బారెడు పొద్దెక్కింది. శీతాకాలపు ఎండైనా ఇంకా చురుక్కుమంటూనే ఉంది. ఆ గోదారొడ్డున ఉన్న కొబ్బరి చెట్ల ఆకులు గాలికి ఊగుతున్నాయి. పరవళ్ళు తొక్కుతూ ముందుకు వెళుతోంది గోదావరి తల్లి.శివాలయం పక్క నుంచి గోదావరి గట్టు మీదకు నడచుకుంటూ వస్తున్న పదిహేనేళ్ళ కుర్రాడు టక్కున ఆగిపోయాడు. కళ్ళు మూసుకున్నాడు.
" ఏమైందిరా?! కృష్ణా" అన్నాడు ఆ కుర్రాడి వెనకే వస్తున్న ఒక డెబ్భైయ్యేళ్ళ పైబడిన ఒక పెద్దాయన.
" అదిగో చూడు తాతయ్యా!" అన్నాడు కళ్ళు తెరవకుండానే. వారికెదురుగా ఒక పాడె. దానిమీద ఎవరిదో పార్థీవ శరీరం. పూల మాలలతో అలాంకరించేరు. ఆ శవయాత్ర ముందు భారీగా జనసందోహం. కుండతో ముందు నడుస్తున్న ఒక యువకుడు.
" ఎవరో చనిపోయారు. శ్మశానానికి వెళుతున్నారు. ఆ మాత్రం దానికి భయమెందుకు?" అన్నాడు ఆయన నవ్వుతూ.
" అమ్మో" అన్నాడు మనవడు ఇంకా కళ్ళు తెరవకుండానే.
" ఒరేయ్...నువ్వు కొన్నిరోజుల్లో మెడిసిన్ లో చేరుతున్నావు. శవాలను పరపరా కోసి పారేస్తావ్, అంత భయమయితే ఎలా?!" అన్నాడు. ఆ మాటకు సమాధానం చెప్పకుండా కళ్ళుమూసుకునే ముందుకు నడిచాడు మనవడు కృష్ణ. మనవడి చర్యకు నవ్వుకుంటున్న ఆయనకు తన కూతురు వసుంధర చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. " నాన్నా వీడొట్టి పిరికి సన్నాసి. బాత్ రూం కు రాత్రుళ్ళు తోడు రావాలి. రాత్రయితే మాకు నిద్రుండదు. - రేప్పొద్దున్న మెడికల్ కాలేజీలో చేరి హాస్టల్ కు వెళ్ళి ఎలా ఉంటాడో, అందుకే వాడిని నీ దగ్గరకు పంపుతున్నాను. కాస్త భయం పోగొట్టి వాడిలో ధైర్యం పెంచు" అంది.
అందుకే వాడిని రాజమండ్రి పంపింది అనుకున్నాడు. ఆయన పేరు కృష్ణయ్య. శవం వారిని దాటుకుని ముందుకు కదిలిన తర్వాత మనవడు కళ్ళు తెరిచాడు.
"ఒరేయ్, శవం అంటే అంత భయపడుతున్నావ్?! మరి శవాల మధ్య ఉండాల్సి వస్తే?" అన్నాడు.
" బాబోయ్, శవాల మధ్యనా?" గుండె ఆగిపోదూ?" అన్నాడు కృష్ణ తాతయ్య వంక భయంగా చూసి.
" అలా శవాల మధ్య పడుకుని ఇరవై నాలుగ్గంటలు గడిపిన ఒక వ్యక్తి గురించి నాకు తెలుసు" అన్నాడు ఆయన మనవడి వంక నవ్వుతూ చూసి.
" మైగాడ్..." ఎవరాయన?" అన్నాడు మనవడు.
" అనగనగా ఒకడుండేవాడు" అన్నాడు అతడి తాతయ్య.
" చెప్పు ...చెప్పు...! చాలా ఉత్కంఠగా ఉంది" అన్నాడు మనవడు కృష్ణ. ఆ తాతా మనవళ్ళిద్దరూ ఆ గోదారొడ్డున ఇసుకలో కూర్చున్నారు. గోదావరి గట్టు మీద నుంచి ఏదో గుర్రపు బండీ వెళుతోంది. ఆ పక్క నుంచే బూర ఊదుతూ డబ్బులు అడుక్కుంటున్న ఒక యాచకుడు. గోదావరి నీళ్ళ మీద. ఆ ఉదయపు ఎండ పడి నీళ్ళు తళ తళ మెరుస్తున్నాయి.
