చల్లని పిల్లగాలి మలయ మారుతంలా వీస్తుంటే కారులోని యంత్రపు చల్లదనాన్ని ఆపేసి వెలుపలి ఆ గాలి హాయిని అనుభవిస్తూ దారివెంట కనువిందు చేస్తున్న పచ్చని పొలాలను చూస్తూ అంతులేని ఆనందాన తేలియాడుతూ వెళుతున్నారు సుగుణారావు, సులోచన దంపతులు.
సుగుణారావు సబ్ కలెక్టర్ గా పనిచేసి ఈ మధ్యన పదవీవిరమణ చేశారు. ఇద్దరు అబ్బాయిలతో ముచ్చటైన సంసారం వారిది. ఇంకా నాలుగు సంవత్సరాలు సర్వీసు ఉందనగానే పిల్లలకు వివాహములు చేసి బాధ్యత నెరవేర్చుకున్నారు. వారి అదృష్టమో లేక వీరి పూర్వజన్మసుకృతమో గాని ఇద్దరూ మంచి పోజిషన్లలో ఉండి అమెరికాలో ఉంటున్నారు. వారి భార్యలు కూడ ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద అబ్బాయికి ఒక కూతురు కూడ. ఇది స్థూలంగా సుగుణారావు కుటుంబ పరిస్థితి.
"సులోచనా మనం ఊరి పొలిమేరల దగ్గరకు వచ్చేశాం"
"ఏమిటో మీ ఆలోచనలు. చూడటానికి వాతావరణం అది పచ్చగా, చల్లగా ఉంది. కాని మనం ఇలాటి ఊర్లలో ఉండగలమా అనే సందేహం నన్ను పీడిస్తూనే ఉంది"
"ఇంకా ఊర్లోకి అడుగుపెట్టనే లేదు. అప్పుడే అంత విచారం దేనికి. ముందు మన రాకకు ఎలా స్పందిస్తారో మనవాళ్ళు చూడని. అసలు నాతో కలిసి చదువుకున్నవారు ఎంతమంది అక్కడ ఉన్నారో తెలియదు. పద్మనాభం కూడ చెప్పలేదు. ముందు వాడిని కలిస్తే గాని విషయాలు తెలియవు"
అలా భార్యభర్తలు మాట్లాడుకుంటుండగానే ఊరు రానే వచ్చింది. ఎవరో చెయ్యి చూపి ఆపడంతో ఎవరా అనుకుంటూ కారు ఆపాడు సుగుణారావు.
ఎదురుగా పద్మనాభం నవ్వుతూ కారు డోర్ దగ్గరికి వచ్చాడు.
"అరె పద్మనాభం. నువ్వు వచ్చావేమిటి? నేనే వచ్చేవాడిని కదా. సులోచనా ఇతనే నేను చెప్పే పద్మనాభం. నా బాల్యస్నేహితుడు, ఆప్తుడు. ఇక్కడ మన ఆస్తిపాస్తులను కాపాడేవ్యక్తి." అంటూ భార్యకు పరిచయం చేశాడు.
"నమస్తే చెల్లెమ్మా. మీ పెళ్ళయిన కొత్తలలో ఒకసారి వచ్చానమ్మా మీ ఇంటికి. అప్పుడు చూశాను మిమ్మల్ని. ఆ తరువాత అడపాదడపా వీడు నేను కలుస్తున్నా మనం కలవలేదు. కుటుంబంతోపాటు ఒకసారి రండిరా అని ఎప్పుడడిగినా ఏదో సాకు చెప్పి తప్పించుకునేవాడు. ఇదిగో ఇన్నాల్టికి మీతో సహా ఈ ఊరికి విచ్చేస్తున్నాడు." అని నమస్కరించిన పద్మనాభంతో
" ఆయన తప్పేమీలేదు అన్నయ్యగారు. మాకు ఎవరికీ ఇక్కడికి రావటం పెద్దగా ఇష్ఠం ఉండేది కాదు. ఆయన అంతగా బలవంతపెట్టేవారూ కాదు. అందుకే అలా జరిగిపోయింది" అని బదులిచ్చింది సులోచన.
"అన్నయ్య గారు ఏమిటమ్మా. గారు తీసేసి అన్నయ్య అని పిలువు తల్లీ ఆప్యాయంగా ఉంటుంది"
"వాడు చెప్పినట్లు పిలువు. వీడు నాకు దేవుడిచ్చిన బావ. చిన్నతనం నుంచి అలాగే పిలుచుకునే వాళ్ళం. వీడి భార్య నన్ను సొంత అన్నలాగే చూస్తుంది. చూద్దువు గాని ఆ అమ్మాయి ఎంత ఆప్యాయంగా ఉంటుందో" అన్నాడు సుగుణారావు.
