“దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 12728 హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ ఫారం పై బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది, యాత్రిగాన్ కృపయా….” “టక్ టక్”
“కమిన్”
పోర్టర్ లగేజీ తెచ్చి లోపల పెట్టేడు. మెరున్ రంగు అమెరికన్ టూరిస్ట్ బాగ్… బాగ్ పైన గోల్డ్ కోటెడ్ అక్షరాలు చైతన్య అని.. పోర్టర్ బయటకు వెళ్ళగానే నేవీ బ్లూ షిఫాన్ చీరకట్టుకున్న ఒకామె లోపలకు వచ్చింది. సుమారుగా పాతికకు దగ్గర్లో ఉండొచ్చు. “వాటర్ బాటిల్ తేవాలా మేడం” అడిగాడు వినయంగా… “అవసరం లేదు,నువ్వెళ్ళు” చెప్పిందామె.
పోర్టర్ వెళ్ళాక లోపలికి చూసింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్.. ఇద్దరికే బెర్త్ లు ఉంటాయి. బ్లూ జీన్స్ లోకి వైట్ షర్ట్ ఇంషర్ట్ చేసిన ఒకాయన చాలా ఆశ్చర్యంగా ఇటే చూస్తూ కనిపించాడు. సుమారు ముప్పై , ముప్పైరెండేళ్ల వయసు ఉండొచ్చేమో… చిరాగ్గా తల పంకించి, “ఎక్స్ క్యూజ్ మీ… సర్… మీరు ఏమనుకోకుండా పై బెర్తు మీద సర్దుకోగలరా…”
“మీ అబ్బాయి పేరు చైతన్య?”
అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ప్రశ్న వేస్తున్నాడేంటి అనుకుంది ఆమె.
“కాదు, నా పేరే…”
“వాట్” అదిరిపడ్డాడతను.
వచ్చిన దగ్గర నుంచి అతని ప్రవర్తనతో చిరాకు పడుతున్న ఆమె “మిస్టర్, మిమ్మల్నే” కొంచెం గట్టిగానే పిలిచింది.”
ఇంతలో ట్రైన్ కదిలింది. తూలి పడబోయింది ఆమె. అతను గభాలున కిందకి దిగాడు. అతని చూపులు నిలిచిన చోట ఆమె చూపులు కదిలాయి. ఇప్పుడు ఆశ్చర్య పోవడం ఆమె వంతయ్యింది. “రెండు సూట్కేసులు ఎలా వచ్చాయి?” స్వగతంగా అంటున్నా పైకే అనేసింది.
“అందుకే కదా నేను ఆశ్చర్యపోయింది” అన్నాడు అతను.
“అంటే మీ పేరు కూడా చైతన్య”
“అవును, ముందు మీరు కూర్చోండి. మంచినీళ్లు తాగండి.” వాటర్ బాటిల్ అందించాడు. “ఆక్వాడెకో”
కాస్త నీళ్లతో గొంతు తడుపుకుని చెప్పింది. “ఇద్దరి పేర్లు ఒకటే, బాగ్స్ రంగులు, బేగ్ మీద చిత్రించిన పేర్ల రంగుతో సహా కూడా ఒకటే”
“అవును అదే చిత్రం అనిపించింది”
“ఇంకొకటి కూడా చెప్పనా?”
“ఊఁ, చెప్పండి”
“ఉహు చూపిస్తాను” హాండ్ బాగ్ లో నుండి ఆక్వాడెకో వాటర్ బాటిల్ తీసి చూపించింది.
“అరె… ఇంకా చిత్రం గా ఉంది”
“ఇంతే కాదు , మీ చేతిలో తెలుగు నవల, అదికూడా యండమూరిది ఉంది. నేను కూడా కాలక్షేపానికి అదే తెచ్చేను”
“వాట్ ఏ కో ఇన్సిడెంట్” ఇద్దరు ఆశ్చర్య పోయి అంతలోనే నవ్వేసుకున్నారు.
