కవల పిల్లలు - ఓట్ర ప్రకాష్ రావు

kavala pillalu

“సహస్రా, మా ఆఫీసులో పని చేస్తున్న కొలీగ్ భార్యకు ఆ కంపెనీలో సోమవారం ఇంటర్వ్యూ ఉందంట. నీకూ అదే రోజు ఉంటుందనుకొంటాను.” తనలోని సంతోషాన్ని బయటపెట్టకుండా మామూలుగా చెప్పాడు భర్త అధర్వ్.

ఆదర్వ్ మాటలు వినగానే ఒక్క సారిగా నిరుత్సాహ పడింది సహస్ర. లాప్ టాప్ నందు ఈ మెయిల్ ఓపెన్ చేసి చూసింది.

ఈ మెయిల్ నందు వచ్చిన ఇంటర్వ్యూ లెటర్ చూసి "నాకు శని వారం ఇంటర్వ్యూ" గట్టిగా సంతోషంతో భర్త వైపు చూస్తూ అంది సహస్ర.
"సహస్రా ,ఏమిటి ఉద్యోగం దొరికినంతగా సంబర పడుతున్నావు. ఇంతవరకు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళావు.ఎన్నడూ ఇలా సంతోషంతో బిగ్గరగా చెప్పలేదు" అన్నాడు ఆదర్వ్

"నాకు ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకంతో చెప్పడం లేదు. ఇది చాలా పెద్ద కంపెనీ.ఇందులో ఉద్యోగం దొరకడం చాలాకష్టం. నేను ఇంటర్వ్యూ కు వెళ్ళడానికి అవకాశం వచ్చినందుకు సంతోషించాను.ఇదే ఇంటర్వ్యూ సోమవారం అయితే నేను వెళ్ళడానికే అవకాశం లేదు. సోమవారం నాకు డెలివరీ రోజు." అంటూ సంతోషముతో తన కడుపు పై మృదువుగా నిమరసాగింది.

“సహస్రా నీవు ఉద్యోగం వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. ఇంటర్వ్యూ సోమవారం ఉంటుందని సంతోషంతో చెప్పాను. మరొక్క సారి ఆలోచించు. మన బిడ్డను చూసుకోవచ్చుగా "అన్నాడు ఆదర్వ్

"చూడండీ మీ చెల్లెలి పెండ్లికి చేసిన అప్పు ఇంకా తీరలేదు .మీతమ్ముడి చదువు బాధ్యతలు మీ మీదే ఉంది.గోరుచుట్టుపై రోకటి పోటన్నట్లు మా అమ్మకు గుండె ఆపరేషన్ అంటూ చేసిన లక్ష రూపాయల అప్పుఅలాగే ఉంది. ప్రతినెలా అన్నింటికీ వడ్డీ కడుతున్నాము.మంచి ఉద్యోగం దొరికితేనే చేస్తాను. పదివేల రూపాయల జీతానికి వెళ్లను. "

“ఒక వేళ ఉద్యోగం దొరికితే బిడ్డను వదిలి వెళ్లడం అంటే ...నీవు చాల కష్టపడి వలసి వస్తుంది "అన్నాడు ఆదర్వ్.

" ఆదివారం మా ఊరిలో ఇల్లు కాళీ అమ్మ చేసి ఇక్కడకు వస్తుంది. మీరన్నట్లు ఉద్యోగం దొరికితే బిడ్డను అమ్మ చూసుకొంటుంది. కావాలంటే పని మనిషిని పెట్టుకొందాం. కనీసం ఈ అప్పులన్నీ తీరేవరకు ఉద్యోగం చెయ్యాలనుకొన్నాను.అయినా ఉద్యోగం దొరికినప్పుడు మాట్లాడుకొనవలసింది ఇప్పుడే మాట్లాడుకొంటున్నాం." చిరునవ్వుతో అంది.

