మన భారతదేశం ఎన్నో అందమైన పండుగలకు పుట్టిల్లు. అందులో ఒకటి దీపావళి. ముఖ్యంగా ఈ పండగ కోసం ఎదురు చూసేది చిన్నపిల్లలు, టీనేజర్లు. వాళ్లలో ఒకడు వివేక్.ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుందా? ఎప్పుడు తను టపాసులు కాల్చి వీధి వీధంతా హడావిడి చేద్దామా? అని ఎదురు చూస్తున్న వివేక్, అప్పుడే తను ఎండపెట్టిన క్రాకర్స్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చాడు.
‘రేయ్ అవినాష్, బంటీ, బబ్లూ, వినీత్, చోటూ...’ అంటూ తన ఫ్రెండ్స్ అందరిని పిలిచాడు వివేక్. ప్రతి ఒక్కరూ తమ తమ వాటా క్రాకర్స్ పట్టుకుని వచ్చారు.‘ఇన్నాల్టికి మనం ఎదురు చూసిన టైం వచ్చింది... మొదలుపెడదామా?’ అని వివేక్ అనంగానే అందరు ఒక్కసారిగా ‘యా!’ అని గట్టిగా అరిచి ఎటుకటు పరిగెట్టారు.
ఒకడు వెళ్ళి ఉల్లిపాయ బాంబులు జనాల మీదకి విసురుతూ ఉంటే, ఇంకొకడు ప్రతి ఇంటి పోస్ట్ బాక్స్ లో మిర్చీ బాంబ్స్ వెలిగించి పడేస్తున్నాడు. ప్రతి ఇంటి తలుపు కొట్టి గుమ్మం ముందు చిచ్చుబుడ్డి వెలిగించి పారిపోవడం, పార్క్ చేసున్న బండ్ల మీద పాంబిల్లలు వెలిగించడం, పక్కింటి డాబా పైన పడేలా గురి పెట్టి రాకెట్లు వెలిగించడం. ఇలా ఒకటా రెండా, ఆ విధిలో వాళ్ళకి వణుకు మొదలైపోయింది.
కోపంతో అరిచే వాళ్ళు మాత్రం ఇవన్నీ ఎవరు చేస్తున్నారో తెలియక గాలిలోనే గట్టి-గట్టిగా అరిచి మళ్ళీ లొపలికి వెళ్ళిపోతున్నారు. ఇదంతా దాక్కుని చూసే వివెక్ అండ్ గ్యాంగ్ మాత్రం కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
అప్పుడే వినీత్ దూరం నుంచి ‘కారు వస్తుంది’ అన్నట్టు సైగ చేశాడు. వెంటనే బంటీ, బబ్లూ, అవినాష్, చోటూ రోడ్డు పైనున్న పేడ మీద సుతిల్ బాంబు పెట్టి వెలిగించి దాక్కున్నారు. ఆ విధిలో అప్పుడే ఎంటర్ అయిన బీ.ఎమ్.డబ్ల్యూ ఆ పేడ దెగ్గరికి రాగానే ఒక్కసారిగ గట్టిగా పేలింది. డ్రైవర్ ఉలిక్కిపడి ఒక్కసారిగా సడన్ బ్రేక్ తొక్కడంతో కారు ఠక్కున ఆగిపోయింది. పేడ మొత్తం ఆ తెల్లటి బీ.ఎమ్.డబ్ల్యూ మీద పడి పోయింది. అప్పుడే వెనకాల కిటికీ రోల్ అయ్యి ఓ తల బయటకొచ్చింది. భయంతో అందరూ పరిగెట్టారు.... వివేక్ తప్ప!
