అపరకాళిక...నిర్భయ - ప్రతాపవెంకటసుబ్బారాయుడు

Aparakaalika ... Nirbhaya

కాలం కృష్ణపక్షం నుండి శుక్లపక్షం వైపు సాగుతోంది.

రెండు ఊళ్ళమధ్యనున్న ఆ ప్రదేశం నీరవ నిశ్శబ్దంతో భయానకంగా వుంది.

సాయంకాలమైందంటే అది నిర్మానుష్యమైపోతుంది.

అక్కడ దొంగలు వుంటారు. అమ్మాయిల్ని అనుభవించి హతమార్చే కాముకులూ వుంటారు.

ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది ఆ ప్రదేశం సాక్షిగా బలైపోయారు.

అందుకే ఆ ప్రదేశం గుండా ఎవరూ వెళ్ళరు.

కానీ ఆ రెండూళ్ళ మధ్య వ్యాపార లావాదేవీలకి, సంబంధబాంధవ్యాలకీ ఆ దారి తప్పనిసరి.

కుక్కల అరుపులు... కీచురాళ్ళ ధ్వనులతో భీతావాహంగా వుంది ఆ ప్రదేశం.

సరిగ్గా అప్పుడు...

పెద్ద రావిచెట్టుకింద కూర్చున్న నలుగురూ తప్పతాగుతూ పేలుతున్నారు.

"ఉరే! నిన్న మనం కొట్టేసిన డబ్బు ఒక నెలదాకా మనకి సరిపోద్ది. మనం ఊర్లో కనిపిస్తే పోలీసులు దుంపతెంచుతారు. ఇక్కడ సాటుగా ఓ వారం ఉందామంటే సుక్కా... ముక్కా... సక్కని సుక్కా లేకుండా వుంది. ఏం చెయ్యాలో అర్ధమవ్వట్లేదు"అన్నాడు తల గోక్కుంటూ చిరాగ్గా.

"పోయిన్సారి అట్టా నిబాయించుకోలేక తొందరబడి ఎల్లి... ఇరుక్కుపోయి... మళ్ళా తప్పించుకోడానికి తల ప్రాణం తోక్కోచ్చింది. మళ్ళా అట్టాంటి పొరబాటు చెయ్యకూడదురేయ్"

"కొద్దిరోజులు ఓపికపడితే అంతా సరైతది"

వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే... దూరంగా ఒక స్త్రీ వెళుతుండడం కనిపించింది.

"ఇవ్వాళ మనది ఏమద్రుష్టంరా... రంబలా వున్న ఆ ఆడది ఒక్కత్తీ ఎలా ఎలుతుందో సూడరా... నాయాల్ది మనకి ఇవాళ సుఖ జాగారమేరా!"

"నేను ముందే చెబుతున్నా... ముందు అది నాది... ఆ తర్వాత ఈడిది... ఆడిది... సివరాఖరికి నీదిరోయ్"

"అదిసర్లేరా... డబ్బైనా... మానమైనా... దోచేటప్పుడు... నువ్వు సెప్పినట్టే ఇన్నాంకదరా... ముందు పదండి నోరూరిపోతోంది"

"సరే పద సప్పుడు సేయకుండా దాన్ని ఎంబడించి సటుక్కున పట్టుకుని కోర్కె తీర్సుకుందాం"

అలా వాళ్ళు ఆమెని వెంబడిస్తూ కాస్త దగ్గరగా వెళ్ళి భయంతో బిర్రబిగుసుకుపోయారు.

కారణం అప్పుడప్పుడే వికసితమవుతున్న వెన్నెట్లో... కుదురుగా కట్టిన చీరా జాకెట్టుతో... నడుముకి వడ్డాణం... జబ్బలకి వంకీలు... మెడలో హారం... జుట్టు వదిలేసుకుని... సువాసనలు వెదజల్లుతూ... చేతిలో త్రిశూలం పట్టుకున్న ఆమె కనకదుర్గలా వుంది. చిన్నగా నడుచుకుంటూ వెళుతోంది.

వాళ్ళలో వాళ్ళు చిన్నగా "ఆమె నిజంగా దేవతే అంటావా?"

"అలాగేవుంది"

"పొరబాట్న ఏ నాటకంలోనో ఏషమేసుకుని అదయ్యాక ఊర్లోకి వెళ్ళడం లేదుకదా?"

"అలా అయితే ఒక్కతే ఎందుకెళుతుంది... అదీ ఇంత దైర్యంగా... ఆమె నిజంగా దేవతే"

"అవున్రా... మా బామ్మ సెప్పేది... ఊరిని కాపలా కాయడానికి గ్రామ దేవతలు తిరుగుతుంటారట... కచ్చితంగా ఆమె గ్రామదేవతే!"

"ఇంకా నయం అగాయిత్తెం చేసాము కాదు... కళ్ళు పేలిపోయేవి"

ఆలోపల ఆమె వాళ్ళవైపు తిరిగి కళ్ళలో అగ్నిజ్వాలలు కురిపిస్తూ "ఏరా అమ్మాయి కనిపిస్తే నాశనం చేసేయడమేనా... ఆడదంటే ఆదిశక్తిరా... హుఁ" అని హూంకరించి ఒక్కసారిగా వాళ్ళమీదకి దూకి శూలంతో ఒకడి కాళ్ళమీద మరొకడి జబ్బలపైనా పొడిచింది... వాళ్ళు "అబ్బా" అని నేలమీదకి జారిపోయారు.

