‘’ ఈ రాత్రికి టిఫిన్ ఏమ్చేయమంటారు?’’ డ్యూటీ లో అలసిపోయి నీరసంగా సోఫాలో వాలిన శ్రావణ్ ని అడిగింది రోహిణి.
‘’రోజూ నన్ను అడిగి చేస్తున్నావా?నువ్ ఏది బాగా చెయ్యగలిగితే అది చెయ్యి సరేనా?’’ విసుగ్గా అన్నాడు శ్రావణ్
‘’ ఆసంగతి నాకు తెలుసు. మీరు ఏమ్చేసినా ఎలా చేసినా తింటారనీ తెలుసు. ఆ గదిలో ముసలాయనకే చెయ్యలేక చస్తున్నాను.ఇలా పెడితే అలా ఎందుకు చేశావమ్మా? అంటారు. పోనీ ఆయనకు నచ్చినట్టు చేస్తుంటే ఈ వయసులో తినలేనమ్మా? అంటారు.ఎలా వేగేదీ? తినేది రెండు ఇడ్లీ..అవి తినడానికి అందులోకి కరగబెట్టిన నెయ్యి, రెండు చెట్నీలు.
కారం , ఉప్పులు విపరీతం గా వాడేస్తున్నవమ్మా అంటారు. ఉన్న నలుగురికీ రెండురకాల వంటలు చెయ్యడం నావల్ల కాదు.మీరేమనుకున్నా సరే రేపటినుంచి ఆయన సంగతి మీరు చూసుకుని మరీ ఉద్యోగానికి వెళ్ళండి.మీచేత్తో ఏంపెట్టినా ఆయన మాట్లాడకుండా తింటారు.’’అని తన బాధ్యత తీరిపోయినట్టు వెళ్ళబోయింది రోహిణి.
‘’ఇదిగో.చాలా నీరసంగా ఉంది. కాస్త చక్కటి టీ పెట్టియ్యి.’’ అన్నాడు శ్రావణ్
‘’నాన్నగారు. ఈసారి సెమిస్టరు లో కూడా నాదే ఫస్ట్ మార్క్ నాన్నగారు. ఇదంతా మీరు నాకు లెసన్స్ అర్ధమయ్యేలా చెప్పడం వల్లే.’’ అంటూ హుషారుగా వచ్చి తనపక్కన కూర్చున్న కొడుకుని చూస్తూనే నిటారుగా అయ్యాడు శ్రావణ్.
‘’నిజమా నాన్న. అభినందనలు నీకు.’’ అన్నాడు కొడుకు చంద్ర హాస్ ను ప్రేమతో కౌగలించుకుని వెన్ను తట్టుతూ. భర్తకు టీ తెస్తూ కొడుకుతో హుషారుగా కబుర్లు చెబుతున్న భర్తని చూసి కుళ్ళుకుంది రోహిణి.గదిలో ఉన్న తండ్రి పేరు చెప్పినా, కొడుకు చెప్పే మాటలు విన్నా నాదస్వరం ఊదిన నాగుపాములా నిటారై వాళ్ళ మాటలు వింటాడు. అదే తనేమన్నా అంటే అపుడపుడు విసుగు, కోపం ప్రదర్సిస్తాడు.రాత్రి పడక గదిలో ఉన్నంతసేపు తనతో బాగానే ఉంటాడు. వాళ్ళ ఇద్దరి మాట వస్తే మాత్రం హుషారు అయిపోతాడు అనుకుంటూ భర్తకు టీ అందించింది రోహిణి.
‘’మమ్మీ..నాకు ఈసారి సెమిస్టరు లోను ఫస్ట్ వచ్చింది.కాలేజీలో లెక్చరర్లు అందరూ అభినందించారు.’’ లేచి తన గదిలోకి వెళ్ళబోతూ తల్లితోనూ ఆనందగా చెప్పాడు చంద్ర హాస్.
‘’ వెరీ గుడ్ నాన్న.కాలేజీ ఫస్ట్ రావాలి మరి.’’ అంది రోహిణి.
‘’ ఆ అన్నట్టు నాన్నగారు.మీకు పనేమైనా ఉందా?నాకు రసాయన శాస్త్రం లో కెమికల్ ఈక్వేషన్స్ బాలన్సింగ్ చెప్పాలి.’’అడిగాడు చంద్రహాస్.
‘’ ముందు నువ్ బట్టలు మార్చుకో. అలా బజారుకు వెళ్లి కూరలు తెద్దాం.వచ్చాకా పదినిముషాలు టీవీ చూద్దాం. ఆవెంటనే నీ సందేహాలు నివృత్తి చేస్తాను.సరేనా?’’ అన్నాడు కొడుకుతో నవ్వుతూ...
‘’ అలాగే నాన్నగారు.’’ చంద్రహాస్ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
‘’మీరొక్కరే వెళ్ళొచ్చుగా. ఓ పక్క నీరసంగా ఉందన్నారు.వాడూ అలిసిపోయి వచ్చాడుగా.’’ నీల్గింది రోహిణి.
