కిక్కిరిసిన జనంతో కాంప్లెక్స్ లోకి వఛ్చి ఆగింది బస్.జనాన్ని తోసుకుంటూ బస్సెక్కాను.అదే ఆఖరి బస్.
మర్నాడే ఓ ఉద్యోగం ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.టైం చూసాను. రాత్రి పదయ్యంది. బస్ బయల్దేరింది. ప్రయాణీకులు కబుర్లలో పడ్డారు. నా ముందున్న సీట్లలో ఓ పదిమంది గల భక్త బృందం ఒకటి ఉంది.వారు దేవుని గురించి, ఆధ్యాత్మిక సంబంధ విషయాల గురించి చర్చించు కోసాగారు.
"దశరథ రాముడు జన్మించిన మాసం కావడంతో చైత్రం ధర్మ ప్రాశస్త్యాన్ని నొక్కి చెబుతుంది.ధర్మమున్న చోట జయం సిద్ధిస్తుంది.కనుక ప్రతి మానవుడు ధర్మంతో జీవించాలి, ధర్మాన్ని ఆచరించాలన్నదే శ్రీరామ చంద్రుని ఆదేశం" అన్నాడొకాయన.
"ఉదయం లేచింది మొదలు మళ్ళీ పడుకొనే వరకు అనునిత్యం ఎవరికీ అపకారం చేయకుండా ఉండే శక్తినీ, ఉన్నంతలో ఎదుటివాడికి సహాయ పడే సద్బుద్ధినీ ప్రసాదించాల్సిందిగా నిండు మనస్సుతో కోరు కోవాలి. మనసా, వాచా అన్ని భారాలు భగవంతుని పైనే వేసి సత్కర్మలతో నడుచుకొన్నట్లైతే మాసమంతా అన్ని శుభఫలాలే చేకూరుతాయి" అన్నాడు భక్త జన బృందం లో మరొకాయన. క్రమంగా వారి చర్చ మానవులు-మానవత్వం పైకి మళ్లింది.
"ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడమే కదా మానవత్వం" అన్నాడు ఓ పెద్దాయన.
“ఔను...కష్ట కాలంలో మనిషిపై కరుణ చూపించేదే కదా మానవతా ధర్మం" అన్నాడు మరో పెద్దమనిషి. వాళ్ళ మాటలు వింటూ చిన్నగా నవ్వుకున్నాను.మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉంది అనుకున్నాను.
జనాన్ని తోసుకుంటూ అతి కష్టంమ్మీద కండక్టర్ నా వద్దకు వచ్చాడు. ఊరిపేరు చెప్పాను. టిక్కెట్ కొట్టాడు. పర్స్ కోసం ఫేంట్ జేబు తడిమాను.
నా గుండె గుభిల్లుమంది!
నా పర్స్ లేదు!
ఎవరో కొట్టేసారు.పిచ్చోడిలా జేబులన్నీ వెతుక్కున్నాను.కానీ పర్స్ కనిపించలేదు.
కండక్టర్ డబ్బులు తీయమని తొందర పెడుతున్నాడు.నాకు ముచ్చెమటలు పోశాయి.
"సర్, నా పర్స్.. డబ్బులు.." అంటూ నీళ్లు నమిలేను..
అంతే..కండక్టర్ అంతెత్తున లేచాడు.
"ఏమయ్యా, పర్స్ లేదంటావు. ఎవరో కొట్టేశారంటావు అంతేనా" అన్నాడు వ్యంగ్యంగా.
"అవును సర్" అన్నాను మెల్లగా.
“చూడయ్యా! రోజూ ఈ బస్ లో నీలాంటి వాళ్ళు నాకు చాలామంది తగులుతూనే ఉoటారు.వాళ్లంతా చెప్పే మాటే ఇది.వెంటనే ఏదో ఒకటి చేసి టిక్కెట్ తీస్కో, లేదా బస్ దిగిపో! త్వరగా ఏదో ఒకటి తేల్చుకో" అంటూ ముందుకు పోయాడు కండక్టర్.
నాకు ఏం చెయ్యాలో తోచలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు.డబ్బులన్నీ పర్స్ లోనే ఉన్నాయి. బస్ లోని అందరి కేసి దీనంగా చూసాను. ఎవరూ నాకు సహాయం చేయడానికి ఇష్టపడలేదు. భక్త బృందం వారి కేసి చూసాను.
