“అమ్మా... అమ్మా.. ఎక్కడున్నావే...! నాన్నా... నాన్నా...” కాలికున్న చెప్పులు గుమ్మం ముందు విసురుగా విసిరేసి అరుచుకుంటూ ఇంట్లోకెళ్ళి వెతుకుతున్నాడు గోకుల్. మంచంపై దుప్పట్లు సర్దుతూ తల్లి ప్రాంచన కనిపించింది.
“అబ్బా.. ఎందుకురా అలా అరుస్తావ్..?” విసుక్కుంటూ పక్కను సరిచేస్తుంది ప్రాంచన.
“అమ్మా... నీకెన్నిసార్లు చెప్పాను.. చెల్లినలా ప్రాక్టీసుకు పంపించొద్దని. మగాళ్ళతో తిరిగి ఇది కూడా మగరాయుడు అయిపోతుందని మొత్తుకుంటుంటే పట్టడం లేదేంటి.?” పక్కను సర్దనివ్వకుండా మంచంపై కూర్చొని ఆవేశపడుతున్నాడు గోకుల్.
“దానికా గేమ్ అంటే ఇష్టమని తెలుసు కదరా. అదేదో పార్టిసిపేట్ చేస్తానంటుంది కదా... చేయనీ..” సావధానంగా చెప్పింది తల్లి.
“అదే అంటున్నా. ఆడోళ్ళకు గేమ్స్ ఎందుకు.? ఊర్లో దాన్ని అదోలా చూస్తున్నారంటే వినిపించుకోరేంటి.? నాకైతే తల తీసేసినట్లుంది. చక్కగా చదువుకోవచ్చుగా...” గట్టిగా అరిచాడు గోకుల్.
“నువ్వు చదువుకుని ఏం ఉద్ధరించావు కనుక, అది కూడా అలాగే ఉద్ధరిస్తుందిలే..! లే.. అరవకు..” అంటూ అతన్ని లేపేసి పక్కలన్నీ సర్దేసి గది నుండి బయటకొచ్చింది తల్లి.
ఎదుటివాళ్ళ తప్పులను ఎత్తి చూపినప్పుడు, పరిస్థితి తారుమారై మన తప్పులను ఎత్తి చూపుతున్నప్పుడు ఎవరైనా సరే
తలోంచుకోవాల్సిందే.! వారిలోనున్న కోపమనే భావోద్వేగం చల్లబడిపోవాల్సిందే.! గోకుల్ డిగ్రీ చదివాడు. అంతకుమించి చదివించే స్థోమత ఇంట్లో లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు రాస్తున్నాడు. తక్కువ ఖర్చులోనే అయిపోతుందని ఏదో చిన్న కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు. అయినా ఈ పోటీ ప్రపంచంలో అతనికి స్థానభ్రంశం కలగలేదు. ఏదన్నా ప్రైవేటు జాబ్ చేసుకోమన్నా చేయనని చెప్తూ నాలుగేళ్ళుగా అక్కడక్కడే తిరుగుతున్నాడు. చెప్పే ఓపిక లేక తల్లిదండ్రులు ఇలా పరోక్షంగా దెప్పిపొడుస్తున్నారు.
“నేనూ అదే అంటున్నా. జెంట్స్ కన్నా లేడీస్ కు రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది. పైగా మనకు స్పెషల్ రిజర్వేషన్ కూడా ఉంది. కాబట్టి చదువులో శ్రద్ధ పెడితే జాబ్ వస్తుంది ఈజీగా. నాకు తెలీక అడుగుతా... సరిగ్గా జంప్ చేయలేదు, సరిగ్గా పరిగెత్తలేదు. దానికి ఎందుకంట గేమ్స్.?” చెల్లెలి బలహీనతల్ని ఎత్తి చూపాడు గోకుల్. అప్పుడే తండ్రి సుధాకరరావు వచ్చాడు. తండ్రిని చూడగానే అక్కడ్నుంచి జారుకున్నాడు గోకుల్.
“వాడి మాటల్ని మీరేం పట్టించుకోకండి. లోపలికి రండి ఇడ్లీ పెడతాను” అంటూ లోపలికెళ్ళింది ప్రాంచన.
