‘చింటూ.... కళ్ళుమూసుకుని చేతులు జాపు..’ అన్నాడు చలపతి, తన రెండు చేతులని తన వెనకాల దాస్తూ.
ఇలా అన్న ప్రతి సారి, చింటూ ముఖం ఆనందం, ఉత్కంఠ తో వెలిగిపోతుంది. వెంటనే కళ్ళు మూసి చేతులు జాపాడు చింటు. చలపతి ఏదో తన చిన్న చిన్న చేతులమీద పెట్టాడు. అది చింటూకి చాలా తేలికగా అనిపించింది. కళ్ళు తెరవకముందే తనకి తెలుసు అది ఏంటో. అది తను ఎప్పటినుంచో కావాలనుకునే పెద్ద పతంగ్. ప్రతి సంక్రాంతికి చలపతి పతంగ్‍లని అమ్ముతూ ఉంటాడు. ఈ సారి పతంగ్‍లలో కొత్త మోడల్ వచ్చింది. అది పెద్దగా, రెండు రెక్కలతో, ఆకుపచ్చరంగులో.. ఉన్న పతంగ్ లలో అన్నిటికంటె అందంగా ముస్తాబయ్యుంది. చింటూ దానిని చూడగానే మనసు పారేసుకున్నాడు. ఎలాగైనా ఈ సారి తను ఆ పెద్ద పతంగ్‍నే ఎగరెయ్యాలనుకున్నాడు. అడుగుదామంటె, తన తండ్రిలానే చింటూకి కూడా మొహమాటం చాలా ఎక్కువ. అయినా అడగనవసరం లేదులే, చలపతి వెళ్ళే ముందు కచ్చితంగా తనకి ఆ పతంగ్ ఇస్తాడని తెలుసు.
మెల్లగా కళ్ళు తెరిచాడు. అది ఆ పెద్ద పతంగ్ కాదు. సాదా సీదా పేపర్ పతంగ్. వెంటనే తన ముఖంపైనున్న నవ్వు పోయింది. కాని తన తండ్రి అది గమనించేలోపే వెంటనే నవ్వి ప్రేమతో చలపతిని హత్తుకున్నాడు చింటూ.
‘చక్కగా ఎగరేస్కో నాన్న... సరేనా! జాగ్రత్త!’ అంటూ చలపతి తన దెగ్గరున్న పతంగ్‍లను అమ్మకానికి పెట్టడానికి ఆ ఊరి ఎగ్జిబిషన్ వైపు బయలదేరారు.
ఆ పెద్ద ఆకుపచ్చ రంగు పతంగ్‍ల మూట వైపు బాధగా చూస్తూ ఉండిపోయాడు చింటూ.
***
అప్పుడే తెచ్చిన గట్టి మాంజా దారం, పొడవాటి చక్రి, రెపరెపలాడుతూ ఎగిరే ఎర్రటి పతంగ్.
ఆ మాంజాతో పతంగ్‍కి సూత్రం కట్టి, అక్కడినుంచి చక్రీకి ఉన్న సాదా దారంతో ముడి వేసాడు గోపి. డాబా మీదకెల్లి ఎగరేసే ముందు ఆ పతంగ్‍ను తన ఇంట్లోని పూజ గది వైపు తీసుకెళ్ళి వినాయకుడి పాదాల ముందు పెట్టాడు.
రెండు చేతులో జోడించి, ‘గణేషా... ప్రతి సంవత్సరం నా పతంగ్ గాలిలోనే తెగిపోతుంది... అది చూసి నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాలి చేస్తారు. ఈ సారైనా నా పతంగ్ గెలిచేలా చూడు’ అని మనస్పూర్తిగా దణ్ణం పెట్టుకుని ఆ పతంగ్‍ను ఎగరవేయడానికి డాబా మీదకి తీసుకెళ్ళాడు గోపి.
***
ఎగ్జిబీషన్ చుట్టూ రంగు రంగుల పతంగ్‍లు, చక్రీ, మాంజాను కొనాడానికొచ్చిన పిల్లలు, షాపతనితో బేరమాడుతూ పెద్దలు.
