భూలోక యాత్ర - దమ్మవళం శ్రీనివాస్

bhuloka yatra

ఒక రోజు వైకుంఠంలో శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవి కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. కాసేపయ్యాక, లక్ష్మీ దేవికి స్వామి వారితో కలిసి ఎక్కడికైనా వెళ్ళి విహరించాలన్న కోరిక కలిగింది.
“స్వామీ, సరదాగా ఎక్కడికైనా వెళదామా?”
“తప్పకుండా దేవీ. భూలోకానికి వెళదామా? నీకు ఓకే నా?”
“అలాగే స్వామీ.. త్వరగా పదండి..మళ్ళీ ఎవరైనా వచ్చారంటే మీరు పనిలో పడి, మనం వెళ్ళటం కష్టమవుతుంది” హడావిడిగా, ఉత్సాహంగా చెప్పింది లక్ష్మీ దేవి. స్వామి వారు ఇలా తీరిగ్గా దొరకటం చాలా కష్టం మరి.
“వెళదాం. ఒక్క ఐదు నిమిషాలు ఆగి..” చెప్పాడు స్వామి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా.
“ఎందుకు స్వామీ ఐదు నిముషాలు?” ఆశ్చర్యంగా అడిగింది. కొంపదీసి ఈ ఐదు నిమిషాల్లో ఎవరైనా వచ్చి భూలోకంలో విహరించాలన్న తమ ప్లాన్ ని చెడగొట్టరు కదా?
“ఎవరైనా వస్తారేమోనని..” చిన్నగా నవ్వి జవాబిచ్చాడు స్వామి. ఊరికే, గమ్యం లేకుండా వెళ్ళటం కన్నా, తమ ప్రయాణం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే మేలనిపించింది స్వామి వారికి.
లక్ష్మీ దేవి భయ పడినట్టుగానే సరిగ్గా ఐదవ నిమిషంలో నారదుడు అక్కడకు వచ్చాడు. కాస్త విచారంగా ఉన్నాడు. స్వామి వారికీ, లక్ష్మీ దేవికి భక్తిగా ప్రణామం చేసాడు.
“ ఏమైంది నారదా? ఎందుకా విచారం? ” అడిగారు స్వామి.
“ఏం చెప్పమంటారు స్వామీ, భూలోకంలో మనుషులు ఎన్నో తప్పులు, పాపాలు చేతికి ఎముక లేనట్టుగా, ఎడా పెడా చేసేస్తున్నారు. కలి యుగమంటే ఏంటో అనుకున్నాను కానీ మరీ ఇంత దారుణమని ఎప్పుడూ అనుకో లేదు. యముడు కూడా గోల పెడుతున్నాడు ఇప్పుడున్న నరకం లెక్క లేని పాపులతో నిండి పోయి, ఇరుగ్గా మారి తనకే నరకం కనిపిస్తుందనీ, అర్జెంటుగా నరకం ఫేజ్ 2 ని మొదలు పెడితే మంచిదని చెబుతున్నాడు...” అంటూ ఇంకా ఏదో చెప్ప బోతుండగా, లక్ష్మీ దేవి మధ్యలో అడ్డు పడింది.
స్వామి వారితో సరదాగా భూలోకానికి వెళదామనుకుంటే, ఈ నారదుడేంటి ఇలా చెబుతాడు? అనవసరంగా ఇప్పుడు ఇలాంటివన్నీ విన్నారంటే స్వామివారి మూడ్ పాడై భూలోకానికి రాక పోవచ్చు. ఇలా అనుకొని, “నారదా, ఇంత మంది మనుషులు ఇన్ని తప్పులు చేస్తున్నారంటే, ఎక్కడో ఏదో లోపం ఉందని అనిపిస్తుంది. నా అనుమానం ఏంటంటే, మనుషులకి తాము చేసేది తప్పు అని తెలియదు అని. తప్పు అని తెలిసి ఎవరైనా చేస్తారా? ఏది తప్పో ఏది సరో తెలియంది ఎవరు మాత్రం ఏం చేయ గలరు?” అన్నది మనుషులని సమర్థిస్తూ.
“అదేమిటి తల్లీ అలా అంటారు? ఏది తప్పో ఏది కాదో మనుషులకి ఎందుకు తెలీయదు? మనకున్న వేదాలు, పురాణాలు ఎంత గొప్పవి. ధర్మ మార్గం ఎంత చక్కగా చెప్పబడింది వాటిలో. ఇవే కాక, ఎంతో మంది గొప్ప గురువులు, బోధకులు, సన్యాసులు, వారు చెప్పే సూక్తులు ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి మనుషులకు ఏది మంచో ఏది కాదో తెలుసుకోవడానికి” చెప్పాడు నారదుడు.
“ఇవన్నీ ఉన్నాయి సరే. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో నువ్వు చెప్పిన వేదాలు, పురాణాలు ఎంత మందికి అర్ధమవుతాయి? అసలు సంస్కృత భాష తెలిసిన వాళ్ళు ఎంత మంది? పోనీ కష్టపడి అర్ధం చేసుకుందామనుకున్నా వీటన్నిటికీ అసలు మనుషులకి టైం ఎక్కడ ఉంది? ఉరుకులు, పరుగులతో అలసి పోవటమే జీవితమై పోయింది. ఇక గురువులు, సన్యాసులు అంటావా, వీరు చెప్పేది వినే వాళ్ళంతా దాదాపు వయసు మళ్ళిన వాళ్ళు, చేద్దామన్నా ఏ పాపం చేయలేని వాళ్ళు.అలాగే, ఇప్పటి స్కూల్స్ లో పిల్లలకి ఏది మంచో ఏది కాదో చక్కగా వివరించి చెప్పే సిలబస్ ఏమైనా ఉందా అసలు? ఏమీ లేదు. సరస్వతీ దేవి మొన్నెప్పుడో కలసినప్పుడు ఇదే విషయం నాతో చెప్పి మొర పెట్టుకుంది. ఇదంతా ఒక వైపు. మరో వైపు అసలు చదువు రాని వారి పరిస్థితేంటి? వారికి ఎలా మంచీ, చెడూ తెలిసేది? తప్పంతా వ్యవస్థలో పెట్టుకొని మనుషులు పాపాలు చేసారు అని ఎందుకు వారిని ఆడి పోసుకోవటం?” లక్ష్మీ దేవి అడిగింది నిలదీస్తున్నట్టుగా.
జవాబివ్వడానికి ఠక్కున ఏదీ తట్టక పోవడంతో ఆలోచనలో పడ్డాడు నారదుడు.

