నిజమైన దీపావళి - బొందల నాగేశ్వరరావు

nijamaina deepavali

ఆ గేటెడ్ అపార్టుమెంటులో పదహారు పోర్షన్లు వున్న'సి' బ్లాకు లో మూడవ ప్లోర్ లో వుంటున్నారు క్రిష్ణమూర్తి దంపతులు. వారికి కొడుకూ, కూతురు వున్నారు. ఇద్దర్ని ఇంజినీరింగ్ చదివించి సాప్టువేరు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించి పెళ్ళిళ్ళు చేసి పంపారు. పిల్లలకు కుటుంబాలంటూ ఏర్పడ్డాక వాళ్ళు నలభై కిలో మీటర్లకావల మైన్ సిటీలో వుంటున్నారు. పండగలకు పబ్బాలకు పిల్లలతో వస్తుంటారు. ఆ సమయంలో క్రిష్ణమూర్తి గారి ఆ మూడు పడగ్గదుల ఇల్లు పిల్లల సందడితో కళకళలాడుతూ వుంటుంది.

క్రిష్ణమూర్తి గారు పిసనారి, పైసలు ఖర్చు చేయటానికి మీనమేషాలు లెక్కపెట్టే వాడని అనలేము కాని జాగ్రత్త కలిగిన వ్యక్తి. ఎవరిని పైసా సహాయం కోరడు. తనూ ఇవ్వడు. ప్రభుత్వపు సర్వీసు నుంచి ఉన్నతాధికారిగా ఆరు నెల్లలో రిటైర్డు అవుతాడు.

ఆ రోజు సాయంత్రం అయిదు గంటల కల్లా ఆఫీసు నుంచి వచ్చాడు క్రిష్ణమూర్తి..బైకును సరాసరి తను కొత్తగా కొనుక్కొన్న కార్ పార్కింగ్ వద్దకు పోనిచ్చాడు. అక్కడ తనకు సొంతమైన స్థలంలో రెండు బైకులుండడం చూసి ఉగ్రుడై పోయాడు. ఆ బైకులు రామాచారి గారి ఇంటికి వచ్చిన వాళ్ళవేనని గుర్తించిన తను కాస్త పెద్దగా "ఓయ్ చారీ...రామా చారీ"అని కేకేశాడు. ఆ కేకలు రామాచారి చెవిన పడుతూనే పరిగెత్తినట్టు మెట్లు దిగి వచ్చి"ఏంటండీ క్రిష్ణమూర్తిగారూ!" అని మెల్లగా అడిగాడు.

"ఏంటండీ ఏంటి? ఈ బైకులెవరివీ? ఈ కార్ పార్కింగ్ ప్లేసు నాదని తెలీదా మీకు. అపార్టుమెంటు పోర్షన్ తో పాటు రెండు లక్షలు అదనంగా ఇచ్చి కొన్నది. ఈ స్థలంలో మీ బైకులు, కార్లు పెట్టి అరగదీసి, కరగదీసి ఖరాబు చేయటానికా ?" ప్రశ్నల వర్షం కురిపించాడు క్రిష్ణమూర్తి.
"అది కాదండి. బైకులు పెట్టిన వాళ్ళు మా బంధువులే! పెళ్ళికి శుభలేఖలివ్వటానికి వచ్చారు. స్థలం ఖాళీగా వుంటే పెట్టుకొన్నారు" అన్నాడు రామాచారి.

"అంటే...మీ ఇష్టానికి బైకులు, స్కూటర్లు పెట్టేస్తారా! అయితే రావయ్యా! నా పోర్షనులో రెండు బెడ్ రూములు కూడా ఖాళీగానే వున్నాయ్ ! వచ్చి ఆక్యుపై చేసుకొండి. రండి" అని చెయ్య పట్టుకు లాగాడు.

"ఏంటండి మీరు మరీనూ. గొటితో గిల్లితే పోయే విషయాన్ని గొడ్డలి వరకూ తీసుకు వెళతారు"అని అంటుండగా పైనుంచి దిగి వచ్చిన రామాచారి బంధువులిద్దరూ బైకులు తీసుకొని వెళ్ళి పోయారు. క్రిష్ణమూర్తి గొణుక్కొంటూ లిప్టు దగ్గరకు వెళ్ళాడు. కరెంటు లేక లిప్టు ఆగి వుండడం గమనించిన తను మూడో అంతస్థుకి వెళ్ళటానికి కాళ్ళకు బుద్ధి చెప్పాడు.

