ఆగని చక్రం - దమ్మవళం శ్రీనివాస్

aagani chakram

హాస్పిటల్లో మంచం మీద వెల్లికిలా పేషెంట్లా పడుకొని ఉండటం నాకు మహా చిరాకు. ఏం చేయాలో తోచకుండా పనీపాటా లేకుండా గోడల వైపు, మంచం వైపు చూడటం, అక్కడ పని చేసే నర్సులు పెద్ద అందంగా లేరే అని బాధపడటం, జూనియర్ డాక్టర్లు మధ్య మధ్యలో వచ్చి నా రోగం గురించి వచ్చీ రాని వైద్య భాషలో పెద్ద డాక్టర్లలా నటిస్తూ మాట్లాడుకోవటం, చుట్టు పక్కల రోగుల దగ్గు, అరుపులు, గావుకేకలు మొదలైనవి భరించటం నిజంగా నరకం. ఇలాంటి నరకం పగ రోగికి కూడా రాకూడదు.

నా పేరు జయరాం. కొత్తగా, ఈ మధ్యే ముసలితనం లోకి అడుగుపెట్టాను. నేను ప్రస్తుతం పరమ చిరాగ్గా గడుపుతూ ఉన్న హాస్పిటల్ పేరు వెల్కమ్ హాస్పిటల్స్. హాస్పిటల్ కి ఇదేం పేరని నవ్వుకునే వాడిని ఇంతకు ముందు అప్పుడప్పుడూ. ఇక్కడకు రావటం మొదలుపెట్టాక అర్ధమైంది, పేరు చెత్తగా ఉంది కానీ ఇది మంచి పేరున్న హాస్పిటల్ అని. ఎప్పుడూ రకరకాల రోగులతో, జబ్బులతో కళ కళలాడుతుంటుంది.
ఒంట్లో ఏ మాత్రం బాలేక పోయినా, నా ఏకైక సుపుత్రుడు విజయ్ నన్ను ఇక్కడకు తెచ్చి పడేస్తుంటాడు. ఖర్చు ఎంతైనా వెనకాడడు వెధవ. ఈ విషయంలో వాడికి నా పోలికే వచ్చిందని చాలా గర్వం నాకు. నేను కూడా మా నాన్న గారిని ఇలాగే చూసుకునేవాడిని. ఆయన ఆరోగ్యం కోసం ఎంత ఖర్చైనా పట్టించుకునే వాడ్ని కాదు. విజయ్ కి చాలా మటుకు నా పోలికలే వచ్చాయని సంబరపడ్డా, ఓ విషయంలో మాత్రం నా దారిలోనే నడుస్తున్న వాడ్ని చూస్తే చాలా దిగులుగా ఉంటుంది. ఎలా వాడికి అర్ధమయ్యేలా చెప్పేది వాడు చేస్తుంది తప్పు, తరువాత యమ తీరిగ్గా బాధ పడాల్సి వస్తుంది అని? మనసు ఎంతో భారంగా, అలవాటుగా మూలిగింది ఇంకేం చేయాలో తెలీక.

ఫోన్ మోగింది నాకిష్టమైన కొత్త సినిమా పాట రింగ్ టోన్ తో. విజయ్ దగ్గర నుంచి. పాట కాసేపు వినాలని ఉన్నా వెంటనే ఫోన్ ఎత్తాను వాడ్ని తలచుకొని.

“ఎలా ఉంది నాన్న ఇప్పుడు?”

“డాక్టర్ ఇంకా చెకప్ కి రాలేదు రా.. మీ అమ్మ కాంటీన్ కు వెళ్ళింది.. ” అంటూ ఇంకా ఏదో ఉత్సాహంగా చెప్పబోతున్న నన్ను మధ్యలోనే ఆపాడు విజయ్ విసుగ్గా.

“అబ్బా నాన్నా, అర్జెంటు పనిలో ఉన్నా.. నేను అడిగినదేంటి నువ్వు చెబుతున్నదేంటి? ఇప్పుడెలా ఉంది అని అడుగుతే, ఏదో చెబుతావు..”
“అదేరా, డాక్టర్ వస్తే రేపు డిశ్చార్జ్ చేస్తారో లేదో తెలుస్తుంది.. రేపే చేస్తారులే.. ఇవాళ నువ్వేమైనా..” ఇంకా మాట్లాడుతున్న నన్ను మళ్ళీ మధ్యలోనే ఆపాడు వెధవ.

