టీవీ సీతక్క - దాసరి చంద్ర

tv seetakka

చందు పుస్తకాలను సర్ధుతుంటే వాళ్ళ అమ్మానాన్నల పెళ్ళి నాటి ఫోటో ఒకటి ఆ పుస్తకాలలో నుండి జారిపడింది. ఆ ఫోటో చాలా తమాషాగా వుంది. పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు మెళ్ళో వెనుక నుంచి తాళి కడుతున్న ఫోటో అది. పాతకాలంలో పెళ్ళి కూతురు సాధారణంగా పెళ్ళిపీట మీద స్టిల్‌ ఫోటో.. తల వంచుకుని, సిగ్గుపడుతూ. కానీ ఈ కాలంలో పెళ్ళికూతురు సిగ్గు నటించడం లేదు. ఒకవేళ నటించడానికి ప్రయత్నించినా ఫోటోగ్రాఫర్‌ ఒప్పుకోడనుకోండి. అది వేరే విషయం. మనలో మన మాట.. ఈ మధ్య పెళ్ళికి వచ్చిన అతిథులెవరూ ముహూర్తం వరకు ఉండడం లేదు. ఎందుకంటారూ? కంకణం కట్టినప్పటి నుంచీ ఆరుంధతిని చూపించే వరకూ పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు కనిపించకుండా ఫోటోగ్రాఫర్లు అడ్డంగా నిలబడి కవర్‌ చేసేస్తున్నారు. కనిపించని దానికి ఎందుకులే టైమ్‌ కాల్చుకోవడం అని అతిథులు ‘హలో’ చెప్పి అప్పుడే వెళ్ళిపోతున్నారు.

ఫోటోని చందూ పరిలశీనగా చూశాడు. అమ్మ ఆ కాలంలోనే తల ఎత్తుకుని పెళ్ళి పీటల మీద కూర్చుందంటే.. అమ్మ ఆత్మాభిమానానికి గర్వంగా ఫీయ్యాడు. టీవీ ఆన్‌ చేయబోతున్న వాళ్ళమ్మ దగ్గర కొచ్చి ఫోటో చూపుతూ,

‘‘మమ్మీ.. నాన్న మీ మెళ్ళో తాళి వెనుక నుంచి కడుతున్నాడేంటి?’’ అని అడిగాడు.

‘‘ఓ.. అదా.. మీ నాన్ననే అడుగు’’ ముసి ముసిగా నవ్వుకుంటూ టీవీ చూడ్డంలో మునిగిపోయింది ఆమె.

చందు ఇచ్చిన ఫోటోను చూసి కళాధరం ఒక నిట్టూర్పు విడిచి ‘‘ఇదా... చెబితే ఆర్ధమయ్యేది కాదు నాన్నా... చూపించాల్సిందే ఫ్లాష్‌బ్యాక్‌...నాకు పెళ్ళి చూపు...మీ అమ్మకు టీవీ చూపు’’ అంటూ థర్డ్‌ అంపైర్‌కు ఇచ్చే సిగ్నల్లా చేతుతో సైగ చేసి చూపించాడు.
కళాధరం, అతని తల్లిదండ్రులు ఒక సోఫాలో కూర్చుని వున్నారు. ఇంకో సోఫాలో పెళ్ళిచూపు కూతురు (కన్‌ఫర్మ్‌ అయ్యాక పెళ్ళి కూతురు) తండ్రి సుందర్రావ్‌ కూర్చున్నాడు. పక్కనే తల్లి సుందరమ్మ నిల్చుని వుంది. కళాధరం స్వీట్లు కూడా తినకుండా ఆమ్మాయికోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు.

అది గమనించిన సుందర్రావ్‌ ‘‘సుందరీ.. అమ్మాయిని తీసుకురా’’ అన్నాడు.

సుందరమ్మ లోపలి నుంచి వచ్చి సుందర్రావ్‌ చెవిలో ఏదో చెప్పింది. అతనూ ఆమె చెవిలో ఏదో చెప్పాడు. సుందరమ్మ తల ఊపి లోపలికి వెళ్ళి రెండు నిముషా తర్వాత తిరిగొచ్చి భర్త చెవిలో మళ్ళీ గుసగుస.. ఆయన కూడా గుసగుసే.. ఇప్పుడు సుందర్రావ్‌ కూడా సుందరమ్మతో పాటు లోపలికి వెళ్ళాడు. ఏం జరుగుతుందో అర్థంకాక అబ్బాయివాళ్ళు అయోమయంగా చూస్తున్నారు.

