మానవత్వం విరిసింది - కందర్ప మూర్తి

manavatvam virisindi

" రాధా , రెడీయా! తొందరగా బయలు దేరు.అప్పుడే ఆరయింది. ట్రాఫిక్ పెరిగి పోతుంది. ట్రైనుకి గంటే టైముంది. స్టేషను కెళ్లే దార్లో మ్యారేజ్ గిఫ్టు కొనాలంటున్నావు" హాల్లో సోఫాలో కూర్చుంటూ తొందర పెడుతున్నాడు ప్రవీణ్.

" నేను రెడీ, శ్రీ వారూ ! సూట్ కేస్ సర్దేసాను. మీరు కాఫీ తాగి కారు గేటు దగ్గరకు తీసుకురండి." సమాదాన మిచ్చింది చీరకుచ్చెళ్లు సర్దుకుంటూ. కారు ఫ్లాటు గేటు ముందు ఆపి హారన్ కొట్టాడు ప్రవీణ్. ఫ్లాట్ డోర్ కి తాళం పెట్టి చేత్తో సూట్కేసు తీసుకుని కారు ముందు సీట్లో కూర్చుంటే ఆమె చేతిలోని సూట్ కేస్ అందుకుని కారు డిక్కీలో పెట్టాడు.కారు స్టార్టు చేసి " ట్రైను కరెక్టు టైముకి వైజాగ్ చేరితే స్టేషన్నుంచి గంటలో కల్యాణ మండపానికి చేరుకుంటావు. అనుకోకుండా ఆడిట్ వచ్చి పడింది, లేకపోతే నీతోపాటు నేనూ పెళ్లికి వచ్చేవాడిని. మీ అన్నయ్యకు మరొకసారి నా సమస్య చెప్పు. రిసీప్సన్ కి తప్పక చేరుకుటాను.బావ గారితో మొబైల్లో మాట్లాడతానులే. వైజాగ్ చేరిన వెంటనే ఫోన్ చెయ్యి" కారు డ్రైవ్ చేస్తూ భార్యతో మాట్లాడుతున్నాడు.

కారు వీధి మలుపు తిరిగి పబ్లిక్ పార్కు దగ్గర కొచ్చేసరికి రోడ్డుకు అడ్డంగా జనం గుంపులుగా చేరడంతో ముందుకు వెళ్లే అవకాశం లేకపోయింది. కారు డోర్ గ్లాస్ దించి దగ్గరగా ఉన్న వ్యక్తిని పిలిచి ఏమైందని అడిగాడు ప్రవీణ్. " ఎవరో ముసలాయన సార్ , కాలేజీ స్టూడెంటు కొత్త మోటర్ బైక్ కొని రేష్ గా నడిపి రోడ్డు దాటుతున్న ఆయన్ని గుద్దేసి పోయాడట. బండికి రెజిస్ట్రేషన్ నంబరు లేదట. ఏమైందో ఏమో ఆ పెద్దాయన కింద పడి రక్తం గడ్డ కట్టింది." సానుభూతి వ్యక్తం చేసాడా వ్యక్తి.

" ట్రాఫిక్ పోలీసులు వచ్చేవరకు రోడ్డు క్లియర్ కాదు సార్ !" మరొక వ్యక్తి ఉచిత సలహా ఇచ్చాడు.అప్పటికే కారు బయలుదేరి అరగంటయింది. మరొక అరగంటలో స్టేషనుకి చేరకపోతే ట్రైను అందుకోలేము, మైన్ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని షార్ట్ కట్ రోడ్లో కారు నడిపితే పార్కు దగ్గర ఇరుక్కు పోయాం. ఇప్పట్లో రోడ్ క్లియరయేటట్టు లేదు " కంగారు పడుతున్నాడు ప్రవీణ్: రాధ కారు డోరు తెరిచి బయటి కొచ్చింది. ఎదురుగా పార్కు గేటు మలుపు దగ్గర సుమారు డెబ్బై సంవత్సరాల ముసలాయన అపస్మారక స్థితిలో రోడ్డు మద్య పడున్నాడు. ఆయన కట్టుకున్న తెల్లని పంచె, షర్టు రక్తంతో తడిసి ఎర్రగా కనబడుతున్నాయి. దూరంలో చేతికర్ర పడుంది.

