తేజస్ - దినవహి సత్యవతి

tejas

మధ్యాహ్నం 2 గంటల సమయం. ఆఫీసులో అత్యవసర మీటింగులో ఉన్నాను. మధ్యలో మాధవి నుండి ఫోన్????

ఈ సమయంలో దాదాపుగా రోజూ నాకు మీటింగ్స్ ఉంటాయని మాధవికి తెలుసు మరి ఈ వేళలో ఎందుకు చేసిందో ఒకవేళ నాన్నకిగానీ ఏమైనా కాలేదు కదా? ఛ ఛ వెధవ మనసు ఎప్పుడూ చెత్త ఆలోచనలే అనుకుని తల విదిల్చి ‘ఒక్క నిమిషం‘ అని మీటింగ్ హాల్ బయటకి వచ్చి ‘ హలో’ అన్నాను

‘ఏమండీ!’ అవతలినుండి మాధవి ఏడుపు గొంతువిని ‘‘ఏమైంది మాధవీ?’ అన్నాను గాబరాగా

తేజస్ స్కూలునుండి ఫోన్ వచ్చింది. గేమ్స్ క్లాసులో ఉన్నట్లుండి కూలబడి పోయాడుట. వెంటనే వచ్చి తీసుకెళ్ళమన్నారు. నేను బయలుదేరుతున్నాను’ మాధవి గొంతులో దుఃఖం సుడులు తిరుగుతోంది

అయ్యో అదేమిటీ?సరే కంగారు పడకు స్కూలుకి నేను వెళతానుగానీ నువ్వు నాన్నని తీసుకుని సరాసరి సిటి ఆస్పత్రికి వచ్చేయ్. అక్కడ చూపించి ఇంటికి తీసుకెళదాము’ అని మా బాసుకి చెప్పేసి ఆఘమేఘాల మీద తేజస్ స్కూలుకి బయలుదేరాను .

స్కూలుకి వెళ్ళి చూద్దును కదా సిక్ రూం లో తేజస్ నీరసంగా పడుకుని ఉన్నాడు. తేజస్ ని లేపి నడిపించుదామని ప్రయత్నించాను కానీ తోటకూర కాడలా వాలిపోయాడు చేతుల్లో. దాంతో ప్రిన్సిపల్ అనుమతి తీసుకుని స్కూలువాళ్ళు ఇద్దరు సాయం చేయగా తేజస్ ని ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి వెళ్ళాను..........

అప్పటికే నాన్న, మాధవి అక్కడ ఉన్నారు. నాన్న, నేను వాడిని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళాము.

తేజస్ ని పరీక్ష చేసి కొన్ని టెస్ట్ లు చేయించమన్నారు డాక్టర్. టెస్ట్ రిపోర్ట్ లతో మళ్ళీ ఆయనను కలుసుకున్నాము.

రిపోర్ట్ లు చూసిన డాక్టర్, తేజస్ చదువు దినచర్య అన్నీ విపులంగా అడిగి తెలుసుకున్నారు. తేజస్ సమస్య గురించి ఆయన చెప్పినది వినగానే మా అందరికీ గుండెలు గుభేల్ అన్నాయి. తేజస్ అయితే బెంబేలెత్తి బిక్క ముఖం వేసేసాడు........

దీనంతటికీ అసలు కారణం.............

నేను ఢిల్లీ బదిలీ అయి వచ్చి ఏడాది అయ్యింది. తేజస్ వయసు పదమూడు , ఎనిమిదవ తరగతిలో ఉన్నాడు. ఇప్పుడప్పుడే యుక్త వయసులో అడుగిడుతున్నాడు.

ఆ వయసు ప్రభావమేమో కానీ అమ్మా నాన్నలు ఏది చెప్పినా వినాలనిపించదు.....అంతా తమకే తెలుసనుకుంటారు పిల్లలు!!!
ఢిల్లీ రాకముందు హైదరాబాదులో ఉండేవాళ్ళము. అక్కడ కనీసం అప్పుడప్పుడైనా చుట్టుప్రక్కల స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లేవాడు తేజస్.....ఇక్కడికి వచ్చి ఏడాదిగా అసలు ఇల్లు కదిలి బయటకు వెళ్ళడమే మానేసాడు.......

