సమన్విత గది లోనికి దొంగతనంగా ప్రవేశించాడు కుమార్. సుత్తీ, హాక్సా బ్లేడ్, స్క్రూ డ్రైవర్ తీసుకొనే వచ్చాడు. సమన్విత పనికి వెళ్లే తొందరలో పెరటి వైపు తలుపుకు గడియ పెట్టడం మరచిపోవడంతో సులభంగా ప్రవేశించాడు. కుమార్ ఎటువంటి శ్రమ లేకుండా లోనికి ప్రవేశించాడు. తన సెల్ ఫోన్ నందున్న టార్చ్ లైట్ ఆన్ చేసి మెల్లగా ఒక గది లోనికి వెళ్ళాడు. అది సమన్విత గది అని ఊహించాడు. అక్కడ టేబుల్ మీదున్న సమన్విత ఫోటో చూసాడు. చాల అందంగా ఉంది .
'సమన్వితా ఈ రోజు మీ తల్లి తండ్రులు ఊరికి వెళ్లడం చూసాను.ఈ రోజు నా పగ తీరబోతుంది.బలవంతంగా నిన్ను......హూ....నా పగ తీర్చుకొంటాను.' కోపంగా అనుకొన్నాడు.
హద్దులు మీరితే విపరీత పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుంది.వద్దు వెనక్కు తిరిగి వచ్చిన దారినే వెళ్ళిపో అని మనసు ఒక ప్రక్క హెచ్చరిస్తున్నామరో ప్రక్క పగతో రగులుతున్న అతని మనసు విస్మరించింది.
సమన్విత తలుపులు తీసిన శబ్దం వినగానే తలుపుల వెనుక దాక్కొని తలుపు సందులోంచి గమనించసాగాడు. సమన్విత హాలులోనే తలుపుల దగ్గర నిలబడి సెల్ ఫోన్ నందు ఎవరితోనో మాట్లాడటం గమనించాడు.హాలు తలుపులు గడియ పెట్టి ఈ గదికి వచ్చిందంటే ....పగ తీర్చుకోవాలి అనుకొన్నాడు.
"అమ్మా ఇప్పుడే ఇంటికి వచ్చి తలుపులు తెరచి హాలులోకి ప్రవేశిస్తున్నాను నీవు ఫోన్ చేసావు."అంది సమన్విత.
“సమన్వితా,వెళ్ళేటప్పుడు అన్ని తలుపులూ జాగ్రత్తగా మూసి వెళ్ళావా.పనికి పోయే తొందరలో...."
"అమ్మా,నేను ఉదయం నీవన్నట్లు మరచిపోయి తలుపులు మూయకుండా వెళ్ళాననుకో....కానీ ప్రస్తుతం ఇంటి లోనికి ఏ దొంగా రాలేదు.ఇంటికి వచ్చానని తెలిసీ ఇలా అడిగితే ఎలాగమ్మా…. కాస్సేపు తరువాత ఫోన్ చేసి ఎన్ని ప్రశ్నలైనా అడుగమ్మా." నవ్వుతూ అంటూ ఫోన్ కట్ చేసింది .
వీధి తలుపు గడియపెట్టి తిరుగుతున్న సమయాన కాలింగ్ బెల్ శబ్దం వినగానే మొదట కుమార్ ఉలిక్కి పడ్డాడు.
ఎవరా అనుకొంటూ అనుమానంగా తలుపులు తీసిన సమన్విత ఆశ్చర్యపోయింది. అతను సమన్వితకు కాబోయే భర్త.
“మీరు ...మీరు...." ఆ తరువాత మాట్లాడలేకపోయింది.
“నేను ఈ ఊరికి ఆఫీస్ పనిమీద వచ్చాను.పనిపూర్తిగా కాగానే మీ ఇంటికి వెళ్లి రమ్మని మా అమ్మ ఒకటే గోల "
"మా అమ్మా నాన్నలు మన పెండ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్లారు.రేపు వస్తారు.
“ ఒక్క నిమిషం ఉండండి పక్కింటి ఆంటీని పిలుచుకొని వస్తాను."తడబడుతూ అంది.