“పట్టించుకోకపోతే ఎలా.? వాడు నిజమే చెప్పాడు. అమ్మాయికి నేర్పేవాళ్లు లేక ఇబ్బంది పడుతోంది” కాళ్ళు కడుక్కొని లోపలికొస్తూ అన్నాడు సుధాకర్.
“వాడి లాగానే మీరు కూడా ఏంటండి.? రెండేళ్ళయితే దానికీ పెళ్లి చేసి పంపించేయోచ్చు. అప్పటి వరకు దాన్నలా ఉండనివ్వండి.” ఇడ్లీలు ప్లేటులో పెడుతూ అంది.
కొడుకు మీద కన్నా కూతురి మీదనే సుధాకర్ కు ప్రేమెక్కువ. రంజని పుట్టిన తర్వాతే పేదవాడిగా ఉన్నవాడు కాస్త మధ్య తరగతి వాడయ్యాడు. రంజని అడిగిన ప్రతి దానిని కాకపోయినా అవసరమనుకున్న ప్రతి దాన్ని ఇవ్వడం అతనికలవాటు. లాంగ్ జంప్ లో బంగారు పతకం సాధించాలని రంజనీకున్నా తండ్రినేప్పుడూ ఆ విషయమై చర్చించలేదు. అన్నయ్య గోకుల్ ఖాళీగా ఉండడం, అమ్మ ప్రాంచన ఇంటి దగ్గరే ఉండడం, తండ్రి సుధాకరరావు పొలంలో కష్టపడుతుండడం చూసి బయట పడలేదు. తన స్వప్నాన్ని తన లోనే దాచేసుకుంది. కాని అది కుటుంబ సభ్యులందరికీ తెలుసు. అయినా ఎవ్వరూ బయట పడలేదు. ఈ రోజు ఆ విషయం మీదనే ఎక్కువ చర్చ జరగడం ఆలోచనలకు బీజం వేసింది. కూతురికి రెండేళ్లలో పెళ్లి చేసి పంపిస్తాననే సరికి సుధాకర్ కు కోపం వచ్చి భార్య వంక చూసి, ఇడ్లీలు తిని బయటకెళ్ళి పోయాడు. భర్తకు కోపం వచ్చిందని గ్రహించిన భార్య మారు మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయి ఇంటి పనుల్లో మునిగి పోయింది.
* * * * * *
ప్రాంచన వంటింటి పనులు ముగించుకుంది. గ్రౌండ్ నుంచి అప్పుడే రంజని వచ్చి ఫ్రెష్ అయ్యింది. బయటకెళ్ళడానికి బయలుదేరాడు గోకుల్. వంద రూపాయలు డబ్బులు కావాలని తల్లినడిగాడు.
“ఎందుకురా..? మాటి మాటికి డబ్బులు అడుగుతావ్.? మీ నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. వినిపించుకోవెం...” చిరుకోపంగా అరిచింది ప్రాంచన.
“నాన్నకు నీ మీద ప్రేమేక్కువమ్మా..! ఏమీ అనరులే..” తల్లిని బ్రతిమాలాడు గోకుల్.
“అవునవును... నా మీద ప్రేమెక్కువే.. అందుకే ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడు..” అంటూ నాలుక కరుచుకుని “నా దగ్గర లేవురా..” అంది తల్లి.
“ముందు దానికి వంట పనులు నేర్పించు. పెద్ద కూతురిలా అత్తోరింటికి వెళ్లి ఏడవకుండా ఉంటుంది” అంటూ విషయాన్ని చెల్లెలి మీదకు తోశాడు. డబ్బులు తీసుకుని బయటకెళ్లిపోయాడు. రంజని ఇవేమీ పట్టించుకోకుండా కాలేజీకెళ్ళిపోయింది.
ఉదయం కోపంగా బయటకెళ్ళిన భర్త దిగులుగా ఇంటికి చేరుకోవడం చూసి కంగారు పడింది ప్రాంచన. ఏమైందని దగ్గర కూర్చొని ప్రేమగా అడిగింది. ప్రేమున్నా లేకున్నా కట్టుకున్న భార్య ప్రేమగా కళ్ళల్లో కళ్ళు పెట్టి భర్తనలా చూసి ఏమైందని అడిగితే నిజం చెప్పని భర్తలుంటారా ప్రపంచంలో.!
