ఆరంభం ఒక్క అడుగుతోనే - సుంకర వి హనుమంత రావు .

aarambam okka adugutone

ఆదివారం.ఉదయం పదిగంటలు.అబవ్ మిడిల్ క్లాస్ లొకేలిటిలో ఒక ఫ్లాట్.

“నాన్నా వాసూ!కొంచం కూరగాయల సత్తవ్వను పిల్చుకురా .ఆలస్యం చేస్తే ఫ్రెష్ వన్ని అయిపోతాయి.”దీక్షగా చదువుకుంటున్న కొడుకును బ్రతిమాలింది వనజాక్షి.

“అమ్మా!నాకు టెస్ట్ వుంది ..యిప్పటికి నన్ను వదిలేయ్ ప్లీజ్.”

“ఎలారా?ఫ్రిజ్ లో కూడా అయిపోయాయి.చెల్లిని పంపించాలంటే అదింకా బాత్ రూమ్లోనే వుంది.”

“పోనీ యివ్వాళ సండే కదా?డాడీని పిలవమని చెప్పు.”

“చాల్లే సంబరం.మీడాడీకి అవ్వల దగ్గిర ..బండ్ల మీద కూరలు నచ్చవు.”విసుగ్గా లేచాడు వాసు.

“అమ్మా!జర్రంత సాయం పట్టున్రి .”వనజాక్షి సాయంతో గంప దించుకుంది సత్తవ్వ.

“టొమాటోలు ఎట్లిస్తున్నావ్?”

“ఇరవై తల్లి.”

పదిహేను చేసుకో.బీరకాయలు?”

“పాతిక తల్లి.”

“ఇరవై చేసుకో ..బీన్స్ యెంత?”

“యాబై తల్లి.”

“కాలిఫ్లవర్?”

“గదీ గంతే తల్లి.”

“బీన్స్ ,కాలిఫ్లవర్ నలబై నలబై చేసుకో.రెండు కట్టలు..కొత్తిమీర..రెండు కట్టలు కరివేపాకు..మరో రెండు కట్టలు మెంతి కూర .మొత్తం ఎంతయ్యిందో చెప్పు.”

“అమ్మా !మీకు ఎక్కువ సెప్ప.ఐదు సంవత్సరాల సంది యిస్తున్నా .జర్రంత దాహం యిప్పించున్రి.”

నీరు తాగి గ్లాస్ సింకులో కడిగి తెచ్చింది అవ్వ.కూరలన్నీ తూకమేసి కుప్పగా పోసింది.

“ఎంతయ్యిందో చెప్పు.”

“ఐదు తక్వ దోసౌ .”

“అబ్బో !ఎక్కడా తగ్గించ లేదన్నమాట? ఇదిగో నూట యాభై.”

“గంత తక్వకి ఇవ్వలేను తల్లి..ఓపాతిక రూపాయలు కమ్మి చేసుకో.”

వనజాక్షి యిచ్చిన పైసలు తీసుకొని

“అమ్మా!ఆనలు లేవు..పంటలు ఎండిపోతున్నాయ్.బరించలేని ఎండలు.ముప్పై అడుగుల లోతున్న బావి నుండి నీల్లుతోడి పోసి కూరలు పండిస్తున్నాం.మాకస్టాలు మీకు ఎందుకుగాని..

దొడ్లో కాసిన బంగిన పల్లి మామిడి పండ్లు దోరగా మగ్గి వున్నాయి.తమరు తెమ్మంటే రేపు తెస్తా .”

“ఎంత చెప్తున్నావు?”

“కిలో పచాస్ తల్లి.”

“అబ్బో చాలా ఎక్కువ ..యిచ్చేమాట చెప్పు.”

“పడది తల్లి.అదేదో “ఆరగానిక్కని” వంద రూపాయలకు బజార్ల అమ్ముతున్నరు.మాదోడ్లో పండి ,ఎండు గడ్డిలో మాగిన పళ్ళు.దళారులకు యివ్వడం యిష్టం లేక, తెలిసిన మీలాంటి వారికి ఇస్తున్నం.”

“పదికిలోలు తీసుకుంటా ..కిలో ముప్పై చేసుకో.”

“గంత కమ్మికి ఇవ్వలేము తల్లి.”

సత్తవ్వ గంప ఎత్తించుకొని వెళ్ళిపోయింది.