‘‘రెండు నిముషాలు ... రడీ అవుతూ వుంది’’ అబ్బాయి వాళ్ళ వైపు ఇబ్బందిగా చూస్తూ సోఫాలో కూర్చున్నాడు.సుందరమ్మ మళ్ళీ వచ్చి భర్త చెవిలో ఏదో చెప్పింది.

అబ్బాయి వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు ఇప్పటికి చాలాసార్లు చూసుకున్నారు. కానీ ఖాళీగా ఉండలేక మళ్ళీ ఒకసారి చూసుకున్నారు.
సుందర్రావ్‌ మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు నిముషాల తర్వాత హాల్లోకి వచ్చాడు.

గెలవాలంటే చివరి బాల్‌కి సిక్స్‌ కొట్టాల్సివచ్చినప్పుడు బాల్‌ ఎప్పుడు పడుతుందా.. సిక్స్‌ ఎప్పుడు కొడతారా అన్నట్టు ఎదురుచూసే ప్రేక్షకుడి మాదిరిగా వుంది అబ్బాయి తరపు వాళ్ళ పరిస్థితి.

‘‘ఏమండీ.. ఏదైనా చెప్పుకోలేని ఇబ్బందా?’’ అన్నాడు అబ్బాయి తండ్రి చపతిరావ్‌

‘‘అటువంటిదేం లేదండి.. అమ్మాయి ఇక్కడికి రావడానికి కాస్తా సిగ్గుపడుతూ వుంది. అందుకే మీరే లోపలికి..’’ నోట్లో నీళ్ళు లేకపోయినా నమిలాడు.

‘‘సిగ్గా..??! మేం లోపలికొస్తే ఉండదా?!’’

‘ఆ ఏర్పాట్లేవో నేను చూసుకుంటాను.. మీరు రండి’’ ధైర్యంగా హామీ ఇచ్చాడు సుందర్రావ్‌. తన ఏర్పాట్లు తనకున్నాయ్‌.
అందరూ లోపలి గదిలోకి వెళ్ళారు. అక్కడ అమ్మాయి కనిపించలేదు.

‘‘అమ్మాయిని ఇకనైనా చూపిస్తారా?’’ ఉండబట్టలేక పోతున్నాడు పెళ్ళి చూపుల కొడుకు కళాధరం.

‘‘అదిగో బాబూ.. ’’

‘‘అదుగో అంటున్నారు.. ఎక్కడ? ఇంతకీ మీకు అసు కూతురుందా? లేక రాజుగారి వస్త్రాల్లాగా..’’

‘‘రాజుగారి వస్త్రాలు అబద్దం బాబూ.. నా కూతురు నిజం.. అదుగో అద్దంలో..’’

‘‘అద్దంలోనా?’’ ఖంగుతిని ముగ్గురూ ఒకేసారి ఖంగుమని అరిచారు. తెప్పరిల్లి అద్దం వైపు చూశారు.

‘‘ఇవేం పెళ్ళి చూపులండీ.. అద్దంలో పెళ్ళి చూపులు .. ప్రపంచంలో మొదటివి ఇవేననుకుంటా.. మరీ ఇంత సిగ్గయితే ఎలా? రేపు సిగ్గని కాపురం కూడ అద్దంలోనే చేస్తానంటే మా వాడి పరిస్థితి..?’’ దీర్ఘం తీసింది కళాధరం తల్లి

‘‘అలా ఏం కాదులే వదినా. చిన్నపిల్ల కదా.. మనం మాత్రం అప్పట్లో..’’ సిగ్గుపడుతూ అంది సుందరమ్మ.

‘‘కాకపోతే ఫరవాలేదు వదినా...ఒకవేళ అయితే మా వాడి బతుకు ఆటోస్టాండే కాదా...’’

‘‘ఆటోస్టాండా?కొటేషన్‌ కొత్తగా వుందే’’ నవ్వుతూ అన్నాడు సుందర్రావ్‌.

‘‘ఆ.. అప్‌డేటవ్వద్దూ.. ఇప్పుడు బస్సుల్లో ఎవరెక్కుతున్నారు? అందరూ ఆటోల్లోనే కదా’’ అన్నాడు చపతిరావ్‌

అమ్మాయి అద్దంలో కనిపిస్తూ వుంది. అమ్మాయి చెవులకు ఇయర్‌ ఫోన్స్‌ తగిలించి ఉన్నాయి. తదేకంగా దేన్నో చూస్తున్నట్లుంది. ఎందుకు చూస్తుంది అలా? సిగ్గా..? బిడియమా..? భయమా..? ఏమిటన్నది, ఎందుకన్నది తెలిసిన వాళ్ళు నాకు తెలిసి ముగ్గురు. ఒకరు దేవుడు.. మిగిలిన ఇద్దరూ సుందర్రావ్‌ దంపతులు .కళాధరానికి అమ్మాయి పిచ్చగా నచ్చిందట.