మాటల్లో రానే వచ్చింది పద్మనాభం ఇల్లు.
ఎదురువచ్చి ఆహ్వానించింది పద్మనాభం భార్య సరస్వతి. ఆమెను చూసి కళ్ళు తిప్పుకలేకపోయింది సులోచన. చక్కదనంతో పాటు సంప్రదాయబద్ద అలంకరణ 'అబ్బ. ఎంత బాగుందో' అనుకున్నది సులోచన మనసులో.
"ఏంటి వదినా మా గతుకుల రోడ్ల మీద వచ్చి బాగా అలసిపోయినట్లున్నారు. ముఖం వాడిపోయింది. కొంచెం ఫ్రెష్ అయి రండి" అంటూ టవల్ తెచ్చి ఇచ్చింది సరస్వతి.
భోజనాలు చేస్తూవుండగా లోపలికి వచ్చాడు పద్మనాభం కొడుకు చైతన్య. స్ఫురద్రూపి అన్నమాట సరిగ్గా సరిపోతుంది అతనికి. వస్తూనే 'ఎవరు వీళ్ళు' అన్నట్లుగా చూశాడు సరస్వతి వైపు.
"రారా చైతూ. నేను చెప్పానే సుగుణారావు మామయ్య అని. ఆయన, ఆయన భార్య సులోచన" అని పరిచయం చేశాడు పద్మనాభం.
"నమస్తే మామయ్య, అత్తయ్య" అంటూ నమస్కారం చేశాడు చైతన్య. చిరునవ్వుతో సమాధానమిచ్చారు సుగుణారావు దంపతులు.భోజనాలు ముగించి వరండాలో కొచ్చి కూర్చున్నారంతా. మరో పది నిముషాలలో తాను కూడ భోజనం ముగించి వచ్చి కూర్చున్నాడు చైతన్య.
"వీడి గురించి చెప్పలేదు కదురా బావా నీకు. వీడు అగ్రికల్చరల్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఎంట్రన్స్ లో 100వ ర్యాంకు వచ్చినా మెడిసిన్ లో చేరకుండ అగ్రికల్చరల్ లో చేరాడు. వాడి జీవితాశయం పల్లె జీవనం సాగిస్తూ, నూతన పద్ధతులతో వ్యవసాయం చేస్తూ సరికొత్త గ్రామీణాన్ని సృష్ఠించాలని" కొడుకును గురించి చెప్పాడు పద్మనాభం.
"వెరీగుడ్. నువ్వు ఈ కాలపు పిల్లలలాంటి వాడివి కావనిపిస్తుంది. అందరూ అమెరికా, లండన్ లవైపు చూస్తుంటే నువ్వు పల్లె వైపు చూశావు. నీకు వర్తమానం కంటే భవిష్యత్తు మీద ఎక్కువ దృష్టి ఉందనిపిస్తుంది." మెచ్చుకోలుగా అన్నాడు సుగుణారావు.
"నేను అంతదూరం ఆలోచించలేదు మామయ్యా. సరిగ్గా పది సంవత్సరాల క్రితం మా పక్కవీధిలో ఉండే రాంబంటు తాతయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట్లో కారణం ఎవరికీ అంతుపట్టలేదు. తరువాత తెలిసింది నాలుగు సంవత్సరాలు ఒకే పంటవేసి రాబడి రాక అప్పులు పెరిగి తీర్చలేక పురుగులమందు తాగి చనిపోయాడని. అప్పుడు నాన్న అన్నమాట ఇప్పటికి గుర్తుంది. "ఏదో పిచ్చికొద్ది ఈ పొలాలను నమ్ముకుని చాలీచాలని ఆదాయంతో చావలేక, బ్రతకలేక, వేరేపని చేతగాక ఉంటున్నామురా. మీరన్నా మంచి చదువులు చదువుకుని బస్తీలలో హాయిగా బ్రతకండిరా. మా బాధలు మీకొద్దు" అన్నారు. అన్నంపెట్టే రైతు నోటినుంచి ఆ మాట రావడం నేను తట్టుకోలేకపోయాను మామయ్యా. నాలోని రైతుబిడ్డ ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు ఈ ఊరిని విడవకూడదని, లోపాలను దిద్ది ఈ నేలలోనే సిరులు పండించాలని" చైతన్యలో ఏదో ఆవేశం.
"వీడి పిచ్చిగాని ఇంతమంది అనుభవం ఉన్న రైతులు చేయలేనిది వీడేమి చెయ్యగలడు బావా" నిట్టూర్చాడు పద్మనాభం.
