'సు మ' మనసు ఈవేళ చిరాగ్గా వుంది. హు.. కమల్ చూడు ఈ మధ్య ఎలా తయారయ్యడో! పెళ్ళైన కొత్తలో తన చుట్టూ తిరగడానికి టైం ఎలా వచ్చిందో, అదే టైం ఈ నెల్లాళ్ళుగా కనీసం జలుబుతో, ఎలర్జీతో బాధపడ్తున్న తనను డాక్టర్ కి చూపించడం కూడా కుదరలేనంత బిజీ అయిపోయాడు. అంటే ఒక పిల్లడు కలిగే సరికే తనపై అంత మోజు తగ్గిపోయిందా? లేక "ఆఫీసు బిజీ" లో భాగంగా ఏ భామో ఆఫీసర్ గా వచ్చిందా? విషయం ఏదైనా ఉంటే బయట పడకుండా ఎంత సున్నితంగా చెప్పాడో చూడు! రేపయితే తనకు కాస్త వెసలుబాటట... డాక్టర్ కి చూపించడానికి! అంటే ఈ రొంపతో, చీదితే ఊడేలా ఉన్న ముక్కుతో తను మరో ఇరవైనాలుగు గంటలు గడపడమా? అసలీ మధ్య ఆయనకి ఎక్కువయ్యిందిలే. లేకపోతే బాబిగాడు హోంవర్క్ చేయలేదని తాను వాణ్ని కొట్టబోతే, ఏకంగా చెయ్యెత్తాడు తనపైకి కమల్. వెంటనే తన రెండు జతల బట్టలు బ్రీఫ్ కేసు లో సర్డుకుంటే (అచ్చం సినిమాలోలా) సర్లేవోయ్! ఇంత చిన్న విషయానికే అంత పెద్ద ట్రీట్ మెంటా? అంటూ వచ్చి మృదువుగా చేరదీసినందుకు ఏదో పోన్లే అని సర్డుకుపోయింది కాని... హు.. అని సుమ దీర్ఘంగా నిట్టూర్చేలోగా, ముక్కు ట్యాప్ నుండి జలుబు ధారగా.. క్లినిక్ లోకి డా. రవి ఒకేసారి రావడంతో టక్కున ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది ముక్కు తుడుచుకుంటూ.
నమస్కారం డాక్టర్ గారు! అంటూ విష్ చేసి, తన చీటీ నంబర్ మరోసారి చూసుకుంది. రెండవ పేషెంట్ తను. డాక్టర్ గారు ఎప్పుడో ప్రతి నమస్కారమ్ చేసి లోపలికివెళ్ళాడు. మళ్ళీ ఆలోచనల బండెక్కింది సుమ. తనూ, కోమల, హేమంత ఒకే కాలేజీ లో అయిదేళ్ళు కలసి ఇంటరూ, డిగ్రీ చదువుకున్నారు. అపుడోసారి టాపిక్ లో తమకెలాంటి మొగుళ్ళు రావొచ్చు? అని ప్రశ్న వేసుకొని, ఆపై ఒక్కొక్కళ్ళు వరుసగా చెప్పుకొని సరదాగా ఆనందించారు. అప్పుడు తనే కాస్త ఘాటైన సమాధానం చెప్పింది. మగవాళ్ళు ఎప్పుడు సమాజంలో స్త్రీలను అణగద్రొక్కే ప్రయత్నం చేస్తుంటారు. స్త్రీలంతా ఇది గమనించి ప్రొటెస్ట్ చేయాలి. వరకట్నాన్ని మగవారి జులుంని.. ఇలా తను వాదించి అందరి చేత శెహభాష్ అనిపించుకుంది. కానీ మరిప్పుడో? పెళ్లై ఏడేళ్ళు అయ్యిందోలేదో.. కమల్ కి తనపై ప్రేమ తగ్గినట్లే కనిపిస్తుంది. అంటే అతడు సగటు పురుషాహంకారం గల మగాడేనా? బెల్ మ్రోగింది. సుమ ఆలోచనల బండి నుండి జారి ఇలలో పడింది. నమస్తే డాక్టర్। బాగా జలుబు... తన మాటలకడ్డోస్తూ, "కమల్ రాలేదామ్మా?" అని డాక్టర్ ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. హు.. చివరకి ఈయనగారు కూడా కమల్ లో మార్పు గమనించాడులా ఉంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ హాల్ వైపు నడిచింది సుమ.
