జవాను కుటుంబం - చెన్నూరి సుదర్శన్ ,

javaanukutumbam

ల్యాండ్ లైన్ ఫోన్ మ్రోగుతోంది...

వంటింట్లో పరధ్యాన్నంగా వంట చేస్తున్న వసుమతి.. ఉలిక్కి పడింది. ఉన్నఫళంగ హాల్లోకి పరుగెత్తుకుంటూ వెళ్ళీ ఎడం చేత్తో ఫోన్ ఎత్తింది. ఫోన్లో విషయం వినగానే కుడి చేతిలోని గరిటె కిందపడింది.. రిసీవర్ జారి పోయింది. నిల్చున్న చోటనే కుప్పలా కూలిపోయింది.. వంటింట్లో అడుగంటుకోబోతున్న వాసన వసుమతి జీవితానికి అద్దం పడుతోంది.

***

భారతి, భాస్కర్‌రావు దంపతులిరువురూ ఉపాద్యాయవృత్తికి వన్నె తెచ్చిన వారు.. పైగా గొప్ప దేశ భక్తులు. వారి రక్తానికి వారసుడైన అమరేశ్వర్ ఏకైక సంతానమైనా.. ఆర్మీలో చేర్పించారు. ఊళ్ళో అ ఇంటికి ‘జవాను కుటుంబం’ అనే మారు పేరు స్థిరపడింది.
అమరేశ్వర్ ఆదర్శభావాలలో మరొక్క అడుగు ముందుకు వేసి అనాధాశ్రమంలో ఉన్న వసుమతి చెయ్యి అందుకున్నాడు. చిమ్మచీకటిలో.. ఊహించని వెలుగు రేఖలా వచ్చిన తన అదృష్టానికి కృతజ్ఞతాపూర్వకంగా వసుమతి కళ్ళు వర్షించాయి.. నమ్మ శక్యం కాలేదు. ఇది మన ఇరువురి జన్మ జన్మల బంధం అన్నట్టుగా తన కళ్ళతోనే సమాధానపర్చాడు అమరేశ్వర్.

అనాధాశ్రమంలో వారిరువురి వివాహం నిరాడంబరంగా జరిగింది. వారి అన్యోన్య దాంపత్యానికి ఆనవాలుగా అదృష్టం కలిసి వచ్చి.. వసుమతి గర్భం ధరించింది. కుటుంబం యావత్తు ఆనందడోలికల్లో తేలి ఆడుతున్న తరుణంలో అమరేశ్వర్‌ను అత్యవసరంగా రమ్మని టెలిగ్రాం వచ్చింది. పెళ్ళికని ఆరు నెలలు ప్రత్యేక సెలవుల మీద వచ్చిన అమరేశ్వర్ ఒక నెల రోజుల ముందుగానే వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ వీలు చూసుకొని త్వరలో వస్తానని వసుమతి చేతిలో చెయ్యి వేసి చెప్పాడు అమరేశ్వర్. కన్నీటితో వీడ్కోలు పలికింది వసుమతి. కాని అదే కడసారి చూపు అవుతుందనుకో లేదు.

క్షణమొక యుగంగా నెల రోజులు గడిచాయి. అమరేశ్వర్ నుండి వార్త కోసం ఎదురిచూసేది వసుమతి. హఠాత్తుగా ఒక రోజు వినగూడని వార్త వచ్చింది. కార్గిల్ యుద్ధంలో అమరేశ్వర్ తన బటాలియన్‌కు నాయకత్వం వహించి ఏబది మంది శతృసైనికులను హతమార్చి వీరమరణం చెందాడనే వార్త విని సొమ్మసిల్లింది. అమరుడైన అమరేశ్వర్‌కు ‘పరమ వీరచక్ర’ బిరుదును ప్రదానం చేసింది ప్రభుత్వం.

పార్థీవ శరీరాన్ని సైతం చూసుకునే భాగ్యానికి నోచుకొనకుండా చేశాడు దేవుడు. 'దైవోపహతులు పోవుం గడకు పోవు గదా.. ఆపదల్' అని ఒక కవి రాజు అన్నట్లుగా.. వసుమతి అన్నపానీయాలు మాని దుఃఖింసాగింది. తమూ దుఃఖిస్తే వసుమతి మరింత బేజారై పోతుందని భాస్కర్‌రావు దంపతులు గుండెలు దిటవు చేసుకుని.. వసుమతికి ధైర్యం చెబుతూ.. ఓదార్చడం నిత్యకృత్యమయ్యింది. గర్భవతి ఇలా శోకించడం తగదని.. పుట్టబోయే పిల్లలకోసమైనా.. గుండె నిబ్బరం చేసుకోక తప్పదని ఊరడించే వారు.