“నేను లోపలికి అడుగుపెట్టగానే మీరు నావంక ఏదోలా చూస్తుంటే ఎందుకో అనుకున్నాను సుమా”
“ఇలా ఒకే రకమైన అభిరుచులు కలిస్తే ఏమంటారో తెలుసా”
“చెప్పండి”
“ట్విన్ ఫ్లేమ్స్”
“ఓహో… బాగుంది, మీరు ఎక్కడివరకు”
“ విశాఖపట్నం”
“థాంక్ గాడ్, నేను కూడా అక్కడివరకే”
“పోనిలేండి, మంచి కాలక్షేపం ఇద్దరికి”
“మరొక్క ట్విన్ ఫ్లేమ్ చెప్పనా”
“చెప్పండి” ఉత్సాహంగా అందామె
“మన డ్రెస్ కలర్ కూడా”
“చాల్చాలు, అక్కడితో ఆపేయండి. అసలు నాకు ఇందాకటి నుండి ఒక అనుమానం మనసులో పీకుతోంది”
“అడిగేయండి చైతన్య గారు, లేదంటే కడుపు ఉబ్బిపోతుందట ”
“చైత్ర అని పిలవండి, అదే నాకు అలవాటు, మరేం లేదు, సాధారణంగా ఇలా ఒక మగ, ఆడ కు కలిపి కంపార్ట్మెంట్ ఇస్తారా?”
“చూడండి… వేరే ఆలోచనలు పెట్టుకోకండి. ఇద్దరి పేరు ఒకటే అవడంతో ఇద్దరం ఒకే జెండర్ అనుకోని ఇలా ఇచ్చేసి ఉంటారు రైల్వేవారు. పైగా మీది ఎమర్జెన్సీ కోటా అంటున్నారు కూడాను” అన్నాడు చైతన్య.
“ఏమోమరి”
“ఏదైనా కానియండి చైత్ర గారు… ఇలా పేర్లతో సహా, అభిరుచులు కలిసి ఒకరికొకరు అద్దంలాంటి మరొక వ్యక్తిని కలుస్తానని నేను కలలో కూడా ఊహించలేదు”
“అఫ్ కోర్స్… పేర్లు మనం పెట్టుకున్నవి కాకపోయినా…”
చైతన్య అదే చైత్ర భర్త ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీకి సి ఈ ఓ. ఇద్దరు పిల్లలు. చైతన్య ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఇద్దరికి కూడా ఫ్లయిట్ ఎక్కే అవకాశం ఉన్నా రైలు ప్రయాణాన్ని ఆస్వాదించే అభిరుచి కావడంతో ట్రైన్లో ప్రయాణానికే మొగ్గు చూపించారు.
ట్రైన్ వరంగల్ స్టేషన్ దాటింది. పాంట్రీ కార్ లేకపోవడంతో మొబైల్ లో ఫుడ్ ఆర్డర్ చేశారు ఇద్దరు. మహబూబాబాద్ లో డెలివరీ అయిన ఆహారాన్ని చూసి మరొకసారి నవ్వుకున్నారు.
భోజనాలు అయ్యాక పిచ్చాపాటీ కబుర్లలో పడ్డారు. రావినూతల సువర్ణాకన్నన్ రచనల నుంచి రష్యా మేడే ఉత్సవాల వరకు, పదహారేళ్ళ వయసు సినిమా నుంచి పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. కొన్నింటికి చైత్ర శ్రోత అయితే మరికొన్నిటికి చైతన్య శ్రోత. ఇరువురి కుటుంబ విషయాలు, చదువు సంధ్యలు కూడా దొర్లాయి. వాటిల్లో చెప్పుకోదగిన సారూప్యతలు మాత్రం ఎక్కువగా లేవు. చైత్ర మాట్లాడేటప్పుడు ఆమె పెదవులను, లయబద్దంగా కదిలే లోలాకులను గమనించేవాడు చైతన్య. అలాగే తాను మాట్లాడేటప్పుడు కుతూహలంతో, అప్పుడప్పుడు ఆశ్చర్యం గా పెద్దవయ్యే కళ్లనే చూసేవాడు. చైతన్య మాట్లాడేటప్పుడు వేళ్ళు కదిలిస్తూ లేదా పెన్ చేతిలో తిప్పుతూ మాట్లాడటం గమనించింది చైత్ర.