“మన మండలంలో గెలవాలి. తర్వాత మన జిల్లాలో గెలవాలి. తర్వాత రాష్ట్రంలో గెలవాలంటే కోచ్ కావాల్సిందేనని వివరాలు కనుక్కున్నాను” అక్కడితో ఆగిపోయాడు సుధాకరరావు. ప్రేమగా చెంపలను నిమిరింది ప్రాంచన. ‘ఏమైందో చెప్పండి’ అన్నట్లుగా చూసింది.
“ఆశలకు హద్దేముంటుంది. యాభై వేలవుతుందని అంటున్నారు” అన్నాడు ఆమెను చూస్తూ.
“అమ్మో... యాభై వేలే... అంత ఖర్చా..” నోరెళ్ళబెట్టింది ప్రాంచన.
“అందుకే శెట్టి గారిని అడిగాను. ఐదు రూపాయల వడ్డీతో ఇస్తానంటున్నాడు. కావాల్సిస్తే రమ్మంటున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు” అంటూ ఆమె చేతులను పక్కకు తీశాడు.
“అంత వడ్డీ మనమెక్కడ కట్టగలం చెప్పండి. మధ్యతరగతి వాళ్ళమైనా మనం బీదవాళ్ళతో సమానమేనండి. మన కలలను నెరవేర్చుకునే అవకాశమే ఉండడం లేదు. ఎప్పుడూ అణిగిమణిగి ఉండాల్సిందే” తన దృడమైన నిర్ణయాన్ని చెప్పలేదామే.
“పిల్లల్ని కనడమే బాధ్యత అంటే జంతువులు కూడా కంటాయి. వాళ్ళ కలల్ని కూడా సాకారం చేయగలిగితేనే తల్లీదండ్రులవుతాం. లేకపోతే మనిషికి గొడ్డుకూ తేడా ఏంటి చెప్పు.?” ఆమె నిర్ణయాన్ని తెలుసుకోవడానికి పరోక్షంగా చురకంటించాడు.
“అంత వేదాంతం చెప్పేవాళ్ళు మరో దారి ఏదన్నా ఆలోచించలేకపోయారా..!” అంటూ ఆమె కూడా కూతుర్ని కోచ్ దగ్గరికి పంపించడానికి పరోక్షంగా సమ్మతి తెల్పింది.
“మనకిదొక్కటే దారి. ఇదే చేద్దాం. బ్రతిమాలుకుంటే ఇంకో రూపాయి తగ్గించి నాలుగు రూపాయల వడ్డీతో ఇవ్వోచు. ఒంట్లో ఇంకా సత్తువ ఉంది కదా.. కష్టపడి వాడి డబ్బులు వాడి మొహాన కొట్టేద్దాం. పిల్లోడు కూడా ఒక దారైతే ఇంకా బావుంటుంది. అమ్మాయే గెలిస్తే కష్టాలు పోయినట్లే అనుకో..!” ఆశావహ దృక్పథంతో అతని నిర్ణయాన్ని కూడా చెప్పేశాడు.
“మీకు నచ్చిందే చేయండి కాని మిమ్మల్ని బయటకీడ్చవద్దు” ఫోన్ మోగడంతో అక్కడ్నుంచి లేచింది.
* * * * * *
బ్రతిమాలి శెట్టి దగ్గర నాలుగు రూపాయల వడ్డీతో యాభై వేలు తెచ్చి కూతుర్ని కోచ్ దగ్గర జాయిన్ చేశాడు సుధాకరరావు. గోకుల్ ఇంట్లో బాగా గొడవ చేశాడు. ఏదన్నా జాబ్ చూసుకోమని వాళ్ళు కూడా ఈసారి ఖచ్చితంగా అతనికి చెప్పేశారు. రాకెట్ నిరంతరాయంగా వెళ్తూనే ఉండాలంటే కింద మంట పెట్టాలి. అలాగే గోకుల్ కింద మండినట్లుంది. ఈ సంఘటనతో ప్రైవేటు జాబ్ వెతుక్కున్నాడు. జాబ్ హడావుడిలో పడి ఇంట్లో విషయాలు పట్టించుకోవడం తగ్గించేశాడు. మనకంటూ ఓ వ్యాపకం ఉంటే మెదడులోనున్న చెత్తంతా చెదిరిపోతుంది.
