ఔను, అతను చదువును ప్రేమించాడు! - ఎమ్వీ రామిరెడ్డి

ounu atanu chaduvunu preminchadu

పదిహేనేళ్ల కిందటి సంగతి...

అక్టోబరు నెలలో ఓ సాయంత్రం. మా ట్రస్టు వార్షికోత్సవం అయిపోయిన మరుసటి రోజు. నేను ట్రస్టు సభ్యులతో సమావేశంలో ఉండగా తులశమ్మ మరో మహిళను వెంటబెట్టుకుని వచ్చింది.

''ఏం తులశమ్మా బాగున్నావా?'' నవ్వుతూ పలకరించాను.

''బానే ఉన్నాను బాబూ. ఇదిగో ఈమె మొగుడు సచ్చిపోయాడు. కొడుకు ఇంజినీరింగ్‌ సదూతున్నాడు. కూలీకెల్లి కొడుకును సదివిత్తంది. ఫీజు కట్టడం శానా కట్టమైతంది. ఏదో కాత్తె, సాయం జేత్తావని...''

''పిల్లల్ని ప్రోత్సహించడానికి చిన్నచిన్న ప్రైజుల ఇస్తున్నాంగానీ, డబ్బుసాయం అంటే సాధ్యం కాదు. మన ట్రస్టుకేం మూలనిధి లేదు'' తేల్చిచెప్పాడు బాబాయి.

''కాత్తె కనికరించండి బాబూ. సదువింకా రెండేళ్లుంది. దానొల్ల కాదు'' బతిమాలింది తులశమ్మ.

''మీ పరిస్థితి నాకర్థమైంది తులశమ్మా. కానీ ఫీజులన్నీ కట్టి చదివించే స్థితిలో నేను లేను. అయినా సరే, వచ్చే ఏడాది, నేను ఎంతోకొంత సాయం చేస్తాను'' మాట అడ్డం వేశాను.

ఆ తర్వాత రవికుమార్‌ గురించి ఆరా తీశాను. ఇద్దరక్కలు, ఇద్దరు అన్నల తర్వాత రవి. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. సెంటు పొలం లేదు. అక్కలిద్దరికీ, పెద్దన్నకీ పెళ్లిళ్లు అయిపోయాయి. చిన్నన్న వికలాంగుడు. తన పనికూడా తాను చేసుకోలేడు.

రవి మాత్రమే అతికష్టం మీద చదువులో ముందుకు కదిలాడు. ఇంటర్‌ అయిపోయి, ఎమ్‌సెట్‌లో ఓ మాదిరి ర్యాంకు తెచ్చుకున్నాడు. ఇంజినీరింగు అతని లక్ష్యం.

ఇంకా నాలుగురోజుల్లో కౌన్సెలింగ్‌ ఉందనగా, తండ్రి హఠాన్మరణం చెందాడు. బంధువుల్లో కొందరు 'ఇంకేం చదువులే' అటున్నా, అతని తల్లి పట్టుబట్టి మరీ కౌన్సెలింగ్‌కు పంపింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజినీరింగులో సీటొచ్చింది. తల్లి కూలినాలితోపాటు కొంత అప్పుచేసి, రెండేళ్లు నెట్టుకొచ్చింది. ఇక భారంగా పరిణమించిన నేపథ్యంలో నా దగ్గరకు వచ్చింది.

++++++++++

అప్పుడు నేను సూర్యాపేటలో ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. నైట్‌డ్యూటీలో ఉండగా ఓరోజు రవి ఫోన్‌చేశాడు.

''సార్‌, నా చదువుకు మీరు హెల్ప్‌ చేస్తామన్నారటగా...'' వెంటనే అవసరమనే స్వరంతో అడిగాడు.

''అవును రవీ. కానీ నెక్స్ట్‌ ఇయర్‌ అని చెప్పానే...!'' గుర్తు చేశాను.

''సార్‌ సార్‌, వచ్చే ఏడాది ఇంకెవరినైనా అడుగుతాను. ఇప్పుడు అర్జెంటు సార్‌'' బతిమాలాడు.

''ఎందుకు?''

''నేను కొన్ని నెలలుగా మెస్‌బిల్లు కట్టడం లేదు. ఇప్పుడు మొత్తం క్లియర్‌ చేస్తేనే ఫైనల్‌ ఎగ్జామ్స్‌కి హాల్‌టిక్కెట్‌ ఇస్తామంటున్నారు. ఎంత ప్రయత్నించినా ఎక్కడా అప్పు దొరకలేదు. ప్లీజ్‌ సార్‌...'' అర్థించాడు.