“జవాన్ల జీవితాలు అంతే తల్లీ..” అని వసుమతిని తమ అక్కున చేర్చుకునేది భారతి.

వసుమతిని ఏదో ఒక పనిలో వ్యాపకం కలిగించాలని ఒక ప్రైవేటు బడిలో టీచరు ఉద్యోగం ఇప్పించాడు భాస్కర్‌రావు. రోజూ పిల్లలకు పాఠాలు చెప్పడంలో మునిగి తేలుతూ.. తిరిగి మామూలు మనిషి కాసాగింది వసుమతి. ‘ఎంతటి గాయాన్నైనా.. మాన్పించే మహత్తు కాలానికి ఉంది’ అన్నట్లుగా..

ఒక సుమూహూర్తాన కవల పిల్లలకు జన్మనిచ్చింది వసుమతి. అనిల్, అఖిల్ అని అమరేశ్వర్ పేరు లోని మొదటి అక్షరం కలిసేలా నామకరణం చేశారు. ఒక అమరేశ్వర్ వెళ్ళి తన రూపంలో ఇద్దరు అమరేశ్వరులను పంపించాడని భారతీ, భాస్కర్‌రావులు ఉప్పొంగి పోయారు. పిల్లల బోసి నవ్వులు వసుమతి మోములో అణగారి పోయిన చిరునవ్వులను రీచార్జ్ చేయసాగాయి.

కాలచక్ర గమనంలో.. ఆదర్శభావాల పందిరి కింద పిల్లలు పెరిగి పెద్దకావడం ముదావహమే.. కాని పిల్లల మనో భావాలు ఉత్తర, దక్షిణాలు కావడం.. భాస్కర్‌రావు జీర్ణించుకో లేక పోతున్నాడు.

“జవాను కుటుంబాన్ని కాస్తా జవాన్ల కుటుంబమని మార్చే శక్తి నీ చేతుల్లో ఉంది తల్లీ” అని ప్రాధేయ పడ్డారు భాస్కర్‌రావు దంపతులు.
ఏ దిక్కూ మొక్కు లేక గాలికి కొట్టుకు పోయే తన జీవితానికి ఒక అర్థం.. పరమార్థం కలిగించిన ఆ పుణ్య దంపతుల మాట కాదనలేక పోయింది వసుమతి. పెద్ద కొడుకు అనిల్‌ను సైన్యంలో చేర్పించింది. కాని చిన్నోడు అఖిల్ ఇంటి పట్టున్నే ఉండి తమ ఆలనా.. పాలనా చూసుకుంటాడని మొదటి సారిగా కోరుకుంది. భాస్కర్‌రావు దంపతులూ తమ సమ్మతి తెలిపారు.. వృద్ధాప్యంలో ఒకరు తోడు ఉండలనే మనోగతం సరియైనదే కదా..! అనుకొని అఖిల్‌ను సంఘసేవ వైపు దృష్టి మరల్చారు. కాని అది బెడిసి కొడ్తుందని ఊహించుకో లేక పోయారు.

“అన్నయ్య దేశ రక్షణ కోసం సైన్యంలో చేరడం సబబే.. గాని ఇక్కడ మన కళ్ళముందే జరుగుతున్న అన్యాయాలను చూస్తూ నేను ఊరుకోను. మనలో ఉంటూ.. మనకు.. మన దేశానికి ద్రోహం చేస్తున్న గోముఖ వ్యాఘ్రాలను ఏరి పారేస్తాను. చీల్చి చెండాడేస్తాను” అంటూ వీరావేశంతో ముఖంలో నిప్పులు కురిపించే వాడు అఖిల్. ఒకే రక్తం పంచుకొని పుట్టిన పిల్లల్లో విభిన్న ఆలోచనా ధోరణులు. ఇద్దరూ దేశ రక్షకులేనా..! అని ఎటూ తేల్చుకోలేక పోయేది వసుమతి. కాని మనుమని మొండి వాదనతో ఏకీ భావించ లేక పోయేవాడు భాస్కర్‌రావు.

“చట్టాలను మన చేతుల్లోకి తీసుకోవడం నేరం. మనది ప్రజా స్వామ్యం. ప్రజలే పాలకులు. అంతగా అయితే ప్రజల మనసు దోచి రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకొని దేశ సేవ చెయ్యి” అంటూ భాస్కర్‌రావు హిత బోధ చేసే వాడు.