ఒక రోజు ఆఫీస్ కెళ్ళగానే సహోద్యుగులంతా అతనికి కంగ్రాట్స్ చెప్పారు. అతను ఏదో సాధించినందుకు కాదు, రంజని జిల్లాలో టాప్ ప్లేస్ లో పతకం గెలిచిందని పేపర్ లో న్యూస్ వచ్చింది. అది చూశాక కాని అతని చెల్లి ఎంత కష్టపడి గెలిచిందో అర్ధం కాలేదు. ఆమెపై సంపూర్ణమైన నమ్మకం కలిగింది. కళ్ళు చెమర్చాయి.
“ఇంకేంటి.? నెక్స్ట్ స్టేట్ లెవెల్ లో గెలవడమే తరువాయి” అంటూ ఒకరు.
“సిక్స్ మంత్స్ లో కామన్ వెల్త్ గేమ్స్ ఉన్నాయి కదా.! అందులో పార్టిసిపేట్ చేయొచ్చా” అంటూ ఇంకొకరు సహోద్యుగులంతా గోకుల్ ను అడిగారు. తదుపరి కర్తవ్యం అతనికప్పుడు బోధపడింది. తన చెల్లితో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తానని చెప్పి, త్వరత్వరగా ఆఫీస్ వర్క్ ముగించుకుని ఇంటికి బయలుదేరాడు గోకుల్.
* * * * * *
“అమ్మా... అమ్మా... నాన్నేక్కడ..?” కాళ్ళు కడుక్కొని కుర్చీలో బ్యాగును వదిలేసి లోపలికెళ్తూ తల్లిని అడిగాడు గోకుల్.
“లోపలుంటారు, చూడరా..” అంటూ ఆమేవో పనుల్లో మునిగిపోయింది.
“నువ్వు కూడా ఒకసారి ఇలా రా..” అంటూ తల్లి అడిగే మాట వినిపించుకోకుండా “నాన్నా... నాన్నా...” అంటూ తండ్రిని పిలిచాడు గోకుల్.
“ఏమైందిరా..?” అంటూ చేతులు కడుక్కుని వచ్చింది ప్రాంచన.
కొడుకు ప్రైవేటు జాబ్ చేస్తున్న దగ్గర్నుంచి తండ్రీ కొడుకుల మధ్య వారికే తెలియని బంధం ఏర్పడింది. ఒకప్పటి సూటిపోటి మాటలు లేవు. చికాకులు పడడం లేవు. ఒకరికొకరు పరస్పరం గౌరవించుకుంటున్నారు. ఒకరి మాటకు ఒకరు విలువిచ్చుకుంటున్నారు. ఒక మనిషి విలువ అతనూ వృత్తిలో ఉన్నప్పుడే పెరుగుతుంది.
“ఈ రోజు ఆఫీసులో మా స్టాఫ్ అంతా చెల్లెలు గురించే మాట్లాడుకున్నారు తెలుసా....! దానివల్ల నా ఇమేజ్ ఇంకా పెరిగింది. నెక్స్ట్ కామన్ వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయించమంటున్నారు. నాకు కూడా అదే మంచిదనిపిస్తుంది. ముందు నేషనల్ లెవెల్ లో గెలిస్తే కామన్ వెల్త్ గేమ్స్ కు క్వాలిఫై కావొచ్చు. ఎప్పుడూ అంటుంటుంది కదా, బంగారు పతకం తెస్తానని. మామూలు వాటికన్నా ఈ గేమ్స్ గోల్డ్ మెడల్ అయితే ఇంకా పేరు వస్తుంది. అది తేవాలంటే ఇంకా ఎక్కువ టార్గెట్ పెట్టుకుని సాధన చేయాలి నాన్నా” అన్నాడు గోకుల్.
“దాందేముందిరా..! రోజూ ఇలాగే ప్రాక్టీసు చేస్తే సరిపోతుందిగా..” వెంటనే తల్లి ప్రాంచన అంది.
“టాప్ ర్యాంకులలో ఉన్నవాళ్ళ మీద గెలవాలంటే అంత ఈజీ కాదమ్మా.! ఇలా ప్రాక్టీసు చేస్తే అసలు క్వాలిఫై కాదు” అంటూ తల్లివైపు తిరిగాడు గోకుల్.
