ఆరు రోజులు అయింది పాల డైరీలో నేను చేస్తున్న ఉద్యోగం ఊడిపోయి. ఈ కంపెనీ వాళ్ళు వారి లాభాలను పెంచుకోవడానికి పాలు రేటు పెంచడం ఏమిటో.! మార్కెట్ లో పోటీ ఎక్కవ అవడంతో ఈ కంపెనీ సేల్స్ పడిపోవడం ఏమిటో.! దాంతో కంపెనీ పొదుపు చర్యల్లో భాగంగా నాలాంటి కొత్త ఉద్యోగాలు మీద కోత పెట్టడం ఏమిటో.! ఇదంతా నాకు అర్ధం అయ్యేసరికి నా ఖర్మ కాలిపోయింది. ఇంటి బాడుగలు, కుటుంబ ఖర్చులు అన్ని దాదాపు నా మీదనే ఆధారపడి ఉన్నాయి. నాలుగు రోజుల నుండి తిరుగుతున్నా నాకు ఎక్కడ పని దొరకలేదు. తిరిగి తిరిగి చెప్పులు కూడా తెగిపోయాయి. ఈ రోజు ఇరవై ఐదో తేదీ గత నెల జీతం డైరీ వాళ్ళు నాకు ఇంకా ఇవ్వలేదు. ఈ రోజు అయిన ఇస్తారేమో చూడాలి. ఆ డబ్బు వస్తే ఈ నెల సమస్యలు కాస్త గడుస్తాయి. వచ్చే నెల సంగతి తరువాత చూడొచ్చు. ముందు ఒకసారి డైరీ దగ్గరకు వెళ్ళి రావాలి అనుకొని జేబులో చెయ్యి పెట్టాను. చేతిలోకి రెండు రూపాయల నాణెం వచ్చింది. ఇక్కడి నుండి డైరీకి పది కిలోమీటర్ల దూరం. ఆటోకు వెళ్లాలి అన్నా తొమ్మిది రూపాయలు కావాలి. రావడానికి మరో తొమ్మిది రూపాయలు మొత్తం పద్దెనిమిది రూపాయలు. చేతిలోకి వచ్చిన రెండు రూపాయలను వంక చూసి నా కష్టాలకు నేను మరొక సారి నవ్వుకొని, మద్య తరగతి ప్రజల ప్రధాన వాహనం అయిన నా సైకిల్ మీదనే పాల డైరీకి వెళ్లాలనే నిశ్చయించుకున్నాను. ఈ సైకిల్ కు కూడా బ్రేకులు సరిగా పడడం లేదు. అది గమనించి ఈ సైకిల్ కు కూడా సర్విసింగ్ చేయించి చాలా రోజులు అయింది. ఈ రోజు అయిన జీతం వస్తే దీనికి కూడా రిపేర్ చేయించాలి. అనుకొని సైకిల్ మీదనే నా యాత్ర ప్రారంభించాను. ఆయాస పడుతూ డైరీ దగ్గరకు చేరుకున్న నన్ను చూసి మా మానేజర్
"ఏంటయ్యా.. ఇలా వచ్చావు?" అని అడిగాడు.
"సార్... ముందు నెల జీతం డబ్బులు నాకు ఇంకా ఇవ్వలేదు. ఇంట్లో డబ్బుకు చాలా సమస్యగా ఉంది. ఆ డబ్బు ఇస్తే ఈ నెలను ఎలాగోలా జీవితాన్ని లాగించేస్తాను"అని నా దీన స్థితిని ఆయనకు వివరించాను.
"ఎవరికి లేవయ్యా సమస్యలు. అందరికీ సమస్యలు ఉన్నాయి. ఈ డైరీ కూడా ఇప్పుడు నష్టాలలోనే నడుస్తొంది. తెలుసు కదా..! నీ జీతం డబ్బులు వచ్చే నెల రెండవ తేదీన వచ్చి తీసుకుని వెళ్లొచ్చు" అని మా మానేజర్ అన్నాడు.
దానికి నేను "అదేంటి సార్. ప్రతినెలా ఇరవై ఐదో తేదీన కదా మాకు జీతం ఇస్తు ఉన్నది. మరి రెండవ తేదీన రమ్మంటున్నారు ఏమిటి?" అని అడిగాను.