“సర్లే నాన్న అయితే... ఇవాళ ఆఫీసులో కాస్త పనుంది. రేపు వస్తాను ఒకే సారి..” ఫోన్ పెట్టేసాడు కనీసం నా దగ్గర నుంచి రిప్లై కూడా ఆశించకుండా.

ఓ సారి నిట్టూర్చాను. ఎప్పుడూ విసుగే వీడికి. ఎప్పుడు తెలుసుకుంటాడు నాకు వాడితో ఇంకాసేపు కులాసాగా మాట్లాడాలని ఉందని. చిరాగ్గా ఒకటి రెండు ముక్కలు తప్ప ఇంకేమీ మాట్లాడడు. చాలా బాధగా అనిపించింది. అయితే, నా బాధకు కారణం నా కొడుకు విజయ్ కాదు. నా తండ్రి.

ఇలాంటప్పుడు ప్రతీసారీ నాకు మా నాన్న గుర్తుకువస్తాడు. ఆలోచనలో పడ్డాను అర్జెంటుగా. ఎంత గొప్ప మనిషి ఆయన నిజంగా. ఉన్నతమైన వ్యక్తిత్వం. గొప్ప అలవాట్లు. మంచి మనసు. ఈ మూడు లక్షణాలు ఒక మనిషిలో ఉండటం చాలా అరుదు. మంచి మనసుంటే, గొప్ప అలవాట్లు ఉండాలని లేదు. మంచి వ్యక్తిత్వం ఉంటే, మంచి మనసు ఉండాలని లేదు. మా నాన్నలో మాత్రం ఈ మూడు లక్షణాలు పోటాపోటీగా ఉండేవి. అయితే, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న మనిషి, నా విషయాలో చేసిన ఓ తప్పు ఆయన పోయాక, నేను ఎన్నో సంవత్సరాలు బాధ పడేలా చేసింది. ఆ బాధ నేను మళ్ళీ ఆయన దగ్గరకు పోయేదాకా నన్ను వెంటాడేలా ఉంది. ఆయన మీద కోపం ముంచుకొచ్చింది ఎప్పటిలాగే. నిజంగా నేను పోయాక పైకి వెళ్ళి ఆయన్ను కలవటమంటూ జరిగితే, కడిగిపారెయ్యాలి.

ఎక్కడ ఏ లోకలో ఉన్నావు నాన్న? ఎంతగా నిన్ను తలచుకుంటానో నాకు మాత్రమే తెలుసు. ఎలా సాధ్యపడింది నాన్న నీకు ఇన్ని గొప్ప లక్షణాలు అలవర్చుకోవటం? నాన్నను గురించి ఆలోచనలో పడితే, టైం చాలా వేగంగా దొర్లిపోతుంది.

ఎప్పుడు టైం దొరికినా ఏదో ఒక పుస్తకం పట్టుకొని వదలకుండా చదువుతూ ఉండేవారు నాన్న. నాకూ ఎన్నో సార్లు చెప్పారు మంచి పుస్తకాలు చదవటం మించిన గొప్ప అలవాటు ఇంకేమీ లేదని. నేనూ చదువుతాను కానీ, చదివినదేదీ పెద్దగా గుర్తుండదు. పైగా మా నాన్న చెప్పే ‘మంచి’ పుస్తకాలన్నీ యమ బోరుగా అనిపిస్తాయి నాకు. ఆయనకు బోరెందుకు కొట్టదో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. ఆయనకు పనిచేసినట్టు పుస్తకాలు నాకు ఏ మాత్రం పని చేయవని కాస్త ఆలస్యంగా అయినా మొత్తానికి అర్ధమైంది.

ఆయనకున్న తెలివితేటలు కూడా అద్భుతం. చెప్పదలచుకున్న విషయాన్ని అతి మామూలుగా కనిపించే ఉదాహరణతో చాలా తేలిగ్గా అర్ధమయ్యేలా చెబుతారు.

నాకు ముప్పై ఏళ్ళు అప్పుడు. నాన్న అప్పటికే ముసలితనంలో అడుగు పెట్టి చాలా కాలమైంది. ఇంటికి ఆఫీసు నుంచి ఓ అసిస్టెంట్ కుర్రాడొచ్చి ఇంటి పనేదో చేసిపెట్టాడు. నేనా కుర్రాడితో మాట్లాడటం అక్కడే ఉండి గమనించిన నాన్న, కుర్రాడు వెళ్ళిపోయాక నన్ను గట్టిగా చీవాట్లు పెట్టారు.

