నయన విన్యాసం - వారణాసి రామకృష్ణ

nayana vinyasam

పొద్దున్నే పనేమీ లేక కళ్ళు నులుముకుంటుంటే సెల్ మోగింది.,చూస్తె డాక్టర్ కన్నారావు!

అతనూ అమెరికాలో నా లాగే కంటి డాక్టరు. ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయాడు. దాదాపు ఏడాది క్రిందట కాల్ చేసి ఇండియా వచ్చేసి బోలెడు సంపాయించుకుంటా అన్నాడు. అప్పుడు నేను

“అమెరికా లో కంటే హైడ్రా బాడ్లో ఎక్కువ ఏం సంపాదిస్తావురా? ఇక్కడ పని లేక నేనే కళ్ళు నులుము కుంటున్నా” నవ్వుతూ అన్నాను. ఆ తర్వాత ఇదిగోమళ్ళిపొద్దున్నేకాల్!

“ ఇప్పుడు నేనూ హైడ్రాబాదీ నే! ” కన్నారావు హుషారుగా చెప్పాడు.

“అవునా!ఎప్పుడొచ్చావు?” అడిగితె, “ వచ్చి రెండు నెలలు దాటీంది” అన్నాడు

“హార్ని! ప్రాక్టీస్ ఎలా ఉంది” అంటే “ సూపరో సూపరు! ఫ్లాటు,ఆడి కారు కొన్నా! హహహ “ గట్టిగా నవ్వేడు. “ఓర్ని! అమెరికా లో లేని ప్రాక్టీస్ హైద్రాబాద్ లో ఎక్కడ్రా నేత్రావధాని! “ అనుమానంగా అడిగితే “ ఓరి పిచ్చోడా! హైడ్రా బాడ్లో కళ్ళ సమస్యలు ఎక్కువని ఉహించిందే నిజమైంది” అన్నాడు. “ఉహించావా? ఎలా? “

“ అదేరా నీ మంద బుద్దికి నా పాదరసం బుర్రకి ఉన్న తేడా!”“సరే ఒప్పుకుంటా! ఐతే మందబుద్ది తల్లోకి కొంచెం పాదరసం పారబోయ్యి ” “ పోస్తా .. నా క్లినిక్కి వచ్చెయ్యి” అంటూ అడ్రస్ చెప్పాడు. వెళితే మై గాడ్! ఆస్పత్రి నిండా బోలెడు మంది పేషెంట్లు! కన్నారావు చాల బిజీ గా ఉన్నాడు, నన్ను చూసి “రారా కూర్చో “ అనేసి సీరియస్ గా పేషంట్లని చూడసాగాడు. రద్దీ తగ్గాక నా వైపు తిరిగి

“చూశావా ఎంత మంది కంటి జబ్బుల వాళ్లు నీ హైడ్రాబ్యాడ్లో ? “ అన్నాడు .

“ ఇదేంటి గురూ ఇంతమంది కంటి జబ్బుల వాళ్ళు ఉన్నారని నేను ఉహించనేలేదు”

“ హహహ” మని నవ్వి కన్నారావు “ అసలు వచ్చిన పేషంట్లని గమనించావా” అడిగాడు. ఈలోగా మరింత మంది దూసుకొచ్చారు. అంతా మయోఅయంగా (అంటే అయోమయానికి తర్వాతి స్టేజిఅన్నమాట) ఉంటె వెర్రి మొహం పెట్టా. నా వెర్రి ఫేసు చూసి వెక్కిరింతతో నవ్వి
“పిచ్చోడా! మన చుట్టూ జరిగే పరిస్థితుల్ని గమనిస్తే అన్నీ అర్ధం అవుతాయ్! నువ్వు ఇక్కడి టీవీ లో డైలీ సేరియళ్ళు చూడవా?” అడిగాడు
“వామ్మో! డైలీ సీరియళ్ళా !” బాంబు బాడి మీద పడ్డట్టు తుళ్ళి పడ్డాను.

“అదేంట్రా అంతలా భయపడ్డావు ?”

