ఆత్మ సంతృప్తి - పద్మావతి దివాకర్ల

atmasamtrupti

బిగ్‌ బజార్‌కి ఇంటికి కావలసిన సరుకులు తేవడానికి వెళ్ళిన సరళకి అక్కడ ఆకుపచ్చ డ్రెస్‌వేసుకున్నామెను ఎప్పుడో, ఎక్కడో చూసినట్లనిపించింది. అయితే ఎంత ఆలోచించినా గుర్తు మాత్రం రాలేదు. కానీ ఆమె ముఖం బాగా పరిచయం ఉన్నట్లు అనిపించింది. ఆమెని గుర్తు చేసుకోవడానికి తన చిన్ననాటి స్నేహితులని, స్కూల్, కాలేజీలో కలసి చదివినవాళ్ళని, ఉద్యోగంలో చేరిన కొత్తలో కలసి పనిచేసిన సహోద్యోగులని గుర్తుకు తెచ్చుకుంది సరళ. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆమెకి హఠాత్తుగా గుర్తుకువచ్చింది. అవును! ఆ నడక, ఆ ఠీవి అవన్నీ, ఆమె కచ్చితంగా తన కాలేజీ రోజుల్లో స్నేహితురాలైన అనిత! అనితని చూసి చాలా రోజులవడంవల్ల వెంటనే పోల్చుకోలేకపోయింది.

"అనితా!..." అని ఉద్విగ్నంగా బిగ్గరగా పిలిచింది సరళ ఆమెని. ఆ మాటలు వింటూనే గిర్రున వెనుతిరిగి చూసిన ఆమె సరళను వెంటనే పోల్చుకుంది.

"హాయ్! సరళా! ఏమిటి నువ్విక్కడ? ఏలా ఉన్నావు? చాలారోజులైంది నిన్ను చూసి." అంది అనిత.

"నాకు ఇక్కడికి ఈ మధ్యనే బదిలీ అయింది. మావారు కూడా ఇక్కడే ఉదోగం చేస్తున్నారు. మరి నీ సంగతేమిటి?" అడిగింది సరళ.

"ఓహో! అలాగా! నేను ప్రస్తుతం ఇక్కడే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మా వారుకూడా ఇక్కడే బిజినెస్‌లో స్థిరపడ్డారు.”జవాబిచ్చింది అనిత.

"పద! అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం!" అని అక్కడ నుండి బయటపడి ముందుకి దారి తీసింది అనిత. ఆమెను అనుసరించింది సరళ.

ఆ పక్కనే ఉన్న కాఫీహౌస్‌లోకి ఇద్దరూ దారితీసారు. అనిత రెండు కాఫీలకి ఆర్డరిచ్చిన తర్వాత ఇద్దరూ కబుర్లలో పడ్డారు. చాలా రోజుల తర్వాత కలసుకున్నారేమో, వాళ్ళిద్దరి మధ్య చాలా కబుర్లే దొర్లాయి. సరళ, అనిత ఇద్దరూ కాలేజినాటినుండి మంచి స్నేహితురాళ్ళు. ఇద్దరికీ అంతస్థుల్లో తేడా ఉన్నా అది వాళ్ళ స్నేహానికి ఏమాత్రం అడ్డు రాలేదు.

"అవునూ, నువ్వు కూడా ఇంజినీరింగ్ చేసి నాలాగే మంచి జాబ్ చేసిఉంటే బాగుండేది. నువ్వు చదువు సగంలో ఆపేసి టీచర్‌గా చేరావు. అంతే కాకుండా మళ్ళీ ఓ టీచర్‌నే పెళ్ళాడావు! చూడు! మాలైఫ్ ఎలా ఉందో? డబ్బుకి డబ్బు, దర్జాకి దర్జా." ఠీవిగా అంది అనిత.