“రేయ్ జయరాం, నువ్వు ఎవరికైనా మర్యాద ఇచ్చేది వారి వెనకున్న ఆస్తిపాస్తులు, హోదా చూసేనా?” అడిగాడు నాన్న.“అదేంటి నాన్న అలా మాట్లాడతావు? నా సంగతి నీకు తెలీదా? డబ్బుకు, హోదాకు మాత్రమే మర్యాద ఇస్తానా నేనేమైనా?”“అవున్రా. అది నిరూపించడం చాలా తేలిక. ఆ కుర్రాడ్ని నువ్వు ‘నువ్వు’ అని ఎందుకు సంభోదిస్తున్నావ్?”“అదేంటి నాన్న, అంతా అలాగే గా పిలిచేది.. ఆఫీస్ అసిస్టెంట్ ని కూడా ‘మీరు’ అని పిలవాలా? ఎక్కడా ఇలాంటిది చూడలేదు” ఆశ్చర్యంగా చెప్పాను.

“ఒక్క ప్రశ్న. అదే కుర్రాడి ఆస్తి ఓ వంద కోట్లనుకో, అప్పుడు కూడా వాడ్ని ‘నువ్వు’ అనే సంభోదిస్తావా?” సూటిగా కళ్ళలోకి చూస్తూ అడిగాడు నాన్న.నివ్వెరపోవాటం నా వంతైంది. “లేదు నాన్న.. వాడి ఆస్తి వంద కోట్లయితే, ‘మీరు’ అనే పిలుస్తాను” నిజాయితీ గా చెప్పాను.
“ఇప్పుడు చెప్పు. నువ్వు మర్యాద ఇచ్చేది డబ్బుకేగా? ఆ కుర్రాడి దగ్గర డబ్బు లేదని మాత్రమే నువ్వు మర్యాద తక్కువ చేసావు. ఇది చాలా తప్పురా. ఒక్క విషయం గుర్తు పెట్టుకో. మనిషి గా పుట్టిన ప్రతీ వాడు మర్యాదకు అర్హుడే. డబ్బు, హోదా లేక ఎదురు చెప్పలేరన్న ఒక్క కారణం వల్ల ఎవరినీ మనం తక్కువగా చూడొద్దు. ఈ విషయంలో ప్రపంచమంతా ఒకలా ఉన్నా, నువ్వు మాత్రం వేరుగా ఉండాలిరా.. ఆ కుర్రాడి స్థానంలో నువ్వు ఉండి, నీకు ఎవరైనా మర్యాద ఇస్తూంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఆలోచించరా.. ఎందుకు ఉచితంగా ఇవ్వగలిగే అలాంటి సంతోషానికి వారిని దూరం చేస్తావ్?” బాధగా చెప్పాడు నాన్న.

ఇది జరిగాక, నా జీవితంలో ఎప్పుడూ ఏ బయట వ్యక్తిని నేను ‘నువ్వు’ అని సంభోదించలేదు. మొదట్లో అంతా ఆశ్చర్యపోయినా, నాలో వచ్చిన మార్పుకి నా చేత అప్పటిదాకా ‘నువ్వు’ అని పిలిపించుకున్న వారంతా చాలా సంతోషించారు. వారు నాకోసం చేసే పనిలో శ్రద్ధ, ఉత్సాహం పెరగటం కూడా గమనించాను.

ఇలాంటిదే మరో సంఘటన నా ఆలోచనా విధానాన్ని మొత్తంగా మార్చేసింది.