ఆ కారులో ఉన్న అతను విస్సూ. వివేక్ చిన్నప్పుడు వాడి ఇంట్లో కంటె తన ఇంట్లోనే ఎక్కువ ఉండేవాడు. ఎవరూ తనతో ఆడుకోని టైంలో విస్సూ తన ఇంటికి పిలిచి ఆడించేవాడు. చిన్నప్పుడు ఇలానే వివేక్ ‘ఫోన్ కావాలి’ అని ఏడ్చినప్పుడు, విస్సూ వెళ్ళి ఎగ్జిబీషన్ నుంచి బొమ్మ ఫోన్ కొన్ని ఇచ్చాడు. అందులో ఉన్న బటన్ నొక్కగానే ‘ధూమ్ మచాలే ధూమ్ మచాలే ధూమ్...’ అని మోగేది, మోగినప్పుడల్లా వివేక్, విస్సూ కలిసి డ్యాన్స్ వేసే వాళ్ళు. అలా వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు కలిసి తిని, తిరిగి, పడుకునే వాళ్ళు. చదువులో హెల్ప్ చేసేవాడు. బాధ పడితే ఓదార్చేవాడు. మొత్తానికి, వివేక్ కి విస్సూ తన సొంత అన్నయ్య లాంటివాడు. ‘లాంటి వాడు’ అని అనడం కూడా తప్పే, వాళ్ళు తోబుట్టులకి ఏ మాత్రం తక్కువ కాదు.
విస్సూ ఒక అమ్మయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. ఆ పెళ్ళికి తోడి పెళ్ళికొడుకుగా వివేక్ కూర్చున్నాడు. విస్సూ భార్య ఝాన్వీ కూడా చాలా మంచిది. తనకి వివేక్ అంటే ప్రాణం.
అంతా సవ్యంగా జరిగే టైంలోనే వివేక్‍కి ఓ షాక్ తగిలింది. ఆఫీస్ పని మీద విస్సూ-ఝాన్వీ అమెరికా షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. వివేక్ కి ఇండియా వదిలిపెట్టి వెళ్ళాలన్నా, తన ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళలన్నా, ముఖ్యంగా వివేక్‍ని వదిలి పెట్టి వెళ్ళాలన్నా, అస్సలు మనసొప్పలేదు. కాని తప్పదు!
ఆ రోజు వివేక్ ఏడ్చినంత తన లైఫ్ లో ఎప్పుడూ ఏడవలేదు. విస్సూ ని చూడడం కూడా అదే చివరి సారి.. మళ్ళీ ఇన్నాల్టికి ఇప్పుడు చూశాడు. ఆనందంతో ఇంకా స్తంభం వెనకనుంచి నక్కి నక్కి చూస్తూ ఉన్నాడు వివేక్.
విస్సూ మాత్రం బాంబ్ పెట్టింది ఎవరన్నట్టు కోపంతో బయట చూస్తూ ఉన్నాడు, ఏదో అరవబోయే లోపల, పక్కనున్న ఝాన్వీ అతన్ని ‘వదిలేయండి’ అని చెప్పినట్టు దూరంగా దాక్కుని ఉన్న వివేక్‍కు కనపడింది.
‘వదిన లావయ్యింది’ అని అనుకున్నాడు వివేక్. కాని తన మొహం మీద ఆ బాంబు పేలినందువల్ల కలిగిన భయం మాత్రం ఇంకా పోలేదు. చిరాకుగా ఉన్న ఆ ఇద్దరు డ్రైవర్‍కి ‘పోనీ..’ అని చెప్పడంతో కారు ఆ వీధి చివరు ఉన్న ఇంటి వైపు భయలుదేరింది.
‘హహహ... ఆ కారు వెనకల కూర్చున్న వాడి ఫేస్ చూశారా? పాపం భలే భయపడ్డాడు..’ అని నవుతూ అన్నాడు వినీత్. ‘అంతే కాదు.. బీ.ఎమ్.డబ్ల్యూ కారు మొత్తం పెంట పెంట అయ్యింది...’ అని చోటూ చెప్పగానే అందరూ గట్టి గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. వివేక్ మాత్రం ఇంకా చిరాకుతో ఉన్నా విస్సూ-ఝాన్వీ ల మొహాలు తలుచుకుంటూ చింతిస్తున్నాడు.