"నేనేం చేయను? మా ఇంటి అర్థిక పరిస్థితులవల్ల చదువు ముందుకు సాగడానికి వీలు లేకపోయింది. మా నాన్నగారు కూడా స్కూల్ మాస్టర్ కదా! నా తర్వాత ఇంకా ఓ తమ్ముడు, చెల్లెలు ఉండడంవల్ల నన్ను ఇంకా పైచదువులు చదివించడానికి మా నాన్నగారికి ఆర్థిక స్తోమత లేకపోయింది. అయినా నేను ఈ ఉద్యోగం చేస్తున్నందుకు నాకేమీ బాధగా లేదు. పైగా ఆనందంగా కూడా ఉంది. విద్యార్థులను ఉత్తమ భావి భారతపౌరలుగా తీర్చిదిద్దుతున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. అతనికి కూడా చాలా జాబ్స్ వచ్చినా టీచర్‌గా చేయాలని అభిలాష ఉండడం వల్ల అవన్నీ వదులుకున్నారు. మా ఇద్దరి జీతంతో ఇల్లు హాయిగా గడిచిపోవడమే కాకుండా పిల్లల్ని మంచి స్కూల్‌లో చదివించడం, భవిష్యత్తుకోసం డబ్బులు దాచడం కూడా చేస్తున్నాము. అంతేకాక స్వంత ఇల్లు కట్టడానికి కూడా కొంత డబ్బులు దాస్తున్నాము. త్వరలో బ్యాంక్‌నుండి లోన్‌తీసుకొని ఓ ప్లాట్ కొందామనుకుంటున్నాం." అంది సరళ.

"అయితే నువ్వు ఉన్నదానితోనే తృప్తి పడుతున్నానంటున్నావు! కానీ డబ్బువల్ల సమకూరే సౌఖ్యాలే వేరుకదా! చూడూ, ఇప్పుడు మాకు పోష్ ఏరియాలో ఓ మంచి బంగళాలాంటి ఇల్లొకటి ఉంది. మంచి ఖరీదైన కార్లు ఓ రెండున్నాయి మాఇద్దరికి చెరొకటి. ఇవేకాక ఇంకో రెండు ఫ్లాట్‌లు ఉన్నాయి. ఇంట్లో పని చేసేందుకు బోలెడంతమంది పనివాళ్ళు కూడా ఉన్నారు. మా పిల్లలిద్దరూ మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు తెలుసా!" అంది అనిత అతిశయంగా.

"ఎవరి అభిప్రాయం వారిది. నామట్టుకు నాకు జీవితం హాయిగా, అనందంగా సాగిపోతోంది. దేవుడిదయవల్ల మంచిభర్త, ముత్యాల్లాంటి పిల్లలు దొరికారు. నాకు ఏ విధమైన చింతలు లేవు." అంది సరళ.

"అంటే, నువ్వు చాలా అల్పసంతోషివన్నమాట!" నవ్వింది అనిత. మందహాసం చేసింది సరళ.

"సరే పద! ఇక వెళ్దాం! నిన్ను మీ ఇంటివద్ద కారులో డ్రాప్‌చేసి నేను వెళ్తాను. వచ్చే ఆదివారం మీకందరికీ ఎలాగూ సెలవేకదా! మాఇంటికి తప్పక రండి మీరిద్దరూ పిల్లల్ని తీసుకొని. నా ఫోన్ నంబరు, ఇంటి అడ్రస్స్ చెప్తాను." తిరిగి అంది అనిత. ఇద్దరూ కాఫీహౌస్‌నుండి బయటపడి కారు పార్కింగ్‌వైపు కదిలారు.

*****

ఆ ఆదివారం అనిత చెప్పిన అడ్రస్‌కి బయలుదేరివెళ్ళారు సరళ, ఆమె భర్త మహేష్, వాళ్ళ ఇద్దరు అబ్బాయిలూను. అనిత, ఆమె భర్త రమేష్ వాళ్ళకోసం ఇంటిముందు లాన్‌లో వేచి ఉన్నారు.