ఇంతలో ఒకావిణ్ణి, వాళ్ళ నాన్న మెల్లిగా నడిపించుకుని తీసుకొచ్చాడు అక్కడికి. స్టన్ అయ్యింది సుమ. అరే! అది హేమంత కదూ! ఏమయ్యిందండీ ఈమెకు? ఆతృతగా అడుగుతూ విస్తుపోయింది సుమ. అమ్మ రెండు నిముషాలు ఆగండి. డాక్టర్ వద్దకెళ్ళాలి అర్జెంటుగా అని ఆమెను తీసుకెళ్ళిపోయాడు ఆయన. చేసేది లేక ఆత్రంగా మల్లి కుర్చీలో కూర్చుంది సుమ. 10 నిమిషాల తరువాత బయటకి వచ్చారు వాళ్ళు. "ఏం చేయమంటావు అమ్మా? నీవూ మా అమ్మాయీ స్నేహితులా..! అని విషయం తెలుసుకొని ఇలా చెప్పసాగాడాయన...
నీ పెళ్ళైన సంవత్సరానికి దీనికి పెళ్ళయ్యిందమ్మా.. పెళ్ళైన సంవత్సరం వరకూ అల్లుడు బాగానే చూసుకున్నాడు. పైగా అతని ఇష్టానుసారమే ఉద్యోగం లోనూ చేరింది మా హేమ. ఇప్పుడు దానికి రెండేళ్ళ బాబు కూడా ఉన్నాడు. ఈ మధ్య అల్లుడు దాన్ని సూటి పోటి మాటలతో వేదించడమే కాకుండా, దీని ఆఫీసులో బాసుకీ దీనికి ఏవో సంబంధాలు అంటగట్టేట్టుగా మాట్లాడుతున్నాడు. ఉద్యోగం వదిలేద్దమా అని అనుకుంది కాని, అల్లుడు వద్దంటాడు మళ్ళీ. దీని డబ్బులు వాడిక్కావాలి జల్సాలకి పార్టీలకి వెళ్ళడానికి. దీనికి అమ్మ ఉంటే కడుపులో దాచుకోనేది. కానీ ఆడదిక్కులేని ఇంటికి దీన్ని ఎలా తీసుకురావాలో అర్థంకాక ఇన్నాళ్ళు జంకాను. కానీ నిన్న రాత్రి వాడు.. ఆ కుబుద్ధి దీని ముందే, నా మనవణ్ణి పైకెత్తి కింద పడేయబోతుంటే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలిందమ్మా. వాణ్ణి వాడికి దీన్ని పట్టుకుని ఎప్పుడు లేని విధంగా క్రింద పడేసి కాళ్ళతో తన్నాడమ్మా ఆ క్రూరుడు. డిగ్రీ చదివి ఉద్యోగం చేస్తున్న ఆడదేనా అమ్మా ఇది> చూడు వాతలెలా తేలాయో! అంటూ... ఇంకా షాక్ నుండి తేరుకోని తన కూతురిపై ఆ కిరాతకుడు చేసిన గాయాలను చూపిస్తూ రోదిస్తున్న పెద్దయన్ను ఎలా ఓదార్చాలో కూడా తెలీలేదు సుమకి. పైగా మరొక ఆశ్చర్యమైన విషయం తెలిసింది. ఈ భర్త గారి పైశాచిక చర్యలకు అండదండలుగా నిలిచింది అతని పెళ్ళికాని ఇద్దరు చెల్లెలంట. ఛీ! ఆడడానికి ఆడదే శత్రువన్నమాట ఇలా పుట్టిందని ఇప్పుడే తెలిసింది. ఈ విషయం కోమలకి కూడా చెప్పాలి అనుకుంటూ ఆయన్ని ఊరడించి, ఆటోలో వాళ్లనెక్కించి వడివడిగా ఇల్లు చేరింది సుమ. ఏదో పీడకల వచ్చి నిద్ర లేచినదానిలా మనసంతా బాధతో నిండి పోయింది.
