లాప్ టాప్ ముందు కూర్చుని ఫేస్ బుక్ లో పోస్టింగ్స్ ని , చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తూ/వింటూ ఉన్న రాఘవ కి తల్లి జానకమ్మ వంట ఇంట్లోంచి పిలుస్తున్నా వినపడలేదు.
కాసేపు తరవాత ఆవిడ అక్కడ నుంచి వచ్చి గట్టిగా పిలిస్తే, ఇయర్ ఫోన్స్ తీసి " ఏమిటి?" అన్నాడు తల్లి కేసి చూసి
"ఇంటర్వ్యూ ఇంకా పది రోజులే ఉంది కదా? ఈ లోపులో తిరుపతి వెళ్లి స్వామి దర్శనం చేసుకు రమ్మన్నాను కదురా? బస్సో, ట్రైనో బుక్ చూసుకున్నావా?" అంది జానకమ్మ గారు అతనికి దగ్గరగా వచ్చి
" ఏమిటమ్మా నీ పిచ్చి. తిరుపతి వెళ్లి, స్వామిని మొక్కేస్తే ఉద్యోగం వచ్చేస్తుందా? నీ పిచ్చి గాని" అన్నాడు కొంచం విసుపుగా
కొద్ది సంవత్సరాల క్రితం తన తండ్రికి అనుకోకుండా లివర్ వ్యాధి ఏదో వచ్చి కొద్దీ రోజుల లోనే సీరియస్ అయింది. ఆ సమయం లో అమ్మ ఎన్ని మొక్కులు మొక్కిందో, ఎంత మంది దేవుళ్ళని ప్రార్థించిందో అతనికి బాగా గుర్తు. ఏ దేవుళ్ళూ తన తండ్రిని బ్రతికించ లేకపోయారు. అతనికి ఆశ్చర్యం ఏమిటంటే, తండ్రి అనారోగ్యం సమయం లో అమ్మ మొక్కుకున్న వెంకటేశ్వర స్వామీ కళ్యాణం లాంటివి, మిగతావి ఆ తరువాత అన్నీ ఆవిడ నెరవేర్చడం.
అదంతా గుర్తుకు వచ్చి, ఆ విషయం ప్రత్యక్షంగా అనకుండా " " ఏమో అడిగిన వెంఠనే అన్నీ అందరికీ దేవుడు ఇచ్చేస్తాడన్న నమ్మకం కలగటం లేదు. సరే వెడతాలే" అన్నాడు
" రోజూ లక్షల మంది ఎన్నో కష్టాల కోర్చి స్వామిని దర్శించు కుంటున్నారంటే, వాళ్లంతా వెర్రి వాళ్ళటరా ?
గతం కంటే ఇప్పుడు ఆమెకి తన క్షేమమే ముఖ్యమని తెలుస్తోంది. అందుకే "అలాగే" అని "ఐ ఆర్ సి టి సి" వెబ్ సైట్ కి వెళ్లి టికెట్ బుక్ చేసుకున్నాడు.
రాఘవ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అనేక వందల ఇంజనీరింగ్ కాలేజీలలో ఒకటయిన ఒకానొక కాలేజీలో బిటెక్ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. అంత పేరు ప్రఖ్యాతులున్న కాలేజీ కాదు కాబట్టి క్యాంపస్ సెలక్షన్ కి వాళ్ళ కాలేజీకి ఏ కంపెనీ వాళ్ళు రాలేదు . డిగ్రీ చేతికి వచ్చినప్పటి నుంచీ చాలా కంపెనీలకి అప్లికేషన్లు పెడుతూనే ఉన్నాడు. కొందరు అసలు పట్టించుకోకపోతే, కొందరు మాత్రం రిగ్రెట్ లెటర్స్ పంపి ఊరుకున్నారు తప్ప, ఎవరూ పిలవలేదు. ఆఖరికి అనుకోకుండా ఒక కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ కి రమ్మన్నారు.