''అవునా! నేను ప్రయత్నిస్తాను, రేపు సాయంత్రం ఫోన్జెయ్యి'' అన్నాను. సరేనన్నాడు.

'మెస్‌ డబ్బులు కట్టలేక, చదువు మానెయ్యడమా..!' రాత్రి రెండు గంటల వేళ స్కూటరు మీద ఇంటికెళుతున్నా అదే ఆలోచన. నిజానికి నా దగ్గర కూడా డబ్బుల్లేవు. నెలాఖరు. ఎవరినడగాలా అని ఆలోచించి, చివరికి మా యూనిట్‌ మేనేజర్‌ గంగాప్రసాద్‌ గారినే అప్పు అడగాలని నిర్ణయించుకున్నాను.

మరుసటి రోజు సాయంత్రం అరగంట ముందుగానే డ్యూటీకి వెళ్లాను. సెక్యూరిటీలోనే చెప్పారు 'మిమ్మల్ని మేనేజర్‌గారు కలవమన్నారు' అని. కారణం తెలియక, కంగారుగా వెళ్లాను.

రూములోకి అడుగు పెడుతుండగానే ఆయన 'కంగ్రాట్స్‌' చెప్పారు. ఎందుకన్నట్లుగా చూశాను.

''మనవాళ్లు ఈ సంవత్సరం నుంచే గ్రేడింగ్‌ సిస్టమ్‌ ఇంట్రడ్యూస్‌ చేశారు. మీకు ఏ ప్లస్‌ గ్రేడ్‌ వచ్చింది. అయిదువేల రూపాయల ఇన్సెంటివ్‌ వచ్చింది'' అన్నారు.

ఒక్క క్షణం నోటమాట రాలేదు. తేరుకున్నాక 'థాంక్యూ వెరీమచ్‌ సార్‌' అంటూ, నా అవసరం గురించి చెప్పాను.

''మంచి చేయాలనుకుంటే, భగవంతుడు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు. వెరీగుడ్‌. గో ఎహెడ్‌'' అన్నారు, కరచాలనం చేస్తూ. మరుసటి రోజే ఆ డబ్బులు రవి అకౌంటులో డిపాజిట్‌ చేశాను. ఆ తర్వాత మూడు, నాలుగు సంవత్సరాలు చదవడానికి అవసరమైన ఫీజులు నేనే కట్టాను. రవి ఇంజినీరింగ్‌ మంచి మార్కులతో పాసయ్యాడు. ఆ తర్వాత నాకు టచ్‌లో లేడు.

++++++++++

2004లో నాకు హైదరాబాదు ట్రాన్స్‌ఫర్‌ అయింది.

ఓరోజు మధ్యాహ్నం సెక్యూరిటీ నుంచి ఫోను. కిందికెళ్లాను. చాలాకాలం తర్వాత కనిపించాడు రవి. ఏదో పోగొట్టుకున్న వాడిలా డల్‌గా ఉన్నాడు. రవితోపాటు మరో యువకుడు ఉన్నాడు. రవి ఏమీ మాట్లాడటం లేదుగానీ, ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడని గ్రహించాను. ఇద్దర్నీ క్యాంటీన్‌కు తీసుకెళ్లాను. వాళ్లను కూచోమని చెప్పి, నేను వెళ్లి మూడు టీలు పట్టుకొచ్చి, చెరొకటీ ఆఫర్‌ చేశాను. రవి మౌనం వీడలేదు. నేను టీ తాగుతూ, 'తీసుకోండి' అన్నాను. ఆ యువకుడు తాగడం మొదలుపెట్టాడు. రవి టీ కప్పు వంక కూడా చూడటం లేదు.

''ఏమైంది రవీ! ఎనీ ప్రాబ్లమ్‌?'' అడిగాను.

''నేను చెబుతాను సార్‌. నా పేరు కిషోర్‌. రూమ్మేటుని. వీడు ఎమ్‌టెక్‌ చదవాలనుకున్నాడు, గేట్‌లో ర్యాంకు రాలేదు. బాగా డిజప్పాయింటై, సూసైడ్‌ చేసుకోవాలన్న స్టేజికి వచ్చాడు'' చివరి వాక్యాన్ని కోపంగా పలికాడు కిషోర్‌. నాకు సీన్‌ అర్థమైంది. ఏమీ మాట్లాడలేదు. రవి అలా తల వంచుకుని మరో లోకంలో ఉండిపోయాడు. మూడు నిమిషాల మౌనం తర్వాత నేను తాపీగా ''గుడ్‌ రవీ, మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు చనిపోవడం చాలా మంచిది'' అన్నాను. దిగ్గున తలెత్తాడు రవి. అర్థం కానట్టు చూశాడు నావైపు.

