తొలగిన తిమిరం - శింగరాజు శ్రీనివాసరావు

tolagina timiram

అక్కడ కుల ప్రాతిపదికన సభ జరుగుతున్నది. మైకు ముందు సంఘ అధ్యక్షుడు అచ్యుతరావు ఆవేశంగా మాట్లాడుతున్నాడు.
" సాటి కుల స్నేహితులారా మన పెద్దలంతా మనకంటే పెద్ద కులమని చెప్పుకునే వాళ్ళ చేతులలో నరకాన్ని అనుభవించారు. మనలను వాళ్ళ చేతులలో మరబొమ్మలను చేశారు. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి. మనమూ చదువుకున్నాం వాళ్ళతో సమానంగా. ఎన్నో కష్టాలకోర్చి ఎదిగిన మనం వాళ్ళ మీద కసి తీర్చుకోవాలి. మనలోని మేధావులు కొందరు ఇప్పటికే తమ రచనలలో వారి కుళ్ళును కడిగేశారు. అది చాలదు. మనం ఇంకా ఎదగాలి. మన కులసంఘానికి నిధులిచ్చి, సాహితీ సమాఖ్యను ఏర్పరచి, ప్రత్యేక రిజర్వేషన్ లిచ్చి, రాజకీయంగా మనకు అవకాశమిచ్చే పార్టీకే మనం ఓట్లు వేయాలి. వనభోజనాలు, మీడియాలు, దేవాలయాలు, ఒకటేమిటి అన్నీ మన కులానికి వేరే ఉండాలి" ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు అచ్యుతరావు.

ఇంతలో జనం మధ్యలో ఏదో కలకలం. ఏమిటన్నట్లు చూశాడు ముందు వరుస వారి వైపు.

" ఏమీలేదు సర్. మన కులం కాని విలేఖరులు ఎవరో TV ఛానల్ నుంచి వచ్చారట. అది తెలిసి మనవాళ్ళు వాళ్ళను బయటకు పంపేస్తున్నారు" అని చెప్పాడు ఒక వ్యక్తి లేచి వచ్చి.

అచ్యుతరావు మనసు ఆనందంతో నిండిపోయింది. " అదీ ఉద్యమ స్ఫూర్తి అన్నా, కులపిచ్చి అన్నా అలా ఉండాలి. శభాష్. తరిమేయండి వారిని" అని రెచ్చగొట్టాడు.

అతని జేబులో సెల్ మోగింది. ఇంటినుంచి ఫోను. కట్ చేసి మరల ఉపన్యాసం మొదలుపెట్టాడు. మరల ఫోను. కట్ చేశాడు.

" అసలు మనం ఉన్నత స్థితికి రావాలంటే మన కులాన్ని మన ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకోవాలి. ఇప్పుడు మన కులంలో రచయిత, విమర్శకుడు, ప్రొఫెసర్ చేదయ్య గారు మాట్లాడుతారు" అని కూర్చోబోతుంటే మరల మోగింది ఫోను. విసుగొచ్చి స్విఛ్ ఆఫ్ చేసి పారేశాడు వెధవగోల అనుకుంటూ.

పది నిమిషాలు అయిందో లేదో ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి అచ్యుతరావు చెవిలో ఏదో చెప్పాడు. అంతే ఉన్న పళంగా వేదిక దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అచ్యుతరావు.

********

" ఇక ఫర్వాలేదమ్మా. గండం గడిచింది. సమయానికి వచ్చి రమణమూర్తి రక్తం ఇవ్వకపోయివుంటే మీ పాప మీకు దక్కేది కాదు" ICU నుంచి వస్తూ చెప్పాడు డాక్టర్ అన్వర్.

మనసు తేలికపడింది సుగుణకు.

" పాపను చూడొచ్చా డాక్టర్" అడిగింది సుగుణ.

"వెళ్ళి చూడండి. మీ వారి సంగతి తెలిసి కూడ ధైర్యం చేసి రక్తం ఇచ్చిన మూర్తి నిజంగా అభినందనీయుడు. నీలాటి యువతే నేటి సమాజానికి కావాలి. నువ్వేమీ భయపడకు. నీకు తోడుగా నేనున్నాను" అంటూ అక్కడే కూర్చున్న రమణమూర్తిని అభినందించి వెళ్ళాడు డాక్టర్.