******

మరో ఆదివారం..అదే ఫ్లాట్.అదే సమయం.వనజాక్షి భర్త చలపతి తెచ్చిన సూపర్ బజార్ సరుకులు చూసుకుంటూ..బిల్ చదువుతూ కళ్ళు తేలేసింది వనజాక్షి .

“టమాటో..డెబ్బై..బీరకాయలు ఎనభై..గోరుచిక్కుడు వంద..కాలిఫ్లవర్ వంద..మామిడి పండ్లు వంద ..

కొత్తిమిర ముప్పై..కరివేపాకు ముప్పై ఐదు..మెన్తికూర యాభై..మొత్తం తొమ్మిది వందల తొంబై తొమ్మిది. టేక్సులు అదనం.ఇవి కూరల రేట్లా ..బంగారపు రేట్లా?సత్తవ్వ వానల మూలంగా రావడం లేదు. ఈ ధరల్లో కూరలు కొని నేను కాపరం చేయలేను.” బిపి తెచ్చేసుకుంది వనజాక్షి.“ఇవన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్..ధరలు యిలాగే ఉంటాయ్.నువ్వేమీ టెన్షన్ పడకు.మైహునా?”

“ఏం మైహూనానో..నెలతిరిగే సరికి అరలక్ష అయిపోతోంది.పిల్లల ఫీజులు..ఫ్లాట్ అద్దె ..వారానికో హోటల్లో డిన్నర్..సినిమా చూడాలంటే వేలకు వేలు..దానికి తోడు ఈకూరగాయలొకటి.పేరు ఆర్గానిక్కే గాని మెత్తబడిన టమాటాలు..ఎండిపోయిన కొత్తిమిర..మెంతికూర ..కరివేపాకు.” తెగ బాధ పడిపోయింది వనజాక్షి .

“వనజా!నేను ఇప్పుడున్న సీట్లో వున్నంతకాలం డబ్బుగురించి ఆలోచించకు.వచ్చే నెలలో సుజికి కారు కొంటున్నాం.బీహేపీ.” “లంచాలపతిగా” ..ప్రసిద్ధుడైన చలపతి గర్వంగా చెప్పాడు.

“డాడీ..మమ్మీ! స్కూల్లో ప్రైవేట్ క్లాసుంది ..బై.”

“నాన్నా..వాసూ!నీకోసం ఇవ్వాళ స్పెషల్ చేసాను .త్వరగా వచ్చెయ్.అన్నట్లు రాత్రికి హోటల్లో డిన్నర్.”

“ఓకే మమ్మీ!”

వాసు వెళ్ళిపోయాడు.

***

అదేరోజు రాత్రి..జూబిలీహిల్స్ లోని ఓఖరీదైన రెస్టారెంట్.

“మమ్మీ!చూసావా?బిర్యాని ఫైవ్ హండ్రెడ్..ఐస్ క్రీం త్రీ ఫిఫ్టీ..లెమన్ సోడా టుహండ్రెడ్.అంటే మనం తక్కువలో తక్కువ తిన్నా బిల్లు దాదాపు త్రీ థౌజండ్.డాడీ!ఒక్క పూట డిన్నర్ కోసం యింత ఖర్చు అవసరమా?”

“నాన్నా!వాసూ మనమొచ్చింది డిన్నర్ చేయడానికి.లెక్కలు వేసుకోడానికి కాదు.మనం వచ్చేది వారానికి ఒక్క సారి.ఆలోచనలు మాని ఫుడ్ ఎంజాయ్ చెయ్.”చలపతి సముదాయించాడు.

“అదికాదు డాడీ !నాక్లాస్ మేట్ ఫ్రండ్ నవీన్ తెల్సుగా. వాడి డాడీ డ్రైవర్. వాళ్ళ అమ్మ కుక్.యిద్దరి శాలరీ ట్వెంటీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ.అయినా వాడు నేనుచదివే స్కూల్లోనే చదువుతున్నాడు.ఇల్లు చిన్నదే అయినా సంతోషంగా వుంటున్నారు.మీరు టిప్పుల పేరుతో అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు.నాకు యిష్టం లేదు డాడీ.”

“మరీ అంత ఆలోచించి బాధ పడకు.మన దగ్గరవుంది కాబట్టి స్పెండ్ చేస్తున్నాము” .

“మీ యిష్టం డాడీ.”

