అక్షయం - శ్రీచరణ్ మిత్ర

akshayam

అలసిన సూర్యుడు విశ్రమించడానికి సిద్ధమవుతున్న వేళ...అవని అంతా చీకటి చాటున అవస్థపడుతోంది. అలాంటప్పుడే నా దినచర్యలో రెండవ అంకం మొదలవుతోంది. నా డెబ్బయి రెండు సంవత్సరాల వార్ధక్క్యాన్ని, దానివలన వచ్చే నిస్సత్తువను అధిగమించడానికి అవస్థపడుతున్న నేను, తప్పనిసరై చేస్తున్న వ్యాపకమే ఈ గ్రంధాలయంలో ఉద్యోగం.

తమ కులం గుర్తింపు కోసమో… మేమూ దాతలమే అని గర్వించడం కోసమో ఒక కులం వారు ఏర్పాటు చేసుకున్న ఈ గ్రంధాలయంలో నేనో ఉబుసుపోని ఉద్యోగిని.

నామమాత్రపు వేతనంతో దాదాపు ఐదు సంవత్సరాలుగా...నా పనికిరాని కాయంతో ఈ పనిని పవిత్ర యజ్ఞంగా భావిస్తూ...పఠితలకు కాలక్షేపం కలిగించాలని ఆరాటపడుతుంటాను.

కానీ అది కూడా ఇక్కడ నామమాత్రంగానే జరుగుతుంది.

కేవలం దాతల దయచేతనే నడుపబడుతున్న ఆ గ్రంధాలయంలో ఒక వారం ఒక వార పత్రిక వస్తే...మరుసటి నెల వరకూ ఆ వార పత్రిక అక్కడే ఉంటుంది. ఆ పత్రిక డోనర్ వీక్లీ వేస్తున్నాడో, మంత్లీ వేస్తున్నాడో ఆయనకే తెలియదు.

మరో డోనర్ డైలీపేపరు గ్రంథాలయానికి డొనేట్ చేస్తున్నాడు.అది ఆ డోనర్ ఇంటివారు, ఆయన బంధువులు చదివేసిన తరువాత నేను గ్రంధాలయం మూసేసే గంట, అరగంట ముందు లైబ్రరీ కి ఉదారంగా ఇవ్వబడుతుంది.

నాకైతే ఆ మరుసటి రోజైనా - ఆ దిన పత్రికను చదువుకునే భాగ్యం దొరుకుతుందేమో కానీ - ఏ రోజు వార్తలు ఆ రోజే తెలుసుకోవాలనే ఔత్సాహికులు - మరుసటిరోజున ముందురోజు పేపరు పట్టుకోమన్నా పట్టుకోరు. ఆ వార్త విశేషాలను ముందురోజు టీవీల్లో దర్శించేస్తారు మరి. సరే, ఇప్పుడు నేను ఈ లైబ్రరీల తీరు తెన్నుల గురించి చెప్పడం అప్రస్తుతం అనుకుంటాను. అయితే ఈ లైబ్రరీలో ఆగిపోయిన గడియారం ముల్లులా నేనూ - గోడకు దీనంగా వేలాడుతున్న సరస్వతీ దేవి చిత్రపటం, అప్పుడప్పుడు నన్ను పలుకరించడానికి వచ్చే స్నేహితులు, చదవడానికి కాకుండా కాలక్షేపానికై వచ్చి సినిమా విశేషాలు, సెక్స్ ఎడ్యుకేషన్ వివరాలు మాత్రమే తెలుసుకోవాలనే అభాగ్యులతోటి ఒకటి అరా వ్యక్తులతో కుంటుకుంటూ నడుస్తున్న ఈ గ్రంధాలయంలో నేనో పనికిమాలిన పనివాడిని.విసుగు... భరించలేని విసుగు...తో నేను చేస్తున్న ఈ పనిలో నేను ఇమిడిపోవడానికి కారణం వేరే ఉంది.