కాలింగ్ బెల్లు నొక్కాడు క్రిష్ణమూర్తి. ఆయన భార్య కమలిని వచ్చి తలుపు తీసింది. లోపలికి అడుగు పెట్టి హాల్లోకి చూశాడు. అక్కడ బ్రహ్మాండంగా సోఫాలో కూర్చొని కాఫీలు తాగుతూ టీవీలో 'ఇరుగు పొరుగు' సీరియల్ చూస్తున్నారు ప్రక్కింటి పంకజం, అవతలింటి అంబుజం. క్రిష్ణమూర్తిని చూస్తూనే టక్కున లేచి నిలబడ్డారు. కమలిని వెళ్ళి టీవీని ఆఫ్ చేసింది.

"ఏంటమ్మా! కరెంటు లేక పోయే సరికి నా ఇంటికి తగలడ్డారా సీరియల్ చూడ్డానికి. మీరు కూడా మీ మొగుళ్ళతో చెప్పి ఇన్వెక్టర్ల పెట్టించుకొండి. అప్పుడు కరెంటు బాధ వుండదు. హాయిగా సీరియల్లను చూసుకోవచ్చు. అంతే తప్ప ఇరుగిల్లు పొరుగిల్లని ఇలా వచ్చి కాఫీలు, టిఫిన్లు మెక్కి ఇక్కడ జరిగే సంఘటనలను నా పెళ్ళాం లాంటి వాళ్ళు ఏకరువు పెడితే విని నవ్వుకొంటూ వెళ్ళి హాయిగా అవతలిళ్ళకు చేరవేసి ఆనందించండి. వెళ్ళండమ్మా...వెళ్ళండి" అన్నాడు కోపంగా.

ఇద్దరిలో ఒక్కరికి కాస్త రోషం తన్నుకు రాగా "అది కాదండన్నయ్య గారూ! ఏదో పొరుగిళ్ళ వాళ్ళమని మాతో స్నేహంగా వుండే కమలిని రమ్మంటే వచ్చాము. అదీ తప్పే! మేమూ ఇన్వెర్ట్ర్లను కొంటాం. రావే వెళదాం" అంటూ తలుపు తెరచుకొని బయట పడ్డారు. వాళ్ళ వెంట బయటికెళ్ళిన కమలిని బ్రతిమాలుతున్నట్టు "వదిన గారూ! వారి మాటల్నుపట్టించుకోకండి. వారి తీరే అంత. నా మోహం చూడండి!"అని సర్థి చెప్పిలోనికొచ్చింది.

ఈ లోపు బట్టలు మార్చుకొని లుంగీ కట్టుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి సోఫాలో కూర్చొని వున్నాడు క్రిష్ణమూర్తి.
భర్తను క్రీకంట చూస్తూ కోపంగా కిచ్చన్ లోకి వెళ్ళింది కమలిని. రెండు నిముషాల్లో కాఫీ తెచ్చి టఫీమని టీపాయ్ మీదుంచి" దీపావళికి పిల్లలెవ్వరూ రారట. ఫోన్లో చెప్పారు" అంది.

"ఏం? ఎందుకు రారట?"కాఫీ చిప్ చేస్తూ అడిగాడు క్రిష్ఞమూర్తి.

"వాళ్ళ గదులకు ఏ.సీలు పెట్టించాలట. ఏ.సి లు లేకుంటే పిల్లలు అస్సలు వుండలేరట" అని పిల్లాడికి ఫోన్ కలిపి "ఇదిగో! క్రిష్ తో మాట్లాడండి" ఫోన్ చేతికిచ్చింది.

"క్రిష్ ! నేనేరా! దీపావళి పండక్కు మరో రెండు వారాలున్నాయ్ ! ఈ లోపు మీ గదులకు ఏ. సీలు పెట్టిస్తాను. పిల్లల్ని తీసుకొని తప్పకుండా రండి" అని చెప్పి కూతురి నంబర్ను నొక్కి "చిన్నీ! అమ్మ నాకు విషయాన్ని చెప్పింది. నీ గదికి కూడా ఏ.సి పెట్టిస్తానమ్మా! పిల్లల్ని, మీ ఆయన్ను తీసుకొని పండక్కు రెండు రోజులు ముందే వచ్చేయ్ "అని ఫోన్ కట్టేసి అటు భార్య వేపు తిరిగి "ఓకేనా?" అన్నాడు.

