ప్రభాత సమయం...... ధనుర్మాసం కావడంతో చలి చలిగా ఉంది. ఉదయాన్నే నిద్రలేచి గేటు తాళం తీయడానికి బయటకు వచ్చాను. ఆదివారం అవ్వడం వల్ల వీధి మొత్తం బద్దకంగా పడుకుని ఉంది. కొంతమంది సాంప్రదాయాల పట్ల మక్కువ గల ఆడపడుచులు ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దుతూ ఉన్నారు.నా బోటి ఉద్యోగినులు మరికొందరు మాత్రం మరో వారానికి గానీ మళ్లీ ఆదివారం రాదన్నట్టు తలుపులు బిడాయించుకుని నిద్రపోతున్నారు.
వేసవిలో అయితే ఆదరాబాదరా డ్యూటీ కొచ్చే సూర్య భగవానుడు చలికి వెచ్చగా మబ్బుల దుప్పటి కప్పుకుని పడుకుని ఉన్నాడనుకుంటా! ఇంకా రాలేదు......లేదు లేదు హె ఇస్ ఒన్ థె వయ్ అంటున్న అప్పుడప్పుడే ఎరుపెక్కుతూ ఉన్న తూరుపు. తోటలో అరవిరిసిన గులాబీల పైన, ముచ్చటగా పెంచుకున్న లాన్ లో పచ్చిక పైన మెరుస్తున్న తుషారికలు...... ఇంకెంత సేపు ఆయన గారు రాగానే మేము వెళ్లిపోవాల్సిందే గా అంటున్నాయి. అందమైన ఉషోదయాన్ని నేనలా ఆస్వాదిస్తూ ఉండగానే పేపర్ బాయ్ న్యూస్ పేపర్ గిరాటేసి వెళ్ళాడు. రోజు అయితే ఉదయమే పేపర్ చదవడం అనే కోరిక నాకు ఎలాగూ తీరదు. ఆదివారం అయితే ఓ చేతిలో కాఫీ కప్పు......... మరో చేతిలో న్యూస్ పేపర్ తో ఓ గంట సేపు ఇష్టంగా గడిపేస్తాను. లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చుకొని వరండాలో కూర్చుని పేపర్ తిరగెయ్య సాగాను. హత్యలు.... ఆత్మహత్యలు..... రోడ్డు ప్రమాదాలు వగైరా పర్వాలు ముగిశాక లోకల్ న్యూస్ లో ఒక వార్త నన్ను ఆకర్షించింది. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు రాధేశ్యాం గారికి ఘన సన్మానం హెడ్డింగ్.... క్రింద ఫోటో....
ఆ పేరు చూడగానే నాలో ఏవో జ్ఞాపకాల నీడలు. తనే నా....... ఫోటో ప్రచురించారు గాని అస్పష్టంగా ఉండడంతో సరిగా తెలియట్లేదు. వివరాల్లోకి వెళ్లాను. ఇక్కడ కాలేజీలో చదువుకుని, ప్రస్తుతం చెన్నైలో పేరు గడించిన ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణులు రాధేశ్యాం గారు అదే కాలేజీ యాజమాన్యం అభ్యర్థన మేరకు విచ్చేసి, కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం పైన ప్రత్యేక తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు సన్మానం జరగడం, ఆ వార్త పత్రికల్లో ప్రచురించడం జరిగింది. వివరాలు అన్నీ చదివాక తను నా చిన్ననాటి ఆప్తమిత్రుడు అని రూడి అయింది. ఎప్పటి మాట.......... దాదాపు పాతికేళ్లు అయ్యింది తనను చూసి. బహుశా నా పెళ్లిలో కలిసాము అనుకుంటా చివరగా. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఊరికి వచ్చాడు అన్న మాట....... నా మనసు తెలియకుండానే గతంలోకి జారిపోయింది.
*******************
“జ్యోతి త్వరగా రావే! కాలేజీ కి టైం అవుతుంది” మూడో సారి అరిచింది శ్రావణి.