అరవై ఏళ్లకు నేను ఉద్యోగంలో రిటైర్ అవ్వగానే...మా ఇంట్లో నేను చాలా చులకనై పోయాను.నా రిటైర్మెంటు కు ముందుగానే నా జీవితం నుండి నిష్క్రమించిన మా ఆవిడ లేక పోయినా - చాన్నాళ్లుగా పనిచేసే చోటే రిలాక్స్ దొరుకుతుందనే భావించే నాకు నా రిటైర్మెంట్ శరాఘాతంలా తగిలింది. నేను ఇంట్లో అలా ఖాళీగా కూర్చోవడం మా కోడలికి అసలు నచ్చేది కాదు. ఇల్లు విశాలమైనదే అయినా - హృదయమంతా ఇరుకుగా మసలుకునే ఆమె కేవలం నా పెన్షన్ డబ్బుల కోసం ఆ భోజనం, కాఫీలాంటిది అందించినా...నేనలా ఖాళీగా ఇంట్లో ఉండటం తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నట్టుగా భావించింది. ఫలితంగా చిరాకులు - మాట విసరడాలు - చివరగా కొడుకు తో మందలింపులు అధికమయ్యాయి.

"అలా ఖాళీగా కూర్చుంటే ఏం తోస్తుంది నాన్నగారూ...అలా పార్క్ కో, బయట కో వాకింగ్ కు వెళితే బాగుంటుంది కదా" లాంటి అన్యాపదేశ అభిప్రాయాలతో - క్రమ క్రమంగా నా స్థానమేమిటో నా కర్థమవుతుండగా- ఒకరోజు వాడే - "నాన్నగారూ మీకో మంచి వ్యాపకం చూసాను. నాకు తెల్సిన దుర్గారెడ్డి అనే స్నేహితుడు వాళ్ళ రెడ్డి కులస్తులంతా కలిసి ఈ ఊరి చివర్లో ఒక గ్రంధాలయం లాంటిది ఏర్పాటు చేసారు. దానిని చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలిట. కేర్ టేకర్ గా ఉండటానికి మీ పేరు ఇచ్చాను.మీకు కాలక్షేపంగా ఉంటుంది. పేపర్లు పుస్తకాలు చక్కగా చదువుకోవచ్చు" అంటూ చెప్పుకొచ్చాడు."కానీ ఈ వయస్సులో ఏ బాదరబందీ పెట్టుకోలేనురా" అన్నాను కాస్తా ఈ కొలువును తప్పించుకుందామనే ఉద్దేశ్యంతో. కానీ వాడు వింటే కదా...

"ఇష్టమనేది చేసుకుంటే వస్తుంది నాన్నగారూ...ఇది మీకు చాలా బాగుంటుంది...కాదనకండి. నేను మాట ఇచ్చేసాను" అంటూ నాకు మరో మాటకు తావివ్వకుండా లోనికి వెళ్ళిపోయాడు. అలా... నేను ఉదయం ఓ నాలుగు గంటలు - సాయంత్రం ఓ నాలుగు గంటలు ఈ గ్రంథాలయానికి బందీ అయిపోయాను. అయితే - ఆ మేనేజ్ మెంట్ వ్యక్తులను ఒక సంవత్సరం పాటు గమనించాక అనిపించింది.
'మనుష్యులు ఎలా ఉండకూడదో - వారిని చూసి నేర్చుకోవచ్చని'

ఎనిమిది గంటలు పని చేయించేసుకుంటున్నా పనికి, వయసుకు తగ్గ వేతనం ఇవ్వకుపోతున్నా వ్యక్తిని గౌరవించడం చేతగాని దౌర్భాగ్యులు. తామిచ్చే స్వల్ప వేతనానికి పనిచేస్తున్నాడు కనుక వీడు అస్సలు పనికిరాని వాడు అనే భావన వాళ్ళది.'అల్ప బుద్ధి వాడికి అధికారమిచ్చినా -' అనే పద్దతిలో 'గదిలో బూజులేంటి అలా ఉన్నాయి. వాటిని కాస్తా దులిపేయొచ్చు కదా' అంటాడొకడు. 'పుస్తకాలు ఎప్పటికప్పుడు సర్దినట్లుండాలి' అని చెబుతాడు మరొకడు. 'పేపర్లు బాగా నలిగిపోతున్నాయి.చూసుకోవాలోయ్' ఇంకొకడు.

'కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది - తగ్గించండి' అని ఇంకో ఇంకొకడు ఇలా నాపై అధికారం చెలాయిస్తుంటే...' ఏ వ్యక్తినైనా మీరు తెలుసుకోవాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి' అనే అబ్రహాం లింకన్ మాటలు గుర్తుక వచ్చి మనసులో చిన్నగా నవ్వుకుంటాను విరక్తిగా.