నాన్నకున్న గొప్ప అలవాటు దాన ధర్మాలు విరివిగా చేయటం. తన సంపాదనలో కొంత భాగం నిజాయితీగా పక్కనబెట్టి ఎంతో నిష్ఠగా దానాలకీ, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటానికీ ఉపయోగించే వారు.“నీకు భగవంతుడు మిగితా వారికన్నా ఎక్కువ డబ్బు, శక్తి ఇచ్చాడంటే, నిన్ను వారిపట్ల బాధ్యతగా ఉండమని చెప్పినట్టే.. ఎప్పుడూ ఈ విషయం మర్చిపోకు.. లేని వారికి సహాయం చేయటం అంటే, మనకు చక్కటి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి కృతఙ్ఞతలు చెప్పి ఆయన్ను సేవించటమే..” ఎప్పుడూ చెబుతూ ఉండేవారు నాన్న.
నాన్నలా కాకపోయినా, నేనూ అడపాదడపా దానాలు గట్రా చేసేవాడ్ని. ఓ సారి నా వల్ల చాలా సార్లు సహాయం పొందిన నా కింది ఉద్యోగి, నేను చిన్న సాయం అడిగితే మొహమాటం లేకుండా చేయలేనని చెప్పేసాడు. చాలా బాధేసింది నాకు. ఎందుకు మనుషులు ఇంత నీచంగా ఉంటారు. ఎన్ని సార్లు, నేను వాడికి హెల్ప్ చేశాను. ఎంత డబ్బు ఖర్చుపెట్టాను వాడి కోసం? ఆ మాత్రం కృతజ్ఞత లేదా వాడికి? ఆ రోజు సాయంత్రం నాన్న దగ్గర ఈ విషయం చెప్పాను ఎంతో బాధగా. సానుభూతితో ఆయన నన్ను అర్ధం చేసుకుంటారనుకున్నాను.
అయితే నాన్న చెప్పింది విని ఆశ్చర్యంతో నోట మాట రాలేదు నాకు. ఏ మాత్రం ఊహించలేనిది ఇది. ఆయనకీ నాకూ ఉన్న తేడా కూడా స్పష్టంగా అర్ధమైంది నాకు.

“జయరాం, కృతజ్ఞత చూపాల్సింది నువ్వురా, నీ వల్ల సాయం పొందిన వారు కాదు. ఎందుకో తెలుసా? వారికి సాయం చేయటం ద్వారా భగవంతుడ్ని సేవించుకునే భాగ్యం మనకు వారు కలుగజేసినందుకు. ఇప్పుడు చెప్పు ఎవరు ఎవరికి సాయం చేసారు? కృతజ్ఞత చూపాల్సింది ఎవరు ఎవరికి? అవసరంలో ఉన్న వారికి సాయం చేయగలగటం మన అదృష్టం. అలాంటి అదృష్టాన్ని మనకు కలిగించిన వారి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి..”

అప్పటిదాకా ఉన్న నా బాధంతా చేత్తో తీసేసినట్టుగా మాయమైంది. ఇతరులకు సహాయం చేయటం అనే కాన్సెప్ట్ ని ఇంత తేలిగ్గా, ఇంత అద్భుతంగా చెప్పటం నాన్న వల్ల మాత్రమే అయ్యే పని.

ఎదురుగా ఏదో చప్పుడు అవడంతో ఈ లోకంలోకి వచ్చాను. నాన్నను గురించి ఆలోచనలో పడితే ఈ లోకాన్నే మర్చిపోతాను.
హాస్పిటల్లో కాంపౌండర్ ఏదో వీల్ చైర్ తో కుస్తీ పడుతున్నాడు. చక్రం సరిగ్గా తిరుగుతున్నట్టు లేదు. కిందకు వంగి చూస్తున్నాడు. నేనూ ఆసక్తిగా చూసాను ఏమైందా అని. వీల్ చైర్ చక్రాన్ని చూడగానే, నాన్నను గురించిన ఆలోచనలు మళ్ళీ ఉధృతంగా మొదలయ్యాయి. “ఆగని చక్రం”.. గుర్తుకు వచ్చింది.

ఎన్నో విషయాల్లో ఎంతో ఉన్నతంగా ఆలోచించే నాన్న, నాకు ఓ విషయంలో చాలా అన్యాయం చేసాడనిపించింది. ఎందుకు నాన్న ఇలా చేసావ్? బాధగా ఆలోచనలు గతంలోకి జరుకున్నాయి నేరుగా. యౌవనంలోంచి మధ్య వయసు వాడిగా మారే కాలం చాలా వేగంగా గడిచిపోతుంది. ఆ కాలంలోనే ఉద్యోగంలో యమ బిజీగా మారిపోవటం, విజయ్ పుట్టడం, జీవతంలో విసుగూ, కోపం ఎక్కువ అవటం మొదలైనవి చాలా మామూలుగా జరిగిపోయినయ్. నాన్నతో సమయం గడపటం బాగా తగ్గిపోయింది. ఆయన కూడా ఈ విషయం పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు.