“అర్ధమైందిరా..! ఇంకా మంచి కోచ్ దగ్గర జాయిన్ చేయాలంటావ్... అంతేగా..?” అన్నాడు సుధాకర్ రావు.
“కరెక్ట్ నాన్నా.. టాప్ కోచ్ లకయితే ట్రిక్స్ తెలుసు. టార్గెట్ ను రీచ్ అవ్వడానికి ఏమేమి చేయాలో తెలుసు. అందుకే వాళ్ళకంత పేరు. రంజనిని కూడా అక్కడ చేర్పిస్తే బావుంటుంది నాన్నా..” తన మనసులో మాట చెప్పేశాడు గోకుల్.
“అమ్మో... అంత డబ్బు మనమెక్కడ పెట్టగలం. అకాడమీలో అంటే మామూలు మాటలా..?” భర్తవైపు తిరిగి అంది ప్రాంచన.
ఆడవాళ్ళ గొప్పదనమదే.! ఏ పని గురించి ఆలోచిస్తున్నా సాధ్యాసాధ్యాలకన్నా ఆర్ధిక పరిస్థితుల గురించే ఆలోచిస్తారు. అందుకే తాళాల గుత్తి వారి దగ్గరే ఉంటుంది. కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. అకాడమీలో చేర్పిస్తే కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఏమైపోతుందోనని ఆమె భయం.
“అదే ఆలోచిస్తున్నా. పెద్దమ్మాయి శ్రీవల్య పెళ్లి చేసి రెండు సంవత్సరాలైనా తిరక్కముందే యాబై వేలు అప్పు చేసి కోచింగ్ ఇప్పించాం. ఇప్పుడు టాప్ కోచ్ అంటే.... ఐదు లక్షల పైనే ఖర్చు అవుతుంది. అంత డబ్బంటే మాటలా.?” అంటూ ఆలోచిస్తూ కూర్చొన్నాడు సుధాకర్ రావు.
అప్పుడే ఇంటికొచ్చిన రంజని అక్కడి సంభాషణను అర్ధం చేసుకుంది. తన మనసులో ఉన్నదాని గురించి మాట్లాడుకోవడం ఆమెను అమితానందానికి గురిచేసింది. తను అడగకపోయినా అన్నయ్య అడిగేసరికి మనసులోనే కృతజ్ఞతలు తెల్పుకుంది.
“స్పాన్సర్స్ ఎవరినైనా ట్రై చేస్తే బావుంటుంది నాన్నా. కామన్ వెల్త్ గేమ్స్ కు చాలామందికి స్పాన్సర్స్ ఉంటారు” అందించింది రంజని.
“అది ఆల్రెడీ నేషనల్ లెవెల్ లో గెలిచి కామన్ వెల్త్ కోసం ప్రాక్టీసు చేసేవాళ్ళకు. నువ్వు నేషనల్ లెవెల్ కెళ్ళలేదు కదా.! ఇప్పుడే స్పాన్సర్స్ రావడం కష్టం” అన్నాడు గోకుల్ కుర్చీలో కూర్చొంటూ. అందరిలోనూ మౌనం ఆవహించింది. ‘ఏం చేద్దాం’ అంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు.
“ఉండండి... ఇప్పుడే వస్తాను” అంటూ బీరువా దగ్గరికెళ్ళాడు తండ్రి. పిల్లలముందు మొదటిసారి లాకర్ తాళాలు తీశాడు. అందులో భద్రంగా దాచిపెట్టిన పేపర్స్ ను బయటకు తీశాడు సుధాకర్.
కాసేపటి సంభాషణ తర్వాత “మేం డెసిషన్ తీసుకున్నాం రా.! నువ్వు ఖచ్చితంగా బంగారు పతకం సాధించాల్సిందే.! ఏమంటావ్..?” అంటూ చెల్లెలు వైపు చూస్తూ అడిగాడు గోకుల్.
“అలాగేరా..! ఆ గోల్డ్ మెడల్ కన్నా ఇంకా పెద్ద గోల్డ్ మెడల్ తెస్తా.. సరేనా..” అంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది రంజని.