''నువ్వు సరిగ్గానే విన్నావు. బతకడం అనవసరం'' నొక్కి చెప్పాను. తల విదిలించాడు రవి. అప్పటిగ్గానీ అతనీ లోకంలోకి రాలేదు.

''ముందు టీ తీసుకో'' ఆర్డర్‌ వేశాను. మెల్లగా కప్పు అందుకుని ఓసారి సిప్‌ చేశాడు.

''చూడు రవీ, మీ అమ్మ కడుపు కట్టుకుని, కూలీనాలీ చేసి, ఎంతో కష్టపడి చదివిస్తే... ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకుని నువ్వు సూసైడ్‌ లాంటి చచ్చుపుచ్చు ఆలోచనలు చేయడం సిగ్గుచేటు. ఏం, కనీసం అటెండర్‌ ఉద్యోగమైనా రాదా? నెలకు పదివేలు సంపాదించలేవా? మీ అమ్మను పోషించలేవా? ఇంత చిన్న లాజిక్‌ మరచిపోయి, అలా ఆలోచించడం... ఇట్స్‌ టూ బ్యాడ్‌...'' అయిదు నిమిషాలు హితబోధ చేశాను.

''ఇప్పటికైనా మునిగిపోలేదు. ముందు ఆత్మవిశ్వాసం పెంచుకో. ఆశావహంగా ఆలోచించడం నేర్చుకో. ఉన్నంతలో హ్యాపీగా ఉండు. నువ్వు ఉంటున్నది చందానగర్‌, నేనుండేది మియాపూర్‌. నాలుగు కిలోమీటర్లు లేదు. అప్పుడప్పుడూ మా ఇంటికి రా. మా బాబుతో ఆడుకో. మా పాపకు మ్యాథ్స్‌ చెప్పు. తీరిగ్గా ఆలోచించు...''

+++++

సుమారు నెలరోజుల తర్వాత మళ్లీ కలిశాడు రవి. మొహం నిండా కాంతి. కళ్లల్లో ఉత్సాహం.

''ఏమిటోయ్‌ విశేషం?''

''జె.ఎన్‌.టి.యు. సపరేట్‌గా ఎంటెక్‌ ఎంట్రన్స్‌ నిర్వహిస్తుందన్నయ్యా. ఈ నెలరోజులూ బాగా ప్రిపేరై, రాశాను. మూడోర్యాంకు వచ్చింది'' ఆనందంగా చెప్పాడు.

''ఓ, గ్రేట్‌. కంగ్రాట్స్‌'' అభినందించాను.మళ్లీ పదిరోజులు పోయాక వచ్చాడు. ఫలానా రోజు కౌన్సెలింగ్‌ ఉందని చెప్పాడు. ''నాకిప్పుడు మీరే దిక్కన్నయ్యా. కౌన్సెలింగ్‌ రోజునే పదిహేను వేలు కట్టాలి. మీరే సర్దాలి'' అన్నాడు. ఆ సంతోషంలో నేను మరేమీ ఆలోచించకుండా సరే అన్నాను.

''అన్నయ్యా, ఎల్లుండే కౌన్సెలింగ్‌. రేపు సాయంత్రం ఆఫీసుకొచ్చి కలుస్తా'' ఫోనులో గుర్తు చేశాడు రవి. నా దగ్గర డబ్బుల్లేవు. ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాలేదు.ఓ ఫ్రెండును అప్పడిగాను. ఇవ్వకపోగా ''నువ్వు వాడికి స్పూన్‌ఫీడింగ్‌ మానెయ్‌. ఇంజినీరింగ్‌ క్వాలిఫికేషన్‌తో ఏదో ఒక జాబ్‌ చూసుకోమను'' అంటూ కసిరాడు.మరుసటి రోజు ఆఫీసుకెళ్లాను. దసరా బోనస్‌ ఇచ్చారు. కవరు విప్పిచూస్తే, పన్నెండు వేలు ఉన్నాయి. మనసు కుదుటపడింది. సహోద్యోగి స్వాతి అయిదు వేలు అప్పుగా ఇచ్చింది.ఆ రోజు సాయంత్రం... ఏడు గంటల వేళ..

