“హలో….. దేవానందం బాగున్నావా ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలావుంది.” తమ్ముడ్ని ప్రశ్నించింది సుమతి
“ ఏమిటో అక్కా, జీవితం అంటేనే చాలా విసుగనిపిస్తోంది. నాకు లేకుంటే సావిత్రికి ఏదో ఒక జబ్బు. మేమిద్దరం కుదట పడగానే పిల్లలిద్దరిలో ఒకరి తరువాత ఒకరికి ఏదో ఒక జబ్బు .ఈ గ్రామంలో సరి అయిన వైద్యం లేక వారంలో ఒకటి రెండు రోజులు ట్రీట్ మెంట్ కోసం పట్నానికి వెళ్ళ వలసి వస్తోంది.”
“నాన్న చనిపోయినప్పటి నుంచి మీ ఇంటిలోని వారందరూ ఒకరి తరువాత మరొకరు అనారోగ్యానికి గురి అవుతున్నారు “
“అవునక్కా" బాధగా అన్నాడు. నాన్న మరణం వల్లనే మీకిలాగా జరుగుతున్నట్లని పిస్తోంది.”
“ఏమిటక్కా నువ్వు చెప్పడం ….”
“అదంతా నీకు అర్థం కాదు ....పక్కన సావిత్రి ఉందా “
“ఇక్కడే ఉంది.”
“సావిత్రికి ఫోన్ ఇవ్వు “
“అలాగే అక్కా “అంటూ “సావిత్రీ మా అక్క నీతో మాట్లాడాలంట" అంటూ భార్య చేతికి ఫోన్ ఇచ్చాడు దేవానందం.
“సావిత్రీ నీ ఆరోగ్యం ఎలా ఉంది.”
“ఏం ఆరోగ్యమో ....ఇంట్లో ఎవరికీ సంతోషం అనేది లేక పోయింది.ఎవరికో ఒకరికి ఏదో ఒక జబ్బు ...ప్చ్ " అంది విసుగ్గా
“నాకెందుకో మా నాన్న మరణం వల్ల మీకా పరిస్థితి కలిగినట్లనిపించింది.అనుమానంతో మా అపార్ట్ మెంట్లో ఉన్నఒకరిని అడిగాను. మా నాన్న మరణం మామూలుగా సంబవించింది కాదంటూ ఆయన ఆత్మ హత్య చేసుకొన్న సంగతి కూడా వివరించాను "
“ఏమని చెప్పారు”
“ ఆత్మ హత్య చేసుకొనడం వల్ల ఆ ఆత్మ మీ మీద పగ పట్టి ఉండవచ్చన్నారు”
“ అంటే మేమిలా అనారోగ్యం ఎంతకాలం ...."
“ ఆ సమస్యలు పరిష్కరించడానికి ఒక మార్గముందని చెప్పారు. మా తమ్ముడు దేవానందం పితృకార్యం జరిపితే ఆయన ఆత్మ శాంతించడానికి అవకాశముందన్నారు.”