ఇంట్లో ఉన్నంతసేపు తన గదిలో ఆ టాబ్ లో ఏవో వీడియోలు చూస్తూ అలా మంచం పై పడుకుని ఉంటాడు....తినడానికి రావడం మళ్ళీ గదిలోకి దూరి కూర్చోవడం.......మాధవీ నేనూ చెప్పి చెప్పి విసిగి పోయాము..

వద్దండీ అంటున్నా ఆ టాబ్ కొనిచ్చానని మాధవి దెప్పడంలో తప్పేముంది?

కాసేపు అలా బయట సైకిల్ తొక్కుకోరా అంటే ‘అబ్బా డాడ్ ఇప్పుడే వచ్చాను కదా అలసిపోయాను, కాళ్ళు బాగా నెప్పెడుతున్నాయి’ అని విసుగ్గా సమాధానం చెప్పేవాడు.

వీడితో ఎలా వేగాలో తెలియక అమ్మానాన్నలని సలహా అడుగుదామని అనుకుని కూడా మా బాధ్యతలు తీర్చుకుని ఇప్పుడు కొంచం విశ్రాంతిగా జీవితం గడుపుతున్న వాళ్ళని మళ్ళీ ఈ పెద్ద వయసులో మా సమస్యలతో ఇబ్బంది పెట్టడమెందుకులే అనుకుని ఊరుకున్నాను.....

హైదరాబాదులో ఉండగా అడపాదడపా వచ్చే అమ్మ నాన్నా ఢిల్లీ వచ్చాక ‘అబ్బా అంత దూరం ప్రయాణం చేయలేమురా అబ్బాయీ’ అనేసారు.

‘‘పోనీ ఫ్లైట్ టిక్కేట్లు పంపిస్తాను రండి నాన్నా’ అన్నప్పటికీ ‘మీ అమ్మ విమాన ప్రయాణం చేయనంటోందిరా’ అనేసారు మరో మాటకి ఆస్కారం ఇవ్వకుండా .

ఇంతలో నా మొర ఆ దేవుడు విన్నాడా అన్నట్లుగా అమ్మ తన స్నేహితురాలు పెళ్ళికి వెళ్ళగా తేజస్ ని చూసి పోదామని నాన్న వచ్చారు.
నాన్నకి ఇప్పుడు 65 సంవత్సరాల వయసు. ఇప్పటికీ ఉదయాన వాకింగ్ , సంధ్యా వందనం, సూర్య నమస్కారాలు తప్పని సరిగా చేస్తారు. నేను అవన్నీ కాకపోయినా ఒక సంధ్యా వందనం మాత్రం చేస్తుంటాను.

నాన్నకి తేజస్ గదిలోనే పడక ఏర్పాటు చేసాను.

తేజస్ కి ఎ.సి. కావాలి, నాన్నకేమో ఎ.సి. అంతగా కిట్టదు.

చక్కగా కిటికీ తలుపులు తెరుచుకుని స్వచ్చమైన గాలి గదిలోకి రానిస్తే ఆరోగ్యంరా బాబూ అంటారు .

వాడి స్వేఛ్ఛ కి కొంత భంగం కలిగిందని గునిసాడు కానీ తాతగారంటే ఉన్న ఇష్టం వల్ల పెద్దగా గొడవ చేయలేదు.

ఆ మర్నాడు నాన్న ఉదయాన లేచి వాకింగ్ కి వెళుతూ ‘తేజస్ నాతో వస్తావా?’ అడిగారు

‘వ్వాట్ తాతగారూ నన్ను పడుకోనివ్వండి. కొంచం ఆ ఎ.సి. ఆన్ చేసి వెళ్ళండి ప్లీజ్ ’ అన్నాడు విసుగూ బద్ధకం మేళవించిన స్వరంతో

‘సరే’ అని తలుపు దగ్గరగా లాగి వెళ్ళిపోయారు నాన్న. వాకింగ్ నుండి వచ్చిన నాన్న స్నానం పూజ అయి సూర్య నమస్కారాలు చేస్తుండగా లేచి హాల్లోకి వచ్చాడు తేజస్.