‘నేనింక వివేక్ గాడు దొరికిపోతాననుకున్నాను రా... కని స్తంబం వెనకాల భలే దాక్కున్నాడు’ అన్నాడు బంటీ. ‘నెక్స్ట్ ఏం చేద్దాం రా? ఎవరిని భయపెడదాం?’ అడిగాడు బబ్లూ.‘ఇంక చాలు రా, నేను ఇంటికెల్తా...’ బాధగా చెప్పాడు వివేక్.
***
‘ఏరా వివేక్... ఇంటికొచ్చేసావా? రా... సీతా రాములకి దణ్ణం పెట్టుకో!’ అని అంది వివేక్ నానమ్మ పూజగదిలో కూర్చుని.
‘ఏంటి నానమ్మ... దీపవళి రోజున ఎవరైన దుర్గా మాతకి దణ్ణం పెట్టుకుంటారు కాని, రాముడికి ఎందుకు పెట్టుకుంటారు?’ అడిగాడు వివేక్.
‘దీపావళి వెనక కేవలం దుర్గా మాత కథ మాత్రమే కాదు, రాముడి కథ కూడా ఉంది. అయినా పండగల బట్టి దేవుడికి దణ్ణం పెట్టుకుంటానంటావేంటిరా బడుద్దాయి?!’ వివేక్ వెంటనే వచ్చి తన నానమ్మ దగ్గర కూర్చున్నాడు.‘దీపావళి వెనకాల సీతారముల కథ ఉందా? అదేంటి నానమ్మ?’ అడిగాడు వివేక్. అప్పుడు నానమ్మ రామాయణం మొత్తం క్లుప్తంగా వివరించడం మొదలుపెట్టింది. అయోధ్యకి రాజైన దశరథ మహారాజు పుత్రుడైన రాముడి గురించి వివరించినప్పుడు, అలానే భూదేవి బిడ్డ అయిన సీతాదేవి గురించి వివరించినప్పుడు, వివేక్‍కి రాముడిగా విస్సూని, సీతగా ఝాన్వీని ఊహించుకున్నాడు. రాముడు శివధనస్సు విరిచి సీతని గెలుచుకుని పెళ్ళిచేసుకోవడం, రాముడు దశరథుడి వారసుడిగా పట్టాభిషేకం జరగకుండా ఆపడానికి కైకేయి సీతారాములని పద్నాలుగేళ్ళ వనవాసానికి పంపించమని దశరథుడిని కోరడం, ఇంతకముందు ఇచ్చిన మాట వల్ల దశరథుడు కాదనలేకపోవడం, సీతా-రామ-లక్ష్మణులు వనవాసానికై అడవులకి వెళ్లి అక్కడ నివసించడం, శూర్పణక రాముడిపై మనసుబడడం, లక్ష్మణుడు ఆమె ముక్కు-చెవులూ కోయడం, తను తన సోదరుడైన రావణాసురుడి దగ్గరకు వెళ్ళి బాధపడడం, అందుకుగాను రాముడిపై పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్న రావణుడు, మారీచుని పంపడం, మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చి రామ-లక్ష్మణులు దారి మళ్ళించగా, రావణుడు సీతాదేవిని అపహరించడం, రామ-లక్ష్మణులు హనుమంతుడు మరియు వానర సేన సహాయంతో లంకకి చేరుకోవడం, అక్కడ రావణాసురునితో యుద్ధం చేసి సీతని గెలుచుకోవడం.. ఇలా నానమ్మ రామాయణం చెబుతూండగా, వివేక్ ఎంతో ఆసక్తికరంగా వింటూ, ఊహించుకుంటూ ఉన్నాడు.
‘అలా ఆ పద్నాలుగేళ్ళ వనవాసం పూర్తి చేసుకున్న సీతారాములు తిరిగి అయోధ్యకి వస్తూ ఉండగా, అయోధ్య ప్రజలందరు వారికి దేదిప్యమానమైన దీపాలతో స్వాగతం పలికారు.. అందుకే మనం దీపావళి జరుపుకుంటాం!’ ముగించింది నానమ్మ. ‘ఉత్త దీపాలేనా? టపాసులు??’