"మిమ్మల్ని అర్థంచేసుకోలేమండి. మనం, మన పిల్లలు మాత్రం బాగుండాలనుకోవడంలో తప్పు లేదు. అలాగే మన చుట్టూ...అంటే మన అపార్టుమెంటులో వుండే ఇరుగు పొరుగు కూడా బాగుండాలనుకోవాలండి. వాళ్ళనలా ముఖం మీదే అనడం నా మనసుకు బాధనిపించింది. రామాచారిని మాటలతో బాధ పెట్టారు. ఏమనుకున్నాడో పాపం!" బాధతోనే అంది కమలిని.

"తనేమనుకున్నానాకు బాధ లేదు. నేను అందరి కోసం బ్రతక లేను. అయినా నువ్వున్నావుగా అందరిని ఆకట్టుకొని దగ్గరకు చేర్చుకునే మనస్తత్వంతో. బాగా దాన ధర్మాలు కూడా చేస్తావాయే! నీ కొరకైనా అందరూ మన చుట్టే వుంటారులే"వ్యంగ్యంగా అన్నాడు.

"అది నిజమే! మీ మోహాన్ని చూస్తే అందరూ పొలోమంటూ పారిపోతారు. చూడండి! మనం ఇద్దరమే వుంటున్నాం. పెద్దగా ఆరోగ్యవంతులం కూడా కాము. ఏ సమయం ఎలా వుంటుందో చెప్ప లేము. అందుకని అందరితో కలిసి మెలిసి వుందామండి" బ్రతిమాలింది.

"అది కుదరదమ్మాయ్ ! నేనింతే" అన్నాడు క్రిష్ణమూర్తి.

"అయ్యో రామా! సరే...పిల్లల కోసం ఏ.సీలు యెప్పుడు పెట్టిస్తారు?" ప్రశ్నించింది.

"నువ్వనుకుంటే రేపే కమలినీ"

"నేనా...నేనేమనుకోవాలండి మీ చేదస్తం కాకపోతే"

"అంటే...నీ పిల్లలు ఇక్కడికొచ్చినప్పుడల్లా పాకెట్టు మనీ అని నీకిచ్చిన డబ్బు ఇప్పుడు దాదాపు ఒకటిన్నర లక్ష రూపాయలు ఆ బ్యాంకులో మూలుగుతున్నాయ్!. వాటి వల్ల ఎవరికి ఎలాంటి లాభం లేదు. ఆ డబ్బు తీసిచ్చావంటే మరో రెండు రోజుల్లో పిల్లల గదులకు ఏ.సీలు పెట్టిస్తా" అని నవ్వాడు క్రిష్ణమూర్తి.

"మొత్తానికి పిల్లలు నాకిచ్చిన డబ్బుతోనే ఏ.సి.లు పెట్టిస్తారన్న మాట. అంటే వాళ్ళ కోసం మీరు పైసా ఖర్చు పెట్టరు" అంటుండగా కమలిని చెక్కు బుక్కులో లక్షా ముఫ్ఫై వేలకు చెక్కు రాసి సంతకం తీసుకున్నాడు క్రిష్ణమూర్తి.

************

దీపావళికి వారం రోజులు వుందనగా 'సి' బ్లాక్ వెల్పేర్ అసోసియేషన్ వాళ్ళు అర్జంటు సమావేశం ఏర్పాటు చేసి అందర్ని రమ్మన్నారు. సాయంత్రం ఆరు గంటలకల్లా అందరూ సమావేశమైయ్యారు, క్రిష్ణమూర్తి ఆఫీసు నుంచి రాక పోవటంతో ఆయన శ్రీమతి కమలిని సమావేశానికి హాజరైయ్యింది. సమావేశంలో అసోసియేషన్ వాళ్ళు దీపావళికి పెద్ద శబ్దాలతో పేలే టపాసులను తప్పించి చిచ్చుబుడ్లు, మతాపులు, కాకర పూవత్తులు, భూ చక్రాలతో మాత్రమే పండగ చేసుకోవాలని తీర్మానం చేసి అందరి అంగీకారంతో సంతకాలు చేయించు కున్నారు. కమలిని కూడా సంతకం పెట్టి ఇంటికి వెళ్ళింది.

