మనసా తుళ్ళి పడకే - కర్రా నాగలక్ష్మి

manasaa tullipadake

వారం రోజులుగా గాలీవానలు కలిసి వాతావరణాన్ని మైనెస్ డిగ్రీలతో వణికించి పారీసేయి . వీధి తలుపు తియ్యాలంటేనే భయపడేట్లు చేసేయి

వీధి లోకి వెళ్లలేక యింట్లో కాలునిలువక నేను అనుభవించిన బాధ నాకే తెలుసు . ' నాక్కూడా తెలసుగా ' అంది మనస్సు .ఎండపొడ వచ్చిందిగాని చలిగా వుంది . లాంగు కోటు వేసుకొని చెవులమీదుగా మఫ్లర్ చుట్టుకొని హడావుడి గా బయలుదేరబోతున్న నన్ను " యింతచలిలో వాకింగు అవుసరమా ? వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం " అన్న సహచరుడి మాటలు యింతకు ముందు గిలిగింతలు పెట్టేవి , కాని యివాళ అసహనం కలిగించేయి .

" రోజూ వాకింగు చెయ్యాలని డాక్టరు చెప్పేరుగా " అనే సమాధానంతో బయటపడ్డాను .సాయంత్రపు పలుచని యెండ ఒంటిని తాకి యేదో హాయిని కలుగజేసింది .పెద్ద సూర్యబింబం పశ్చిమదిశకి ఒరుగుతూ స్వాగతం పలికింది . అనుకోకుండా ఆదిత్యహృదయం చదువుకోడం మొదలు పెట్టేను . అల్లంత దూరంలో జోగర్స్ పార్క్ కనిపించగానే కళ్లు వెతుకులాట ప్రారంభించేయి .

యాంత్రికంగా నడుస్తున్నానన్నమాటే కాని కళ్లు వెతుకుతునే వున్నాయి . నలుగురైదుగురు కుక్కలను తిప్పడానికి తెచ్చేరు , వాళ్లని కాదు నా కళ్లు వెతుకుతున్నది . ఒక రౌండు పూర్తిచేసి , అలసటగా బెంచి మీద కూర్చొని కొద్ది రోజులలో మాయింటికి రాబోయే పాపడికోసం స్వెట్టర్ అల్లసాగేను . అలవాటయిన పని యాంత్రికంగా చేతులు చేసుకు పోతున్నాయి . కళ్లు మాత్రం వెతుకులాట మానలేదు . సన్నగా చీకట్లు ముసురుతున్నాయి నిరాశా నిస్పృహ లకు గురైన మనసుని బుజ్జగించే ప్రయత్నం చేసేను .

వెంటనే మనస్సు యెదురు తిరిగింది . " ఎదురు చూస్తున్నది నువ్వు , నేను కాదు , నేల విడిచి సాము కూడదు సుమా ! , సమాజం కట్టుబాటులు మరిచేవా ? " నిలదీసింది మనస్సు .

అతని వోరచూపు నా యెదలో ముల్లై గుచ్చుకుంటోంది , ఈ సమాజం నాకేమిచ్చిందని నేను సమాజం గురించి భయపడాలి , ఒక్కసారి జీవితంలో నాకునచ్చినట్లు వుండాలనుకోవడం తప్పా ? .

నా ప్రశ్న కి తనదగ్గర సమాధానం లేదో యేమో చాలా సేపు మౌనంగా వూరుకుంది .

" నీది వన్ సైడ్ లవ్వేమో "

ఊ హూ యెంత మాత్రం కాదు , నేను అతని వైపు చూడగానే చటుక్కున మరోవైపుకి చూసే ఆ కళ్ళే చెప్తున్నాయి , నేనంటే అతనికి యెంత యిష్టమో ? .

"మరయితే యింతవరకు రాలేదెందుకనో "

ఏవో బిజినెస్ పనులలో మునిగి పోవడం వలన రాలేక పోయేడేమో ?

" బిజినెస్ పనులేనని అంత గట్టిగా చెప్తున్నావు , నీ కెలా తెలుసు " నిలదీసింది మనసు .

" రోజుకో రకం కారులో రావటంలే ఉద్యోగాలు చేసుకొనే వారికి అది సాధ్యమా ? " కోపంగా అన్నాను .

