మాట్లాడే బొమ్మ - దమ్మవళం శ్రీనివాస్

matlade bomma

“గుడ్ మార్నింగ్ సర్. విష్ణు గారంటే మీరేనా? నా పేరు వినాయకరావు” చెప్పాడు కుర్చీలో కూర్చుంటూ మొహం మీద తెచ్చి పెట్టుకున్న చిరునవ్వుతో. వచ్చిందెవరో, ఎందుకో, తేలిగ్గా అర్థమైంది విష్ణుకి. అది ఓ గవర్నమెంట్ కంపెనీలోని అకౌంట్స్ సెక్షన్. విష్ణు అక్కడ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు.

“నా బిల్లు కాస్త అర్జెంటుగా క్లియర్ చేసి పెట్టాలి సర్. చాలా ఇబ్బందిగా ఉంది. పేపర్స్ అన్నీ సక్రమంగా ఉన్నాయి. మీరే కాస్త సహాయం చేయాలి. మిగితాది నేను చూసుకుంటాను” చెప్పాడు వినాయకరావు తన పనికి లంచం ఎర వేస్తూ. తన గురించి వినాయకరావుకు ఏమీ తెలీదని అర్థం అయింది విష్ణుకు. కాస్త చిరాకుగా అనిపించినా, తన దూరపు బంధువు ద్వారా రావటంతో, ఏమీ అనలేక ఊరుకున్నాడు.
నిజాయతీకి మారు పేరు విష్ణు. తనకు సక్రమంగా వచ్చే సంపాదన తప్ప ఏదీ ఆశించడు. తన నిజాయితీ విషయంలో కాస్త గర్వంగా కూడా ఫీలవుతాడు.

“చూడండి వినాయకరావుగారు, మీ పని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాను. అయితే, అన్ని పేపర్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసి మీ బిల్లు క్లియర్ చేయాలంటే కాస్త టైం పడుతుంది”

“అలాగే సర్. మీరు ఈ పని ఊరికే చేయొద్దు. ఈ ఐదు వేలు ఉంచండి” అంటూ ఎవరికీ కనబడకుండా చాటుగా డబ్బు విష్ణు చేతిలో ఉంచబోయాడు వినాయకరావు.

“చూడండి సర్, అన్నీ సక్రమంగా ఉంటే, మీ బిల్లు పాస్ చేయటం నా డ్యూటీ. అందుకు మీరు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు” కాస్త కోపంగానే చెప్పాడు డబ్బును తాకకుండా.

“ఇది లంచం కాదు సర్. బహుమతి”

“ఇంకా నయం జీతం అనలేదు..” మనసులో అనుకొని, “ఇక మీరు వెళ్ళొచ్చు” చెప్పాడు విష్ణు మొహమాటం లేకుండా. మొహం మాడ్చుకొని వెళ్ళిపోయాడు వినాయకరావు.

పొద్దున్నే చచ్చు బేరం. త్వరగా పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళాలి. చిట్టితల్లిని షాపింగుకు తీసుకువెళ్ళాలి. రెండ్రోజుల్లో దాని పుట్టినరోజు. అప్పుడే ఎనిమిది నిండి తొమ్మిది వస్తున్నాయి దానికి. కొద్ది క్షణాలు ఆలోచనల్లో గడిపి పని మొదలుపెట్టాడు. చేసే పనిలో కూడా చాలా నిజాయితీగా ఉంటాడు విష్ణు. ఆఫీసుకు టైముకు రావటమే కాక, టీ కనీ, బ్రేక్ అనీ వృధా కబుర్లతో టైం వేస్ట్ చేయటం లాంటి వాటికి కూడా దూరంగా ఉంటాడు. అనుకూలవతి అయిన భార్య, ఒక్కగానొక్క కూతురు, ఆదాయానికి తగ్గ ఖర్చు. చక్కటి, చింతల్లేని కుటుంబం.
పని పూర్తి చేసి ఇంటికి తిరిగి వెళ్ళే ముందు, పొద్దున్న వచ్చిన వినాయకరావు ఫైల్ ఓసారి తిరగేసాడు కుతూహలంగా, అసలు విషయమేంటో చూద్దామని. ఏదో కాంట్రాక్టరు కంపెని. కాగితాలన్నీ సక్రమంగానే ఉన్నాయి. వెధవ ఈ మాత్రం దానికే ఐదు వేలు ఇవ్వబోయాడు. ఇలా కదూ గవర్నమెంట్ ఉద్యోగులకి లంచాలు అలవాటు చేసేది. ఫైలు మూసేసి ఇంటికి బయలుదేరాడు.

