''అమ్మాయిని ఆసుపత్రికి తీసికెళుతున్నాం. ఆమెకి నొప్పులొస్తున్నాయి''
ఆఫీసులో సీరియస్ గా పనిచేసుకుంటున్న సాత్విక్ తన మామగారి నుంచి వచ్చిన ఆ ఎస్.ఎమ్.ఎస్ చదివి వెంటనే డిలీట్ చేశాడు.
భార్య ప్రసవానికని పుట్టింటికి వెళ్లి మూడు నెలల పైగా అయ్యింది. అప్పుడప్పుడు ముక్తసరిగా నాలుగు మాటలు తప్పించి... ఒంటరిగా ఉంటున్న తను ఇబ్బంది పడుతున్నాడా అని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఆమె.
నిజానికి ఆమె వెళ్లినప్పటి నుంచి తను చాలా అవస్థ పడుతున్నాడు.
మొదట్నుంచి అతనికి చెయ్యి కాల్చుకునే అలవాటు లేదు. అందుకే హోటల్ లోనే టిఫిన్, భోజనం రెండూ కానిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.
ఆదివారాలయితే ఉదయానే లేచి బయటకెళ్లటం ఇబ్బందనిపించి అలాగే ఇంట్లో ఉండిపోతున్నాడు.
అతనికి పెద్దగా స్నేహితులు లేరు.
ఆఫీసు, ఇల్లూ... ఇదే అతని లోకం.
భార్య పుట్టింటికి వెళటాన్ని చాలా మంది స్వేచ్ఛగా భావిస్తారు.
మందుకొట్టటం, పేకాడ ఆటడం, స్నేహితురాళ్లుంటే కలిసి ఎంజాయ్ చేయటం వంటి పనులు చేస్తూ బయట ఎక్కువ సమయం గడుపుతారు.
పాపం... సాత్విక్ ఇలాంటి వ్యక్తి కాదు.
అందుకే ఏకాంతం అతన్ని వేధించింది. రాత్రి పొద్దుపోవటం కష్టమయ్యేది. తెల్లవార్లూ గోడగడియారం వంక చూస్తూ గడిపేవాడు.
భార్య ప్రవర్తన అతనికి కోపం కలిగించింది.
''మా వాళ్లకి మీ సంబంధం అంతగానచ్చలేదు. కోదాడ ఇంజనీరింగ్ అబ్బాయి అయితే బావుంటుందనుకున్నారు. నాకూ అతను నచ్చాడు'' మాటల సందర్భంలో భార్య చెప్పింది గుర్తుకొచ్చి మనసు బాధగా మూలిగింది.
సాత్విక్ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. సుజలను మొదటి చూపులోనే ఇష్టపడ్డాడు. అందుకే కట్నకానుకల విషయంలో ఆమె కుటుంబ సభ్యులను అంతగా ఇబ్బంది పెట్టవద్దని తల్లిదండ్రుల్ని కోరాడు.
'' అంత ఆడంబరాలు అవసరంలేదు. శాస్త్రోక్తంగా చేయించండి చాలు'' పెళ్లికి ముందు అత్తవారికి చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది?
మంచివాడు, మర్యాదస్థుడని వారు మెచ్చుకోలేదు.
డబ్బు తక్కువ ఖర్చుపెట్టించాడని గౌరవించనూ లేదు.
పెద్దగా కోరికలు లేని తను అందరికీ చులకన అయ్యాడు.
అందుకేనేమో... పండగలకి, పబ్బాలకి పెద్దగా పిలవలేదు. పెట్టుపోతల విషయంలోనూ బాగా వెలితి చూపారు. అందుకే వారిపైన సాత్విక్ కి అంత గౌరవం ఉండేది కాదు. సాధ్యమైనంత దూరంగా ఉండేవాడు.
''నా పెళ్లి ఘనంగా చేసుకోవాలని చిన్నప్పట్నుంచి కలలు కన్నాను. మీరేదో పెద్ద ప్రవక్తలా లెక్చరిచ్చి నాకు ఆ ముచ్చట లేకుండా చేశారు''
సుజల కూడా తరచూ తూలనాడేది.
''సిటీలోనే తను ప్రసవం అయితే బావుంటుంది.'' అని అతనికి చాలా సార్లు చెప్పాలనిపించేది. తను పూర్తిగా పక్కనుంటాడు. అవసరమయినవన్నీ సమకూర్చగలుగుతాడు..