తాతయ్య చెప్పడం మొదలు పెట్టాడు. మనవడు చెవులు రిక్కించి వింటున్నాడు. మధ్య మధ్యలో భయం వేసి తాతయ్యకు దగ్గరగా జరుగుతున్నాడు. ఒక గంట వరకూ తాతయ్య ఆ కథ చెబుతూనే ఉన్నాడు. ఇంతలో ఆకశంలో మబ్బులు... వాతావరణం చల్లబడింది.
కథ పూర్తయ్యే సరికి, ఆ చలిలోనూ మనవడికి కొద్దిగా చిరుచెమటలు పట్టాయి. రోమాలు నిక్కబొడుచుకున్నాయి.కొద్దిగా భయమూ కలిగింది.
" ఇంతకీ ఈ కథలో హీరో ఎవరు?!" అన్నాడు మనవడు తాతయ్య వంక ప్రశ్నార్థకంగా చూస్తూ.
" ఇంకెవరురా?!" అంటూ ఆ తాతయ్య వంపు తిరిగిన మీసం మెలేసాడు. గర్వంగా మనవడి వంక చూస్తూ.
" యూ ఆర్ గ్రేట్..." అంటూ మనవడు తాతయ్యను గట్టిగా హత్తుకున్నాడు..
" ఒరేయ్ నువ్వూ నువ్వూ ఈ తాతయ్యలా " అనగనగా ఒకడుండేవాడు" అని జనం చెప్పుకునే స్థాయికి ఎదగాలి" అన్నాడు.
" అలాగే తాతయ్యా " అన్నాడు కృష్ణ.
ఆ తాతా మనవళ్ళిద్దరూ లేచి గోదావరి దాటి ఇంటి వైపు నడక మొదలెట్టారు.
**********
అదొక మెడికల్ కాలేజీ. వేసవి శెలవుల తర్వాత విద్యార్థులు తిరిగి కాలేజీకి వచ్చే మొదటి రోజు. కొత్తగా చేరిన విద్యార్థుల కోసం " వెల్ కం టు ఫ్రెషర్స్" అనే ఫ్లెక్సీలు వేలాడుతున్నాయి.
కృష్ణ తన బేగ్ భుజాన వేసుకుని భయం భయంగా కేంపస్ లోకి అడుగు పెట్టాడు. రేగింగ్ గురించి అంతకు ముందు విని ఉండడంతో గుండె దడ దడగా ఉంది. అప్పటికే పది దాటింది. మొదటి రోజు అనాటమీ క్లాసు. వేగంగా నడుస్తూ అనాటమీ డిపార్టుమెంట్ లో ఉన్న క్లాసు రూము వైపు నడిచాడు. అప్పటికే తన సహచరులంతా క్లాస్ రూముకి చేరుకున్నారు. ప్రొఫెసరు గారు క్లాస్ మొదలు పెట్టేసారు. " ఎక్స్ క్యూజ్ మీ సార్" అంటూ లోపలకు నడిచాడు. క్లాస్ రూములో కూర్చోగానే అంత వరకూ ఉన్న భయం పోయింది. పాఠంలో లీనమయ్యాడు.
సాయంత్రం ఐదు దాటిన తర్వాత హాస్టలుకు తిరిగి వస్తున్నాడు కృష్ణ. తన క్లాస్ మేట్స్ తో కలిసి. దారిలో సీనియర్లు ఎదురయ్యారు.
" ఒరేయ్ ఆగండ్రా!" అన్నారు.
సహచరులతో పాటూ కృష్ణ ఆగి పోయాడు.
" రేగింగ్ కాదు...భయపడకండి...ఒక విషయం చెపుతున్నాను..మీ మంచికే..." అన్నాడొక సీనియర్. అంతా ప్రశ్నార్థకంగా చూసారు...అతను చెప్పడం మొదలు పెట్టాడు.
" మెడిసిన్ మొదటి సంవత్సరంలో ఎనాటమీ ఉంటుంది. శవాలను, డిసెక్షన్ చేయవలసి ఉంటుంది. చాలా మంది భయపడ్తారు. కొంత మందికి వాంతులవుతాయి. ఒకళ్ళిద్దరు తట్టుకో లేక మెడిసిన్ వదిలి పెట్టి వెళ్ళి పోయిన వాళ్ళున్నారు. అందుకే మీకు ధైర్యం నూరి పోసేందుకు ఒక పోటీ పెడుతున్నాము. " అన్నాడొక సీనియర్. " చెప్పండి" అన్నారు జూనియర్లు అంతా ముక్త కంఠంతో. కృష్ణ మాత్రం మౌనంగా ఉండి పోయాడు.
