పెరిగిన గెడ్డం , చిందర వందర జుత్తుతో విరాగిలా భాస్కరం వరండాలో విరిగిన వాలుకుర్చీలో పడుకుని ఇంటికప్పు పగిలిన పెంకుల్లోంచి వస్తున్న సూర్యకిరణాల్ని చూస్తూ గతాన్ని నెమరు వేసుకుంటున్నాడు.
* *
నాన్న నా చిన్నతనంలో చనిపోగా అమ్మ ఇళ్లలో వంటపనులు చేస్తూ అక్కడ మిగిలిన వంటపదార్దాల్ని ఇంటికి తెచ్చి నాకూ తమ్ముడికీ
తినిపించేది.వంటల పొగ మూలంగా అమ్మకి ఆయాసం, దగ్గు వస్తున్నా మమ్మల్ని పెంచడం కోసం తన ఆరోగ్యాన్ని లెక్క చేసేది కాదు. వంటపనులు, పాచి పనుల వల్ల చేతులు కమిలి నల్లాగా ఉండేవి.ఇళ్లలో పనులు ముగించుకుని వచ్చేసరికి చీకటయేది. అమ్మ వచ్చే
టప్పుడు తినడానికి తెస్తుందని ఎదురు చూసేవాళ్లం.పెంకుటింట్లోనే కాలక్షేపం చేస్తున్నాము. వానాకాలంలో పగిలిన పెంకుల్లోంచి కారే నీటి చుక్కలు, బీటలువారిన గోడలతో శిధిలావస్థలో ఉంది. ఇంటిని రిపేరు చేయించే ఆర్థిక స్తోమత లేక అందులోనే రోజులు వెళ్ల దీస్తున్నాము. నాకు పెద్దగా చదువుకోవాలని ఉన్నా ఇంటి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పదవ తరగతితో ఆపేయ వలసివచ్చింది.తమ్ముడు
సూర్యాన్నయినా తనలా కాకుండా కాలేజీ చదువులు చదివించి మంచి హోదా ఉద్యోగం చేయించాలి , అమ్మని వంట పనుల నుంచి
విముక్తి కలిగించి విశ్రాంతి ఇవ్వాలి. అమ్మ రాత్రిళ్లు దగ్గుతోంది. మంచి డాక్టరు కి చూపించి వైద్యం చేయించాలి. ఇలా భవిష్యత్ ఆలోచనలు వచ్చాయి.
ఇంటి ఆర్థిక అవసరాల దృస్ట్యా నా చదుకు తగ్గ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ , ఇంట్లో అవసరాలు తీర్చగలుగుతున్నాను.
నేను ఉద్యోగం చేస్తున్నాను కనక వంటపనులు మానేసి విశ్రాంతి తీసుకోమని అమ్మకి చెబితే ' చిన్నోడు పట్నమెల్లి పెద్ద సదువులు సదివి
పెద్ద కొలువు సంపాదించాల, అప్పుడు ఇంటికాడ ఉంటా ' అంది అమ్మ. నేను ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే తమ్ముడు సూర్యం చదువుల కోసంనెల నెలా పోస్టాఫీసు సేవింగు ఎకౌంట్లో డబ్బు జమ చేసేవాడిని. డ్యూటీకి ఆటోలో వెల్తే డబ్బులు ఖర్చవుతాయని నడిచి వెళ్లేవాడిని. ఈ మధ్య అమ్మకి ఆయాసం , దగ్గు ఎక్కువైతే డాక్టరుకి చూపించగా పరిక్షలు జరిపి ఆస్తమా అని మందులు రాసి విశ్రాంతి
తీసుకోవాలన్నారు. ఆ మాటే అమ్మతో అంటే చిన్నోడి సదువు పూర్తయే వరకూ కష్టపడతానని భీష్మించుకు కూర్చుంది.
ఊరి హైస్కూల్లో సూర్య పదవ తరగతి పాసయేడు. కాలేజీ చదువుల కోసం పట్నం పంపి ఎడ్మిషన్ చేసి ఫీజులు, కావల్సిన బుక్స్,
కొత్త డ్రెస్సులు ఏర్పాటు చేసాను. కాలేజీ దూరమవుతోందంటే పాత మోపెడ్ కొనిచ్చాను.
పెళ్లి వయసు దాటుతున్న తనని చూసి అమ్మ రెండు మూడు సార్లు పెళ్ళి ప్రస్తావన తెచ్చినా నా ముందున్న భవిష్యత్ ప్రణాళికల్ని
దృష్టిలో ఉంచుకుని వాయిదా వేస్తూ వచ్చాను. సూర్య డిగ్రీ పూర్తి చేసాడు.కాలేజీ స్నేహితుల ప్రభావం వల్ల వాడి వేష భాషల్లో మార్పు కనబడుతోంది. కాలికి తొడిగే షూ నుంచి హైర్ స్టైల్ , కూలింగ్ గాగుల్సుతో స్టైలిష్ గా కనబడుతున్నాడు.డబ్బు కోసం ఆలోచించక తమ్ముడి
సరదాలన్నీ తీర్చేవాడిని. పాత మోపెడ్ నడపడం చిన్నతనంగా ఉందంటే వాయిదాల పద్దతి లో కొత్త స్కూటర్ కొనిచ్చాను. డిగ్రీ పూర్తయిన తర్వాత యం.బి.ఎ చదివి మంచి మార్కులతో పాసయాడు.చదువు లో వాడి చురుకుదనం చూసి ఆనందమైంది. స్నేహితుల ప్రోద్బలంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్సు ఎగ్జామ్సు రాస్తానంటే కోచింగ్ సెంటర్లో చేర్పించి కావల్సిన మెటీరియల్సు సమకూర్చాను.
