సాఫ్ట్ వేర్ ఉద్యోగి - ఓట్ర ప్రకాష్ రావు

software udyogi

అద్విక్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. పట్టణంలోనే పుట్టి పెరిగాడు.ఇంతవరకు పల్లెటూరు ఎలా ఉంటుందో చూడలేదు .

ఉద్యోగంలో మొదటి నెల జీతం అందుకోగానే ఎక్కువ ధర గల సెల్ ఫోన్ కొన్నాడు. ఇంటికి వచ్చినా ఆఫీస్ పనితో ఎక్కువ సమయం…….. మిగిలినది వాట్స్ అప్ ,ఈ మెయిల్స్ ,పేస్ బుక్ లాంటి వాటితో గడపడానికే సరిపోయేది.

“ నా మనవడు ఇంతవరకు మా ఊరికి రాలేదని” ముక్కు చీదుకొంటూ మరీ చెప్పడం ప్రారంభించింది విజయ. ఇలాగే అయితే ఆ ముక్కు ఎక్కడ ఊడిపోతుందన్న భయం కొడుకు శ్రీవాత్సవకు కలిగింది.

అద్విక్ ను పిలచి అర్థమయ్యేలా ఉపదేశించాడుశ్రీవాత్సవ.

" నాన్నా మీరు చెప్పారని కాదు అమ్మమ్మమ ముక్కు క్షేమంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో వెళ్తున్నాను "అన్నాడు అద్విక్.

" ఎలాగూ వెళ్లాలని నిర్ణయించుకొన్నావు సంక్రాంతికి వెళ్ళవచ్చుగా "కొడుకు వైపు చూస్తూ అంది స్వాతి.

“అమ్మా, నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగి . నీవు అనుకొంటూనే లీవు పెట్టడం కుదరదు. సంక్రాంతి రోజు మాకు పని ఉందని చెప్పారు.”అన్నాడు అద్విక్

"బోగి పండుగకైనా వెళ్ళారా అసలు బోగిపండుగ మన తడుకు పేటలో ఎంతో గొప్పగా చేస్తారు. ఆభోగి మంటలు ఎంత ఉత్సాహంతో వేస్తారో ఒక సారి చూస్తే తెలుస్తుంది " అన్నాడు శ్రీవాత్సవ.

*** *** ***

అప్పుడే రెడ్ సిగ్నల్ పడగానే ట్రాఫిక్ నిలచిపోయింది . అద్విక్ సెల్ ఫోన్ నందు ఆఫీస్ వారు పంపుతున్న మెసేజెస్ చదువుతూ వాటికి సమాధానం ఇవ్వడంలో మునిగిపోయి రోడ్ దాటడం మరచి పోయాడు .అందరూ వెళ్తున్నా అద్విక్ అలాగే నిలబడి ఉండటం చూసిన ఒక వృద్ధుడు "బాబూనీవు కూడా రోడ్ దాటాలనుకొంటాను . నా చేతి కర్రను ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో నీ సెల్ ఫోన్ పని చూసుకో " అన్నాడు.

అతని ఆలోచనను అద్విక్ మెచ్చుకున్నాడు .అతని చేతి కర్రను ఒక చేత్తో పట్టుకొని ఆఫీస్ వారు పంపిన మెస్సేజ్ చదువుతూ రోడ్ దాటాడు.

ఈ దృశ్యాన్ని తడుకు పేట అబ్బాయి తన సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసి వెంటనే వాట్స్ అప్ ద్వారా పంపుతూ ‘సెల్ ఫోన్ పిచ్చి వాడికి వృద్ధుడి సహాయం’ అన్న కామెంట్ పెట్టి తడుకు పేట గ్రామంలో ఉన్న మిత్రులందరికీ పంపాడు. అద్విక్ తన గ్రామానికి వెళ్తున్నాడన్న సంగతి ఆ యువకుడికి తెలీదు.

*** *** ***

అద్విక్ మొదటి సారి తడుకు పేట గ్రామంలో ప్రవేశించాడు. అమ్మమ అంనందానికి అవధులు లేకపోయింది. మాటల మధ్యలో అమ్మమ్మ చూపించిన తన వీడియో చూసి ఉలిక్కి పడ్డాడు .

‘యమధర్మరాజు చిట్టా పుస్తకాలలో పొందుపరచిన సంఘటనలను ఆ వ్యక్తి యమలోకానికి వచ్చినప్పుడు మాత్రమే చెబుతారు.కానీ ఈ సెల్ ఫోన్ అలా కాదు. ఒక్కసారి వాట్స్ అప్ నందు ప్రవేశించిందంటే చాలామందికి తెలిసిపోతుంది. ఆ వీడియో వైరల్ అయిందంటే సమస్త లోకాలకు తెలిసి పోతుంది. ఇప్పుడు నా వీడియో వైరల్ అయింది ' బాధగా అనుకొన్నాడు అద్విక్ .