ఖైరతాబాద్‌ చౌరస్తాలో ఇరానీ కేఫ్‌లో కూచున్నాం నేను, రవి, కిషోర్‌. కవర్‌ను రవికి అందిస్తూ ''ఇందులో పదిహేడు వేలున్నాయి. పదిహేను వేలు ఫీజు కట్టు. ఇప్పుడే షాపుకెళ్లి రెండు జతల బట్టలు కొనుక్కో'' అన్నాను.

''థాంక్యూ సార్‌'' నీళ్లు నిండిన కళ్లతో అన్నాడు రవి. కిషోర్‌ నా వంక సంతోషంగా చూశాడు.

''చూడు రవీ, నాకు డబ్బులెక్కువై నీకివ్వడం లేదు. దసరా బోనస్‌ వస్తే, కనీసం ఇంటిక్కూడా తీసుకెళ్లకుండా, నీకిస్తున్నాను. రేపు నువ్వు బాగుపడితే, నీ ద్వారా మరో పదిమందికి ఊతమందుతుందని నా ఆశ. ఎప్పుడు నిరాశగా అనిపించినా నా మాటలు గుర్తు తెచ్చుకో. కష్టపడి చదవడం ఒక్కటే నువ్వు నాకివ్వగల బహుమానం''.

''కచ్చితంగా బాగా చదవుతానన్నయ్యా. నిజానికి ఎంటెక్‌లో స్టైపండ్‌ వస్తుంది. అయితే అది సెకండియర్‌లోగానీ రాదు. ఈ ఒక్క సంవత్సరం కష్టపడితే, సెకండియర్‌కు డబ్బుతో పనిలేదు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలుంటాయి. కచ్చితంగా సెలక్టవుతాను'' అతనలా ఆశాజనక భవిష్యత్తును ఊహించడం నాకు నచ్చింది.

ఆ రోజు రాత్రి జరిగిందంతా నా శ్రీమతికి వివరించి, సారీ చెప్పాను.

''సారీ ఎందుకండీ, ఆ డబ్బుతో అంతకన్నా మంచిపని చెయ్యలేం'' అంది.

++++++++++

రవి చందానగర్‌లో అద్దెకుండేవాడు. మా ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు. ఇద్దరు పదో తరగతి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మ్యాథ్స్‌ బోధించేవాడు. అలా నెలనెలా వచ్చే డబ్బు ఖర్చులకు సరిపోయేది.

రవి ఓరోజు ఇంటికొచ్చినప్పుడు మా ఆవిడ నన్ను లోపలికి పిలిచి ''ఏవండీ, మీరు గమనించారా? ఆ కుర్రాడెప్పుడొచ్చినా అదే ప్యాంటు వేసుకొస్తున్నాడు. చొక్కాలు కూడా రెండే కనిపిస్తున్నాయి...'' అంది. తన పరిశీలనకు ఆశ్చర్యపోయాను.

''రవీ, బట్టలవీ సరిపోనూ ఉన్నాయా?'' క్యాజువల్‌గా అడిగడానికి ప్రయత్నించాను. సిగ్గుపడ్డాడు. ఏదో చెప్పబోయి, మౌనం వహించాడు.

''పర్లేదు, నిజం చెప్పు''. ''ఒక్క ప్యాంటే ఉందన్నయ్యా. షర్టులు మాత్రం రెండున్నాయి. నిజానికి ఇప్పుడు మీ దగ్గరకు ఆ పనిమీదే వచ్చాను. నా దగ్గర మూడొందలున్నాయి. మీతో వెళ్లి ఓ జత బట్టలు కొనుక్కుందామని...'' ఒక్క నిమిషం నాలో ఏవో ఆలోచనలు.

''చూడు రవీ, నేను టెన్త్‌ చదివేప్పటి నుంచీ మా బావగారివీ, ఆఖరికి మా తమ్ముడు వాడినవి కూడా వేసుకునేవాణ్ని. నేనెప్పుడూ నామోషీగా ఫీలవలేదు. మంచి ప్యాంట్లు, షర్టులు కొన్ని... నాకు టైటయ్యాయి. నీకభ్యంతరం లేకపోతే...''