" మీ డిసెక్షన్ కోసం అనాటమీలో శవాలుంటాయి. రాత్రి పన్నెండు తర్వాత ఆ శవాల దగ్గరికెళ్ళాలి. ఒక శవం దగ్గర ఒక కవరు ఉంటుంది. దాన్ని ఎవరు ముందు తీసుకుని వస్తారో వారికి ఫ్రెషర్స్ డే రోజున, మన ప్రిన్సిపాల్ గారి చేతుల మీదుగా " మిస్టర్ సాహసం " అనే బిరుదు ఇప్పిస్తాం. దాంతో బాటు ఒక మంచి బహుమతి" అన్నాడొక సీనియర్ వివరంగా.
ఆ మాటలకు నలుగురు జూనియర్లు ముందుకొచ్చారు. వారిలో కృష్ణ లేడు. " ఎందుకొచ్చిన తంటాలు దేవుడా' అనుకుంటూ మాట్లాడకుండా ఉండి పోయాడు.
అంతా హాస్టలు వైపు కదిలారు. హాస్టలుకు చేరుకున్నా కృష్ణ మనసు మనసులో లేదు. ' ఏదో గిల్టీ' తనెందుకు ఇంత పిరికిగా అయిపోతున్నాడు? ఆర్జు తాతయ్య ఏం చెప్పాడు? ?" ధైర్యంగా ఉండాలి అన్నాడు. మరి తనేం చేస్తున్నాడు? ప్రాణం లేని శవాలకు భయపడుతున్నాడు.
రాత్రవుతున్నా కృష్ణలో అవే ఆలోచనలు. ఆఖరికి రాత్రి పన్నెండు అయ్యే సరికి ఒక నిర్ణయానికొచ్చేసాడు. తను ధైర్యంగా ఉండాలి. తాతయ్య మాట నిలబెట్టాలి. అనుకున్నాడు. అంతే...
రూముకు తాళం వేసి బయలు దేరాడు. హాస్టలు బయట అంతా చీకటి. పచ్చగా వెలుగుతున్న మెయిన్ గేటు మీది నియాన్ లైటు, ఆ చీకటిని పారద్రోల లేక పోతోంది. అనాటమీ డిపార్టుమెంటుకు వెళ్ళే రోడ్డు పక్కనున్న అశోక వృక్షాలు ఆ చీకట్లో గాలికి ఊగుతున్నాయి. వాటిని చూస్తూ ముందుకు నడుస్తున్న కృష్ణకు వణుకు మొదలయ్యింది. ఇంతలో ఎక్కడి నుంచో కుక్క ' భొయ్ ' మంటూ మొరిగింది. వెంటనే వెనక్కి పరుగెత్తాడు. క్షణంలో తాతయ్య గుర్తుకొచ్చి, మళ్ళీ ముందుకు కదిలాడు. రెండడుగులు వేసే సరికి మార్చురీ. చాలా దుర్గంధం..ముక్కు మూసుకుంటూ ముందుకి నడిచాడు. కొంచెం దూరంలో ఎవరో నవ్వుతున్నారు. తెరలు తెరలుగా...ఆ నవ్వు ఆగడం లేదు. ' బాబోయ్ దెయ్యమా?' అనుకున్నాడు. అప్పుడు అర్థమయ్యింది. దూరంగా సైకియాట్రీ డిపార్ట్ మెంట్ లోంచి వస్తోంది ఆ పిచ్చివాడి నవ్వు. ఇక లాభం లేదని కళ్ళు మూస్తూ, తెరుస్తూ అనాటమీ డిపార్టుమెంట్ వైపు వేగంగా నడిచాడు. అప్పటికే అక్కడ తన సీనియర్లు చాలా మంది నిలబడ్డారు. తన క్లాస్ మేట్స్ ఎవరూ కనబడలేదు. సాయంత్రం నలుగురు వస్తామన్నారు.. మొత్తానికి బెదిరి పోయారు. అనుకున్నాడు.