‘’వాడి విషయంలో నేను నీరసపడిపోతే మన భవిష్యత్తే మారిపోవచ్చు. వాడి దగ్గర నా నీరసం సంగతి మాట ఎపుడూ ఎత్తకు. అర్ధమైందా?’’ అనేసి భార్య సమాధానం కోసం చూడకుండా తన గదిలోకి నడిచాడు శ్రావణ్. అన్న ప్రకారం బజారు నుంచి వచ్చాకా కొడుకుకి అన్ని సందేహాలు తీర్చి అతన్ని చదువుకోమని తండ్రి గదిలోకి వచ్చాడు శ్రావణ్ .అప్పటికే టిఫిన్ చేసి తన గదిలో టీవీ చూస్తున్నారు రామచంద్రమూర్తిగారు.
‘’ టిఫిన్ అయిపోయిందా నాన్న గారు?’’ అడిగాడు తండ్రిని.‘’ చేసాను నాన్న. నువ్వు కూడా తొందరగా తిని పడుకో.సందేహాలు అంటూ ఆ చంద్ర గాడితో రాత్రి పదకొండు వరకు మెలకువగా కూర్చుంటే ఎలా? బ్యాంకు లో అసలే అలిసిపోయి వస్తావాయే.’’ అన్నారాయన.
‘’ సరే నాన్నగారు. మీరు తొందరగా పడుకోండి.ఎక్కువ సేపు టీవీ చూస్తె కళ్ళు దెబ్బతింటాయి. నేను వెళ్తాను.’’ అని వెనుదిరగ బోతున్న కొడుకుని చేయి పట్టి ఆపారాయన.
‘’ చూడు. రేపు బ్యాంకు కు వెళ్ళాకా ఈ ఉత్తరం చదువు. తర్వాత నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. సరేనా.ఒక్క మాట.ఈ ఉత్తరం కోడలికి చూపించకు. బాధపడుతుంది. అర్ధమైందా?’’ తల ఊపి ఆయన అందిచిన ఉత్తరం తీసుకుని తను బ్యాంకు కి పట్టుకెళ్ళే బాగ్ లో పెట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రావణ్.
*******
మరునాడు ఉదయం తన సీట్లో కూర్చున్నాకా శ్రావణ్ తన బ్యాగ్ జిప్ తీసేసరికి అందులో తండ్రి ఇచ్చిన ఉత్తరం కనిపించింది. తీసి చింపి చదివాడు. అందులో- నాన్నా శ్రావణ్, నాతొ మీ అమ్మ అరవై సంవత్సరాలు కాపురం చేసింది. తను కాపురానికి వచ్చాకా నన్ను ఏనాడు నాఒంటి శుభ్రమే తప్ప మరే పనీ చేయ నిచ్చేది కాదు. నిజం చెప్పాలంటే ఆమె వచ్చాకా నేను నా తల కూడా దువ్వుకోలేదంటే నమ్ముతావా...నాకు సంబందించిన ప్రతీ పనీ తానే చేసేది. ‘నన్ను మరీ సోమరిపోతులా ‘ అని నేను అంటే...’కుటుంబాన్ని పోషించడం మీ బాధ్యత...మీకు సేవ చేయడం నా ధర్మం. ఓపిక ఉన్నంతకాలమే చేయగలను. తరువాత మీకు మీరే చేసుకోవాలి.భర్త, పిల్లల పనులు చేయడం కన్నా నిజమైన ఇల్లాలికి మరో ఆనందం ఉండదు. నా ఆనందానికి అడ్డురాకండి ప్లీజ్.’ అంది. ప్రతీ పండు తొక్కతీసి ముక్కలు కోసి పెట్టేది. సపోటా, జామ, మామిడి, అనాస,మొదలుకొని చివరకు ముంజులు కూడా వలిచే పెట్టేది. ప్రతీపదార్ధం శుచిగా రుచిగా చేసేది.నా లోదుస్తులతో సహా అన్నీ తనే తీసి ఇచ్చేది.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అలా అలవాటు పడిపోవడం వల్ల వయసు మళ్ళినా జిహ్వ రుచి చావలేదు నాకు. నేను ఎనభయ్యవ పడిలో పడినా నా పనులు నేను చేసుకుంటూ ఆరోగ్యంగా మరీ ముఖ్యంగా ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తిరుగుతున్నాను అంటే దానికి కారణం మీ అమ్మే.
నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన నువ్వంటే ఆమెకు ప్రాణం. నిన్ను తన కోరిక మేరకు చదివించుకుని ఒక మంచి బ్యాంకు ఆఫీసర్ గా చూడాలనుకుంది.జీవితంలో తన కోరికలన్నీ తీర్చుకుని ఒక తల్లిగా, ఇల్లాలిగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి నిండు ముత్తైదువ లా ఎవరో పిలిచినట్టు ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది.
