మునగటం!ముంచటం!! - వారణాసి రామకృష్ణ

munagatam..munchatam

“కాశీ వెళ్ళావా?గంగలో మునిగావా?నీ నియోజకవర్గం ఎప్పుడు చేరుకుంటావు ?”

చీఫ్ బాస్ ఫోన్లోమాట్లాడుతుండగా అనుచరుడుయమా స్పీడుగా ప్రవేశించి “గురో, ఇంకా ఇక్కడే ఉన్నారా ? లేవండి లేవండి!” హడావిడిగా అన్నాడు.

బాస్ విసుక్కుని “ఏంటయ్యా గోల? మంచిసీజన్ లో బిజినెస్ చేసుకోక ఎక్కడి లేచేది? “ మళ్ళీ ఫోన్లో అవతలి వ్యక్తి తో
“చాలా పెద్ద బిజినెస్!తొందరగా వచ్చెయ్యి!” చెప్పి చిరాగ్గా చూశాడు.

“అయ్యోగురు!బిజినెస్ దేముందీ,ఇవాళ కాకపోతే రేపయినా చేసుకోవచ్చు కానీ బంగారం లాంటి తరుణం పోతే రాదు!” అనుచరుడి కంగారు చూసి ముక్కు చిట్లించి మళ్ళీ ఇంకో ఫోన్ చెయ్యబోతే శిష్యుడు “ఈసారీ వెళ్ళకపోతే కుంభమేళా కాస్తా అయిపోతుంది! వెంటనే తమరు వెళ్ళి గంగలో మునగాలి!” చెప్పాడు.

“ఛత్!ఒకర్ని ముంచటం తప్ప మనo మునగటం ఏంటయ్యా చీపుగా ?”

“ఇంకా బాగా అందర్నీ ముంచాలి అంటే ఇప్పుడు మనం గంగ లో మునగాలి!కదలండి కాశీ! పదండి ప్రయాగ..”

“వీల్లేదు!అది పాలసీకే విరుద్దం! మునగటం అన్న ప్రశ్నలేదు”

“అలా అనకండిగురో!చిట్ ఫండ్స్ లో జనాల్నిముంచిన చిన్నా రావు బ్యాంకుల్ని ముంచిన భద్రయ్య గోల్డ్ స్మగ్లింగ్ బంగారయ్య నకిలీనోట్ల నర్సింగు స్కూల్ బిజినెస్ విద్యాపతి ఇలా మీ అనుచరులoతా గంగలో మునగాలని కుంభమేళా వెళ్లారు. ఇంత మంది మునగంగా లేoది మీరెందుకు మునగరు?” బాసు జవాబివ్వక బిజీ గా ఫోన్లు చేస్తునే ఉన్నాడు.

“ప్లీజ్ గురు!ఇప్పుడు మీరు మునగక పోతే ప్రతిపక్షాలు సరే మన స్వపక్షం లో వాళ్ళు కూడా విమర్శిస్తారు!అర్ధం చేసుకోండి! అసలు గంగ లో మునిగే వాళ్ళంతా పిచ్చాళ్ళా?ఓసారి గంగలో ముక్కు మూసుకుని మునిగేసి అమ్మా గంగామ్మా!మేము చేస్తున్న పాపాలన్నీ ప్రక్షాళనం చెయ్యి తల్లీ! అంటే చాలు! ఆనక నీళ్ళలోంచి బైటికొచ్చి ఎంచక్కా తడి గుడ్డలతో గొంతులు కోయ్యొచ్చు!”

“చూడు శిష్యా ఎవరెవరు గంగ లో మునిగారో వాళ్ళనే మనం ముంచాం!అవునా?”

“దేహంలో సందేహం ఏముందీ?!”

“జనాల్ని ముంచిన వాళ్ళనే మనం ముంచగలం!అంటే వాళ్ళని మించిన వాళ్ళం!కాబట్టి ఇప్పుడు వాడూ గంగలో మునిగి మనమూ మునిగితే ఆడికి మనకి తేడా ఏంటి చెప్పు?”

“తమరి తలపు ఏ తలుపు సందులోంచి దూసుకోస్తోందో అర్ధమై చావట్లేదు గురూ!”

“మనదంతా సింగిల్ విండో వ్యవహారం శిష్యా!కుంభమేళా లు రావటం వాళ్ళకి అవసరం! మనకి వరం!”

“ఇంతకీ ఇన్నిన్ని ఫోన్ కాల్స్ ఎవరికీ చేస్తున్నారు గురూ?”

“ఇంకెవరికి?మన రెగ్యులర్ కస్టమర్లకే! వాళ్ళంతా గంగలో మునిగి లేచాక ఫ్రెష్ గా పాపాలు చెయ్యడానికి సొంత జిల్లాలకి వెళ్తారు! అక్కడికి చేరుకున్నాక మనం పంపిన గంగాజలాలను జనానికి పంపిణీ చేస్తారు!”

“అవునా? మనం గంగా జలాల పంపిణీ చేస్తున్నామా?ఎంత పుణ్యం!”

“పిచ్చి శిష్యా!గంగాజలం అన్న బ్రాండ్ పేరుతో మనం పంపే ఖాళీ ప్లాస్టిక్ క్యాన్ల నిండా స్థానికజలాల్నినింపి అమ్మకాలు కొనసాగి స్తారు మన అనుచర గణం!”

“ఆహా!నావెల్ ఐడియా!కానీ గురో.. జనానికి అనుమానం వస్తే?”

“చూడు శిష్యా బ్యారేజీ నీళ్ళకి డ్రైనేజీ నీళ్ళకి తేడా అంత తేలిగ్గా తెలీదు.ఒకవేళ జనానికి తెలిసిందే అనుకో..”

“ మనాళ్ళని సున్నం లోకి ఎముక లేకుండా పట్టుకు తంతారు!”

“తొందరపడకు సుందరవదనా!ఆదుకోవటానికి మనం లేమూ? అలా జరిగితే వెంటనే రక్షక భటులు రంగప్రవేశం చేసి మన వాళ్లందరినీ భద్రంగా ఏసీ బొక్కలున్న బొక్కల్లో ఏసేస్తారు!”

“ఓహో భలే మాస్టర్ ప్లాన్!ఇంతకీ ఇంతటి పుణ్య కుంభమేళ కాలంలో భక్తఅనుచరగణమంతా పునీతులవటానికి ముచ్చటగా మచ్చుకో ఆణిముత్యం లాంటి కొటేషన్ చెప్పండి గురో!”

“అలా అడిగావు బావుంది! రాసుకో ..”

చీఫ్ బాసు ఉడుకులాం వేసిన నాలుగు ఉడుకునీళ్ళ గంగా జలం చుక్కలు నెత్తిన జల్లుకుని చిద్విలాసంగా నవ్వి చెప్పాడిలా ..
“ బడా నేతలు మునగరు, ముంచుతారు!!”

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న