‘ఈ చెత్త అంతా ఇప్పుడు.... అప్పట్లో చక్కగా ప్రశాంతంగా వేడుక జరుపుకునే వాళ్ళు..’ చెప్పింది నానమ్మ. ‘అసలు అప్పట్లో ఎలా ఉండేది?’ ఊహించుకోవడం మొదలుపెట్టాడు వివేక్.
***
అప్పుడే తన పద్నాలుగేళ్ల వనవాసం పూర్తిచేసుకుని అయోధ్యకి తిరిగి వస్తున్నారు విస్సూ-ఝాన్వీ... అదే అదే... సీతా రాములు! ఒకపక్క హనుమంతుడు, మరోపక్క లక్ష్మణుడు, ముందర రథసారథి. దూరం నుంచి తెల్లటి గుర్రాలతో నడుస్తున్న ఆ రథం మీద అందరినీ ఒక్కసారిగే చూసి అయోధ్య ప్రజలు ఆనందంతో కేకలు పెట్టసాగారు. అలా ఆ గుర్రం అయోధ్యలో అడుగు పెట్టిందో లేదో, ఢమాల్ ధడేల్ అని పెద్ద పెద్ద శబ్దాలు మొదలయ్యాయ్. విపరీతమైన కాంతి. దెబ్బకి ఆ గుర్రాలు భయపడి అక్కడికక్కడే ఆగిపోయాయి. సీతా దేవి వెంటనే రాముడి వెనకాల భయంతో దాక్కుంది. రాముడికి మాత్రం అసలు ఈ హడావిడి ఏంటో ఏమీ అర్థం కాలేదు. ఐదు నిమిషాల తర్వాత అన్ని ఆగిపోయాయి.
‘ఏంటిది?’ అడిగాడు లక్ష్మణుడు కొపంగా.
‘మీకు వెల్‍కం చెప్పడానికి 5000 వాలా పేల్చాం అయ్యా..’ సమాధానం చెప్పాడు ఓ పిల్లాడు, చేతిలో అగరబత్తి పట్టుకుని. రథం మెల్ల మెల్లగా ముందుకు సాగుతూ ఉంటే ఇరు వైపులా బాంబులూ, చిచ్చుబుడ్డిలు, తాటాకు టపాకాయలు, ఇలా అన్నీ క్రాకర్స్ పేలుతూ ఉండగా, సీతా రాములకి చిరాకు మొదలయ్యింది.
‘అసలు ఇదంతా ఏంటి అన్న గారు? వీళ్ళ సంగతి చూస్తా...’ అంటూ కోపంగా ఓ బాణం తీశాడు లక్ష్మణుడు. ‘వద్దు లక్ష్మణ, మనం తిరిగి వచ్చినందుకు గాను వీళ్ళందరూ సంబరాలు జరుపుకుంటున్నారు... వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు...’ ఆపింది సీత. ‘ఇదిగోండి, విష్ణుచక్రం...’ అరిచాడు ఓ యువకుడు, తన చేతిలోని విష్ణుచక్రాన్ని పట్టుకుని. ‘హతవిధి.. అది విష్ణుచక్రమట! అది కూడా మీకు చూపిస్తున్నాడు రామా’ అన్నాడు హనుమంతుడు.
సీత వైపున గట్టిగా పేలిన శబ్దం విని సీతా దేవి మళ్ళీ ఓ సారి ఉళ్ళికిపడింది.
‘అమ్మా సీతమ్మతల్లి, అది లక్ష్మీ బాంబు...’ అన్నాడు అది పేల్చిన ఓ అయోధ్యవాసి.
‘తన దుస్తులు చూస్తూ ఉంటే లక్ష్మీ దేవి కటాక్షం అంతగా ఉన్నట్టు అనిపించడం లేదు.. చక్కగా డబ్బులు దాచుకోక, ఉన్న డబ్బుని ఇలా లక్ష్మీ బాంబుల పై నిప్పెడుతున్నాడు చూడండి..’ అని చెప్పింది సీత.