*******

శనివారం ఉదయం క్యాబ్ బుక్ చేసాడు ఆదర్వ్. సహస్రను ఇంటర్వ్యూ జరిగే స్థలానికి క్యాబ్ లో వెళ్ళింది.రిటర్న్ టెస్ట్ పెద్ద హాలు నందు ఏర్పాటు చేశారు.మొత్తం వంద కంప్యూటర్లు ఉన్నాయి.కంప్యూటర్ నందు పరీక్ష పూర్తి చేసింది. వారడిన ప్రశ్నలన్నిటికీ సరిఅయిన సమాధానాలను టిక్ చేశానన్న తృప్తి సహస్ర లో కలిగింది. నడుములో ఏదో లాగినట్టి బాధ కలుగగానే సహస్ర మనసులో ఏదో చిన్న అనుమానం ……ఒక వేళ పురిటి నొప్పుల యితే.....అయినా డెలివరీకి ఇంకా రెండు రోజులు సమయం ఉందిగా .....సరిగ్గా వారు చెప్పిన తేదీకి ముందు వెనుక మూడు రోజులు కూడా జరగవచ్చు అన్న మాటలు గుర్తుకు వచ్చింది. ఇంత వరకు ఆ ఆమాటలు ఆలోచించలేదు. సహస్ర లో ఏదో తెలియని భయం ...అలా ఆలోచిస్తున్నసమయాన డిజిటల్ బోర్డు నందు రిటర్న్ టెస్ట్ లో సెలెక్ట్ అయినా వారి పేర్లు ప్రకటించారు. అందులో తన పేరు చూసుకొని పురుటినెప్పులు వస్తుందేమోన్నన్నా అనుమానంతో పూర్తిగా సంతోషించలేకపోయింది.
భర్తకు ఫోన్ చేసింది "ఏమండీ ,రిటర్న్ టెస్ట్ లో నేను పాస్ అయ్యాను.. ప్రతిరోజూ నలభై మంది ఉద్యోగులను ఎన్నిక చేస్తారంట, ఫైనల్ ఇంటర్వ్యూ కు అరవై మందిని ఎన్నుకొన్నారు నలభై ఖాళీలకు అరవై మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు"

“ప్చ్...నీవు రిటర్న్ టెస్టులో పాస్ అయ్యవంటే ఇక నీకు ఉద్యోగం దొరికినట్లే.....మరొక్క సారి ఆలోచించు సహస్రా .... కన్న బిడ్డను వదిలి ఆ ఉద్యోగం ముఖ్యమా?" ప్రశ్నించాడు ఆదర్వ్.

“మన ఇంటి పరిస్థితికి ఆ ఉద్యోగం చాల ముఖ్యం. మరో ముఖ్య విషయం నేను గమనించిందేమిటంటే మనకు పుట్టబోయే బిడ్డ అబ్బాయా అమ్మాయా అని చెప్పలేను కానీ గుణ గణాలు మీలాగే ఉన్నాయి “

“సహస్రా ఏమిటి నీవు చెప్పేది.”

“మీకు నేను పనికి వెళ్ళడానికి ఇష్టం లేనట్లే కడుపులో బిడ్డకు ఇష్టంలేనట్లుంది. ఇంటర్వ్యూకు నేను వెళ్తానో లేదో అనుమానం కలుగుతోంది.”

“అంటే ……నీకు పురుటి నెప్పులు “

“ఆ నొప్పులు చూస్తుంటే ఆకొద్దిగా అనుమానం గా ఉంది.ఎందుకైనా మంచిది మీరు సెలవుపెట్టి రండి.”

“నేను క్యాబ్ పంపుతాను వెంటనే హాస్పిటల్ కు బయలు దేరు .నేను ఆఫీస్ నుండి నేరుగా బయలు దేరుతాను.”

“నొప్పి కొద్దిగానే ఉంది ...మంచి కంపెనీ ...మంచి జీతం కల ఉద్యోగం ........”

" సహస్రా ఈ సమయంలో అలా మొండి పట్టడం నాకు నచ్చలేదు .....నీకు చెమటలు పడుతున్నాయా ....."

“అవునండీ…… కొద్దిగా”

"చెమటలు పట్టిందంటే శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.పళ్ళ రసం లాంటిది త్రాగాలన్న సంగతి తెలుసుగా "

"అదృష్ట వశాత్తూ కంపెనీ వారి కూల్ డ్రింక్ షాప్ నందు దొరుకుతోంది. తీసుకొంటున్నాను "

“ సహస్రా పురుటి నెప్పులు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుగా"“అన్నీ తెలుసండి”

“ఫోన్ పెట్టెయ్ నేను బయలుదేరుతున్నాను.” అన్నాడు ఆదర్వ్

**********

నడుము నుండి ప్రారంభమైన నడుమునొప్పి క్రమ క్రమంగా పొత్తికడుపు వైపుకు రాసాగడంతో ఈ రోజే తనకు ప్రసవం జరగవచ్చన్న నిర్ణయానికి వచ్చింది.