"సమన్వితా నీ భయం నాకు అర్థమయింది . అత్తయ్య మామయ్యా లేరని ముందుగా తెలిసింటే నేను వచ్చేవాడిని కాదు. కాబోయే భర్త అయినా ఎక్కడ హద్దులు మీరుతానోనన్న భయంతో బయట నిలబెట్టి మాట్లాడటం ....ఆంటీ ని పిలుచుకొస్తాననడం....మనం కాబోయే భార్యా భర్తలం అయినా నీకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించను. స్నేహితుల్లా మాట్లాడుకొందాము. మరికొద్ది సేపట్లో నేను ట్రైన్ కు బయలుదేరాలి"అన్నాడు.
ఆ మాటలు సమన్విత నందు తృప్తి కలిగించి "క్షమించండి ....లోపలకు పిలవడానికి సందేహించాను. ఇప్పుడు రండి." లోపలున్న సోఫా పై కోర్చొనగానే."మీరు కాఫీ... టీ.... పాలు ....ఏం కావాలి ఒక్క క్షణంలో...."అంది.
"ఇంతకు ముందే కడుపు నిండా భోజనం చేసాను కాస్సేపు మాట్లాడుకొని వెళ్తాను…. అటు కూర్చో " అని చెప్పగానే ఎదురుగా నున్న కుర్చీలో కూర్చొంది సమన్విత.
అతను తన జీవితంలో జరిగిన ఎన్నో ముఖ్యమైన సంఘటనలు చెబుతుంటే వినసాగింది.
“నేను కాలేజీ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి నాకు ప్రేమలేఖ రాసింది.ఆ అమ్మాయిని పిలిచి ‘మా అమ్మ నాన్నల ఇష్టప్రకారమే నేను పెళ్లి చేసుకొంటాను.ఇలాంటి వాటికి వారు అంగీకరించరు’ అని చెప్పాను.ఆ తరువాత ఆ అమ్మాయి మనం స్నేహితుల ఉందాము అంది .ఎప్పుడైనా కనపడితే హాయ్ అనడం తప్ప ఆ తరువాత మాటలాడుకొనడానికి అవకాశం కల్పించలేదు.”
అతను చెప్పడం ముగించగానే "నన్ను కూడా కుమార్ అనే ఒక స్టూడెంట్ ప్రేమించానంటూ ఉత్తరం వ్రాసాడు.నేనూ అతనిని పిలిచి మీరు చెప్పినట్లే సమాధానం చెప్పాను.అయినా ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు.నాకేమి చెయ్యాలో అర్థం కాలేదు.సమస్య రోజు రోజుకు పెద్దది కాసాగింది.కుమార్ మరలా నా వెనుకనే అనుసరించడం జరుగసాగింది."తన గురించి సమన్విత చెప్పడంతో కుమార్ తలుపు సందులోంచి చూస్తూ ఆసక్తిగా వినసాగాడు.
"చాల కష్టమైన సమస్యే.....ఆ కుమార్ నీ మాటలను అర్థం చేసికొనివుంటే సులభంగా పరిష్కారమయ్యేది.ఇంతకూ ఎలా పరిష్కరించావు."అడిగాడు
“మానాన్నకు చెబుతామనుకొంటే హార్ట్ పేషెంట్ ...ప్రిన్సిపాల్ కు చెబుతామనుకొంటే ఆయన చాలా కఠినమైన వ్యక్తి ...ఇలాంటి విషయాల్లో దయా దాక్షిణ్యం లేకుండా సస్పెండ్ చేస్తాడు .పదిహేను రోజులు నిదురలేక నరకాన్ని అనుభవించాను."