రిజర్వు చేసుకున్న రోజున బయలుదేరి తిరుపతి చేరుకున్నాడు రాఘవ. సాధారణ క్యూ పద్దెనిమిది గంటలు పడుతుందని తెలిసి మూడు వందలు కట్టి ప్రత్యేక దర్శనం క్యూ లో నుంచున్నాడు. క్యూ లో ఉన్నంత సేపూ అతని ఆలోచనలు పరి పరి విధాల పోయాయి. స్వామిని దర్శించి నమస్కరించి వచ్చేయడమా? మనసులో కోరిక తీర్చమని ప్రార్థించాలా వద్దా?. ఇంటర్వ్యూ కి వచ్చే మిగతా అభ్యర్థులు కూడా ఆయన్ని ప్రార్థించి ఉండవచ్చు కదా? ఆయన్ని ప్రార్థిస్తేనే కోరిక తీరుస్తాడా? లేక పోతే తీర్చడా? వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్లో ఉన్న స్వామీ, ఇక్కడ ఉన్న స్వామీ వేరా ? ఇక్కడికే వెళ్ళమని అమ్మ ఎందుకు వత్తిడి చేసింది?. అసలు ఈయన ఎక్కడ ఉంటాడు. వైకుంఠం లో ఉంటే అది ఎక్కడ, ఎలా ఉంటుంది ? ఒక వేళ అక్కడికి వెళ్లగలిగితే ఎవడయినా ఎన్నిగంటలు ఆయన ఎదురుగా కూర్చోగలుగుతాడు? తన ఆలోచనలకి అతనికే నవ్వు వచ్చింది. "ఇలాంటి ఆలోచనలు నాకే వస్తాయా మిగతా వాళ్లకి కూడా వస్తాయా ?" అనుకున్నాడు
క్యూ లో ఉండి ఉండి " "ఏడుకొండలవాడా గోవిందా గోవిందా" అని ఎవడో గట్టిగా అనగానే మిగతా వాళ్లంతా అంత వరకూ మామూలుగా ఉన్న నవాళ్లు కూడా గొంతు కలిపి " గోవిందా గోవిందా" అనడం ఆశ్చర్యమేసింది .
క్యూ లో ముఖ ద్వారం ప్రవేశించగానే స్వామి విగ్రహం కనపడటం ప్రారంభించినప్పటి నుంచీ, అందరూ ఒక రకమయిన భావోద్రేకం పొందడం అతను గమనించాడు. తాను కూడా వేరే ఆలోచనలు లేకండా స్వామీకి నమస్కరిస్తూ ముందుకు నడిచాడు. స్వామీ ముందుకు రాగానే కొద్దీ క్షణాలు విగ్రహం చూస్తూ ఉండిపోయాడు. తల్లి గుర్తుకు వచ్చింది. ఆమె ఆనందంగా ఉండాలని మనసులో కోరుకుని వచ్చేశాడు. బయటికి వచ్చిన తరువాత తాను స్వామిని ఉద్యోగం గురించి కొరకపోవడం అతనికి ఆశ్చర్య మేసింది. తల్లికి అబద్ధం చెప్పడం ఇష్టం లేక అక్కడి నుంచే స్వామి వైపు తిరిగి ప్రార్థించాడు.
ఇంటర్వ్యూ రోజున తల్లి ఇచ్చిన దేవుడి అక్షింతలు వేసుకుని ప్రసాదం తిని హైటెక్ సిటీ లో కంపెనీ చేరేటప్పటికి, అప్పటికే కాండిడేట్స్ కొంత మంది చేరుకున్నారు. పది మంది ఉంటారు. కారుణ్య ఒక్కడే తనకి తెలిసిన క్లాస్ మేట్ కనిపించాడు. తనకి పిలుపు వచ్చే దాకా అతనితో కబుర్ల లో పడ్డాడు.