కాస్సేపటికి రెండు పెద్ద పెద్ద బాక్సుల్లో పది వేల రూపాయలకు విలువ చేసే టపాసులతో ఆటోలో వచ్చి దిగాడు క్రిష్ణమూర్తి. ఆ బాక్సులను అతి కష్టం మ్మీద లిప్టులో పైకి తీసుకెళ్ళాడు.

"ఏటండీ అవి...టాపాసులేనా? అందులో పెద్ద శబ్దంతో పేలే టాపాసులు కూడా వున్నాయా!" సందేహంతో అడిగింది కమలిని.

"అవును కమలినీ! మనకొచ్చిన ఫండు చీటీ డబ్బులకు పది వేల రూపాయల విలువ చేసే టపాసులు ఇచ్చారు. అల్లుడు కొడుకూ కాల్చటానికి టపాసులు. పిల్లలకి కాకర పూవత్తులు, చిచ్చుబుడ్లు, మతాపులు, భూ చక్రాలని రకరకాలుగా తెచ్చాను" చెప్పాడు క్రిష్ణమూర్తి.

"అయితే ఆ పెద్ద శబ్దాలతో పేలే టపాసులను రిటర్నుచేసి పిల్లలకు తగినవే తెండి. ఆ బాక్సును తీసుకు వెళ్ళండి. ఎందుకంటే అలాంటివి ప్రమాదాలకు దారి తీస్తాయని, వాటిని కాల్చకూడదని అసోసియేషన్లో తీర్మానం చేసి సంతకాలు చేయించుకున్నారు"

"అదేం కుదరదు. అసోసియేషన్ వాళ్ళ కోసం నా ఆనందాన్ని పోగోట్టుకోలేను. వాటిని కాల్చే తీరుతాను. ఇదిగో ! రేపు ఉదయం రెండు ఏ.సీలు తీసుకొని కంపెనీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు బిగించి వెళ్ళే వరకు ప్రాపర్ గా సూపర్ వైజ్ చెయ్యి" అంటూ బట్టలు మార్చుకోవటానికి బెడ్ రూంలోకి వెళ్ళాడు క్రిష్ణమూర్తి.

భర్త క్రిష్ణమూర్తి తన మాట ఎప్పుడూ వినడని తెలిసినా ప్రయత్నించింది కమలిని. ఆ ప్రయత్నంలో విఫలమై భర్తకు భోజనం వడ్డించటానికి కిచెన్ లోకి వెళ్ళబోతుండగా చేతిలో వున్న ఫోన్ రింగైయ్యింది. చూస్తే అది కూతురి నంబరు."ఆఁ...చెప్పమ్మా! ఎప్పుడొస్తున్నారు" అడిగింది.

"బుధవారం మమ్మీ! ఇంతకు మా గదికి ఏ.సి పెట్టించావా? మీ మనవడు అడుగుతున్మాడు" అంది కూతురు నవ్వుతూ.

"ఆఁ...! రేపే నీ గదికి, అన్నయ్య గదికి పెట్టిస్తున్నాం. వచ్చేయండి! హాయిగా పండగ చేసుకొందాం" అని ఫోన్ కట్ చేసి కిచెన్ లోకి వెళ్ళింది.
"ఫోన్ లో ఎవరూ?" అడిగాడు క్రిష్ణమూర్తి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొంటూ.

"మన పాపండి! తను బుధవారం కుటుంబ సమేతంగా వస్తోందట "

"అరే! పిల్లాడు కూడా భార్య పిల్లలతో బుధవారమే వస్తున్నట్టు ఫోన్ చేశాడు. నాకు చాలా సంతోషంగా వుంది కమలినీ! దీపావళికి మన ఇల్లు సందడి సందడిగా వుంటుంది" అన్నాడు క్రిష్ణమూర్తి.

