"బండి సర్వీసింగ్ కి ఇమ్మని చాలా సార్లు చెప్పేను. విన్నావా?. నా మాట లెక్క లేకుండా పోతోంది నీకు. ఇపుడు చూడు! హారన్ పని చేయటం లేదు. నేను ఆఫీస్ కి ఎలా వెళ్లాలి?" టైం అవుతూండటంతో, బండి సరిగా లేక పోవడంతో కొడుకు పై చిరాకు పడుతున్నాడు మోహన్ ..
అప్పటి వరకూ ముసుగు తన్ని పడుకున్న ఫణి తండ్రి ఆఫీస్ టైమైనా ఇంకా ఎందుకు వెళ్లలేదా అన్నట్టు చూసీ ..బండి హారన్ మొరాయించడం కారణం అని అర్థమై గబగబా లేచి బయటకు వచ్చి , బండి స్టార్ట్ చేసాడు. మోహన్ కేరేజి సర్థుకుని వచ్చే సరికల్లా ఇంకా అలాగే నిలబడీ హారన్ ఎందుకు పని చేయట్లేదా అని హేండిల్ పట్టుకు చూస్తున్నకొడుకును చూసి మరో మారు మండిపడ్డాడు మోహన్ ..చిన్న రిపేర్ అయి ఉంటుందిలే నాన్నాఅంటూ సర్దిచెప్తూ, హేండిల్ వైర్లు అటూ ఇటూ సరి జేస్తూ ఓ ఐదు నిమిషాల్లో హారన్ మోగేలా చేసాడు..ఎందుకైనా మంచిది సాయంత్రం వచ్చేటపుడు ఓసారి మెకానిక్ కు చూపించమని చెప్పి బండి ఇచ్చేడు ఫణి.. ఆఫీస్ లో మధ్యాహ్నం భోజనం వేళపుడు ఫణికి కాల్ చేసాడు మోహన్ . ఎంతసేపటికీ ఫోన్ తీయలేదు..ఫణి..
కంగారు మొదలైంది మోహన్ లో ..
" అన్నం తినకుండా ఫోన్ పట్టుకు కూర్చున్నావేంటి ?" ప్రశ్నించేడు కొలీగ్ శివ..
ఫణి సంగతి తెల్సు కదా నీకు అంటూ రాత్రి తను వెళ్ళేటప్పటికి కనీసం అన్నం వండక పోవడం, పొద్దున్న బండి హారన్ పని చేయక పోవడం ఇంట్లో ఏ పనీ చేయని కొడుకును మాటలనడం అన్నీ చెప్పాడు శివతో..
ఫణి భోజనం చేసాడో లేదోనని ఫోన్ చేస్తున్నాను. తీయటం లేదు..అంటూ మళ్ళీ కొడుక్కి రింగ్ చేస్తున్నాడు..అప్పటికి ఓ పది సార్లు చేసుంటాడు ..ఐనా..సరే. ఫోన్ మోగుతోంది. తీయలేదు ఫణి..
కొంప దీసి పొద్దున్న తిట్టిన తిట్లకు అఘాయిత్యమేమైనా చేసుకునుంటాడా !?? ఇప్పటి పిల్లలు చాలా సెన్సిటివ్. గట్టిగా ఏమీ అనడానికి లేదు. పొద్దున్న లేస్తే - పేపర్లో ఎన్ని వార్తలు చూస్తున్నాం!??
చెమట్లు పోసాయి మోహన్ కు.. పోనీ పక్కింటి వారి నెంబరుంటే చెయ్.. ఫణి ని పిలవమను. సలహా ఇచ్చేడు శివ.. కంగారులో తట్టనే లేదు అనుకుని, పక్కింటతనికి ఫోన్ చేసాడు..అతను బయట ఉన్నానని, ఇంట్లో ఆడవారు ఊరెళ్ళారంటూ ఓ పావుగంటలో ఇంటికి వెళ్ళేక చేస్తానని అన్నాడు..