కొందరు యువకులు వారి మొబైల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు. ఎవరూ ముసలాయన దగ్గర కెళ్లటం లేదు. తాత చచ్చిపోయాడేమో మనకెందుకులే , ట్రాఫిక్ పోలీసులే చూసుకుంటారని కొందరు, కోర్టులు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్ సొస్తుందని మరికొందరు దూరంగా ఉన్నారు. ఇలా ఎవరి మటుకు వారు సానుభూతి కనబరుస్తున్నారే కాని పెద్దాయన వివరాలేంటి , కనీసం అంబులెన్సుకి ఫోను చేద్దామన్న ఇంగిత జ్ఞానం లేకపోయింది. రాధ గబగబా ముసలాయన దగ్గర కెళ్లింది. అపస్మారక స్థితిలో పడున్న ఆయన్ని వంగి దీక్షగా చూస్తే మెల్లగా శ్వాస ఆడుతోంది. వెంటనే కారు తీసుకు రమ్మని చేత్తో ప్రవీణ్ కి సంజ్ఞ చేసింది. ప్రవీణ్ కారు స్టార్టు చేసి పెద్దాయన పడున్న చోటుకి తీసుకు వచ్చాడు.

" సాయం చెయ్యండి , తాతగారు బతికే ఉన్నారు. దగ్గరున్న సుమతీ హాస్పిటల్ కీ తీసుకెల్దాం , అర్జంటు " అంది ఆతృతగా. " రాధా, ఇవన్నీ నెత్తి మీద పెట్టుకుంటే ట్రైను అందుకో లేము. మరొక ట్రైను అందుబాట్లో లేదు. బస్సు ప్రయాణం నీకు పడదు. అంబులెన్సుకి పోన్ చేసి మనం బయలుదేరుదాం!" నచ్చ చెబుతున్నాడు ప్రవీణ్.

" ప్రాణాపాయంలో ఉన్నారు తాతగారు. బ్లడ్ కూడా బాగా పోయినట్టుంది. ఇలాగే వదిలేస్తే ప్రాణం పోతుంది. ముందు ఈయన్ని హాస్పిటల్ కి చేర్చాలి " మానవత్వం చూపింది. ప్రవీణ్ కి ఏమి చెయ్యడానికి తోచడం లేదు. ఈ తతంగం పెట్టుకుంటే ట్రైను టైముకి స్టేషనుకి చేరడం కష్టమని ఆందోళన పడుతున్నాడు.

" ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలస్యం చెయ్యకుండా తాతగార్ని కార్లోకి చేర్చండి.తర్వాత ట్రైను గురించి ఆలోచిద్దాం! క్విక్ '" అంటోంది ఆందోళన గా. ఇంతట్లో ఇద్దరు వ్యక్తులు తాతగార్ని పట్టుకుని తీసుకు రాగా ప్రవీణ్ కారు వెనక డోరు తెరిస్తే సీటు మీద పడుకో బెట్టారు. రాధ తాత గారి పక్కన కూర్చోగానే ప్రవీణ్ కారు స్టార్టు చేసి దగ్గరున్న సుమతీ ప్రైవేట్ హాస్పిటల్ కి చేర్చాడు. రాధ వెంటనే డోర్ తెరిచి పరుగున రిసీప్స న్లో పరిస్థితి వివరించగా యాక్సిడెంట్ కేసని ఎమర్జెంసీ డిపార్టుమెంటుకి చేర్చారు నర్సింగ్ స్టాఫ్. ట్రాఫిక్ పోలీసు విభాగానికి ఫోన్ చేసి కేసు వివరాలు తెలియ చేసారు.అప్పటికే టైము రాత్రి ఏడు దాటింది. రాధ వెళ్లాల్సిన ట్రైను స్టేషను కొచ్చి వెళి పోయింది. రాధకి ఇవేవీ ధ్యాస లేవు. ముందు తాతగారి ప్రాణాలు కాపాడటం ముఖ్యం. తాతగారి దగ్గర ఏ విధమైన వివరాలు లబ్యం కాలేదు. పేరేంటి , ఎక్కడుంటారు, బంధువు లెవరనేది విషయాలేవీ తెలియలేదు. ఇంతలో రిసీప్సనిస్టు ఎడ్వాన్సుగా పది వేలు డిపాజిట్ కట్టాలని మిగతాది తర్వాత జమ చెయ్యమంది.రాధ మరేమీ ఆలోచించ లేదు. ప్రవీణ్ దగ్గరున్న బ్యాంకు డెబిట్ కార్డు తీసుకుని రిసీప్సన్ కౌంటర్లో డబ్బు జమ చేసింది రెండు గంటల అనంతరం ఎమర్జెంసీ వార్డులో తాతకి స్కానింగ్ మిగతా అత్యవసర పరీక్షలు జరిపిన తర్వాత ఆయన తుంటి ఎముక విరిగిందనీ, బ్లడ్ కూడా చాలా పోయిందని బ్లడ్ ఎక్కించి వెంటనే ఆపరేషను చెయ్యాలన్నారు డాక్టర్లు.రీప్లేస్ మెంటుగా ఎవరైన బ్లడ్ బ్యాంకులో బ్లడ్ డొనేట్ చెయ్యాలన్నారు ప్రవీణ్ ది రేర్ బ్లడ్ గ్రూప్ ' ఎ 'నెగెటివ్ , ఈ మద్యనే వాళ్ల కొలీగ్ ఫాదర్ బైపాస్ హార్టు సర్జరీకి బ్లడ్ ఇచ్చాడు. మూడు నెలల వరకు డొనేట్ చెయ్యకూడదు.

రాధది ' ఓ ' పాజిటివ్ గ్రూప్ అయినందున తను బ్లడ్ ఇవ్వడానికి సిద్ధపడింది. ప్రవీణ్ ఆ మాట విని ఇబ్బంది పడుతున్నాడు. కాళీ కడుపుతో బ్లడ్ డొనేట్ చెయ్యకూడదు. రాధ ఒత్తిడి చెయ్యగా హాస్పిటల్ క్యాంటీను నుంచి ఇడ్లీ కూల్ డ్రింకులు తెచ్చాడు. రాధకి ప్రవీణ్ తో పెళ్లి కాకముందు ప్రైవేట్ హాస్పిటల్లో మెడికల్ ల్యాబ్ ఇన్వస్టిగేటర్ గా జాబ్ చేసేది. అందువల్ల బ్లడ్ విలువ ఏంటో తనకి తెలుసు. ప్రవీణ్ యం.ఫార్మా చేసి పేరున్న విదేశీ ఫార్మా కంపెనీ రిసెర్చ్ డిపార్టుమెంట్ లో సీనియర్ ఎనలిస్టుగా జాబ్ చేస్తున్నాడు.

***

ముసలాయన పే‌రు వెంకట్రామయ్య గారు హైస్కూలు హెడ్ మాస్టర్ గా రిటైరై స్వంత ఊళ్లో వ్యవసాయం చూసుకుంటున్నారు. కొడుకు సాగర్ సాఫ్టువేర్ ఇంజినీర్ గా జాబ్ చేస్తున్నందున కొద్ది రోజులు కొడుకు కుటుంబం తో గడపడానికి పట్నం వచ్చారు. రోజూ సాయంకాలం వాకింగు కోసం పార్కుకి వస్తూంటారు.ఏడు గంటల లోపు వాకింగ్ పూర్తి చేసి అపార్టుమెంటుకు చేరుకుంటారు. పార్కు దగ్గరగా ఉన్నందున ఒంటరిగానే వచ్చి నడక అవగానే కొంతమంది పరిచయ మిత్రులతో ముచ్చట్లు పెట్టి తిరిగి వస్తారు.