‘నచ్చితే చేసుకుందువుగానీలేరా.. నీకు అన్నీ తొందరే’’ అని సుందర్రావ్‌ వైపు తిరిగి ‘‘మీరు ఏమీ అనుకోకపోతే ఒక చిన్న మాట..’’ అన్నాడు చపతిరావ్‌ మ్లెగా.

ఈ మాటతో సుందర్రావ్‌కి గుండే జారిపోయినట్టనిపింది. అది మోకాళ్ళ దాకో.. అరికాళ్ళ దాకో గమనించే పరిస్థితిలో లేడు తను. అసలు విషయం తెలిసిపోయిందా? నాటకం బయటపడిపోయిందా? అయినా గుండేల్ని కాస్తా చిక్కబట్టుకుని,

‘‘అనుకోవడానికి ఏముందిలెండి.. ఆడప్లి తండ్రిని.. అనుకుంటే పెళ్ళిళ్ళు అవుతయా! అడగండి..’’ అన్నాడు నీరసంగా.

‘‘ఏమీ లేదు.. అమ్మాయినైతే సిగ్గని అద్దంలో చూపించారు. చూశాం. కానీ.. కాళ్ళు.. అవీ సక్రమంగా...’’

‘‘ఆ సందేహమే మీకు అక్కర్లేదు అన్నయ్య గారూ...మా కళావతి పరుగులో పి.టి. ఉషాకి పెదనాన్న కూతురు. అశ్వనీ నాచప్పకు అన్న కూతురు. పరుగు పందెంలో అమ్మాయి కొచ్చిన సర్టిఫికేట్లు చూపుతాను చూడండి?’’ అంటూ సుందరమ్మ లోపలికి వెళ్ళబోతుంటే.. వద్దని వారించాడు చపతిరావ్‌.

‘‘సరేనండి.. పెళ్ళి మండపం అడ్రస్‌ చెబితే నేరుగా అక్కడికే వచ్చేస్తాం’’ ఆనందంగా సుందర్రావుకి షేక్‌హ్యాండిచ్చి ‘‘వస్తామండి’’ అని బయుదేరాడు కళాధరం. పక్కంట్లో నుంచో, ఎదురింట్లో నుంచో ఫోన్‌లోనో, టీవీలోనో పాట ‘తుమ్మెదా తుమ్మెదా తొందరపడకు తమ్మెదా ముందుంది ముసళ్ళ పండగ..’అని. తథాస్తు దేవతలు అప్పుడే ఈవినింగ్‌ వాక్‌లో భాగంగా సుందర్రావు ఇంటి మీదుగా పోతున్నారు. ‘తథాస్తు’ అని అన్నారేమో పాట సౌండ్‌లోఅది ఎవరికీ వినిపించలేదు. ఆ దేవతలూ ఎవరికీ కనిపించలేదు.

పెళ్ళికొడుకుగా పీటపై కూర్చున్న కళాధరం చేత పురోహితుడు పెళ్ళి తంతుని నిర్వహిస్తూ మధ్యలో ‘‘పెళ్ళికూతురుని తీసుకురండి..’’అన్నాడు. అమ్మలక్కలు పెళ్ళి కూతురిని తీసుకురావడానికి వెళ్ళారు.అమ్మలక్కలూ రాలేదు. పెళ్ళి కూతురూ రాలేదు.
పురోహితుడు ‘‘పెళ్ళి కూతురు.. పెళ్ళి కూతురు..’’ అని గట్టిగా అరిచాడు

పెళ్ళికూతురిని ఎవరూ తీసుకురవడం లేదు. పెళ్ళికూతురు వున్న రూము నుంచి అమ్మలక్కలు పందిట్లో వున్న బంధువుల్ని ఆహ్వానిస్తున్న సుందర్రావ్‌ దగ్గరికి అమ్మలక్కలు హడావిడిగా పరిగెత్తున్నారు.

‘‘పెళ్ళి కూతురు.. పెళ్ళి కూతురు.. ముహూర్తం దాటిపోతూ వుంది. త్వరగా.. త్వరగా..’’ అంటూ పురోహితుడు కేకలేస్తున్నాడు. ఒక్కసారిగా పెళ్ళి మండపంలో గుసగుసలు .. నవ్వు.. కోలాహలం మొదలైంది. పెళ్ళికొడుకు నవ్వు వినిపిస్తున్న వైపు చూశాడు. ఎందుకు నవ్వుతున్నారో అర్థంకాక వాళ్ళు చూస్తున్న వైపు చూశాడు.