"ఓహో నీది కారు లవ్వాయణమా ? "

" చుప్ నోర్ముయ్ అతన్ని చూడగానే నాయెద ఝల్లు మనలే అది నీకు మాత్రం తెలీదూ ? "

" యిదేమాట నీ భర్తని మొదటి మారు పెళ్ళి పీటల మీద చూసినప్పుడు కూడా కలిగిందన్నావు మరిచిపోయేవా ? "

యెప్పటెప్పటివో జ్ఞాపకం పెట్టుకుంటుంది యీ బుద్ది లేని మనసు అలుసిస్తే యింకా యేమేమి గుర్తుచేస్తుందో అని భయమేసి దాని నోరు నొక్కి అవతలకి పొమ్మన్నా .

చిన్నగా ఆకాశంలో చిరు చీకట్లు కమ్ము కుంటున్నాయి . చల్లగాలి శరీరాన్ని వణికిస్తోంది . ఇంక అతడు రాడు అనుకుంటూ లేవబోతున్న నాకు అల్లంత దూరం లో చెట్టు చాటు నుంచి చూస్తున్న అతను కనిపించేడు .

ఎప్పటిలాగానే నా చూపులు అతనిపై పడగానే చూపులు మరో పక్కకు తిప్పు కున్నాడు .

నేనంటే అతనికి యింట్రష్టు వుందో లేదో మరోమారు పరీక్షించి నా పిచ్చి మనసుకు స్వాంతన కలిగించాలని అనుకున్నాను .

అంతే కూర్చున్న చోటు నుంచి లేచి పార్క్ లో నడవ సాగేను . అతను నా వెనుక రావడం నాకెంతో నచ్చింది . వెంటనే యీ చిన్ని విషయం యిన్నేళ్ళుగా నా సుఖదుఃఖాలలో పాలుపంచుకొనే నా మనసుతో పంచుకోకుండా వుండలేక పోయేను .

" ఈ వయసులో యిలాంటి ఆలోచనలేంటి నీకు , ఈ సోకాల్డ్ ప్రేమాయణం ముదిరి పాకాన పడితే నీ భర్తకి విడాకులిచ్చి యితనితో వెళ్ళి పోతావా ? , నీ కంటే చిన్నవాడిలా లేడూ " కోపంగా అరిచింది మనసు .

" ఇంకా అవేవి ఆలోచించలేదు గాని , కుళ్ళబోతు మాటలు మాట్లాడక కాస్త నోరు మూసుకుంటావా ? " .

" నీకు కొత్త ప్రేమ ముందు వయసు వావి యేమాత్రం కనబడటం లేదన్న మాట " .

" కాస్త ఆగు నా పడమట సంధ్యా రాగం హీరోని కళ్ళారా చూసుకోనీ "

" పడమట సంధ్యా రాగం అన్న మాట నీకు మరో అర్ధాన్ని యివ్వటం లే " అంది కోతి మనసు .

" రెండుచేతులూ జేబులో పెట్టుకు నడిచే ఆ స్టైల్ నాకెంతో యిష్టం , చనువిస్తే చాలు యిలా వాగుతూనే వుంటుంది వినడం మానేస్తే పోలా , మనసుని ఓ మూలకు నెట్టేసి పార్క్ లో నడవసాగేను . నేను ముందు అతను వెనుక . అసంతృప్తి గా అనిపించింది . ఇద్దరం కలసి నడిచే రోజొస్తుందా ? రాదని వివేకం చెప్తోంది , రావాలని పిడికెడంత గుండె కోరుకుంటోంది . అందుకే నడక ఆపి లాను లో చతికిలబడ్డా .

ఓర కంట నన్ను చూస్తూ నడవసాగేడు అతను .

జేబులో చేతులు పెట్టుకొని నడుస్తున్న అతను నా వైపు రాసాగేడు .

నా గుండె దడదడా కొట్టుకోవడం మొదలు పెట్టింది . నుదుటి మీదా , మెడ కిందన చిరు చమట్లు పోస్తున్నాయు . ఇంత వరకు మనసుకే తెలిసిన విషయం పెదవుల పైకి వస్తుందా ? , ఒక వేళ వస్తే తన సమాధానం యేమిటి ? ఎప్పుడూ ఆలోచించలేదే ?