"ఏమయ్యా.. బస్ ఎక్కేటప్పుడే జేబులో పర్స్ ఉందో లేదో చూస్కో వద్దూ" అన్నాడు ఓ పెద్దాయన మందలింపుగా.
"అయినా ఈ కాలం కుర్రకారుకి నిర్లక్ష్యం ఎక్కువండీ" అన్నాడు మరో పెద్దమనిషి.
వాళ్లంతా మాటలతో సరి పెట్టారు కానీ ఎవరూ నాకు హెల్ప్ చేయలేదు.కండక్టర్ మళ్ళీ వచ్చాడు. అప్పటికే బస్ సగం గమ్యానికి చేరుకుంది. నా పరిస్థితంతా వివరించి చెప్పాను. అయినా అతడు నా మాట వినలేదు.
"నీ గురించి ఆలోచిస్తే నా ఉద్యోగం పోతుంది. నువ్వు వెంటనే బస్ దిగటం మంచిది" అన్నాడు కండక్టర్. ఎంత ప్రాధేయ పడి నా ఫలితం లేకపోయింది."హోల్డాన్" అన్నాడు కండక్టర్. బస్ ఆగింది.
"ఏయ్ మిస్టర్.. మీరు త్వరగా బస్ దిగితే మంచిది" అన్నాడు కండక్టర్. నాకు కళ్ల నీళ్ల పర్యంతమైంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బస్ దిగటానికే నిశ్చయించుకున్నాను. ఫుట్ బోర్డ్ రెండు స్టెప్స్ దిగాను. చివరి స్టెప్ దిగుతుండగా..
"ఆగు" అన్నాడు ఓ వ్యక్తి బస్ వెనక సీట్లో నుండి. ఆగాను.
అతడు జనాన్ని తోసుకుంటూ నా వద్దకు వచ్చాడు.
"కండక్టర్.. అతనికి టిక్కెట్టివ్వండి " అన్నాడు.
కండక్టర్ టిక్కెట్ కొట్టాడు. ఆ వ్యక్తి డబ్బులిచ్చాడు.
"రైట్.. రైట్.." చెప్పాడు కండక్టర్.
బస్ బయల్దేరింది.
నేను అతని వంక చూసాను.
నాకు ఆపదలో ఆపద్బాంధవుడి గా, అడక్కుండా వరాలిచ్చే దేవుడి గా కనిపించాడు.
"సర్, మీరు చేసిన సాయం నా జన్మలో మర్చిపోలేను. మీకు నా కృతఙ్ఞతలు ఎలా తెల్పుకోవాలో నాకు తెలియటం లేదు" అన్నాను ఉద్వేగంగా.అతడు నవ్వాడు.
కాసేపటికి నేను దిగాల్సిన ఊరొచ్చింది.
నేను బస్ దిగాను. చాలామంది ప్రయాణీకులు దిగుతున్నారు.
అతడు కిటికీ లోంచి తల బయటికి పెట్టాడు.కాసేపు అతడ్ని పొగడ్తలతో ముంచెత్తాను.
అన్నిటికీ అతడు నవ్వాడు.
బస్ బయల్దేరింది.అతడు వెంటనే ఏదో వస్తువు తీసి నా చేతిలో పెట్టాడు.
బస్ స్పీడoదుకొంది.ఆ వస్తువుని చూసి నిశ్చేష్టుడ్నయ్యాను. అది నేను పోగొట్టుకున్న నా పర్స్!
అంటే అతడు..?
అతడు నా పర్స్ కొట్టేశాడని అతనిపై నాకెంత మాత్రం కోపం రాలేదు.
అతడు జేబు దొంగే కావచ్చు.కానీ మానవత్వమున్న మంచి మనిషి!
మనుషుల్లో మానవత్వం గురించి గొప్పగా చెప్పే వాళ్ళ కంటే ఆపద సమయంలో ఆదుకున్న అతడే గొప్పవాడు.ఆపదలో దేవుడు! మెల్లగా నా అడుగులు ఊళ్లోకి దారి తీశాయి.
***