మౌనమేలనోయీ - కాశీవిశ్వనాధం పట్రాయుడు

mounamelanoyi

“ఏమోయ్!

ఇవాళ మన ఇరవై ఐదవ పెళ్లిరోజు.. ఘనంగా జరుపుకుందాం. నేనే వంట చేస్తాను. నిన్ను ముస్తాబు చేస్తాను కాదనకూడదు మరి. అయినా నా పిచ్చిగాని నువ్వు నాతో మాట్లాడటం మానేసి ఏడాది అయ్యింది. అయినా సరే ఈ ఒక్క రోజుకి నామాటకు ఊఁ కొట్టు. ఒక్కరోజు నీకు విపరీతంగా దగ్గువచ్చి నాకు ఫోన్ చేస్తే, ఆ ఫోన్ నేను రిసీవ్ చేసుకోకపోతే మరీ ఇంత అలగాలా చెప్పు. అదిగో ఆరోజునుంచే కదూ నువ్వు నాతో మాట్లాడటం మానేసింది. సర్లే నేనిలాగే వాగుతూ ఉంటాను. నువ్వు కాసేపు టివి చూసుకో, నేను వెళ్లి కూరలు తెస్తాను “ అని చెప్పి వీధి తలుపు దగ్గరగా వేసి బయటకు వెళ్ళాడు రామారావు.

రామారావు జయలది అందమైన జంట, ఆనందకరమైన కాపురం. పెళ్లై ఇరవై ఐదు ఏళ్లయినా పిల్లలు లేకపోవడంతో వాళ్ళకి వాళ్లే పిల్లలయ్యారు. కొన్నాళ్ళు ఎదురు చూశారు. తరువాత బాధపడ్డారు, ఆతరువాత అలవాటు పడ్డారు. ఎవరినన్నా దత్తత తీసుకుందామనుకున్నా ఎందుకో ఆ ఆలోచన విరమించుకున్నారు.

“మాస్టారూ ఇటువైపు రావడమే మానేశారు” అంటూ పలకరించాడు సింహాద్రి.

"ఇప్పుడు మా అపార్టుమెంటు దగ్గరకే కూరలు వస్తున్నాయి సింహాద్రి. అందుకే ఇటు రావడం తగ్గించాను.

"అయ్యా! అమ్మగారు"... అర్ధోక్తిగా ఆపాడు సింహాద్రి.

"ఆఁ దాని మొండితనం దానిదే" సణుక్కుంటు కూరలెంచుకుని సంచిలో వేసుకున్నాడు.

“ఇవాళ మా ఇరవై ఐదవ పెళ్లి రోజు. ఎలాగైనా మీ అమ్మగారిని మెప్పించాలోయ్. నా ప్రేమనంతా కురిపించి మరీ మువ్వొంకాయ వండేస్తాను. మీ అమ్మగారిని మెప్పించేస్తాను” అంటూ ఇంటికి బయలుదేరాడు.

**********************

పెళ్ళైనకొత్తలో

"జయా నాకు మువ్వొంకాయ అంటే ఇష్టమోయ్!"

"అయ్యో నాకు రాదండీ."

"నేను నేర్పిస్తాను ఉండు."

చొక్కా చేతులు మడిచిపెట్టి

లేత వంకాయలను ఏరి, మసాలా నూరి, వంకాయల్లో కూరి ఆపై బాండీ లో వేసి తగినంత నూని వేసి స్టవ్ పై నుంచి

“చూడు వనజాక్షి గరిటే ఇలా పట్టుకో, ఒక చేయి నడుం మీద పెట్టుకో, అటు ఇటు సుతారంగా కలుపుకో, మాడకుండా చూసుకో” అంటూ సరసాల్లోకి దిగాడు.

"ఇదిగో నాపేరు జయ మీరు మీ పాత ప్రియురాళ్ల అందరిపేర్లు నాకు తగిలిస్తే బాగోదు”. ఎర్రగా చూసింది.

“కోపమెందుకే కోమలాంగి నాకు నచ్చిన పేరుతో పిలుచుకుంటాను. వాళ్లందరూ నా ప్రియురాళ్లు అయిపోతారా? కారం కూరలో ఉండాలి నీ కళ్ళలో కాదు.”

సరసం పండింది. కూరమాడింది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఈసారి తనే వండడం నేర్చుకుని చక్కగా వండిపెట్టింది.

************************

"భానుమతీ మువ్వొంకాయకి సిద్ధం చేస్తున్నా..ఈ సారి మాడనివ్వను లే అంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళాడు.

ఇంతలో “రామారావు” అని బయటినుంచి ఎవరో పిలిచారు.

“వస్తున్నా” అంటూ వెళ్లి తలుపు తీసాడు.

"ఏమిటీ ఇవ్వాళ ఆఫీసుకు వెళ్లలేదా?" ఆరాగా అంటూ లోపలికి రాబోయాడు పొరుగింటి జగన్నాధం.

ద్వారానికి అడ్డంగా నిలబడి “ఇరవై ఐదవ పెళ్లిరోజు జరుపుకుందామని ఆఫీసుకు సెలవు పెట్టేసాను" అన్నాడు రామారావు.

"ఏమిటీ మీరే!" మెడను సాచి రామారావు భుజాలమీదుగా గదిలోకి చూసాడు.