అప్పటి దాకా మౌనంగా ఉన్న స్వామి వారు లక్ష్మీ దేవి అడిగిన దానికి జవాబివ్వాల్సిన బాధ్యత తన మీద ఉన్నట్టుగా భావించారు.
“దేవీ, పుస్తకాలు, పురాణాలు లాంటివి ఏవీ లేకపోయినా, గురువులు, సన్యాసులు లేక పోయినా, మనుషులకి ఏది తప్పో, ఏది కాదో చెప్పటానికి, వారి దగ్గర ఓ మహత్తరమైన శక్తి ఉంది. అది లేని మనిషంటూ ఉండడు. ఈ సృష్టి చేసేటప్పుడే బాగా ఆలోచించి, మనుషులకు ఆ శక్తినిచ్చాను. అదే వారిని జంతువుల నుంచి వేరు చేసేది. అదే వారికి ఎప్పుడూ, ఏ మొహమాటం లేకుండా, ఏ స్వార్థం లేకుండా, ఏ ప్రతిఫలం ఆశించకుండా, అడగక పోయినా, ఏది కరెక్టో ఏది కాదో చక్కగా, అర్ధమయ్యేలా, వివరించి చెప్పేది..”

“ఏంటి స్వామీ అది?” కుతూహలంగా అడిగింది లక్ష్మీ దేవి.
“ఆ శక్తి పేరు... అంతరాత్మ..”
ఒక్క క్షణం అంతా నిశబ్దం అలుముకుంది వైకుంఠంలో. నారదుడి మొహంలో సంతృప్తి. తనని స్వామి వారు ఆ వేళ తలచుకొని ఈ చర్చ జరిగేలా చేసిన కారణం అర్ధమైంది. లోకానికి స్వామి వారు ఏదో చెప్పాలనుకుంటున్నారు.