"అలా అనకు పద్మనాభం. వాడు పట్టా తెచ్చుకున్నది వ్యవసాయరంగంలో. వ్యవసాయానికి నీరు ముఖ్యం. దాన్ని ఎలా దాచాలో, ఎలా వినియోగించాలో వాళ్ళకు తెలిసినంతగా మనకు తెలియదు. ఏమో నీరు అంతగా అవసరం లేని పంటలను మన పొలాల నేలలలో పండిస్తే చాలు కదా. మనకు రాబడి వస్తుంది కష్టాలు తప్పుతాయి. ఆ తెలివితేటలు వాళ్ళకే ఉంటాయి" చైతూను సమర్థించాడు సుగుణారావు.
"అత్తయ్యా. మీరు, మామయ్య మాతో ఉండిపోగూడదూ" సులోచనను ఉద్దేశించి అడిగాడు చైతన్య.
అతని అభ్యర్ధనలోని ఆప్యాయత, అతని పిలుపులోని మాధుర్యం ఆమెను కట్టిపడవేశాయి. అంత చదువుకుని కూడ తన ఊరి మీద మమకారంతో ఏదో చేయాలనే తపనతో ఉన్న అతని ఔన్నత్యం ముందు ఆమె మనసు తలవంచింది. ఇది తన భర్త జన్మస్థలం. అతనికి ఇక్కడే ఉండి ఎంతోకొంత తన ఊరి అభివృద్ధికి కృషి చేయాలని ఉన్నా నాకు ఇష్టంలేదని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చారు. కాని చైతన్య మాటలు సులోచనలో ఆలోచనలు రేకెత్తించాయి. వారి ఆదరణ, చనువు ఆమెకు తన పుట్టినింటిని మరపిస్తున్నాయి. మనసు ఉండమని సంకేతాలిస్తున్నది. సందిగ్దంగా భర్త వైపు చూసింది.
భార్య మనసు అర్థమయింది సుగుణారావుకు.
"చూడు చైతన్యా. మేమిక్కడ ఉంటే ఊరికి ఉపయోగపడతామని నీ కనిపిస్తే తప్పకుండా ఉంటాము" అంతేనా అన్నట్లు భార్యవైపు చూశాడు సుగుణారావు.
"బాబు నువ్వు అడిగావు గనుక చెబుతున్నాను. మేమిక్కడికి వచ్చిన ఉద్దేశమే అది. మీ మామయ్య కోరిక అది. మీరు కూడ సుముఖంగానే ఉన్నారు గనుక వచ్చే వారానికల్లా సామాన్లతో దిగిపోతాం" మనసులో మాట చెప్పేసింది సులోచన.
"ఎంత చల్లని మాట చెప్పావు వదినా. ఇది నీ పుట్టిల్లే అనుకో. నీకు ఏది కావాలంటే అది చేస్తాం మేము. ఈ వయసులో ఒకరికి ఒకరం తోడుగా ఉంటే ఆ ఆనందమే వేరు" తెగ సంబరపడిపోయింది సరస్వతి.
"ధాంక్స్ అత్తయ్యా. మామయ్య ప్రభుత్వాధికారిగా చేశారు గనుక ఆయన సలహాలు మాకు చాలా అవసరం. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసివస్తోంది" మొహమాటపడ్డాడు చైతన్య.
"ఇదిగో చైతన్యా. అలాటి మాటలు వద్దు. మన ప్రణాళికలేమిటో చెప్పు. అందులో నా పాత్ర కూడ చెప్పు" అడిగాడు సుగుణారావు.
"మామయ్యా ముందు మనం ఊరిని రాజకీయాలనుంచి తప్పించాలి. పార్టీల కొట్లాటలు మాని ఐకమత్యంగా ఉండాలి. దీనికి సర్పంచి తాతయ్య ఒప్పుకోవాలి. ఊరి చివర పూడిన చెరువును పూడ్పు తీయించాలి. అందరమూ ఒకే పంట కాకుండా మన నేలకు అనుకూలమైన విభిన్న రకాల పంటలు పండించాలి. పైలట్ ప్రాజెక్ట్ కింద మీది మాది కలిసిన యాభై ఎకరాలను తీసుకుని ప్రారంభిద్దాము. ఫలిస్తే అందరి పొలాలకు విస్తరిద్దాము. దీనికంతటికి సర్పంచి గారి సహకారం కావాలి" చెప్పడం ఆగి తండ్రివైపు చూశాడు చైతన్య.