టేబుల్ మీద పువ్వులు ముస్తాబు సామగ్రి కనపడ్డాయి.

"ఏమిటి సంగతి? హాల్లో పువ్వులు కనిపిస్తున్నాయి"

"మా ఆవిడ కోసం"

"ఏమిటీ" కళ్ళు ఇంతలా చేసుకుని ఆశ్చర్యపోయాడు.

"హా మా ఆవిడ కోసమే, మీరు మరీ నోరు తెరిచేసుకుని ఆశ్చర్యపోకండి. మీరు దయచేస్తే నాకు బోలెడు పని ఉంది."

"అసలు నేను వచ్చిన పని మర్చిపోయాను. ఓ ఐదువందలు ఉంటే ఇద్దూ"

"ఎందుకూ టైపిస్టు రాగిణి కోసమా?"

ఇకిలించాడు జగన్నాధం.

"నా దగ్గర లేవు ఉన్నా ఇవ్వను. నువ్వెళ్ళు" అంటూ మొహం మీదే తలుపేశాడు.

"చూడు సౌదామినీ నా రొమాంటిక్ మూడ్ అంతా పాడు చేసాడు. పరాయి ఆడవాళ్ల వైపు చొంగ కార్చుతూ చూసే జగన్నాధం లాంటి వాళ్ళకి పెళ్ళాన్ని ఎలా ప్రేమగా చూసుకోవాలో ఏం తెలుస్తుంది చెప్పు”. అంటూ జయ బుగ్గపై చిన్నగా చిటికేసి “ఇంకేం ఇంకేం కావాలె” పాట హమ్ చేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు.

***********************

“కాత్యాయనీ, కాస్తంత కాఫీ ఇస్తావూ..”

“అదిగో మళ్ళీ… నా పేరు జయ, సుబ్బారావు…”

“సుబ్బారావూ? వాడెవడు?”

“ఆఁ.. మీరే… నన్ను రకరకాలుగా పిలిస్తే, నేను కూడా మిమ్మల్ని అలాగే పిలుస్తాను.” అంది జయ కాఫీ అందిస్తూ…

“అబ్బా ఇన్నాళ్ళకి నా దారిలోకి వచ్చావోయ్, సుబ్బలక్ష్మీ”

“బావుంది సంబడం… ఇలా రకరకాలుగా పిలుచుకుని అసలు పేరు మర్చిపోతాం”

“మరేం పర్వాలేదోయ్ మీనాక్షి, సరే కానీ సినిమా కెల్దామా?”

“ఎందుకు? సినిమా మీరు చూడరు, నన్ను చూడనివ్వరు. మీరు నా ముఖం చూస్తూ… నా చేతులు నిమురుతూ… , అబ్బ నేను సినిమా ఎలా చూసేది బాబూ…” సిగ్గుతో ముఖం చేతుల్లో దాచుకుంటూ అంది జయ.

*******************

“ఏమిటి ఎలనాగా… నీకు పాత విషయాలు గుర్తుకువస్తున్నాయా? అయినా గడచిపోయినవి గుర్తుకు తెచ్చుకుంటే ముసలివాళ్ళం అయిపోయినట్లుట, ఎక్కడో చదివేను”

“చూడమ్మాయి… అన్నం, ముద్దపప్పు, మువ్వొంకాయ, రసం చేసాను. పాయసం చెయ్యనా? లేదంటే ఫ్రిజ్ లో ఉన్న రసగుల్లా తీసిపెడితే సరిపోతుందా? నువ్వు చెప్పవు కదా… సర్లే , రసగుల్లా చాలు. ఇదిగో నీ దగ్గరకే వస్తున్నాను.”

టేబుల్ పై ఉన్న పువ్వులు, ముస్తాబు సామాన్లు తీసుకుని హాల్లో ఉన్న భార్య దగ్గరకి , అదే జయ నిలువెత్తు ఫోటో దగ్గరకి వెళ్ళాడు రామారావు.

“ఓయ్ ముద్దుగుమ్మా… నీకు ఎన్ని సార్లు సారీ చెప్పినా నువ్వు పలకవు, తిరిగిరావు కదా జయా…. ఆ మాయదారి దగ్గు నీ ప్రాణాలు తీసేసింది. నువ్వు ఫోన్ చేసావు, కానీ నేను అందుకోలేక పోయాను. ఆ మిస్సడ్ కాల్ నేను చూసుకుని, నీకు మళ్ళి చేసాను. నువ్వు తియ్యలేదు. ఎంత గాభరాగా ఇంటికి పరిగెత్తుకు వచ్చానో… అప్పటికే అంతా అయిపోయింది. దగ్గుతో గుండె చిక్కబట్టి ప్రాణం పోయిందని , డాక్టర్ చెబుతుంటే నా ప్రాణమే పోయినంత పని అయిపోయింది కదా… జయా నన్ను మన్నించు….” గద్గద స్వరంతో స్వగతంగా అనుకుంటూ ఫోటోకి పూల దండ అలంకరించాడు రామారావు.

భార్యాభర్తల బంధం
ఏడేడు జన్మల అనుబంధం.
ఆత్మీయత అనురాగాలే మూల బలం.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న