“ ఆగవే జడ వేసుకుంటున్నాను” తన పొడవాటి జడ ను తల్లి దగ్గర అల్లించుకుంటూ అంది జ్యోతి. నేను నవ్వుతూ చూస్తూ నిలబడ్డాను. నేను, జ్యోతి, శ్రావణి ఒక జట్టు. నేను, శ్రావణి ఒక వీధిలో, ఆ ప్రక్క వీధిలో జ్యోతి వాళ్ళు ఉండేవాళ్ళం. రోజు ఉదయాన్నే నేను, శ్రావణి కలిసి జ్యోతి వాళ్ళింటికి మీదుగా కాలేజీ కి వెళ్ళేవాళ్ళం. రోజూ జరిగే తంతే ఇది. మేము తయారయ్యి వచ్చే సరికి తను ఉదయాన్నే రేడియోలో వచ్చే చిత్రరంజని వింటూ జడ అల్లించుకుంటూ ఉంటుంది. నేనూ ఓ పాట వినొచ్చు అని నేను తొందర చేసేదాన్ని కాదుగాని శ్రావణికి అంత రసాస్వాదన లేక పోయే............ మమ్మల్ని అదిలిస్తూనే ఉంటుంది. తను తయారయ్యాక ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ కాలేజీకి వెళ్లే వాళ్లం. ముగ్గురము ఇంచుమించు ఒకే సామాజికం గానూ, ఆర్థికంగానూ ఒకే స్థాయి వాళ్ళం. చదువులోనూ ఒకేలా రాణించే వాళ్ళం. జ్యోతి ఆ రోజు వాళ్ళ అక్క వాళ్ళు ముందు రోజు వెళ్లి వచ్చిన విహారయాత్ర గురించి చెబుతూ ఉంది.
“ వాళ్ళందరూ క్లాస్మేట్స్ వెళ్లి భలే ఎంజాయ్ చేశారట. మనము ఎక్కడికైనా అలా వెళితే బాగుండును కదా” అంది జ్యోతి. “మన క్లాసులో అన్ని ముచ్చు మొహాలే! ఏ ఒక్కరికైనా ఇలా టూర్ ప్లాన్ చేయాలని అనిపించలేదు.ఎంతసేపూ అమ్మాయిలను కామెంట్ చేస్తూ ఉండమంటే తయారుగా ఉంటారు” విసుక్కుంది శ్రావణి. “పోనీ మనమే ప్లాన్ చేసి వాళ్లను రమ్మంటే!” ఉత్సాహంగా అంది జ్యోతి. “సర్లే! ముందే అవి కోతులు. ఇక మనం టూర్ కు రమ్మంటే అంతే సంగతులు. మనల్ని చులకన చేసేయరూ!” భయం ప్రకటించింది శ్రావణి.
“ ఏమోనే! కానీ మా అక్క వాళ్ళ విశేషాలు చెబుతూ ఉంటే నాకు కూడా వెళ్లాలని మహా కోరికగా ఉంది. మీకు లేదూ వెళ్లాలని..” అంది జ్యోతి. ఇద్దరం అవును అన్నట్టు తల ఊపాం. కానీ ఎలా..... ఎవరిని అడగాలి? ఇప్పటి మాదిరి అప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు రాసుకుపూసుకు తిరగడం, సెల్ ఫోన్ లు, చాటింగులు ఇవేమీ లేవు. టీవీ లో కూడా వారానికి ఒకసారి దూరదర్శన్ లో వచ్చే ఒక సినిమాను ఎంతో శ్రద్ధగా, మహా ప్రసాదంగా భావించి చూసేవాళ్ళం.... అది ఎంత చెత్త సినిమా అయినా సరే.......... ఇక కాలేజీలో అబ్బాయిలతో మాట్లాడటం అంటే ఏదో ఘనకార్యం చేసినట్టు. విహార యాత్ర గురించి చర్చ ఆరోజుతో అయిపోలేదు. రోజురోజుకీ మా ముగ్గురిలో ఆ కోరిక అధికం అవసాగింది. నాలుగైదు రోజులు బుర్ర బద్దలు కొట్టుకున్నాక ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఆ ఐడియా పేరే రాధేశ్యాం. కాలేజీలో మిగిలిన అబ్బాయిలకు భిన్నంగా తన చదువే లోకంగా ఉండేవాడు తను.ఏ రోజు ఏ అమ్మాయిని కామెంట్ చేసిన చరిత్ర లేదు. ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినా చాలా మర్యాదగా నడుచుకునేవాడు. కవితలు... కాకరకాయలు ఏవో రాస్తూ ఉంటాడట. మిగతా క్లాస్మేట్ చెప్పుకోగా విన్నాం. అతను అయితే ఈ టూర్ ప్లాన్ మిగిలిన అబ్బాయిలతో మాట్లాడి చెయ్యగలడు అనిపించింది. మేము తనతో మాట్లాడటం వలన అతను పిచ్చి వేషాలు వేయడు అనిపించి తనను కలవడానికి వెళ్ళాం.
ముగ్గురం ఒకేసారి దండెత్తి వెళ్లేసరికి అతను మొదట కాస్త కంగారు పడ్డా తర్వాత సర్దుకున్నాడు. విషయం చెప్పాక అతను కూడా “మన సీనియర్స్ వెళ్లి వచ్చినప్పటినుంచి మన వాళ్లు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు కానీ అమ్మాయిలంతా వస్తారో రారో అని సందేహిస్తున్నారు” అన్నాడు. ఇక ఏముంది.... మా పని రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు అయింది. అమ్మాయిలను ఒప్పించే పూచీ మా మీదా,టూర్ ప్లానింగ్ మిగతా వారితో కలిసి అతను చేసేలా మాట్లాడుకున్నాం.
ఓ శుభదినాన అందరం కలిసి దగ్గరలో ఉన్న ఓ హిల్ స్టేషన్ కు బయలుదేరాం.కాలేజీ రోజుల్లో స్నేహ బంధాలు, ప్రేమ గంధాలు మొదలయ్యేది ఇలాంటి విహార యాత్రల్లోనే అనుకుంటా.....స్వేచ్చగా విహరించే పక్షుల్లా అందరం బాగా ఎంజాయ్ చేసాం. మిగతా అబ్బాయిలు అందరూ అమ్మాయిలను ఇంప్రెస్ చేసే ప్రయత్నాల్లో ఉంటె శ్యాం ఒక్కడే మా సౌకర్యాలు, అవసరాలు చూసుకున్నాడు. తన మాటల్లో ఆత్మ విశ్వాసం.... భవిష్యత్ పట్ల ఆశావహ దృక్పథం .... బాధ్యతగా మసలుకోవడం.....మాటల్లో గాని, చేతల్లో గాని అమర్యాద లేకపోవడం ..ఇవన్ని చూసి మేము ముగ్గురం నిజంగానే ఇంప్రెస్ అయ్యాం.కొన్ని గంటలు గడిచే సరికే మాకు ఎం కావాలన్నా తననే అడిగేంత చనువు వచ్చేసింది. విహార యాత్ర ముగిసే సరికి తను మాకు మంచి మిత్రుడు అయిపోయాడు. తను కూడా నా లాగే పుస్తకాల పురుగని తెలియడం తో నాకు మరింత ఆనందం కలిగింది.
నేను కొంచెం చొరవ తీసుకుని “ మీరు ఏవో కవితలు రాస్తారట కదా! నాకు చూపించరూ..” అని అడిగాను.“దాందేముంది! రేపు కాలేజి కి తెచ్చి ఇస్తాను” అన్నాడు తను.మరుసటి రోజు అన్నట్టుగానే తను రాసిన కొన్ని కవితలను తెచ్చి ఇచ్చాడు నాకు. మేమేదో తన గురించి ఆషామాషి గా అనుకున్నాం గాని తీరా అవి చదివాక వాటిని అర్థం చేసుకునే స్థాయి కూడా మాకు లేదనిపించింది. తెలుగు బాష మీద తనకు అంత పట్టు ఉందనుకోలేదు. అంత అద్భుతం గా ఉన్నాయి తన రచనలు. వాటిలో చాల వరకు తన ఊహ సుందరి మీద వ్రాసాడు. అవి మరీ గొప్పగా ఉన్నాయి. “ఓయ్! నిజం చెప్పు. ఎవరా అమ్మాయి? ..మన కాలేజేనా?” అని అడిగాను. “నీకు చెప్పడానికి నాకు మొహమాటమెందుకు? తానెవరో కాదు ....జ్యోతి నే!” అన్నాడు. నేను షాక్ తిన్నాను.ఆ సమయం లో వాళ్ళిద్దరూ నా పక్కన లేరు.“నిజంగానా!” అడిగాను ఆశ్చర్యం గా.“అవును. కాలేజీ లో తనను చూసిన మొదటి క్షణం నుండే తనంటే ఇష్టం.” అన్నాడు. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది.టూర్ లో కూడా తను జ్యోతి పట్ల కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ చూపాడనిపించింది. తన కవితలు మళ్ళీ చదివితే తెలిసింది... అవన్నీ తనను ఉద్దేశించి రాసాడని. తన వాలు జడ నుండి కాలి పట్టీల వరకు కాదేదీ తన వర్ణనకు అనర్హం అన్నట్టు ఉన్నాయి. మాకు సాదా సీదాగా కనిపించే జ్యోతి అతని కవితల్లో ఎంత అద్భుతం గా ఉందో! మాతో ఆడుతూ పాడుతూ తిరిగే తను అతని దృష్టిలో అపురూపమైన దేవత..... అందమైన కావ్య నాయకి..... ప్రేమలో పడితే అంతేనేమో!