“భయమా?భయమున్నరా? మా బామ్మకాశీ వెళ్తూ జీవితం మీద విరక్తి పుట్టాలనుకుంటేనే టీవీ చూడరా బడుద్దాయి అని చెప్పెళ్ళింది. అప్పట్నించి అస్సలు టీవీ ఆన్ చెయ్యలేదు! “

“నీ మొహం! అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వెర్రి మొర్రి కొత్త ఉహాలు రావాలంటే టీవీ డైలీ సీరియళ్ళు గమనించాలి, కానీ చూడకూడదు!” కన్ను గీటి చెప్పాడు

“ వల్ల కాదుగానీ ఇంకో మాట చెప్పు! “

“ కంటి డాక్టరువి అయి ఉండి కంటికి కనిపించేది గమనించవన్నమాట! “

“ సుత్తి కొట్టకుండా సూటిగా చెప్పు!”

“చెప్తా! నీకో క్లూ ఇస్తా .. ముందు ఇంటి కెళ్లి డైలీ సీరియల్సు గమనించు” అన్నాడు .

ఈలోగా మరో పేషంట్ వస్తే బగబగా ( అంటే గబాగబా కంటే ఎక్కువ స్పీడన్నమాట) ఇల్లు చేరి టీవీ ఆన్ చేసి అదేదో దిక్కు మాలిన ఛానల్ లో “కూతురా కూతురా నా ప్రియుడి పెళ్ళామా “ అనేడైలీ సీరియల్ వస్తుంటే చూడసాగాను...

**** **** *****

తల్లి పాత్రధారిణి కొడుక్కి కాఫీ కప్పు చేతిలో పెట్టగానే కోడలు పాత్రధారిణి మరో టీ కప్పు తో వచ్చి

“ ఆగవే అత్తమ్మా!” గట్టిగా అరిచింది.కొడుకు హతాశుడై చూసాడు. కోడలు కళ్ళు ఎరుపెక్కాయి. గుడ్ల్లు గుండ్రంగా తిరిగాయి. కను బొమ్మలు పైకి కిందికి ఊగేయి. విసవిసా చూస్తూ “ కాఫీ లో విషమెందుకు కలిపావు అత్తమ్మా!” కళ్ళు చిట్లించింది. మళ్ళీ కళ్ళు గుండ్రంగా తిప్పి తల వంచి అత్తమ్మని వోరగా చూసిoది. వికటాట్టహాసం చేసింది. అత్తమ్మా ఏమి తక్కువ తినలేదు ఆమె కూడా కనుగుడ్లు గిరగిరా తిప్పింది కళ్ళు చిట్లించింది. నల్ల గుడ్లు ముక్కు మీదకి రప్పించి రౌండు గా తిప్పింది . ఇలా అరగంట సేపు అత్తాకోడళ్ళ నయనవిన్యాసాలు ముగిసాక కోడలు హు అంటూ కోపంగా తిరస్కారంగా ముక్కు పుటలు ఎగురేసి కళ్ళు అగ్ని గోళాల్లా నిప్పులు కురిపిస్తూ గబుక్కున మొగుడి చేతిలో అత్తమ్మ పెట్టిన కప్పు ఒక్క లాగు లాగి నేల కేసి కొట్టి “కాఫీ లో ఏం కలిపావో చెప్పవే” అంటూ వికటంగా నవ్వింది. అత్తమ్మ కోడలు చేతిలోని కాఫీ కప్పు లాక్కుని గోడ కేసి విసిరి కొట్టి కళ్ళు తాటికాయలంత చేసి ఆవేశంతో “నా కొడుకు ప్రాణాలు తీద్దామని కుట్ర చేశావే రాక్షసీ “అంటూ అరిచింది.

అంత సేపూ బిగదీసుకుని కూచున్నకొడుకు కళ్ళు ఎర్ర బడ్డాయి.కనుగుడ్లు రివ్వు రివ్వున తిప్పుతూ చెయ్యి గాల్లోకి లేపి పెళ్ళాన్ని చాచి కొట్టాడు. కోడలుచేత్తోబుగ్గ పట్టుకునిఅత్తమ్మని కొరకొరాచూసింది.అత్తమ్మకళ్ళలోపైశాచిక నవ్వుస్పష్టంగాకనిపించింది. ఇంతలో కొడుకు వేగంగా తల్లి వైపు దూసుకొచ్చి బాక్సర్ లా ముక్కు మీద బలంగా పంచ్ ఇచ్చాడు. ముక్కు ఈ లావున వాచింది. అత్తమ్మ కళ్ళు అవమానం భారం తో షాక్ తిన్నట్టు చూశాయి. కోడలు క్రౌర్యం నిండిన చూపులతోచూసింది. కొడుకు కొరకొరా ఇద్దర్నీ చూసి ”పొద్దున్నేకాఫీచుక్కపొట్టలో పడక పొతేచస్తాను! చంపేద్దామని అత్తాకోడళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారా?”అంటూ జేబులోంచి కత్తి తీసి పెళ్ళాం పొట్టలో ఒక్క ఉదుటున పొడిచి భయంకరంగా నవ్వుతు గుడ్లుతిప్పాడు . తల్లి మంచి పనిచేసావురాఅబ్బాయ్ అన్నట్టు కళ్ళుఆడించింది.