ఇదీ అతని ఆలోచన.
సుజలకి తల్లిదండ్రులంటే ఉన్న ఇష్టం చూసి... పుట్టింటికి వెళ్లాలన్న ఆమె ఆత్రుత చూసి అతను నోరు మెదపలేదు.
అవన్నీ మనసులో మెదిలాయి సాత్విక్ కి.
''తను బెట్టు చేయాలి. ప్రసవం అయ్యిందన్న సమాచారం తెలిపే వరకూ వెళ్లకూడదు'' మనసులో గట్టిగా అనుకున్నాడు.
ఆ తర్వాత పనిలో లీనమవ్వాలని తెగ ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.
వెంటనే టీ తెప్పించుకుని తాగాడు. పక్కనే ఉన్న కొలీగ్ తో మాటలు కలిపి ఏవేవో విషయాలు మాట్లాడాడు.
అవన్నీ తనకి మనస్థిమితాన్ని కలిగింలేదు.
ముళ్లమీద కూర్చున్నట్టే ఉంది.
'' ఓ సారి వెళ్లి చూసొస్తే పోలా'' అనుకున్నాడు చివరికి.
''అయినా ఎంత... రెండు గంటల ప్రయాణం... అక్కడికి వెళ్లి మళ్లీ రాత్రికి తిరిగొచ్చెయ్యవచ్చు''
అలా అనుకోగానే మనసు తేలిక పడింది. గబుక్కున సీటు కట్టేసి బస్ స్టాండుకు బయలుదేరాడు.
సాత్విక్ వెళ్లేటప్పటికే ఆమె ప్రసవం అయ్యింది. అతన్ని చూడగానే ఆమె కళ్లు ఆనందంతో మెరిశాయి.
మామగారు, అత్తగారు, బావమరిది అయితే తెగ సంబరపడిపోయారు. భుజాలపైన చేతులు వేసి ఆత్మీయతను ప్రదర్శించారు.
సుజల పక్కలో పసిపాప...
పచ్చని పసిమిరంగులో... బొద్దుగా... ఇంకా కళ్లు పూర్తిగా తెరుచుకున్నట్టులేదు.
ఆ చిన్నారి అతనికెంతో అపురూపంగా అనిపించింది.
''ఈ బిడ్డ తన బిడ్డ... ఎంత అందంగా ఉంది.'' ఒక్కసారిగా అతనిలో ప్రేమ పెల్లుబికింది.
ఆ చిన్నారిని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. జాగ్రత్తగా పొదివిపట్టుకుని ఒళ్లో పడుకోబెట్టుకున్నాడు.
అలా ఎంత సేపు కూర్చున్నాడో అతనికి తెలియదు.
వెంటనే తిరిగి వెళ్లిపోవాలని అక్కడికి వచ్చేముందు అనుకున్న సంగతి అతనికి గుర్తుకురాలేదు.'' పదండి... భోజనం చేసొద్దాం'' అని మామగారు హోటల్ కి ఆహ్వానించేవరకూ ఆ విషయమే తట్టలేదు.
ఆ రాత్రి సుజల గదిలోనే ఖాళీగా ఉన్న కుర్చీలో కూలబడి గడిపేశాడు. తెల్లవార్లూ మెలకువతో ఉండి ఆమెకు కావలసినవన్నీ అమర్చాడు. మరుసటి రోజు ఉదయం కూడా బలవంతంగా అక్కడి నుంచి కదిలాడు.
ఆ తర్వాత...
... శని, ఆదివారాలు ఎప్పుడొస్తాయో... రెక్కలు కట్టుకుని ఎప్పుడెప్పుడు తన బిడ్డ ముందు వాలిపోతానా అని లెక్కలేసుకుంటూ గడపసాగాడు.
ఇప్పుడు సాత్విక్ వారంవారం అత్తగారింటికి వస్తున్నాడు. వచ్చే ముందు పాపకి బోలెడన్ని వస్తువులు తెస్తున్నాడు. గంటలు గంటలు పాపతోనే గడుపుతున్నాడు.
''ద్వేషానికి విరుగుడు ప్రేమ అంటే ఇదేనేమో... ఎన్నాళ్లగానో తన వాళ్లపై అతనిలో గూడుకట్టుకున్న ద్వేషం కన్న బిడ్డ ప్రేమ మాయం చేసింది''
అనుకుంది సుజల సంతృప్తిగా.