చిట్టితల్లి అంటే ప్రాణం విష్ణుకి. చిట్టితల్లికి కూడా తండ్రంటే ఎనలేని ప్రేమ. తండ్రికి కాస్త ఒంట్లో నలతగా ఉన్నా తట్టుకోలేదు. పక్కనే ఉండి సేవ చేస్తుంది. వయస్సుకి మించిన భాద్యత ఫీలవుతుంది.

సాయంత్రం చిట్టితల్లిని ఇంటికి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ కు తీసుకువెళ్ళాడు. తనకు కావలసిన బట్టలు, చెప్పులు కొనిపెట్టాడు. తరువాత, మాల్లో కొత్తగా తెరిచిన ఓ బొమ్మల షాపుకి తీసుకొని వెళ్ళాడు ఏదైనా మంచి బొమ్మ గిఫ్టుగా కొనిద్దామని. లోపలకి వెళ్ళాక తెలిసింది అక్కడకు వచ్చి తప్పు చేసానని. అది తన తాహతుకు మించిన దుకాణం. జనం కూడా అందుకే కాబోలు పెద్దగా లేరు. అన్నీ ఇంపోర్టెడ్ బొమ్మలు.

ఎదురుగా ఉన్న ఓ అందమైన రెండడుగుల ఆడపిల్ల బొమ్మ మీద పడ్డది చిట్టితల్లి దృష్టి. దానివైపే ఉత్సాహంగా చూస్తుంది. చూడగానే ఆకట్టుకునేలా ఉందది. జీవకళ ఉట్టిపడేలా కళ్ళు, ఒత్తైన ఎర్రని జుట్టు, అందమైన బ్లూ గౌను, బూట్లు.

“ఇది జపాన్ బొమ్మ సర్. కొత్తగా వచ్చింది. చక్కగా పెదాలు కదుపుతూ ఇంగ్లీషులో మాట్లాడుతుంది. ఎన్నో మంచి విషయాలు చెబుతుంది. ఒక్కసారి బాటరీ వేస్తే కనీసం మూడు నెలలు వస్తుంది. పిల్లలకి ఇంగ్లీషు భాష కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది...” చెప్పుకుంటూ పోతున్నాడు షాపువాడు.

అక్కడ నుంచి అర్జెంటుగా పారిపోవాలనుంది విష్ణుకి. ఈ బొమ్మను కొనడం తన వల్ల అయ్యే పని కాదు.

“ఎంత ఈ బొమ్మ?” అడిగాడు భయపడుతూనే.

“ఆరు వేలు సర్. ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది..” అదేదో అరవై అన్నట్టుగా చెప్పాడు.

ఆ..రు వే..లు. తన తాహతుకు ఎన్ని రెట్లు మించిందో కూడా చెప్పటం కష్టం..

“బావుంది. మళ్లీ వస్తాం” చెప్పాడు విష్ణు ఇంకోసారి ఈ చుట్టుపక్కలకి కూడా రాకూడదు అనుకుంటూ. అయితే మర్నాడు తను అదే బొమ్మను కొనటానికి షాపుకు తిరిగి రాబోతున్నాడని ఏ మాత్రం ఊహించలేదు.

చిట్టితల్లి చెయ్యి పట్టుకొని బయటకు వచ్చాక, కాస్త రిలీఫ్ గా ఫీలయ్యాడు. అయితే కూతురి మనస్సు మాత్రం ఆ మాట్లాడే బొమ్మ మీదే ఉందని గమనించాడు. షాపులోంచి బయటకు వస్తూకూడా తల వెనక్కు తిప్పి ఆ బొమ్మ వైపే చూసింది. అంతగా ఆకట్టుకుంది ఆ బొమ్మ.
అయితే మాటవరసకు కూడా తనకా బొమ్మ కొనిపెట్టమని అడగలేదు. దానికీ తెలుసు అది కొనివ్వటం తండ్రి వల్ల అయ్యేపని కాదు అని. అడిగి బాధపెట్టడం ఇష్టంలేక మౌనంగా ఊరుకుంది. వయస్సుకి మించిన జ్ఞానం దానికి. విష్ణు మనసంతా పాడయింది తన నిస్సహాయత తలచుకొని.