"నన్నేం చేయమంటావయ్యా.. జీతాలు ఇవ్వడానికి మేనేజ్ మెంట్ వారికి ఇప్పుడు డబ్బు సమయానికి అందుబాటు కాలేదట. అందుకే రెండవ తేదీకి వాయిదా వేసారు. రెండవ తేదీ వచ్చి నీ జీతం డబ్బులు నువ్వు తీసుకొని వెళ్లొచ్చు" అని మేనేజర్ కాస్త చిరాగ్గా అన్నాడు.
నా పరిస్థితికి నన్ను నేను తిట్టుకుంటూ డైరీ నుండి ఇంటికి తిరుగి వెళదామని వచ్చి సైకిల్ స్టాండ్ నుండి దానిని తీసి చూస్తే వెనుక టైరు గాలి తగ్గి కనబడింది. ఆ క్షణం కష్టాలు అన్నీ నన్నే ఏరి కోరి వరించి నట్టు ఉన్నాయి. అనుకొని వేరే దారి లేక సైకిల్ ను తోసుకుంటూ ఇంటికి బయలు దేరాను. అలా నడిచి వెళుతున్నప్పుడు మేఘాలతో నిండి ఉన్న ఆకాశం, వీస్తున్న చల్లటి గాలి మాత్రమే నాకు ఈ లోకంలో అనుకూలంగా ఉన్నాయి అనుకుంటూ కొంత దూరం వెళ్లగానే రోడ్డు యొక్క మట్టి కట్టకు కాస్త దిగువ ఎవరో ఒకవ్యక్తి పడి ఉండడం చూసి సైకిల్ ఆపి స్టాండ్ వేసి అతడు బతికి ఉన్నాడా? లేడా? చూద్దామని అతడి దగ్గరకు వెళ్ళి చేతిని పట్టుకొని నాడీ పరిక్షించాను. నాడి బాగానే పని చేస్తొంది. తెల్లని పంచె, చొక్కా వేసుకొని ఉన్న అతడు ఎందుకు అలా పడి ఉన్నాడో నాకు అర్ధం కాక అతడిని కాస్త ఊపి " అన్నా.. ఏమైంది? ఎందుకు ఇలా పడి ఉన్నావు?" అన్నాడు.
దానికి ఆ వ్యక్తి బలవంతంగా కళ్లు తెరిచి మాట్లాడలేక మాట్లాడుతూ " ఎ..వ.ర్రా.. నువ్వు?" అని మళ్ళీ మత్తు లోకి జారుకున్నాడు.
వాడు నోరు తెరవగానే మద్యం వాసన గుప్పున నా ముక్కును తాకింది. అదీ గాక నన్ను అతడు అమర్యాదగా మాట్లాడడం నాకు నచ్చలేదు. నాకు తాగుబోతులు అంటే పరమ అసహ్యం. ఈ తాగుబోతు ఎవడో ఇక్కడే ఉండనీలే అని నా దారిన నేను పోదాం అని లేచి బయలు దేరుతుండగా అప్పుడు వీచిన గాలికి అతడి జేబు కదిలింది. అందులో నాలుగు ఐదు వందల రూపాయల నోట్లు చూడగానే నా కళ్ళు మెరిసాయి. నేను అతడి వంక మరొక సారి పరిశీలనగా చూసాను. కోసి కిడ్నీలు తీసుకుని వెళ్లినా అతడికి మెలకువ వచ్చేలా లేదు. దాంతో నేను వంగి అతడి జేబులో ఉన్న నోట్లను తీసుకుని చటుక్కున నా ప్యాంటు వెనుక జేబులో పెట్టుకొని అక్కడి నుండి బయలుదేరాను. వెళ్లే ముందు మళ్ళీ ఒక క్షణం ఆగి ఎలాగో అతడి డబ్బు తీసుకున్నాను. కదా వర్షం వచ్చేలా ఉంది. పాపం కనీసం అతడిని వాళ్ళ ఇళ్లు ఏదో కనుక్కుని ఇంటి దగ్గర అయినా వదిలేద్దాం అనుకుని మళ్ళీ కిందకు దిగి అతడిని లేపి "ఏమయ్యా..నీ ఊరు ఏది?" అని అడిగాను. దానికి అతడు మత్తు కళ్లు పూర్తిగా తెరవకుండానే " ఎనుములవారిపల్లి" అన్నాడు.