పెళ్ళి కూతురుని ఇద్దరు ఆడవాళ్ళు చేతుల మీద ఎత్తుకొస్తున్నారు. పెళ్ళికూతురికి ఎదురుగా ఆమెకు కనబడేటట్టు టీవీని వైరుతో సహా తీసుకొస్తున్నారు. కళాధరానికి ఇది కలా? నిజమా? అర్థంకాక టెస్ట్‌ చేసుకోవడం కోసం పురోహితుడి తొడ మీద గిల్లాడు. గిల్లిన నొప్పికి పురోహితుడు, పెళ్ళికూతురు అనపోయి

‘‘పెళ్ళి కో..’’ అని గావుకేక పెట్టాడు పెళ్ళి కూతురని అనబోయి.

మండపం ఇప్పుడు ఓ కామెడీ సినిమా ఆడుతున్న థియేటర్లా వుంది. పెళ్ళి కొడుక్కి మైండ్‌ బ్లాంకయిపోయింది.

పెళ్ళి కూతురిని పీటపై కూర్చోపెట్టారు. టీవీని పెళ్ళికూతురికి ఎదురుగా టేబుల్‌ మీద సెట్‌ చేశారు. పెళ్ళికూతురు తదేకంగా టీవీ సీరియల్‌ చూస్తూవుంది. పెళ్ళికొడుకు ఆశ్చర్యంగా పెళ్ళికూతురుని చూస్తున్నాడు.

పెళ్ళి చూపు రోజు గుర్తుకొచ్చింది పెళ్ళి కొడుక్కి. ఆ రోజు సిగ్గుతో అద్దానికి లంబకోణంలో కాకుండా వాలు కోణంలో తదేకంగా చూస్తుంటే సిగ్గో.. బిడియమో.. భయమో.. అనుకోవడం. కాదు. ఆ రోజు కూడా టీవీ సీరియలే చూస్తుందన్న మాట. మాకు టివీ సౌండ్‌ వినిపించకుండా టీవీకి తనకి ఇయర్‌ ఫోన్స్‌ కనెక్ట్‌ చేశారన్న మాట. ఓరి దేవుడా ఎంత అన్యాయం చేశావురా.

‘‘ఇక పెళ్ళికొడుక్కి సీ....రియల్‌ కష్టాలే’’

‘‘సీరియల్‌ కష్టాలా..??’’

‘‘ఆ.. సినిమా కష్టాలైతే రెండు గంటసేపు.. మహా అయితే మూడు గంటు. అదే సీరియల్‌ కష్టాలైతే రెండు సంవత్సరాు కాదు కదా ఇరవై సంవత్సరలైనా కొనసా...గు....తూ...నే వుంటాయి కదా’’

‘‘పాపం పెళ్ళికొడుకు.. ఏ జన్మలో పాపం చేసుకున్నాడో..’’ వాయిస్‌ ఓవర్‌లో గొంతు.

పురోహితుడు మంగళసూత్రాన్ని పెళ్ళికొడుకు చేతికందిస్తూ ‘‘మంగళ సూత్ర్రాన్ని టీవీ మెడలో కట్టు నయనా.. సారీ...సారీ అమ్మాయి మెడలో కట్టు నాయనా... గట్టిమేళం... గట్టిమేళం...’’ అని గట్టిగా అరిచాడు.

పెళ్ళికొడుకు తాళి కడుతున్నప్పుడు అతని చేతులు అడ్డొచ్చి పెళ్ళికూతురికి టీవీ కనిపించకపోయేసరికి ఆమె పెళ్ళికొడుకుని పక్కకు నెట్టేసింది. పెళ్ళికొడుకు కింద పడిపోయాడు. పెళ్ళికొడుకు లేచి మళ్ళీ తాళి కట్టబోతుంటే పురోహితుడు,

‘‘నాయనా నీ స్థానం ఇక వెనకే. వెనక నుంచి మంగళధారణ కానీయ్‌.. ముహూర్తం దాటిపోతూ వుంది’’ అన్నాడు.
పెళ్ళికొడుకు పెళ్ళి కూతురి వెనుక నిబడి తాళి కడుతుండగా ఫోటోగ్రాఫర్‌ ‘‘స్మైల్‌ ప్లీజ్‌’’ అన్నాడు.

కళాధరం చేతిలో వున్న ఫోటోను చూస్తూ అదేరా... ఈ కళాఖండం... కాదు కళా ఖండం వెనుక, ముందు వున్న చరిత్ర’’ కళావతిని చూశాడు. ఆమె తదేకంగా టీవీ చూస్తూనే వుంది. కళాధరంలో పెద్ద నిట్టూర్పు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న