పదిరోజుల అనాథ - క్రిష్ణ చైతన్య

padirojula anadha

అర్థరాత్రి..... ట్రింగ్..... ట్రింగ్ అంటూ మోగుతున్న నా ఫోను వైపు చూసాను, చిమ్మటి చేకటి గదిలో, సూర్యునిలా వెలిగిపోతున్న ఫోను లిఫ్టు చేసాను. మా అబ్బాయి ఆనంద్, "హలో నాన్నా, సారీ నాన్నా నిద్ర డిస్టర్బ్ చేసినందుకు, మనం రేపు ట్రిప్ వెళ్తున్నాం, మీరు బట్టలు సర్దుకుని రెడీగా ఉండండి, నేను, మీ కోడలు, పిల్లలు ఉదయాన్నే అక్కడికి వస్తున్నాము" అంటూ ఫోన్ పెట్టేసాడు. ఈ సడన్ ట్రిప్పులు నాకు అలవాటే, ఛ్.భ్.ఈ ఆఫీసర్ అయిన మా వాడికి సెలవు ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కాబట్టి, కొద్దిపాటి సమయం దొరికినా అందరం కలిసి అలా సరదాగా వేరే ఊరికి వెళ్ళి వస్తూ ఉంటాము. నా పేరు రామనాథం, గవర్నమెంటు టీచరును, రిటైర్ అయిపోయాకా మా ఫాం హౌస్లో ఒక్కడినే ఉంటున్నాను. తెల్లవారింది, లేచి అబ్బాయి చెప్పినట్టు లగేజి సర్దుకుని, కావలసిన మాత్రలు సిద్దం చేసుకుని, పేపరు చదువుతుండగా కారులో వచ్చారు

అబ్బాయి, కోడలు, పిల్లలు. ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకున్నారు, "నాన్నా, పద" అంటూ కారు వైపు తీసుకెళ్ళాడు లగేజిని, అదేంటో మరి డిక్కీలో నా లగేజి మాత్రమే ఉంది, "మీ లగేజీ ఎక్కడ??" అని అడిగిన నాకు మౌనమే సమాధానం అయ్యింది. దేవుడికి దండం పెట్టుకుని కారు ఎక్కాను, హైవే మీదుగా సాగుతున్న కారు ఒక్కసారిగా మట్టిరోడ్డు వైపు మళ్ళింది, ఆ మట్టి రోడ్డును ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం వచ్చింది, అవును, నేను నా భార్య కౌసల్య పాతికేళ్ళ క్రితం ఇదే రోడ్డు వెంబడి వెళ్ళాము,

మాకు పిల్లలు పుట్టరు అన్న చేదు నిజాన్ని తట్టుకోవడానికి ఇదే రోడ్డు చివరన ఉన్న అనాధ ఆశ్రమానికి వెళ్ళి, ఆనంద్ అనే అబ్బాయిని దత్తత తీసుకున్నాం, ఆ ఆనందే ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నాడు. నాకు కలిగిన సందేహం ఏంటి అంటే, ఇప్పుడు ఆ ఆశ్రమానికి ఎందుకు వెళ్తున్నామని?? ఇదే మాటను మా అబ్బయిని అడిగా?? "లేదు నాన్నా, ఇది మనం వెళ్ళే ఊరి హైవేకి షార్టుకట్, అందుకే ఈ దారి వెంబడి వెళ్తున్నాం" అని జవాబు చెప్పాడు ఆనంద్. ఓ పదిహేను నిమిషాల తరువాత కనపడింది ఆశ్రమం, అయితే ఇప్పుడు అది అనాధ ఆశ్రమం కాదు, వృద్ధ ఆశ్రమం. కారు ఆశ్రమం లోపలికి పోనిచ్చాడు ఆనందు, సరాసరి మేనేజరు ఆఫీసు ముందు ఆపాడు.

*నేను - ఇక్కడికి తీసుకొచ్చావేంటిరా??

*ఆనంద్ - నాన్నా, నేను వెళ్ళి మేనేజర్ తో మాట్లాడి వస్తాను, మీరు ఓ పది రోజులు ఇక్కడే ఉంటున్నారు!!!

*నేను - పది రోజులు ఇక్కడ ఉండటం ఏమిట్రా??

*ఆనంద్ - నాన్నా, ఇప్పుడు మీకు ఏ విధమైన వివరాలు చెప్పలేను, మీరు దిగి మేనేజర్ ను కలవండి, ఆయన మీకు రూము చూపిస్తాడు, నేను పది రోజుల తరువాత వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను.