అతను దగ్గరయేసరికి అసంకల్పితంగా లేచి నిలబడ్డాను .

" హాయ్ ణమస్టే యూ యిండియా " అంటూ నా చేతిని తన చేతితో వత్తుతున్న ఆరున్నర అడుగుల నా కలల హీరో వెచ్చని స్పర్శ నా శరీరమంతా పాకి నన్ను యేవేవో లోకాలకు యెగరేసుకు పోయింది . లీలగా మాటలు తడుముకుంటూ నేను చెప్పిన సమాధానం గాని నా పేరు గాని గుర్తులేవు , కాని అతని పేరు ఫ్రిల్ అని మాత్రం గుర్తుంది .

యింటికి యెలా చేరేనో , భోజనం యెలా ముగించేనో గుర్తులేదు . పక్కమీదికి చేరేక నిద్ర పట్టని నన్ను " ఏమిటా మైమరపు అని " మనసు పలకరించంది .

" నిజం ...... మైమరపే ఎప్పుడూ యిలాంటి అనుభూతి కలగలే , అతని స్పర్శ వల్ల కలిగిన పులకంత నా తనువుంతా నిండిపోయింది చూడు , అతని కర స్పర్శ కోసం మనస్సు తహతహ లాడుతోంది . నన్ను ఈ సమాజం వెలివేసినా సరే , ఒక్క రోజు .... ఒక్క రోజైనా నా కోసం నేను జీవించాలి . ప్రతి మనిషికి తన జీవిత కాలంలోంచి ఒక్క రోజుని తనకిష్టం వచ్చినట్లు గడిపే హక్కు లేదా ? అలా గడిపితే తప్పా ? మన చేతి పాలు తాగి బలిసిన యీ సమాజం మనలనే కాటేస్తుందా ? " నాలో చెలరేగుతున్న భావోగ్వేదాన్ని అరికట్టలేక వుక్రోషపడ్డాను .

చీరల లోంచి జీన్సు , టీ షర్టులలోకి మారినప్పుడు నోరు మెదపని మనసు యిప్పుడు యెందుకు యెదురు తిరుగుతోందో నాకు యెంత మాత్రం అర్ధం కాలేదు .

మొదటి చూపులో కలిగిన ప్రేమ , మొదటి సారి తాకిన పురుష స్పర్శ అన్నీ నీ భర్త వల్ల అని అన్నట్లు గుర్తు , నీ ఆలోచనలు తప్పుదోవ పడుతున్నాయి , పనికి రాని ఆలోచనలని పెరగనివ్వకు , కాలక్షేపం కోసం అంటూ సామాన్యుడి జీవీతాలలోకి దూసుకు వచ్చి నట్టింట్లో తిష్టవేసిన టీవీ సీరియళ్లని అనుకరించాలని ప్రయత్నించకు , అవి నిన్ను అగాధం లోకి నెట్టెస్తాయి , నీ మనసుకి కమ్మిన మోహపు పొరలను తొలగించి చూడు నీ మనసేంటో నీకు అర్ధమౌతుంది , చేతిలోని స్వర్గాన్ని చెయ్యజారనీకు అంది మనసు .

నా జాగాలో మరొకరుంటే వారి రియేక్షను యెలావుండేదోగాని యిప్పడు మాత్రం నేనేమీ ఆలోచించ దలచుకోలేదు . ఒక్కసారి కనీసం ఒక్కసారైనా జీవితంలో నా మనసుకి నచ్చినట్లు వుందామని అనిపిస్తోంది . తప్పోవొప్పో నాకనవసరం యెవ్వరిమాటా వినదలుచుకోలేదు , యేమో జీవితం యీ మలుపులో అదృష్టం కాచుకొని వుందేమో ? వ్యర్ధపు ఆలోచనలతో కాలయాపన చేస్తున్నానేమో ? ఇన్నాళ్లూ నా కోరికలకు కళ్లేలు వేసి అందరి అవుసరాలకీ ప్రాముఖ్యతనిచ్చి , నా మనసుని చంపుకొని బతకేను , యీ దేశం లో యివేవీ తప్పుకావు , యిష్టమొచ్చినట్లు బ్రతకొచ్చు , ఒప్పు తప్పు , పాపం పుణ్యం మన్ను మషాణం అని స్పీచులిచ్చేవారెవరూ లేరు యేమంటావ్ నా మనసుని ప్రశ్నించేను .