అద్విక్ ఇంతగా సెల్ ఫోన్ కు బానిసయ్యాడన్న దృశ్యం తలచుకొన్నప్పుడంతా విజయా కళ్ళు బైర్లు కమ్మినట్లనిపించసాగింది .నమ్మశక్యం కాలేదు ఇది కలా నిజమా అని తికమక పడసాగింది . ఆ వీడియో చూడగానే అద్విక్ ముఖం ముప్పై వంకర్లు తిరగడంచూసి నిజమన్న నిర్ణయానికి వచ్చి బాధ పడసాగింది విజయ.

"అద్విక్ , నా మనవడు చిలిపి పనులు సరదాగా చేయడం అలవాటు. ఆ వీడియో వైరల్ అయితే తప్పకుండా నా వాట్స్ అప్ లో వస్తుందని చెప్పాడు అంటూ ఈ ఊరిలో సెల్ ఫోన్ ఉన్న వారి చెవి దగ్గరకు వెళ్లి చెవి కొరుక్కుండా చెప్పాను.” లేని నవ్వును తెచ్చుకొంటూ అంది విజయ.

అమ్మమ్మ మాటలకు అద్విక్ తృప్తి పడ్డాడు. టింగ్ టింగ్ అన్న సెల్ ఫోన్ శబ్దం వినగానే ఆఫీస్ మెసేజి అయివుంటుందని సెల్ ఫోన్ తీసుకొన్నాడు.

*** *** ***

రాత్రంతా ఆఫీస్ పనితోనే గడిపాడు. ఉదయం మూడుగంటల కు విజయా వచ్చి "ఒరే, అద్విక్ భోగిమంటలు వెయ్యాలి "అంటూ పిలవడంతో అసహనంగా లేచాడు .ఇంట్లో గత నెల రోజులుగా భద్రపరచిన పాత బల్ల , పేపర్లు. బుట్టలు, చేటలు, తీసుకొని వచ్చి వెలిగించింది.

అంత పెద్ద బోగి మంటను చూడకుండా సెల్ ఫోన్ నందు మునిగిపోయిన మనవడి వైపు వెర్రిదానిలా చూడసాగింది .

మంటంతా ఆరాక తలయెత్తి "అమ్మమ్మ ఏంటి బోగి మంట వేయలేదా ...ఈ అగ్గి, బూడిద ఎలా వచ్చింది "అంటూ మనవడు అడగగానే పిచ్చిదానిలా వేగంగా పరుగెత్తి లోపలున్న కొత్త బల్ల , కొత్త చేట ,కొత్త పేపర్లు తీసుకొని వేగంగా వచ్చికోపంతో వేస్తుంటే ఆశ్చర్యంగా చూసాడు అద్విక్.

అమ్మమ్మ నందు ఇంతటి కోపాన్ని ఎన్నడూ చూడలేదు అనుకొంటూ బిక్కు బిక్కుమని చూడసాగాడు. ఒక్క సారిగా మంట పెద్దది కాగానే ఎదురు చూడని విధముగా అద్విక్ చేతిలోని సెల్ ఫోన్ తీసుకొని భోగిమంటల్లో వేసింది.

"నీవు ఇంతటి సెల్ ఫోన్ పిచ్చివాడివనుకోలేదు. నిన్న రాత్రి ఇంటికి వచ్చినప్పటినుండి గమనిస్తున్నాను ఒక్క నిమిషం కూడా వదలకుండా సెల్ ఫోన్ చూస్తూనే ఉన్నావు భోగిమంటల్లో పాత వస్తువులతో పాటు దెయ్యం పట్టిన వస్తువులను వేస్తారు. ఆ దెయ్యం పట్టిన సెల్ ఫోన్ ను బోగి మంటలో వేసాను." పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ అంది విజయ

"అమ్మమ్మా, నీ మీద ఒట్టు వేసి చెబుతున్నాను నీవనుకొన్నట్టు నేను సెల్ ఫోన్ బానిసను కాదు,రెండురోజులుగా నేను వాట్స్ అప్ ,పేస్ బుక్, ఈ మెయిల్స్, చూడలేదు. ఆఫీస్ వారు నాకు కొత్తగా ఇచ్చిన పదమూడు కోట్ల రూపాయల ప్రాజెక్టు పని మాత్రమే చేస్తున్నాను. నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగి....మా జీవితాలు ఇలాగే ఉంటుంది " దీనంగా చూస్తూ నీరసమైన గొంతుతో అన్నాడు అద్విక్.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న