‘ఓహో తాతగారు ఇంకా అవన్నీ చేస్తూనే ఉన్నారా? వ్వాట్ ఎ పేషన్స్!!!’ అన్నాడు సందర్భం వచ్చింది కదా అని ‘సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తారో తెలుసా తేజస్?’ అంటూ చెప్పబోయాను అంతలో ‘తేజస్ స్కూలుకి టైమవుతోంది త్వరగా రెడీ అవ్వు. మళ్ళీ బస్ వెళిపోతుంది’ అన్న మాధవి పిలుపుతో అటు వెళ్ళిపోయాడు.

‘రాక రాక ఒక మహదవకాశం వచ్చిందనుకుంటే అది కూడా చేజారిందే! హూ...!’ అని నిట్టూర్చాను

‘బై తాతగారూ ‘ అంటూ వెళుతున్న తేజస్ తో బస్సుదాకా వెళ్ళొచ్చిన నాన్న ‘అబ్బాయ్ తేజస్ ఏమిటిరా అలా కాళ్ళు ఈడుస్తున్నట్లుగా నడుస్తున్నాడు?’ అన్నారు

ఈ మధ్యన నేను కూడా గమనించాను వాడి నడకలో తేడా. ఇప్పుడు నాన్న మాటలతో నా అనుమానం ధృఢమైంది .

‘అవునా? సరే సాయంత్రం కనుక్కుంటాను నాన్నా’ అని ఆఫీసుకి వచ్చేశాను.........

ఇంతలో మధ్యాహ్నమే మాధవి నుండి ఈ ఫోన్????

‘ఇప్పటికి కొన్ని మందులు వ్రాసి ఇస్తున్నాను. క్రమం తప్పకుండా అశ్రధ్ధ చేయకుండా వాడండి. మీరు ఇంకా నిర్లక్ష్యం చేసారంటే మీ అబ్బాయి లేచి నడవడం కూడా కష్టమవుతుంది’ అని కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు డాక్టర్.

మనవడి ఆరోగ్యం గురించి తెలుసుకున్న అమ్మ స్నేహితురాలి దగ్గర ఇంకో రెండ్రోజులు ఉందామనుకున్నదల్లా హుటాహుటిన వచ్చేసింది.
అప్పటినుండీ అమ్మా నాన్నా సహకారంతో తేజస్ ని కంటికి రెప్పలాగా చూసుకున్నాము. ఒక పదిహేను రోజులు గడిచేటప్పటికి కొంచంగా కోలుకున్నాడు తేజస్.

ఒకనాడు నాన్న వాకింగ్, సూర్య నమస్కారాలు అన్నీ అయి కూర్చున్నారు .

తేజస్ వచ్చి ఆయన ప్రక్కనే కూర్చుని ‘తాతగారూ రేపటి నుంచి నేను కూడా మీతో సూర్య నమస్కారాలు చేస్తాన, నేర్పిస్తారా?’ అన్నాడు

‘అబ్బో అబ్బో ఏమిటో విశేషం?’

‘అవును తాతగారూ ఆ రోజు డాక్టర్ చెప్పారు కదా నేను అస్తమానమూ ఇంట్లోనూ , ఎ.సి. లోనూ కూర్చోబట్టి నాకు సన్ రేస్ సరిగ్గా తగలకపోవడం వల్లనే ఈ డి విటమిన్ డెఫిషెన్సీ వచ్చిందని......’

ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ మాధవికూడా వచ్చి కూర్చుంది నా ప్రక్కనే సోఫాలో

’అవునూ అయితే ?’

‘ నాకు అప్పుడు తెలిసింది తాతగారూ మీరు ఇప్పటికీ మోర్నింగ్ ఇవన్నీ ఎందుకు చేస్తారో?’

‘ఎందుకో?’

తేజస్ నాన్న కేసి మాకేసి ఒకసారి చూసి ‘ అందువల్ల మీకు డైరెక్ట్ సన్ రేస్ తగులుతాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మంచివని డాక్టర్ చెప్పారు కదా. ఇవన్నీ నేను సైన్స్ లో చదువుకున్నా నెగ్లెక్ట్ చేసాను అందుకే నాకిలా జరిగింది.