ఛీ! పురుషాహంకారం, అంటూ 'కమల్' లాంటి మంచి మనసున్న వ్యక్తులకు ఈ బిరుదు తొందర్లో తగిలించబోయింది తను. లెటస్ బి కూల్ అనుకుంటూ... తన మనసుకు సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకుంటూ జలుబుకు వేన్నీళ్ళ స్టీమింగ్ చేసింది. ముఖంలో కాస్త రిలీఫ్ గా ఫీలయ్యి కోమలకి ఫోన్ చేసింది. అవతలి నుండి పురుషకంఠం "ఎస్ ప్లీజ్! అని వినబడింది." కోమలికి ఇస్తారా ఫోన్. అన్నది తను. కానీ ఈ రాత్రి సమయంలో ఈ గొంతేమిటి? అనుకుంటూనే ఉంది సుమ. ఓ నిమిషం తరువాత కోమలి లైన్లోకి వచ్చింది. ఏంటోయ్ సుమ ఈ రాత్రి వేళ ఫోన్1 అంటూ కోమలి!. మనం చదువుకొనేటప్పుడు హేమంత ఉందే! అది.. అది ఇవ్వాళ్ళ దాన్ని చూసానే! అర్జంటుగా మా ఇంటికి మా ఇంటికొస్తావా? ఫోన్లో చెప్పేది కాదువే అంది సుమ అసహనంగా! ఏయ్ సుమ, ఇప్పుడెలా కుదురుతుందే, కొంచెం బిజీ. రేపు ఉదయం 10గంటలకి వస్తాను ఓకే. అంటూ కోమలి ఫోన్ పెట్టేసింది. ఆ తీరు తెన్నులు కాస్త ఆశ్చర్యంతో బాటు మరికాస్త కోపాన్ని కూడా తెప్పించాయి సుమకి.
ఈ లోగా బయట స్కూటర్ ఆగిన శబ్దంతో ఇక ఆ పూటకి ఆ విషయాన్ని మరుగున పెట్టేసింది తను. పూల పొట్లాన్ని సుమకిస్తూ డాక్టర్ వద్దకెళ్ళోచ్చావా? ఏమన్నాడు? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కమల్ ప్రేమను మనసుతో పూర్తిగా ఆస్వాదించి, ఇటు తిరిగి హాయిగా నవ్వుకుంది సుమ. ఆ! వెళ్లక తప్పుతుందా? మీకు రిపోర్టివ్వలిగా! డాక్టర్ గారు అడిగారు మీరెందుకు రాలేదని! తెచ్చుకున్నాన్లే మందులు అంటూ కోపం నటిస్తూ! మరికొంత అలకనూ చేర్చి మాట్లాడింది సుమ. తల్లీ! మాకు బాస్ కాదు బాసిణి వచ్చింది. ఆవిడకన్నీ స్ట్రిక్ట్ రూల్సే. హు! మీ లేడీస్ కి ఎప్పుడు అనుమానాలే... నీకున్నట్లు! దానికీ నా మీద అనుమానం. చివుక్కున చూసిన సుమతో ఆ.. అదే.. ఆవిడ గారికి నా మీద అఫీషియల్ వర్క్ అనుమానం. ఆ ఫైలూ ఈ ఫైలూ వెరిఫై చేసాక గాని ఇంటికి పంపలేదు. నన్నూ, రాజారావునూ.... ఓ మూలగా సుమ ముఖం చూసి అన్నాడు కమల్. హమ్మయ్యా! కమల్ కున్న నిజాయితీ లక్షణాల్లో ఫ్రాంక్ నెస్ కూడా ఒకటి. ఎంత నిర్భయంగా ఒక భార్యతో భర్త తన ఆఫీస్ లో బాస్.. అదీ లేడీ బాస్ గురించి చక్కగా చర్చిస్తాడు? తను అలక చెందినా, ఆలోచించిన మీదట కమల్ ప్రవర్తన మచ్చలేనిదని స్పష్టంగా అర్థమవుతూనే వుంది సుమకు. నిద్ర పోతున్న బాబును ముద్దాడి, భోజనానికి లేవబోతున్న భర్త వంక గర్వంగా చూసింది తన అదృష్టానికి మురిసిపోతూ!
ఇట్టే తెల్లారింది... బాబుని స్కూల్ లో దిగబెడుతూ ఆఫీసుకి బయలుదేరాడు కమల్. జడ వేసుకుంటూ వాకిట్లో నిలబడ్డ తనకు కోమలి కనిపించింది. రావే! ఈ మధ్య బొత్తిగా కనిపించట్లేదు.. అంటూ కోమలి ని కూర్చోబెట్టి కాఫీ కలుపుకొచ్చింది సుమ. యోగ క్షేమలయ్యాక అసలు విషయానికి వచ్చింది సుమ. హేమంత విషయమై ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. హేమంత అడబడుచులిద్దరిని నయాన కాకుండా భయాన దారికి తేవడం. ముందు కోమలి ఇలా చేయడానికి ఒప్పుకోవడానికి సుముఖంగా లేదు. కానీ ఒకళ్ళకి సాయం చేస్తే ఆ దైవం మనకి కావలసిన సమయంలో ఎవరి రూపం లో నైనా వచ్చి సాయం చేస్తాడనే తన గట్టి నమ్మకాన్ని కోమలి ముందుంచాక కోమలి ఒప్పుకుంది. ఈ నాటకానికి ఇద్దరూ హేమంత వాళ్ళ నాన్న చెప్పిన అడ్రస్ కి బయలుదేరారు.