ఎందుకు మైనం వహించింది , జవాబు వెతుక్కుంటోదేమో ? నా ఆలోచనలలో మునిగి పోయేను .

ఎదురుగా రంగులహరివిల్లు , దానిపైకి గబగబా యెక్కేను , అవతల వైపున అంతా రంగుల ప్రపంచం , తెల్లని దుస్తులు ధరించి చప్పుడు కాకుండా గాలిలో తేలుతున్నట్లుగా తిరుగు తున్న ఆడా ్గా మనుష్యులు , చేతులు జాపి పిలుస్తున్నారు , నాకూ అలాంటి దుస్థులే ధరించి తిరగాలని వుంది . ఇలాంటి అవకాశం మళ్లీ వస్తుందో రాదో , యిప్పడే దాన్ని అందుకోవాలి . ' ఆ ... ఆ ...వస్తున్నా............ వస్తున్నా....

' పోగాలము దాపురించిన వారు మంచిమాటలు వినరు ' సరే నీఖర్మ యెలావుంటే అలాగే జరగనీ , యికపైన నా అవసరం నీకు వున్నట్లు లేదు , బై " మనసు నా నుంచి శలవు తీసుకుంది .

నిద్రరాని నాలో యేవేవో ఆలోచనలు ,

మరునాడు కొత్త వుత్సాహం తో రోజు ప్రారంభించేను . కాలం ఆగిపోయినట్లుగా వుంది , యెప్పటికీ సాయంత్రమవదే ? .

యెండ పొడ వుండగానే పార్క్ కి వెళ్ళి చీకట్లు ముసిరే వేళ యింటికి తిరిగి రాసాగేను .

మా యిద్దరి పరిచయం " హాయ్ హవార్యూ " నుంచి ముందుకు కదలటం లేదు . యెలా ముందుకు కదపాలో కూడా తెలియని అయోమయం . ఆ అయోమయం లోనే మరో మూడు నెలలలో రాబోయే బుజ్జి అతిధి కోసం అల్లుతున్న స్వెట్టర్ , మేజోళ్ళు , టోపి పూర్తి చేసేను .

ఇంట్లో యే పని మీదా మనసు నిలవటం లేదు . అతని ధ్యానం లో వున్న నాకు నిద్రాహరాలు కరువయ్యాయి . అది నా ఆరోగ్యం మీద ప్రభావం చూపించ సాగింది . నిద్ర రాక పక్క మీద మసలు తున్న వేళ భర్త " అనీజీగా వుందా , ఆయాస మనిపిస్తోందా ? ఈ చలిలో వాకింగు వద్దంటే వినవు కదా ? నీళ్ళు వేడి చేసి యివ్వనా ? అని కేరింగు గా అడుగుతుంటే గిల్టీ గా ఫీలవ్వడం తప్ప యేమి చెయ్యలేక పోయేను .

ఒక రోజు ఆడుకుంటున్న పిల్లలని తీసుకొని పెద్దలు వెళ్ళిపోసాగేరు , అంతవరకు అతని కోసం యెదురు చూసిన మనసు , కళ్ళు అలసిపోగా నిస్పృహ తో లేచిన నాకు పార్క్ గేటు లో అడుగు పెడుతున్న ఫ్రిల్ కనిపించేడు .

మనసులో యేదో ఆశ తిరిగి కూర్చొనేటట్లు చేసింది . నా వైపు పడుతున్న అతని ప్రతి అడుగు నాలో ఆశలు రేపు తున్నాయి . నేరుగా వచ్చి నా పక్కన కూర్చున్నాడు . నా గుండె వేగం మరింతగా పెరిగింది . రోజూ వాడే బిపి మాత్ర అరముక్క బదులు రెండు వేసుకోవాలేమో ? పక్కన కూర్చుంటేనే యింత యెగసి పడుతోంది పిడికిడంత పిచ్చి గుండె , అతని నోటివెంట " ఐ లౌ యు " అనే మూడు పదాలు వింటే ఆగి పోతుందేమో ?