బేరర్ బిల్లుతోబాటు “swiping pad” తీసుకు వచ్చాడు.చలపతి కార్డ్ తో పే చేసాడు.కౌంటర్ దగ్గరకు వెళ్ళిన బేరర్ ట్రేలో పాన్లు..సోంపు తెచ్చి నిలబడ్డాడు.చలపతి వాలెట్ తెరిచి రెండు వంద రూపాయల నోట్లు టిప్ గా ట్రే లోవేసి..వాసును నవ్వుతూ చూసి బిల్లు తీసుకొని బయటికి నడిచాడు.

******

మరో ఆదివారం.లివింగ్ రూము. సోఫాలో కూర్చొని భార్యతో ముచ్చట్లు పెట్టుకుంటున్న చలపతి ముందు చేతిలో నోట్ బుక్, పెన్ తో వచ్చి ఎదురుగా వున్న సోఫాలో కూర్చున్నాడు వాసు.

“ఏరావాసూ!ఎనీ డౌట్స్ ?” ప్రశ్నించాడు చలపతి.

“ఔను డాడీ..రేపు స్కూల్లో ఒక వ్యాసం సబ్మిట్ చేయాలి..నెట్లో చూసాను ..కాని మిమ్మల్ని అడిగితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని.” “ఓకే..ప్రొసీడ్..యింతకీ సబ్జక్ట్ ఏమిటి?”

“చాలా సింపుల్ డాడీ. రెండు మాటల్లో చెప్పాలంటే .పేరెంట్స్ పిల్లలకు ఎలా ఆదర్శం గా వుండాలి? పెరుగుతున్న పిల్లలమీద ఇంటిపెద్దల ప్రభావం యెంత?”

HOW EXEMPLARY PARENTS SHOULD BE? HOW YOU ALL INFLUENCED BY YOUR FATHER AND MOTHER ?

“ఓస్ యింతేనా?పిల్లలు పుట్టి నప్పటినుండి..తల్లితండ్రుల నుండి భాష, ఆహారపు అలవాట్లు నేర్చుకుంటారు.కొంచం పెద్దయ్యాక డ్రెస్సింగ్..వాకింగ్ ..స్టైల్స్ నేర్చుకుంటారు.”

“అంతేకాదు డాడీ..స్మోకింగ్..అబద్దాలు చెప్పడం..లేనిపోని గొప్పలకు పోవడం, లంచాలు తీసుకోవడం అనవసరంగా ఖర్చులు చేయడం ..యింకా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు.”

“నాన్నా!అవన్నీ యిప్పుడు ఎందుకు ?నీకు యేమికావాలో అడుగు .” కొడుకు చెపుతున్న ఆ అవలక్షణాల్లో దాదాపు అన్ని తన భర్తలో వున్నాయని తెలిసిన వనజాక్షి అడ్డం పడిపోయింది.

“అమ్మా!”మా సర్” సబ్జెక్ట్ చెప్పేటప్పుడే పాయింట్స్ చెప్పారు.వాటిగురించే డాడీని అడుగుతున్నాను.మధ్యలో నువ్వెందుకు కలిగించు కుంటావు?డాడీకి చెప్పడం యిబ్బంది గావుంటే చెప్పొద్దని చెప్పు.”

“నువ్వు అడుగు వాసూ..”

నీరసంగా చెప్పాడు..చలపతి.

“పిల్లలు పెద్దల్ని అనుసరించి పెరుగుతారు..తర్వాత అనుకరించి అలవాట్లు నేర్చుకుంటారు.అంటే పెద్దలకున్న మంచితో బాటు చెడును కూడా “అడాప్ట్” చేసుకుంటారు.మాకు మీరే పెద్దలు..అనుసరణీయులు.అవునంటారా? యిప్పుడు మీవిషయాని కొద్దాం.

మీరు ఒక సామాన్య ప్రభుత్వోగి.మీ జీతము యాభై వేలు.మన ఫ్లాట్ అద్దె ఇరవై వేలు.నాది చెల్లెలి ఫీజులు బుక్స్ ..బస్సు..డ్రస్సులు ..కలిసి మరో ఇరవై వేలు.మీ ఫోన్ బిల్లు..మిగతా ఖర్చులు ఓపదివేలు.. అంటే ఇప్పటికే మీజీతం అయిపోయింది. ఇకపోతే ఇంటి ఖర్చులు ..కరెంట్ బిల్లులు కలిపి మరో పదిహేను వేలు.మమ్మీ కిట్టి పార్టీలు..హోటల్లో డిన్నర్లు ..సినిమాలు షికార్లు అదనం.అంటే అన్ని కలిపి మరో యాభై వేలు. సోర్స్ ఆఫ్ ఇన్కం మీరు చెప్పలేరు..నేనుచెప్తాను..”లంచం”నిన్న మీరు అమ్మతో ఆనందంగా మీలంచాల భాగోతం చెప్తుంటే విన్నాను.మీకున్న దొంగ బేంక్ అకౌంట్స్ చెక్ చేసాను.