* * * * * *
పోటీతత్వం తన నరనరాన జీర్ణించుకుందేమో.! కష్టపడే గుణం శరీరమెప్పుడో అలవర్చుకుందేమో.! అన్నట్లుగా కఠోరంగా శ్రమించింది రంజని. తల్లీదండ్రుల ఆశీస్సులు, అన్నయ్య అండదండలు, గురువు ప్రోత్సాహం రంజనీని కామన్ వెల్త్ గేమ్స్ లో రజత పతకం సాధించేలా చేశాయి. అయినా ఆమెలో సంతృప్తి కనపడలేదు. చిలుక కంటిమీదే అర్జునుడు గురిపెట్టినట్లుగా తన లక్ష్యం బంగారు పతకం గెలవడంపైనే గురిపెట్టింది. న్యూస్ తెలియగానే పత్రికా విలేకర్లు రంజనీని చుట్టుముట్టారు. అందులో ఆడవాళ్ళూ ఉన్నారు, మగవారూ ఉన్నారు. ఓ సాటి ఆడది సాధించినందుకు మహిళాలోకం గర్వంగా తలెత్తుకుంటుందన్న ఆనందం ఆడవిలేకర్లులో కన్పిస్తుంటే, ఈమెలా సాధించగలిగిందని మగవిలేకర్లలో కన్పిస్తుంది.
“హాయ్ రంజని మేడం.! కామన్ వెల్త్ గేమ్స్ లో రజత పతకం సాధించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు.?” అంటూ మైకుని ఆమె దగ్గర పెట్టి అడిగిందో విలేకరి.
“ఆనందంగానే ఉందండి. ప్చ్.. గోల్డ్ మెడల్ మిస్ అయినందుకు బాధగా ఉంది” నిట్టూర్చింది రంజని. పక్కనే వచ్చి కోచ్ కూర్చొన్నాడు.
“కామన్ వెల్త్ గేమ్స్ లో మన దేశపు అమ్మాయిలు రాణించడం కష్టమైన ఈ రోజుల్లో మారుమూల పల్లెనుండి వచ్చిన మీరు సిల్వర్ మెడల్ వచ్చినందుకు కనీసం హ్యాపీ ఫీల్ అవ్వగుండా గోల్డ్ మెడల్ రాలేదని బాధ పడుతున్నారెందుకు.?” అంటూ అర్ధం లేని లాజిక్ పట్టుకుని అడిగాడో విలేకరి.
“మన టార్గెట్ గోల్డ్ మెడల్ అయిన్నప్పుడు అదే సాధించాలి. సిల్వర్ తో సంతృప్తి రాదండి...” తన మనసులో మాట నిర్మొహమాటంగా చెప్పేసింది రంజని.
“రంజని చెప్పింది కరెక్ట్. గోల్ కొట్టడం మీద క్లియర్ గా ఉంటే ఈ రోజు కాకపోయినా రేపయినా సాధించి తీరుతాం” అంటూ కోచ్ వంత పాడాడు.
“ఒక మారుమూల పల్లెనుండి వచ్చిన మేడంలో సాధించే శక్తి ఉందని ఎలా తెలుసుకోగలిగారు సార్..?” అంటూ అతనివైపు మైకుని పెట్టి అడిగిందో విలేకరి.
“ఇంట గెలిచినవాడు రచ్చ గెలవగలడు. స్టేట్ లెవెల్ లో గెలిచిన వీడియోలు చూశాను. తపనున్న అమ్మాయి. గెలిచేవరకూ వదిలిపెట్టే రకం కాదు. చాలా తక్కువ మందిలోనే ఈ లక్షణాలు ఉంటాయి. తను గెలిస్తే నేను గెలిచినట్లే కదా.! అందుకే స్పాన్సర్స్ రాకపోయినా, తను నిరాశపడకుండా కష్టపడుతుంటే చేయూత అందించానంతే. దానికే ఇంత గుర్తింపు” పొంగిపోయాడు కోచ్.
“మీ పేరెంట్స్ గురించి చెప్పండి మేడం. వాళ్లెలా ఫీల్ అవుతారు.?” నేపధ్యం తెలుసుకునే ప్రయత్నం చేశాడో విలేకరి.