అక్కడేవున్న అతని స్నేహితులంతా అతడిని అభినందించి ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ఇంతలో హడావుడిగా వచ్చాడు అచ్యుతరావు.

" ఏమైంది సుగుణా నా బంగారుతల్లికి. ఆసుపత్రికి దేనికి తీసుకువచ్చారు. వెంటనే ఫోను చెయ్యొచ్చుకదా" భార్య చేయి పట్టుకుని ఏడ్చినంత పని చేశాడు

" ఏం లేదు అంకుల్. సరిత స్కూటర్ మీద వస్తుంటే యాక్సిడెంట్ అయింది. వెంటనే ఆసుపత్రిలో చేర్చి ఆంటీకి ఫోన్ చేశాము. ఆంటీ మీకు చాలా సార్లు ఫోన్ చేశారు. కానీ మీరు లిఫ్ట్ చెయ్యలేదు" వివరించాడు జోసఫ్.

" ఇప్పుడెలావుంది సుగుణా పాపకు"

" బాగానే వుంది. రమణమూర్తి రక్తం ఇచ్చి సరిత ప్రాణం నిలబెట్టాడు. ఏ తల్లి కన్న బిడ్డ అయితేనేం మన పాలిట దేవుడుగా వచ్చాడు" అంటూ రమణమూర్తిని చూపించింది సుగుణ.

ఆ పేరు వినగానే ఏదో కలవరం. అతనిది తమ కులం కాదని అనుమానం వచ్చింది అచ్యుతరావుకు. మనసు విచక్షణ కోల్పోయింది.

" నీది మాలాటి వారినెందరినో అణచిన అగ్రవర్ణం కదూ" సూటిగా అడిగాడు.

తలదించుకున్నాడు రమణమూర్తి.

" ఎంతకు తెగించావురా. నా సంగతి తెలిసే చేశావా...నిన్ను..నిన్ను" అంటూ రమణమూర్తి మీదకు దూకబోయాడు.

" ఆగండి అంకుల్. ఏం చేస్తున్నారు మీరు..." అంటూ అడ్డు తగిలారు సరిత స్నేహితులు.

" నా బిడ్డ శరీరం లోకి వేరే కులం వాడి రక్తమా. నో... భరించలేకున్నాను. డాక్టర్..డాక్టర్...." బిగ్గరగా అరిచాడు అచ్యుతరావు. ఆ అరుపులకు బయటకు వచ్చిన డాక్టర్ గారికి పరిస్థితి అర్ధమయింది.

" ఎందుకు డాక్టర్. నా కూతురికి వేరే కులం వాడి రక్తం ఎక్కించారు. ఏ బ్లడ్ బ్యాంకులోనూ దొరకలేదా రక్తం. వీళ్ళెవరూ చెప్పలేదా మీకు నా గురించి..." విరుచుకు పడ్డాడు.

" ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. మీ గురించి అందరికీ తెలుసు. మీ పాప బ్రతకాలంటే వెంటనే రక్తం ఎక్కించాలి. ఇక్కడవున్న వారిలో రమణమూర్తి బ్లడ్ గ్రూపు మాత్రమే సరిపోయింది. ఆలోచించే వ్యవధి లేక, మీరు ఫోనులో కలవక, మీ శ్రీమతి గారి అంగీకారంతో రక్తం ఎక్కిస్తూ ఆపరేషన్ చేసి మీ బిడ్డను బ్రతికించాం" పరిస్థితిని వివరించాడు డాక్టర్.

" అంతకంటే అది మరణిస్తేనే బాగుండేది" కఠినంగా వుంది అచ్యుతరావు గొంతు.