వృద్ధాప్యంలో తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలో నాకు కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉండేవి. వారి సుఖానికీ, సౌక్యానికీ అయ్యే ఖర్చు ఎంతైనా భరించాలనీ, ఆర్ధికంగా ఎప్పుడూ వారికి ఏ ఇబ్బందీ రాకుండా చూసుకోవాలనీ మొదలైనవి. అదే రకంగా నేను మా నాన్నను చూసుకున్నాను ఆయన ఉన్నంత వరకూ. ఆ రోజుల్లోనే నాన్నను ఫ్లైట్లో తిరుపతికి తీసుకు వెళ్ళాను. తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే ఎంతో మందితో నన్ను నేను పోల్చుకొని చూసుకొని చాలా గర్వంగా ఫీలయ్యే వాడ్ని. అయితే నా గర్వం అర్ధం లేనిదని నాకు చాలా కాలం తరువాత తెలిసింది.

మా నాన్న పోయాక చాలా కాలానికి ఓ ఆదివారం ఏదో పని మీద ఆయన గది సర్దుతూంటే దోరికిందది. ఆయన ఆ రోజుల్లో రాసుకునే డైరీ. చక్కటి, ఎర్రటి లెదర్ కవర్తో, చాలా లావాటి పుస్తకం. దుమ్ము దులిపి ఉత్సాహంగా తిరగేసాను. డైరీ అంటే ప్రతీ రోజూ జరిగింది రాయటం కాక, జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలని చక్కటి టైటిల్ పెట్టి ఒకటి లేదా రెండు పేజీలు రాసుకోవటం అలవాటు ఆయనకి. పుస్తకాలు బాగా చదివే అలవాటు వల్ల అనుకుంటా, ఆయన రాసే విధానం కూడా చాలా చక్కగా ఉండేది.

ఎన్నో విషయాలు రాసుకున్నారు ఆయన. నా గురించి కూడా ఉంది అక్కడక్కడా. చదువుతూంటే కళ్ళు తడి అయినయ్ నాన్న, జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చి. పేజీలు తిప్పాను ఆసక్తిగా. నాకు ఉద్యగం రావటం, విజయ్ పుట్టడం, ఆఫీసులో ప్రమోషన్ రావటం, కొత్త ఇంట్లోకి మారటం, అలాగే ఆయన స్నేహితుల గురించీ, అమ్మను గురించీ, బంధువుల గురించి ఎన్నో విషయాలు రాసుకున్నారు. చాలా సేపు చదివాక ఒక విషయం అర్ధమైంది. ప్రతీదీ ఎంతో పాజిటివ్ గా చక్కగా రాసుకున్నారు ఆయన. ఏ మాత్రం నెగెటివ్ ఆలోచనలు లేవసలు. ఆయన మీద గౌరవం మరింత పెరిగింది. అయితే మరి కొన్ని పేజీల తరువాత ఆయన రాసుకున్న విషయం అంతా నెగెటివ్ అనీ, అది చదివాక నేను ఎప్పటికీ తీరని బాధకు లోనవుతానని ఆ క్షణం నాకు తెలీదు.

పేజీలు తిప్పాను. ఓ టైటిల్ ఆసక్తిగా అనిపించింది. “ఆగని చక్రం” అన్న టైటిల్ అది.

నాన్న ఏదైనా పుస్తకంలోని ఏదైనా విషయం ఒక్కసారి కన్నా ఎక్కువ చదివితే, ఆ విషయం టైటిల్ ని పెన్సిల్ తో అండర్ లైన్ చేయటం ఆయనకు అలవాటు. డైరీ లో కూడా ముందు చదివిన పేజీల్లో చూసాను ఒకటి రెండు టైటిల్స్ కింద పెన్సిల్ గీతాలు. అయితే, నేను ఎంతో ఆశ్చర్యపోయేలా ఈ ఆగని చక్రం టైటిల్ కింద ఎన్నో గీతాలు కనబడ్డాయి ఆయన దీన్ని ఎన్నో సార్లు చదివిన గుర్తుగా. చాలా ముఖ్యమైన విషయం అయుండాలి. ఆత్రంగా చదవటం మొదలు పెట్టాను.