" యు లుకింగ్ బ్యూతిఫుల్ , సెక్సీ టూ "

అదేం విచిత్రమో ' ధాంక్యూ ' అన్న మాట తప్ప మరో మాట రాదే .

అతని రెండు చేతులు నా వైపుకి చాచుతున్నాడు .

యేం చెయ్య బోతున్నాడు . నన్ను హత్తు కుంటాడా ?

ఒక్కసారి తెలివి తప్పుతున్నట్లు అనిపించింది .

' బొయ్య్ ' మని వినిపించిన శబ్దానికి యిద్దరం వులిక్కి పడ్డాం . తుళ్ళి బడ్డ ఫ్రిల్ గబగబా తలవంచుకొని వెళ్ళి పోయేడు.

పానకంలో పుడకల్లా అలా అరుచుకుంటూ గేటులోంచి లోపలకి వచ్చిన పిల్లలని చూస్తే నా ఆనందాన్ని హరించడానికి వచ్చిన పిల్ల రాక్షసుల్లా కనిపించేరు . అతనెప్పుడో మసక చీకటిలో కనుమరుగయేడు , నిరాశగా అనిపించింది .

సెక్సీ అనే మాట యెందుకో నచ్చలే ! పోనీలే యీ దేశంలో యిది మామూలే అని సమర్ధించు కున్నా యెక్కడో అసంతృప్తి .

ఇవాళ కాకపోతే రేపు అంతేగా , నేను వినాలని ఉవ్విళ్ళూరు తున్న మాట అతని నోటివెంట రావడానికి యింక యెంతో కాలం పట్టదు .గాలిలో తేలుతున్నట్టుగా నడుస్తూ యిల్లు చేరేను . అన్యమనస్కంగా పనులు పూర్తి చేసుకొని పక్క చేరగానే యిన్నాళ్ళుగా నా మీద అలిగిన నిద్రాదేవి వెంటనే కరుణించింది .

" ప్రియతమా రా .. నన్ను చేరుకో .... అందమయిన లోకాలకు తీసుకు వెళతా ..."

ఆ పిలుస్తున్నది యెవరు నా భర్తా ? కాదు .... కాదు .... గొంతు అలాగే వుంది కాని ఆ .... ఆకారం భర్తది కాదు .... మరెవరు ..... ఫ్రిల్ ... అవును నా కలల రాకుమారుడు ... నన్ను పిలుస్తున్నాడు . అతను యెగురుతున్నాడు యెలా .... ఓ ...రెక్కలున్నాయి మరి నాకో ... లేవే యెలా .... ?

" నా చెయ్యందుకో నేను తీసుకు వెళతా ... రా.... రా.... "

" వద్దు అందుకోకు రెక్కలు లేని నిన్ను యెంతదూరం లాగగలడు చెయ్యజారితే నీ బతుకు అధోగతే " యెవరో హెచ్చరిస్తున్నారు ...... యెవరు ... యెవరు ... యెవరో తెలియటంలేదు . ఆకారం లేని వాళ్ళ మాటలతో నాకేంటి ?

అతికష్టం మీద చెయ్యందుకున్నాను . అందమయిన లోకాలను తనివితీరా చూస్తూ పరవశించి పోతున్నాను . ఆ పరవశంలో నా చెయ్యి యెప్పుడు అతని చేతిలోంచి పట్టుతప్పిందో తెలిసేసరికి నేను అగాధంలో పడి పోతున్నాను .

అగాధంలో పడకుండా తప్పించుకోవాలి యెలా ? ........ , గట్టిగా రక్షించండి అంటే యెవరైనా చెయ్యందిస్తారేమో ? .... అరుద్దామంటే గొంతు పెగలదేం ........ , పోనీ గట్టిగాకేక పెట్టినా చాలు యెవరైనా వచ్చి రక్షిస్తారేమో ? ...... కెవ్వుమని అరుద్దామని చేసిన ప్రయత్నం విఫలమవడంతో గిలగిలా తన్నుకుంటున్న నా పై పడ్డ చల్లని స్పర్శ , " పీడ కలేమైనా వచ్చిందా ? " అని అడుగుతూ మంచి నీళ్ళు అందస్తున్న నా జీవితసహచరుడి ని చుట్టుకు పోయా . నీకు నేనున్నా అన్నట్టుగా వెన్ను నిమురుతున్న అతని చేతులలో యెంతో హాయిని , బతుకు మీద భరోసా ని పొందేను . ఆ భరోసా నాలో యిన్నాళ్ళుగా చెలరేగుతున్న ప్రశ్నలకి సమాధానం చూపింది . అలజడి రేపు తున్న ఆలోచనలు శాంతించగా ప్రశాంతంగా నిద్రపోయా .