“మరి తనతో చెప్పలేదేం?” అడిగాను.“ఇప్పుడేగా స్నేహం మొదలయింది. మనమింకా చదువు పూర్తి చేయాలి. నాకంటూ ఒక అర్హత సంపాదించు కున్నాక నేనే తనతో చెప్తాను.” అన్నాడు తను. ప్రేమలో కూడా అంత బాధ్యత గా ఉండటం నాకు నచ్చింది. ఆ తర్వాత తను ఏ కొత్త కవితలు వ్రాసినా నాకు తెచ్చి చూపేవాడు. ముందే చెప్పానుగా .....శ్రావణి కి అంత రస హృదయం లేదని... అందుకని తన జోలికి వెళ్ళే వాడు కాదు. ఇవేం తెలియని జ్యోతి తనతో మామూలుగానే వుండేది. తన దృష్టిలో అతనో మంచి స్నేహితుడు .. అంతే... నేను కూడా జ్యోతి తో ఈ విషయాలు చర్చించి తనను డిస్టర్బ్ చేయాలనుకోలేదు. తనే అన్నాడుగా ...తగు సమయం వచ్చినపుడు చెప్తానని. అందుకే దాన్లో నేను తల దూర్చలేదు. ఆ ఏడు వేసవి సెలవులు వచ్చాయి. అందరు వాళ్ళ వాళ్ళ ఊళ్లకు వెళుతున్నారు.శ్యాం కూడా వేరే ఊరి నుండి అక్కడకొచ్చి చదువు కుంటున్న వాడే. నేను తనని సరదాగా అడిగాను..సెలవుల్లో తనని చూడటం కుదరదుగా ..మరెలా...అని
“తనని చూడాలంటే నాకు ఊహల పల్లకి ఎందుకు? ఒక్క సారి కళ్ళు మూసుకుంటే చాలదూ!” అన్నాడు. ఆ భావుకత్వానికి నేనే మైమరిచిపోయాను.ఇంత గొప్ప ప్రేమికున్ని పొందిన నా స్నేహితురాలు ఎంత అదృష్ట వంతురాలో అనిపించింది.ఆడుతూ పాడుతూ చివరి సంవత్సరం పరిక్షలు కూడా రాసేసాం. జ్యోతి వాళ్ళ నాన్న గారికి ఉద్యోగ రీత్యా వాళ్ళ సొంత వూరికే బదిలీ అయింది. వారి కుటుంబం తరలి వెళ్ళిపోయింది. పై చదువుల కొరకు, ఉద్యోగ ప్రయత్నాల కొరకు ఎవరికి వారు దూరంగా విసరి వేయబడ్డారు. నేను,జ్యోతి మాత్రం రెగ్యులర్ గా ఉత్తరాలు రాసుకునే వాళ్ళం. శ్రావణి వాళ్ళు కూడా వేరే ఊళ్ళో సెటిల్ అయ్యారు. మొదట్లో తను కూడా ఉత్తరాలు రాసేది కానీ తర్వాత తగ్గి పోయాయి.
నాకు మాత్రం ఉన్న ఊళ్లోనే ఉద్యోగం,పెళ్లి అన్ని కుదిరాయి. శ్యాం కు, మిగిలిన స్నేహితులకు శుభలేఖలు పంపాను. జ్యోతి కి వాళ్ళ ఊరికి వెళ్లి మరీ అందరిని ఆహ్వానించాను. అప్పటికి రాదేశ్యాం కూడా చెన్నై లో మంచి ఉద్యోగం లో సెటిల్ అయ్యాడు. నా పెళ్లికి జ్యోతి తప్పకుండా వస్తుందని,అక్కడే ఆమెకి తన ప్రేమ విషయం చెప్పాలని శ్యాం అనుకున్నాడు. కానీ విధిరాత మరోలా ఉంది. సరిగా అదే సమయంలో జ్యోతి తల్లికి ఆరోగ్యం విషమంగా వుండడంతో తను పెళ్ళికి రాలేక పోయింది. అతడి ప్రేమ తన గుండెల్లోనే ఉండిపోయింది. ఒకవేళ తను వచ్చి, అతను ఈ విషయం చెప్పి వుంటే ఆమె అంగీకరించేదో లేదో నా ఊహకందని మాట. జ్యోతి మనసు తెలుసుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళే సాహసం చేయలేకపోయాడు తను. తిరిగి చెన్నై వెళ్ళిపోయాడు. తల్లి ఆరోగ్యం కుదుట పడగానే అదే ఏడు జ్యోతికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసారు.తనే చెప్తాడనుకుని నేను జ్యోతి తో చెప్పని తన ప్రేమ విషయం... తనకు పెళ్లి అయిపోవటం తో చెప్పే అవసరమే లేకపోయింది. అలా రాధేశ్యాం వెలిబుచ్చ లేకపోయిన మూగ ప్రేమకు నేను సాక్ష్యం గా మిగిలిపోయాను.