"రండి! అనిత మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది." అంటూ సాదరంగా అహ్వానించాడు అనిత భర్త రమేష్ వాళ్ళని. సరళ వాళ్ళ బంగళా చూసి ఆశ్చర్యపోయింది. చాలా విశాలమైన జాగాలో విలాసవంతంగా నిర్మించబడి ఉంది ఆ భవనం. ఇంటి చుట్టూ పార్కులాంటి కన్నుల పండుగగా ఓ పెద్ద తోట. ఇంట్లోకి దారి తీసారందరూ.

"మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి! మేమిద్దరం వంటపని చూస్తాం!" అని సరళని లోపలికి తీసుకెళ్ళింది అనిత. అసలు ఇంట్లో వంటమనిషి ఉండడంవల్ల వంట స్వంతంగా చేయవలసిన అవసరం లేదు అనితకి. అయితే వంటమనిషికి ఏమేం చేయాలో పురమాయించి స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు.

పిల్లలిద్దరూ ఏమి తోచక టివిలో కార్టూన్‌షో పెట్టుకు కూర్చున్నారు.

మహేష్, రమేష్ ఇద్దరూ కూడా మాటల్లో పడ్డారు. కొద్దిసేపు లోకాభిరామాయణం అయ్యాక వాళ్ళ మాటలు రాజకీయాలవైపు, ఆ తర్వాత సినిమాలవైపు మళ్ళాయి.

ఈ లోపున వంటింట్లోంచి కాఫీలు రావడంతో చెరోకప్పు తీసుకుని మళ్ళీ కబుర్లలో పడ్డారు.

"అవునూ! మీరుకూడా జాబ్ వదిలేసి నాలాగ వ్యాపారం చెయ్యొచ్చుకదా! వ్యాపారంలో అయితే చాలా కొద్దిరోజులలోనే మంచి లాభాలార్జించి ఆస్థులు పెంచుకోవచ్చు. నా లాగే మంచి పోష్ ఏరియాలో ఇలాంటి ఇల్లొకటి కట్టించుకోవచ్చు. పిల్లలకి మంచి చదువు చెప్పించవచ్చు." అన్నాడు రమేష్.

"నాకలాంటి ఆశలేమీ లేవండి. నాకు చిన్నప్పటినుండి ఉపాధ్యాయవృత్తి అంటే చాలా గౌరవం. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా నేను టీచర్‌గానే ఉండదలచాను. నాకు చదువు చెప్పడంలో ఉన్న ఆనందం అపరిమితం. ఈ వృత్తిద్వారా విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్ది, దేశానికి కావలసిన ప్రతిభను వెలికితీసే అవకాశం నాకు లభించినందుకు గర్విస్తున్నాను కూడా." అన్నాడు మహేష్.
రమేష్ కొద్దిగా నవ్వి అన్నాడు, "మీ భార్యాభర్తల గురించి అనిత నాకన్నీ చెప్పింది లెండి! మీలాంటి ఆదర్శభావాలు గలవారు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. మీరు మాకు స్నేహితులుగా లభించడం మా అదృష్టం. అయితే ఇవాళరేపు చదువుని కూడా వ్యాపారంగా మార్చి కోట్లు ఆర్జిస్తున్నారు కదా చాలామంది."

"అవును! నిజమే!... విద్యకూడా ఇప్పుడు ఓ వ్యాపార వస్తువైపోయింది మరి. అందుకు నాకు కూడా చాలా బాధగానే ఉంది." అన్నాడు మహేష్.