ఇవాళటినుండి నాకోసం పార్క్ కి వెళుతున్నా , అతని తో పరిచయం హాయ్ బాయ్ కి పరిమితం చెయ్య బోతున్నాను . ఇవాళ యెందు చేతనో యింకా యెవరూ రాలేదు .

ఈ మధ్య మన జీవితాలలో పెద్ద పీట వేసుకు కూర్చున్న టీవీ ప్రభావానికి తను కూడా లోనయిందా ? తలాతోకాలేని లేని సీరియళ్ల ప్రభావం తనమీద కూడా పడిందా ? అయినా నూటయెనభై నిముషాల సినిమాని నూరేళ్ళ జీవితానికి అన్వయించుకోడం యెంతవరకు సబబు . అరగంట కాలక్షేపాలు అరవైయ్యేళ్ల బతుకును బుగ్గిపాలు చేసేవిగా వుండకూడదు . మూడు వేల యెపిసోడ్స్ తో ప్రజలచే విషాన్ని రంగరించి తాగించి ఆఖరు పదినిముషాలు విషం ఆరోగ్యానికి హానికరం అని చెప్పించినా ఫలితం ?....... శూన్యం .

తన లాంటి వారిమీదే యింతటి ప్రభావం చూపితే మరి నేటి యువత మాటేమిటి ? ..... ఊహించడానికి కూడా భయం వేసింది .

మన సంస్కృతికి , సాంప్రదాయాలకి పదే పదే మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను . నా అడుగులు తడబడ కుండా కల రూపంలో అడ్డుకున్నవి అవే కదా ? ఆలోచనలలో వున్న నాకు యెంత సమయం గడిచినదీ తెలియలేదు .

వెనుకనుంచి యేదో ముక్కును అదిమి పట్టటం తో వులిక్కి పడ్డాను . పెనుగులాడినా లాభం లేక పోయింది . స్పృహ తప్పేటప్పుడు మసక మసక గా కనిపించింది ఫ్రిల్ ముఖం .

" ఈ మధ్యన యిండియన్స్ వుండే ప్రాంతాలలో యిలా జరుగుతున్నాయట నాన్నగారూ , పోతే పోయేయి నగలు మళ్ళా చేయించు కోవచ్చు . అక్కడ రోజూ ఆడుకోడానికి వచ్చే పిల్లలు చెప్పబట్టి గాని లేకపోతే యీ చలిలో యింకొంచం సేపు అలా పడి వుంటే అమ్మ మనకి దక్కక పోను " అంటున్న కొడుకు మాటలతో తెలివి వచ్చిన నాకు పార్కులో జరిగిన విషయం లీలగా గుర్తుకొచ్చింది .

బలవంతంగా కళ్ళు తెరిచిన నాకు దిగులుగా నావైపు చూస్తున్న భర్త , ఆందోళన గా చూస్తున్న కొడుకు అతని పక్కనే వున్న నిండు గర్భిణి కోడలుని తృప్తి గా చూసుకొని యిలాంటి జాతి వజ్రాల విలువ తెలియక గాజు ముక్క వైపు ఆకర్షింప బడ్డ నా తెలివి తక్కువ తనానికి సిగ్గు పడి కళ్ళు మూసుకున్నాను .

" సిగ్గు పడడమే కాదు యింకెప్పుడూ వెర్రి మొర్రి సినిమాలు , సీరియళ్లు చూసి బుద్దిని భ్రష్టు పట్టించే వ్యామోహాలను దగ్గరకు రానీయకు తెలిసిందా ? " యెప్పుడొచ్చిందో యేమో నన్ను హెచ్చరించింది నా మనసు .

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న