***********

దీపావళికి ముందు రోజే అపార్టుమెంటు 'సి' బ్లాకు మొత్తం రంగు రంగు దీపాలతో అందంగా, దేదీప్య మానంగా వెలిగి పోతోంది. ఆ ప్రాంతంలో చుట్టు ప్రక్కలున్న అపార్టుమెంటుల్లోని జనం దీపావళికి సందడిగా ముందు రోజే టపాసులను పేలుస్తున్నారు, 'సి' బ్లాకులో వున్న కుటుంబాల పిల్లలూ, పెద్దలు, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో సహా అందరూ కాకర పూవత్తులు, చిచ్చు బుడ్లు, మతాబులు, భూ చక్రాలను కాలుస్తూ కేరింతలతో ఆనంద లోకాల విహరిస్తున్నారు.

క్రిష్ణమూర్తి ఇంట్లో కొడుకు, కోడలు వాళ్ళపిల్లలతో, కూతురు, అల్లుడు వాళ్ళ పిల్లలతో బాక్సును ముందుంచుకొని కాలుస్తూ ఆనందిస్తున్నారు. వాళ్ళ ఆనందంలో పాలు పంచుకొని కుర్చీలో కూర్చొని చూస్తూ వుంది కమలిని. అంతలో ఇంట్లోంచి టపాసులున్న మరో బాక్సును తీసుకొని టెర్రాస్ మీదికి వచ్చాడు క్రిష్ణమూర్తి "ఒరేయ్ క్రిష్ ! నువ్వూ అల్లుడు కలసి ఈ టపాసులను కాల్చండి" అంటూ.

"ఓకే నాన్నా! మీరెళ్ళి అమ్మ ప్రక్కలో వున్న ఆ కుర్చీలో కూర్చొండి" అన్నాడు కొడుకు క్రిష్ .

"కూర్చోవడమా! కుదరదురా. నేనూ మీతో పాటు టపాసులను కాల్చాలి" అంటూ రెండు లక్ష్మీ టపాసులు, రెండు రాకెట్లను తీసుకొని వెళ్ళి పిట్ట గోడ మీద పెట్టి సాంబ్రాణి కడ్డీతో నిప్పు అంటించాడు క్రిష్ణమూర్తి. అంతే నిప్పంటుకున్న అవి పేలాయి. వాటిలో ఓ రాకెట్టు అలాగే వచ్చి క్రిష్ణమూర్తి గుండెలను తాకుతూ కంటికి ప్రక్కగా దూసుకు పోయింది.

"అమ్మా!" అంటూ రెండు కళ్ళు పట్టుకొని షాక్ కు గురై నేలకొరిగి అపస్మారక స్థితిలోకి వెళ్ళి పోయాడు క్రిష్ణమూర్తి.

"ఏమండీ!"అంటూ పెద్దగా అరిచి దగ్గరికెళ్ళింది భార్య కమలిని.

"నాన్నా"అంటూ కూతురు కొడుకు, 'తాతయ్యా' అంటూ మనవలు మనవరాళ్ళు దగ్గరికెళ్ళి చుట్టూ నిలబడి ఏడవ సాగారే కాని ఆసుపత్రికి తరలించాలన్న ఆలోచనే ఎవరికీ రాలేదు.

అప్పుడు ప్రక్కింటి టెరాస్ మీద నుంచి విషయాన్ని గమనించిన రామాచారి వెంటనే ఆంబులెన్సుకు ఫోన్ చేసి రప్పించి క్రష్ణమూర్తిని తీసుకొని దగ్గరలో వున్న ఓ కార్పోరెట్ ఆసుపత్రికి వెళ్ళారు. డాక్టర్లు ఒక్క నిముషం కూడా ఆలస్యం చేయకుండా క్రిష్ణమూర్తిని ఐ,సి.యూ లో వుంచి షుగరు, బి.పీ లను చెక్ చేసి కాలిన గాయాలకు మందు వేసి కట్టుకట్టి, ఓ కళ్ళ స్పెషలిస్టును పిలిపించారు. ఆయన క్రిష్ణమూర్తి కళ్ళను పరీక్షించి నాలుగు చుక్కలు మందు వేసి అర కిలో బేండేజి చుట్టి పడుకోబెట్టి సెలైన్ ఎక్కించి రెండు సూదులు పొడిచాడు. బి,పి. షుగర్ వ్యాధితో బాధపడుతున్న క్రిష్ణమూర్తి అపస్మారక స్థితిలో నుంచి ఓ గంట తరువాత మామూలు స్థితికి వస్తాడని నిర్థారించారు డాక్టర్లు. అపార్టుమెంటు వాళ్ళు గది తలుపు కున్న అద్దంలో నుంచి క్రిష్ణమూర్తిని చూస్తున్నారు. దాదాపు ముప్పావు గంట తరువాత ఇద్దరు డాక్టర్లు బయటికొచ్చారు.