నాకు ఒక్క సారిగా లోయలోకి పడిపోతున్నట్టు అనిపించింది, నేను తేరుకునేలోపు కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు, నేను చూసిన చివరి చూపు, పిల్లల ఏడుపు, నిమిషంలో నేను అనాధను అయిపోయాను, కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి, నా జీవిత ప్రయాణంలో నాకు ఎవరో ఒకరు తోడుగా ఉండేవారు, అలాంటిది ఇప్పుడు అనాధగా ఈ ఆశ్రమంలో ఉండవలసి వస్తోంది, లగేజి తీసుకుని, అక్కడి రిజిస్టర్ లో వివరాలు నమోదు చేసి, నాకు కేటాయించిన గది వైపు నడిచాను, మనిషిని ఉన్నాను తప్ప, మనసు లేదు, ఈ క్షణం చావు పిలిస్తే బాగుండు అనిపించింది. రెండు రూముల గది అది, చాలా చెండాలంగా ఉంది,

ఎప్పుడు కడిగారో ఏమిటో, వాసన కూడా వస్తోంది, అప్పటికే అక్కడ ఇంకో అనాధ కూర్చుని ఉన్నాడు, లీలగా చూసాను, ఎక్కడో చూసినట్టు ఉంది అతనిని, అవును జ్ఞాపకం వచ్చింది, "ఒరేయ్ వెంకీ", అంటూ గట్టిగా పిలిచాను, వాడు ఉలిక్కిపడి నా వైపు, నా సామాను వైపు చూసి, "ఏంటిరా నిన్ను ఆనంద్ తోసేశాడా ఇంట్లో నుంచి" అంటూ వెటకారంగా నవ్వాడు. "ఓ పది రోజులు ఉండమని మా అబ్బాయి ఆనంద్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు రా". నా సమాధానం విన్న వాడు ఫక్కున నవ్వాడు, "ఈ పుత్రులు అందరూ అంతేరా, పది రోజులు అని చెప్తారు, ఇంక మనకు కనపడరు, వినపడరు" అని అంటూ వాడు నవ్వుతున్నా నాకు మాత్రం ఏడుపు వస్తోంది. నేనేం తప్పు చెయ్యకుండా, ఎందుకు ఈ శిక్షను అనుభవిస్తున్నానో నాకు ఏ మాత్రం అర్థం అవ్వడం లేదు. అప్పటికే టిఫిన్ సమయం అవ్వడంతో, నేను, వెంకి, మెస్ వైపు నడిచాము, ఒక ఇడ్లీ ముక్క నోట్లో పెట్టానో లేదో, అస్సలు రుచి లేదు, నీళ్ళ చట్ని, ఇక్కడ ఉన్న ఆరు మంది అనాధలు ఎలా తింటున్నారో అని అనిపించింది, వెంకి గాడి వైపు చూసాను,

"నీకు అలవాటు అవుతుంది లేరా" అన్నట్టు చూసాడు. టిఫిన్ తినేసి, మేమంతా ఆరుబయట కూర్చున్నాం, మాటలు కలిపాము, అందరి మాటలు వింటున్నాను, కొందరివి కథలు, కొందరివి వ్యధలు, అందరూ నాతో బాగా కలిసిపోయారు, ఈ ఆశ్రమంలో ముందు పన్నెండు మంది ఉండేవారు, ఇప్పుడు ఆరు మంది ఉంటున్నాం అని చెప్పాడు ముత్తయ్య. ఆనంద్, పిల్లల జ్ఞాపకాలతో భారంగా ఓ రోజు గడిచిపోయింది, మొదటి రోజు కావడంతో నిద్ర పట్టలేదు, ఈ ముసలి బుర్ర ఆలోచిస్తూనే ఉంది, ఒక్కరోజులో జీవితం ఇలా మారిపోయిందే అని!!..రోజూ నా దినచర్య ఇంతే, ఉదయాన్నే లేవడం, ఆరుబయట కూర్చోవడం, టైముకు తినడం. నేను టీచరు కావడంతో అందరికీ నా వాగుడుతో మంచి కాలక్షేపం అయ్యేది, మంచి కథలు, నా విద్యార్థులకు సంబంధించిన కబుర్లు, సాహస కథలు, మోటివేషన్ విషయాలు ఇలా అన్నీ చెప్పేవాడిని, చూస్తూ ఉండగానే పది రోజులు గడచిపోయాయి, పేపరు చదువుతున్న నా ముందు ఆనంద్ కారు ఆగింది, తల పక్కకి తిప్పి కూర్చున్నా,

*ఆనంద్ - నాన్నా, పది రోజులు అయిపోయాయి, వెళదాం పద!!!

*నేను - నేను రాను రా, నాకు ఇక్కడే బాగుంది...

*ఆనంద్- బెట్టు చెయ్యకు నాన్నా, నీకు అన్ని విషయాలు చెప్తా అన్నాను కదా, పద వెళదాం....

*నేను - సరే, అందరికీ చెప్పి వస్తా..ఆగు...

నా మిత్రులు అందరికీ చెప్పి, లగేజీ తీసుకుని కారు ఎక్కబోయా, అందరి కళ్ళలో కన్నీళ్ళు, ఈ పది రోజుల్లో అంతలా బలపడింది మా మధ్య బంధం. నువ్వు అదృష్ఠవంతుడివి రా అని అందరూ అంటే నాకు సంతోషంగా ఉంది, బిల్ సెట్టిల్ చేసి కారు తీసాడు ఆనంద్, నాకు ఇంకా కల లాగే ఉంది, ఈ సారైనా ఇంటికి తీసుకువెళ్ళరా అని అడిగాను, కారులో ఉన్న ఆనంద్, కోడలు గట్టిగా ఏడుస్తూ నా చెయ్యి పట్టుకుని క్షమాపణ అడిగారు.........