' తనూ పారిపోతే?... ఎందుకొచ్చిన గొడవ? ' అనుకుంటూ పరిగెత్తబోయేంతలో ఒక సీనియర్ తన చేయి పట్టుకున్నాడు.
" ఏం భాయ్...ఇంత వరకూ వచ్చి పారిపోతే ఎలా?! మేమంతా లేమా? పద!" అన్నాడు. మిగతా వాళ్ళంతా చప్పట్లు కొట్టారు " భేష్ " అని. ఇక తప్పదని కృష్ణ పరిగెత్తి డిపార్టుమెంటు ముఖ ద్వారం వైపు చేరుకున్నాడు. తలుపులు తెరిచే ఉన్నాయి. మెల్లగా లోపలికి నడిచాడు. అంతా చీకటి. లైటు వేద్దామని స్విచ్చు బోర్డు వైపు నడిచాడు. స్విచ్ వేసినా వెలగ లేదు. అవును... ఎక్కడో మెయిన్ ఆఫ్ చేసి ఉంటారు. అనుకున్నాడు. ముందు గదిలో ఎముకలు, స్పెసిమెన్సు ఉంచుతారు. అక్కడే కొన్ని అస్థిపంజరాలు ఆ చీకటో మెరుస్తున్నాయి తెల్లగా. ఒక్కసారి వళ్ళు జలదరించింది. తడుముకుంటూ ముందుకు కదిలాడు. తరువాతి గదిలో మృత శిశువు ఉన్న గాజు పెట్టె.. క్షణం సేపు వాటిని చూసే సరికి గుండె వేగంగా కొట్టుకుంది. ఆ గది దాటి ముందుకు వెళ్ళే సరికి శవాలను ఉంచిన లేబ్. గుండె వేగం మరింత పెరిగింది. ఆంజనేయ దండకం చదువుకుంటూ ముందుకు నడిచాడు. లోపల ముక్కు పుటాలను బద్దలు చేస్తున్న ఫార్మాలిన్ ద్రావణం వాసన. శవాలు చెడి పోకుండా ఆ ద్రావణంలో ఉంచుతారు. ఆ గదిలో బల్లల మీద పడుకో బెట్టిన శవాలు. ఆ బల్లలను దాటుకుంటూ సీనియర్లు ఉంచిన కవరు కోసం ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ముందుకు కదులుతున్నాడు. ఒకటో నెంబరు బల్ల దాటేడు. వరుసగా శవాలుంచిన బల్ల దగ్గర శవం పొట్ట మీద తెల్లగా ఉంచిన కవరు కనిపించింది. దాన్ని చేతిలో తీసుకుని మెల్లగా వెనక్కు తిరిగేడు. అంతే! ఎవరో తనని గట్టిగా పట్టుకున్నట్టనిపించింది. గుండె ఆగినంత పనయ్యింది. బలంగా ఆ పట్టు నుంచి విడిపించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. - అబ్బే, ఉడుం పట్టులా ఉంది. అంత చలిలోనూ ముచ్చెమటలు పట్టాయి కృష్ణకు. - బాబోయ్ రక్షించండి దెయ్యం..." అంటూ అరిచి సమస్త శక్తుల్ని కూడదీసుకుని బలంగా ఆ పట్టు నుంచి విడిపించుకుని వేగంగా ముందుకు కదిలాడు. గదులన్నీ ఆయాస పడుతూ దాటుకుని ముఖ ద్వారానికి చేరే సరికి పూర్తిగా అలసి పోయి క్రింద కూలబడ్డాడు. రెండు నిముషాలు అలసట తీర్చుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ సీనియర్లు దూరంగా నిలుచున్న వైపుగా నడిచాడు.
అంత చలి ఉన్నా ధారాపాతంగా శరీరం నుంచి చెమటలు కారుతున్న కృష్ణను చూసి , " ఏంటీ, లోపల స్నానం కానిచ్చావా?" అన్నారు.
" బాబోయ్, లోపల శవం కదిలింది? " అన్నాడు భయం భయంగా.
" శవం కాదురా...నేను...మొత్తానికి బలశాలివే" అన్నాడు అతని వెనుకే పరిగెత్తుకుంటూ వచ్చిన అతని సీనియర్. అతని వంటి మీద చొక్కా లేదు. నల్లగా ఉన్నాడు.
'ఏంటండీ...గుండె ఆగినంత పనయ్యింది" అన్నాడు కృష్ణ ఆ సీనియర్ వంక కోపంగా చూసి.