“ఈ దిక్కుమాలిన బొమ్మలు ఎందుకు తయారు చేస్తారో మన ప్రాణాలు తీయడానికి కాకపోతే..” కసిగా అనుకున్నాడు ఇంటికి తిరిగి వెళ్తూ.
మర్నాడు ఆఫీసులో కూడా ఇదే ఆలోచన. ఆ బొమ్మను కొనిస్తే చిట్టితల్లిలో కనిపించే పట్టరాని ఆనందం, ఉత్సాహం తను చూడలేకపోతున్నాడు. మొదటసారి తన ఆర్ధిక పరిస్థితి తలచుకుంటే దిగులేసింది. మనసంతా భారంగా అనిపించింది.

ఫోను మోగింది ఏదో తెలియని నెంబరు నుంచి. “హలో..” అన్నాడు ఫోన్ ఎత్తి చిరాకుగా. ఏ క్రెడిట్ కార్డో, పర్సనల్ లోనో అంటే మటుకు వాళ్ళ అంతు చూడాలనుకున్నాడు. లక్కీగా వాళ్ళెవరూ కాదు.

“సార్ నేను వినాయకరావును. నా విషయం కాస్త చూడండి సర్..”

“తప్పకుండా...” ఏదో ఆలోచిస్తూ జవాబిచ్చాడు విష్ణు.

ఫోను కట్టేసి ఆలోచనలో పడ్డాడు చేస్తున్న పని పక్కనబెట్టి. ఈ కాంట్రాక్టరుగాడి బిల్ క్లియర్ చేస్తే ఐదు వేలిస్తానన్నాడు. ఆ డబ్బుతో బొమ్మను కొనచ్చు. వాడు అడిగింది ఏ మాత్రం కష్టం లేని పని. కాస్త త్వరగా చేసిపెట్టమంటున్నాడు. అంతే. కాగితాలన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఈ ఒక్కసారికి వాడిచ్చే బహుమతి (లంచం కాదు) తీసుకుంటే ఏం? భూలోకం ఏమైనా ముక్కలవుతుందా? అంతరాత్మకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు విష్ణు.

“రేయ్ విష్ణు తప్పుగా ఆలోచిస్తున్నావ్! ఇలా మొదలుపెట్టే ఎంతో మంది లంచాలకు మరిగారు. నువ్వు నిజాయితీని నమ్ముకున్నావ్. అనవసరంగా పాడైపోకురా” అంతరాత్మ హెచ్చరించింది కంగారుగా.

తన చిట్టితల్లి మొహంలో కనబడే సంతోషం కోసం నిజాయితీ, వంకాయ్ అనుకుంటే కుదరదు. ఇంకొంత కాలం పొతే, బొమ్మలతో ఆడే వయస్సు దానికి ఉండదు. ఇంత చిన్న కోరిక తీర్చలేకపోతే ఇంకెందుకు ఈ జీవితం. తనేమీ నిజాయితీని పూర్తిగా వదులుకోవట్లేదు. కాస్త పక్కనబెడుతున్నాడు అంతే. పైగా, ఆ కాంట్రాక్టర్ వెధవ అడుగుతున్నది చాలా చిన్న విషయం. నెల రోజులు పట్టే పనిని కాస్త ముందుగా చేయమంటున్నాడు... ఇదేమీ దేశ ద్రోహం కాదు...తనెవరినీ హత్య చేయడంలేదు..

“ఒరేయ్ తప్పుడు వెధవ, నువ్వు చేస్తున్నది హత్యేరా.. నీలో ఉన్న నిజాయితీని దారుణంగా చంపేస్తున్నావు.. నిజయితీకి మించినది ఏదీ లేదురా. నువ్వు ఆలోచిస్తున్న పద్ధతి పూర్తిగా తప్పు, నిన్ను నువ్వు..” అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న అంతరాత్మను తొక్కిపెట్టాడు విష్ణు.

డబ్బు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. మొదటిసారి నిజాయితీని పక్కనబెడుతున్నాడు మరి. అంతరాత్మ తనని వేధించడం ఆపడంలేదు. తల పగిలిపోతుంది ఆలోచనలతో. ఏదో తెలియని విచారం. తను చేసే పని కరెక్టు కాదు అనిపించినా, కూతురి సంతోషం కోసం ఏదీ తప్పు కాదనిపిస్తుంది.