వీటి మధ్యలోని ఓ షాపులో ఉన్నాడు చలపతి.
కళ్ళు తెరిచి చూడగానే ఆ పెద్ద ఆకుపచ్చ పతంగ్ లేదని గ్రహించిన వెంటనే ముఖంలోని నవ్వు పోవడం, అది చూసి తను ఎక్కడ బాధపడతాడేమోనని వెంటనె మళ్ళీ నవ్వడం చలపతి గమనించాడు. తనకి తెలుసు, చింటూ ఆ పెద్ద పతంగ్‍నే ఆశించాడని. కానీ ఏవీ చెయ్యలేని పరిస్థితి. తన సేఠు తన దగ్గరున్న ఆ పెద్ద పతంగ్‍లు అన్ని అమ్మిపెడితే పండగ కానుకగా పది వేలు ఎక్కువ ఇస్తానన్నాడు. పెద్ద పతంగు, ధరలో కూడా చాలా ఎక్కువ. అందుకే ఎక్కువ మంది కొనలేరు. కాని ఒకవేల గనకా అమ్మి పెడితే, తనకి పది వేలు వస్తాయి. కటిక పేదరికంలో ఉన్న చలపతికి పది వేలు చాలా పెద్ద సంఖ్యే. తను ఎంత పేదవాడంటే అ పెద్ద పతంగ్‍ను తను గాని కొంటే, తన కుటుంబం ఓ పదిహేను రోజులు రెండు పూటలు పస్తులుండాల్సొస్తుంది. సేఠుని ఆ ఒక్క పతంగ్ కోసం అడిగుండొచ్చు... కాని మొహమాటం!
అయిదు వందల పతంగ్‍లు ఒక దాని తర్వాత ఒకటి అమ్ముడుబోతూ ఉంటే చలపతి సంతోషించాలి... కాని చలపతి మాత్రం బాధ పడుతున్నాడు. తన షాపు దెగ్గరకొచ్చి ఆ ఆకుపచ్చ పతంగ్ కావాలని అడిగిన ప్రతి పిల్లాడి తల్లిదండ్రులు కొనిచ్చారు... చలపతి మాత్రం తన పిల్లాడికి ఇవ్వలేకపోయాడు.
499 అమ్ముడుబోయాయి... ఇంకొక్కటే మిగిలుంది.
‘శభాష్ చలపతి’, మెచ్చుకున్నాడు సేఠు, ‘ఇంక ఒక్కటి అమ్మిపెట్టు, పదివేలు ఇస్తాను!’
ఎందుకో, ఇప్పుడు పది వేలు చాలా తక్కువ అనిపించింది చలపతికి.... ఈ పతంగ్‍ను చింటూకి ఇస్తే, తన ముఖంపై వచ్చే ఆనందమే తనకి పదివేలనిపించింది. సేఠుని అడుగుదామని నిష్చయించుకున్నాడు చలపతి. కాని అప్పుడే ఓ చిన్నపిల్లవాడు ఆ ఆఖరి పతంగ్‍ను తన చేతులో తీసుకుని చలపతిని అది ‘ఎంత’ అని అడిగాడు.
***
అప్పుడే ఎగ్జిభిషన్ నుంచి పతంగ్ కొనుక్కుని ఇంటికొచ్చాడు భార్గవ్.
‘ఎంత అదృష్టం! చివరాఖరి పతంగ్ నాకే దొరికింది... ఈ ఊరంతటిలో ఇంత అందమైన పతంగ్ ఉండదేమొ!’ అనుకుంటు ఢాబా మీదకి బయలుదేరాడు.‘జాగ్రత్త నాన్న... అసలే మన డాబాకి పిట్ట గోడలేవీ లేవు..’ హెచ్చరించింది భార్గవ్ తల్లి.‘అబ్బా... ప్రతి సంవత్సరం ఎగరేస్తానమ్మా... నాకు అలవాటేలే!’ విసుగ్గా అన్నాడు భార్గవ్.
మరికొద్దిసేపట్లోనే ఆకాశం అంతా రంగులతో నిండిపోయింది.