ఇంటర్వ్యూ లో చాలా ప్రశ్నలు వేశారు, కుటుంబ పరిస్థితి, ఎక్కడ చదివాడు, మొదలయినవన్నీ. తరువాత కమిటీ లో ఉన్న ముగ్గురిలో ఇద్దరు సబ్జెక్ట్ మీద ప్రశ్నలు వేశారు. పది ప్రశ్నలు అడిగితే రెండింటికే అతను చెప్పగలిగాడు. ఆఖరున మూడో అతను 'ర్యాన్సమ్ వేర్' పేరు విన్నావా? అన్నాడు . రాఘవ ఆ పేరు ఎప్పుడూ వినలేదు. ఉద్యోగం ఇస్తే, అతనికి ట్రైనింగ్ చాలా ఇవ్వవలిసి ఉంటుందనీ, మూడు సంవత్సరాలు వాళ్ళ దగ్గరే పని చేస్తానని బాన్డ్ ఇవ్వాలని అంటే " సరే అన్నాడు" రాఘవ.
ఏ సంగతీ వారం లోపులో మెయిల్ పంపుతామన్నారు. బయటికి వచ్చి, కారుణ్య ఇంటర్వ్యూ కూడా అయ్యేదాకా కూర్చున్నాడు. ఇంచుమించు అతని ఇంటర్వ్యూ కూడా తన దాని లాగానే జరిగిందని తెలుసుకుని వచ్చేశాడు.
మళ్ళీ రొటీన్ లో పడ్డాడు రాఘవ. కాసేపు ఫేస్ బుక్, కాసేపు టీవీ, కాసేపు యూట్యూబ్ వీటితో పగలంతా కాలక్షేపం. వాళ్ళ నాన్నగారు కట్టించిన ఇంట్లోనే గత పది సంవత్సరాలూ ఉంటున్నారు కాబట్టి చుట్టు పక్కల చాలా స్నేహితులు ఉన్నారు . సాయంత్రం పార్క్ లో వాళ్ళతో కాలక్షేపం. పగలయినా, రాత్రయినా తోచనప్పుడు బాల్కనీ లో కూర్చుని రోడ్డు మీద జనాన్ని గమనించడం అతనికి ఒక హాబీ. వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న స్థలంలో ఎవరో బిల్డర్ పెద్ద అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ కట్టాడు. ఈ మధ్యనే పూర్తి అయి ఒకళ్ళో ఇద్దరో చేరారు. ఆ కాంప్లెక్స్ లో కొత్తగా ఒకాయన ప్రొద్దుటే బెంజ్ కారులో వెళ్లడం, సాయంత్రం రావడం చూశాడు అతను. ఎవరో పెద్ద ఆఫీసర్ కొత్తగా వచ్చి చేరాడు అనుకున్నాడు రాఘవ.
వారం పూర్తి అవకుండానే అతన్ని ఇంటర్వ్యూ చేసిన కంపెనీ చాలా మర్యాద పూర్వకంగా రిగ్రెట్ లెటర్ పంపించారు. అతను బాగానే చేశాడనీ, కానీ అతనికి సరిగ్గా సరిపోయే స్లాట్ తమ దగ్గర ప్రస్తుతం లేదనీ, అటువంటి అవకాశం వచ్చినప్పుడు తెలియ చేస్తామనీ చెప్పారు. అతనికి చాలా నిరాశ కలిగింది. వందల కొద్దీ అప్లికేషన్లు పంపితే, ఎవడో ఒకడు పిలిచి, వాడు కూడా ఇలా నీరు కారిస్తే, అంతా నిరాశ గా ఉంది అతనికి. కారుణ్యకి కూడా అలాంటి మెయిలే వచ్చిందని చెప్పాడు.
వెంఠనే కాక పోయినా తల్లి తరుచు అడుగుతుంటే చెప్పక తప్ప లేదు. ఏడుకొండల వాడికి మన ప్రార్థన సరిపోలేదమ్మా నాకు ఇవ్వలేమని మెయిల్ పంపారు అని చెప్పాడు . తన కంటే తల్లి ఎక్కువ నిరుత్సాహ పడుతుందని భయ పడ్డాడు. నిరాశ పడిందో లేదో అతనికి తెలియ లేదు కానీ, పైకి మాత్రం ఆవిడ " అలా మాట్లాడకురా, భగవంతుడు ఏది ఎలా చేస్తాడో ఊహించడం మనకి చాలా కష్టం.
మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించు" అంది ఆవిడ కొడుక్కి ధైర్యం చెబుతూ. రాఘవ మళ్ళీ అదే పనిలో పడ్డాడు.మామూలుగా బాల్కనీ లో కూర్చుని ఆ రోజు కూడా బయటికి చూస్తున్నాడు రాఘవ. ఎదురుగా కట్టిన కొత్త కాంప్లెక్ లోంచి ఒకావిడ బయటికి వచ్చి రాఘవ వాళ్ళ ఇంటి కాంపౌండ్ లోకి రావడం చూశాడు. కింద తలుపు తీసి ఉందో లేదా అని కిందకి దిగి మెయిన్ గుమ్మం దగ్గరికి అతను రాగానే, కాలింగ్ బెల్ మోగడం, అతను తలుపు తీయడం ఒకే మాటు జరిగాయి. వచ్చినావిడ " మేము ఎదురుగా కొత్తగా వచ్చాము. ఆంటీ లేరా బాబూ " అంది. ఆవిడ నవ్వుతూ " ఉంది కూర్చోండి పిలుస్తాను" అని అతను తల్లి బెడ్ రూమ్ వైపు వెడుతోంటే " ఎవరు రా ?" అంటూ ఆవిడే వచ్చింది బయటికి వాళ్లిద్దరూ మాట్లాడుకోవడానికి కూర్చోగానే అతను తన కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లి పోయాడు.
ఆవిడ చాలా సేపు కూర్చుని వెళ్లిన తరువాత, వేళ అయితే, జానకమ్మ గారు కొడుకుని భోజనానికి పిలిచింది. " కొత్తగా వచ్చినట్టున్నారు కాంప్లెక్స్ లోకి. మనింటికి ఎందుకు వచ్చింది ఆవిడ అని అడిగాడు రాఘవ తల్లిని .
కొడుక్కు వడ్డిస్తూ చెప్పింది. " ఆవిడ పేరు రజని. అవును వాళ్ళు కొత్తగా వచ్చారు. పాల గురించీ,పనిమనిషి గురించీ అడగడానికి వచ్చింది .ఆవిడ భర్త వరుణ్ కుమార్ ఏదో పెద్ద కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తున్నాడట. మొన్నటి దాకా అమెరికా లో ఉండి వచ్చారట. నీ సంగతి చెబితే. రేపు శనివారం ఆయన ఖాళీ గా ఉంటాడట, నిన్ను వచ్చి కలవమంది. పోయిందేముంది ? తప్పకుండా వెళ్లికలువు" అంది ఆవిడ.
రాఘవ కంటే ఆవిడే ఎక్కువ ఆత్రుతగ ఉందేమో, శనివారం ప్రొద్దుటే రాఘవని లేపి కాఫీ టిఫిన్లు అయిన తరువాత, వాళ్ళ ఫ్లాట్ నెంబర్ చెప్పి వరుణ్ కుమార్ దగ్గరికి పంపింది జానకమ్మ గారు.
బెల్లు కొట్టగానే రజని వచ్చి తలుపు తీసింది. వరుణ్ కుమార్ గారు కంప్యూటర్ ముందు కూర్చుని, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ, రాఘవకి చెయ్యి ఊపి కూర్చోమని సైగ చేశారు.