ఆలోచనలన్నీ బలవంతం మీద పక్కనబెట్టి, సాయంత్రం బొమ్మల షాపుకు వెళ్ళాడు. వినయకరావుకు ఫోన్ చేసి డబ్బు షాపు దగ్గరకు పంపమని ముందుగానే చెప్పాడు. మర్నాడు పుట్టినరోజు బహుమతిగా తను ఇచ్చే బొమ్మను చూసి చిట్టితల్లి మోహంలో కనిపించే ఆనందం తలచుకుంటే మనసు ఉత్సాహంగా ఉరకలేస్తుంది.

*********

“లంచం తీసుకుంటూ తేలిగ్గా పట్టుబడ్డ గవర్నమెంట్ ఉద్యోగి.. తెలివిగా ఉచ్చు వేసి పట్టుకున్న ఏసిబి అధికార్లు..” న్యూస్ పేపర్ చదువుతున్నాడు విష్ణు మర్నాడు ఉదయం నిద్ర లేచాక. గుండె ఒక్క క్షణం ఆగినట్టనిపించింది హెడ్ లైన్స్ చదవగానే. గబగబా వార్తంతా చదివాడు. ఏసిబి వాళ్ళు ఎవరో ఉద్యోగిని ట్రాప్ చేసి పట్టుకున్నారు. తన పరిస్థితి ఇలా ఎప్పుడైనా అయితే? ఆలోచనలో మునిగిపోయాడు. రాత్రంతా సరైన నిద్రలేదు. దిక్కుమాలిన ఆలోచనలు వేధించి నిద్ర లేకుండా చేసినయ్.

కిందటి రోజు జరిగినదంతా గుర్తుకు వచ్చింది. అంతా కలలా అనిపించింది. తనేనా అలాంటి తప్పుడు ఆలోచనలు చేసింది? ఎంత నిజాయితీగా ఉండేవాడు ఒకప్పుడు. ఎంత గర్వంగా ఫీలయ్యే వాడు తన నిజాయితీని చూసుకొని. తన పేరు కూడా ఇలాగే ఏదో ఒక రోజు పేపర్లో వస్తే? వినాయకరావు కూడా ఏసిబి మనిషయ్యుంటే? పెద్దయ్యాక చిట్టితల్లికి ఏనాడైనా జరిగిందంతా చెప్పగలడా? మాట్లాడే బొమ్మను కాసేపు తలచుకున్నాడు.. తన జీవితాన్ని మార్చేసిన బొమ్మ.. తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిన బొమ్మ.. కిందటి రోజు జరిగినదంతా మళ్ళీ గుర్తుకు తెచ్చుకున్నాడు.

*********

అక్రమ మార్గంలో డబ్బు సంపాదించి, అంతరాత్మను తాత్కాలికంగా ఓడించి, మాట్లాడే బొమ్మను కొనడానికి వెళ్ళాడు విష్ణు. తను చేసేది తప్పని చాలా స్పష్టంగా తెలిసినా, కూతురి సంతోషం కోసం నిజాయితీని పక్కనబెట్టాడు. షాపులోకి అడుగు పెట్టాడు బలవంతంగా. మనసంతా అలజడిగా ఉంది. అక్కడనుంచి వెళ్ళిపొమ్మనీ, డబ్బు తీసుకోవద్దనీ అంతరాత్మ గ్యాప్ లేకుండా వేధిస్తుంది ఓ పక్క. వినయకరావుకు కాల్ చేసి డబ్బు పంపొద్దని చెబుదామనుకున్నాడు ఎన్నోసార్లు. అయితే కూతురి సంతోషం ఆ పని చేయకుండా ఆపింది.
షాపులో ఎదురుగా ఉన్న బొమ్మను ఓ సారి చూసాడు. అమాయకంగా ఉందది. కోపం ముంచుకు వచ్చింది దాన్ని చూడగానే. ఇది కదూ తనని అక్రమ సంపాదనకి ఉసిగొల్పింది.. చచ్చు బొమ్మ.. కసిగా అనుకున్నాడు. అయితే, మరి కొన్ని క్షణాల్లో అదే బొమ్మ మీద తనకున్న అభిప్రాయం ఇంకో రకంగా మారబోతుందనీ ఏ మాత్రం ఊహించలేదు విష్ణు.

షాపువాడు విష్ణును చూడగానే గుర్తుపట్టాడు సంతోషంగా.