మీరు కూడా నన్ను ఎప్పుడు అడిగినా కేర్ లెస్ గా రిప్లై ఇచ్చాను. అయాం సారీ తాతగారూ!’ అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. నాన్న గబుక్కున వాడిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. అమ్మ కూడా వాడి తలపై చేయివేసి నిమిరింది.

మాధవికి నాకు కూడా వాడు అలా బేలగా ఏడవడం చూసి కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి.

‘అవును రా బాబూ తేజస్. చక్కగా గ్రహించావు. ఉదయాన సూర్యుడి కిరణాలు మన శరీరానికి ఎంతో మంచివి. అంతే కాదు ఇంకా ఎన్నోవిధాల మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సూర్యుడు ఎంతగానో హెల్ప్ చేస్తాడు. అందుకే నేను, ఇంకా చాలా మంది సూర్యుణ్ణి దైవంలా భావించి పూజిస్తాము’

‘మీరు చెప్పింది ఎంతో కరెక్ట్ తాత గారూ నేను కూడా అలాగే చేస్తాను’ కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు తేజస్ అలా అనడమే కాదు ఆ రోజూ మొదలు వాడు కూడా ఉదయానే లేచి నాన్నతో వాకింగ్, ఆయన నేర్పించగా సూర్య నమస్కారాలూ చేయడం మొదలు పెట్టాడు.
అమ్మ నాన్నా తేజస్ కి బాగా ఆరోగ్యం చేకూరేదాకా ఉండి వెళ్ళారు. ఆ తరువాత కూడా తేజస్ తన దినచర్య అలాగే కొనసాగించాడు. రోజూ వాళ్ళ తాతగారికి రిపోర్ట్ ఇస్తుంటాడు ఇప్పటికీ....

తేజస్ ఇప్పుడు 10 వ తరగతిలోకి వచ్చాడు. ఆ సంఘటన తరువాత రోజూ నియమం తప్పని వ్యాయమం, సూర్య నమస్కారాలు ..వీటన్నిటితో చక్కగా ఆరోగ్యకరంగా తయారయ్యాడు.

ఎప్పుడో మరీ తోచకపోతే తప్ప టాబ్ ముట్టుకోవడం మానేసాడు. ప్రతిరోజూ సాయంత్రం కాసేపైనా సైకిల్ త్రొక్కడం, స్కూల్లో గేమ్స్ లో పాల్గొనడం ఇత్యాది వన్నీ చేస్తున్నాడు కూడా.

ప్రతిరోజూ నాన్నతో కాసేపైనా కబుర్లు చెప్పడం వాడి దినచర్యలో ఒక భాగం అయిపోయింది.

‘హాయ్ డాడ్’ ఉదయాన్నే వాకింగ్ కి వెళ్ళి లోనికి వస్తూ పలకరించాడు తేజస్

‘హాయ్ తేజూ !’ చదువుతున్న పేపర్ లోంచి తలెత్తి సమాధానమిచ్చాను.

‘ఫ్రెష్ అయి వస్తాను’ అని గదిలోకి వెళ్ళిపోయాడు.

స్నానం ఫలహారం కానిచ్చి స్కూలు యూనిఫారం ధరించి షూస్ వేసుకుంటూ ‘డాడ్ ఇవాళ తాతగారు వాళ్ళు వస్తున్నారు కదా. నేనూ స్టేషన్ కి వద్దామనుకున్నా కానీ ఇవాళ ఒక ఇంపార్టెంట్ క్లాస్ టెస్ట్ ఉంది. రాలేనేమో!’

‘ఫరవాలేదు తేజస్, సాయంత్రం కలుసుకుందువుగాని. వాళ్ళు వస్తున్నదే నీకోసం , చూడాలని ఉంది రమ్మని పిలిచింది నువ్వేగా’ నవ్వుతూ అని కారు తాళాలు తీసుకుందుకు లేచాను.

తేజస్ ని స్కూల్లో దింపి అమ్మా నాన్నలను తీసుకుని రావడానికి కారు స్టేషన్ వైపు మళ్ళించాను. అప్పటిదాకా ఉదయ భానుడిని ఆవరించిన మబ్బులు తొలగడంతో నులివెచ్చని సూర్య కిరణాల తేజస్సుతో గగన తలం ప్రజ్వరిల్లింది.....

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న