గంట బస్సు ప్రయాణం చేసాక, ఓ ఇంటి ముందు వడియాలు పెడ్తూ కనిపించిన ఆ తాటకి, పూతన... అదే ఆ అక్కాచెల్లెళ్ళను చూసారు. కోమలి వెంటనే అందుకుంది. ఏం వొళ్లేలావుంది? మఫ్టీ లో వచ్చాను గనుక సరిపోయింది. లేకుంటే మీరిద్దర్నీ ఈ పాటికి జీప్ లో ఎక్కించి జైలు కి పంపేదాన్ని కఠిన స్వరం తో హడాలెత్తే మాటలన్న కోమలిని ఆడ పోలీస్ అని ఇట్టే నమ్మేసారు ఆ అక్కాచెల్లెళ్ళు. వడియాలు పెట్టడం ఆపి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు! మమ్మల్ని వదిలేయండి... అన్నారిద్దరూ... ఏం ఎలా వదిలేయ్యమంటారు? కస్సుమంది కోమలి. మీ సంగతి తేల్చుకుందామనే వచ్చాను. మీ వదినను పెళ్ళాడింది మీ అన్నయ్య. మధ్యలో మీ పెత్తనం ఏంటి?చేతనైతే మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మీ మీ కాపురాళ్ళు వెలగపెట్టండి. అంతే కాని, కాపురం చేసే వాళ్ళని పనిగట్టుకొని విడదీసే చర్యలకు పూనుకుంటే ఆనక మీ పెళ్లి మేం చేస్తాం. తెల్సిందా? గంటలో మా పోలీసు బృందం మీకు బేడీలు వేయబోతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ వదినని సాదరంగా ఇంటికి పిలుచుకు రండి! ఆమె ఆరోగ్యం బాగయ్యేదాకా మీలో ఏ ఒక్కరూ ఆమెను ఏమైనా అన్నట్టు తెలిసిందో, లాకప్పులో పడేసి, బూటు కాలితో తంతాను. ఏవనుకున్నారో. చచ్చుదద్దమ్మల్లారా! సూటిగా చూస్తూ తీక్షణంగా బాణాలు విసురుతున్న కోమలిని స్టన్ అయి అలాగే చూస్తూ ఉండిపోయింది సుమ. ఏమో అనుకున్నాను. దీనికింత నటన బ్యాక్ గ్రౌండా? అని విస్తుపోతూ... వేయించిన వడియాల్లా అక్కాచెల్లెల్లిద్దరూ ముఖాలు మాడిపోగా తలలు దించుకొని నిలబడ్డారు. చెల్లి ముందుగా తేరుకొని, అమ్మ గారు , ప్లీజ్! మా అన్నకు మా మీద చెప్పకండి రేపీపాటికి అన్న మనసు వెన్నలా మార్చే పూచీ నాది. వదినను ఇన్నాళ్ళు మేమే కనబడకుండా దాచి బాధపెట్టాము. అన్న మనసులో విష బీజం నాటాము. ఇప్పుడు బుద్ధొచ్చింది. అమ్మా! మీరే చూస్తారుగా... మన్నించండి. అంటూ కాళ్ళు పట్టుకున్నంత పని చేసారు ఆ సిస్టర్స్ ఇద్దరూ.. అదే... వృద్ధకన్యలు.. వీళ్ళకిదేం పోయేకాలమో. పెళ్లి చేసుకున్న అన్నని వదినతో సంసారం చేయనివ్వరు... ఛీ అనుకుంటూ కోమలి తనతో అక్కడనుంచి బయటకొచ్చింది.