“అంటే మీరనేది ఏమిటి స్వామీ? ఏ మనిషికైనా తను చేసేది తప్పో కాదో ముందుగానే అంతరాత్మ ద్వారా తెలుస్తుంది అంటారా?”
“ఖచ్చితంగా..”
“నమ్మ లేక పోతున్నాను స్వామీ..అలా ఎలా జరుగుతుంది? తెలిసీ ఎవరైనా ఎందుకు తప్పు చేస్తారు? వింతగా ఉందే..”
“ఎలాగూ భూలోకం వెళదాం అనుకున్నాం కదా.. పద.. చూద్దువు గానీ..” చెప్పాడు స్వామి అప్పటి దాకా కూర్చొని ఉన్న ఆసనం మీద నుంచి లేస్తూ.

నారదుడు కూడా వచ్చిన పని అయి పోయినట్టుగా స్వామి వారి దగ్గర సెలవు తీసుకొని అక్కడ నుంచి బయలు దేరాడు.
భూలోకానికి చేరుకున్నారు స్వామి వారు లక్ష్మీ దేవి సమేతంగా. టైం ఉదయం తొమ్మిది. ముందుగా ఎదురుగా కనిపించే ఓ ఇంట్లోకి వెళ్ళారు, అదృశ్య రూపంలో అక్కడ జరిగేది చూద్దామని. సుబ్బారావనే ఓ మధ్య తరగతి మనిషి ఇల్లది. ఇంట్లో పెద్దగా ఏడుపు పదేళ్ళ చిన్న పిల్లాడిది. సుబ్బా రావు వాడ్ని చావగొడుతున్నాడు. ఇంట్లో వాళ్ళు పిల్లాడ్ని కొట్టకుండా సుబ్బారావును ఆపుతున్నారు. కాసేపు జరిగేది గమనించాక విషయం అర్ధమైంది లక్ష్మీ దేవికి. పిల్లాడు సుబ్బారావు కొడుకు. ఇంట్లో డబ్బు దొంగతనం చేసి స్కూలు ఎగ్గొట్టి స్నేహితులతో కలిసి ఏదో సినిమాకు వెళ్ళాడు ఇంట్లో వాళ్ళకు తెలియకుండా. జరిగినదంతా బయట పడే సరికి, ఉగ్ర రూపం దాల్చాడు తండ్రి.

“ఛీ వెధవ. నిన్ను కొట్టి ఏ మాత్రం లాభం లేదు. ఇంట్లో డబ్బు కాజేయడానికి సిగ్గు లేదూ.. దొంగ వెధవ..ఇంత తప్పు చేసి నీకు నిద్రెలా పడుతుందిరా? బుద్ధిగా, నిజాయితీగా ఉండటం నేర్చుకో. ఇంకోసారి ఇలా జరిగిందో, ఒళ్ళు చీరేస్తాను.. స్కూలుకు తగలడు ఇప్పుడు..” చెప్పాడు సుబ్బారావు కోపంగా.

అక్కడే అదృశ్య రూపంలో ఉండి అంతా గమనించిన లక్ష్మీ దేవి, “ఇక్కడ ఇక చూడటానికి ఏమీ లేదు స్వామీ.. మనం వచ్చిన పని అవలేదు. మీరేదో అంతరాత్మ అన్నారు.. ఏదీ కనిపించదే..” అన్నది కాస్త నిరుత్సాహంగా.

“కాస్త ఆగు దేవీ.. చూద్దాం ఏం జరుగుతుందో..”
గొడవ సద్దుమణిగాక, పిల్లాడు స్కూలుకు వెళ్ళి పోయాడు. తరువాత కాసేపటికి, ఎవరో బయటి వ్యక్తి ఇంటికి వచ్చి సుబ్బారావుతో ఏదో ప్రైవేటు గా మాట్లాడుతున్నాడు.