హెచ్.ఆర్. స్టెనో దగ్గరకెళ్ళి "మేడం నాకు ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది. డెలివరీ టైం కు ఇంకా రెండురోజులుందని ఇక్కడకు వచ్చాను......ఇప్పుడే అనుకోలేదు ....నొప్పులు ప్రారంభమైంది.... ముందుగా వెళ్లే అవకాశం....ఉంటే...” అంది.

స్టెనో సహస్ర వైపు చూసింది.దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని నోటితో గాలి వదలడం గుర్తించింది. సహస్ర ముఖంలో నొప్పులు పడుతున్న బాధ ముఖంలో గుర్తించింది.

“సారీ మేడం,లోపల ఒక కమిటి ఇంటర్వ్యూ చేస్తుంది. వారి అనుమతితోనే ......”

“ వద్దండి .... వీలయితే వారిని అడగకుండా మీరు పంపితే బాగుంటుంది ....లేకుంటే వదిలేయండి. నేను హాస్పిటల్ కు వెళ్తాను.”

సాటి ఆడ దానిగా ఒక్క క్షణం ఆలోచించింది “ఓకే లోపల వెళ్లిన వ్యక్తి రాగానే మీరు వెళ్ళండి”
**********

కమిటీ సభ్యులు సహస్రకు ప్రశ్నలు వేస్తుంటే పురుటినెప్పుల బాధను పంటితో బిగబట్టుకొని వినసాగింది. సమాధానం చెప్పేటప్పుడు కృత్రిమమైన చిరునవ్వుతో చెప్పినా కమిటీ సభ్యులలో సహస్ర ఎందుకో ఇబ్బంది పడుతుందని గుర్తించారు. పది నిముషాలు వారు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వసాగింది. అంత బాధలోనూ తన సమాదానికి కమిటీ సభ్యులు సంతృప్తి పడటం గమనించింది. హెచ్ ఆర్ మేనేజర్ స్టెనోకి ఫోన్ చేసి వరుస ప్రకారం ఎందుకు పంపలేదని మెల్లగా అడిగాడు.ఆమె చెప్పిన సంగతి విని ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ప్రక్కనున్న అతను ఇంకో ప్రశ్న వేయబోతుంటే హెచ్.ఆర్. మేనేజర్ అడ్డుపడుతూ "సహస్రగారూ మా నిర్ణయం ఈ రోజే మీకు తెలుపుతాము.ఆఖరి ప్రశ్న ఈ ఉద్యోగం దొరికితే మీరు ఎలాచేస్తారు."

అప్పటికే నొప్పులు ఎక్కువకావటంతో లేచి నిలబడి చేతులు జోడించి “నా కన్నా బిడ్డ లాగా…… " అంటూ వెళ్ళింది. గది బయటకు రాగానే వీల్ చైర్ తో పాటు ఉన్న నర్స్ ను చూసి అర్థం కానట్లు స్టెనో వైపు చూసింది

"మేడం మీరు వెంటనే చైర్ లో కూర్చొని వెళ్ళండి. బయట మీ వారు అంబులెన్సు తో ఎదురు చూస్తున్నారు." ఆసుపత్రిలో సహస్రకు కొడుకు పుట్టాడు. ఫోన్ రింగ్ అవుతుంటే నర్స్ తీసుకొని వచ్చి సెల్ అందించింది.

“ కంగ్రాట్యులేషన్స్ సహస్రా మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు.ఇంతకూ మీకు అబ్బాయా అమ్మాయా "అంటూ ప్రశ్నించారు హెచ్.ఆర్. మేనేజర్.

“థాంక్స్ సార్.....అంటే నాకు కవలలు పుట్టారన్న మాట."

“అదేమిటి అలా చెబుతున్నారు "అయోమయంతో ప్రశ్నించాడు.

“సార్ ఒకడు మా అబ్బాయి,రెండోవాడు మీకంపెనీలో ఉద్యోగం "చిరునవ్వుతో అంది సహస్ర..

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న