ఈసారి కొడుకు కత్తితోతల్లిగుండెల్లోబలంగాపొడిచాడు.అత్తాకోడళ్ళిద్దరూహాహాకారాలుపెడుతూ గుడ్లు మిటకరించారు.ఆతను హేళనగా నవ్వి పక్కకి జరిగితే..అక్కడ మరో ఇద్దరు ఆడ వాళ్ళు. ఒక పడుచు అమ్మాయి, ఇంకో పెద్దావిడ! ఇద్దరూ గార పళ్ళు బైట పెట్టి కళ్ళ తో నవ్వేరు. కొడుకు పెద్దావిడ తో

“ అత్తా! నా పెళ్ళాం చచ్చిన మరుక్షణం నీ డాటర్ మెళ్ళో తాళి కడతా” అంటుండగానే అక్కడమరో కుర్రాడు పిచ్చినవ్వులు నవ్వుతూ రక్తంమడుగులోఉన్నకోడలికిపిస్టల్ అందిస్తే కోడలు మొగుడికి గురిపెట్టిగుడ్లుమిటకరించింది. పడుచు అమ్మాయి మొహం లో రంగులు తిరిగాయి.కళ్ళు భయంతో పెద్దవి అయినాయి. కెమెరా స్లో మోషన్ తో ఆ ఇద్దరి మొహల్లోకి జూమ్ అవుతుండగా “సుమతి పతి సుమంత్ ని చంపుతుందా లేక సవితి రేవతిని కాలుస్తుందా? రేపటి భాగం లో..’ అన్నఅక్షరాలు కనిపించాయి. తర్వాత ఆ సీరియల్ లక్షా పాతిక వేల భాగాలు పూర్తి చేసుకున్నట్టు చూపించి మళ్ళి తర్వాతి భాగం రేపు మధ్యాహ్నం ఇదే టైం కి అంటూ ముగించారు. నేను “మయ్యా-అ” అనుకుని( అంటే అమ్మయ్యా కంటే ఎక్కువ రిలీఫ్) ఛానల్ మారిస్తే- “ సావిత్రిగారి సావిట్లో సంపెంగ చెట్టు” డైలీ సీరియల్ వస్తోంది

***** **** *****

పెళ్లి కొడుకు విసురుగా జీలకర్ర బెల్లం పెళ్లి కూతురి నెత్తి మీద పెట్టాడు. పెళ్లి కూతురూ కోపంగా అతని నెత్తి మొత్తి మొట్టికాయ వేసింది. పెళ్లి కొడుకు తల వంచిన వాడల్ల్లా నలభై ఇదు డిగ్రీలు తిప్పి కళ్ళెర్ర జేశాడు. గుడ్ల్లు గుండ్రంగా తిప్పాడు.కను బొమ్మలు పైకి కిందికి ఊపాడు. చేతి కంటిన బెల్లంపాకం నాకుతూ “ఇకనుంచి నీకు పిచ్చిపట్టిస్తానే! పెళ్లి అయ్యిందనిసంబరమా!సంక నాకిపోతావ్! చిత్ర హింసలు భరించలేక పిచ్చికుక్కలా రోడ్డున పడతావ్!” అంటూ భయంకరంగా నవ్వుతూ కళ్ళు రౌండు రౌండు గా గిర గిరా తిప్పేడు. ఈలోగా కెమెరా పెళ్లి కూతురి మొహం మీద జూమ్ అయ్యింది. ముందు నవ్వి ఆనక కళ్ళు నిప్పుకణికల్లా ఎర్రగా చేసింది. ఒక్కసారిగా గాల్లోకి లేచింది. జుట్టు విరబోసి కళ్ళు నిప్పుల్లా మెరుస్తుంటే వికటాట్టహాసం చేసి “వదలనురానిన్ను! పెళ్లి అయిపోయింది ఇక నన్నోఆటఆడిద్దా మనుకుంటున్నావా ..ఆట! హహహా! శోభనం గది లో నీకు..” అంటూ చిటికెన వేలు పైకెత్తి చూపించి “నాలుగు లీటర్లు పోయిస్తా! తోలి రేయే.నీకిక ఆఖరి రేయి! హహహ్హ!! “ అంటూ వంకర తలతో కళ్ళు గిర గిర తిప్పింది.