“అవునూ.. మీరు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కదా. ఏ ఏ పత్రికలకు రాస్తారు?” ఉన్నట్లుండి అడిగింది చైత్ర.
ఒక్క క్షణం తటపటాయించి “ఇండియా టుడే, ఫ్రంట్ లైన్, ఔట్ లుక్ మొదలైన వాటికి రాస్తాను. ఎక్కువగా ప్రముఖుల ఇంటర్వ్యూలు, ఏదైనా ప్రముఖ సంఘటనలు జరిగినపుడు నా విశ్లేషణలు రాస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొన్ని కవర్ స్టోరీలు గా కూడా వచ్చాయి. “
“మీరెందుకో సందేహిస్తున్నారు”
“అబ్బే అలాంటిదేం లేదు” అంటూ తన బాగ్ లో నుండి ఇండియా టుడే తీసి ఇచ్చాడు
చైతన్య రాసిన ఆర్టికల్ కోసం వెతుకుతూ ఒక పేజీ చూసి , చైతన్య వంక చూసింది. చైతన్య ఇబ్బందిగా నవ్వాడు. చైత్ర పకాలుమని నవ్వేసింది. “చైత్ర” ఈ పేరు తోనే నేను ఆర్టికల్స్ రాసేది” అన్నాడు చైతన్య . “సరే.. చాలా పొద్దుపోయింది. ఇక నిద్రపోదాం” అనుకుని గుడ్ నైట్ చెప్పుకుని చైతన్య పై బెర్త్ మీదను, చైత్ర తన బెర్తు లోను నడుంవాల్చారు. నీలిరంగు కాంతి పల్చగా పెట్టెలో పరచుకుంది.
“చిత్రమైన పరిచయం, చిత్రమైన ప్రయాణం ఎవరికైనా చెప్తే కథలల్లుతున్నాను అనుకుంటారు” అనుకుంటూ కళ్ళుమూసుకుంది చైత్ర.
“కొన్ని పరిచయాలు చిత్రంగా జరుగుతాయి. ఎందుకు ఎవరు ఎలా కలుస్తారో తెలీదు “ అనుకుంటు రెప్పలు మూసాడు చైతన్య. కాలం గడుస్తోంది కానీ నిద్ర కళ్ళమీదకి వాలలేదు. చైత్ర కళ్ళు, పెదవులు, చెవి లోలాకులు పదే పదే కళ్ళముందు తిరుగుతున్నాయి. ఏమిచేస్తోందో చూడాలనిపించి వంగి చూసాడు. ఆల్చిప్పల్లా కళ్ళు విప్పార్చుకుని ఇటే చూస్తోంది. కళ్ళు కలవగానే పెదవులు విడివడకుండా నవ్వింది.
“నిద్ర రాలేదా” అడిగాడు.
“ఉహు… ఎంత ప్రయత్నించినా రావడం లేదు”
“నేను కాసేపు కంపెనీ ఇవ్వనా?”