"ఈ గ్రామంలో ఇద్దరు ముగ్గురు నాకు అదే సలహా ఇచ్చారు. ఎన్నడూ మాట్లాడని మా ఇంటి పొరుగింటావిడ మేము పడుతున్న బాధలు చూసి జాలి పడి అదే మాట చెప్పింది "
“పొరుగింటావిడ నీతో ఎందుకు గొడవ పెట్టుకోంది”
“ గొడవా లేదు పాడూ లేదు.ఆమె అత్తా మామలు నాతొ మాట్లాడకూడని ఆమెకు ఆఙ్ఞాపించారట “
“వాళ్లేందుకలా చెప్పారు “
“నేను మామయ్యను సరిగ్గా చూడటంలేదట. నాతొ ఆవిడ మాట్లాడితే ఆవిడకూడా అత్తమామలను సరిగ్గా చూడదన్న భయం వల్ల అలా చెప్పారంట "
"సావిత్రీ ఇలా అంటున్నానని ఏమనుకోవద్దమ్మా , ఏదో మీరు తెలిసో తెలియక పొరపాటు చేశారు . ఆ పొరపాటును ఎలా సరిదిద్దాలి తెలియక పిరికివాడిలా మా నాన్న ఆత్మ హత్యా చేసుకొని మన ఇంటి పరువును గంగలో కలిపారు. వెంటనే పురోహితుని పిలిపించి ఆబ్దీకం జరిపించు"
“ఆబ్దీకం అంటే..." అడిగింది సావిత్రి
“చనిపోయిన రోజు ఏ తిథి వస్తుందో ఆ తరువాత సంవత్సరాలలో అదే తిథి రోజు జరిపించడమే ఆబ్దికం " పోయిన సంవత్సరం మా నాన్న చెనిపోయిన తేదీ చెప్పి అడిగితె ఈ నెల ఇరవై తారీకున ఆబ్దికం జరిపించమని చెప్పారు . ఇక రెండు వారాలు ఉంది ఈ లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆబ్దికం జరిపించు "
“వెంటనే మీ తమ్ముడిని పంపి ఆ ఏర్పాట్లు చూడమంటాను." అంది సావిత్రి.
ఫోన్ కట్ చేసిన తరువాత భర్తకు వివరంగా చెబుతూ “మామయ్య మరణానికి మనమే కారుకులమంట......ఆ పాపం పోవాలంటే ఆబ్దికం చేయమంటూ సలహా ఇచ్చింది. మీ నాన్న చనిపోయి మనలను వేధించుకొంటున్నాడు. " కోపంగా అంది సావిత్రి .
“ఇప్పుడేమి చేయాలనుకొంటున్నావు " అడిగాడు దేవానందం.
“చనిపోయిన మీ నాన్న కు పురోహితుడను పిలిపించి ఆబ్దికం జరిపిద్దాము ...అప్పుడయినా ఆ మనిషి ఆత్మ శాంతించి మనపై పట్టిన పగ వదులుకొంటారనుకొంటాను.”
" నేను వెళ్లి మన ఊరి బ్రాహ్మణుడని కలసి వస్తాను." అంటూ వెళ్ళాడు దేవానందం.బసవయ్య ఒక రైతు కూలీ. లలితను వివాహం చేసుకొనడం వల్ల మామ గారిచ్చిన అర్ధ ఎకరం పొలం తో వ్యవసాయం ప్రారంభించాడు.పొదుపుగా ఖర్చుపెడుతూ మెల్ల మెల్లగా అభివ్రుది చెంది ఆరు ఎకరాల పొలానికి యజమాని అయ్యాడు.తన ఇద్దరు ఆడపిల్లలకు మంచి సంబంధాలు చూసి వివాహం జరిపించాడు.కొడుకు దేవానందం చదువు శ్రద్ద చూపించక తండ్రితో పాటు వ్యవసాయంలో సహాయం చేయ్యసాగాడు.కొడుక్కి సావిత్రి తో వివాహం జరిపించాడు. సావిత్రి అత్త మామలంటే విసుక్కొనే గుణం కలదని తెలుసుకొన్న బసవయ్య లలితలు సర్దుకొంటూ ఇరుగు పొరుగు వారికి తెలియకుండా జీవించసాగారు. వీలైనంతవరకు సావిత్రి మీద ఆధారపడకుండా ఎటువంటి గొడవలు రావడానికి అవకాశం ఇవ్వకుండా ఆ దంపతులు జీవించసాగారు.
లలిత అనారోగ్యం తో మరణించాక అసలు సమస్య ప్రారంభమైంది . ప్రతిరోజూ మామ కోడలు మధ్య మాటల యుద్ధం జరిగేది. ఆ సమయంలో దేవానందం భార్యవైపు మాట్లాడటం అతను సహించేంచలేక పోయాడు.క్రమ క్రమంగా అతనిని పశువుల కొట్టం లోనికి మార్చారు. సరిఅయిన సమయానికి తిండి లేక పోవడం చూసి భరించలేక అతను చెరువు గట్టుకెళ్ళి అక్కడున్న చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు.
