తల్లి మనసు - పద్మావతి దివాకర్ల

tallimanasu

అది చాలా జనసమర్ధంగల స్థలం. దగ్గరలోనే నాలుగు రోడ్ల కూడలి గల ట్రాఫిక్ పోస్ట్ ఉంది. మాధవ్ బైక్‌పై వెళ్తూ రెడ్‌సిగ్నల్ పడడంతో బైక్ ఆపాడు. అక్కడ లైన్‌క్లియర్ అవడానికి దాదాపు పదినిమిషాల నుండి పావుగంట వరకు సమయం పడుతుంది. రోడ్‌కి ఇరుపక్కలా బిచ్చమెత్తే వాళ్ళూ, రకరకాల వస్తువులు అమ్మేవాళ్ళూ కార్లు, బైకుపైన వెళ్ళేవాళ్ళని విసిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలని ఎత్తుకొని, వాళ్ళని చూపించి బిచ్చమడిగే వాళ్ళకి కొదవలేదు అలాంటి చోట. ఇలాంటి న్యూసెన్సంటే గొప్ప చిరాకు మాధవ్‌కి. అతని బైక్ వద్దకి కూడా ఇలాగే ఏవో వస్తువులు అమ్మకానికి పట్టుకొచ్చాడు ఓ వ్యక్తి. అతనిని నిరాకరించి యధాలాపంగా పక్కకి తిరిగి చూసిన మాధవ్‌దృష్టి దూరంగా ఒక కార్‌వద్ద ఓ చిన్నపిల్లని ఎత్తుకొని బిచ్చమెత్తుతున్నఒకామె మీద పడింది. తైల సంస్కారంలేని జుట్టు, చినిగిన దుస్తులతో దారిద్యానికి ప్రతినిధిలా ఉందామె. అయితే ఆమె చేతిలో ఉన్న పిల్ల మాత్రం మామూలు దుస్తులు వేసుకున్నా ముద్దొస్తూ చూపరుల దృష్టి ఆకర్షించేలా ఉంది. చూసిన వాళ్ళెవరికైనా ఆ పిల్ల బిచ్చగత్తె కూతురేనా అనిపించక మానదు.

మాధవ్ కి ఆ దృశ్యం చూడగానే వార్తా పత్రికలలో చూసే వార్తలు, టీవీల్లో వచ్చే కథనాలే గుర్తుకు రాసాగాయి. చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్ళని చూపించి బిచ్చమెత్తుకునే వార్తా కథనాలే గుర్తుకు రాసాగాయి ఆమెని చూస్తూంటే. వెంటనే బండిని ఓ పక్కకు తీసుకెళ్ళి పార్క్‌చేసి ఆ ఎదురుగా ఉన్న పోలీస్ పోస్ట్‌వద్దకు వెళ్ళి తన అనుమానం వ్యక్తం చేసాడు మాధవ్.

మాధవ్ అనుమానాన్ని నమ్మదగినదిగా అనిపించడంతో అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్ లాఠీ ఊపుకుంటూ అక్కడికి వచ్చాడు. పోలీస్‌ని చూడగానే అంతవరకూ ప్రయాణికుల్ని విసిగిస్తున్న కొంతమంది వెనక్కి తగ్గారు.

మాధవ్ చూపించిన ఆమెవైపు వెళ్ళి తన లాఠీ ఎత్తి చూపిస్తూ , "ఎయ్ఁ !... నిజం చెప్పు? ఎక్కణ్ణుంచి ఎత్తుకొచ్చావు ఈ పిల్లని?" బెదిరిస్తూ అడిగాడు అతను.

"నిజం బాబూ, ఇది నా బిడ్దే బాబు!" అంది బెదురు చూపులతో. ఆమె బెదురు చూపులు చూసేసరికి కానిస్టేబుల్ కి ఆమె పైన అనుమానం రెట్టింపైంది.

ఈ లోపున మాధవ్ తన ఆఫీస్‌కి టైమవుతోందంటూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు మిగిలిన సంగతి పోలీసులే చూసుకుంటారనుకుంటూ. ఉత్తమ పౌరుడిగా తనవంతు కర్తవ్యం నెరవేర్చానని అతను తృప్తి పడ్డాడు.