హర్నయనోయ్! నేను బెంబేలెత్తిపోతూ ఛానల్ తిప్పితే మరోమాయదారి డబ్బింగ్ సీరియల్ -

“మామగారింట్లోమందేది” వస్తుంటే పెట్టా. నా కర్మ కొద్దీ అది మరింత దారుణం ..

**** **** *****

బోలెడు మంది నంగిరి నంగిరిగా నవ్వుతూ వెర్రి వెర్రిగా ఎగుర్తూ గంతులేస్తున్నారు బ్యాక్ గ్రౌండ్ లో ఏదో పిచ్చి పాట: హిందూస్తాన్ మే సబ్ సే అచ్చా డాడీ, ప్యార్ సనం తుజుకో ముజుకో సలాం కరుంగా డాడీ అంటూ చిరిగిన జీన్స్ వేస్కుని ఒక పిల్ల పాడుతూ డాడీ డాడీ అంటూ బఫూన్ లా ఉన్న అతనితో ఏదేదో బడబడా వాగుడు పండులా వాగుతూ (అంటే వాగుడుకాయ కన్నాఎక్కువన్న మాట)కస్సుకస్సు మంటూ నవ్వింది. సదరు డాడీ అంత దాకా మాములుగా చూసిన వాడల్లా వికటంగా కళ్ళు చిట్లించాడు. కనుబొమలు దగ్గరగా చేసి కనురెప్పలు టపటపా లాడించి కూతురు చేతిలో కొత్త కారు తాళాలు పెట్టేడు. కారు తాళం గాల్లోకి ఎగరేసి అమ్మాయి నడుస్తుంటే స్లో మోషన్ లో చూపించారు. డోర్ తీసి ఇంజిన్ ఆన్ చేసింది. ఈసారిసదరు డాడీకూతుర్నిశత్రువుని చూసినట్టు చూస్తుంటేమళ్ళిబ్యాక్ గ్రౌండ్ లో పిచ్చిపాట:
”ఈ కారు ప్రయాణం నీకు అంతిమప్రయాణం! అనంత లోకాలకి పయనం ” అంటూ! అంతలోనే కెమెరా డింగు డింగు మని కుదుపులతో జూమ్ చేసి కూతుర్ని చూపగానే మొహం లో పైశాచిక నవ్వు ప్రత్యక్షమైంది. కారు వేగంగా ముందుకుపోగానే వెనక ఆమె ప్రియుడు రాకేశ్ ఉన్నాడు. కూతురు క్షణం లోనే రూట్ మార్చి డాడీని గుర్రుగా చూసి కళ్ళు ఎర్రగా చేసి “ సారీ డాడీ!నువ్వు నా తండ్రివి కాదనీ ప్రియుడు రాకేశ్ చెప్పాడు ఇన్నాళ్ళు మోసం చేసినందుకు నీకిదే శిక్ష” అంటూ డాడీ మీదకి అతివేగంగా కారు నడపసాగింది. మిగతా జనాలు కెవ్వు కెవ్వు మని అరుస్తూ కళ్ళుగిర్రు గిర్రున తిప్పేరు ఒకళ్ళ వంక మరొకళ్ళు ఎందుకో వింత వింత చూపులు చూసుకున్నారు. దూసుకోస్తున్న కారునిచూసిడాడీకనుగుడ్లు భయం తో పెద్దవయి చావు భయం కళ్ళల్లోస్పష్టంగాకనిపించిందిఇంతలోసదరు ప్రియుడు రాకేశ్ తల తిప్పికారుకి అమర్చిన బాంబురిమోట్ చేత్తోతడిమి నవ్వి“నువ్వుమాంగారిని డీకొట్టిన క్షణమేనీ ఆఖరిక్షణం” అనేసి పక్కనేఉన్న డాడీ భార్యతో “ఒక్క దెబ్బకి రెండు పిట్టలు” గొప్ప పని చేసినట్టు చెప్పాడు అంతపెద్దావిడ రాకేశ్ ని కౌగలించుకుని “ఆస్తి మన చేతికి రాగేనే ఫారిన్ పోదాం “ అంది. కార్లో అమ్మాయి కళ్ళు చికిలిస్తూoడగా తెర మీద సీరియల్ పాతిక లక్షలా తొంభై తొమ్మిదోభాగం పూర్తి అయినట్టు అంకెలు కనిపించాయి!