నీరసంతో వస్తున్న భర్తను చూడగానే ఏదో జరిగిందని ఊహించి "ఏం జరిగింది..." అడిగింది.
“ మన ఊరిలో ఉన్న బ్రాహ్మణులు ఆబ్దికం జరిపించడానికి అంగీకరించలేదు “
“వాళ్ళ కేమి రోగం వచ్చిందట ...అంగీకరించలేదు" కటువుగా అంది.
“ఒకతనేమో ఆ రోజు వేరే కార్యక్రమమునకు ఎవరో అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారన్నారు"
“ ఆ పక్కవీధిలో ఉన్న బాపనాయన……. పిలిచారా..."
“నాకు ఊరి వారందరి దయ కావాలి . ఇప్పుడు మీకు ఆబ్దికం జరిపిస్తే ఆ తరువాత ఎవరూ నా చేత ఎటువంటి కార్యక్రమం జరిపించరు. మీరు మీ తండ్రిని సరిగ్గా చూడలేదన్న నింద వుంది అన్నాడు."
“వాడి బతుకు మీద బండ పడ. అసలు ఈ ఊరి వారు ఇంటిలో ఉన్న ముసలోళ్లను ఎవరు సరీగ్గా చూసుకొంటున్నారు.ఏమో మనమొక్కరే దోషులమైనట్లు .ఊరి చివర గుడి దగ్గర ఇంకో బాపనాయన ఉన్నారే ...ఆయన్ను అడిగారా "అడిగింది సావిత్రి.
"ఆయన అసలు నిజం చెప్పాడు "
“అసలు నిజమా...... యేమని చెప్పాడు "
“గ్రామం బడిలో మాస్టారుగా పనిచేస్తున్న జబ్బార్ ఆ ముగ్గురుని బెదిరించాడట.”
“ ఆడు బెదిరిస్తే ఈళ్ళు బయపడటమా.....చ్చ ...చ్ఛా ...సిగ్గు చేటు”
“మనుషులు ఉన్న ఇంటిలో కర్మ కాండలు చెయ్యండి. వాళ్ళింట్లో ఉన్నవారు ఒక వృద్ధుడి మరణానికి కారణమైన రాక్షసులు అన్నాడట"
ఆ మాటలకు సావిత్రి అగ్గిమీద గుగ్గిలంలా మారి జబ్బార్ ను ఏక బిగిన తిట్టసాగింది.
జబ్బార్ ఆ గ్రామంలోని పాఠశాలకు మాస్టారుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు.జబ్బార్ ముస్లీమ్ యువకుడయినా అన్ని మతాల సాంప్రదాయాలను గౌరవిస్తాడు.యువకుడైన జబ్బార్ ను ఆ గ్రామ ప్రజలు గౌరవించసాగారు.ఆ గ్రామ యువ .సంగం కార్యనిర్వాహక సభ్యుడిగా ఉంటూ ఎన్నో కార్యక్రామలలో చురుకుగా పాల్గొనేవాడు. అతను మాస్టారుగా చేరిన కొద్దీ రోజులలోనే బసవయ్య ఆత్మహత్య అతనిని బాధించడమే కాదు అందుకు కారణమైన ఆ భార్యా భర్తలపైనా కోపం కలిగింది.ఎలాగూ పితృ కర్మలు జరుపుతారని ఊహించి ముందుగానే ఊరిలో ఉన్న ఆ ముగ్గురు బ్రాహ్మణులకు దేవానందం పిలిచినా వెళ్లకూడదని హెచ్చరించాడు.
జబ్బార్ చెప్పడం లోని న్యాయాన్ని గుర్తించిన ఆ ముగ్గురి బ్రాహ్మణులు తమకు తోచిన రీతిలో వ్యతిరేకించారు. జబ్బార్ బడి వేళలు ముగియగానే ఇంటికి బయలుదేరుతున్న సమయాన గ్రామ పెద్ద రమణ దగ్గర నుండి ఫోన్ వచ్చింది.
“రమణన్నా నమస్కారం చెప్పండి "అన్నాడు జబ్బార్.
