పెద్దలూ తస్మాత్ జాగ్రత - సింగరాజు శ్రీనివాసరాజు

peddaloo tasmat jagratta
మేనేజర్ గా ప్రమోషన్ తీసుకుని, పాలసీమేటర్ కింద చెన్నైకి బదిలీ అయివచ్చాను. నా అదృష్టమో లేక మా డిప్యూటి జనరల్ మేనేజర్ గారి మంచితనమో గాని నన్ను భాషతో ఇబ్బందిలేని ప్రధాన కార్యాలయంలోని పర్సనల్ బ్యాంకింగ్ డిపార్టుమెంట్ కు కేటాయించారు. అక్కడ మా ఛీఫ్ మేనేజర్ తమిళియన్ అయినా తెలుగు వచ్చినవాడు కావడంతో నాకు సగం దిగులు తప్పినట్లయింది. ఇక నా దగ్గర ఉండే గుమస్తాలలో కూడ సంతోష్ వాళ్ళ తాతయ్యది తెనాలి కావడంతో ఆ కుర్రాడు కూడ తెలుగులోనే మాట్లాడేవాడు. అందరూ నాతో కలుపుగోలుగానే ఉండేవారు. అతి తక్కువ కాలంలోనే వారితో చనువు ఏర్పడడంతో ఇంటి విషయాలు కూడ మా మధ్య చర్చకు వచ్చేవి. అక్కడ నాకు కొత్తగా అనిపించిన విషయం ఏమిటంటే అందరివీ ఉమ్మడి కుటుంబాలే తాతలు, తండ్రులు, పిల్లలు అందరూ కలిసే ఉంటారు. అలాగే ఉదయాన్నే గుడికి వెళ్ళకుండా ఎవరూ ఆఫీసుకు వచ్చే వారు కాదు. ఒక రకంగా చెప్పాలంటే వారింకా సంప్రదాయాలను మర్చిపోలేదనిపించింది. మా ఇంట్లో పెద్దలు ఎవరూ లేరని చెప్పడం అవమానంగా తోచి, కొత్త ఊరు కదా అని అమ్మను తమ్ముడి దగ్గర ఉంచానని అబద్ధం చెప్పాను. ఇంట్లో గొడవలు పడలేక ఆమె ఆశ్రమంలో ఉంటుందని తెలిస్తే నన్ను వారెంత అసహ్యించుకుంటారోనని భయం కూడ వేసింది. మన వైపు ఇది సాధారణమైనా ఇక్కడ కొత్త గదా!

********
ఒకరోజు మా శ్రీమతికి కొంచెం సుస్తీగా ఉంటే సాయంత్రం ఆరు గంటలకు వచ్చి ఆమెను టీ. నగర్ లో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. డాక్టర్ గారి వద్ద నుంచి పిలుపుకోసం ఎదురు చూస్తున్నాము.

ఇంతలో మా ఛీఫ్ మేనేజర్ ఒక ఎనభై యేళ్ళ ముసలావిడను చెయ్యి పట్టుకుని లోనికి తీసుకువచ్చాడు. మెల్లగా ఆమెను నడిపించుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. బహుశా ఆమె అతని తల్లి అయుండవచ్చు అనుకున్నాను. అతను నన్ను గమనించలేదు. నర్స్ దగ్గరకువెళ్ళి ఏదో మాట్లాడివచ్చాడు. పలకరించకపోతే సభ్యత కాదేమోనని అతని దగ్గరికి వెళ్ళాను.

" సర్ నమస్తే. ఏమిటిలా వచ్చారు" అడిగాను ఎదురుగా వెళ్ళి.

" హలో. వాసు గారా. ఏమిలేదండి. అమ్మకు రాత్రి నుంచి జ్వరం, వాంతులు. బాగా డీలా పడింది అందుకని ఇంజక్షన్ చేయించి తీసుకువెళదామని వచ్చాను"

" మీ బాబు ఉన్నాడు కదా. అతనితో పంపక పోయారా?"

"నో. నో. మా అమ్మకు నేను వస్తేనే సంతోషం "

" నిజమేననుకోండి. మీరు ఆఫీసులో పని ఒత్తిడిలో అలసిపోయి ఉంటారు కదా. మాకంటే మీకు ఒత్తిడి ఎక్కువ కదా" ఏదో పూత వేయబోయాను.