“నన్నింతగా ప్రోత్సహించినందుకు వాళ్లకెప్పుడూ ఋణపడిఉంటాను. మా అన్నయ్య గోకుల్ కు స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఇలా చెప్పినంత మాత్రానా ఆ ఋణం తీర్చుకోలేను. తీర్చుకునే అవకాశం వస్తుందనుకుంటున్నా..” చెమర్చిన కళ్ళతో చెప్పింది రంజని. ప్రపంచాన్ని గెలిచిన అమ్మాయైనా తనూ ఓ మహిళే కదా.!
“పల్లెల్లో ఆడపిల్లల్ని ఎక్కడికీ పంపించరు కదా.! ఏదీ నేర్పించరు కదా.! అలాంటిది మీరు ఈ రంగాన్ని ఎంచుకోవడం, ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంత ధైర్యంగా ఎలా రాగలిగారు మేడం.? గెలవగలననే నమ్మకంతోనే వచ్చారా.? మీ పేరెంట్స్ వద్దని చెప్పలేదా.?” ఉత్సుకత ఆపుకోలేక అడిగిందో విలేకరి.
“ఆడపిల్ల, ఆడపిల్ల అంటున్నారు... ఏం మీరు ఆడవాళ్ళు కాదా.? ఎన్నో సవాళ్ళతో కూడుకున్న జర్నలిజంను ఎంచుకుని సత్తా చాటడం లేదా.? ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి ఇంటర్వ్యూలు తీసుకోవడం లేదా.? నేనిక్కడికి గెలవాలని రాలేదు. మారుమూల ఆడపిల్లలు కూడా ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకోగలరని నిరూపించాలని వచ్చాను. మా కోచ్ వల్ల అది సాధ్యమైంది. మీ వల్ల ప్రపంచానికి తెలుస్తుంది. మీ అందరికి థాంక్స్..” అంది రంజని.
“సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 20 లక్షలు, స్టేట్ గవర్నమెంట్ నుంచి 30 లక్షలు నజరానా ప్రకటించారు కదా.. దీనిపై మీ ఒపీనియన్ మేడం..? ఆ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నారు.?” అడిగాడో విలేకరి.
“ప్రభుత్వం అందర్నీ గుర్తిస్తుందని తెలుస్తుంది. నాకింత వరకు స్పాన్సర్స్ లేరు. నా కలను నిజం చేయాలని నా ఫ్యామిలీ వాళ్ళ కలల్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడెలాగూ స్పాన్సర్స్ వస్తారు కాబట్టి నా ఫ్యామిలీ కలను నిజం చేయాలనుకుంటున్నా.” అందరి వంక చూస్తూ గర్వంగా చెప్పింది రంజని.
“అదేంటో పాఠకులకు చెప్పండి మేడం” మళ్ళీ అడిగాడతను.
“ఇల్లు కట్టుకోవాలని ఆశపడి కొనుక్కున్న భూమిని నా కోసం అమ్మేసి నన్నిక్కడికి పంపించారు. నేనిది సాధించడానికి సాయపడిన వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పొదరిల్లు కట్టించాలనుకుంటున్నాను. ఇప్పటి వరకున్న ఇంటిని పడగొట్టేసి డూప్లెక్స్ కట్టించాలని నా కోరిక. మరణించాక స్వర్గం చేరుకుంటామో లేదో నాకు తెలియదు. బ్రతికున్నప్పుడే స్వర్గంలో ఉండడమంటే ప్రేమానురాగాల పొడరిల్లులో కలిసుండడమే. స్వర్గమంటే అదెక్కడో ఉండదు. నిర్మలమైన మనస్సుతో మనకున్న సౌకర్యాలతో నలుగురితో సంతృప్తిగా బ్రతికే జీవితమే స్వర్గం అని నాన్నగారు ఎప్పుడూ చెప్తుంటారు. ప్రాధమిక హక్కులు ఆరు. సొంతింటి నిర్మాణం ప్రాధమిక హక్కు కాకపోయినా సుప్రీంకోర్టు దాని పరిధిలోకి తీసుకొచ్చి చట్టబద్ధత చేసింది. మన అవసరాల కోసమని, కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తూ స్వర్గంలాంటి ఇంటిని దూరం చేసుకుంటున్నాం. నేలతల్లిని నమ్ముకుంటే మీ బంగారుతల్లిని ఆ నేలతల్లె ఆదుకుంటుందని చెప్పి ఇప్పించిన ఒక ప్లాట్ ను అమ్మేసి నన్నీ స్థాయికి తీసుకొచ్చిన నాన్నగారుకు ఆ మాత్రం చేయలేనా.?” గతాన్ని గుర్తుచేసుకోవడంతో గొంతు గద్గదమయ్యింది. కోచ్ ఓదార్చాడు.