“జబ్బార్ ఒక సారి ఇంటికి రా ....నీతో కొంచం మాట్లాడాలి "అన్నాడు రమణ.
"ఇంకో ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాను అన్నా " అన్నాడు. ఫోన్ కట్ చేసే నేరుగా రమణ ఇంటికి వెళ్ళాడు జబ్బార్.
"ఏంటి జబ్బార్ మీ పంతుల ఉద్యోగం,మీ యువక సంఘము కార్యక్రమాలు ఏలా సాగుతోంది."
“రమణ న్నా మీ లాంటి వారి ప్రోత్సాహం ఉన్నంతవరకు చక్కగా సాగుతూనే ఉంటుంది.”
“జబ్బార్ నేను నిన్ను ఎందుకు పిలిపించానో తెలుసా “
“ ఆ దేవానందం గురించి పిలిచారని ఊహించాను." చిరునవ్వుతో అన్నాడు జబ్బార్ .
“ నీ ఊహించింది నిజమే .....ఈ రోజు ఉదయం నా దగ్గరకు వచ్చాడు "
“ఏమంటున్నాడు.”
“నా కాళ్ళ పై పడి బోరుమంటూ విలపించాడు “
“నిజంగా ఏడ్చాడా " అంటూ ఆశ్చర్యంగా అడిగాడు జబ్బార్
“నిజంగా ఏడ్చాడో లేక నటించాడో చెప్పలేను కానీ చాలా బయపడుతున్నాడన్న సంగతి గమనించాను"
“అన్నా మీరేమి చెప్పారు”
“జబ్బార్ , ఈ సారి వాడు ఆబ్దికం జరిపించకుంటే మరింత కష్టాలకు గురికావలసివస్తుందన్న భయంలో ఉన్నాడు.ఈ ఊరిలో ఉన్న బ్రాహ్మణులు ముగ్గురూ నీకు బయపడి ఆబ్దికం జరపటానికి నిరాకరించిన విషయం చెబుతూ గ్రామా పెద్ద అయినా నేను చెబితే వింటారంటూ కాళ్ళ మీద పడ్డాడు . నీవు ఆబ్దికం జరిపించడానికి అడ్డంకులు లేకుండా చేస్తాను అంటూ హామీ ఇచ్చాను.”
"అన్నా ,మీరు అలాంటి హామీ ఇచ్చారంటే నమ్మలేకున్నాను .మీరు అసలైన నాస్తికులు .మీరు వాడి వైపు మాట్లాడటం ..."అన్నాడు జబ్బార్.
“ జబ్బార్ నేను నాస్తికుడనే కావచ్చు,కానీ నన్ను ఈ గ్రామపెద్దగా గ్రామ ప్రజల బాగోగుల దృష్టిలో ఉంచుకొని వాడికి హామీ ఇచ్చాను.నాస్తికుడిగా నాకు నచ్చని పని అయినా గ్రామా ప్రజల కోసం అలా అన్నాను.నీవు ముస్లిం వ్యక్తివి కదా నీకు ఆబ్దికం పై నమ్మకం ఉందా "
“అన్నా , నేను ఖురాన్, బైబిల్, భగవద్గీతను పూర్తిగా నమ్ముతాను.ఆబ్దికం జరిపించడం ద్వారా అతని సమస్యలు తొలగి పోవడానికి అవకాశాలు ఉన్నాయిఅని నమ్ముతున్నాను. వాడు చేసిన తప్పు తెలుసుకొని పశ్చత్తాప పడాలనే అడ్డుపడ్డాను. ఆబ్దికం జరిపించమని బ్రాహ్మణులతో నేనే చెబుతాను.”
“జబ్బార్ నీ దగ్గర ఉన్న గొప్పతనం అదేనయ్యా ,అందుకే ఈ గ్రామంలో అందరూ నువ్వంటే ఇష్టపడుతున్నారు,అన్ని మతాలకు సమానత్వం ఇచ్చేనీ లాంటి మనుషులు నేడు కరువయ్యారు.”