రాఘవ సోఫాలో కూర్చుని ఇల్లంతా ఓమాటు చూశాడు. చాలా పెద్ద ఫ్లాట్ లా ఉంది. అద్దె చాలా ఎక్కువ ఉండవచ్చు అనుకున్నాడు. ఇల్లంతా అన్నీ ఖరీదయిన సామానుతో నిండి ఉంది
" హాయ్ రాఘవ, ఆంటీ చెప్పింది నీ గురించి. మీ అమ్మగారు చెప్పారనీ, బి టెక్ చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావట కదా? ఎలా ఉన్నాయి ప్రయత్నాలు ? అన్నాడు నవ్వుతూ
'ఆయన మాట్లాడడం లో ఒక రకమయిన ఆప్యాయత కనిపించింది రాఘవకి. తాను చేస్తున్న ప్రయత్నాలు, ఈ మధ్యనే జరిగిన ఇంటర్వ్యూ గురించీ అన్నీ చెప్పాడు
" ఇంటర్వ్యూ లో ఏమేమి అడిగారని అడిగితే అన్నీ చెప్పి, 'ర్యాన్సమ్ వేర్ గురించి కూడా అడిగినట్టు, తనకి తెలియదని చెప్పాననీ అన్నీ చెప్పాడు
రాఘవ చదివిన కాలేజ్ గురించీ, చదివిన సబ్జెక్ట్ ల గురించీ, ఫ్యాకల్టీ గురించీ చాలా విషయాలు అడిగాడు వరుణ్ కుమార్. ఎప్పుడు పాసయిందీ, పాసయిన తరువాత ఏమన్నా కోర్సులు చేశావా అని కూడా అడిగాడు
అన్నిటికీ, రాఘవ చెప్పిన జవాబులు ఓపికగా విని " ఇప్పుడు నాకు నీ ప్రాబ్లెమ్ అర్థమయ్యిందయ్యా. నువ్వు ఒక ప్రయివేట్ కాలేజ్ లో చదివావు. అది ప్రముఖ మయిన కాలేజ్ కాదు. ప్రతి కంపెనీ నువ్వు ఎక్కడ చదివావన్న దానికి ప్రాముఖ్యం ఇస్తారు. ఎందుకో తెలుసా? చిన్న కాలేజీలు ఎటువంటి ఫ్యాకల్టీ ని పెట్టుకుంటారు? వాళ్ళు తమ కాలేజీలని ఇండస్ట్రీ కి లింక్ చేయరు. పెద్ద జీతాలు ఇచ్చుకోలేరు కాబట్టి మంచి ఫ్యాకల్టీ పెట్టలేరు. వాళ్ళు చెప్పేవి చదివి మీరు ఉద్యోగాలకి వచ్చేటప్పటికి, మీ చదువు ఇప్పుడు ఇండస్ట్రీ కి కావలసిన వాటికి సరిపోదు. మిగతా ఇండస్ట్రీల లాగ కాకుండా, కంప్యూటర్లలో రోజు రోజు కీ మార్పులు వచ్చేస్తున్నాయి. వాటికి సరితూగుతూ మన స్కిల్స్ ని అప్ డేట్ చేసుకోక పోతే ఉద్యోగాలు రావు. ఎప్పుడో చదువుకున్నచాలీ చాలని చదువుతో ఎక్కడా ఉద్యోగం రాలేదని విచారిస్తే సుఖ మేమిటి?. నేను నిన్ను బ్లేమ్ చేస్తున్నానని అనుకోకు. ముందు నీకు సమస్య ఏమిటో వివరిస్తున్నాను" అన్నాడు
" మీరు చెప్పింది నిజమే నండి, మా ఫ్యాకల్టీ చెప్పింది సరిపోక, పరీక్షల సమయం లో మంచి కాలేజీ లలో చదివే స్నేహితుల హెల్ప్ తీసుకోవలిసి వచ్చేది" అన్నాడు అయన చెప్పినది అంగీకరిస్తూ.