" కోప్పడకు. ఆ కవరులో ఏముందో చూడు.." అన్నాడు.
" మిస్టర్ సాహసం కు అభినందనలు" అని అక్షరాలు రాసిన ఒక గ్రీటింగ్ కార్డు.
" రేపు జరగబోయే ఫ్రెషర్స్ డే పార్టీలో నీకు మన ప్రిన్సిపాల్ గారి చేతుల మీదుగా సన్మానం ఇంకా మంచి బహుమతి" అన్నాడా సీనియర్.
" ఒరేయ్...ఇంత సాహసానికి ఎలా ఒడిగట్టావ్? భయం వేయలేదా?" అన్నాడు సీనియర్. కృష్ణకు వెంటనే తాతయ్య గుర్తుకు వచ్చాడు. వెంటనే సీనియర్లకు చెప్పాడు.
" అనగనగా ఒకడుండేవాడు అని చెప్పాలి!'
" ఎవరికి?" అన్నారు సీనియర్లు." నా మనవడికి " అన్నాడు. తన లేత మీసం మీద చెయ్యేసి.
" బావుంది..అనగనగా ఒకడుండేవాడు" అంతా బృందావనంలా పాడేరు. మళ్ళీ కృష్ణ వాళ్ళ వంక చూసి చెప్పాడు. " ఈ ధైర్యం నాకు మా తాతయ్య కృష్ణయ్య ఇచ్చింది. ఆయన యుద్ధంలో పని చేశారు. ఒకసారి శవాల మధ్య గడిపారు. దాదాపు ఇరవై నాలుగ్గంటలు పైగా - ఆ విషయం చెప్పగానే, కనీసం ఆయన సాహసంతో కొంతైనా గ్రహించాలనుకొన్నాను." అన్నాడు కృష్ణ గర్వంగా.
" ఏమిటా కథ...చెప్పు చెప్పు...ఒరేయ్ ఆ ఫ్లాస్కులోంచి ఓ వేడి కాఫీ ఇవ్వు. మన సాహసవంతుడు కృష్ణకి" ఒక సీనియర్ అరిచాడు. ఇంకో విద్యార్థి తన దగ్గరున్న ఫాస్క్ లోంచి ఒక కప్పులోకి వొంపి కృష్ణకిచ్చాడు. కృష్ణ కప్పు చేతిలోకి తీసుకుని మెల్లగా చప్పరించాడు. వేడి వేడి కాఫీ లోపలికి పోవడంతో అంత వరకు పడిన శ్రమ భయం మరచి పోయాడు. అప్పటికి సమయం రెండు గంటలు దాటిందేమో.! ఆకాశంలో పలచగా మబ్బులు. మిణుకు మిణుకుమంటూ అక్కడక్కడా నక్షత్రాలు. ఆ ఆవరణ అంతా చీకటిగానే ఉంది. దూరంగా అంబులెన్స్ వేన్ ఆగిన శబ్దం. మెంటల్ వార్డులో తన నవ్వు కొనసాగిస్తున్న ఒక మానసిక రోగి - మార్చురీ పక్కనున్న వెయిటింగ్ రూములో ఎవరో ఏడుస్తున్న ఏడుపు. ఇవేమీ కృష్ణకు ఇపుడు భయం కలిగించడం లేదు. గబ గబా కాఫీ త్రాగడం పూర్తి చేసి చెప్పడం మొదలు పెట్టాడు." ఇది మా తాతయ్య నాకు చెప్పిన నమ్మలేని నిజం..." ఆయన మాటల్లోనే వినండి " అన్నాడు.
***
కళు తెరవలేక పోతున్నాను. రెప్పల మీద ఏదో బరువు. ఎక్కడున్నాను? పొట్ట మీద భారంగా ఏదో పడింది. చేతులు చాపబోయాను. ఎవరిదో తల తగిలింది. శరీరాన్ని కదిలించుదామనుకొన్నాను. అసలు తిరగడమే కష్ట సాధ్యంగా ఉంది. మెల్లగా నన్ను అంటి పెట్టుకుని పడుకున్నారు , యునిఫారాలలో నా సహచరులు. మేం ఎక్కడికి వెళుతున్నట్టు?" తలంతా దిమ్ముగా ఉంది. అసలేమయ్యింది? అంతా మౌనంగా ఉన్నారే..