‘నిజమే..’, ఒప్పుకున్నాడు శ్రీ రాముడు.
తన మహల్‍కు తిరిగి వచ్చేసిన సీతా, రామ, లక్ష్మణ, హనుమంతుల చెవిలో ఇంకా అవే శబ్దాలు మారుమ్రోగుతున్నాయి. చిరాగ్గా అందరూ కూర్చుని ఉన్నారు.
‘లంకలో యుద్ధం చేసినప్పుడు కూడా ఇంత తలనొప్పి రాలేదు సీత..’ అన్నాడు రాముడు తన తల పట్టుకుని. వెంటనే బయట గట్టి గట్టి శబ్దాలు వినపడగా, హనుమంతుడు వెళ్ళీ ఆ మహల్ కిటికీ తెరచి చూశాడు. ఆకాశంలో రంగు రంగుల 50 షాట్స్ పేలడం చూసి ఒకపక్క కనువిందు అవుతున్నా, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో మాత్రం ఎవరికీ వినపడట్లేదు.
‘చాలా బాగుంది కదండి..’ చెప్పింది సీత.
‘ఆఁ...?’ వినపడక అడిగాడు రాముడు.
‘చాలా బాగుంది కదా?’ మరింత గట్టిగా చెప్పింది సీత.
‘వినపడట్లేదు...’ చెప్పాడు రాముడు.
ఎంత అరిచి చెప్పినా లాభం లేదని ఊరుకుంది సీత. ఓ పది నిమిషాల తర్వాత వాతావరణం మొత్తం ప్రశాంతంగా మారింది. ఏ శబ్దం లేదు.
‘హమ్మయ్యా!’ అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఇంతలోనే ఆ కిటికీలో నుంచి విజిల్ వేసుకుంటూ ఓ రాకెట్ దూరి మహల్‍లో రావడం చూసి అక్కడున్న అందరు బెంబేలెత్తిపోయారు.
‘ఏంటండీ ఇది? వేడుకంటే ఏదో ముచ్చటగా నాలుగు మతాబులు కాల్చుకోవాలి కాని, అనవసరమైన వాటిపైన డబ్బు నిప్పెట్టి ఇలా ప్రకృతిని, మనశ్శాంతినీ హాని చేసుకుంటే ఎలా? పొరబాటున ఏదైన అవకూడనిది అయితే ఎంత ప్రమాదం? మన రాజ్యంలో ముసలి వాళ్ళు, గుండె జబ్బు ఉన్న వాళ్ళు ఇవన్ని ఎలా తట్టుకుంటారు?’ అడిగింది సీత ఆందోళనగా.
‘మీరు అయోధ్యలో టపాసులను నిషేదించవచ్చు కదా అన్నగారూ?’ అడిగాడు లక్ష్మణుడు.
‘నేను చెప్పినందుకు ప్రజలు ఆపేయడం నాకు నచ్చదు లక్ష్మణ..’ చెప్పాడు రాముడు.
‘మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు?’ అడిగింది సీతాదేవి.
‘సీతా, నువ్వు అడిగానని నేను బంగారు లేడి కోసం పరుగులు తీశాను కదా, యుద్ధాలు చేశాను కదా, నిన్ను మళ్ళీ జాగ్రత్తగా నా వద్దకు తెచ్చుకున్నాను కదా, నా కోసం ఒక్కటి చెయ్యగలవా? నాకు ఒకే ఒక్క కోరిక... కాదనుకు..’ అడిగాడు రాముడు.
‘అదేంటి స్వామి... మీరు చెప్పాలా? మీ మాటే నా మాట!’ చెప్పింది సీత.