" ఇప్పుడు ఉద్యోగం అత్యంత అవసరమా ? నాఉద్దేశ్యం, మీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. అది అడుగుతున్నాను " అడిగాడు వరుణ్
"అంత అర్జెంటు లేదండి. అమ్మకి పెన్షన్, అది కాకుండా కొద్దిగా భూముల మీద ఆదాయం వస్తుందండి. వెంఠనే కాకపోయినా ఉద్యోగం చేయాలండి. నాకు పెద్దగా రికమెండేషన్ చేసే వారు కూడా ఎవరూ లేరండి " కొంచం నిస్పృహతో అన్నాడు రాఘవ
" భలేవాడి వయ్యా ! ఇదేమన్నా గుమస్తా ఉద్యోగాలనుకున్నావా? రికమెండేషన్ల మీద రావడానికి. సాఫ్ట్ వెర్ కంపెనీలు తమ ప్రాజెక్ట్ ఏదయినా సరయిన టైం లో పూర్తి చేయడానికి కావలసిన స్కిల్స్ ఉన్నవాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ప్రస్తుతం ఎటువంటి స్కిల్స్ కి డిమాండ్ ఉందో తెలుసుకుని వాటిని సంపాదిస్తే పిలిచి వాళ్లే ఇస్తారు. టెక్నాలజీ ఫాస్ట్ గా మారుతున్న ఈ రోజుల్లో ఉద్యోగం ఉన్నా కూడా మారుతున్నవి నేర్చుకోక పోతే ఎవరికీ గ్యారంటీ లేదు. అయితే అన్నిటి లోనూ అందరూ స్కిల్ సంపాదించలేరు. నువ్వు ఒక దాంట్లో బాగా చేస్తే, అందులో నేను బాగా చేయలేకపోవచ్చు. అవి ఇష్టా ఇష్టాల బట్టి ఉంటాయి. అందుకని ముందు నువ్వు ఎందులో కంఫర్టబుల్ గా ఉన్నావో తెలుసుకుని, బాగా కష్ట పడితే మంచి జాబ్ సంపాదించవచ్చు"
" మీరు కూడా ఇప్పుడు కొత్తవి నేర్చుకోవాలా అండి " అడిగాడు రాఘవ అమాయకంగా
" ఆహా నిస్సందేహంగా. ఎటొచ్చీ మీరు ఇప్పుడు కష్ట పడవలసినంత పడక్కర లేదు" రజని తెచ్చిన కాఫీ అందుకుంటూ అన్నాడు వరుణ్
రాఘవని కూడా తీసుకోమని సైగ చేసి మళ్ళీ అతనే అన్నాడు " కానీ మాకు కూడా అప్డేటింగ్ తప్పదు. సెక్యూరిటీ సిస్టమ్స్ చాలా అద్వాన్సు అయ్యాయి. 'ర్యాన్సమ్ వేర్ " లాటి హెకింగ్స్ తట్టుకోవాలంటే చాలా అప్రమత్తం గా ఉండాలి. సరే నా సంగతి అటుంచు. నీ సంగతి చూద్దాము. నువ్వు ఇంటర్వ్యూ కి వెళ్లిన ఉద్యోగానికి ఎంత ఇచ్చేవాళ్ళు, ఒక వేళ వచ్చి ఉంటె?
"నెలకి ఇరవయి వేలు ఉండవచ్చునండి" ఇంటర్వ్యూ లో డిస్కషన్ అంత వరకూ రాక పోయినా మిగతా వాళ్ళ ద్వారా తెలిసింది చెప్పాడు
" నువ్వు కష్టపడి స్కిల్స్ పెంచుకుంటే మంచి జీతం కాకుండా మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఐఐటి లో చదివిన వాళ్ళ కంటే మంచి ఉద్యోగం సంపాదించవచ్చు. దానికి ప్రారంభంగా ముందు నువ్వు కొన్ని కోర్సులు సెలెక్ట్ చేసుకుని వాటిలో చేరాలి. రెండు రోజులు రోజూ రాత్రి ఎనిమిదింటికి నా దగ్గరికి రా, నువ్వు ఎందులో ఇష్టం గా ఉన్నావో మనం డిసైడ్ చేసిన తరువాత కోర్సులు సెలెక్ట్ చేద్దాము అన్నాడు"
అతని మాటలు విన్న తరువాత రాఘవకి ఉత్సాహం వచ్చింది. మరునాడు వస్తానని చెప్పి వచ్చేశాడు.
