ఇదేమి న్యాయం? - డా. లక్ష్మి రాఘవ

idem nyayam

చీకటి అవుతూంది.

కొద్దిగా మబ్బులు కమ్మి ఇంకా చీకటిగా అనిపిస్తూంది.

6 గంటలకు వచ్చే ఎక్స్ ప్రెస్ రైలు ఆ చిన్ని స్టేషన్ దగ్గర ఆగదు. నిలిచేది తిరుపతి కి వెళ్ళే పాసింజేర్ రైలు మాత్రమే. అదికూడా ఒక్క రెండు నిముషాలు. దానికోసం వచ్చే ప్రయాణీకులు బహు తక్కువ.

రోజూ సాయంకాలం ఎక్స్ ప్రెస్ రైలు వచ్చే సమయానికి స్టేషన్ చివరగా వున్న బెంచీ పై కూర్చుని చూడటం ఇష్టం రాముకు. కూత వేసుకుంటూ స్పీడుగా వెళ్ళే రైలు వాళ్ళ వచ్చే గాలి ముఖాన పడుతూ వుంటే పొడుగ్గా, అందంగా వంపుతిరిగే రైలు చూడటానికి ఎంత బాగుంటుందో...

రైలు స్టేషన్ కు ఆపక్క తమ గుడిసె కనిపిస్తూ వుంది.

రాము తండ్రి శివుడు రాము పుట్టిన ఐదు ఏళ్లకు యాక్సిడెంట్ లో చచ్చి పోయినాక ఈ రైలు స్టేషన్ పక్కన గుడిసెలో వుండే తాత దగ్గరికి వచ్చేసినారు. తాత శానా ఏండ్లుగా ఆ స్టేషన్ ఊడుస్తూ, మిగిలిన టైములోకూలి చేసుకునే వాడంట. ఇప్పుడు తాత కు చేత కాదని రామూ వాళ్ళ అమ్మ గంగ స్టేషన్ వూడవటమే కాదు రోజూ వూరిలో వున్న గవర్నమెంటు స్కూల్ లో మధ్యాహ్న భోజనం తయారు చేసే వాళ్ళ కు బోకులు తోమి పెట్టేది. పని అయినాక వాళ్ళు పెట్టె అన్నం ముగ్గురికీ సరిపోయేది. పోనీ చదువుకుందామని స్కూలులో చేరినా వయసు పెద్ద అని అందరూ ఎగతాళి చేస్తావుంటే ఇష్టం కాలేదు వాడికి. అమ్మతో పొద్దున్న పనికి వెళ్లి వచ్చినాక పనేమీ వుండదు. స్టేషన్ దగ్గరే ఉండిపోతాడు. కూలి పని కూడా వుండదు ఎందుకంటే తిరుపతి రైల్ ఆగే రెండు నిముషాలకు అక్కడకు వచ్చే పాసెంజర్లు కూలికి మనిషి కోసం చూడకుండా వారి సామాను వాళ్ళే ఎత్తుకుని ఎక్కేస్తారు.

కానీ రోజూ రైలు కోసం ఎదురు చూసేది ఇష్టం పదేళ్ళ రాము కు.ఎక్స్ ప్రెస్ రైలు ఎల్లిపోగానే అమ్మ పిలుస్తుంది. తాత సీతయ్యను పట్టుకుని బయటకు తీసుకువచ్చి వొంటేలు చేయించాల. ఈ మధ్యంతా తాత కు వొంట్లో బాగలేదు. జరం కూడా మళ్ళీ మళ్ళీ వస్తానే వుంది. డాక్టరు దగ్గరికి పోదామంటే వూరు చానా దూరం. అందుకే అమ్మ ఊర్లో వున్న మెడికల్ షాపు లో మందులు తీసుకు రమ్మంటుంది.

వూరు ఎందుకంత దూరం అని తాతను అడిగితే రైలు వూరికి దగ్గరగా ఎల్లితే ఎప్పుడైనా పట్టాలు తప్పి వూరి మీదకు వస్తుందని, రైలు వచ్చినప్పుడు విపరీతమైన శబ్దం వస్తుందనీ మావూరికి మూడు మైళ్ళ కవతల రైల్వే లైను ఉండాలనీ అర్జీ పెట్టుకున్నారంట వూర్లో పెద్దలు ఆ కాలం లో.

ఇది ఎంతో విచిత్రం గా అనిపిస్తుంది రాము కు. ఇన్నేళ్ళయినా వూరు స్టేషన్ వైపు పెరగనే లేదు. అందుకే అన్నీ దూరమే.రాము ఇంకా చిన్నగా వున్నప్పుడు ఒకసారి ఒక మనిషి రైలు కింద పడి చచ్చి పోయినాడు. పోలీసులు వచ్చినా శవాన్ని ముట్టుకోరు. ముక్కలుగా అయిపోయిన శరీరాన్ని అక్కడే వున్న తాత ను ఒక చోట పెట్టమంటారు. ఇంకా జేబులు వెతకమంటారు. తాత చేసిన పనికి ఇరవై, లేదా ముప్పై రూపాయలు ఇస్తారు.