" సర్. నేను డాక్టర్ ను. నా పేషెంట్ ప్రాణం నాకు ముఖ్యం. రక్తం ఇచ్చి మీ కూతురు ప్రాణం కాపాడిన మహోన్నతుడిని అక్కున చేర్చుకోవడం మాని నిందిస్తున్నారా. బ్లడ్ బ్యాంకులో రక్తపు సీసాల మీద కులం, గోత్రం వ్రాసి ఉంచుతారా. ఇప్పుడు మీ అమ్మాయి రక్తంలో నుంచి మూర్తి రక్తాన్ని వేరు చేయండి చూద్దాం. అసలు కులాలనేవి మనిషి స్వార్థంతో ఏర్పరచిన అడ్డుగోడలు. మతం, కులం అనే విషబీజాలు మనలో నాటి మనలను విడదీశారు పూర్వీకులు. ఈ రోజు మనం ఆ విషయాన్ని తెలుసుకుని, ఆ స్థాయిని దాటి కులమతరహిత సమాజం వైపు అడుగులు వేస్తున్నాం. ఒక్కసారి ఆ పిల్లలను చూడండి. వారిలో అన్ని కులాల వారు వున్నారు. కానీ అందరూ మీ పాప బ్రతకాలని వారి వారి దేవుళ్ళను వేడుకుంటున్నారు. అంతేగాని ఎవరినీ ద్వేషించటం లేదు. కానీ మేధావులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు పేరు కోసమో, ఎవరైనా పడేసే ముష్టి కోసమో ప్రలోభపడి కుల, మతాలను తెరపైకి తెచ్చి మీలాంటి వాళ్ళ మెదడులో విషబీజాలు నాటారు. ఇకనైనా నిజం తెలుసుకుని మారండి. మూర్ఖులను మార్చండి" ఆవేశంతో మాట్లాడాడు డాక్టర్ అన్వర్.

ఆవేశం తగ్గి ఆలోచనలో పడ్డాడు అచ్యుతరావు.

" అంకుల్. సరిత మా అందరికీ చెల్లి లాంటిది. అందుకే మాలో ఒకడైన మూర్తి రక్తమిచ్చి బ్రతికించాడు. ఒక్క మాట. కులాల వారిగా మనిషి శరీరంలో అవయవాలు, రక్తమాంసాలు మారవు అన్న విషయం మీకు చెప్పనక్కరలేదు. అందరూ ప్రపంచీకరణవైపు పరుగులు పెడుతుంటే, ఎందుకు అంకుల్ మమ్మల్ని అనాగరికతవైపుకు లాగుతారు. ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిందని, దాని వలన కొందరు బాధపడ్డారని, వారి వారసుల పైన కోపం తెచ్చుకోవడం సమంజసమేనా..మా విద్యార్థులలో ఎవరికీ ఆ భేదాలు లేవు. మేమంతా భారతీయులమనే మా భావన. మమ్మల్ని అలాగే ఉండనివ్వండి. అమెరికన్, ఆస్ట్రేలియన్ అంటూ ఆ దేశాల వారు చెప్పుకున్నట్లు మమ్మల్ని 'ఇండియన్స్" అని గర్వంగా చెప్పుకునేలా తయారుచేయండి. నవ సమాజం వైపు నడిచే యువతను వెనుకకు లాగకండి ప్లీజ్" అంటూ చేతులు పట్టుకున్నాడు రషీద్.

అచ్యుతరావులో ఏదో తెలియని అలజడి. ఇంతవరకు తను చేసింది తప్పా అన్న భావన అతడి మెదడును తొలిచివేస్తోంది.

" ఇకనైనా ఈ పెడధోరణి మాని మనమంతా ఒకటేనని తెలుసుకోండి. ముఖ్యంగా యువతరానికి మీ ఉపన్యాసాల ద్వారా చాటండి. యువతకు భారతీయత మీద గౌరవం పెంచండి" అన్న అన్వర్ మాటలకు అంతా వంత పాడారు.

చలించిపోయాడు అచ్యుతరావు. రమణమూర్తిని దగ్గరకు తీసుకున్నాడు. అతని కళ్ళలో కృతజ్ఞత తొంగి చూసింది.

" నన్ను క్షమించు బాబు. మీరందరూ కలిసి మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్ళు నాకు కొడుకులు లేరనుకున్నాను. ఆ దేవుడు ఈ రోజు నాకు రమణమూర్తి రూపంలో కొడుకును అందించాడు" అంటూ రమణమూర్తిని గుండెలకు హత్తుకున్నాడు అచ్యుతరావు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న