వరుణ్ రాఘవకి ఉన్న పరిజ్ఞానం పరీక్షించి. ఏ కోర్సులు చేయాలో సెలెక్ట్ చేశాడు. తాను కూడా కొన్నీ సిస్టమ్స్ నేర్పుతానన్నాడు
ఆ తరువాత మూడు నెలలు రాఘవ కి ఒక తపస్సు లాగ జరిగింది. పగలు వరుణ్ చెప్పిన కోర్సుల కి వెళ్లడం, రాత్రి వరుణ్ తో కూర్చుని అతను నేర్పినవి నేర్చుకోవడంతో అతనికి కాలం తెలియలేదు.
చిన్నప్పటినుంచీ దేనికీ అంత కష్టం ఎప్పుడూ పడలేదు. అతను అంత క్రితం ఎప్పుడూ వినని, చదవని సబీజెక్ట్స్ అతను చేరిన కోర్సులలో చెబుతూ, ఇంటిదగ్గర కూడా చేసుకు వచ్చేలా అసైన్మెంట్స్ ఇవ్వడంతో, వాటిని అర్థం చేసుకుని, కొన్ని సొంతం గా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలిసి వచ్చేది.
ఒక్కొక్కప్పుడు ఎందుకింత కష్టపడాలి, హాయిగా మొదట వెళ్లిన ఇంటర్వ్యూ వాళ్ళు ఉద్యోగం ఇచ్చి ఉంటె ఈ కష్టాలు ఉండేవికాదు కదా ? అనుకున్నాడు.
ఒకరోజు నిస్పృహతో. ఆ మూడ్ నుంచి బయటికి రావడానికి టీవీ ముందు కూర్చుని ఎదో న్యూస్ ఛానల్ చూస్తూ కూర్చున్నాడు. తల్లి కూడా వచ్చి పక్కన కూర్చుంది. ఆవిడ వచ్చిందని భక్తి ఛానల్ కి మార్చాడు, ఆవిడ చూస్తుందని.
ఎవరో పెద్దాయన్ని ఒకావిడ శ్రోతలు అడిగిన ప్రశ్నలు చదివి జవాబులు అడుగుతోంది. ఆయన చెప్పే జవాబులు చాలా ఆసక్తి గా ఉండడంతో తల్లీ కొడుకులు ఇద్దరూ వింటున్నారు
" మనుషులకి దేముడు కష్టాలు ఎందుకు పెడతాడు ? ఎవరో అడిగిన ప్రశ్న చదివింది ఆవిడ
ఆవిడ ప్రశ్న కుతూహలం రేపింది రాఘవ లో
" దీనికి చాలా జవాబులు చెప్పవచ్చు. చిన్నగా చెప్పాలంటే సుఖం తెలియాలంటే కష్టం పడవలిసిందే. కొంచం లోతుగా వెడితే ఇంకా బాగా తెలుస్తుంది. చిన్న ఉదాహరణ చెబుతాను.
గొంగళీపురుగు గూడు కట్టుకుని అందులో కొంతకాలం ఉండిపోతుంది. తగిన సమయానికి లోపల చాలా కష్టపడి ప్రయత్నం చేసి, గూడు చీల్చుకుని సీతాకోక చిలకలా బయటికి వస్తుంది. ఎవరయినా ఆ గూడుని చీల్చి సహాయం చేస్తే, సీతాకోక చిలకలా అవకపోగా అది చనిపోయే ప్రమాదం ఉంది. అది కష్టపడి ప్రయత్నం చేసి బయటికి వస్తేనే అది సీతాకోక చిలక గా బయటికి వస్తుంది." అని ఆయన వివరించాడు. అది పూర్తిగా అర్థం అవడానికి రాఘవ ఇంకో నెల ఆగవలిసి వచ్చింది
అన్ని కోర్సులూ పూర్తి అయిన తరువాత రాఘవ సీవీ ని 'లింక్డ్ ఇన్' లో 'అప్ డేట్' చేయించాడు వరుణ్. ఒక వారం లోనే ఒక ప్రముఖ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ఇంటర్వ్యూకి రమ్మన్నారు. లింక్డ్ ఇన్ లో అప్పటికే ఇతని గురించి చూశారు కాబట్టి, కొద్ది సేపే ఇంటర్వ్యూ నడిచింది. ఆరు నెలలు ప్రొబేషన్ తరువాత ఏడాదికి ఆరు లక్షలు ఇస్తా మని, ఫార్మల్ లెటర్ కోసం వైట్ చేయమన్నారు.