ఆ రోజు ఇదంతా చూసిన రాము కు శానా భయం వేసింది. చచ్చినోడు దయ్యమై తనను పట్టు కుంటాడేమో నని...ఆరోజు రాత్రి జరం కూడా వచ్చింది. తాతను దగ్గరగా పండుకున్నాడు.

“మనల్ని ఏమీ చేయ్యవురా...బయపడద్దు. పోలీసోల్లు చేసే పని మనచేత చేయిస్తారు గదా పాపం కూడా రాదులే. ఈ టేషన్ వూరికి దూరంగా వుంది కదా మనిషి సంచారం కూడా వుండదు. అందుకే చావాలను కునే వాళ్ళు ఈడికి వస్తావుంటారు.” అని సమాదానం చెప్పినాడు తాత.
“ఇంకా కొంతమంది ఖూనీ చేసి శవాన్ని ఈడకు తీసుకొచ్చి రైలు కింద పడేసిన రోజులు కూడా చూసినానురా నేను...” అని కూడా చెప్పినాడు.
రైలు కోసం రోజూ ఎదురు చూసినా రైల్వే లైను దగ్గరగా ఎవరూ రాకూడదని అనుకుంటాడు.

ఎవరూ చావకూడదని వాడి మనసుకు అనిపిస్తావుంటుంది.

*******

రోజూలాగే ఆ రోజూ రామూకు రైలు కోసం ఎదురు చూపు. తల తిప్పి ఇటుగా చూస్తే దూరాన రైలు పట్టాల దగ్గరగా ఒక మనిషి వస్తూ కనిపించినాడు. బహుశా ఆ మనిషికి ఇప్పుడు రైలు వస్తుందని తెలియదేమో అని గాబరా పడినాడు రాము. పైకి లేచి చెయ్యి పైకెత్తి దూరంగా పోమ్మన్నట్టు వూపినాడు. ఆయన రామును గమనించి నట్టే లేదు. రైలు పట్టాల పక్కనే నడుస్తా వున్నాడు, పరిగెత్తుకుని చెప్పుదామా అంటే చాలా దూరం! ఇంతలో రైలు వచ్చేస్తూ౦ది. అందుకే నిస్సహాయంగా చూసినాడు.ఆయన ఒక చోట నిలబడినాడు కానీ రైలు పట్టాల దగ్గరగానే...రైలు కూత వినిపించి తలెత్తితే రైలు రావడం కనిపించి దూరం జరుగుతాడులే అనుకుంటూ వుంటే రైలు కూత వినిపించింది. స్పీడుగా వస్తూన్న రైలును చూస్తూ తల తిప్పి ఆ మనిషి దూర౦గా పోయినాడా అని చూసినాడు.

రాము చూస్తూ ఉండగానే ఆ మనిషి పట్టాల మీదికి దూకడం రైలు అతని మీదుగా వెళ్ళడం కళ్ళారా చూసాడు రాము. రైలు వెళ్ళిపోయిన మరుక్షణం రాము ఆ వైపుకు పరిగెత్తుకుని వెళ్ళినాడు.ముక్కలు ముక్కలుగా అయిన మనిషి, పట్టాలంతా రక్తం చూసి కళ్ళు తిరిగినాయి. వెనక్కి గుడిసె దగ్గరకు పరిగెత్తి అమ్మకు చెప్పినాడు. వాళ్ళు స్టేషను మాస్టర్ కు చెప్పితే ఆయన పోలీసులకు ఫోను చెయ్య సాగినాడు.
రాము తో తోబాటు గంగ అక్కడికి వెళ్ళింది.

“ఎవరో ఏమో పాపం ఇట్లా చావాలని అనుకున్నాడు...” అనింది రాముతో.

“పోలీసులు వస్తారు మీరు దగ్గరికి పోవద్దు” అని హెచ్చరించి నాడు స్టేషన్ మాస్టర్. గంగ దూరంగా నిలుచుంది.

పోలీసులు రావడానికి అరగంట పట్టింది. వాళ్ళు రాగానే ఫోటోలు తీసుకున్నారు. రామూను, స్టేషన్ మాస్టర్ ను వివిధ ప్రశ్నలు వేసినారు. రాము మాటలను బట్టి చివరిసారిగా బతికున్న అతన్ని చూసింది రాము అని తేల్చారు.శవానికి తల మొండెం వేరై భయంకరంగా వున్నాడు. అక్కడే వున్న రామూను సాయం రమ్మని శవం భాగాలు ఒక దగ్గర చేర్చినారు. జేబులువెతికించి నారు..శవ బాగాలు ఆంబ్యులేన్స్ లోకి పెట్టుకున్నారు. రాము చేతిలో 50 రూపాయలు పెట్టినారు సాయం చేసినందుకు. చుట్టూ వున్న ప్రదేశం క్షుణ్ణంగా చూసినారు.

“ఏదైనా వస్తువులు పడినాయేమో చూడరా” అని రాము చేత వెతికించి నారు. ఇంతలో గంగ దగ్గరగా వచ్చి “చిన్న పిల్లగాడు భయపడతాడు” అంది నిష్టూరంగా.