ఎనుములవారిపల్లి. అయితే పక్కనే, ఇక్కడి నుండి ఒక కిలోమీటరు దూరం ఉంటుంది ఆ ఊరు. ఎలాగో నేను అటే వెళ్లాలి కాబట్టి అతన్ని తీసుకుని వెళ్లి అక్కడ వదిలేస్తే సరిపోతుంది అనుకొని అతన్ని లేపి సైకిల్ హాండిల్ ను ఒకచేత్తో, అతడిని ఒకచేత్తో పట్టుకొని అతి కష్టం మీద నడిపించుకుంటూ ముందుకు కదులుతుండగా అప్పుడు నా ముందు ప్రత్యక్షం అయింది నా 'అంతరాత్మ'
ఏ పనినైనా చేసే ముందు అది అలా ప్రత్యక్షం అయి నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు అది వచ్చింది అంటే ఏమి ప్రశ్నలు అడుగుతుందో అనుకుంటు ముందుకు నడుస్తుండగా అది కూడా నాతోపాటు కదులుతూ సంభాషణ మొదలు పెట్టింది. అంతరాత్మ- ఏమిటి రోయ్ సమాజ సేవ బాగానే చేస్తున్నట్లు ఉన్నావు.! నేను- అప్పుడప్పుడు అయినా చేయాలి కదా..!
అంతరాత్మ- అదిసరే... కానీ. డబ్బు ఏదో చేతికి అందినట్లు ఉంది. ఎంతమాత్రం గిట్టుబాటు అయ్యిందేంటి? నేను- అవును.. ఏదో దేవుడి దయవల్ల రెండు వేల రూపాయలు దొరికింది. అంతరాత్మ- ఆ డబ్బు తో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను- ఆ.. ఏముంది. ముందు ఇంటి బాడుగ కట్టేస్తా. తర్వాత మంచి చెప్పులు ఒక జత కొనుక్కుంటా. మిగిలిన డబ్బు నాకు మరొక ఉద్యోగం దొరికే వరకు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటా.
అంతరాత్మ- మొత్తానికి ఈ డబ్బు తో నీ సమస్యలు కాస్త తీరుతాయి అంటావు. అది సరేకానీ నీ కష్టాలు తీర్చుకోవడం కోసం మరొకరి కష్టాలు ఏవీ పట్టించుకోవా? నేను- అంటే? నేను ఇప్పుడు ఏమి తప్పు చేస్తున్నాను అని నీ అభిప్రాయం? అంతరాత్మ- ఏమిలేదోయ్.. నీకు ఉన్నట్టే ఆ తాగుబోతు అతడికి కూడా కుటుంబం, కష్టాలు ఉండవు అంటావా? నేను- కష్టాలు ఉంటే డబ్బుతో కష్టాలు తీర్చుకుంటారు కానీ ఇలా తాగి రోడ్డు పక్కన పడి ఎందుకు దొర్లుతాడు? అంతరాత్మ- ఓహో.. అలా వచ్చావా? అదిసరే దొంగతనంగా ఇతరుల సొమ్ము తీసుకోవడం మంచి అలవాటా? చెడ్డ అలవాటా? నేను- నేను ఇతడి డబ్బు ఏమి ఊరికినే తీసుకోవడం లేదు. తాగి పడిపోయిన ఇతడిని ఇంటి దగ్గర క్షేమంగా దింపడానికి తీసుకుంటున్నాను. అంతే కానీ ఇదేమి దొంగతనం కాదు. అంతరాత్మ- అడ్డెడ్డెడ్డే.. చేసిన తప్పును భలే కవరింగ్ చేసేసుకుంటున్నావ్ రోయ్.
నేను- నేనేమీ కవరింగ్ చేసుకోవడం లేదు. వాస్తవం మాట్లాడుతూ ఉన్నాను. అంతరాత్మ- అది సరేకానీ నిన్ను ఒక ప్రశ్న అడిగినా? నేను- ఓ..అడుక్కో దాని దేముంది. నువ్వు వచ్చిందే ప్రశ్నలతో నన్ను విసిగించడానికే కదా.
అంతరాత్మ- సరేలేవో.. నేను ఏదొ నన్ను ఉద్ధరించడానికి వేరే పనిలేక నిన్ను ఇలా అడుగుతున్నాను అనుకున్నావా? నేను ఏమి అడిగినా అది నీ బాగు కోసమే గుర్తించుకో.