అది చూసి "మమ్మల్ని సెమించు తల్లీ... ఇంకోసారి ఏ ఆడదాన్నీ ఏం చేయం... కాదు కాదు అసలు సూడం... మమ్మల్ని ఒదిలేయితల్లి... దండం పెడతా" కన్నీరు మున్నీరవుతూ కాళ్ళు పట్టుకున్నారు మరో ఇద్దరు.

"ఇంకోసారి సంగతి సరే మరి మొన్నటి దాకా చేసిన పాపాలకి శిక్ష వేయాలి కదరా" అని శూలం ఒకడి వీపుమీదా మరొకడి తొడమీదా గుచ్చింది "అమ్మా" అంటూ నేలపైకొరిగారు.

"చూశారా మీరు ‘అమ్మా’ అంటూ నేలకొరిగారు... పరాయి ఆడదానిలో అమ్మని చూస్తే రాక్షత్వం పెచ్చుమీరదు. మీరు అందరికీ ఇక్కడ జరిగింది చెప్పి ఇహనుండీ ఏ ఆడదాన్నీఏ మగపురుగు కామ దృష్టితో చూడకూడదని చెప్పాలి. అందుకే మిమ్మల్ని ప్రాణాలతో వదుల్తున్నా. ఈ జగజ్జననిని మోసం చేశారో తర తరాలకీ మిమ్మల్ని శాపగ్రస్తుల్ని చేస్తాను జాగ్రత్త" అని వడి వడిగా నడుస్తూ అడవిలో కలసిపోయింది.

***


ఊళ్ళో వున్న అమ్మవారి గుడిముందు ఊరు ఊరంతా గుమిగూడింది.

అమ్మవారి గుడి పూజారి పరంధామయ్య శాస్త్రి "అయితే మీకు నిన్న అమ్మవారు ఆ నిర్జన ప్రదేశంలో కనిపించి ఆడవాళ్ళ మీద ఏ మగవాడూ చెయ్యెయ్యకూడదని చెప్పి మిమ్మల్ని దండించిందంటారు" అన్నాడు.

"సత్తె పెమానకంగా అంతే నండయ్యగారూ"

ఆయన తీక్షణంగా వాళ్ళవంక ఓసారి చూసి "మరి దండించదూ... అమ్మలగన్న అమ్మ అంటే ఆడపిల్లల తల్లిరా... అలాంటిది మీరు వాళ్ళపట్ల అలా అసభ్యంగా... రాక్షసంగా ప్రవర్తిస్తే ఊరుకుంటుందా? కాస్త దయగల తల్లి కాబట్టి దండించి ఊరుకుంది అదే మీరు ఆ తల్లి మాట పెడచెవిన పెట్టి వినకపోతే ఊరిని వల్లకాడు చేస్తుంది ఏమనుకుంటున్నారో... అది మీతో పోదు తర తరాలకీ సోకుతుంది... ఆఁ" అని గట్టిగా మందలించి గుడిలోకి వెళ్ళిపోయాడు.

దుర్మార్గుల కాళ్ళు వణికాయి... అప్పటికే తప్పుచేసిన వాళ్ళ గుండెలు గుబ గుబ లాడాయి.

ఆడాళ్ళందరూ మగాళ్ళని శాపనార్ధాలు పెడుతూ... అక్కడి నుండి కదిలారు.

అప్పటిదాకా వాళ్ళమధ్య వున్న వకుళ నవ్వుకుంది.

ఆ నిర్మానుష్య దారిని అందరికోసం సుగమం చేయడానికీ... అమ్మాయిల్ని అపర కీచకులనుండీ రక్షించడానికి నడుంకట్టి సంవత్సరం క్రితం చదువు నెపంతో హైద్రాబాదులో వుంటున్న వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళి ఆత్మరక్షణ కోసం కరాటే లాంటివి ఏకాగ్రతతో నేర్చుకుని తిరిగి తన ఊరికొచ్చి దేవుళ్ళంటే ఊరి జనం భయపడతారు కాబట్టి అమ్మవారి వేషం వేసుకుని వకుళ వాళ్ళ భరతం పట్టిందనీ ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. ఆమె ఒక్కదాని ధైర్యం... తెగింపువల్ల రెండూళ్ళ మధ్య రాకపోకలు నిరంతరమయ్యాయి.

ఇప్పటి వ్యవస్థకి కావలసింది ప్రభుత్వాలు... అవి రూపొందించే చట్టాలూ కాదు. వకుళ లాంటి ‘నిర్భయ’లు... మగాసురుల పాలిట కాళికలు!!

( స్త్రీ అబల... సబల అన్నది పక్కన పెడితే... పురుషుడితో పాటు సమానంగా జీవించేహక్కు స్త్రీది. ఆ హక్కుకి విఘాతం ఏర్పడుతున్నప్పుడు ప్రతి స్త్రీ అపరకాళిక కావలసిందే... పురుషజాతి మదమణచవలసిందే. మగమృగాల దౌష్ట్యానికి బలైన నిర్భయలకి అశృనయనార్పితమీకథ!)

***

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు