అమ్మకోసం తపన - అదూరి.హైమావతి

amma kosam tapana

బడిగంటకొట్టగానే పిల్లలంతా సంచులు తగిలించుకుని బిల బిల మంటూ బయటికివచ్చి , తమ కోసం వచ్చిన అమ్మ నాన్నల చేతు లుపట్టుకుని బయటికి నడవసాగారు. గేటువద్ద ఉన్న వేప మానుకు ఆనుకుని రెండు చేతులూ బుగ్గలకు ఆన్చుకుని తదేక దీక్షతో వారిని చూడసాగాడు సుందర్., వాడి బుగ్గల మీద కన్నీరుకారిపోతున్నది.

"!రారా! సుందర్ పోదాం!" అంటూ ఆనంద్ ,సుందర్ భుజం పట్టి ఊపాడు. ఆనంద్ తోపాటుగా వచ్చిన కార్తీక్ " వీడురోజూ ఇంతేరా ! ఇక్కడకూర్చుని అందర్నీ చూస్తూ ఉంటాడు. వీళ్ళ అమ్మకూడా వస్తుంద నేమో రా పాపం. “ అని నిరంజన్,

“ వీళ్ళమ్మ వీడిని చిన్నప్పుడే అనాధ శరణాలయం ముందు పడేసి వెళ్ళిపోయిందిట! అందుకే వీడు ఏడేళ్ళుగా అక్కడే ఉంటున్నాడుట!. మా అమ్మ చెప్పింది లేరా!" అని కారీక్ అన్నారు

" ఒరే! నిరంజన్ !కార్తీక్ ! సావాస గాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది ? మనం ఎవ్వర్నీ బాధించకూడ దని ఈరోజు మనకు మన అయ్యవారు చెప్పలేదా? సుందర్ ఎప్పుడైనా ఎవర్నైనా ఏమన్నా ఆన్నాడా చెప్పండి? ఎందుకురా వాడినలా అంటారు ?మరి నేనూ వాడిలాగే అక్కడే ఉంటు న్నాగా? నన్నెందు కనరురా? నేను బలంగా ఉంటా గనక కొడతానని భయం ఔనా?" అన్నాడు కోపంగాఆనంద్.

" పొరపాటైందిరా! ఏమనుకోకు సుందర్! “అనిచెప్పి వాళ్ళ అమ్మతో వెళ్ళిపోయాడు కారీక్.

" సారీరా! సుందర్ " అని నిరంజన్ కూడా వెళ్ళాడు..

“సుందర్ ! వాళ్ళమాటలేం పట్టించుకోకు . నెల నుండీ మనం వెళ్ళేదార్లో ఉన్న అన్ని గుడుల ముందూ ,చర్చిముందూ ప్రార్ధిస్తూనే ఉన్నాంగా, తప్పక మీ అమ్మ ఒక రోజు నిన్ను వెతుక్కుంటూ వస్తుందిరా! బాధపడకు. పాపం ఏదో ముఖ్య మైన పని ఉండి నిన్నలా ఫాదర్ వద్ద ఉంచి వెళ్ళి ఉంటుందిరా! ఇంద ఈ చాక్లెట్ తీసుకో !" అని చాక్లెట్ ఇవ్వ బోయిన ఆనంద్ తో ..

" వద్దురా ! ఆనంద్! మనది కాని దేదీ మనం తీసుకో కూడదని మనకు ఫాదర్ చెప్పలేదూ!." అని లేచి నడిచాడు సుందర్. “ సుoదర్ !ఉంగరాల ఉంగరాల నీ జుట్టు ఎంత బావుంటుందిరా! నీకళ్ళు గుండ్రంగా భలే ఉంటాయిరా ! నీవు మా అందరికన్నా తెల్లగా ఉంటావురా! నీకు ఒక్కసారి వింటేనే అన్నీవచ్చేస్తా యిరా ! ఎలా గుర్తుం టాయిరానీకు!" అంటూ వాడిని మామూలు గా చేసేందుకు ప్రయత్నిం చాడు ఆనంద్.. " ఊరికే పొగడకురా !నాకు గిట్టదు.” అంటూనడక సాగించాడు సుందర్.

" సుందర్ ఈరోజు మనకు ధృవుని కధ లో భక్తితో ప్రార్ధిస్తే ఏదైనా సాధించ వచ్చని చెప్పారు కదరా!. మనం ఈ రోజునుండీ ఇంకా గట్టిగా అన్ని గుడుల ముందూ ప్రార్ధిద్దాం. , అంతేకాక క్రిస్మస్ రోజున క్రిస్మస్ తాత వచ్చి కోరిన బహుమతులన్నీ ఇస్తాడనీ తెలుగు పాఠలో రాలేదూ? తప్పక దేవుడు మన ప్రార్ధన వింటాడు. చర్చి ముందు నేను పెద్దగా అరిచి అడుగుతాను. " అన్నాడు ఆనంద్. ఇద్దరూ నడుచు కుంటూ’ శిశు మందిరం’లోపలికి వచ్చారు.