" ఏమిటీ? ఎక్కడకు వెళుతున్నాం?" పక్కనున్న నా సహచరుడిని అడిగాను. సమాధానం లేదు.. మళ్ళీ అరిచాను. కాస్తంత స్వరం పెంచి. బాగా చలిగా ఉంది. మంచు పడుతోంది. మేమున్న ఈ వేన్ చాలా నెమ్మదిగా వెళుతోంది. అందరూ అడ్డదిడ్డంగా పడుకొన్నారు. ఒకడు నా గుండె మీద కాలు వేసాడు. " భయ్య ఈ వేన్ లో చాలా చోటుంది. కాస్త పక్కకు జరుగు" అన్నాను. అబ్బే! ఆవ్యక్తి జరుగ లేదు. పక్కకు నేనే తోసా మెల్లగా.. అయినా ఏమీ చలనం లేదు.
" అసలు ఏమయ్యింది వీడికి?!" తాగాడా? అయోమయంగా ఉంది. అసలు ఏం జరుగుతోంది? ఒక్కసారి ఆలోచనలో పడ్డాను. గడిచిన విషయాల మీద దృష్టి సారించాను. నిన్న రాత్రి మా మిలిటరీ పోస్టు ఈ సియాచిన్ సరిహద్దు ప్రాంతం దగ్గర అక్కడ బంకర్లు ఖాళీగా ఉన్నాయి. మేమంతా పెరేడ్ కు వెళ్ళా. హైకమాండ్ రావడంతో. అది పూర్తయి బంకర్లు చేరేసరికి, వాటిని శత్రు సైన్యం ఆక్రమించి తుపాకుల వర్షం కురిపించేరు. నేను, సహచరులం శక్తికొలదీ అడ్డు నిలిచాం. వాళ్ళు పారిపోయారు. కొంత దూరం వెంబడించాము ఆ వేన్ లో అంతలో ఊహించని విధంగా దొంగదెబ్బ వెనక నుంచి వచ్చేసారు. ఇరవై మంది నేలకు ఒరిగారు. నేనూ బోర్లా పడుకున్నాను. ఏదో రసాయనిక వాయువు వదిలారు. నాకు స్పృహ తప్పింది. ఇపుడు ఈ వేన్ లో... అదీ విషయం. . మై గాడ్...వీళ్ళంతా చనిపోయారా?!" నాకు దు:ఖం ముంచుకొస్తోంది. నేనొక్కడినే.. . సజీవంగా ఈ నిర్జీవ శరీరాల మధ్య. ఇంతలో ఏదో చప్పుడు. వేన్ ఆగింది.
ఎవడో పైకి ఎక్కుతున్నాడు. వాడితో బాటు ఇంకొకడు. బాటరీ లైటు వేసాడు. కళ్ళకు ఆ వెలుగు కిరణాలు తగిలి వెంటనే కళ్ళు మూసేసాను. వాళ్ళిద్దరూ ఒక్కొక్కళ్ళ దగ్గరకే వస్తున్నారు. పరీక్షగా చూస్తున్నారు. కళ్ళు బలంగా మూసాను. ఎవరు చనిపోయారో, ఎంత మంది బతికున్నారో వీళ్ళు తనిఖీకి వచ్చారనుకుంటాను. వెంటనే నేను నేర్చుకున్న యోగా గుర్తుకొచింది. శవాసనం వెయ్యాలి. రేచకం, పూరకం, కుంభకం, గాలి వదలాలి. గాలి నింపాలి. పట్టి ఉంచాలి. అలా ఊపిరి బిగ పట్టాను. వాడు ముఖంలోకి చూస్తున్నాడు. రెప్పని బరువుగా మూసాను. ఏదో ఒక క్షణంలో దొరికి పోతానేమోననే భయం! ఇంతలో వాడు బూటు కాలితో తన్నాడు. మడమల దగ్గర విపరీతమైన నొప్పి. నరాలు తెగిన ఫీలింగ్. బలవంతంగా బాధను అణచుకున్నాను.
వాడు గట్టిగా అరిచాడు..." సబ్ మర్ గయ్" అమ్మయ్య..నన్నూ చనిపోయిన లిస్టులో చేర్చాడు...ఇక ఫరవాలేదు. నేనూ శవాన్నే...ఈ శవాల మధ్య...గాఢంగా ఊపిరి పీల్చి కళ్ళు మూసుకున్నాను.