“వాడు స్టేషన్ కు రావాల్సి వస్తుందమ్మా. ఈ మనిషి రైలుకింద పడటం వాడే కదా చూసినాడు”అన్న కానిస్టేబుల్ తో

“అట్లా తంటాలు మాకు పెట్టద్దయ్యా. వాడు చిన్నోడు ...” అని రాము ని లాక్కుని వస్తావుంటే కనపడింది రాళ్ళ పక్కగా నల్లని పర్సు గంగకు. వంగి తీసుకుని జాకేట్టులో పెట్టుకుంటా వుంటే అడిగినాడు రాము “ఏందే “అని

“ఏమీ లేదు. నువ్వు పద...”అని చెయ్యి పట్టుకుని ఈడ్చుకుని గుడిసె దగ్గరికి వచ్చింది గంగ.

“యాడికి పోయినారు” అని అడిగినాడు తాత.

ఇషయం చెప్పింది గంగ.

“ఇసువంటివి నేను ఎన్ని చూసినానో“ నిట్టూర్చినాడు తాత. పొయ్యి దగ్గరికి పోయి మెల్లిగా పర్సు బయటికి తీసింది. అందులో ఏముందో చూస్తావుంటే చూసినాడు రాము.

“ఏందమ్మా” అని అడిగినాడు

”ఏందోలే నీకెందుకు?” అనింది.

ఆ మాటకు సర్రున అమ్మ చేతిలో పర్సు లాక్కున్నాడు రాము. దానిలో వుండే నూరు రూపాయల నోట్లు కిందకు పడినాయి. ఒక ఫోటో కూడా కింద పడింది.

ఆ ఫోటో లో వున్నది ఆ చచ్చిపోయిన ఆయన!

“ఛీ మడిసి చచ్చిపోయింటే ఆడి పర్సు తెస్తావా?” కోపంగా అన్నాడు రాము.

“దుడ్లు తీసుకుంటా. పర్సు అక్కడే పారెయ్యి.వాళ్ళు చూసుకుంటారు. తాత కు డాక్టరు దగ్గర చూపించుదాము” అనింది గంగ.

“వద్దే చచ్చినోడి సొమ్ము మనకెందుకు ఇచ్చి వస్తా” అని పర్సు తీసుకుని బయటకు పరిగెత్తినాడు రాము.

శవం పడినచోట ఇంకా ఒక కానిస్టేబులు వున్నాడు.

పర్సు అమ్మ తీసుకోచ్చిందంటే ఏమంటాడో అని భయం వేసింది.

ఆయన దగ్గరికి పోయి “సార్...దావ లో ఇది దొరికింది...” అని పర్సు చేతిలో పెట్టినాడు రాము.

“ఎక్కడ రా?” అని అడుగుతూనే పర్సు తెరిచినాడు.అందులో వున్న దుడ్లు, ఫోటో చూసి

“మంచిపని చేసినావురా ...దీనిలో అడ్డ్రెస్ కూడా వుంది” అంటూ పర్సులోని నూరు రూపాయల నోట్లు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. అది చూసి నోరు తెరుచుకున్న రాము చేతిలో పది రూపాయల నోటు పెట్టి

“ఇందులో దుడ్లు వుండినట్టు ఎక్కడా చెప్పద్దు ఎవరికీ“ అన్నాడు.

రామూ అట్లనే చూస్తూ వుంటే “ఇదిగో ఇది కూడా తీసుకో” అని ఒక నూరు రూపాయల నోటు పెడుతూ

“ఎక్కడైనా దుడ్లు సంగతి చెప్పినావో, పర్సు ఖాళీ చేసి ఇచ్చినావని బొక్కలో వేయిస్తా” అని బెదిరించినాడు.

“ఇదెక్కడి న్యాయం?”అనుకుంటూ రామూ వెనక్కి తిరిగినాడు.

అమ్మ తీసుకుని వుంటే తాతను డాక్టరుకు చూపించేది కదా... రాము చిన్ని బుర్రలో ఎన్నో ఆలోచనలు.

మరసనాడు కానిస్టేబులు తో ఒకాయన వచ్చి చచ్చిపోయినాయన మెడ లో బంగారు గొలుసు వుండాలి తీసుకున్నావా? అని ప్రశ్నిస్తే బిత్తర పోయాడు లోకం తీరు తెలియని రాము.

అందరూ స్కూలుకు వెళ్లి చదువుకోవాలి అని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా రామూ లాటి వాళ్ళు మిగిలిపోతూనే వున్నారు. రైలుపట్టాల మీద హత్యలూ, ఆత్మహత్యలూ జరిగినా శవం ముట్టుకుని సాయం చెయ్యడానికి పిల్లలను ఉపగియోగిస్తూనే వున్నారు.
శవాల మీద రూకలు ఏరుకునే ముఖాలూ తగ్గడం లేదు. ఈ తీరు మారేదేన్నడు? సమాజం బాగుపడే దేన్నడు??

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న