అయితే చిన్నపటినుంచి నాకు కాస్తా సాహిత్యాభిలాష ఉండడం వలన, సాధారణంగా వయసు రీత్యా అందరూ దూరమయిపోయే ఈ వృద్ధాప్యంలో నాకు ఏకాంత వాసం కలుగలేదు. ఎందుకంటే పుస్తకాలు చదివేవారికి...వాటి గురించే మాట్లాడుకునే వారికి ఏకాంతం నుండి కాస్తా సౌలభ్యం ఉంటుంది కదా...

ఎవరెవరో రచయితలు, పేపరు చదివే వాళ్ళతో నా కాలక్షేపం చక్కగానే సాగిపోతుంది. అలా నాకు పరిచయమైనా వాడే కాశి...ఇతనో ఔత్సాహిక రచయిత.తానేవో తనకు పనికి వచ్చే పుస్తకాలు కొనుక్కోకుండా నాకూ లైబ్రరీకి కావాల్సిన పుస్తకాలేవోతెలుసుకుని వాటిని కొని తెచ్చి నాకిస్తాడు.

అలా అతను లైబ్రరీకి పుస్తకాలు ఇవ్వడం, అదీ కేవలం నేను ఇష్టపడే పుస్తకాలు కూడా తెచ్చివ్వడం నాకొక వింత. 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నట్టు లైబ్రరీకి చదువుకోవడం కోసం కాక ఈ దిక్కులేని లైబ్రేరియన్ కోసమే వస్తాడతడు. ఒకసారి- లైబ్రరీ మూసే సమయానికి కాశీ గారు ఆదరా బాదరాగా వచ్చి- "లైబ్రరీ మూసేస్తారనుకున్నానండి. ఇంకా ఉన్నారేంటి? భోజనానికి వెళ్ళలేదా?" అంటూ అడిగారు.

"లేదు కాశీగారు...వెళ్లాలనిపించలేదు. ఒంట్లో కాస్తా నలతగా వుంది. ఇంటికెళ్లి ఆ భోజనం చేస్తే - జ్వరం కాస్తా ఎక్కువ కావొచ్చు. ఇక్కడే కాస్తా రెస్టు తీసుకుందామని ఉండిపోయాను.సాయంత్రం మళ్ళీ ఇక్కడికే రావాలి కదా" అన్నాను.

"మరి ఇప్పుడెలా? టాబ్లెట్స్ ఏమైనా తెమ్మంటారా" ఆతృతగా అడిగాడు కాశి.

"అబ్బే...టాబ్లెట్స్ ఎందుకులెండి కాశీ గారు...గవర్నమెంట్ ఆసుపత్రి నుండి మా అబ్బాయి అప్పనంగా నాకై తెచ్చి పడేసిన టాబ్లెట్లు అధికమొత్తంలోనే ఉన్నాయి.అవి తగ్గవు నాకు. అయినా నాకు ఈ టాబ్లెట్స్ వాడటం మొదటి నుండీ పెద్దగా అలవాటు లేదండీ.మా ఆవిడ ఉన్నప్పుడయితే వేపుడు గంజి అనో, వేపుడు జావ అనో ఏదో చిట్కా వైద్యం జ్వరానికి పథ్యంగా పెట్టేది. నా జ్వరం కూడా అలానే పోయేది. ఇప్పుడవన్నీ ఎలా కుదురుతాయి లెండి...ఇంట్లో మధ్యాహ్నం టీవీ సీరియల్ వచ్చే సమయంలో స్టవ్ దగ్గరకు వెళ్లాల్సి వస్తే - మా కోడలు మహా చిరాకు పడిపోతుంది. అదీ నాకోసం అయితే ఆమె కోపం ఇంకా తారాస్థాయికి చేరుకుంటుంది. ' వృద్ధాప్యం మోసేవారికంటే… చూసేవారికి ఎక్కువ అసహనం కలిగిస్తుంది’ కదా...అది సరే కానీ వర్షం వచ్చేటట్టు ఉందికదా... మీరే మిటి అంత హడావిడిగా వచ్చారు?" అని ప్రశ్నించాను.