“హ్హు..! రాజకీయనాయకులు.. వీళ్ళే మన దేశానికి పట్టిన చీడ పురుగులు. గుడిని, గుడి లోని లింగాన్ని దిగ మింగి అమాయకపు ముఖం పెట్టి రాయితీలు.. నజరానాలు ఇస్తున్న రాక్షసులు. ఎలక్షన్ల సమయంలో ఓటుకు డబ్బిస్తే నేరం. మరిప్పుడు నాయకులు చేస్తున్నదేమిటి?.. మందే తమ ఓట్లకు పునాదుల కోసం గాలం వేస్తూ.. వివిధ రూపాలలో డబ్బు తేరగా పంచడం లేదా..?. ప్రజలను పూర్తిగా సోమరి పోతులను చేస్తున్నారు.

పూర్వం నాయకులు తమ భార్యల మీది మంగళసూత్రాలు అమ్మి దేశానికి పెట్టారు. నేడు.. మంది భార్యల మీది పుస్తెల తాళ్ళు తెంపి ఆస్తులు కూడబెట్టుకుంటున్న బందిపోటు దొంగలు. ముందు వాళ్ళ అంతు చూస్తాను” అంటూ అతివాద పలుకులు పలికే వాడు అఖిల్.

“అలా ఆలోచించడం తప్పు. నువ్వు చేస్తా అంటున్న పని సరియైనది కాదు. జనస్రవంతిలో కలిసి పోయి జనంలో మార్పు తీసుకు రావాలి.. గాని జనం మీద పగతో గాదూ.. ఆయుధం చేతబూనీ కాదు” అంటూ ఎంతో సౌమ్యంగా చెప్పినా భాస్కర్‌రావు మాటలు పెడ చెవిన పెట్టి అఖిల్ అడవిలో తూర్పు దిశకు పయనమయ్యాడు.

అటు అనిల్ సైన్యంలో అంచెలంచెలుగా.. ఉన్నత పదవులు పొందుతున్నాడని సంతోషించాలో..! లేక ఇటు నక్సలైటు దళంలో కామ్రేడ్ కార్తికేయ కమాండర్‌గా అలియాస్ అనిల్ ఎదిగి పోతున్నాడనే రహస్యపు వార్తలు వింటూ.. గుండెలు చిక్కబట్టుకోవాలో..! అర్థం గాక వసుమతి మనసు కొట్టుమిట్టాడేది. ఏ సమయంలో ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అని ప్రాణాలు అర చేతిలో పట్టుకుని రోజులు సాగదీస్తోంది.. ఆ రోజు రానే వచ్చింది..

***

గుడికి వెళ్ళి తమ మనుమళ్ళు క్షేమంగా ఉండాలని అర్చన చేయించి వచ్చిన భారతి, భాస్కర్‌రావులు వసుమతి మొదలు నరికిన మ్రానులా కూలి పోయి ఉందడం.. చూసి వడి, వడిగా వచ్చారు.

భారతి గబ, గబా వంటిట్లోకి వెళ్ళి స్టౌ ఆఫ్ చేసి.. గ్లాసులో నీళ్ళు తీసుకు వచ్చింది. వసుమతి ముఖంమ్మీద కాసిన్ని నీళ్ళు చిటకరించింది. భాస్కర్‌రావు ఆందోళనగా చూడసాగాడు. వసుమతి చెక్కిళ్ళను సుతారముగా తడుతూ.. మరి కొన్ని నీటి చుక్కలు చిటకరించింది భారతి. వసుమతి నెమ్మదిగా కళ్ళు తెరచి పిచ్చి చూపులు చూడ సాగింది.

హాల్లో టీ.వీ. వార్తలు కశ్మీరులో పుల్వామా దాడుల వైనం వివరిస్తూంది. భయానక దృశ్యాలు ప్రసారం చేస్తూంది. వసుమతి అలా నిర్జీవంగా పడిపోవడానికి కారణం అదేనా అని మనసులోకి రాగానే భారతి, భాస్కర్‌రావుల గుండెలు ఝల్లుమన్నాయి. అమరులైన పేర్లలో అనిల్ పేరు ఫ్లాష్ .. ఫ్లాష్.. వార్తల్లో ప్రకటిస్తున్నారు.. భారతి చేతి లోని గ్లాసును అప్రయత్నంగా కింద పడవేసి వసుమతిని గుండెలకు హత్తుకుంది. భాస్కర్‌రావు మ్రాన్పడి పోయాడు.