అయిపోయిందా? వామ్మో! ఇవేం మాయదారి సీరియల్స్! తలదిమ్మెక్కి నిద్ర మాత్రలు వేస్కుంటే గాని నిద్ర పట్టి చావలేదు. మర్నాడు పొద్ద్దున్నే కంటిడాక్టరు కన్నారావు గుర్తొచ్చి ‘అయినా నన్ను ఇవన్ని ఎందుకు చూడమన్నాడో?’ అర్ధం కాక ఆస్పత్రికి మళ్ళీ వెళ్ళా!
నన్ను చూడగానే కన్నారావు “ ఊ! టీవీ సీరియళ్ళు చూశావా” అడిగాడు

“ చూశాలే గానీ ఈ తుక్కు సీరియళ్ళకి నువ్వు హైదరాబాద్ రావటానికీ ఏంటి సంబంధం?

“చెప్తా, ఇంతకీ అందులో నటించిన వాళ్ళగురించి ఎప్పుడైనా ఆలోచించావా? “ ఆ ప్రశ్నకి విస్తూపోయాను.

” లేదు! కానీ ప్రతీరోజూ సిరియల్స్ చూసే ప్రేక్షకులని తలచుకుంటే కడుపు తరుక్కుపోతోంది.”

“అక్కడే దాల్ లో లెగ్గేశావు! నువ్వు గమనిస్తే- ఆ నటీనటులు క్షణానికోసారి కళ్ళు తిప్పాలి! నిమిషానికి నాలుగుమాట్లు గుడ్లు మిటకరించాలి!అదేంత కష్టమో అసలు అలా నటించడం వల్ల వాళ్ళ కళ్ళు ఎంత దెబ్బతింటాయో ఊహించావా??” అతని ప్రశ్నకి ఉలిక్కిపడ్డాను. వరండా లో ఉన్న పేషంట్లు టీవీనటులు అన్నసంగతిఅర్ధమైంది! “అంటే. అంటే” నోటెమ్మట మాట రాక నిర్ఘాంతపోయి తేరుకుని అడిగే లోగా బిలబిలమంటూ ఇద్దరు పెషంట్లు వచ్చేరు. వాళ్ళు ఎవరో కాదు నిన్న చూసిన “కూతురా కూతురా ప్రియుడి పెళ్ళామా” సీరియల్ లో అత్తాకోడళ్ళు! పాపం ఇద్దరి కళ్ళు ఇంతలావున వాచిపోయి ఉన్నాయి. కళ్ళక్రింద ఉబ్బెత్తుగా ఉంది. కన్నారావు నవ్వుతు” ఎలాఉంది కన్ను తగ్గిందా?” అడిగితే ఇద్దరూ బొంగురు గొంతు పెట్టి “ ఏం తగ్గడమో నా బొంద! మీ ట్రీట్మెంట్ తో కాస్త కళ్ళ వాపు తగ్గుతుండగానే నిన్నమళ్ళీఇంకో ఎపిసోడ్ చెయ్యాల్సివచ్చింది” చెప్పారు. వెంటనే నేను కుతూహలంగా

“దీన్లో కూడా మీరు కళ్ళు తిప్పట మేనా?” అడిగితే నన్ను వింతగా చూసి “కూడా అని అడగటం దేనికీ? నా బొంద! దేనిలో అయినా కళ్ళు గిర గిరా తిప్పాల్సిందే! నా బొంద ..గుడ్లు మిటకరించలేక చచ్చిపోతున్నాం బాబూ ” అంది. కన్నారావు డ్రాప్స్ వేసి అత్త క్యారక్టర్ ఆవిడతో

“ వచ్చే నెల లేజర్ ట్రీట్మెంట్ చెస్తానమ్మ” అన్నాడు. ఆమె బోలెదు ఫీజిచ్చి వెళ్లి పోయింది.

“నీ పనే బావుందిరా! మొత్తానికి భలే ప్లాన్ వేసావు! అసలు ఈ ఐడియా నీకెలా వచ్చిందిరా?”

“అమెరికాలో రాత్రి మీకిక్కడ పగలు!ఓరోజు నిద్రపట్టక ఇండియా టీవీఛానళ్ళు చూద్దాం అని పెడితే మై గాడ్, మించుఇంచు ... అన్నీ “ కన్నారావు చెప్పబోతే ఆపి “‘మించుఇంచు అంటే?” అడిగాను.