'ఏం లేదు… మొన్న దీపావళి సంచిక గురించి చెప్పారు కదా...అది కొన్నాను అది మీకు ఇచ్చి వెళదామని" అంటూ ఆయన భుజానికి ఎప్పుడూ వేళ్ళాడే గుడ్డ సంచీ నుండి...తళతళ లాడుతున్న దీపావళి సంచికతో పాటు...ఒక పెద్ద సైజు బిస్కట్ ప్యాకెట్...ఒక అట్టపెట్టెలో దగ్గు తగ్గించే మింట్ బిళ్ళల ప్యాకెట్ తీసి బయట పెట్టాడు.

"ఇవన్నీ ఎందుకు సార్" అన్నాను కాస్తా ఇబ్బందిగా.

"ఏముంది ఇవన్నీ...ఈ సంచికతోనే ఇచ్చారు ఈ పౌడర్ డబ్బా మా అమ్మాయికి తీసుక వెళ్తాను.ఇవి మీ దగ్గరుంచండి. సరే నేనుండి మళ్ళీ మిమ్మల్ని డిస్ట్రబ్ చేయడమెందుకు? మీరు రెస్టు తీసుకోండి.వీలైతే సాయంత్రం మళ్ళీ కలుద్దాం" అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు కాశి.

అయితే నిన్నటితో ఆగస్టు నెల ముగిసిపోయింది. కనుక ఆ నెల్నాటి పేపర్లు కాస్తా ఆర్డర్లో కట్టి పడేసి బుక్ సెక్షన్ లో పెట్టడానికి ఉపక్రమించాను.

పేపరు సర్దుతుండగా ఆగస్టు నెల నాలుగో తారీఖున ‘ఒక ప్రముఖ వ్యక్తి కన్నుమూత’ అన్న పేపరు ఆ పేపరు పైన అతనికి అంత్యక్రియలు. అంతే ఆ తరువాత మరో ఏదో సమాచారం ప్రముఖంగా ఉన్న విషయం పై పేపరుగా పడుతోంది.అంతే ఇంక ఆ ప్రముఖుడు - కాల పుటలలో క్రమ క్రమంగా వెనకబడుతున్న పేజీ అయిపోతాడు.

నేను పనిచేసిన ఈ అయిదారు సంవత్సరాల గ్రంధాలయ జీవితంలో ప్రతీ సంచలన వ్యక్తి మరణించే వార్త నన్ను కదిలించేది. ఏదో సాధించాలని, ఎన్నో శ్రమలకోర్చి బాధలు పడి తమ తమ పద్ధతుల్లో జీవన పోరాటాలు సాగించిన ప్రతీ ప్రముఖ వ్యక్తీ తన ఒక్కరోజు చావు వార్తతో ప్రపంచానికి దూరమయిపోతాడు.

అంతటి ప్రసిద్ధులు - ప్రముఖులే కాలవాహినిలో దూదిపింజల్లా తమ జ్ఞాపకాలను వదలి వెళ్లిపోతుంటే మరి నేను? అందరికీ భారమైన నాలాంటివాడు పోతే నా చావు ఎవరినైనా కదిలిస్తోందా కనీసం రెండు కన్నీటి బొట్లు విడిచేవారు ఎవరుంటారు? ఉంటే మా అబ్బాయి తన ఘనతను చాటుకోవడానికి పేపరులో ఓ మూల ‘శ్రద్ధాంజలి’ అంటూ నా ఫోటో వేసి ప్రచురిస్తాడు.పెద్దకర్మ తేదీ చిన్న అక్షరాల్లో వేయించినా కొడుకు - కోడలు మనుమల పేర్లు పెద్ద అక్షరాల్లో ప్రకటించ వచ్చు.

ఇంకా మా లైబ్రరీకి తరచూ వచ్చే వర్ధమాన రచయిత శ్రీనివాసరావు గారు. ఫలానా వ్యక్తితో నేను పొందిన ఆనందం...అనుభవాలు అంటూ తన దుఃఖాన్ని ఒక కరపత్రం ద్వారా ప్రకటించే ప్రయత్నం చేయవచ్చు.రచయిత కదా తన అనుభూతిని...వేదననీ అందరితో పంచుకోవాలని అనుకోవడం, చనిపోయిన వాళ్ళతో తన పరిచయాన్ని కనీసం గుర్తుచేసుకోవడం బాధ్యతగా భావిస్తాడతడు.