"ఏది ఏమైనా మీలా వృత్తికి అంకితమై పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్న మీలాంటివాళ్ళకి మా జోహార్లు!" మనస్పూర్తిగా అన్నాడు రమేష్.
అక్కడ సరళకి అనిత ఇల్లంతా తిప్పి చూపించింది. అసలే ఇంద్రభవనంలాంటి ఇల్లు. ఆ వైభోగం చూసి నివ్వెరపోయింది సరళ. అందమైన ఇంటిరియర్ డెకరేషన్‌తో సినిమా సెట్‌ని తలపిస్తోంది ఆ హాలు. అక్కడ అణువణువునా ఐశ్వర్యం ఉట్టిపడుతోంది. ఎక్కడెక్కడనుంచో తెచ్చిన పాలరాతి ఫ్లోరింగ్. గోడలమీద అందమైన, ఖరీదైన వర్ణచిత్రాలు అద్భుతంగా అమరాయి. ముందునుండీ అనిత కలవారి అమ్మాయి. ఇప్పుడు పెద్ద ఉద్యోగం, పైగా రెండు చేతులా ఆర్జిస్తున్న భర్త, దానితో ఆమె అంతస్తు ఇంకాస్త పెరిగింది. ఆ వైభవం చూసిన సరళకి అనిత అంటే కొద్దిగా ఈర్షకూడా కలిగిన మాట వాస్తవం. వాళ్ళని తమతో పోల్చుకొని కొద్దిగా బాధపడింది కూడా. తామిద్దరూ టీచర్లుగా చేరి తప్పేమైనా చేసామా అని ఒక్కక్షణం బాధపడింది సరళ. ఉద్యోగంలో చేరిన తర్వాత అవకాశాలు వచ్చినా కూడా వినియోగించకుండా ఆత్మవంచన చేసుకొని సమాధానపడ్డామా అని మధనపడింది.

"మీ ఇల్లు చాలా బాగుంది. మీ అభిరుచి మేరకు బాగా తీర్చిదిద్దినట్లుంది." పైకి మెచ్చుకుంది సరళ.

"అవును ఇద్దరమూ దగ్గరుండిమరీ మాకు నచ్చినవిధంగా కట్టించుకున్నాం." అంది అనిత.

ఈ లోపున వంట పూర్తవడంతో అందరూ డైనింగ్‌హాల్‌వైపు నడిచారు. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నవాళ్ళకి సమయమే తెలీలేదు.
ఆ రాత్రి ఇంటికి తిరిగివచ్చిన తర్వాత మహేష్ అన్నాడు, "చూసావా! మీ స్నేహితురాలి వైభోగం. బిజినెస్ చేసి రమేష్ రెండుచేతులా ఆర్జించాడు. అంతా డబ్బు మహిమ! అందుకే అన్నారు 'ధనం మూలం మిదం జగత్ అని ' అని. అతను నన్ను కూడా బిజినెస్స్‌లోకి దిగమన్నాడు. దేనికైనా పెట్టి పుట్టాలి. నిజం చేప్పొద్దూ...నాకు కూడా ఓ క్షణం అనిపించింది అలా అశ్వ్యరంలో తులతూగితే ఎలాగుంటుందా అని! మనం విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నామని, దానిద్వారా దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నామని ఆత్మవంచన చేసుకోవడంలేదుకదా అని ఓ క్షణం అనిపించింది. అదీ ఓ క్షణం మాత్రమే! చివరకి మన ఆత్మసంతృప్తే డబ్బుకంటే గొప్పదనిపించింది.”

భర్త నుండి ఆ విధమైన విష్లేషణ రావడంతో అప్పటివరకు ఏ మూలో కాస్త వెలితిగా ఉన్న సరళ మనసు నెమ్మదించింది. ఆమె మెచ్చుకోలుగా, ఆరాధనగా భర్తవైపు చూసింది.

ఆ తర్వాత చాలాసార్లు స్నేహితురాళ్ళిద్దరూ కలసుకొంటూండేవారు. మధ్యమధ్యలో రెండునెలలకొకసారైనా ఒకళ్ళ ఇంటికొకళ్ళు కుటుంబంతో వెళ్ళి సరదాగా గడుపుతుండేవారు.