“ఇంచుమించుకి ఎక్కువన్నమాట!నువ్వు పదాల్నికాయినిoగ్ చెయ్యటం నచ్చినీదగ్గర్నుంచే నేర్చుకున్నా!”

“గురువుని ‘ముంచిన’ శిష్యుడివి! తర్వాతి సంగతి చెప్పు”

“ఇలాసీరియల్స్ లో కళ్ళు గిరగిరా తిప్పటం, గుడ్లుఉరమటం,కనుబొమలు మడవటం, రెప్పలు కొట్టడం మొత్తం నయనవిన్యాసాలే! దాంతో ఒక కంటి డాక్టర్ గా వెంటనే నాకీ ఆలోచన వచ్చింది హైడ్రాబ్యాడ్లో ఉండే బోలెడుమంది నటీనటులు ఇలాసీరియల్స్ లోనటించడంవల్ల వాళ్ళ కళ్ళు గ్యారెంటీగా దెబ్బతింటాయికదా! అంటే ఇక్కడ కంటి డాక్టర్లకి మంచి ప్రాక్టీస్ ఉంటుందని ఉహించి వచ్చేసా!రాగానే వీళ్ళందర్నీ కలిసి మీటింగ్ పెట్టి కంటిజబ్బుల గురించి హెచ్చరించా!అంతే తక్కిన కధoతా నీకు తెలిసిందే”

తల వంకరగా పెట్టి గుడ్లుమిటకరించి నవ్వుతూ అచ్చంగా సీరియల్స్ లో లాగే చెప్పాడు.

సీరియళ్ళ లో నటించే వాళ్ళ గురించి డాక్టర్ కన్నారావు ఆలోచించాడు బానే ఉంది కానీ రోజు చూసే వీక్షకుల సంగతి? అక్రమ సంబంధాల్ని ఆసక్తికరంగా, చవకబారు కధనాల్నినేత్రజాలపర్వంగా చూపెడితే చూసే జనం మెదళ్ల లోకి ఇంద్రజాలంలా విషం ఎక్కినేలబారుతనం పెరిగిపోదూ?! సీరియళ్ళలోఒకరుఇంకోర్నిచంపుతూ కుట్రలు పన్నుతూ..మరీ అన్యాయంగా కాక పోతే మానవసంబంధాలు

మట్టికొట్టుకుపోయినట్టుఇవేం కధనాలు? సాధారణ జనం వీటిని చూస్తే సానుకూల దృక్పధం నశిస్తుంది. ఒకరంటే ఒకరికి భయం! ఆందోళన! ఒకరి పట్ల మరొకరికి అపనమ్మకం! కాపురాల్లో అనుమానాలు పెరిగి మనస్పర్ధలు ఎక్కువై పోతాయి! చిన్న చిన్నసంఘటనలే పెను ఘర్షణలు గా మారి సమాజంలో అశాంతి పెరగటం గ్యారెంటీ ! తీసేవాళ్ళు ఏమైపోతున్నారో గాని చూసేవాళ్ళు నాశనమైపోతూ పరోక్షంగా వాళ్ళ జీవితాలు అతలాకుతలమై సమాజంలో సభ్యత సంస్కారాల స్థాయి ఎలా దిగాజారుతోందో ఎవరు ఆలోచించాలి?ఎవరు పట్టించుకోవాలి? ఆలోచిస్తూ నేను లేవగానే

“ సడెన్ గా లేచేవేంటి ? “ కన్నారావు అడిగాడు.

“ అర్జెంటు గా ‘నయన విన్యాసం ’ కథ రాయాలి! ఎవరూ పట్టించుకోని ఈ సమస్యని ప్రజలoదరి దృష్టికి తీసుకెళ్ళాలి“ సాలోచనతో చెబితే వింతగా చూసి అన్నాడిలా-

“చక్కగా అవకాశం ఉపయోగించుకుని ప్రాక్టిసు చేసుకోక ఈ నయనవిన్యాసాలు మనకెందుకు రా?”

“ అందరూ అలానే అనుకుంటే ఎలా? పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి కదా! “

అచ్చంగాసీరియల్స్ లోలాగే గుడ్లుమిటకరించి నయనవిన్యాసాలు చెయ్యబోయి భయంతో ఆపేశాను.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న