ఆసక్తిగా ఆ సంభాషణని వింటున్నారు స్వామి వారు, లక్ష్మీ దేవి.
“.. నా బిల్లు త్వరగా క్లియర్ చేయండి సర్.. మీ ఋణం ఉంచుకోను..” సుబ్బారావును అభ్యర్ధనగా అడిగాడు వచ్చినతను, తన పనికి లంచం ఎర వేస్తూ. సుబ్బారావు ఏదో గవర్నమెంట్ కంపెనీలో అకౌంటెంట్.
“మీరు చేసిన పనికన్నా, బిల్లులో దాదాపు ఏభై వేలు ఎక్కువ క్లెయిమ్ చేసారునా లెక్క ప్రకారం. అదంతా డిడక్ట్ చేసి త్వరగా సెటిల్ చేస్తాలెండి..” చెప్పాడు సుబ్బారావు సూటిగా.
“ఎంత మాట.. మీ దగ్గర దాచేదేముంది సర్.. ఈ ఐదు వేలు గిఫ్టుగా ఉంచండి.. నా బిల్లు ఏ డిడక్షన్ లేకుండా క్లియర్ చేసి పెట్టండి చాలు.. ”
ఇప్పుడు సుబ్బారావు ఏం చేస్తాడా, అతడి అంతరాత్మ ఏమి చెబుతుందా అని ఆసక్తిగా గమనిస్తున్నది లక్ష్మీ దేవి. అంతరాత్మతో మనిషికి లోలోపల జరిగే సంభాషణ లక్ష్మీ దేవికి స్పష్టంగా అర్ధమయ్యేలా చేసాడు స్వామి ముందుగానే.

సుబ్బారావు లోని అంతరాత్మ హెచ్చరించింది, “రేయ్ సుబ్బు, లంచం తీసుకొని నువ్వు పని చేసే కంపెనీకి ద్రోహం చేయటం తప్పు.. వచ్చిన వాడిని వెళ్ళి పొమ్మని చెప్పు..”
“వచ్చిన వెధవ ఐదు వేలు ఇస్తానంటే ఎందుకు వదులుకోవాలి? పైగా ఇవాళ శుక్రవారం. లక్ష్మీ దేవి అనుగ్రహంతో వచ్చిన డబ్బు కాదంటారా ఎవరైనా? డబ్బుతో నాకు ఎన్నో పనులున్నాయి ఇప్పుడు.. నేను తీసుకోకపోతే ఇంకో వెధవెవడో ఈ డబ్బు తీసుకొని అడిగిన పని చేస్తాడు. పైగా ఇది లంచం కాదు గిఫ్టు అని చెప్పాడు కదా?” సుబ్బారావు సర్ది చెబుతున్నాడు అంతరాత్మకు.

“ఒరేయ్ చెత్త వెధవ, ఆత్మవంచన చేసుకుంటున్నావ్.. ఇంకొకరి గురించి నీకెందుకు.. నువ్వు నిజాయితీగా ఏడువు చాలు. ఇందాక నీ కొడుక్కి చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకో.. డబ్బు తీసుకోవటం ముమ్మాటికీ తప్పే.. అది నీ ఆఫీసు డబ్బు కాజేయడంతో సమానం.. నీ కొడుకు ఇంట్లో దొంగతనం చేయటం తప్పైతే, ఇప్పుడు నువ్వు ఆఫీసు డబ్బు కాజేయటం కూడా తప్పే.. లంచానికి గిఫ్టు అని పేరు పెడితే సరిపోదు. ఏమీ ఆశించకుండా ఇచ్చేదాన్ని గిఫ్ట్ అంటారు. ప్రతిఫలం ఆశించి ఇచ్చే దాన్ని లంచం అంటారు..” వివరంగా చెప్పింది అంతరాత్మ.