‘ఇన్నాళ్ళు అడవుల్లో ఉన్నా ప్రశాంతంగా ఉన్నాము. ఇప్పుడు అయోధ్య అల్లకల్లోలంగా ఉంది. తిరిగి మళ్ళీ అడవులకి వెళ్ళిపోదామా?’ అడిగాడు రాముడు. ఇది విన్న హనుమంతుడు ఆనందంతో గెంతులెయ్యడం మొదలుపెడితే, లక్ష్మణుడు సీతా దేవి కూడా అవుననాలని కోరుకున్నాడు.
‘నిజం చెప్పాలంటే నేనూ మిమ్మల్ని ఇదే అడుగుదామనుకున్నానండి, మళ్ళీ మీరు రాజ్య పాలన అంటారని అడగలేదు..’
‘ముందు మనకి మనశ్శాంతి ఉంటే కద సీత, మనం రాజ్యాన్ని పాలించగలము..!’
‘నిజమేనండి... ఎందుకైన మంచిది, ఓసారి నా తల్లి భూదేవిని ఓ మాట అడుగుతాను’ అంటు తన తల్లిని పిలవగా, కళ్ళముందు బాధలో ఉన్న భూదేవి ప్రత్యక్షమైంది.
‘మీకేం?! చక్కగా అడవులకెళ్ళి ప్రశాంతంగా ఉంటారు. నా బాధ ఎవరితో చెప్పుకోగలను? నా పైన ఇష్టమొచ్చిన పటాసులన్ని కాలుస్తున్నారు. భూలోక వాసులందరి చక్రాలని నేను తిప్పితే, నామీదే ఓ చక్రం తిప్పి దానికి భూచక్రం అని పేరు కూడా పెట్టరు... హతోస్మి!’ అని భారంగా నిట్టూరుస్తూ అంది భూదేవి.
మరుసటి రోజు నుంచి అయోధ్య వాసులెవ్వరికీ సీతా, రామ, లక్ష్మణ, హనుమంతులు కనపడలేదు!
***
‘ఏంటి? కవలలా?’ సంతోషంతో అడిగాడు దశరథ్ రావ్, విస్సూ తండ్రి.
‘అవును నాన్న... డక్టర్ స్కానింగ్‍లోఇదే చెప్పారు...’ అని ఝాన్వీని చూసి మురిసిపోతూ అన్నాడు విస్సూ.
‘చక్కగా లవ కుశులు పుడుతున్నారనమట ! హహహ.. తొందరగా వాళ్ళతో ఆడుకోవాలనుందిరా!’ సంతోషంతో మురిసిపోయాడు దశరథ్.
‘కాని నాదో షరతు నాన్నా. మనం యూ.ఎస్. షిఫ్ట్ అయిపోదాం. మీరు కూడా మాతో పాటు అమెరికా వచ్చెయ్యండి.. హ్యాపీగా ఉండచ్చు..’ చెప్పాడు విస్సూ.
‘అదేంటి రా? నువ్వే ఇండియాకి షిప్ట్ అవుతావ్ అనుకుంటే నన్ను కూడా అక్కడికే తీసుకెళ్తానంటున్నావ్??!’
‘అవును నాన్నా.. కాని ఇక్కడ జనాలు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు! బయట చూడండి... ఆ శబ్దాలు వినండి.. దీపావళి అంటే సరదాకి ఓ రెండు క్రాకర్స్ కాల్చుకోవాలి కాని, అదే పనిగా ఇష్టమొచ్చినట్టుగా చేస్తే ఎలా? పైగా నిన్న అమ్మ చెప్పింది.. పండగకి వారం ముందు నుంచీ మొదలుపెట్టి, పండగ అయిన వారం దాకా పగలు-రాత్రి తేడా లేకుండా కాలుస్తూ ఉంటారంటగా? నీకు తెలుసు.. అమ్మ అసలే హార్ట్ పేషెంట్. ఆ సౌండ్స్ పాపం ఆవిడని ఎంతగా డిస్టర్బ్ చేస్తాయి? పైగా, ఇన్నేళ్ల తర్వాత ఇండియా వచ్చి మన వీధిలో ఎంటర్ అయితే మాకు వెల్‍కం ఎలా చెప్పారో తెలుసా? పేడలో బాంబ్ పెట్టి! పాపం ఝాన్వీ చాలా భయపడింది... తను అసలే ప్రెగ్నెంట్ కూడా! అది సరదాగా ఎవరైనా చేసుండొచ్చు... కాని దానివల్ల కారుకి కాని, మాకు కాని ఏమైనా ప్రమాదం జరిగుంటే? మనకి అన్నిటికంటే ప్రశాంతత ముఖ్యం నాన్న.. అది ఈ దేశంలో దొరకదు... అందుకే, మనందరం కూడా అమెరికా షిప్ట్ అవుదాం! ఏమంటావు ఝాన్వీ?’ అడిగాడు విస్సు.