అయితే ఈ మధ్య చాలా రోజులైంది అంటే దగ్గరదగ్గర ఓ ఏడాదైంది పనుల ఒత్తిడివల్ల సరళకి వీలుకాక స్నేహితురాలిని కలుసుకోలేకపోయింది. ఓ ఆదివారంనాడు ఆమెకి అనిత గుర్తుకువచ్చింది.

"ఈ మధ్యన చాలా రోజులైంది నాకు అనితని కలవడానికి వీలుపడలేదు. ఓ సారి వాళ్ళింటివైపు వెళదామండి." అని భర్తతో అంది సరళ.
"ఓ! అలాగే! పిల్లలిద్దరికీ ఏలాగూ పరీక్షలు దగ్గరకొస్తున్నాయికదా! వాళ్ళు ఇంట్లో ఉండి చదువుకుంటారు. మనమిద్దరం వెళ్దాము. రమేష్‌గారిని కలసి కూడా చాలా రోజులైంది. అసలు వాళ్ళు ఊళ్ళో ఉన్నారోలేదో, ఎందుకైనా మంచిది ఓ సారి ఫోన్ చెయ్యి సాయంకాలం వస్తున్నామని." అన్నాడు మహేష్.

"అలాగే!" అని అనితకి ఫోన్ చేసింది సరళ.

చాలాసేపు రింగైనతర్వాత, అనిత ఫోనెత్తి, "హలో!" అంది.

"హలో! అనితా! నేను సరళని. చాలారోజులైంది నీ వద్దనుండి ఫోన్‌లేదు, నాకు కూడా స్కూలుపనుల్లో తీరుబాటులేక నీతో మాట్లాడలేకపోయాను! ఇవాళ మీ ఇంటివైపు వద్దామని అనుకుంటున్నాము!" అంది సరళ.

"మా ఇంటివైపా! నేనే మీ ఇంటివైపు వస్తానులే!" అని కొద్దిసేపు ఆగింది అనిత. ఆమె గొంతులో ఉత్సాహం లేకపోవడం, భారంగా మాట్లాడటం పసిగట్టింది సరళ.

"ఏమిటే! ఏమైందే నీకు! అంత నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు!" ఆదుర్దాగా అంది సరళ.

"నేను వచ్చి చెప్తాగా." అంది అనిత ఫోన్ పెట్టేస్తూ.

'ఏమైంది అనితకి! అంత ముకసరిగా మాట్లాడింది’. ఆమె మనసు ఏదో కీడు శంకించింది. అదే ఆమె మహేష్‌కి చెప్పింది.
"ఆమె వస్తానంది కదా! ఏమైందో వివరంగా కనుక్కో!" అన్నాడు అతను.

ఓ గంటతర్వాత తమ ఇంటిముందు ఆటోదిగిన అనితని చూసి ఆశ్చర్యపోయింది సరళ. కారులేనిదే బయటకి అడుగుపెట్టని అనిత ఆటోలో రావడమేమిటో ఆమెకి అంతుబట్టలేదు.

'అదేమిటే ఆటోలో వచ్చావు! కారేమైంది?' అని అడుగుదామని నోటిదాక వచ్చినమాట అనిత మెహం చూస్తూనే ఆగిపోయింది. అనిత ముఖం విచారగ్రస్తమై, కళాహీనమై ఉంది. ఆమెలో మునపటి ఠీవి, దర్జా కనిపించలేదు సరళకి. మారు మాట్లాడకుండా ఇంట్లోకి దారితీసింది సరళ. ఆమె వెనుకే అనిత కూడా ఇంట్లోకి వచ్చింది.

"ఏమైందే? అలా విచారంగా ఉన్నావు? ఏం జరిగిందిసలు?" ఆదుర్దాగా అడిగింది సరళ.