“…ఈ జీవితం ఎప్పుడూ ఓ చక్రం లా తిరుగుతూనే ఉంటుంది. జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు కూడా అదే చక్రంలో పడి తిరిగుతుంటాయి. ఒకప్పుడు యౌవనంలో ఉన్న నేను ఇప్పుడు ముసలి వాడిగా మారాను. ఇప్పుడు నా కొడుకు యౌవనంలో ఉన్నాడు. తరువాత వాడు పెద్దవాడై నా ఈడు వాడు అవుతాడు. ఇప్పుడు ఈ వయసులో నా అనుభవంలోకి వచ్చిన పరిస్థితులు రేపు నా కొడుకు అనుభవంలోకి కూడా రావొచ్చు. ఇదంతా ఎప్పుడూ గతి తప్పని, ఒకే క్రమంలో తిరిగే ఓ ఆగని చక్రం...

జయరాం కి నేను ఈ విషయాలన్నీ చక్కగా అర్ధమయ్యేలా చెప్పాలనుకుంటాను. కానీ మాట పెగలదు వాడ్ని చూస్తే. ప్రతీదీ వాడికి విసుగే. ఆఫీసులో ఎన్నో ఇబ్బందులనుకుంటా పాపం. వాడి కోపం, విసుగు చూస్తే చాలా జాలిగా అనిపిస్తుంది. వాడికి ఎప్పుడూ చెప్పాలనిపిస్తుంది, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి కావలసింది ఆర్ధిక శక్తి మాత్రమే కాదు రా, విసుగు లేకుండా పిల్లలు గడిపే సమయం కూడా!

నాన్నా జయరాం, ఎందుకురా నేనంటే అంత విసుగు నీకు. నేను ఫోన్ చేస్తే కనీసం ‘హలో’ అని కూడా అనవెందుకు నాన్న? ‘చెప్పు’ అని అంత విసుగ్గా మొదలు పెడితే ఇంకేంట్రా నేను మాట్లాడేది? ఎప్పుడు, ఎలా తెలుసుకుంటావురా నాకు నీతో సమయం గడపాలని ఉందని? నీ ఆరేళ్ళ కొడుకుతో గడిపే సమయంలో కనీసం పదో వంతు సమయం కూడా నాకోసం గడపాలని లేదురా?

విమానంలో తిరుపతి తీసుకువెళ్ళావు ఎంతో ఖర్చు పెట్టి. మొదటి సారి విమాన ప్రయాణం నాకు, నీ ఆరేళ్ళ కొడుకు విజయ్ కి కూడా. వాడికి ఎంతో ఓపిగ్గా అన్నీ వివరించి చెప్పే నువ్వు, పక్కనే ఈ ముసలి తండ్రిది కూడా అదే పరిస్థితి అని తెలుసుకోలేక పోయావు. నీ కొడుకు లాగే, నాకూ కిటికీ పక్కన కూర్చోవాలని ఉంది రా ఆ రోజు. నువ్వు కనీసం మాట వరసకు కూడా నా ఇష్టం అడగలేదు.

టీవీ రిమోట్ నేను పాడు చేసానని గట్టిగా కోప్పడ్డావు నా మీద ఓ రోజు. అదే పని ఈ వేళ నీ కొడుకు చేస్తే, చిన్న పిల్లాడే అని ఊరుకున్నావు. వాడి మీద ఉన్న ప్రేమ నా మీద ఏమైంది రా? ఒక వయసు దాటిన తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లలతో సమానం. వారినీ ప్రేమగా, విసుగు, కోపం లేకుండా చూసుకోవాలి. వారికి చురుకుదనం, అర్ధం చేసుకునే శక్తి ఇంతకు ముందులా ఉండవు నాన్న.

నువ్వు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడల్లా, నాకు ఎంతో కంగారుగా ఉంటుంది. నీకు ఫోన్ చేద్దామనుకుంటాను క్షేమంగానే ఉన్నావని తెలుసుకోటానికి. అప్పుడూ నీకు విసుగే. ‘నా కేమవుతుంది నాన్న’ అంటావు చిరకు పడుతూ .. అదే నువ్వు నీ కొడుక్కి ఎక్కడున్నా ఫోన్ చేసి వాడెలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అని కంగారు పడతావు... నాదీ అలాంటి కంగారే అని ఎలారా నువ్వు తెలుసుకునేది? ఆగని చక్రం లాంటి ఈ జీవితం గురించి ఎప్పుడు రా నువ్వు సరిగ్గా తెలుసుకునేది?...”