‘మీరు ఎలా చెప్తే అలానేనండి!’ దశరథ్ ఆలోచనలో మునిగిపోయాడు.
ఇంతలో డోర్ బెల్ రింగ్ అయ్యింది. ఝాన్వీ లేస్తూ ఉండగా, విస్సూ తనని కూర్చోబెట్టి, వెళ్ళి డోర్ తెరిచాడు. వివేక్ ని చూసి ఆనందంతో షాక్ అయ్యాడు.
‘వివేక్.....’ అని గట్టిగా అరిచి తనని మరింత గట్టింగా వాటేస్కున్నాడు విస్సూ.
ఇంతలో పెద్ద పొట్ట వేసుకునున్న ఝాన్వీ ని చూసి వివేక్ మురిసిపోయాడు. వదిన వైపు పరుగులు తీశాడు.
‘నాకు మాత్రం చెల్లి కావాలి...’ అన్నాడు వివేక్.
‘ఏదైన కాంబోలోనే వస్తుంది రా... ట్విన్స్...’ చెప్పింది ఝాన్వీ.
‘తొందరగా కనేయి వదినా, కలిసి ఆడుకుంటాం!’ అన్నాడు వివేక్.
‘కంగ్రాచులేషన్స్ అన్నయ్యా...’ వెళ్ళి మళ్ళీ విస్సూ ని హత్తుకున్నాడు వివేక్, ‘నాకు ఏమని మాట ఇచ్చవు? తిరిగి ఇండియాకి రాగానే ఫస్ట్ నన్నే కలుస్తా అన్నవుగా?’, అలిగాడు వివేక్.
‘నిన్న మేము ఫస్ట్ నీ ఇంటికే వద్దామనుకున్నాంరా, కాని వస్తుంటే ఎవరో మా కారు దగ్గర బాంబు పెట్టి భయపెట్టారు తెలుసా? దానికి తోడు బయట ఈ శబ్దాలు చూడు. రాత్రి అంతా ఇంతేనటగా?! నలుగురితో జరుపుకునే పండగని నలుగురుని బాధ పెట్టి, భయపెట్టి జరుపుకుంటే ఎలా? అసలు ప్రశాంతత లేని దేశంలో ఉండడమెందుకు చెప్పు, అందుకే, అందరం యూ.ఎస్ షిప్ట్ అవుదామనుకుంటున్నాం!’ బాధతో అన్నాడు విస్సూ.
‘అన్నయ్య... ఐ యామ్ సారి. నిన్న ఆ బాంబు పెట్టింది నేనె.’ చెప్పాడు వివేక్, కళ్ళనీళ్ళతో. విస్సూ షాక్ అయ్యాడు.