“సర్లే, నేనొక్కడినీ నిజాయితీగా ఉంటే సరిపోదు ఎలాగూ.. ప్రపంచంలో అందరూ లంచం తీసుకోవటం మానేసాక, నేనూ మానేస్తాలే..”
“ఓరేయ్ దొంగ వెధవ.. ఇంత తప్పు చేసి నీకు నిద్రెలా పడుతుందిరా? నిజాయితీకి మించినది ఏదీ లేదురా...” అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న అంతరాత్మను మధ్యలోనే ఆపేసి, డబ్బు తీసుకున్నాడు సుబ్బారావు లెక్క సరిగ్గా చూసుకొని.
ఆశ్చర్య పోయింది లక్ష్మీ దేవి.

“చూసావా దేవీ, మనుషులు తప్పులు ఎంత తేలిగ్గా, ఎలా చేస్తారో? అంతకు ముందే కొడుక్కి డబ్బు కాజేయటం తప్పు అని చెప్పిన తండ్రి, అదే తప్పు తను చేయడానికి ఏ మాత్రం సంకోచించటం లేదు. అంతరాత్మ చెప్పింది ఏ మాత్రం పట్టించుకోలేదు.”
“అవును స్వామీ. నాకూ చాలా ఆశ్చర్యంగా, వింతగా ఉంది..అక్రమంగా డబ్బు తీసుకోవటమే కాక నా అనుగ్రహం వల్లనే అది వచ్చిందంటాడా? ఎంత మూర్ఖత్వం? ఇక్కడ ఒక్క క్షణం కూడా మనం ఉండొద్దు. ఇంకేదైనా ఇంటికి వెళ్ళి చూద్దామండీ..”
“సర్లే పద. కాస్త దూరంలో ఉన్న ఇంకో ఇంటికి వెళ్ళి చూద్దాం.. ఏం జరుగుతుందో..” అంటూ లక్ష్మీ దేవిని వేరే ఇంటికి తీసుకొని వెళ్ళాడు స్వామి. అదృశ్య రూపంలో ఉండి ఇంట్లో వాళ్ళని ఆసక్తిగా గమనిస్తున్నారు ఇద్దరూ.

ఇంటి యజమాని పేరు వెంకట్. నలభై ఏళ్ళు ఉంటాయి దాదాపు. భార్య శ్రీదేవి చాలా అందంగా ఉంది. కాలింగ్ బెల్ మోగింది. వచ్చింది ఎవరా అని శ్రీదేవి ముందుగది తలుపుకున్న పీప్ హోల్లోంచి చూసింది. వచ్చింది పక్కింటాయన.

“ఏవండీ, తలుపు తీయమంటారా? పక్కింటాయన..” ఆఫీసుకు రెడీ అవుతున్న భర్తను అడిగింది.
“నేను వస్తున్నాను ఆగు.. నువ్వు లోపలి వెళ్ళు..” చెప్పి వెంకట్ వచ్చాడు విసుగ్గా. భార్య పరాయి మగాడి వంక కన్నెత్తి చూడటం కూడా వెంకట్ భరించ లేడు. ఈ విషయం బాగా తెలిసింది కనుకనే, తలుపు తీయాలా వద్దా అని భర్తను అడిగింది శ్రీదేవి.
పక్కింటాయన వెళ్ళి పోయాక, శ్రీదేవి ముందు గదిలోకి టిఫిన్ తీసుకు వచ్చింది భర్త కోసం.
“అర్జంటుగా ఆఫీసుకు వెళ్ళాలి, ఈ ఉప్మా ఏంటి ఇంత వేడిగా తగలబడ్డది.. నోరు కాలిపోతుంది.. కాస్త ముందుగా ప్లేట్లో పెట్టి చల్లార్చ లేవూ?” చిరాకు పడ్డాడు భార్య మీద.
హడావిడిగా తినడం ముగించి, ఆఫీసు బ్యాగు తీసుకొని బయలుదేరాడు, తలుపు గట్టిగా వేసుకోమని భార్యను హెచ్చరిస్తూ.
“పదండి స్వామీ, వెళదాం..” చెప్పింది అప్పటి దాకా జరిగింది గమనించిన లక్ష్మీ దేవి.