"పేషంటు తాలూకు మనుషులెవరండి?"అడిగాడు పెద్ద డాక్టరు.

"మేమే"నంటూ క్రిష్ణమూర్తి భార్య, పిల్లలు ముందుకొచ్చారు.

"ఆయనకు ప్రాణ భయమేమీ లేదు. అయినా పన్నెండు గంటల వరకూ ఐ.సి.యూలోనే ఆబ్జర్వేషన్ లో వుండాలి. మీరు వారి శ్రీమతి కనుక లోనికెళ్ళండి. తతిమ్మా వాళ్ళు ఇళ్ళకు వెళ్ళి పొండి"అని చెప్పి డాక్టర్లు వెళ్ళి పోయారు.

మరుసటి రోజు వుదయం ఆరు గంటలకల్లా లేచి కూర్చొన్నాడు క్రిష్ణమూర్తి. కాఫీ కలిపి ఇచ్చింది కమలిని.

"ఏమిటీ...ఇది ప్రత్యేక గదిలా వుంది! అద్దె వేలల్లో వుంటుందేమో" అంటూ కాఫీ కప్పును ప్రక్కన పెట్ట కంటిక్కట్టిన బేండేజీని విప్పటానికి ప్రయత్నించాడు క్రిష్ణమూర్తి.

కమలిని ఆ కట్టును విప్పనీకుండా భర్త చేయిని తప్పిస్తూ" అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. డాక్టరు గారని రానివ్వండి." బ్రతిమాలింది.

"జిల పుడుతుంది కమలినీ! పైగా చూపు బాగున్న కంటికి ఇంత పెద్ద కట్టు కట్టారెందుకూ?" అని అంటుండగా కంటి డాక్టరుగారు రానే వచ్చారు. కట్టు విప్పి చూశాడు. తన వ్రేళ్ళని క్రిష్ణమూర్తికి చూపుతూ అవి ఎన్నని అడిగాడు. కరక్టుగా చెప్పాడు క్రిష్ణమూర్తి. వెంటనే చుక్కల మందుని కంట్లోకి వదిలి ప్రిష్క్రిప్షన్ రాసి కమలిని చేతికిచ్చి "ఇక భయంలేదండి. కళ్ళు క్లియర్ గా వున్నాయ్! ఆ చుక్కల మందును పిల్లరుతో నాలుగు చుక్కల వంతున రోజుకు నాలుగు సార్లు ఓ నెలనాళ్ళు వాడండి. ఇప్పుడు డిశ్చార్జ్ చేసుకోని వెళ్ళండి" చెప్పి వెళ్ళి పోయాడు డాక్టరు.

"ఏంటే కమలినీ ఈ తతంగం. నాకు కళ్ళు బాగానే వున్నాయిగా! అందుకెందుకింత రాద్దాంతం చేశావ్ ?" అడిగాడు.

"మీరూరుకొండి. నిప్పురవ్వ మీ కంటి మీదుగా వెళ్ళింది నేను చూశాను. అది కంట్లోకి వెళ్ళుంటుందేమోనన్న సందేహం నాకు. అందుకే ఇదంతా" అంది భార్య కమలిని.

అంతలో ఇంటి నుంచి పిల్లలు, అల్లుడు, కూతురు, కొడుకు, కొడలు వచ్చారు. పరామర్శించి క్యాంటీనుకు వెళ్ళి పోయారు. మరో అయిదు నిముషాల్లో రామాచారి కుటుంబ సమేతంగా వచ్చి పళ్ళ బ్యాగును ప్రక్కన బెట్టి బొకేనొకటి క్రిష్ణమూర్తి చేతికిచ్చి "ఎలా వున్నారండీ! మీకిలా అయ్యింది మనవాళ్ళందరికీ బాధ కలిగింది. మీకిది మరోలా జరిగుంటే దీపావళి పండగే మనకు లేకుండా పోయేది. మీరు త్వరగా కోలుకోవాలి. రెస్టు తీసుకోండి. వస్తాం"అంటూ వెళ్ళి పోతుండగా వరుసగా అపార్టుమెంటు లో వున్న తతిమ్మా కుటుంబాలన్ని పళ్ళతో, బొకేలతో వచ్చి ప్రేమతో పరామర్శంచి " త్వరగా కోలుకోవాలి. వస్తాం" అంటూ వెళ్ళిపోయారు.