"ఏం చెప్పమంటావు సరళా! మావారి వ్యాపారం హఠాత్తుగా దివాలా తీసింది. వ్యాపారంలో భాగస్వాములు మోసం చేసారు. అప్పులు తీర్చడానికి ఉన్న ఆస్తంతా అమ్ముకోవలసి వచ్చింది. అనుకోని సమస్యలు చుట్టుముట్టడంవల్ల అతను కూడా చాలా డల్అయి డిప్రెషన్‌బారిన పడ్డారు. ఎప్పుడు ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని నేను కూడా అతని వెన్నంటే ఉంటున్నాను. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. ఇది జరిగి ఆరునెలలయింది. ఈలోగా ఇంకో అవాంతరం వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో రెసిసన్‌వల్ల నేను కూడా నిరుద్యోగినయ్యాను ప్రస్తుతం. మా సమస్యలతో మిమ్మల్నెందుకు బాధపెట్టాలని చెప్పలేదు." అంది అనిత.

"అయ్యో! ఇంత జరిగిందా? మేమూ మా పనుల్లో బాగా బిజీగా ఉండడంవల్ల ఏమీ తెలుసుకోలేకపోయాము." నొచ్చుకుంటూ అంది సరళ.
"మీరు మాత్రం ఏం చేస్తారు? అంతా మా దురదృష్టం." అంది అనిత.

"అలాగనకు!మాకు తోచిన సహాయం మేము చేయగలం. మా ఆయనకి తెలిసినవాళ్ళు చాలామంది బ్యాంక్ ఆఫీసర్లు ఉన్నారు. స్వంతంగా తిరిగి వ్యాపారం ప్రారంభించడంకోసం లోన్‌కోసం చెప్పగలరు." అంది సరళ.

"ఓహ్! సరళా! ఆ మాత్రం మాటసహాయం చాలు మాకు తిరిగి కోలుకోవడానికి. వ్యాపారం కోలుకుంటే అతను మళ్ళీ మామూలు మనిషవుతారు." అంది అనిత.
~
ఇంతలో వీధిలోకి ఏదోపనిమీద వెళ్ళిన మహేష్ తిరిగివచ్చి విషయమంతా తెలుసుకొని వారికి తగిన సహాయం చేస్తానని మాట ఇచ్చాడు.
వాళ్ళు మాట్లాడుకుంటూండగానే, సరళ స్కూల్ హెడ్‌మాష్టర్ రాఘవరావు వచ్చాడు. అతను వస్తూనే సరళని ఉద్దేశించి, "అమ్మా! సరళా! నీకు నా అభినందనలు! ఇప్పుడే పైనుంచి వచ్చిన వార్తా విశేషమేంటంటే ఈ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రాష్ట్రపతి అవార్డుకి ఎన్నుకోబడ్డావు. కిందటి ఏడాది మహేష్‌గారు, ఈ ఏడాది నువ్వు! మీరిద్దరు మన స్కూల్‌కే గర్వకారణం. " అని ఆనందంగా వాళ్ళకి తన అభినందనలు తెల్పాడు.

అది వినడంతోనే సరళ, మహేష్ ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఇద్దరూ ఈ వార్త తెచ్చిన రాఘవరావుగారికి తమ ధన్యవాదాలు తెలిపారు. అక్కడే ఉన్న అనిత కూడా ఈ వార్తకి సంతోషించింది. ఇంట్లోకి వెళ్ళి సరళ తెచ్చిన స్వీట్‌తీసుకొని రాఘవరావుగారు సలవు తీసుకొని వెళ్ళారు.

"చూసావా సరళా! మనం త్రికరణశుద్ధిగా నమ్మిన మన వృత్తి మనకెంత గౌరవం తెచ్చిపెట్టిందో!" అన్నాడు మహేష్ సంతోషంగా.

"అవును! మనం నమ్మిన సిద్ధాంతాలే మనకి చాలా ఆత్మసంతృప్తి కలిగించాయి. నాకు ఈ గౌరవం దక్కడంవల్ల చాలా తృప్తిగా ఉంది." అంది సరళ. వాళ్ళిదరినీ మనసారా అభినందించింది అనిత.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న