" అదే బావ మన పర్వతాలు మామ ఉన్నాడు గదా ఆయనకు మన రాఘవులు గాడికి ఉప్పు, నిప్పు. వాళ్ళిద్దరు సర్దుకంటే మన ఊర్లో పార్టీలు ఉండవు. పంచాయితీలు ఉండవు. రాఘవులుకు నీ మాటంటే వేదం. నువ్వొచ్చావని తెలిస్తే ఈపాటికి వచ్చేవాడే బావ"
"అవన్నీ నాకొదిలిపెట్టు చైతన్యా. మేమిద్దరం ఆ పని చూసుకుంటాం. పోతే వచ్చేటప్పుడు రోడ్డు చూశాను. అధ్వాన్నంగా ఉంది. కలెక్టరు గారితో మాట్లాడి రోడ్డు వేయించే పని చూడాలి. ఇక నువ్వేమి ఆలోచించకు. అందరమూ కలిస్తే సాధించలేనిది ఉండదు. ఊరు మనది అని ముందుకు కదిలితే ఇది ఆదర్శగ్రామమై అందరూ మనల్ని అనుసరిస్తారు. పల్లెలు మరలా పూర్వవైభవాన్ని సంతరించుకుంటాయి" సుగుణారావులో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేసింది. లేచి పద్మనాభాన్ని ఆలింగనం చేసుకున్నాడు
"రత్నమంటి కొడుకును కన్నావు బావా. ప్రతి యువకుడు నీ కొడుకులా ఆలోచిస్తే రైతన్నలకు ఈ అకాలమరణాలు దాపురించవు. ఎవరో వచ్చి మనలను ఉద్ధరించరు. మనలను మనమే ఉద్ధరించుకోవాలి" అంటూ భుజం తడుతున్న స్నేహితుడిని చూచి సంబరపడిపోయారు పద్మనాభం, అతని కొడుకు చైతన్య.
"పూర్తయిందా సమావేశం. ఇంకా మిగిలివుందా" అంటూ వచ్చాడు రాఘవులు.
"నువ్వెప్పుడొచ్చావురా" అంటూ రాఘవులు నెత్తిన మొట్టాడు సుగుణారావు.
"చర్చ మంచి రసవత్తరంలో ఉండగా వచ్చాను. అంతా విన్నాను. నేను లొంగిపోయాను. ఊరిలో ఇంతకాలం లేకుండా ఇపుడే వచ్చిన మీకే ఊరిమీద ఇంత మమకారముంటే పుట్టినప్పటినుంచి ఇక్కడే పెరిగిన నాకింకెంత మమకారం ఉండాలిరా సుగుణా. ఇక పార్టీలు గీర్టీలు ఏవీ లేవు. మీరేమి చెబితే అది" అంటున్న రాఘవులు భుజంమీద చెయివేసి "నేను చెప్పానుగా బావ వీడికి నువ్వంటే గురని" అన్నాడు పద్మనాభం.
"వాడు చెప్పాడని కాదురా. నీ కొడుకు తపన విని మారానురా. చైతన్యా ఈ కాలం కుర్రాళ్ళు ప్రేమలని, సినిమాలని జులాయి వెధవలలాగ తిరుగుతుంటే నువ్వొక ధ్యేయంతో పనిచేస్తున్నావే అది నాకు నచ్చిందిరా. నువ్వే మా నాయకుడివి" చైతన్యను అభినందించాడు రాఘవులు.
ఇంతలో సుగుణారావు చేతిలో సెల్ మ్రోగింది.
"హలో డాడి"
"ప్రదీప్ చెప్పరా"
"ఎక్కడ నాన్నా"
"మా సొంత ఊరిలో. పద్మనాభం మామయ్య వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం. వచ్చే వారం సామాన్లతో సహా ఇక్కడ దిగిపోతాం. అమ్మకు కూడ నచ్చింది. ఇక నుంచి మీరు ఇండియాకు వస్తే నేరుగా ఇక్కడికే రావాలి. ఇది మన జన్మస్థలి. ప్రమోద్ కు కూడ చెప్పు. అమ్మకు ఇస్తున్నా మాట్లాడు"అంటూ సెల్ సులోచనకు ఇచ్చాడు సుగుణారావు.
"సరే ఇక ఆలస్యం ఎందుకు సర్పంచి గారింటికి పోదాం" అని సుగుణారావు అనడంతో లేచి బయలుదేరారు అందరూ.
(ప్రపంచంలో అమ్మ తరువాత అంత అందమైనది పుట్టిన ఊరు. ఎక్కడెక్కడ తిరిగినా చివరి రోజులలో ఆ ఊరికే రావాలని అందరూ అనుకుంటారు. అది పల్లెటూరు అయినా సరే. అదే దాని గొప్ప)