“రండి సర్.. మీరు ఈ బొమ్మను కొనటానికి వస్తారని నాకు ముందే తెలుసు.. మీ అమ్మాయికి బాగా నచ్చిందది..”

“తను లంచం తీసుకొని ఓ బలహీనుడిలా ఈ బొమ్మను కొనటానికి వస్తానని వీడికి ముందే తెలుసా?” మనసులో బాధగా అనుకొని బయటకు చిరునవ్వు నవ్వాడు విష్ణు. వినాయకరావు మనిషి డబ్బు తీసుకొని ఇంకా షాపుకు రాలేదు. ఇంకో ఐదు నిమిషాల్లో వస్తాడని మెసేజ్ వచ్చింది.

ఈ లోగా బొమ్మ సరిగ్గా పనిచేస్తుందని చూపడానికి కవర్ ఓపెన్ చేసి అందులో బాటరీ వేసాడు షాపువాడు. అప్పుడు నోరు తెరిచి మాట్లాడింది ఆ బొమ్మ! తీయని స్వరంతో ఇంగ్లీషులో అది చెప్పిన మాటకు అర్ధం..

“నిజాయితీకి మించిన ఆస్తి లేదు, ఆత్మవంచనకు మించిన ద్రోహం లేదు..”

అంతరాత్మ తనని లాగి పెట్టి మొహం మీద కొట్టినట్టుగా అయింది విష్ణుకు. నోట మాట రాలేదు ఓక్క క్షణం. తనేనా ఇంత దారుణమైన తప్పు చేయబోయింది? తను కూడా అందరిలా ఆత్మ వంచన చేసుకొని తప్పు చేయబోయాడు. క్షమించరాని తప్పు. లేదు. తను తప్పు ఇంకా చేయలేదు! తను బలహీనుడు కాదు! ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయకూడదు. క్షణంలో తేరుకొని, తను ఎప్పుడూ నమ్ముకున్న నిజాయితీని మళ్ళీ నమ్మాడు. అప్పటి దాకా అంతరాత్మతో భీకర యుద్ధం చేసినవాడు ఇక అలసిపోయి ఓటమిని ఒప్పేసుకున్నాడు. నిజాయితీ గెలిచింది. కాంట్రాక్టర్ దగ్గర డబ్బు తీసుకోవటం ముమ్మాటికీ తప్పేనని తెలిసొచ్చింది.

ఆ తరువాత అన్నీ వేగంగా, యాంత్రికంగా జరిగిపోయినయ్. బొమ్మను కొనకుండా బయటకు రావటం, వినయకరావుకు ఫోన్ చేసి డబ్బు వొద్దని చెప్పటం, ఇంటికి హడావిడిగా తిరిగి వెళ్ళటం.. అన్నీ. చెదరని నిజాయితీ వల్ల కలిగే శాశ్వత ఆనందం, అక్రమ సంపాదనతో వచ్చే తన కూతురి తాత్కాలిక సంతోషం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువని తెలిసొచ్చింది విష్ణుకు. చిట్టితల్లి పెద్దయ్యాక జరిగినది తెలుసుకొని తన నిజాయితీని చూసి గర్వపడాలి. మాట్లాడే బొమ్మకు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు.

*********
“నాన్నా..” చిట్టితల్లి నిద్ర లేచి, ఆలోచనలో మునిగిపోయి ఉన్న తండ్రి దగ్గరకు వచ్చి తట్టి లేపింది ఉత్సాహంగా.క్షణంలో ఆలోచనల్లోంచి తేరుకున్నాడు విష్ణు. “హ్యాపీ బర్త్ డే చిట్టితల్లి..” సంతోషంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతూ చెప్పాడు.

“థాంక్స్ నాన్న.. త్వరగా రెడీ అవ్వు. గుడికి వెళ్ళాలి మనం..”

“అలాగే తల్లీ..” చెప్పి ఆనందంగా నవ్వాడు, అక్రమ మార్గంలో వెళ్ళకుండా తనని కాపాడిన మాట్లాడే బొమ్మకు మనస్సులోనే మరోసారి కృతఙ్ఞతలు చెబుతూ. అది చెప్పిన మాటలు మరోసారి గుర్తుకు తెచ్చుకున్నాడు గర్వంగా.

“నిజాయితీకి మించిన ఆస్తి లేదు... ఆత్మవంచనకు మించిన ద్రోహం లేదు”

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న