నేను- సరేలే.. ఉద్ధరించడానికే కానీగానీ విసిగించకుండా ఏదో ప్రశ్న అడగాలన్నావు కదా. అడుక్కో..
అంతరాత్మ- సరే నేరుగా విషయానికి వద్దాం. నువ్వు రెండవ తేదీ నీ జీతం డబ్బులు తీసుకుని వెళ్లడానికి డైరీకి వచ్చావనుకో. ఆ డబ్బు తీసుకుని తిరిగి వెళుతుండగా నీకు ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి స్పృహ తప్పి పడిపోయావు. నీకు తిరిగి మెలకువ వచ్చేసరికి నీ జీతం డబ్బులు నీ జేబులో లేకపోతే నువ్వు ఎలా స్పందిస్తావో ఒకేసారి ఊహించు.. నీలాగే ఆ తాగుబోతు కూడా స్పందించి బాధ పడడు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు?
నేను- ఏయ్.. ఆపు నీ సోది. ప్రమాదం వేరు. తాగి పడిపోవడం వేరు. దానికి దీనికి లింక్ పెడతావేమిటి? నా కష్టాలు కొంత అయిన తగ్గించాలి అని నాకు ఆ దేవుడు ఈ అవకాశం ఇస్తుంటే మధ్యలో నీ గొడవ ఏమిటి?
అంతరాత్మ- హూమ్.. దేవుడు.చివరకు నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి దేవుడిని కూడా ఇందులోకి దూర్చావా? ఏ దేవుడు అయిన ఒకరి పొట్టకొట్టి మరొకరికి సహాయ పడుతాడా? అలా చేస్తే వాడిని దేవుడు అంటారా?
నేను- నా కష్టాలను తీర్చడానికి కాకపోతే ఆ దేవుడు నాకు ఎందుకు ఇలాంటి అవకాశం కల్పించాడు అంటావు?
అంతరాత్మ- మంచి ప్రశ్న మనుషులను పరిక్షించడానికే దేవుడు ఇటువంటి సందర్భాలను కలిపిస్తు ఉంటాడు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అని గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు మంచి చేస్తే మంచి వైపు చెడు చేస్తే చెడు వైపే నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు చెప్పు నీకు మంచి కావాలా? చెడు కావాలా?
నేను- ఏయ్ ఆపు నీ వాదన మంచి లేదు. చెడు లేదు. ప్రస్తుతం నాకు సమస్యలు ఉన్నాయి. సమస్యలు కొంత తీరడానికి ఈ రూపంలో నా చేతికి డబ్బు వచ్చింది. మంచో చెడో నాకు అనవసరం నాకు డబ్బు చేతికి వచ్చింది నాకు అదే చాలు. ఇక నీ మాటలు కట్టిపెట్టి నా ముందు నుండి వెళ్లిపో.
అంతరాత్మ- శభాష్.. దారికి వచ్చావు. చెడు చేయడానికే నువ్వు పూనుకున్నావు. చెడు చేయాలి అనుకున్నవాడే ఇలా అంతరాత్మను చంపుకొని ప్రవర్తిస్తాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకో ఎప్పుడు అయితే ఒక తప్పుడు పని చేయడానికి నీ అంతరాత్మను చంపడానికి అలవాటు పడతావో ఆ అలవాటు ఈ ఒక్క రోజుతోనే ఆగిపోదు. ఈ రోజు తాగిన మత్తులో ఉన్న జేబులో నుంచి నువ్వు డబ్బు కాజేసింది తప్పు కాదు అని సరిపెట్టుకున్నావనుకో. రేపు స్పృహలో ఉన్న వాడి జేబులో నుంచి కూడా అవసరాలకు డబ్బు కాజేయడం కూడా తప్పు కాదు అని సర్దిచెప్పుకోవు అనడానికి గ్యారంటీ ఏమిటి? నేను వెళుతున్నాను కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో అంతరాత్మను చంపుకొని ఎప్పుడు అయితే చెడు వైపు ప్రయాణం మొదలు పెడతావో ఆ ప్రయాణం ఆ ఒక అడుగుతోనే ఆగిపోదు. ఇది గుర్తించి మసులుకో. శెలవు
అంటూ అంతరాత్మ అంతర్ధానం అయిపోయింది.