కానీ ఆ కరపత్రాన్ని అతని మీదఉన్న గౌరవంతో ఎవరైనా చదువుతారేమో కానీ, ఈ కేర్ టేకర్ గాడ్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆయన వెళ్ళాక నా ఫోటో ముద్రించబడి ఉన్న ఆ పేపరును చించి ఆవల పారేయొచ్చు" నిరాసక్తతో కూడిన చిరునవ్వు నా పెదాలపై విరక్తిగా కదిలింది.

ఆలోచనలవల్లనో...పేపర్లు సర్దడం అనే చిన్నపాటి పనివల్ల వచ్చిన - అలసట వల్లనో , బయట కురుస్తోన్న వర్షంతో కూడిన చలిగాలి వల్లనో నిద్ర వచ్చి నట్లయి...ఆ బల్లలను సర్దుకుని నిద్రకు ఉపక్రమించాను.నేను నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుండగా - తలుపు తట్టుతున్న శబ్దం విని - గడియ తీసి కళ్ళు నులుముకుంటుంటే - తలుపు తెరిచిన కాశీగారు - " ఊఁ లేవండి...లేవండి.. ఇదిగో వేపుడు గంజి వేడిగా ఉంది త్రాగండి” - అంటూ టిఫన్ క్యారియర్లో పొగలు కక్కుతున్న వేపుడు గంజిని నా ముందు పెట్టాడు.

నా నిద్ర మత్తంతా ఒక్కసారిగా దిగిపోయినట్లయింది.

"ఇప్పుడిదంతా నాకోసం ఎందుకు సార్...పద్మ గారిని అనవసరంగా శ్రమ పెట్టారులా ఉంది" అన్నాను.

"అబ్బే...ఇదొక పెద్ద శ్రమ అటండీ..." అంటూ తాను తీసుకొచ్చిన స్పూన్ ను మరోసారి నీటితో కడిగి నాకు అందించాడు. బయట చలి.
తుంపర తుంపరగా వాన...ఉండుండి వేస్తోన్న రొజ్జ గాలి.వానంటే తెగ చిరాకు పడిపోతూ...ఎప్పుడైనా వాన వస్తే...తడవాల్సి వస్తుందేమోనని నిరంతరమూ గొడుగును తన భుజానికి వ్రేలాడే సంచీలో వేసుకొని తిరిగే కాశీగారు ఇప్పుడు కష్టపడి ఇంతదూరం వర్షంలో నాకోసం ఈ వేపుడు గంజి చేయించుకుని తీసుక రావడంతో నా కళ్ళు చెమర్చినయి.

ఎవరికీ పనికి రాను అనుకున్న జీవితాన్ని కూడా అభిమానించే వారుండటం కొంత అదృష్టమే కదా.

“ఊఁ... ఊఁ… తొందరగా కానీయండి...లేకుంటే చల్లారిపోతుంది” అంటూ మధ్య మధ్యలో ఎంకరేజ్ చేస్తున్న అతన్ని చూసి నా సహచరిణి గుర్తొచ్చింది - "' ఊఁ... ఊఁ...మొత్తం త్రాగేయాలి. కష్టపడి చేశాను మరి" అంటూ అభిమానంతో ఆవిడా కూడా అదిలించేది.

ఇక అట్టే ఆయనను బ్రతిమిలాడించుకోవడం ఇష్టం లేకపోయింది. ఏ మాత్రం వదిలేసినా ఆయన ఏమనుకుంటాడో అనే సంశయంతో మొత్తం త్రాగేసాక- కాశీగారు మరో చిన్న ప్లాస్టిక్ కప్ లాంటిది బయటికి తీసాడు.ఇంకా తినమంటాడేమో అని గుండె దడ దడ లాడింది. "ఇదేంటి?” అన్నాను తడబడే గొంతుతో. "వేపుడు గంజి త్రాగాక నోరంతా చప్పబడిపోతుందని మా ఆవిడా ఈ కారం పల్లీలను స్వయంగా వేయించింది...తీసుకోండి" అంటూ పల్లీ లున్న ప్లాస్టిక్ పాత్రను నా ముందుకు త్రోసాడు. అనుగ్రహించేవాడు కాశీ విశ్వేశ్వరుడైతే ...ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణ కదూ...