ఆ ఇద్దరూ సిగరెట్లు వెలిగించారు. ఏవో మాటలు వినబడుతున్నాయి. చెవులు రిక్కించి ఆ మాటలు విని శవాలను వారి మిలిటరీ పోస్టుకు తీసుకెళ్ళి వారు చేసేదేమిటి? 'డిస్ ఫిగరేషన్.. అంటే నామరూపాలు లేకుండా మారుస్తారు. కనుగుడ్లు పీకి, తలలు కోసి, చేతులు నరికి...మైగాడ్...చని పోయిన శరీరాలను పార్ధీవ దేహం అంటారు. వాటికి వారి మతాచారం ప్రకారం అంతిమ సంస్కారం జరపాలి. కానీ, వీరు చేయబోయేదేమిటి? నాలో ఏదో బాధ....మనసులో దు:ఖం....నా సహచర సైనిక సోదరులకు అంతిమ సంస్కారం సజావుగా జరగాలి. అప్పుడు నేను ఏం చెయ్యాలి?
ఇంతలో పక్కవాడు చెపుతున్న మాటలకు మరో సారి గుండె ఆగినంత పనయ్యింది. వాళ్ళ తరువాతి టార్గెట్ కొంచెం దూరంలో ఉన్న బంకర్ ! దాంట్లో బాంబులు పెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆ బంకర్లు ఖాళీగా ఉన్నాయి. నా సోదర సైనికులు ఆ బంకరు చేరగానే బాంబులు పేలతాయి. ఆలోచనల్లో పడ్డాను. నా ముందు రెండు జఠిలమైన సమస్యలు. ఒకటి నా మిత్రుల పార్ధివ శరీరాలకు అంతిమ సంస్కారం జరిపించి శత్రువుల నుంచి కాపాడడంతో బాటు వీళ్ళు జరుపబోయే నరమేధాన్ని ఆపాలి. !! అంతే...బుర్ర చురుగ్గా పనిచేస్తోంది. వాళ్ళు వేన్ దిగి క్రిందకు వెళ్ళారు. సీసాలతో నీళ్ళతో. ఓకే, అర గంట వరకూ రారు. అనుకున్నాను. కేబిన్ లో ఒక్కడే ఉన్నాడు. వాడు వేన్ డ్రైవ్ చేసుకుంటూ కొంచెం ముందుకి తీసుకెళ్ళాడు. అక్కడ వేన్ ఆపి, వేన్ నుంచి దిగాడు. కొంచెం ముందుకు కొండ వారగా నడిచాడు. వాడు చేయబోయేది అర్థమైంది. లఘుశంక తీర్చుకోవడం కోసం. అంతే...రెప్పపాటులో వేన్ లోంచి కిందకు దూకాను. పిల్లిలా అడుగులు వేసుకుంటూ వెనకగా వెళ్ళి వాడి పీక పట్టుకున్నాను. అరవకుండా నోరు మూసాను. వెంటనే క్రిందకు తోసి నెత్తి మీద పక్కనే ఉన్న రాయితో బలంగా కొట్టాను. అంతే, వాడి కళ్ళు బైర్లు కమ్మాయి. అచేతనంగా అయి పోయాడు. ఇక ఆలస్యం చేయకుండా వేన్ లోకి దూకాను. అంతే నా లక్ష్యం వైపుకు ప్రయాణించాను. రెండు సమస్యలను పరిష్కరించాను. నా సోదరులకు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం జరిగింది. - తరువాతి మిలటరీ పోస్టులో జరగబోయే మారణ హోమం ఆగింది.
****
కృష్ణ తన సీనియర్లకు తాతయ్య మాటల్లోనే ఆయన సాహస గాధ చెప్పడం పూర్తి చేసాడు. అంతా అభినందన పూర్వకంగా చూసి చప్పట్లు కొట్టారు. " అనగనగా ఒకడుండేవాడు!" అన్నాడొక సీనియర్ గట్టిగా.
" ఇప్పుడూ ఉన్నారు. ఒకడు తాతయ్య, ఇంకొకడు మనవడు. ఇంకో సీనియర్ ఇంకా గట్టిగా చెప్పాడు. కృష్ణ ఆనందంగా తన హాస్టలు వైపు నడక సాగించాడు. వెనక నుంచి చప్పట్లు కొడుతూ సీనియర్లు అంటున్న ఆ మాట " అనగనగా ఒకడుండేవాడు" అతనికి మధురంగా వినిపించింది.