చదవటం పూర్తయ్యేసరికి, కంటి నిండా నీళ్ళు నాకు. ఇంకో నాలుగైదు సార్లు చదివాను. నాన్న రాసుకున్నవే కాక ఇంకా ఎన్నో విషయాలు గుర్తుకు వచ్చినయ్. ఎంత విసుగు, కోపం చూపించేవాడ్ని నాన్న మీద. ఎప్పుడూ ఒక్క మాట కూడా నోరుజారలేదు ఆయన. మౌనంగా ఉండిపోయేవారు. ఎంత బాధ పెట్టాను నేను నాన్నని. క్షమించరాని తప్పు చేసాను నాన్న విషయంలో. డబ్బు ఖర్చు చేస్తే చాలు, వారి జీవితం వారు సుఖంగా గడుపుతారు అని తప్పుగా అనుకున్నాను. తల్లిదండ్రులకి మొదట కావలసింది పిల్లల సమయం. మిగితావన్నీ తరువాత! ఈ విషయం నాకు మా నాన్న పోయిన ఎంతో కాలానికి కానీ తెలిసిరాలేదు.

“ఎలా ఉందండీ ఒంట్లో ఇప్పుడు?” డాక్టర్ అడుగుతున్నాడు నన్ను. చప్పున ఈ లోకంలోకి వచ్చాను. కళ్ళు తుడుచుకొని డాక్టర్ తో కాసేపు మాట్లాడాను. రేపు డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పాడు డాక్టర్.

ఇంత కాలమైనా, నాన్నను నేను సరిగ్గా చూసుకోలేదు అన్న దిగులు నన్ను పట్టి పీడిస్తుంది. రోజులో కనీసం పది నిముషాలు ఆయనతో కులాసాగా గడిపి ఉంటే ఎంత బావుండేది? ఆయనకు నేను చేసిన అన్యాయం గురించి ఒక్క మాట నాతో చెప్పినా లేక ఆయన రాసుకున్న డైరీ అయన బతికుండగా నేను చూసినా, ఎంత బావుండేది? ఎంత అన్యాయం చేసాడు నాన్న నాకు ఈ విషయాలేవీ చెప్పకుండా.. ఎందుకు నాన్న నన్ను ఇంత బాధపెట్టావు?

కాసేపు బాధగా ఆలోచనల్లో గడిపి కళ్ళు తెరిచాను.

విజయ్ గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. ఎంత ప్రయోజకుడయ్యాడు వెధవ. చిన్నప్పుడు సరిగ్గా చదివే వాడు కాదు. ఎంత దిగులేసేది అప్పుడు. ఇప్పుడు అచ్చు తన లాగే తయారయ్యాడు. నేను మా నాన్న పట్ల చేసిన తప్పే ఇప్పుడు వాడూ నాతో తు.చ తప్పకుండా చేస్తున్నాడు. ఇలా అయితే కుదరదు. నాన్న నాకు చెప్పకుండా చేసిన తప్పు నేను విజయ్ దగ్గర చేయదలచుకోలేదు. ఇన్నాళ్ళూ మదనపడ్డా, ఇక నా వల్ల కాదు. విజయ్ కూడా ముసలితనంలో నేను పోయాక, నా మీద చూపించిన విసుగు, కోపం గుర్తుకు వచ్చి వాడికి అంతులేని బాధను కలిగిస్తాయి. ఎందుకంటే, వాడిది అచ్చు నా పోలికే, నా మనసే.

వాడు భవిష్యత్తులో పడే బాధను తలచుకుంటే చాలా బాధేసింది. ఏదైతే అదైంది. వాడికి అన్నీ చెప్పి కుండ బద్దలు కొట్టేయాలి. మొహమాటపడితే లాభం లేదు. ఈ డెసిషన్ తీసుకున్నాక మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. నాన్న డైరీని ముందుగా విజయ్ తో చదివించాలి. ఈ విషయంలో నాన్నకు ధాంక్స్ చెప్పాలి. ఆయన రాసినట్టు రాయటం నా వల్ల ఎప్పటికీ అయ్యేది కాదు. ఏ లోకంలో ఉన్నా, నాన్న సంతోషిస్తారు. కొడుకును తలచుకుంటూ రాసుకున్న “ఆగని చక్రం” ఇప్పుడు మనవడికి పనికి వస్తుంది మరి. విజయ్ తో ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎలా మొదలుపెట్టాలో కాసేపు ఆలోచించాను. నేను చెప్పబోయేది వాడు బాగా అర్ధం చేసుకుంటాడన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే వాడు నా కొడుకు. నా రక్తం వాడు!

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న