స్వామి వారు జవాబివ్వకుండా, మూసి ఉన్న తలుపు లోంచి వెంకట్ వెళ్ళిన వైపే చూస్తున్నారు. లక్ష్మీ దేవి కూడా అటు వైపుకు దృష్టి సారించింది స్వామి వారు చూస్తున్నది ఏంటో తెలుసుకుందామని. వారికున్న శక్తి వల్ల తలుపు మూసి ఉన్నా కూడా, తలుపు బయట జరిగేది స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ జరిగేది చూసి నివ్వెర పోయింది లక్ష్మీ దేవి.

అర్జంటుగా, హడావిడిగా బయటకు వెళ్ళిన వెంకట్ ఇంటి ముందున్న బండి స్టార్ట్ చేయ బోతూ, ఏదో పని మీద బయటకు వచ్చిన ఎదురింటావిడను చూసి ఠక్కున ఆగి పోయాడు. ఎప్పటి నుంచో ఆవిడ మీద కన్నుంది వెంకట్ కి. రెప్ప వాల్చకుండా ఆవిడ వైపు ఆశగా చూస్తున్నాడు. జేబు లోంచి ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ఆవిడ దృష్టి తన మీద పడేలా వెకిలిగా ప్రవర్తిస్తున్నాడు.
వెంకట్ లోని అంతరాత్మ వెంకట్ తో మాట్లాడటం మొదలు పెట్టింది వెంటనే.

“నువ్వు చేసేది తప్పురా.. పరాయి స్త్రీ తో నీకు పనేంటి? అర్జంటుగా వెళ్ళాలి అన్నావుగా? కదిలి చావొచ్చుగా..” అంతరాత్మ చెప్పింది చిరాగ్గా.
“నువ్వు మూసుకో... ఎప్పుడో కానీ ఎదురింటావిడ బయటకు రాదు.. కాసేపు చూడనీ.. చూస్తే కొంపలేమీ మునగవులే..”
“ఒరేయ్ చచ్చు వెధవ.. భార్య పరాయి మగాడి వంక కన్నెత్తి కూడా చూడకూడదు, నువ్వు మటుకు ఎదురింటావిడను పనులు మానుకొని మరీ తినేసేలా చూడొచ్చా? చక్కటి భార్యను ఇంట్లో పెట్టుకొని ఎందుకురా ఈ వెకిలి వేషాలు? బండి స్టార్ట్ చేసి కదల్రా త్రాష్టుడా.. ”
అంతరాత్మను పట్టించుకోవటం ఆపేసాడు ఎదురింటావిడను చూపుల్తో తినేస్తూ, లోకాన్నే మరచి పోయి బిజీగా ఉన్న వెంకట్. కాసేపటికి ఎదురింటావిడ లోపలికి వెళ్ళాక, బండి స్టార్ట్ చేసి ఆఫీసుకు వెళ్ళాడు, చెదిరిన మనసుతో.

“ఏంటి స్వామీ ఈ అన్యాయం.. ఎందుకు మనుషులు ఇంత దారుణంగా, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు? ఎంత చక్కగా చెప్పింది అంతరాత్మ వాడు చేసేది తప్పు అని..”
జవాబివ్వకుండా చిన్నగా నవ్వాడు స్వామి “మరి నేను చెప్పింది అదే కదా” అన్నట్టుగా.