ఈమధ్య “ఎసిబి” దాడులు తరచుగా జరుగుతున్నాయి.మొన్నీమధ్య మీడిపార్ట్మెంట్ లలో కూడా జరిగాయి.ఒకవేళ మీరు దొరికిపోతే మాపరిస్థితి ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా?బంధువులు దూరమై పోతారు.స్నేహితులు పలకరించరు.పక్కింటి వారే పరమ నీచంగా చూస్తారు.అప్పుడు మీరు జైలు పాలు..మేము వీధులపాలు.ఈ బ్రతుకు మనకు అవసరమాడాడీ?ఏమాత్రం అభిమాన మున్నఎవరైనా అవమానంతో ఆత్మహత్య చేసుకుంటారు.మొన్న మీఆఫీస్ ఉద్యోగి లంచాల కేసులో పట్టుబడి జైలుకు పోతే అతని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.మనం కుడా వెళ్ళి సానుభూతి చూపించాము.అదే పరిస్థితి మీకు వస్తే ?మాబ్రతుకులు కూడా అంతే.నేను చెల్లి యింట్లో ఫ్యాన్ కే వురేసుకుంటాం.

మన సంగతి అంతా వ్యాసంగా రాసి యిస్తే..”మా సర్” తోబాటు ఫ్రెండ్స్ అందరూ యిది మనయింటి చరిత్రే అని అర్ధంచేసు కుంటారు.అలా అని అబద్దాలు రాయలేను.ఎందుకు రాయలేదని సర్ అడిగితే అబద్దాలు చెప్పలేను.ఇప్పటికే మన బిల్డప్స్ చూసి ..నిజంగా మీనాన్నప్రభుత్వ వుద్యోగా ?కొంపలు ఆర్పే కంట్రాక్టరా ? అని అనుమానిస్తున్న ఫ్రెండ్స్ అనుమానాన్ని అబద్ధమని కొట్టిపారేయలేను. నాఫ్రెండ్స్ కొందరు లంచగొండులైన తండ్రుల గురించి బాధ పడుతుంటే .. సముదాయించే వాడిని.

మరి యిప్పుడు నా బ్రతుకు ?

నాన్నా!పిల్లలకు ఆస్తులు అవసరం లేదు.సంస్కారం నేర్పండి.కార్పోరేట్ స్కూళ్ళు, కాలేజిలు అవసరంలేదు.పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఒళ్ళు కాలి చచ్చిపోతుంది.

వయసురాని పిల్లలకు..స్మార్ట్ ఫోన్లు..స్మార్ట్ బైక్స్ ఇవ్వకండి.విచ్చలవిడిగా చేసే ఖర్చులు మాని..అవసరమున్న నిరుపేదలకి సాయం చేయండి.

నేను చెప్పిన నామాటలు విని లంచాల ఊభిలో కూరుకుపోయిన మీరు మారిపోయి మహాత్ములవుతారని కాదు.నా మనసులోని ఆవేదనని వ్యక్త పరిచాను.నిర్ణయం మీయిష్టం.”

“అమ్మా!యిప్పుడు నీవంతు.”

“సత్తవ్వతో ..పనిమనిషితో” ప్రవర్తంచే తీరు..అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ని..గుర్తుచేస్తుంది.

నీకిట్టి పార్టీ ఫ్రెండ్స్ తో టివీలలో ..పేపర్లలో వస్తున్న రైతు ఆత్మహత్యలగురించి మాట్లాడుతూ బోల్డంత సానుభూతి ఒలకపోస్తావ్.వానలు కురవక ..పంటలు పండక ..నకిలీవిత్తనాలు..మొలకెత్తక ..చేసిన రుణాలు తీర్చలేక రైతులు పురుగులమందు తాగి తమ ప్రాణాలు తామే బలితీసుకుంటున్నారు. అయిదు కిలోమీటర్ల దూరం నడిచి..ఎండకు ఎండి వానకు తడిసి తమదొడ్లో పండిన “రసాయనక ఎరువులు” లేని కూరగాయలు యింటి ముందుకు తెచ్చి ఇస్తుంటే..గిసిగీసి బేరమాడి వారి పేద బ్రతుకులతో ఆడుకుంటున్నారు.నువ్వు సత్తవ్వతో అరగంట బేరమాడి యిరవై ఇదు రూపాయలు..సంపాదించావు.