“చాలా మందికి సొంతిళ్ళు ఉన్నాయి. మరి వారెందుకు అంత ఆనందంగా లేరు. ఏం వారికి నచ్చినట్లు వారు కట్టుకోవడం లేదా మేడం.?” లాజిక్ గా అడగడం తనకే వచ్చినట్లు అడిగాడో విలేకరి. వెంటనే కోచ్ అందుకున్నాడు.
“మన ఆలోచనల బట్టే ఆచరణ ఉంటుంది. మన ఫీలింగ్స్ ను బట్టే మన స్వభావం తెలుస్తుంది. ఎన్ని ఆలోచనలున్నా ఆచరించకపోతే ఇదిగో మీరన్నట్లే ఉంటారు. గెలిపించాలని నాకుంది. గెలవాలని తనకుంది. అందుకే సాధించాం. అలాగే ఏదైనా..” విలేకరి ఏదో అడగడంతో మధ్యలోనే ఆగిపోయాడు కోచ్.
“అంటే మేడం, ఒక రకంగా ప్లాట్ ఆమ్మడమే ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా.?” ఏదేదో రాసుకుంటూ, కోచ్ మాటలు వినకుండా అడిగాడో విలేకరి.
“ప్లాట్ అమ్మడం ఇన్స్పిరేషన్ కాదు. కాని ప్లాట్ కొనడమే ఇన్స్పిరేషన్. ఎందుకంటే నాన్నగారు నా చిన్నప్పుడు ప్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆయన పక్కన నేను కూడా ఉన్నాను. పేమెంట్ మొత్తం చేశాక 3 గ్రామ్స్ గోల్డ్ మెడల్ తోపాటుగా 10 వేల రూపాయల గవర్నమెంట్ బాండ్ ను బంగారు తల్లి పథకం కింద ఇచ్చారు. ఆ గోల్డ్ మెడల్ ను ఇంట్లో చూసినప్పుడల్లా నేనూ అది సాధించాలని అనుకునేదాన్ని. చదువుల్లో ఎప్పుడూ సాధించలేదు. కాని నేను కోచింగ్ లో జాయిన్ అయ్యాక డబ్బుల కోసమని ఆ బాండ్ ను, గోల్డ్ మెడల్ ను అమ్మేశాక మాత్రం ఖచ్చితంగా దానికన్నా పెద్ద గోల్డ్ మెడల్ తేవాలని ఫిక్స్ అయిపోయాను. ఈ రోజు సిల్వర్ తో తిరిగొచ్చాను. త్వరలోనే ఆ గోల్డ్ మెడల్ సాధించి తీరుతాను. మీ అందరి సహకారం, ఆశిస్సులు కావాలి...” అంటూ వారివంక చూసింది రంజని.
“వెరీ గుడ్ మేడం. చాలా బాగా చెప్పారు. ఇంటి ఆడపడుచులా ఆలోచించి మీ కలను నెరవేర్చిన మీ నాన్నగారి కలను నెరవేర్చడం అద్భుతమైన విషయం” పోగిడిందో విలేకరి. సాటి మహిళ గొప్పదనాన్ని గుర్తెరగడం ఈ రోజుల్లో కరువైపోయింది.
“మీ గురించే కాక ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తూ మన మహిళల మనస్తత్వాల్ని తెలియజేశారు. మీరు ఆశించినట్లే జరగుతుంది మేడం. ఇండియా మీ వైపే ఉంటుంది” అంటూ అందరు మహిళా విలేకర్లు ముక్తకంఠంతో మాట్లాడుతుంటే కుర్చీల్లోంచి లేచింది రంజని, పక్కనే కోచ్.
“చాలా థాంక్స్ అండి..” అంటూ తన లక్ష్యం వైపు మరలింది రంజని.