" అవన్నీ మామూలే. అయినా అమ్మ కంటే అవేవీ ఎక్కువ కాదు. పై వాళ్ళు కూడ తల్లి, తండ్రి విషయంలో కన్సిడర్ చేస్తారు ఇక్కడ" అతని మాటలలో నిజాయితీ.

ఇంతలో వాంతి వస్తుందని చెప్పింది వాళ్ళమ్మ.

సారీ అని చెప్పి నర్స్ చేత ఒక పాత్ర తెప్పించి, ఆమె నోటి దగ్గర పెట్టి ఆమె వాంతి చేసుకున్న తరువాత వాటర్ బాటిల్ లోని నీటితో ఆమె నోరంతా కడిగి తుడిచి, తనే స్వయంగా ఆ పాత్రను శుభ్రం చెయ్యను తీసుకువెళ్ళాడు, నర్స్ ఇమ్మన్నా వద్దని వారిస్తూ.

నేను మెల్లగా వచ్చి మా శ్రీమతి పక్కన కూర్చున్నాను. ఆ దృశ్యాన్నంతా మౌనంగా చూస్తూ కూర్చుంది తను.

ఇంతలో నర్స్ వచ్చి ఛీఫ్ మేనేజర్ వాళ్ళది కొంచెం ఎమర్జన్సీ అని, ముందు వాళ్ళను లోపలికి తీసుకు వెళ్ళింది.

ఒక పావుగంట కల్లా బయటకు వచ్చారు వాళ్ళు.

" ఏమన్నారు సర్ " వెళ్ళి పరామర్శించాను.

" ఏదో వైరల్ ఫీవర్. రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలట. పెద్ద వయసు కదా, అప్పుడప్పుడు ఇలాంటివి తప్పదన్నారు. అవును మీ అమ్మ గారికి ఆరోగ్య సమస్యలేమీ లేవుగా" భుజం తడుతూ అడిగాడు.

ఉలిక్కిపడ్డాను. అసలామె ఎలా వుందో ఎప్పుడైనా విచారిస్తేగా.

"ఆ..ఏదో కొంచెం రక్తపోటు ఉంది సర్. మాత్రలు వాడుతుంది" అబద్దం మరల.

" జాగ్రత్త వాసు. అమ్మను అశ్రద్ధ చేయకు. మనము ఈ రోజు ఈ మాత్రం ఉన్నామంటే అంతా వాళ్ళ చలవే. మనకోసం ఎంత చేస్తే మనం ఇంత వాళ్ళ మయ్యాము. ఎప్పుడైనా మా ఆవిడ బద్ధకించినా, నేనే దగ్గరుండి మా అమ్మకు అన్నీ చూసుకుంటాను. నాకు తెలుసు నువ్వు కూడ అలా చేస్తావని. ఎవరికైనా ఇబ్బంది అంటే వాళ్ళకు సహాయంగా ముందుకు వస్తావని మన స్టాఫ్ చెప్పారు. అలాంటిది అమ్మ విషయంలో చెయ్యవా. ఉంటాను మరలా అమ్మకు నీరసం వస్తుందేమో. " అంటూ ఆమెను పొదివి పట్టుకుని తీసుకువెళ్ళాడు ఛీఫ్ మేనేజర్.

పరధ్యానంగా వస్తున్న నన్ను నర్స్ పిలవడం, మా శ్రీమతికి చూపించుకుని మందులు తీసుకుని ఇంటికి రావడం యాధృచ్ఛికంగా జరిగిపోయాయి

*****

ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేదు. మా ఆఫీసర్ చెప్పిన మాటలే చెవిలో మారుమ్రోగుతున్నాయి.

అవును. నిజమే తల్లిదండ్రులు ఎంత చేస్తే ఈ రోజు ఇంత వారిమయ్యాము. అటువంటిది ఏవో చిన్న మాట పట్టింపులను అడ్డంపెట్టి నిర్దాక్షిణ్యంగా వారిని దూరంపెట్టి వారి బాగోగులు పట్టించుకోకుండా మనసులేని రాయిలా తయారయిపోతున్నాము. ఛీ... ఎంతటి నీచులం. ఆ ఊహ మనసులోకి రాగానే నాకు తెలియకుండానే నా కళ్ళు వర్షించసాగాయి.