అదే నాన్నగారు..హోటల్కి వెళ్లి రెండువందల రూపాయలు టిప్పులిస్తూ అదేదో గొప్ప అని విర్రవీగుతున్నారు.నీ నుంచి మేము నేర్చుకోవలసింది పిసినారి తనాన్ని.”అవ్వ” తాగిన గ్లాసు కడుగుతుంటే..చుస్తూ వూరుకున్నావే తప్ప అంత వయసున్న అవ్వని వారించలేదు.నీ నుంచి యిదే “సంస్కారాన్ని” మేము నేర్చుకోవాలి?ఎదురుగా కూతురు ఉందన్న జ్ఞానం కూడా లేకుండా పనిమనుషుల
ముందు అహంకారాన్ని ప్రదర్శిస్తూఉంటావు. ఇదేకదా..పెరుగుతున్న పిల్లమీద పెద్దవారి ప్రభావం?

నేను యిన్ని నిజాలు రాయకుండా అబద్దాలు రాసి వ్యాసం సబ్మిట్ చేయలేను. పోనీ అబద్దాలు రాయాలంటే నామనసు ఒప్పుకోదు.రేపటినుండి ఆస్కూల్ కివెళ్ళలేను.మీరు మారితే మా బ్రతుకులు మంచి దారిలో నడుస్తాయ్.లేదా మేముకుడా మీలాగే పిసినార్లమో..లంచగొండులమో అవుతాము.నిర్ణయం మీది.

మమ్మల్ని లంచగొండులు..సంస్కార హీనులుగా మారుస్తారో ! నిజాయితీ గల భారత పౌరులుగా తీర్చి దిద్దుతారో ..మీ యిష్టం.పిల్లల్ని ఆత్మహత్యలు చేసుకొనేలా ప్రేరేపించకండి. నా ఆఖరి ప్రార్ధన..మీ పిల్లల్ని మీరు రక్షించు కుంటారో..బలితీసుకుంటారో మీ యిష్టం .
“మాచావుకు.. మీరే బాధ్యులు ..మీరే బాధ్యులు” అవుతారు ..సెలవ్ .

ఒక్కసారిగా త్రుల్లిపడి లేచాడు చలపతి.ఎదురుగా వాసు లేడు.మంచం మీద గాఢ నిద్రలో భార్య వనజాక్షి..గడియారం అర్ధరాత్రి టైం చూపిస్తోంది.కలో..వాస్తవమో అర్ధం గాక ఒక్కసారిగా తట్టి భార్యను లేపాడు.

“ఇప్పుడు అర్ధరాత్రి ఏంటండి?”

కళ్ళు బలవంతాన తెరుస్తూ మత్తుగా అడిగింది.

“వనజా !నిన్ను ఇబ్బంది పెట్టాలనికాదు.ఇప్పుడే నాకు ఒక భయకరమైన కలొచ్చింది.”

“రేపు చెప్పొచ్చుగా?నిద్ర పాడుచేసి యిప్పుడే చెప్పాలా?” విసుగ్గా అడిగింది.

“అవును..యిప్పుడే చెప్పాలి..రేపంటే మర్చిపోయే ప్రమాదం వుంది.”

మొత్తం కలంతా వివరించి చెప్పాడు.

అంతావిని

“ఓస్..ఇది కలేగా?మీఆఫీసులొ రైడ్ అయినప్పటినుండి..కలలూ,కలవరింతలు ఎక్కువయ్యాయి.”

“కలేగాని ..కల్లకాదుగా.కలలో అయినా వాసు నిజమే చెప్పాడు.”

“సరే !వాడు చెప్పాడని మీరు కలకన్నారు.అయితే?రేపు ఏదో జరుగుతుందని ఈరోజు నడిచొచ్చే ధనలక్ష్మి ని కాలదన్నుకుంటామా?కోట్లు కోట్లు ప్రజాధనం మింగి..దేశం మీద పడి యాత్రలు చేస్తున్న గజదొంగలని .. కోట్లాది రూపాయల బేంక్ సొమ్ములు మింగి విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్న వారిని యేమీ చేయలేని ప్రభుత్వం మనది.మీకు కలలో వాసుచెప్పాడని నేనేమీ..”పీనాసి వనజాక్షిని” అయిపోను.మీరేమి కొత్తగా లంచగొండి చలపతి అయిపోరు.బుర్ర పాడుచేసుకోకుండా హాయిగా నిద్రపోండి.గుడ్ నైట్.”అంటునే ముసుగు తన్నేసింది వనజాక్షి.