“ఊఁ”
కిందకి దిగాడు చైతన్య. “ఒక్క నిమిషం” అంటూ ఫేస్ వాష్, టవల్ తీసుకుని వెళ్లి ముఖం కడుక్కుని వచ్చింది. ట్రైన్ విజయవాడ స్టేషన్ దాటింది. ఈలోగా తాడేపల్లిగూడెం స్టేషన్ వచ్చినపుడు ఒక కాఫీ, రాజమండ్రి స్టేషన్ లో ఒక కాఫీ వచ్చేలా ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాడు. తాజా సుమబాలలా వచ్చింది చైత్ర. “కాఫీ ఆర్డరిచ్చాను” “ఊఁ”
ఇందాకటిలా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు. బహుశా మనసులో ఉన్న అలజడే కారణం ఏమో… బహుశా తనకి డ్రెస్ మార్చుకుని పడుకునే అలవాటేమో.. చీరలో సౌకర్యంగా లేక నిద్రపట్టలేదేమో .. ఆలోచిస్తున్నాడు చైతన్య. అదే ఆలోచనలో చైత్ర కూడా.. బహుశా తనున్నానని డ్రెస్ మార్చుకోలేదేమో… జీన్స్ లో నిద్ర ఏం పడుతుంది… “మీరు” ఇద్దరూ ఒకేసారి అన్నారు. ఫక్కున నవ్వొచ్చేసింది చైత్రకి .. నవ్వుతూనే ఉంది. పొలమారింది. తలపై సున్నితంగా తట్టి, మంచినీళ్లు అందించాడు. “మీరు డ్రెస్ మార్చుకోండి కావాలంటే .. స్టేషన్ వచ్చినట్లుంది, కాఫీ వచ్చిందేమో చూసి వస్తాను” అని లేచాడు.
చైతన్య కాఫీ తీసుకు వచ్చేలోగా స్కైబ్లూ శాటిన్ నైటీ లోకి మారిపోయింది. కాఫీ పాట్, కప్పులు అక్కడ పెట్టి వెళ్లిపోయాడు అటెండెంట్. “మీరు కూడా మార్చుకుంటారేమో” అని కాసేపు బయట నిల్చుంది. “మీరు రావచ్చు” అన్నాడు చైతన్య. లేత గోధుమరంగు పైజామా కుర్తా వేసుకున్నాడు. మౌనంగా కాఫీ పూర్తి చేశారు.
తానంటే మనసులో రేగుతున్న అలజడి వలన మాట్లాడలేక పోతున్నాడు. చైత్ర ఎందుకు మాట్లాడటం లేదు? తనకి కూడా అలాగే ఉందా….
“కాసేపు పాటలు విందామా?” నిశ్శబ్దానికి వీడ్కోలు పలుకుతూ అన్నాడు చైతన్య.
“సరే. మీ దగ్గర ఏ పాటలు ఉన్నాయి?”
“హిందీ, తెలుగు… మెలోడీస్”
“చౌదవీకా చాంద్ హో…” “బహుశా మీకు కూడా నచ్చుతాయనే అనుకుంటాను.” అన్నాడు ఆధాహై చంద్రమా రాత్ ఆధి… నిశ్శబ్దం ఇంకా ఇబ్బందిగా ఉంది. అన్నీ ఇందాకే మాట్లాడేసుకున్నట్లు, ఇంక ఏమి మిగలనట్లు అనిపిస్తోంది ఎందుకో… కాస్త అటు ఇటు కదిలి కూర్చుంది చైత్ర…
“చైత్రా..” చేయి చాచాడు. చేతిలో తన చేయి వేసింది. సుతారంగా నొక్కాడు. వొళ్ళు జివ్వుమంది ఇద్దరికి. తన కళ్లలోకిచూస్తూ ఆమె చేతిని పెదవులకు ఆనించాడు. కళ్ళు మూసుకుంది.
“నీలివెన్నెల జాబిలి…”
తన చేతిని వెనక్కు తీసుకుంది. లేచి నిలబడింది. కిటికీ పరదాలు తీసి చూసి మళ్ళీ వేసింది. ఏం చేయాలో తోచనట్లు మళ్ళీ బెర్తు పై కూర్చుంది. చైతన్య లేచి బయటకు వెళ్ళాడు. కాస్త ఊపిరి తీసుకుంది.
“కెరటానికి ఆరాటం …”
లోపలికి వస్తూనే చైత్ర నడుం పట్టుకుని నిలబెట్టి ఆమె పెదవులను తన పెదాలతో బంధించేసాడు. ఉక్కిరిబిక్కిరయ్యింది కాసేపు… అతడి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చింది… గాఢంగా హత్తుకున్నాడతను.