ఇంతలో ఎనుములవారిపల్లి వచ్చింది. దాంతో నేను మళ్ళీ ఒకసారి ఆ తాగుబోతును తట్టి లేపి "మీ ఇళ్లు ఎక్కడ?" అని అడిగాను.అప్పుడు అతడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చెయ్యి ఎత్తి ఒక ఇంటివైపు చూపించాడు.
నేను అతడిని ఆ ఇంటిముందుకు తీసుకుని వెళ్లేసరికి లోపలినుంచి ఒక పెద్దావిడ వచ్చి "ఎక్కడ పడి సచ్చిఉండె బాబు ఈ దరిద్రుడు. అక్కడే వదిలేసుంటే చచ్చిపోయి ఉండేవాడేమో. అలా ఈడు సచ్చిపోయి ఉంటే అయిన ఈ ఇంటికి దరిద్రం వదిలి పోయేది. బయటకు వెళ్లి పని చేసి ఒక పైసా సంపాదించడు కానీ నేను కూలీనాలీ చేసుకుని వచ్చిన డబ్బుతో మాత్రం ఇలా తాగి తందనాలు ఆడి రోడ్లమీద పడతాడు. అలాంటి వీడికి మాత్రం ఎప్పుడూ పెద్దమనిషి లాగా తెల్లచొక్కా, తెల్లపంచి ఉండాలి. ఇంట్లో కాలేజీకి వెళుతున్న పిల్లల ఫీజు కోసం దాచుకున్న డబ్బు అంతా తీసుకుని వెళ్లాడు. ఇప్పుడు పిల్లల చదువులు ఫీజు ఎలా కట్టాలో" అని ఆమె బాధ పడుతూ ఉంటే నా కళ్లలో కూడా నెమ్మదిగా నీటితో తడిసాయి.
నేను "సరే ఇక వెళ్తాను...అమ్మా" అని వెళ్లబోతూ నా ప్యాంటు వెనుక జేబులో ఉన్న డబ్బు తీసి ఇది ఆయన పక్కన పడి ఉన్నది అని ఆమె చేతికి అందించాను.
అంతే ఆమె దాదాపు ఏడుపు లాంటి సంతోషాన్ని ముఖంలో నింపుకుని "ఇంత డబ్బు వెనక్కి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఈ కాలంలో ఎవరు ఉన్నారు. నువ్వు చాలా మంచి వాడిలా ఉన్నావు నాయనా" అంటూ ఇంకా ఏవేవో పొగడ్తల దండకం చదువుతోంది.
నాకు పొగడ్తలు అంటే భయం అందుకే నేను వాటిని చెవులకు ఎక్కించుకోలేదు.
చివరగా నేను అర్జెంటుగా వెళ్లాలి అమ్మా అని ఆమెకు చెప్పి బయటకు వచ్చేసాను. సైకిల్ కు పంచరు వేసే షాపు కనబడడం తో అక్కడ కు వెళ్లి జేబులో ఉన్న రెండు రూపాయలతో కూడా సైకిల్ కు పంక్చర్ వేయిస్తుండగా ఆ షాప్ లో నాకు ఒక పేపర్ ప్రకటన కనబడింది.
అది ఒక పాల డైరీ లో సూపర్వైజర్ ఉద్యోగం కోసం ఇచ్చిన ప్రకటన. ఇంతకు ముందు నేను పని చేసిన కంపెనీ కన్నా రెట్టింపు జీతంతో ఉన్న ఆ ఉద్యోగం ఇంటర్వ్యూ కు వెళితే నాకు ఉన్న ఎక్స్ పీరియన్స్ వలన తప్పకుండా నాకు వస్తుంది.
ఆ అడ్రస్ నోట్ చేసుకొని సైకిల్ ఎక్కి బయలు దేరుతుండగా నెమ్మదిగా వర్షం పడడం ప్రారంభం అయింది. ఆ వర్షానికి ఆ క్షణంలో నేను చిన్నపిల్లాడిలా మారిపోయి చేతులు చాచాను. అది చూసి నా అంతరాత్మ పక్కన నిలబడి నవ్వుతూ నన్ను చూస్తోంది.
అవును కొన్ని క్షణాల్లోనే నాకు ఇంత సంతోషం ఎలా వచ్చింది అంటారు ?