******

యధా ప్రకారం రాత్రి పగలయ్యింది.గడియారంలో పదిగంటలయ్యింది. రోజు వచ్చే టైం కే చలపతి వచ్చి తన “కుబేరస్థానంలో” సెటిలై పోయాడు. రోజూ అందరిని విష్ చేస్తూ..హుషారుగా వచ్చే చలపతి “మౌన యోగిలా” వచ్చి కదలిక లేని విగ్రహంలా సీటుకి అతుక్కుపోయాడు. వస్తూనే..కమీషన్ల గురించి కాంట్రాక్టర్ల గురించి గలగలా మాట్లాడే లంచాలపతి చలనం లేకుండా మౌన ముద్ర దాల్చాడన్న నిజాన్ని జీర్నించుకోలేని సహోద్యోగులు..థాయ్ లేండ్ గుహలో చిక్కుకు పోయి పద్నాలుగు రోజుల తర్వాత బయటపడిన ఫుట్బాల్ ప్లేయర్ల సాహస గాధలా ఆఫీస్ మొత్తం టెలికాస్ట్ చేసేసారు.చలపతి మౌన గాధ అన్ని డిపార్ట్మెంట్ ల్లో..అగ్ని జ్వాలల్లా క్షణాల్లో వ్యాపించిపోయింది.లంచాల సంధాన కర్త.. లంచాల డిపార్ట్మెంట్ హెడ్ అయిన చలపతి మౌనాన్ని యెవరూ అర్ధం చేసుకోలేక గగ్గోలు పెట్టేసారు.అయినా ముఖ భంగిమలో గాని..శరీర భంగిమలో గాని కించిత్తు మార్పు లేని చలపతి స్కాములు చేసి ..మహాత్ములనిపించుకొని ..నాలుగు రోడ్ల కూడల్లలొ రాతివిగ్రహాలుగా మారిపోయి..

పక్షుల రెట్టలతో తరించి పోతున్న రాజకీయ ప్రముఖుల విగ్రహాల మాదిరి బిగుసుకుపోయాడు.లంచాల వ్యాపార భాగస్వాములు, ఫ్రెండ్స్ ఎంతమంది ప్రయత్నించినా నోరు విప్పకుండా ఆలోచనల్లోనే “బెల్లం కొట్టే” రాయిలా ఉండిపోయాడు.మౌనంగా తన మనసులో చెలరేగుతున్న ఆందోళనను తట్టుకోలేక ..కళ్ళుమూసుకున్నాడు. ఒక్కసారిగా నిజాయితీ మబ్బు చలపతి మనసును ఆక్రమించేసింది.అంతర్మధనం తొంగి చూసింది. అదీ ఒక్క క్షణమే.అంతలో లంచాల మేఘం పకపకా నవ్వేసి “చలపతీ!పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడుసుకోకు. ..పిల్లల చదువుకు లంచం ఇస్తున్నావు.రేపు లంచమిచ్చే అల్లుడిని తెచ్చుకోవాలి. సాక్షాత్తు మన దేశ ప్రధాన మంత్రే “రాఫెల్” కుంభకోణంలో వున్నాడనే వార్తలు కార్చిచ్చులా కమ్ముకుంటున్నాయి ? నువ్వెంత ?నీలంచాల విలువెంత? అయినా ఇది భారతదేశం.అభియోగాల వరకే.అదీ గొర్రెలవంటి ప్రజలను పిచ్చివాళ్ళను చేయడానికే.బోఫోర్స్ ఏమయ్యింది?కేంద్ర మంత్రుల లంచగొండి పుత్రులలో ఎంతమందికి శిక్ష పడింది?సాక్షాత్తు కేంద్ర మంత్రులే గాలి చేత లంచాలు ఇప్పించి కర్నాటక ఎన్నికలలో చక్రం తిప్పాలని ప్రయత్నించారు.లోకం చూసింది.అంత గొప్ప గొప్ప దేశనాయకులకే సిగ్గు శరం లేనప్పుడు నీకెందుకు చెప్పు ?”

చలపతిని వూరట పరిచింది అంతరాత్మ.సాయంత్రం దాటిపోయింది.తోటి ఉద్యోగులంతా రేపు చూద్దాం..చలపతి సంగతి అనుకుంటు..టాటా చెప్పేశారు.