“మనసంతా పాడైందండి. ఈసారి చివరగా ఏదైనా ఆఫీసుకు వెళదాం. మనుషులు రోజులో సగ భాగం పైన ఆఫీసుల్లో గడుపుతారని విన్నాను. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం”
“అలాగే దేవీ..”
ఓ భారీ ఆఫీసు కాంప్లెక్స్ కు వెళ్ళారు ఇద్దరూ అదృశ్య రూపంలో.
హడావిడిగా ఉంది లోపల. అంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నట్టనిపించింది. తృప్తిగా అనిపించింది లక్ష్మీ దేవికి. మనుషులు కనీసం తమ పనైనా శ్రద్ధగా చేసుకుంటున్నారు.
స్వామి వారికి లక్ష్మీ దేవి మనసులో అనుకునేది అర్ధమై “దేవీ, ఓ సారి జరిగేది జాగ్రత్తగా గమనించు..” అని చెప్పాడు చుట్టూ చూస్తూ.
ఓసారి చుట్టూ పరికించి చూసి, ఉలిక్కి పడింది లక్ష్మీ దేవి. అక్కడి వారు చాలా మంది బిజీగా ఉన్నది ఎందుకో అర్ధమైంది. కొంత మంది ఫోన్ లో వాట్స్ అప్ చాట్ లో ఉంటే, మరికొంత మంది కంప్యూటర్ లో యు ట్యూబ్ వీడియోలు, వార్తలు చూస్తూ, పనికి మాలిన కబుర్లు చెబుతూ, పర్సనల్ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ వృధాగా కాలం గడిపేస్తున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే శ్రద్ధగా పని చేసుకుంటున్నారు.
“చూసావా దేవీ, పని మీద ఏ మాత్రం శ్రద్ధ లేకుండా ఎలా ఉన్నారో వీళ్ళంతా?”
“అవును స్వామీ..”
అప్పుడే బాసు గదిలోంచి కోపంగా బయటకు వచ్చిన ఓ ఉద్యోగిని చూసి, ఆసక్తిగా అక్కడి వెళ్ళారు ఏం జరుగుతుందో చూద్దామని.
ఆ ఉద్యోగి పేరు మూర్తి.
“వీడికి మనం కష్ట పడి పని చేసేది ఏ మాత్రం పట్టదు. వీడొక్కడే ఇక్కడ పని చేసే వాడిలా బిల్డప్ ఇస్తాడు. వెధవ. నాకు బద్ధకంట, పది నిముషాలు పట్టే పనిని గంట చేస్తానుట. అదే పని వీడికిస్తే రెండు గంటలకు కూడా అవ్వదు.. చెత్త వెధవ.. అడుక్కు తినే వెధవ..అయినా ఈ దిక్కు మాలిన కంపెనీలో పని చేయటం కూడా దండగ.. ఎంత పని చేసినా జీతం పెంచమంటే చచ్చి పోతారు..” మరో ఉద్యోగితో బాసు గురించీ, కంపెనీ గురించీ చెబుతున్నాడు మూర్తి కోపంగా. ఇంతకూ జరిగిందేంటంటే, ఈ సారి మూర్తి కి చాలా తక్కువ స్కోర్ వచ్చింది పెర్ఫార్మన్స్ రివ్యూలో. అందుకే ఈ కోపం. కంపెనీని ఛెడామడా తిడుతున్నాడు.
మూర్తి అంతరాత్మ మేల్కొని సంభాషించడం మొదలు పెట్టింది ఈ లోపల.
“ఈ కంపెనీ అంటే నీకు పడనప్పుడు వేరే ఉద్యోగం చూసుకోవచ్చుగా?” అంతరాత్మ అడిగింది.

“అది కరెక్టే, కానీ ఎక్కడ అప్లై చేసినా ఒక్క చోట కూడా సెలెక్ట్ అయి చావడం లేదు.. జాబ్ మార్కెట్ అంత గొప్పగా లేదిప్పుడు..” జవాబిచ్చాడు మూర్తి.
“నీకు వేరే గతి లేక ఇక్కడ పని చేస్తున్నావు అంతేగా... అంటే నువ్వు ఈ కంపెనీని భరించడం లేదు.. ఈ కంపెనీయే నిన్ను భరిస్తుంది.. అలాంటప్పుడు బుద్ధిగా, నోరు మూసుకొని పని చేసుకోకుండా ఎందుకు అనవసరంగా ఈ పిచ్చి వాగుడు..పని చేసే కంపెనీ నీకు నచ్చలేదంటే నీకు రెండు దారులు ఉన్నాయి. నీ బాసు దగ్గరకు వెళ్ళి నీకున్న సమస్యలు చర్చించడం లేదా అది అయ్యే పని కాదు అనుకుంటే వేరే ఉద్యోగం లోకి మారటం. ఈ రెండూ చేయలేనప్పుడు, నిన్ను భరిస్తున్న బాసునీ, కంపెనీని తిట్టడం తప్పు..”