భార్గవ్ ఎగరేసిన ఈ పతంగ్‍తో కనీసం ఓ పది పతంగ్‍ల ను తెంచేయలనుకున్నాడు. భార్గవ్‍కి అలా చెయడం చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం ఆ ఊరి మొత్తంలోకి అతి పెద్ద, ఆకర్షణీయమైన పతంగ్‍ను గాళ్ళో ఎగరేసి, చుట్టుపక్కల ఎగిరే పతంగ్‍లను తెంచేస్తాడు. ఎగరేసి అరగంట కూడా కాలేదు... అప్పుడే ఓ ఆరు పతంగ్‍లను తెంచేశాడు. సంతోషంతో ఎగిరి గంతులేసే భార్గవ్, తన కన్నును ఆకాశంలో ఎగిరే ఓ ఎర్ర పతంగ్ వైపు సారించాడు.
‘ఇప్పుడు తెగేది ఆ పతంగే!’, నవ్వాడు భార్గవ్.
***
గోపి ఇప్పటివరకు చక్కగానే తన ఎర్ర పతంగ్‍ను ఎగరవేశాడు కాని, ఇప్పుడే తన పతంగ్‍వైపు ఓ పెద్ద ఆకుపచ్చ పతంగ్ రావడం గమనించి భయపడ్డాడు.
ప్ర్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తన పతంగ్ తెగిపోతుందని అనుకున్నాడు. ఎలాగైనా జాగ్రత్తగా పేంచ్ వేయాలని, ఆ పెద్ద పతంగ్‍కి పేంచ్ వేశాడు గోపి.
***
ఐదు రెండువేల రూపాయిల కట్టతో ఇంటికొచ్చినా, చలపతి మొహాన చిరునవ్వు లేదు. చింటూని వెతుక్కుంటూ తను ఢాబా పైకి వెళ్ళాడు. చింటూ అప్పుడే తన పతంగ్‍కు దారం కడుతూ చూశాడు.చలపతి తన రెండు చేతులని వెనక పెట్టుకుని ఉండడం చూసి, చింటూ తనకోసం మళ్ళీ ఏదైనా తెచ్చాడేమోనని చలపతి వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళి, కళ్ళు మూసుకుని చేతులు జాపాడు.చలపతికి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.
***
తన పెద్ద పతంగ్‍తో సమానంగా ఆ చిన్న ఎర్ర పతంగ్ ఢీ కొనడం గమనించి భర్గావ్ ఆందోళన చెందాడు. భయంతో వెనక్కి-వెనక్కి అడుగులు వేస్తూ తను ఆ ఢాబా అంచు వరకూ వచ్చాడు. ఇంకొక్క అడుగు వెనక్కి వేస్తే భార్గవ్ మూడు అంతస్తులనుంచి కింద పడతాడు.
***
‘యాహూ!’, ఆ పెద్ద ఆకుపచ్చ పతంగ్ ను తన చిన్న ఎర్ర పతంగ్ తెంచడం గమనించిన గోపి గంతులేశాడు.
***
తన పతంగ్ తెగిపోవడం గమనించి, వెనకకి అడుగులెయ్యడం ఆపేశాడు భార్గవ్. నిరాశపడి మెడ వెనక్కి తిప్పి చూడగానే తను ఆ డాబా అంచున ఉండడం చూశాడు. వెంటనే భయపడి ముందుకు పరిగెత్తి కింద కూర్చుండిపోయాడు. ‘కొద్దిలో ఎంత ప్రమాదం తప్పింది!’ అనుకున్నాడు భార్గవ్.
***
ఆ తెగిపోయిన పెద్ద ఆకుపచ్చ పతంగ్ ఎగురుకుంటూ ఎగురుకుంటూ చింటూ జాపిన చేతిపై వాలడం చూసిన చలపతి ఆశ్చర్యపోయాడు.
తన కళ్ళు తెరిచి ఆ పతంగ్‍ను తను తన చేతుల్లో చూసిన చింటూ కూడా ఆశ్చర్యపోయాడు. ఆనందంతో చలపతి ని గట్టిగా హత్తుకున్నాడు.