కానిస్టేబుల్ ఆమెని అలా అడగడం చూడగానే చాలామంది గుమిగూడారక్కడ. ఎవరికి తోచిన కామెంట్లు వాళ్ళు చేస్తున్నారు. "చిన్నపిల్లలని ఎత్తుకుపోయి వాళ్ళని చూపిస్తూ బిచ్చమెత్తుతున్నారు. ఎవరి బిడ్డో పాపం ఎత్తుకొచ్చింది" అన్నారొకరు.

"ఇంకా నయం! కొంతమందైతే ఎత్తుకొచ్చిన పిల్లల్ని దివ్యాంగులుగా మార్చి మరీ బిచ్చమెత్తుతారు, జాలిపడి జనం ఎక్కువ డబ్బులు బిచ్చం ఇస్తారని." తను విన్నది, తనకు తోచినది చెప్పాడొకడు.

"ఇలాంటి వాళ్ళని వదలకూడదు. కఠినంగా శిక్షించాలి." ఇంకొకడి సలహా. ఇలా అక్కడ గుమిగూడిన జనం రకరకాలుగా అనుకుంటున్నారు. "నీకిలా కాదు, మామూలుగా అడిగితే లాభలేదు! పద స్టేషన్‌కి!” అంటూ ఆమె చేతిల్లోంచి పాపని అందుకోబోయాడు.

అమె వదిలించుకోవడానికి పెనుగులాడుతోంది, "నిజంగా, సత్తెపెమానంగా నా బిడ్డే బాబు!' అని ఎంత మొత్తుకున్నా పోలీస్ కానిస్టేబుల్ వినకుండా ఆ పాపని దొరకబుచ్చుకున్నాడు.

అక్కడ జనం చోద్యం చూస్తున్నట్లు నిలబడ్డారు.

"పద స్టేషన్‌కి!" అంటూ లాఠీ అమె పైకెత్తి ఝుళిపించాడు. చుట్టూ నిలబడ్డ వారిని చెదరగొట్టి ముందుకి దారి తీసి ష్టేషన్ వైపు నడిచాడు. కానిస్టేబుల్ పాపని లాక్కెళ్ళడంతో ఆమె, 'నా బిడ్డ! నా బిడ్దని పట్టికెళ్ళిపోతున్నారో!" అంటూ ఆమె గోల చేయసాగింది. ఆమెని 'చుప్! నోరుమూసుకొని పద స్టేషన్‌కి" అంటూ ఆమెని అదిలించాడు. ఆ పక్కనే ఉన్న స్టేషన్‌లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్సిపెక్టర్‌కి సంగతి వివరించాడు.

అతనికి కూడా అందరికీ కలిగిన అనుమానమే కలిగింది. ఆ పాప ఆమె కూతురు కాదని ఎక్కణ్ణుంచో ఆమె దొంగలించి ఉండవచ్చన్న భావన కలిగింది. ఈ మధ్య ఇలా పిల్లల్ని దొంగతనంగా తీసుకుపోవడం చాలా చూసాడతను. అయితే ఎన్నిసార్లు ఆమెని అడిగినా ఒక్కటే సమాధానమిస్తోంది. తన కూతురే అని గట్టిగా చెపుతోంది. నమ్మకం మాత్రం చిక్కడంలేదు అతనికి.

క్షణంలో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. వార్తాపత్రికల విలేఖరులు, టి వి వాళ్ళు స్టేషన్ ముందు గుమిగూడారు. పోలీస్ అధికార్లు వద్దనుండి సమాచారం సేకరించి తమ తమ మసాలాలు జోడించి ఆ వార్తని తమ చానళ్ళలో ప్రసారం చేయసాగారు. వార్తాపత్రికలైతే తమ కథనాల్ని ప్రచురించడానికి సన్నహాలు చేయసాగాయి.

"అనుమాన పరిస్థితిలో లచ్చి అనబడే ఈమెని మేము అదుపులోకి తీసుకున్నాం. ఈమె వద్దనున్న రెండేళ్ళ పాపను ఎక్కణ్ణుంచి ఎత్తుకొచ్చిందో ఎంత అడిగినా చెప్పటం లేదు. ఎన్నిమార్లు ప్రశ్నించినా తన కూతురే అంటోంది. ఈ పాప గురించి ఎవరికైనా తెలిస్తే వెంటనే తమ పక్కనున్న పోలీస్ స్టేషన్లో తెలియపర్చవలెను. అంతవరకూ ఈ పాప శిశుసంక్షేమ శాఖవాళ్ల సంరక్షణలో ఉంటుంది. " అని ఇన్స్‌పెక్టర్ చెప్పింది టివిలో పదే పదే వస్తోంది.