అంతరాత్మ చెప్పేది మధ్యలోనే వినటం ఆపేసి, మళ్ళీ తిట్ల దండకం అందుకున్నాడు మూర్తి, ఈసారి కాస్త ఎక్కువగా.
అంతా వింటున్న లక్ష్మీ దేవి స్వామి వారితో “ఇక చాలండి భూలోక యాత్ర. బాధేస్తుంది ఇక్కడ జరిగేవి చూస్తుంటే..” అన్నది విచారంగా.
“దేవీ, ఇవాళ మనం చూసినవి మాత్రమే కాదు. ఓ సగటు మనిషి ఇంకా ఎన్నో రకాల తప్పులు నిత్యం, అలవాటుగా చేస్తున్నాడు. ట్రాఫిక్ రూల్సు పట్టించుకోకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడం, కుటుంబ సభ్యులతో, ఆప్తులతో గడపాల్సిన ఎంతో విలువైన, ఎన్నటికీ తిరిగి రాని సమయాన్ని వ్యర్ధంగా బార్లలోనూ, క్లబ్బుల్లోనూ, పబ్బుల్లోనూ జీవితంలో ఏమీ కాని వారితో గడపటం, బద్దకాన్ని వదిలించుకో లేక దేనికీ టైం లేదు అనుకోవటం, భక్తి అంతా గుడికే పరిమితం చేసి, కష్టాల్లో ఉన్న సాటి మనిషిని పట్టించుకోక పోవటం, గుళ్ళో కూడా ఆడవారు కనిపిస్తే వచ్చిన పని మరిచి వారి వైపు వెకిలిగా చూడటం, తన కింద పని చేసే వారిని చులకనగా చూడటం, మర్యాద లేకుండా మాట్లాడటం, తోటి వారు పైకి వస్తుంటే అసూయతో వారికి హాని చేయటం, డబ్బు కోసం నీతిని వదులుకోవటం.. ఇలా ఎన్నో తప్పులు నిర్భయంగా చేసి చాలా మంది మనుషులు నరకంలో తమ స్థానం సుస్థిరం చేసుకుంటున్నారు.. నారదుడు బాధ పడింది కూడా అందుకే..”
“మరి దీనికి పరిష్కారమేంటి స్వామీ? ఎప్పుడు వీళ్ళంతా బాగు పడతారు?”
“దీనికి పరిష్కారం చాలా సులువు దేవీ. అంతరాత్మ చెప్పింది వినటమే. అంతరాత్మ ఎంత శక్తివంతమైందో ఇవాళ చూసావు కదా. తప్పు చేసే ముందు ఏ మనిషినైనా అది హెచ్చరిస్తుంది.. నువ్వు చేస్తుంది తప్పు అని నిక్కచ్చిగా చెబుతుంది.. ఎవరైనా తప్పు చేసారు అంటే, వారు తమ అంతరాత్మకు వ్యతిరేకంగా ఆ పని చేసినట్టే. అలాంటి మనిషికి శాంతి ఉండదు. మనుషులు చాలా సార్లు తమకు మన:శాంతి కరువైంది అని బాధ పడుతూంటారు. దాని అర్ధం తెలుసా? వారు తమ అంతరాత్మకు వ్యతిరేకంగా పని చేసి దాంతో నిత్యం ఘర్షణ పడుతున్నారు అని. అంతరాత్మతో సఖ్యతగా ఉండి, ఏ తప్పూ చేయకుండా ఉండే మనిషికి అశాంతి అనేది ఎన్నటికీ కలుగదు.. ఈ జీవిత సత్యం తెలుసుకున్న మనిషి ఎప్పుడూ హాయిగా, మన:శాంతిగా ఉంటాడు..”

“చక్కగా చెప్పారు స్వామీ.. ఇక మీదటైనా, మీరు చెప్పింది విని మనుషులు శాంతిగా, సుఖంగా ఉంటారని ఆశిద్దాం..” చెప్పింది లక్ష్మీ దేవి, స్వామి వారి తో భూలోక యాత్ర ముగించి వైకుంఠానికి తిరిగి వెళ్తూ.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న