క్రిష్ణమూర్తి ఒకలా అయి పోయాడు. తనపై అపార్టుమెంటులోని 'సి' బ్లాకు జనానికి ఇంత ప్రేమా! ఛీ...ఇన్నాళ్ళు అందరిని అంటరాని వాళ్ళలా ఏహ్య భావంతో చూశానే. వాళ్ళు నాతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా నానుండి ఏదో ఆశిస్తున్నారన్నట్టుగా విసుక్కున్నానే! అని మనసులోనే అనుకొని బాధ పడ్డాడు.

"కమలినీ! ఎప్పుడూ ఎదుటి వారిని పురుగుల్లా చూస్తూ, తక్కువ అంచనాలతో ప్రతి ఒక్కరిని తొలగేసుకుని వెళ్ళే నీచ స్వభావం గల నన్ను పరామర్శించటానికి అపార్టుమెంటు మొత్తం తరలి వచ్చిందంటే నాకదోలా వుంది. నా పట్ల ఇంతగా ప్రేమ, అప్యాయత, అనురాగాలను చూపుతున్న వీళ్ళకు ఇన్నేళ్ళు దూరంగా వుండిపోయాననుకుంటే గుండెల్నిపిండేస్తున్నంతగా బాధ కలుగుతుంది. వీళ్ళందరూ నాకు ఎలా దగ్గరైయ్యారో తెలియకుంది" అన్నాడు క్రిష్ణమూర్తి. నవ్వి వూరుకుంది కమలిని.

"అందుకు కారణం అమ్మ, నాన్నా! అందరితో కలిసి పోయి మంచి చెడుల్లో పాలు పంచుకొని ప్రతి విషయానికి ముందుండి అందరికీ ప్రేమను పంచుతుంది అమ్మ. అమ్మ కోసమే మీకివాళ వాళ్ళ నుంచి సానుభూతితో కూడికొన్న ఈ ప్రేమ. అందుకే అందరూ ఆత్మీయంగా పరామర్షించడానికి వచ్చారు. మీరు లేకుంటే పండగను సైతం ఆపేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతటి గొప్ప మనసున్న వాళ్ళో గ్రహించండి" విషయాన్ని క్లుప్తంగా చెప్పి ముగించాడు కొడుకు క్రిష్.

క్రిష్ణమూర్తి ఆలోచించాడు. గతాన్ని నెమరు వేసుకున్నాడు. అందులో ఇన్నాళ్ళు తను, తన కుటుంబమని స్వార్థంతో కొనసాగిన రోజులను తెరపైకి తెచ్చుకొని పరిశీలన చేసుకొని తన్ను తానే అసహ్యించుకున్నాడు. మనిషి సంఘజీవి. వాడికి తోడు ఈ సంఘం అంటే జనం! ఆ జనం తను తుది శ్వాస విడిచే వరకూ తోడుంటారన్నదే నిజం అని అప్పుడు గ్రహించాడు.

"కమలినీ! డాక్టరు గారొస్తూనే నన్ను డిశ్చార్జ్ చేయమని అడుగు. ఇంటికెళ్ళి మన అపార్టుమెంటు వాళ్ళందరితో కలసి ఈ దీపావళిని జరుపుకొందాం. ఎస్ !మన ' సి' బ్లాకు ఆత్మీయులతో నేనూ మమేకమై పోవాలి" అన్నాడు ఉద్వేగ పూరితంగా క్రిష్ణమూర్తి.
స్వార్థ పూరిత చీకట్లను చీల్చుకుంటూ అతడి కళ్ళల్లో ప్రేమపూరిత వెలుగులను చూస్తూంటే కమలినికి నిజమైన దీపావళి కనిపించింది.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న