ఆధునిక జగతిలో పరాయి వ్యక్తి కోసం శ్రమ పడేవారు అరుదుగా ఉంటారు.మరి ఈ దంపతులు...? నా కోసం ఇలా శ్రమ పడటానికి వీరికి నేను ఏమవుతాను? నా కొడుకు కోడలు గుర్తుక వచ్చి నా ప్రమేయం లేకుండానే నా కళ్ళు కన్నీళ్లు కార్చాయి.

"అయ్యో ఏంటండీ...ఏడుస్తున్నారా...అదేంటి” గాబరాగా ప్రశ్నించాడు కాశీ.

"మీలాంటి వారందర్నీ శ్రమ పెట్టడానికి కాకపోతే నాలాంటివాడు బ్రతికి ఏం ప్రయోజనం కాశీగారు"

"ఛ...ఛ...అలా అనుకుంటే ఎలా? మనిషి కేవలం తన కోసం బ్రతికే బ్రతుకు, బ్రతుకే కాదు. అలా అని ఇతరుల కోసమే బ్రతకాలని చెప్పడమూ నా ఉద్దేశ్యం కాదు. అసలు మనిషి తనకు తాను ఎందుకూ పనికిరాడని అనుకోవడమే పెద్ద పొరబాటు. భగవంతుడు సృష్టిలో ప్రతీ ఒక్కర్నీ మరో జీవి ప్రయోజనానికి సిద్ధం చేసే పుట్టిస్తాడు. ఆ ప్రయోజనం నెరవేరాక ఆయనే స్వయంగా తన దగ్గరకు తీసుకపోతాడు అంత వరకూ మనం ఆయన ప్రసాదించిన ఈ జన్మను అతని వరంగా స్వీకరించాలి కానీ జీవితాన్ని శాపంగా భావించకూడదు" అంటూ చెప్పుకొస్తున్న ఆయన కేసి చూస్తూ ఉండిపోయాను.

నా వలన మరొకరికి ప్రయోజనం ఏమిటో నాకు తల బద్దలు కొట్టుకున్నా అర్ధం కాలేదు.నా మనసంతా ఈవేళ అలరించుకున్న నిరాశ, నన్ను తీవ్రంగా కలచివేయడానికి కారణం తన కొడుకు - కోడలు సంభాషణే.

"రేపు మా అన్నయ్య, వదిన, వదిన వాళ్ళ అమ్మ, నాన్న అంతా వస్తున్నారు. మావయ్యను ఒక రెండు, మూడు రోజులు లైబ్రరీలోనే పడుకోమని చెప్పండి" అంటోంది కోడలు.

"అలానే కానీ ఈ వర్షపు రోజుల్లో ఆయనకు క్యారేజిలు మోసుకెళ్ళడం ఎలా అని ఆలోచిస్తున్నాను. ఆయన ఆహారం వేడిగా లేకపోతే తినరాయే" అన్నాడు కొడుకు.

"భలేవారండీ...అన్ని సమయాల్లో...అన్నీ అమరాలంటే ఎలా కుదురుతుంది? ఉదయాన్నే ఆయనకు రెండు పూటలకు క్యారియర్ కట్టేస్తాను. మీరు డ్యూటీకి వెళ్లేముందు ఇచ్చేస్తే సరి...కాలం చెల్లిపోతున్న మనుషుల కోసం...కావలసిన వారిని వదిలేయం కదా..." అంటూ ఆమె ఇంకా ఏమేమో అంటుంటే- "అంతే...అంతే..." అంటూ కొడుకు వంత పాడుతున్నాడు.

'తను కాలం చెల్లిన మనిషి...' - ఈ మనిషికి బ్రతుకు అక్కర్లేదా? ఆ ఆలోచన తనని కృంగదీస్తోంది...ఇంటికి మధ్యాహ్నం వెళ్లాలనిపించక పోవడానికి కారణం అదే.

కాశీ గారు కాసేపు ఉండి వెళ్ళిపోయాక...లైబ్రరీ తెరిచినా నాకు వర్షం వల్ల ఇంకెవరూ రారనుకున్నాను. ఇంతలో-

ఎవరో ఇద్దరు దంపతులు...లైబ్రరీ గుమ్మం దగ్గర ఆగి గొడుగును మడిచే పనిలో అతనుంటే వంటి మీద, చీర మీద పడిన వర్షపు నీటి చుక్కల్ని తుడుచుకునే పనిలో ఆమె ఉంది.