హాల్లో విషాదపు ఛాయలు.. క్రమేణా ఊరంతా వ్యాపించాయి.

జవాన్ల కుటుంబం ఇంటి ముందు జనసంద్రమయ్యింది. ఊరంతా అలలు, అలలుగా కడలి లోకి కదలి రాసాగారు.

***

రెండు రోజుల్లో అనిల్ అమర వీరుని పార్థీవ దేహాన్ని భారత దేశ త్రివర్ణ పతాక ఆశీర్వాదంతో ప్రత్యేక పెట్టెలో తీసుకు వచ్చారు సైన్యాధికారులు. అమర వీరుని అంతిమ దర్శనం కోసం. ఊళ్ళకు ఊళ్ళు కదలి వచ్చాయి. కన్నీటి మయమైన నేత్రాలతో.. శోకతప్త కంఠాలు పెకిలాయి.
“అనిల్ అమర్ హై.. జై జవాన్.. వసుమతిమాత.. వీరమాత. వసుమతిమాత.. వీరమాత“ అనే నినాదాలు మిన్నంటాయి.. అమరుని అంతమ యాత్ర ముగిసే వరకు కొనసాగుతునే ఉన్నాయి.

భారతి, భాస్కర్‌రావులు చివరి నిముషం వరకు అఖిల్ కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడసాగారు. వసుమతి మదిలో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి..

భర్తకు.. ఇదుగో మన బిడ్డ అని చూపించే అదృష్టానికి నోచుకో లేదు. ఇప్పుడు కొడుకు చితికి నిప్పు పెట్టి భర్త చేరిన అమరలోకానికి పంపాల్సి రావడం.. వసుమతికి చేతులు ముందుకు కదలక.. పడే ఆవేదన భారతి అర్థం చేసుకుంది. తనే ఒక అడుగు ముందుకు వేసి.. వసుమతి చెయ్యి పట్టుకుని అనిల్ చితికి నిప్పు పెట్టడానికి సహకరించింది.

***

ఊరంతా ‘అనిల్ అమర్ హై.. వసుమతిమాత వీరమాత’ అనే గోడ పత్రికలు వెలిశాయి. ప్రతీ రోజు ఏదో ఒక సంస్థ అనిల్ జవాన్ సంతాప సభలు నిర్వహిస్తూ.. వసుమతికి విరాళాలు అందించేది. వచ్చిన విరాళాలన్నీ గ్రామ అభ్యుదయం కోసం.. ‘అమరేశ్వర్-అనిల్’ పేర్ల మీదుగా ‘నిత్య అన్న దానం’ కార్యక్రమాలకు తిరిగి ఇచ్చేది వసుమతి.

భారతి, భాస్కర్‌రావులు తమ కోడలు చేస్తున్న పనిని హర్షిస్తూ.. అభినందించే వారు. తమ ఇంటి కోడలైనందుకు గర్వపడే వారు. వృద్ధాప్యంలో ఆదుకోవాల్సిన కొడుకు లేని లోటును పూరిస్తూ.. ఆమె చేస్తున్న సేవలకు మనసులో ప్రణామాలు అర్పించే వారు. కాని మేము పోయాక ఆమెనాదుకోవాల్సిన కొడుకులు..! .. జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా కన్నీళ్ళ పర్యంతమయ్యే వారు..

అఖిల్ వచ్చి జనస్రవంతిలో కలిస్తే బాగుండేదని.. దేవుణ్ణి ప్రార్థించే వారు. కొన్నాళ్ళు శిక్ష పడినా.. ఆ తరువాత అయినా వసుమతికి అండగా ఉండే వాడని భారతి, భాస్కర్‌రావులు తరుచూ మాట్లాడుకునే వారు.

ఆ రోజు కూడా తెల్లవారు ఝామున్నే లేచి ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ.. ఎప్పటిలాగే దిగులు పడుతుంటే.. బయట వ్యాన్ శబ్దమయ్యింది. భారతి నెమ్మదిగా కిటికీ తలుపు తెరచి ఓరగా చూసింది. ఎవరో వచ్చినట్లుంది. మసక వెలుగులో గుర్తించడం కష్ట సాధ్యమయ్యింది. వడి, వడిగా వెళ్ళి వసుమతిని లేపింది.