***********
ఆ తర్వాత శ్యాం గురించి ఈ రోజు ఇలా పేపర్ లో చూస్తున్నాను. మావారికి చెప్పి ఎక్కడ బస చేసాడో కనుక్కోవాలి అనుకుంటూ లేచి లోపలికెళ్ళాను. టిఫిన్ చేసి వంట ప్రయత్నాలు మొదలు పెట్ట బోతుండగా గేటు చప్పుడైంది.ఎవరా అని వచ్చి చూస్తే రాధేశ్యాం.... కుటుంబంతో సహా వస్తూ కనిపించాడు. సాదరంగా వారిని ఆహ్వానించాను. “నేనే నీ గురించి వాకబు చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే వచ్చేసారు” అన్నాను. “ఈ ఊరికి వచ్చి నిన్ను కలవకుండా ఎలా వెళ్తాను అనుకున్నావ్?” అన్నాడు తను నవ్వుతూ. అనుకూలవతి అయిన భార్య, రత్నాల్లాంటి పిల్లలతో చూడ ముచ్చట గా ఉంది అతని సంసారం. తను చెన్నై లోనే స్థిర పడ్డాడట. హోదా లోనూ, ఆర్థికంగాను చాలా ఉన్నత స్థితికి ఎదిగిన తనను చూసి నేను ఎంతో సంతోషించాను. ఎంత ఎదిగినా మా స్నేహాన్ని మరిచిపోనందుకు ఇంకా ఆనందపడ్డాను. కాలేజీ రోజుల్ని గుర్తు తెచ్చుకుని కాసేపు నవ్వుకున్నాం. తను అందరి గురించి అడిగి తెల్సుకున్నాడు గాని జ్యోతి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి జ్యోతి అప్పటి నుండి నాకు టచ్ లోనే ఉంది.ఇప్పటికీ వారంలో రెండు మూడు సార్లు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటాము. అప్పట్లో ఆమెను అంతగా ఆరాధించిన మనిషి కనీసం తన క్షేమ సమాచారం అడగకపోవడం విచిత్రమనిపించింది. సాయంత్రం వరకు మా ఇంట్లోనే గడిపి, మమ్మల్ని కూడా చెన్నై కి రమ్మని ఆహ్వానించి బయలుదేరి వెళ్లారు.
నాకు మాత్రం ఆ విషయం సమాధానం దొరకని ప్రశ్న లా మిగిలిపోయింది.రెండు రోజుల తర్వాత శ్యాం నుండి ఫోన్ వచ్చింది...నా అనుమానాలను తీరుస్తూ ...“నేను జ్యోతి గురించి మాట్లాడకపోవడం నీకు వింతగా అనిపించి ఉండచ్చు. నా భార్యకు జ్యోతి గురించి పెళ్ళైన కొత్త లోనే చెప్పాను.ఇన్నేళ్ళ తర్వాత నేను జ్యోతి గురించి మాట్లాడి, నా జీవితంలో భాగమై పోయిన ఆమెను నొప్పించ దల్చుకోలేదు. అలాగే జ్యోతి కి సంబందించిన జ్ఞాపకాలను కూడా చెదిరి పోనివ్వదలుచు కోలేదు. ఆమె అందమైన రూపం.....తనతో గడిపిన మధుర క్షణాలు....నేనున్నంత వరకు నాతోనే వుండే శాశ్వత ముద్రలు. అందుకే తన గురించి నేను ఏమీ మాట్లాడలేదు.ఆమె ఎక్కడున్నా ఆనందంగా ఉండాలనే కోరుకుంటాను. నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది నేను తనకు నా మనసులో మాట చెప్పలేక పోయానే అనేదొక్కటే..... నీవు నన్ను అపార్థం చేసుకోకూడదనే ఇదంతా చెబుతున్నాను” అన్నాడు.
ఇప్పుడతను నా దృష్టిలో మరింత ఎదిగి పోయాడు.ఎంత హుందా గా నడచుకున్నాడు అనిపించింది. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి నా స్నేహితుడు అవటం, అతని హృదయంలో శాశ్వత స్థానం పొందినది నా ప్రాణ స్నేహితురాలు అవటం నాకు ఎంతో గర్వం కలిగించింది.