“ నాన్నా !మమ్మల్ని లంచగొండులు అవినీతి పరుల్లా మారుస్తారో..సంస్కారవంతమైన భారత పౌరులుగా తీర్చి దిద్దుతారో మీ ఇయిష్టం. కాని నన్ను ,చెల్లిని ఆత్మహత్యలు చేసుకునేలా ప్రోత్సహించకండి. మాచావుకు “మీరే బాధ్యులు..మీరే బాధ్యులు” కాకండి.” కొడుకు కలలో చేసిన హెచ్చరికలు పదేపదే గుర్తువస్తుంటే..అల్లకల్లోల మైన మనసును అదుపులో పెట్టుకుంటు ..అంతర్ముఖుడై ఆఫీసులో ఒక్కడే మిగిలిపోయాడు.రోజూ తన ప్రాణ స్నేహితుడిని పికప్ చేసుకొనే క్లోజ్ ఫ్రెండ్ భాస్కర్ వచ్చి చలపతిని ఆస్థితిలో చూసి.. అయోమయంగా
“రేయ్.. చలా!” ఏమయ్యిందిరా? ఆరోగ్యం బాగుంది కదా ?

ఎదురుగా కూర్చుంటూ ఫ్రెండ్లీగా అడిగాడు..మొత్తానికి చలపతి తన మౌనవ్రతాన్ని భంగం చేసాడు చలపతి.రాత్రి వచ్చిన కలగురించి వివరించాడు. “ఇప్పుడు కొంపలేవీ అంటుకుపోలేదు . నేను మొదటి నుండి మొత్తుకుంటునే వున్నాను.పాపపు సొమ్ము వద్దురా అని.ఆఫీసులో “లంచాలకు ..కాంట్రాక్టర్లకు అనుసంధాన కర్తగా” మారి లంచాలపతిగా బిరుదు సంపాదించావు.ఎంత సంపాదించినా యిది నాది అని చెప్పుకోలేని బ్రతుకు నీది.అనుక్షణం భయంతో బ్రతుకు సాగించాలి.ఆలోచించు యిప్పటికైనా మించిపోయింది యేమీ లేదు. జీవితానికి మరణానికి మధ్య కాలం రెప్పపాటు.అంటే ఒక్క క్షణం అంటే ?మనిషికి “మరణమైనా మార్పయినా” ఒక్క క్షణం లోనే వస్తాయి.”
“ఔన్రా..ఈరోజంతా ఆలోచించాను.వుద్యోగం లో చేరింది మొదలు లంచాల పర్వానికి నాంది పలికాను .ఎంతో మంది జీవితాలతో చెలగాట మాడాను.ప్రతిక్షణం భయపడుతూ సంపాదించిన అక్రమ సంపాదనని క్షణంక్షణం భయంతో ..దాచుకుంటున్నాను.రాత్రి వాసు కలలో చెప్పినట్లు ఎందరిదో ఉసురు పోసుకొని సంపాదిస్తూ..పాపం మూటకట్టుకుంటున్నాను.భార్యా బిడ్డలకన్నా జీవితంలో యింకేదీ ముఖ్యం కాదు.వాసు అన్నట్లు నేను లంచాలు తీసుకుంటూ పట్టుబడిపోతే ..వాడన్నట్లు ఆత్మహత్యకు పాల్పడితే యింకా నాబ్రతకు ఎందుకు?ఎవరికోసం?అది జరగకూడదు”.

“రేయ్ చలా!రాత్రి నీకలలో కనిపించింది నీకొడుకు కాదు..నీగిల్టీ మైండ్.మీ ఆఫీస్ లో రైడ్ లో దొరికిపోయిన నీ సహోద్యోగి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అవునా?దాని ప్రభావం కూడా రాత్రి నీకు వచ్చిన కలమీద వుండే వుంటుంది.”

“అవున్రా!నీమాటనిజం. ఆరోజు వాడు హోటల్లో పలికిన మాటలు నన్ను కదిలించాయి.వయసులో చిన్నవాడైనా అర్ధవంతంగా మాట్లాడాడు.అనవసర ఖర్చుల జోలికి పోకపోతే లంచాల అవసరమే రాదు.”