వసుమతి కళ్ళు నులుముకుంటూ.. ఇంటి ముందు లైటు వేసేలోగానే కాలింగ్ బెల్లు మ్రోగింది. త్రలుపు తెరిచే సరికి ఎదురుగా పోలీసులు. గుండె ఝల్లు మంది. అఖిల్ మదిలో మెదిలాడు.

“సారీ మేడం.. ఇలా పొద్దున్నే రావడం తప్పలేదు” అంటూ లోనికి వస్తాం.. అన్నట్లుగా చూడ సాగాడు ఎస్సై శంకరయ్య. అతడి వెనుకాలే ఒక కానిస్టేబుల్. ఆ చూపులు అర్థం చేసుకున్న సుమతి ఇరువురినీ లోనికి ఆహ్వానిస్తూ కూర్చోమంది.

“మీరు కూడా కూర్చోండి మేడం .. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి” అన్నాడు శంకరయ్య.

శంకరయ్య తనకు బాగా తెలుసు. ప్రతీ సంతాప సభలో కలుసుకునే వారు. జవాన్ల కుటుంబమంటే శంకరయ్యకు అభిమానంకూడానూ..
‘ఫరవాలేదు.. చెప్పండి’ అన్నట్లుగా వసుమతి నిలబడడం చూసి.. “మేడం.. గత నడి రాత్రి ఏటూర్ నాగారం అడవిలో ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. నలుగురు నక్సలైట్లు.. ఒక పోలీసు కానిస్టేబుల్ చనిపోయారు. పోస్ట్ మార్టం కోసం మన ఊరికి తీసుకు వచ్చారు. అందులో ఒకరిని చూస్తే నాకు అనుమానమేసింది. శ్రమ అనుకోకుండా.. ఒక సారి వచ్చి అతణ్ణి గుర్తించండి. లేదంటే అనామకుడిగా సామూహిక దహనం చేయిస్తాను” అంటూ తల మీది క్యాపు తీసుకొని చేతిలో పట్టుకున్నాడు.

అఖిల్ విషయం పోలీసు రికార్డుల్లో.. వసుమతి కుటుంబానికి తప్ప ఊళ్ళో ఎవరికీ తెలియదు. అఖిల్ అమెరికాలో ఉంటున్నాడని అనుకుంటున్నారంతా..

వసుమతి కాళ్ళళ్ళో వణకు పుట్టింది. గుండె వేగంగా కొట్టుకో సాగింది. అఖిల్ ఇంటి గడప దాటిన రోజే చచ్చాడని నీళ్ళు వదులుకుంది వసుమతి. కాని ఎంతైనా ఒక తల్లి మనసు.. కొడుకును చూడాలనే తపన అణచుకో లేక పోయింది.

“సరే సర్.. వస్తాను.. ఒక్క నిముషం..” అంటూ బాత్‌రూం వెళ్ళి ముఖంమ్మీద కాసిన్ని చల్లని నీళ్ళు చల్లుకొని.. బయలు దేరింది.
అంతా విన్న భారతి తలుపు గడియ పెట్టి.. తమ పడక గదిలోకి వెళ్ళి భాస్కర్‌రావుకు విషయమంతా పూస గృచ్చినట్లు చెప్పింది.
అరగంటలో తిరిగి వచ్చింది వసుమతి.

ఆమె రాక కోసమే ప్రాణాలు అర చేతిలొ పట్టుకొని ఎదురి చూస్తున్న భాస్కర్‌రావు దంపతులు వసుమతి ప్రశాంతంగా రావడం కాస్త ఉపశమనం పొందారు.

“పోలీసు వాళ్ళు అనుమానించినట్లు అఖిల్ కాదు మామయ్యా.. మన అఖిల్‌కు మీ అశీస్సుల అండ వుంది. వాడికి ఏమీ కాదు” అంటూ బాత్‌రూంకు వెళ్ళి మౌనంగా రోదించ సాగింది.

అఖిల్‌‌ను గుర్తించినా.. నా కొడుకు కాదని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. నిజం చెప్పి ఈ వయసులో.. అత్తమ్మ మామయ్యలకు మనఃశ్శాంతి లేకుండా చెయ్యడం.. తమ జవానుల కుటుంబానికి మాయని మచ్చ తీసుకు రావడం మనస్కరించలేదు. ఆ రహస్యం తన గుండెల్లోనే దాచుకుంది. ‘వసుమతిమాత.. వీరమాత’ గానే శాశ్వతంగా నిలిచి పోవాలనుకుంది వసుమతి. *


మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న