‘నేను చేసింది తప్పే అన్నయ్యా... పండగ అన్నది నలుగురిని సంతోషపెట్టేలా జరుపుకోవాలి కాని నలుగురినీ ఇబ్బంది పెట్టేలా కాదు. అప్పట్లో నువ్వూ వదినా ఇండియా వదిలి వెళ్ళాల్సొస్తున్నందుకూ ఎంతో బాధ పడ్డారు. అలాంటిది ఇప్పుడు ఇండియాని ఎప్పటికీ
వదిలెల్దామనుకుంటున్నారు. నా వల్లే! నా లాంటివాళ్ల వల్లే! అందుకే ఇప్పుడు మీకు ప్రామిస్ చేస్తున్నా... ఇక మీదట ఎప్పుడూ ఇలా జరగదు. సరదాకి ఇంటి దగ్గర నాలుగు క్రాకర్స్ కాల్చుకుంటాం కాని, ఎవరినీ ఇబ్బంది పెట్టం. రాత్రి కొద్దిసేపు టపాసులు పేల్చుకుంటాం కాని, రాత్రంతా కాదు. మావల్ల ఎవ్వరికీ ఏ హాని జరగకుండా నేను చూసుకుంటాను. మీరు మత్రం ఇక్కడే ఉండండి.. ప్లీజ్..’ అన్నాడు వివేక్ కన్నీళ్లతో. విస్సూ గట్టిగా నవ్వి వివేక్ భుజం తడిమాడు.
‘అసలు నువ్వు నన్ను మర్చిపోతావని అనుకున్నాను రా’ అన్నాడు విస్సూ. ‘మర్చిపోవడమా?’ తన జేబులోచి చిన్నప్పుడు తనకి కొనిచ్చిన బొమ్మ ఫోన్ తీసి చూపించాడు వివేక్.
‘నువ్వు ఇంకా ఇదే ఫోన్ పట్టుకుంటావని తెలిసే, నేనూ నీ వదినా నీకో గిఫ్ట్ తెచ్చాము’ అంటూ కొత్త ఐఫోన్ ఎక్స్ ని వివేక్ చేతికిచ్చాడు విస్సూ.
‘హ్యాపీ దివాళి’ అన్నాడు విస్సూ.
ఆ కొత్త ఐఫోన్‌లో ‘ధూం మచాలే’ పాట పెట్టింది ఝాన్వీ. వివేక్-విస్సూ చిన్నపిల్లల్లా డాన్స్ చెయ్యడం మొదలుపెట్టారు.
***
సందేశం కాని సందేశం!
మీరు కూడా ఈ దీపావళిని జాగ్రత్తగా జరుపుకోండి. మీ చుట్టుపక్కల ఎంతో మంది పేషెంట్స్ ఉండొచ్చు, ముసలి వాళ్ళు ఉండచ్చు, జంతువులుండొచ్చు, పిల్లలుండొచ్చు, పక్షులుండొచ్చు.. మీ దీపావళి వేడుక పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి.
అలానే ప్రకృతి కాలుష్యానికి, శబ్ద కాలుష్యానికి దారి తీసే టపాసులని ఎక్కువగా వాడకండి. ముఖ్యంగా, మనలో చాలా మందికి దీపావళి మరుసటి రోజు నుంచీ మన పనులు మనకి ఉంటాయి. అందువల్ల, అందరం రాత్రి ప్రశాంతంగా పడుకోవడం చాలా ముఖ్యం. కాసేపు సరదాకి నాలుగు క్రాకర్స్ కాల్చుకోండి కాని, రాత్రంతా ప్రశాంతంగా మీరు పడుకోండి, అందర్నీ పడుకోనివ్వండి. మన దేశంలోని పండగలన్నిటి వెనకా ఓ చరిత్ర ఉంది, దానిని మర్చిపోకండి. గౌరవించండి !
‘ఈ కథ ఎవరి మనోభావాలని దెబ్బతీయదని ఆశిస్తున్నాను. ముఖ్యంగా రామాయణం.. వివేక్ ఊహించుకునే ఎపిసోడ్, అది కేవలం వివేక్ అన్న ఓ చిన్న పిల్లాడి ఆలోచన పరిథిని బట్టి ఊహించుకున్నది మాత్రమే! నేను నా పర్సనల్ లైఫ్‍లో రామాయణం వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యను.. అది ఈ కొత్త జెనెరేషన్ ని కూడా ఇన్స్పైర్ చేయాలని నా వంతు కృషి నేను చేశాను’
- రచయిత