అదే రోజు వరుణ్ ఇంటికి వచ్చేదాకా ఆతృతగా ఎదురు చూశాడు రాఘవ. ఫోన్లో చెప్పడం కంటే అతనికి పెర్సనల్ గా చెప్పాలని అనిపించింది. వరుణ్ రావడానికి ముందే వాళ్ళ ఇంటికి వెళ్లి రజని తో కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. రజని చెప్పినదాని బట్టి . వరుణ్ మూడు లక్షలు జీతం తో ప్రారంభించి, ఇప్పుడు తొంభై లక్షలు చేరుకున్నాడట. దానికి అతను ఎప్పుడూ స్కిల్స్ ని అప్డేట్ చేసుకుంటూ, నిజాయితీ గా కష్టపడి పనిచేయడం వల్ల కంపెనీ వాళ్ళు గుర్తించి అతను ఎక్కడికీ వెళ్లకుండా వాళ్లే జీతం పెంచుతూ వచ్చారట.
వరుణ్ వచ్చిన తరువాత విషయం చెప్పాడు.రాఘవ . అతను చాలా సంతోషించి. లెటర్ రాగానే వెంఠనే ఒప్పుకున్నట్టు జవాబు ఇచ్చేయ మన్నాడు.
వారం అవకుండానే ఇంటర్వ్యూ ఇచ్చిన కంపెనీ వాళ్ళు సెలెక్ట్ అయినట్టు మెయిల్ పెట్టి, ఆర్డర్స్ పోస్టులో పంపినట్టు చెప్పారు. మెయిల్ చూడగానే పరిగెత్తుకు వెళ్లి తల్లికి చెప్పాడు.ఆవిడ సంతోషించి " ఉద్యోగంలో చేరేముందు తిరుపతి వెళ్ళిరా" అంది
" మొదటి సారి ఇంటర్వ్యూ ముందు వెళ్ళమని తోడేశావు. ఏమైంది? ఇప్పుడు చచ్చి కష్టపడి చదివి సంపాదించిన ఉద్యోగం కూడా ఆయన వల్లే వచ్చిందంటావా ? " అన్నాడు
" భగవంతుడు ఏది ఎప్పుడు చేయాలో ఆయనకీ తెలుసురా. ఆ చిన్న ఉద్యోగం అప్పుడు నీకు వచ్చేలా చేస్తే, ఇంత మంచి ఉద్యోగం నీకు వచ్చేదా? ఇదంతా నువ్వు కష్ట పడటం వల్లే వచ్చిందంటున్నావు. రజని ఆంటీ మన ఇంటికె ఎందుకు రావాలి ? వరుణ్ తో నీపరిచయం నీ ప్రయత్నం వల్లే జరిగిందా? భగవంతుడు సహాయం చేయాలంటే నీ ఎదురుగా వచ్చి వరాలిస్తాడా?ఆయన పద్దతి లో ఆయన చేస్తాడు" అంది ఆవిడ. ఒక క్షణం ఆగి మళ్ళీ ఆవిడే అంది " తిరుపతి వెళ్ళీ టైం లేకపోతే మన ఊళ్ళో గుడికి వెళ్ళు, లేదా ఇంట్లోనే ప్రార్థించు. భగవంతుడిని మరిచి పోక పోవడం ముఖ్యం"
ఆమె మాటలు విన్న తరువాత, ఒక్కమాటు అన్నీ గుర్తుకు వచ్చి, ఆమె చెప్పినదాంట్లో ఎంత నిజం ఉందొ మనసుకి వచ్చి అతని మనసు భగవంతుడి పట్ల కృతజ్ఞత తో నిండిపోయింది