సూర్యం చదువులు , వసతుల కోసం డబ్బు బాగా ఖర్చవుతోంది.పోస్టాఫీసు పొదుపు పధకంల్లోంచి తెచ్చిన డబ్బు ఖర్చయిపోయింది.
అమ్మ ఆరోగ్యం క్రమేపి క్షీణిస్తోంది. ఆవిడ మందుల కోసం అదనంగా డబ్బు అవుసరమవుతోంది.ఆర్థిక ఇబ్బందులు పెరిగి పోయాయి. నేను డ్యూటీ చేసే కంపెనీలో ఓవర్ టైమ్ చెయ్య సాగాను.
" పాత సైకిలైనా కొనుక్కోరా ,పెద్దోడా ! " అని అమ్మ చెబితే పెడచెవిన పెట్టేను. సూర్యం పట్టుదలగా చదివి పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్సు పరీక్షల్లో మెరిట్ లిస్టులో పాసయి రెవిన్యూ డెవలప్ మెంటు ఆఫీసర్. ( ఆర్.డి. ఒ ) గా సెలక్టు అయాడు. నా ఆనందానికి అవధులు లేకపోయాయి. నా చిరకాల కోరిక నెరవేరింది. ఇంక మా కష్టాలన్నీ గట్టెక్కాయాను కున్నాను. సూర్యం ఆర్థికంగా ఆదుకుంటాడనీ, అమ్మకి పూర్తి విశ్రాంతి కలిగించి మంచి స్పెషలిస్టు డాక్టరు కి చూపిస్తాడని కలలు కన్నాను.ఇంటికి రిపేర్లు చేయించి పూర్వవైభవం తెస్తాడను కున్నాను.
గాలి మేడలు కట్టుకున్న నా ఆశలన్నీ పునాదుల్లోనే కూలిపోయాయి. సూర్యానికి రెవెన్యూ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా ఈ జిల్లాలోనే
పోస్టింగు జరిగి బంగ్లా, కారు, నౌకర్లు తదితర సదుపాయాలు సమకూరేయి. సూర్యకి గ్రూప్సు కోచింగ్ సెంటర్లో పరిచయమైన సబ్ కలెక్టర్
గారమ్మాయి శ్రీలతతో పరిచయం ప్రేమగా మారింది. వాళ్లిద్దరి పెళ్లి జరగాలంటే శ్రీలత పేరెంట్సు కొన్ని షరతులు పెట్టేరు. సూర్య కుటుంబ నేపద్యం తెలిసి తల్లి వంటపుట్టని , అన్న ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగని సమాజంలో వారి హోదాకు తక్కువ స్థాయిగా భావించి ఆర్థికంగా డబ్బు సాయం చెయ్యి కాని వారిని ఎట్టి పరిస్థితుల్లోను వెంట ఉంచుకోవద్దని సూర్యం మీద వత్తిడి తెచ్చేరు. కలిసి వచ్చిన సిరిలా డబ్బూ, హోదా మత్తులో ఇప్పటి వరకూ తన ఉన్నతికి రాత్రింబవళ్లు చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో చదివించిన నన్నూ , అమ్మని మరిచి పోయాడు. తమ్ముడి హోదా, బంగళా , కారు ఎలా ఉన్నాయోనని వెయ్యి కళ్లతో వెళ్లిన నాకు తీరని అవమానమే జరిగింది.
బంగ్లా గేటు వద్ద సెక్యూరిటీ గార్డు నుంచి బిళ్ల బుట్రత్తు వరకు హేళనగా మాట్లాడేరు. కాన్ఫరెన్సులో ఉన్నారని సూర్యాన్ని కలిసే
అవకాశం ఇవ్వలేదు.తమ ఇంటికి రిపేరు చేయించి అమ్మని, నన్నూ సుఖ పెడతాడనుకున్న ఆశలు అడియాశలయ్యాయి.
* * *
" సార్ , భాస్కరం గారూ !"
ఎవరో గమ్మం ముందు నిలబడి పేరు పెట్టి పిలుస్తూంటే వర్తమానానికి వచ్చాడు భాస్కరం.పాత సంప్రదాయంలో అమ్మని, లేబర్ క్లాస్ వేషంలో ఉండే అన్నయ్య తన బంగ్లా కొస్తే చిన్నతనమని భావించి సూర్యం తన శెక్రెటరీ చేత కేష్ పంపించాడు.
స్వశక్తి , ఆత్మాభిమానంతో పెరిగిన భాస్కరం , తమ్ముడు పంపిన డబ్బు వాపసు పంపిస్తూ " సూర్య గారి ఆదరాభిమానాలకు ధన్యవాదాలు"
తెలుపమన్నాడు. తల్లీ కొడుకు లిద్దరూ చిన్నోడు ఎక్కడున్నా సుఖ సంతోషోలతో ఉండాలని కోరుకున్నారు.