సుమ కోమలి వీపు పై తడుతూ.. శభాష్! ఇంత నటనెప్పుడు నేర్చావే? అడిగింది ఆశ్చర్యంగా... "ఏం చేస్తామే.. నువ్వేమో ఎప్పుడూ మగవాళ్ళు ఆడవాళ్ల్లని అణగదొక్కేవాళ్ళు అనేదానివి... కాలేజ్ లో వున్నప్పుడు.. మరిప్పుడు చూసావా? అసలు ఆడవాళ్ళకు ఆడవాళ్లే శత్రువులెలా అయ్యారో. ఇదమ్మా కలికాలం. ఇంతకూ ఈ మధ్యే ఏక్టింగ్ స్కూల్ లో చేరానులేవే! మరి నా మొగుడు నెలకోసారి క్యాంపులకెళ్తే ఆ నాల్రోజులూ పరమ బోరింగ్ గా వుంది మరి. నాకున్న కొద్దిపాటి నటనతో మా వారికి తెలీకుండా ఇదుగో ఇందులో జాయిన్ అయ్యాను. "అదేంటే! మీ వారికి తెలిస్తే ఏంటి?" అన్నది సుమ. "ఏంటా? దెప్పి పొడవరూ? నటన అంటే అదో పిచ్చి. వెర్రి మాయా లోకమని, అందులో వెళ్తే అందరూ చెడిపోతారు అని ఆయన భ్రమ. మరి ఎలా చెప్పాలో నువ్వే చెప్పు !"
"ఓసిని! ఆ ఇద్దరాడ రాక్షసులకు ఇంతసేపు బుద్ధి చెప్పిన దానివేనా? మీ ఆయనకింత భయపడే కోమలివి?" ముక్కున వేలేసుకుంది సుమ.
అది కాదే, మరి నేనీ రంగంలో సక్సెస్ అయ్యాక మా వారికి చెబితే ఆయనా సంతోషిస్తారు. అందాక ఎందుకని నేనే చెప్పలేదు. అయినా సుమా! నువ్వు, నేనూ హేమంత తో పోలిస్తే కాస్త అదృష్టవంతులమేమని చెప్పాలి. నాకు అసలు అత్త పోరే లేదు. నీకు ఆడపడచులే లేరు. అయినా స్త్రీ ఎప్పుడూ తన సైడు నుండే ఆలోచిస్తుండడం చెయ్యకూడదు. బాధలకు అసలు కారణం అన్వేషించాలి
భర్త వైపు నుండి కూడా ఆలోచించాలి. ఇక హేమంత జీవితం బాగుపడ్డట్లే. ఆత్మస్థైర్యం ప్రతి స్త్రీ కి వుండాలి. ఆమె ఉద్యోగం చేస్తుందా! లేదా! అన్నది కాదు ముఖ్యం. తాను ముందు తనపై నమ్మకం పెంచుకోవాలి. సమస్యలకు భయపడి దాన్నింకా భూతంలా తయారు చేయకూడదు. హేమంత అదృష్టానికి మనం దొరికాము తనకి. కనుక ఇకనుంచి తన లైఫ్ మెరుగైనట్లే. కానీ దేశంలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు, అరాచకాలకు స్త్రీలోని బేలతనమే కారణం అంటాను. చదివి ఉద్యోగం చేస్తే హేమంత మనకన్నా ఏ మాత్రం బాగా లేదు సంసార జీవితం లో.. కారణం ఆమెలోని అబలతనం. స్త్రీని పురాణాల్లో కూడా పురుషులు గౌరవించేవారు. సుమ అంది "అవునే. యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా! అన్న ఆర్యోక్తి ఉండనే వుంది. అదీ గాక, నేటి స్త్రీలు మరో అడుగు ముందుకేసి, మగ వాడికి తన తెలివి తేటలు ఉపయోగించుకుంటూ. ఆ పనులలో దాసిగా, ఆలోచనలో మంత్రిగా, ఆకలప్పుడు అమ్మలా భోజనం పెట్టి. ప్రేమగా లాలిస్తే పురుషుని హృదయం కూడా ద్రవించక తప్పదే!"
కోమలి అడ్డొచ్చి! ఆ.. ఆపై భూమాతా అంత సహనం మాత్రం స్త్రీకి ఈ కలికాలంలో ఉండొద్దు తల్లీ, పురుషులే కాదు, వాళ్ళ అక్కలూ, అమ్మలూ అదను చూసి హేమంతకు లా బాధ పెడతారు సుమా!. "సరే సరే కోమలీ! కాస్త యుక్తితో నేటి సమాజంలో స్త్రీ తన సంసారంలోనూ, కార్యాలయంలోనూ నెగ్గుకురావలంటావ్ అంతేనా?" అంది సుమ.
ఆ! అచ్చు నాలాగే అంటున్న కోమలితో ఆహా! ఆడ పోలీస్ గారు! ఒప్పుకున్నామండీ! అంటూ శృతి కలిపింది సుమ.ఇద్దరూ హాయిగా నవ్వుకుంటూ ఇల్లు చేరారు మరో గంటలో.
మబ్బులు విడిచిన చంద్రునిలా, మనసు తేలికై ఆ రేయి హాయిగా నిద్ర పట్టింది సుమకు కమల్ భుజంపై...