అయిదేళ్ళ నుంచి అమ్మ ఒంటరిగానే ఆశ్రమంలో ఉంటోంది. నాన్న పెన్షన్ తో కాలం వెళ్ళబుచ్చుకునేది. మధ్యలో ఒకటి, రెండు సార్లు వచ్చిందేమో పిల్లలను చూద్దామని. మనసు బాధగా మూలిగింది.

ఇక అమ్మను అక్కడ ఉంచకూడదు. తెచ్చుకోవాలి. ఎలా? మా శ్రీమతి ఒప్పుకుంటుందా? ఈ రోజు నేను చేసిన తప్పే నా పిల్లలు చేస్తే? తను భరించగలడా?

ఎందుకు చేయరూ... ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! ... ఒక్కసారిగా అదిరిపడ్డాను.

" నిద్రరావటం లేదు కదండీ" మా శ్రీమతి మాటతో ఉలిక్కిపడ్డాను.

" అబ్బే అదేంలేదు" ఏదో సర్దబోయాను.

" ఇందాక ఆసుపత్రినుంచి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. మీకు అత్తయ్య గారు గుర్తుకు వస్తున్నారు కదూ" ఆమె మాటలు పూర్తిగాక ముందే ఆమెను చుట్టుకుని భోరున ఏడ్చాను.

" మీరు బాధపడకండి. నేను ఈ విషయం గురించి నాలుగు రోజుల నుండి మదనపడుతున్నాను. మీ కెలా చెప్పాలో అర్ధం కాక మౌనంగా ఉన్నాను"

నాకు అర్ధం కాలేదు. బాధను దిగమింగి ఆమె కళ్ళల్లోకి చూశాను.

ఆమె కంటిలో కూడ నీటిపొర.

" మొన్న ఒకరోజు నవీన్, జీవన్ మాట్లాడుకుంటుంటే విన్నాను"

ఏమిటన్నట్లు చూశాను

" రేపు మనం అమెరికాలో సెటిలయిపోతే అమ్మ, నాన్న సంగతెలా అని తర్జనభర్జన పడ్డారిద్దరూ కొంచెంసేపు. ఇంతలో నవీన్ అన్నాడు సమస్య ఏముందిరా బామ్మ ఎలాగూ ఆశ్రమంలో ఉంది కదా.. వీళ్ళనూ అక్కడకు పంపితే సరి...అంతా కలిసే ఉంటారు. మనం డబ్బు పంపుదాం. సింపుల్..దానికి వంతపాడాడు జీవన్.. అదంతా విన్న నాకు మనం చేసిన తప్పు తెలిసి వచ్చింది. అదే సమయంలో మీ ఆఫీసర్ వాళ్ళ అమ్మను ఎంత ఆప్యాయంగా చూస్తున్నారో చూసిన తరువాత మనమేమి కోల్పోతున్నామో అర్థమయింది. అత్తయ్యను తీసుకువద్దాము. చిన్న, చిన్న కొరవలకోసం జీవితాలను బలిచేసుకోవడం మూర్ఖత్వం అని తెలిసింది." అని నా చేతులలో ముఖం పెట్టుకుని ఏడువసాగింది.

మనము ఏది చేస్తామో అదే మన పిల్లలు చేస్తారు. ఈ రోజు ఒంటరి కాపురాలలో స్వేచ్ఛ ఉందనుకుని ఆనందపడితే రేపు అదే ఒంటరితనం కారుచిచ్చయి గుండెను తొలిచేస్తుంది.

వద్దు ఆ జీవితం వద్దు. నా పిల్లలకు నేనే రోల్ మోడల్ కావాలి. వాళ్ళ మనసులలో ఇప్పుడిప్పుడే గూడు కట్టుకుంటున్న ఆలోచనలు తప్పని చెప్పాలి. అందుకే అమ్మను తీసుకురావాలి. మనసులో ఆ ఆలోచనరాగానే ఏదో తెలియని ఆనందం. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ నిద్రలోకి జారుకున్నాను అమ్మను తలుచుకుంటూ......

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న