“చైత్రా ఇన్నాళ్లు ఎందుకు కనిపించలేదు” చెంప పక్కగా ఉన్న కురులతో గుసగుసలాడాడు. “నాదీ అదే ప్రశ్న” ఏదో లోకంలో తేలిపోతున్నట్లు ఉంది ఆ స్వరం.
నిను వెతికి వెతికి చూసి…
పాటలను పట్టించుకున్నదెవరు? ఎవరు ఎవరిని ఏం చేస్తున్నారో తెలియనంతగా మైమరపులో ఉన్నారు. ఏసీ లో కూడా చెమటపట్టేసింది ఇద్దరికి.దిగ్గున లేచికూర్చుంది చైత్ర. తల పైకెత్తి చూసింది. చైతన్య పై బెర్తు పై ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. గాఢంగా ఊపిరిపీల్చి మంచినీళ్లు తాగి, తనకి వచ్చిన కలనే తలచుకుంటూ అటు తిరిగి పడుక్కుంది చైత్ర. అలికిడి సద్దుమణిగాక కళ్ళు తెరిచాడు చైతన్య. చిన్నగా తన మొబైల్ లో వినిపిస్తున్న పాటలను ఆపేసి చైత్ర వైపు చూసాడు. లేతనీలిరంగు వెలుగులో నీలిచీరలో ప్రశాంతంగా నిద్రపోతోంది. తనకు మాత్రం నిద్రే కరువయ్యింది అనుకుంటూ బలవంతాన కళ్ళుమూసుకున్నాడు.
రెప్పలపై సున్నితంగా చుంబించిన స్పర్శ. కళ్ళు తెరవాలని లేదు. చేతులతో తడిమాడు. మెత్తగా చీర తగిలింది. టక్కున కళ్ళు విప్పాడు.
“చైత్రా”
“నిద్రపట్టడం లేదు. ఏవో పిచ్చి ఊహలు”
“అవునా… ఊహలు నిజమైతే…”
అంతులేని తమకంతో పెనవేసుకుపోయారిద్దరు.
రాజమండ్రిలో ఆర్డరిచ్చిన కాఫీ కోసం అటెండెంట్ తలుపు కొట్టేవరకు ఇద్దరూ తన్మయావస్థ లో మునిగి ఉన్నారు. ఆ బంధం నుంచి విడివడాలని లేదు. మళ్ళీ తలుపు కొడుతున్నారు. చైతన్యే కళ్ళు తెరిచాడు.
“విశాఖపట్నం వచ్చింది సర్…”.
ఒక్క ఉదుటన బెర్తు దిగాడు. ఇంతవరకు తను కలగన్నాడా… ఆ ఊహే ఎంతో మధురంగా ఉంది. చైత్రని లేపాడు. ఇద్దరి మనసులో ఒకే అలజడి. ఎవరినెవరు సూటిగా చూసుకోలేక పోతున్నారు. అటెండెంట్ మళ్ళీ తలుపుకొట్టాడు. తలుపు తీసి, ఎవరి బాగ్ వాళ్ళు మారిపోకుండా చూసుకుని మరీ అటెండెంట్ కి ఇచ్చారు.
“చైత్రా… నిద్రపట్టిందా?”
“ఊఁ. మీకు?”
“పర్వాలేదు”
“మళ్ళీ మనం కలిసేది ఎప్పుడు?”
“ఇలాగే అనుకోకుండా మరొకసారి కలిస్తే అప్పుడు….”
“ఆఁ.. అప్పుడు?”
“మన పరిచయం, స్నేహం కొనసాగిద్దాం…”
“అవును… అంతవరకు నో మొబైల్ నెంబర్…. నో ఈ మెయిల్…”
“సరే”
“మళ్ళీ కలుద్దాం”
“కలుస్తామా”
“తప్పక”
“ఎదురుచూస్తూ ఉంటాను”
కాస్త దూరం వెళ్ళాక గుర్తు వచ్చింది ఇద్దరికి తాము విడిపోయేటపుడైనా షేక్ హేండ్ ఇచ్చుకోలేదని…