ఆయా తన కొడుకును ఎత్తుకుని ముద్దులాడుతోంది.వాచ్ మెన్ తన కూతుర్ని గుండ్రంగా తిప్పుతూ ఆడిస్తున్నాడు. అక్కడే నిలబడి చూస్తు న్న సుందర్ ని చూసి వాచ్ మెన్ " రా సుందర్ ! నిన్నూ తిప్పుతాను " అన్నాడు .

" వద్దంకుల్ ! " అంటూ లోపలికెళ్ళి , కాళ్ళూ చేతులూ కడుక్కుని , చదివే గదికెళ్ళి కూర్చున్నా , సుందర్ కు ఎంతసేపూ ' అమ్మ తనను ఎందుకు వదలివెళ్ళిందో ! అమ్మ నాన్న ఉంటేఎంత బావుంటుంది ! ‘ అనే ఆలోచనతో దిగులేసింది. ఎంత ఆపుకుందామన్నాకన్నీళ్ళు ఆగలేదు. నిద్రలోసైతం వాడు " అమ్మ నాన్న కావాలి ,అమ్మ నాన్న కావాలి."అని పలవరించడం ఆనంద్ విన్నాడు. ఫాదర్ తో సుందర్ గురించీ చెప్పాలని వచ్చిన ఆనంద్ లోపల ఎవరో మాట్లాడుతుండగా అక్కడే ఆగిపోయాడు.

లోపలి నుండీ "మాకు సంతానంలేదు మాకు ఒక మగపిల్లవాడు దత్తత కోసం కావాలి " అనే మాటలు వినిపించాయి. ఆనంద్ బయటినుండే వచ్చేశాడు.వాడు మేరీమాత విగ్రహం ముందుమోకరిల్లి " తల్లీ !సుందర్ ను వాళ్ళు తీసుకెళ్ళేలాగా చూడు." అని వేడుకుని వెళ్ళాడు . .క్రిస్మస్ రోజున శిశుమందిరాన్ని రంగుకాయితాల తోరణాలతో అందంగా అలంకరిం చారు. ’ క్రిస్ మస్ తాత వచ్చా ‘డనే మాట విని పిల్లలంతా మేరీమాత మందిరంలోకి వచ్చి చేరారు.క్రిస్మస్ తాత పొడవాటి ఎఱ్ఱ కోటువేసుకుని గెంతులేస్తూ పిల్లల మధ్య కు వచ్చాడు. అందరికీ చాక్లేట్లూ, బిస్కత్తులూ,బిళ్ళలూ, పిప్పరమెంట్లూ , ఆటవస్తువులూ ఇంకా ఎన్నెన్నో కోటులోంచీ తీసి ఇస్తూ ఉండగా సుందర్ ఆశగా చూస్తున్నాడు ' తనకూ అమ్మానాన్నలను తెచ్చాడేమోని"

“ ఇక్కడ సుందర్ ఎవరు బాబూ? వాడికోసం మేరీమాత ' అమ్మా నాన్నలను ' పంపింది , అదుగో గుమ్మందగ్గరచూడు. " అంటూండగానే సుందర్ పైకిలేచి చూశాడు. చేతులు చాపి ముందు కొస్తున్న అమ్మా నాన్నలను చూసి సుందర్ ఆనందం అంతా ఇంతా కాదు.

" నిజంగా మా అమ్మా నాన్నలేనా? అచ్చంగా నా కోసమేనా?" అంటూ దగ్గరకెళ్ళి “ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు?" అంటూ ఆమె ను వాటేసుకుని పెద్దగా ఏడ్చాడు.వారిద్దరూ సుందర్ను ఎత్తుకుని ముద్దాడారు. అందరివైపు గర్వంగా చూస్తూ నవ్వాడు సుందర్.

" అమ్మా! మేరీ మాతా! వoదనాలు , నాప్రార్ధన విన్నందుకు , దేవుళ్ళూ! మీ అందరికీ వందనాలు మా అమ్మా నాన్నలను క్రిస్మస్ తాతతో పంపి నందుకు " అనిమొక్కి, "తాతా ! అమ్మా నాన్నలను తెచ్చినందుకు థాంక్స్ " అనిక్రిస్ మస్ తాతకు ముద్దిచ్చి ,"ఫాదర్ నేను అమ్మా నాన్నల తో వెళ్ళవచ్చా?" అని అడిగాడు.

" ఓ తప్పక వెళ్ళు సుందర్! ఐతే అప్పుడప్పుడూవచ్చి మమ్మల్ని వస్తుం టావుగా? " తప్పక వస్తాను ఫాదర్! ఒరే ఆనంద్!నీవేరా దేవుళ్ళందరినీ నాకోసం ప్రార్ధించావు .నిన్నువదల్లేనురా, నీ స్నేహం మరువ లేనురా !" అంటూ వాడిని కౌగలించుకుని కన్నీరుకార్చాడు,

“ఒరే! సుందర్! హాయిగా ఉండరా మీ అమ్మానాన్నలతో నీవు సంతోషంగా ఉండటమే నాకు కావాలిరా!" అంటూ సుందర్ ను ముద్దు పెట్టుకున్నాడు ఆనంద్. అందరికీ చేతులూపుతూ ఆనందంగా వెళ్ళాడు వారితో సుందర్.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న