''అయ్యో, అంతకంటేనా అన్నయ్యా'' సంతోషంగా అన్నాడు. మూడు ప్యాంట్లు, నాలుగు చొక్కాలు తీసుకుని వెళ్లిపోయాడు. మంచి మార్కులతో, నడవడికతో వాళ్ల ప్రిన్సిపల్‌కు ఆప్తుడయ్యాడు రవి. సెకండియర్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌ తర్వాత ఓరోజు ఆయనే స్వయంగా రవిని పిలిచి ''ఓ పనిచెయ్‌. సెకండ్‌ సెమిస్టర్‌లో మీకు క్లాసులు పెద్దగా జరగవు. ప్రాజెక్ట్‌ వర్క్‌ చేసుకుంటూ ప్రతిరోజూ బీటెక్‌ క్లాసులు చెప్పు. ఎంతోకొంత శాలరీ ఇప్పిస్తా'' అన్నాడట.

రవి ఇబ్బందుల నుంచి గట్టెక్కాడని నేను సంతోషిస్తున్నంతలోనే ఓరోజు ఫోన్‌చేశాడు. ఏడుపు తప్ప మాటలు వినిపించడం లేదు.

''ఏమిటి రవీ, ఏమైంది?'' కొంచెం చికాగ్గా అడిగాను. ''ఇప్పటికి 3 కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు కండక్ట్‌ చేశాయి. చాలామంది సెలక్టయ్యారు. నాకు మాత్రం జాబ్‌ రాలేదు...''

అతను రాతపరీక్ష పాసవుతున్నాడు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెబుతున్నాడు. కానీ, అతని ఎకడమిక్‌ ట్రాక్‌రికార్డ్‌ సరిగా లేదని (తండ్రి చనిపోకముందు రెండేళ్లు చదువుకు బ్రేక్‌ పడింది) రిజెక్ట్‌ చేస్తున్నారు.

''ఇంక నాకు జాబ్‌యోగం లేనట్టే...'' రవి దు:ఖం ఆపుకోలేకపోతున్నాడు.

''ఇక క్యాంపస్‌ ఇంటర్వ్యూలు లేనట్లేనా?'' అడిగాను.

''రేపొక కంపెనీ వస్తుంది. అదే లాస్ట్‌''

''అంటే, రేపటి ఇంటర్వ్యూలో కూడా సెలక్టు కాలేననుకుంటున్నావా?''

''అవును''

''కదా! మరింక దిగులెందుకు? నేను కూడా చెబుతున్నాను, నువ్వు కచ్చితంగా సెలక్టు కావు. అలాంటప్పుడు భయపడాల్సిన పనేమిటి? ధైర్యంగా వెళ్లి, సరదాగా ఇంటర్వ్యూకి అటెండై వచ్చెయ్‌! నీకు వేరే కంపెనీలో జాబ్‌ ఇప్పించే బాధ్యత నాది'' భరోసా ఇచ్చాను.

''అంతేనా అన్నయ్యా! అయితే ఓకే'' మాటల్లో ధైర్యం వినిపించింది.

++++++++

సాయంత్రం అయిదు దాటుతోంది.

బండి మీద వెళ్తుండగా ఫోన్‌ మోగింది. రవి. పక్కకు ఆపి, ''చెప్పు రవీ'' అన్నాను.

అతను గస పెడుతూ ఒక్కో మాటా కూడబలుక్కుంటూ ''అన్నయ్యా... ఐ గాట్‌ సెలెక్టెడ్‌...'' పెద్దగా అరిచాడు.

''ఓ, గ్రేట్‌. కంగ్రాట్స్‌ రవీ'' అన్నాను ఆనందంగా.

మరుసటి రోజు ఇంటికొచ్చి, నాకూ మా ఆవిడకూ స్వీట్‌బాక్సు ఇస్తుండగా... రవి నిన్న ఫోనులో చెప్పిన మాటలు నా చెవుల్లో ప్రతి ధ్వనిస్తున్నాయి... ''ఉదయం నుంచీ నాలుగురౌండ్లు జరిగాయి. చాలా ధైర్యంగా ఫేస్‌ చేశాను. చివరిరౌండు తర్వాత నేను సెలక్ట్‌ అయినట్టు చెప్పగానే, జేఎన్‌టీయూ అయిదో అంతస్తు నుంచి పరుగుపరుగున మెట్లు దిగుతూ, రోడ్డు మీదికొచ్చి, కాయిన్‌బాక్సులో రూపాయి వేసి, మొట్టమొదట మీకే చెప్పాను...''

(ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్న ఆ రవికే ఆత్మీయంగా)

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న