“సమన్వితా నీలో రచయితా లక్షణాలు చాలా ఉంది సస్పెన్సుతో ముంచుతున్నావు....ఆ తరువాత"
“ఒక రోజు కుమార్ ను ఎవరో కిరాయి రౌడీలు బాగా కొట్టేశారంట ఆసుపత్రిలో గాయాలతో అడ్మిట్ అయినా సంగతి తెలిసింది.కొన్ని రోజుల తరువాత కాలేజీ కి వచ్చి నన్ను కలుసుకొని ‘ కిరాయి మనుషులచేత కొట్టిస్తావా ...నిన్ను అంత సామాన్యంగా వదలను నేనంటూ మామూలు మనిషిగా మారాలంటే .... అది నీ మీద పగ తీర్చుకొన్నాకే...’అంటూ నా సమాధానము వినిపించుకోకుండా వెళ్ళాడు. కుమార్ కనపడితే నేను ఎవరికీ నీ మీద ఫిర్యాదు చెయ్యలేదు అని చెబుతామనుకొంటే నేను చెప్పడానికి అవకాశమే ఇవ్వలేదు....అప్పటి నుండి నేను జాగ్రత్తగానే కొంతకాలం నడుచుకొన్నాడు.ఇప్పుడు అతను కనపడటం లేదు."
“మరి ఆ కుమార్ ను కొట్టింది....."
"మా కాలేజీ నందు మరో వన్ సైడ్ ప్రేమ వ్యవహారం ... వాడి పేరు కుమార్ ...ఆ అమ్మాయి వాళ్ళ తల్లితండ్రులతో చెబితే కిరాయి రౌడీలను ఏర్పాటు చేసారంట .ఆ రౌడీలు పొరపాటున ఈ కుమార్ ను కొట్టారంట.ఈ విషయం నేను ఉద్యోగంలో చేరినాకే తెలిసింది..ఇప్పటికీ నాకు కుమార్ మీద ఎటువంటి ద్వేషమూ లేదు. కుమార్ డిగ్రీ పూర్తి చెయ్యలేదు . ఆ సంఘటన జరగడానికి ముందు కుమార్ ఒక మంచి బ్రిలియంట్ స్టూడెంట్. నిజానిజాలు తెలీక కుమార్ నా మీద పగపట్టడం .... కానీ నా మీద ఎటువంటి తప్పులేదని అతనితో చెప్పాలనుకొంటే ప్చ్ ...అతను నాకు అవకాశమే ఇవ్వలేదు.ఈ మధ్య కాలంలో చూసి చాల కాలమయ్యింది ఈ సంఘటన తలచుకొన్నప్పుడంతా నా మనసు ...."అంటూ భోరుమని విలపించసాగింది.
మరి కొన్ని క్షణాలలో కళ్ళు తుడుచుకొని "ఇంత వరకు నా మనసులోని బాధను ఎవరితో చెప్పలేదు మీ తోనే...."అంది. “సమన్వితా....వచ్చినప్పటినుండి మీ ఇల్లు చూపించలేదు.ఒక్క సారి నీ గది చూడాలని వుంది ...నీ విక్కడే ఉండు నేను ఒకసారి చూసొస్తాను" అన్నఅతని మాటలు వినగానే కుమార్ నందు వణుకు భయం కలిగింది.
“ప్లీజ్….. ప్లీజ్….. దయచేసి వేళ్ళ వద్దండి ఇంతవరకూ నామీద మంచి అభిప్రాయం కలిగిఉంటుంది. ఆ గదికి వెళ్లారంటే నా మీదున్న అభిప్రాయం పూర్తిగా పోతుంది.పొద్దున్న ఆఫీస్ కు వెళ్లే తొందరలో ఆ గది అంతా చిందర వందరగా ....ప్లీజ్..."అంటూ బుంగ మూతితో వేడుకొన సాగింది.
"సమన్వితా అసలైన అందం ఇప్పుడు చూస్తున్నాను. బుంగమూతిలో చాలా అందంగా ఉన్నావు...ఇక నాకు సమయం అవుతోంది నేను బయలుదేరుతాను....."అన్నాడు.
కాబోయే భర్తను సాగనంపడానికి తలుపులు గడియపెట్టుకొని వీధి వరకు వెళ్ళగానే,సమన్విత మీద అనవసరంగా పగ పెంచుకొని పొరపాటు పడ్డాను అని అనుకుంటూ సమన్వితకు మనసులో క్షమాపణలు చెప్పుకొని వచ్చిన దారిన వైపు కుమార్ వెనుతిరిగి వెళ్ళాడు.