కోడలు ఈ కాలపు అమ్మాయి. నీకు నా అలవాట్లు పద్దతులు బాగా తెలుసు.అందుచేత నిన్ను కోరేదేమంటే నాకు చాకిరీ చేయడం ఆ అమ్మాయికి కొంచం ఇబ్బంది గానే ఉంటుంది. ఎందుకంటే నాకు అరవై ఏళ్లుగా అలవాటైపోయిన సేవలో ఏ లోపం జరిగిన నా నోరు ఊరుకోక తనకి సూచనలిస్తుంటే ఆమె నోచ్చుకోవడం నేను గమనించాను. కాబట్టి ఇక మీదట ఇంట్లో ఉన్న సమయం లో నేను ఉన్నంతకాలం, నా అవసరాలను , నన్ను విసుక్కోకుండా నువ్వే స్వయంగా చూడు నాన్నా. నువ్ ఏంపెట్టినా ఎలా పెట్టినా నేను ఏమీ అనుకోను. దయచేసి ఆ ఒక్క సాయం చేసిపెట్టు.నీ చేతుల మీదుగా ఈ జీవితం సంతృప్తిగా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను.నువ్ నాకు చేసిన సేవ నిన్ను సదా కాపాడు గాక.
ఇట్లు – నాన్నగారు’’
ఉత్తరం చదివిన శ్రావణ్ ఒక అరగంటసేపు అలానే ఉండిపోయాడు. తనకు జ్ఞానం వచ్సినప్పటినుంచి తమ కుటుంబం లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు అతని కళ్ళముందు సినిమా రీళ్ళల్లా గిర్రున తిరిగిపోయాయి.తన తల్లి తమ కుటుంబానికి నడుము వాల్చకుండా చేసిన సేవ గుర్తుకు వచ్చి అతని ఒళ్ళు జలదరించింది.పవిత్ర భావంతో ఒళ్ళు పులకరించింది.
అవును. ఒక చిన్న పని చేసి అలిసిపోయాం అనుకుంటే మనకు నీరసమే మిగులుతుంది. తర్వాత మరో పనీ చెయ్యగలను అనుకుంటే లేని ఉత్సాహం వస్తుంది. కుటుంబ పెద్దగా తనే అలిసిపోయి నీరస పడిపోతే ఆ కుటుంబానికి సంతోషం ఎలా కలుగుతుంది?
‘ఇక మీదట నాన్నగారి అవసరాలన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను.’ స్థిరంగా అనుకున్నాడతను . అలాంటి సంతృప్తి తో ఆయన పెద్ద దిక్కుగా తనకు అండగా ఉన్నంతకాలం తన బిడ్డను తానూ ఎంతో హుషారుగా గైడ్ చేయవచ్చు. శిక్షణ ఇవ్వవచ్చు. తద్వారా చంద్ర హాస్ జీవితం లో తన లక్ష్యాన్ని చేరుకుంటే అంతకన్నా తనకు కావలసింది ఏముంది? అలా అనుకోగానే శ్రావణ్ తన సీట్లో నిటారుగా అయ్యాడు. అలాంటి స్పూర్తి తనకు ప్రతీ నిత్యం కావాలి. అని నిర్ణయించుకుని టేబుల్ సొరుగులోంచి తన వ్యక్తిగత ఫైల్ ను బయటకు తీసి తండ్రి రాసిన ఉత్తరాన్ని ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే కనబడేలా మొదటి పేజీ గా క్లిప్పింగ్ చేసాడు. ఫైల్ మూసేసి తన పనిలో పడిపోయాడు.
*****
ఆరోజునుంచి శ్రావణ్ వెన్ను వంచి నడవడం, ఉసూరు మహాదేవా అన్నట్టు ఉండటం అటు ఆఫీస్ స్టాఫ్ గానీ, స్నేహితులు గానీ, బంధువులు గానీ చూడనే లేదు. అతని లోని మార్పుకు రోహిణి ఎంతో ఆనందించింది. ప్రతీ రోజు ఆఫీస్ కు వస్తూనే తండ్రి ఉత్తరాన్ని చదువుకోవడం, అలాగే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఆ ఉత్తరాన్ని మరోసారి చదువుకోవడం శ్రావణ్ కి ఉత్తేజం తో కూడిన ఉత్సాహం గా, అలవాటుగా మారిపోయింది.
ఇంటర్ ఫలితాలలో చంద్ర హాస్ స్టేట్ రాంక్ సాధించాడు.
ఆరాత్రి కొడుకు గదిలోకి వచ్చిన శ్రావణ్ - చదివి చదివి అలిసిపోయి స్టేట్ రాంక్ సాధించానన్న ఆనందం తో పెదవుల మీద చిరునవ్వు మెరుస్తుండగా గాఢ నిద్రలో ఉన్న కొడుకు తలను ఆప్యాయంగా నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని ప్రక్కనే బోర్లించి ఉన్న డైరీ ని మూసి టేబుల్ మీద పెట్టబోయిన వాడల్లా ఆగిపోయాడు. డైరీ మొదటి పేజీలో ...
‘’MY FATHER DIDN’T TELL ME HOW TO LIVE; HE LIVED, AND LET ME WATCH HIM DO IT.’’