ఎప్పుడూ ఏడు గంటల వరకు ఫ్లాట్ కి తిరిగి వచ్చే తండ్రి రాత్రి ఎనిమిదైనా రాక పోయే సరికి కొడుకు సాగర్ కంగారు పడుతు పార్కులో ఆయనతో వాకింగ్ చేసే కొంత మందిని ఫోన్లో సంప్రదిస్తే వాకింగ్ పూర్తి చేసి తిరిగి వెళి పోయారని చెప్పారు. సాగర్ కి కంగారు ఎక్కువైంది. నాన్న దగ్గరున్న మొబైల్ ఫోన్ ఏమైంది. ఎక్కడి కెళ్లారు , ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. గాబరా పడుతు తండ్రిని వెతుక్కుంటూ పార్కు దగ్గర కొస్తే గేటు మూసి ఉంది. సాగర్ పార్కు వద్ద ఉన్ళ వాచ్ మేన్ని అడిగితే ఒక ముసలాయన్ని మోటర్ బైకు గుద్దిందని గుర్తులు చెప్పి ఎవరో కార్లో దగ్గరున్న సుమతీ హాస్పిటల్ కి తీసుకెళ్లారని చెప్పాడు.వెంటనే సాగర్ కార్లో సుమతీ హాస్పిటల్ కొచ్చాడు. రిసీప్సన్లో ఎంక్వయరీ చేస్తే తన తండ్రి గుర్తులు చెప్పారు.

ఆయన తన తండ్రేనని తెలిసి ఆందోళన పడుతు ఎవ‌రు హాస్పిటల్ కి తీసుకు వచ్చారని ఎంక్వయరీ చేస్తే రాధ , ప్రవీణ్ హాల్లో కనిపించారు. అప్పటికే రాత్రి పదకొండయింది. రాధ బ్లడ్డొనేట్ చేసి విశ్రాంతి తీసుకుంటోంది. సొగర్ సంతోషంతో ప్రవీణ్ ద్వారా యాక్సిడెంటు విషయం తెలిసి , మానవత్వంతో రాధ ట్రైను ప్రయాణం కేన్సిల్ చేసుకుని తన తండ్రిని హాస్పిటల్లో చేర్పించి చార్జీలు చెల్లించారనీ మనసారా అభినందించాడు. యాక్సిడెంటు జరిగినప్పుడు తండ్రి దగ్గరున్న మొబైల్ ఫోను ఎవరో కొట్టేసారని అర్థమైంది.ఆయన్ని హాస్పిటల్లో చేర్చి ప్రాణాపాయం నుంచి కాపాడటమే కాకుండా బ్లడ్ డొనేషన్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాడు.

సాగర్ కటుంబం ప్రవీణ్ ఫ్లాట్ కి కిలోమీటర్ దూరంలో వేరే ఫ్లాట్లో ఉంటున్నారు. ఇంతలో మీడియా వారికి ఎలా తెల్సిందో ఒక్క సారిగా రాధ, ప్రవీణ్ చుట్టూ చేరి కెమేరాలు న్యూస్ కవరేజితో అలిసి హాస్పిటల్ నుంచి ఫ్లాటు కొచ్చేసరికి అర్థరాత్రి పన్నెండు దాటింది వారికి. రాధ తన ట్రైన్ జర్నీ కేన్సిల్ అయిందని కనక పెళ్లి ముహూర్తానికి రాలేక పోతున్నానని రిసీప్సన్కి తప్పకుండా ఇద్దరం కలిసి వస్తామని జరిగిన సంఘటన వివరంగా అన్నయ్యకి మొబైల్ ఫోన్లో చెప్పింది. కల్యాణ మండపంలో ఈ విషయం తెలిసి అందరూ ఫోన్లలో రాధ -- ప్రవీణ్ ని అభినందనలతో ముంచెత్తారు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న