“అవున్రా..ఒక్కసారిగా నీలో వచ్చిన మార్పును లంచాలు మరిగిన నీలంచాల ఫ్రెండ్స్ జీర్ణించుకో లేరు. వారు మానవ రక్తాన్ని మరిగిన “లంచాల పులులు”.అందరు నీలాగే ఆలోచించే అవకాశము వుండదు.నీమీద కూడా దాడిచెయ్యవచ్చు.నువ్వు మారినా గతాన్ని తవ్వి ఏపత్రికకో , ఛానెలుకో ఉప్పు అందించ వచ్చు.నాకు తోచిన చిన్న సలహా చెపుతాను ఆలోచించి నిర్ణయం తీసుకో.ఎవరికి ఏమీ చెప్పకుండా లాంగ్ లీవ్ పెట్టి భార్యా బిడ్డలతో మీస్వగ్రామం వెళ్ళిపో.ఎలాగూ పిల్లలకు సెలవలే కాబట్టి యిబ్బంది వుండదు. సెలవులు అయిపోయాక వచ్చి నిజాయితీ వున్న మరో డిపార్ట్ మెంట్ ట్ కు బదిలీ చేయించుకో.నేను మా యేరియాలో రెండు గదుల చిన్న ఇల్లు చూస్తాను.ముందు అనవసరమైన ఆడంబరాలనుండి బయటపడు.

జీవితంలో అన్ని సమస్యలు వాటికవే సర్దుకుంటాయి.రోజు సూపర్ బజారులలో ఎక్కువ ధరలు పెట్టి కూరగాయలు కొనే బాధ వుండదు.ఇంటికి దగ్గరలో రైతుబజార్ వుంది. రోజు నీఆఫీస్ కి ఆటోల్లోను,ఊబర్లోను వెళ్ళే అవసరంరాదు, ఎందుకంటే ఇల్లు మీ ఆఫీస్ కు వాకబుల్ డిస్టెన్స్ లోనే వుంటుంది.ఆలోచించుకో.లంచాల జీవితం లో అనుక్షణం భయంతో చస్తూ బ్రతుకుతావో..సామాన్య జీవితంతో ప్రశాంతం గా జీవిస్తావో? స్నేహితుడివి కాబట్టి నాకు తోచిన,నేను అనుసరిస్తున్న దారి చూపించాను.నేను లంచాలు తీసుకొని చాలా మందికి అన్యాయం చేసాను అన్న ఫీలింగ్ పోవాలంటే సమాజంలో ఆర్ధిక పరమైన యిబ్బందులతో బాధలు పడుతున్న అభాగ్యులు ఎందరో వున్నారు.చదువులు మానేసిన విద్యార్ధులను గుర్తించి సాయం చెయ్యి. నిరు పేదలకు అన్నదానం చెయ్యి .తర్వాత నిర్ణయం నీది.”
“అరేయ్ భాస్కర్!రాత్రినుండి మనసు మనసులో లేదు.పగలంతా ఆలోచించాను.పరష్కారం దొరకలేదు.ఇప్పుడు నీమాటలు వింటుంటే నాకు ఓపరిష్కారం దొరిన ఫీలింగ్ వస్తోంది.

నువ్వు చెప్పిందే చేస్తాను.”

హఠాత్తుగా లేచి భాస్కర్ ని హగ్ చేసుకొని హాయిగా నిట్టూర్చాడు చలపతి.

******

మరునాడు ట్రైన్ లో బయలుదేరిన తన కుటుంబానికి వీడ్కోలు చెపుతూ “నేను వచ్చేవారంలో వస్తాను.ముందు లాంగ్ లీవ్ సేంక్షన్ చేయించుకొని..పేపర్ బిల్,పాలబిల్ వగైరా కట్టేసి వచ్చేస్తాను.”

నాంపల్లి స్టేషన్ నుండి బయలుదేరిన ట్రైన్ కదలగానే..తేలిక పడిన మనసుతో, దృఢ నిర్ణయంతో తన యింటి వైపుకు అడుగులు వేసాడు చలపతి.

“అభినందనలు చలపతీ!ప్రపంచంలో చివరకు జయించేది న్యాయము ,నీతి మాత్రమే.నువ్వు న్యాయాన్ని రక్షిస్తే న్యాయమే నిన్ను రక్షిస్తుంది. నీనిర్ణయానికి నేను తోడూ నీడగా వుంటాను.” నిజాయితీ మేఘం చలపతి అంతరాత్మను శ్లాఘించింది.

****

“నడక మొదలయ్యేది ఒక్క అడుగుతోనే”“మనసు మారేది చిన్న ఆలోచనతోనే”

“మనిషి మారేది ఒక్క సంఘటనతోనే”

“ఉద్యమం మొదలయ్యేది ఒక వ్యక్తితోనే”.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న