నేను చిత్రంగా కళ్లప్పగించి చూస్తున్నాను.

అతను తల తుడుచుకుంటూ- "గుర్తున్నానా సార్" అన్నాడు చిన్నగా నవ్వుతూ. నేను అతన్ని గుర్తుకు తెచ్చుకున్న ప్రయత్నంలో ఉండగానే, అతను వినయంగా నా రెండు పాదాలకు నమస్కరించి-

"సుశీ నీవు కూడా సార్ కి నమస్కరించు" అని ఆమెకు చెప్పాడు. ఆమె నమస్కరించడానికి సిద్ధపడుతుండగా - ఆమెను ఆపి - "అయ్యో...ఏమిటిదంతా మీరెవరు? నాకెందుకు ఈ నమస్కారాలు" అన్నాను కాస్తా చిరాగ్గా.

"సార్ ఈ లైబ్రరీ మొదలయిన కొత్తరోజుల్లో నేను రెగ్యులర్ రీడర్ ను. పుస్తకాలూ కొనుక్కునే ఆర్ధిక స్తోమత లేక...ఈ గ్రంధాలయంలో ఉన్న అతికొద్ది ఎడ్యుకేషన్ బుక్స్ రిఫర్ చేసుకోవడానికి మీ టైంకు మించి నాకు చదువుకోమని అవకాశం ఇచ్చేవారు...నా పేరు రాజేష్ … సార్... గుర్తు పట్టారా?” ఆయన ముఖాన్ని పరిశీలనగా చూసేక గుర్తొచ్చింది. అతను నా లైబ్రరీలో ఒకప్పటి రెగ్యులర్ రీడరే.

"మీ దయ వల్ల నేను సివిల్స్ రాసి డిస్టింక్షన్ సాధించి, ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ నయ్యాను. ఇదంతా మీ ఆశీర్వచనం...ఔదార్యం ప్రభావమే అని ఇప్పటికీ భావిస్తాను.నన్ను నమ్మి ఇంటికి పుస్తకాలూ కూడా చదువుకోమని ఇచ్చేవారు. మీ వల్ల నేను బాగుపడ్డాను. నా కుంటుంబం బాగుపడింది.

“మీ ఔదార్యాన్ని ప్రేరణగా తీసుకుని నేను కూడా నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తాను.ఇతరుల ఎదుగుదల కోసం తన సౌఖ్యాన్ని త్యజించగలిగే, దివ్యమైన జీవితం గడిపే మీలాంటి వారి సందర్శనం వల్ల నా జీవితం బాగుపడుతుందని అంత దూరం నుండి వచ్చాను" అంటూ అతను ఏవేవో చెబుతున్నాడు.

అతనికి నేను చేసిన సహాయం కేవలం మా లైబ్రరీలో ఎవరెవరో దాతలు తాము చదివిన పాత కాంపిటీటివ్ స్టాక్ జీ.కే పుస్తకాలను అతనికి ఓపికగా తీసివ్వడమే.

నేను ఈ పనిలో చేరిన కొత్తల్లో - అతని మీద విసుక్కున్నాను కూడా.కానీ నేను ఈ ఉద్యోగధర్మంలో అంతర్భాగంగా చేసిన ఆ చిన్నపాటి సహాయం రాజేష్ ను అంతటివాడ్నిచేసిందంటే - నా బ్రతుక్కీ అర్ధం ఉన్నట్టే తోచింది.

"భగవంతుడు సృష్టిలో ప్రతి ఒక్కరినీ - మరో జీవి ప్రయోజనానికి సిద్ధం చేసే ఉంచుతాడు" - అని మా కాశీగారు చెప్పిన విషయం నా చెవుల్లో మార్మోగుతుంది. అయితే ఆ జీవితమనే 'అక్షయపాత్రను' మన స్వార్ధంతోనూ, బద్ధకంతోనూ, లోభత్వంతోనూ మూయకుండా ఉండాలి.

నా నిస్సత్తువ క్రమంగా తొలుగుతున్నట్టే తోచింది.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న