ఆ సాయంకాలం టివిలో ఈ వార్తలు చూస్తున్న భార్య అనితకి చెపాడు మాధవ్, "ఇదిగో! నేను చెప్పానే ఆ బిచ్చగత్తే చిన్న పాపని ఎత్తుకొచ్చింది. నేనే చూసి పోలీస్‌కి చెప్పా."

"ఒకవేళ నిజంగా ఆ పిల్ల ఆమె కూతురేమో?" సందేహంగా అంది అనిత.

ఆమె మాటలకి ఒప్పుకోలేదు మాధవ్. "ఆ పిల్లని చూడు. ఎంత చాలాకీగా ఉందో, మరెంత బాగుందో. పాత, మురికిబట్టలు వేసినంతమాత్రాన ఏవరైనా తెలుసుకోలేరా ఏంటి? చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చి అడుక్కోవటం అలవాటైంది ఇలాంటి వాళ్ళకి. పాపం ఎక్కడనుంచి ఎత్తుకొచ్చిందో పాపని, కన్న తల్లితండ్రులెంత క్షోభ అనుభవిస్తున్నారో?" అన్నాడు మాధవ్.

"నిజమే! పాపం." అంది అనిత.

రెండు రోజుల తర్వాత టివిలో ఆ విషయమై మరో వార్త విన్నారు వాళ్ళు. బిచ్చగత్తె లచ్చే ఆ పాపని బస్‌స్టాండ్ ప్రాంతంలో అపహరించినట్లు ఒప్పుకుందని వార్త ప్రసారం చేసారు టివివాళ్ళు. ఆమె అలా ఒప్పుకోవడంతో, ఆమెని పోలీస్ రిమాండ్‌కి పంపి పాప తల్లితండ్రుల ఆచూకీ దొరికేవరకూ పాపని శిశుసంక్షేమవాళ్ళకి అప్పచెప్పారని ఆ వార్త సారాంశం.

ఓ ఆర్నెల్లతర్వాత బయటకి వచ్చిన లచ్చిని ఎరిగిన ముసలి బిచ్చగత్తె అడిగిందామెని, " ఏంటి లచ్చీ, నీ సొంత కూతురుని నీ బిడ్డ కాదని ఇచ్చేసావంట? ఈ మధ్యనే ఆ పాప తల్లితండ్రులెవరూ రాకపోవడంతో, పిల్లలులేని ఒక దంపతులు వారిని పెంచుకోవడానికి తీసుకెళ్ళారట! నీ బిడ్డని అలా ఎలా వదిలేసావు?" అడిగిందామె.

ముందు ఆమె కళ్ళు వర్షించినా, పాపని ఎవరో దత్తత తీసుకున్నారని విన్న ఆమె సంతోషించింది.

"ఏం చెప్పను అవ్వా! ఆమె నా బిడ్డే అంటే ఎవరూ వినకపోతిరి! ఆ తర్వాత నాను ఆలోచించినా! ఎలాగూ నా ఖర్మ ఇట్టా కాలిపోనాది. నా మావ పోయిన నాడే మేమూ పోకపోతిమి! మావ పోయిన తర్వాత వారం రోజులు ఏదేనా పని చేస్తానని చూసినా! ఏ పని దొరకలా! మరేం ఉపాయంలేక అడుక్కొనైనా మా ఆకలి తీర్చుకొని బతకాలనుకున్నా! ఈ లోన ఇలాగవడం మంచిదైంది. అదైనా నాతో ఇలాగే బతకాలి కదా! అందుకే ఆఖరికి నా బిడ్డ కాదన్నా! ఇలాగైనా దాన్నెవరైనా పెంచుకుంటే దాని జీవితమైనా బాగుపడతాది అనుకున్నా." బరువైన హృదయంతో అందామె.

ఆమె తల్లిమనసు అర్ధమై ముసలిది కూడా చలించింది.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న