*నేను - ఒరేయ్, ఎందుకు రా ఏడుస్తున్నారు, ఎమైంది, నేను ఇక్కడ సంతోషంగానే ఉన్నాను రా, మీరేం బాధపడకండి!!

*ఆనంద్ - లేదు నాన్నా, మిమ్మల్ని ఇక్కడకు పంపింది వదిలించుకోవడానికి కాదు, అక్కడ ఉన్న ఐదు మంది ప్రాణాలు కాపాడడానికి నాన్నా.

*నేను - ఏమిట్రా నువ్వు మాట్లాడేది?

*ఆనంద్ - అవును నాన్నా, ఈ ఆశ్రమం ఫౌండర్ పెద్ద నేరస్థుడు, మనుషుల శరీర భాగాలు అమ్ముకునే ముఠాలో సభ్యుడు వీడు, పన్నెండు మంది తో మొదలయిన ఈ ఆశ్రమం, నేడు ఐదు మంది మాత్రమే మిగిలారు, రెగులర్ చెకప్ అని చెప్పి హాస్పిటల్ కు తీసుకెళ్ళి, మత్తు మందు ఇచ్చి, శరీర భాగాలు తీసేసుకుని, అమ్ముకోవడం వీరి పని, అలా ఏడు మంది చనిపోయారు, ఇక ఐదు మంది మిగిలారు. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే, అక్కడి ఐదు మందిని ఆశ్రమం నుంచి బయటకి వెళ్ళిపోండి అని చెప్పాను, కానీ వారు నా మాటలు నమ్మలేదు. వెంకీ గారు మాత్రం నా మాటలు నమ్మి, "వీరికి ఎవరూ లేరు ఆనంద్, ఎక్కడికి వెళ్ళలేరు కూడా, వీళ్ళందరూ చావుకు సిద్దపడి డీలాగా గడిపేస్తారు, నువ్వు ఆధారాలు సేకరించుకుని రా, అప్పుడు నిన్ను నమ్ముతారు, అ లోపు వీళ్ళు ఎవ్వరూ హస్పిటలుకు వెళ్ళకుండా నేను చూసుకుంటాను" అని నాకు ధైర్యం చెప్పారు. ఆ సమయంలో నా ముందు ఉన్నవి రెండు సమస్యలు, ఒకటి ఆ నేరస్థుడిని బొక్కలో వేయించాలి, రెండు ఇక్కడ డీలాగా ఉన్న వారిని సంతోషంగా మన ఇంటికి తీసుకురావాలి. మొదటి సమస్య తీర్చడానికి ఎవ్వరికీ అనుమానం రాకుండా, ఆధారాలు సేకరించడం మొదలుపెట్టాను,

కానీ ఆ రెండో సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కాలేదు నాన్న, వారిని ఎలా సంతోషపెట్టాలో నాకు అర్థం కాలేదు, వెంకీ గారిని అడిగాను, ఆయన చెప్పిన చిట్కా పేరే మీ "పది రోజుల అనాధ" ప్రోగ్రాం, అందులో భాగంగానే మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాను. మనకు బాగా నమ్మకస్తుడైన, నిజాయితీ పరుడైన ఒక పోలీసును అక్కడ మఫ్టీలో పెటాను, ఇదేమి తెలియని మీరు, ఇక్కడ పరిస్థితులకు అలవాటు అయిపోయి, అందరినీ నవ్విస్తూ, వారితో కలిసిపోయారు, మీరు నాతో వస్తునప్పుడు వారి కళ్ళనీళ్ళు చూసి అర్థం అయ్యింది, నా ప్లాన్ సక్సెస్ అయ్యింది అని, ఈ పది రోజుల్లో ఆధారాలు సేకరించాను, రేపు ఉదయాన్నే ఈ ఆశ్రమంని మా వాళ్ళు వచ్చి సీజ్ చేస్తారు, అక్కడ ఉన్న వారందరినీ బయటకు పంపిస్తారు.

*నేను - చాలా సంతోషంగా ఉందిరా, మన వల్ల ఐదు ప్రాణాలు నిలబడ్డాయి. నేను వారందరి బాధను దగ్గరనుండి చూసాను రా, ఇక నుంచైనా మన దగ్గరే సంతోషంగా ఉంటారు.

*ఆనంద్ - అవును నాన్నా, రేపు ఉదయం వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తారు, దాని తర్వాత, మనం వారందిరినీ మన ఇంటికి తీసుకువద్దాము, ఇక్కడే మనతో పాటే ఉంటారు.

*నేను - ఇంత కౄరమైన చిట్కా చెప్పిన ఆ వెంకి గాడిని మాత్రం నేను వదిలిపెట్టను రా అన్నాను నవ్వుతూ.....

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న