మరింత అసహనం పెరిగి పోయింది మోహన్ లో..తమ రెండిళ్ళ అవతల ఉన్న పరమేశు గుర్తొచ్చి ఆయనకు ఫోన్ చేసాడు.. ఫణి అక్కడే ఉన్నాడనీ, వాళ్ళబ్బాయితో మాట్లాడుతున్నాడనీ తెల్సుకుని ఫోన్ పెట్టేసాడు ... విషయం తెల్సుకున్న శివ-సర్లే టైం అవుతోంది గానీ, ముందు అన్నం తినమని అంటూ, ఫోన్ పలకక పోయినంత మాత్రాన అంత కంగారెందుకురా! ఫణి చిన్న పిల్లాడేం కాదుగా. మోహన్! కొద్దిగా నీ ఆవేశం తగ్గించుకో..నెమ్మదిగా నచ్చ చెప్పాడు శివ..
శివా! ఎదిగిన కొడుకు ఏ ఉద్యోగ ప్రయత్నమూ చేయకుండా ఇంట్లో ఉంటే, వాడి భవిష్యత్ ఏమౌతుందా అని భయం ఉండదా మనకి!? అందులోనూ, వాళ్ళమ్మ వాడి చిన్నవయసులోనే మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి, వెళ్ళి పోయింది. ఆడ దిక్కు లేని ఇల్లు..కష్టపడి వాడిని పెంచీ చదివించేను..వీడు బాధ్యత ఎరగకుండా ప్రవర్తిస్తున్నాడు.. చదువు పూర్తయింది. ఉద్యోగానికి వెళ్లనంటున్నాడు. స్వయం ఉపాధి అంటూ వీధిలో నలుగురిని పోగేసుకుని కాలక్షేపం చేస్తున్నాడు..ఎప్పటికి మారతాడో ఏంటో. బాధ వెళ్లగక్కేడు మోహన్ .. నీ కొడుకు ఒక్కడే కాదు. ఈ తరం పిల్లలు చాలా మంది ఇలాగే ఉన్నారు..నెమ్మదిగా వాడే తెల్సుకుంటాడులే..అంటూ ఓదార్చేడు శివ. అన్నట్లు ఈ రాత్రి డిన్నర్ పార్టీ ఉంది గుర్తుందా!? అంటూ టాపిక్ మార్చేడు శివ. అవున్రా! ఆఫీసర్ గా సత్యం కు ప్రమోషన్ వచ్చినందుకు వాళ్ళింట్లో డిన్నర్ ఏర్పాటు చేసాడు..కదూ. ఆఫీస్ అయ్యాక బండి రిపేర్ చేయించుకునీ అట్నుండి నేను వస్తాలే..అన్నాడు మోహన్ ..
సరేనని తన సీటు వైపుకి వెళ్ళేడు శివ..
అంతలో ఫణి నుండి కాల్ వచ్చింది..
నాన్నా! ఏమైనా అర్జంటా!? అన్నిసార్లు ఫోన్ చేసారు అనడిగేడు..
ఏరా! నీకు బుధ్ధుందా..ఫోన్ వదిలేసి ఎటెళ్ళావు..? తండ్రి కంఠంలో కోపంకన్నా, చెప్పలేనంత ఆదుర్దా ధ్వనించింది ఫణికి.. నాన్నా!. ఫోన్ ఇంట్లో మర్చిపోయేను. చిన్న పనుండి శ్రవణ్ కోసం వాళ్ళింటికెళ్ళాను. అన్నాడు ఫణి.
సర్లే! రాత్రి నేను వచ్చే సరికి లేట్ అవుతుంది.నువ్ తినేసెయ్ అంటూ ఫోన్ పెట్టేసాడు మోహన్ .
*****
బఫే ఏర్పాటు చేసాడు సత్యం.. ఆఫీసు వాళ్ళూ, ఇంకా కొద్ది మంది స్నేహితులు కలిపి సుమారు ఓ ముఫ్ఫై మంది భోజనాలు అవుతున్నాయి.. ఇంతలో సత్యం గేటు దగ్గరకు వెళ్ళేడు... శివ, మోహన్ ఇంకా కొంత మందితో కల్సి మాట్లాడుకుంటూ తింటున్నారు.. అంతలో సత్యం వచ్చి మోహన్ తో నీ కొడుకు ఫణి స్నేహితులతో కల్సి వచ్చేడు అనగానే ఆశ్చర్య పోయాడు మోహన్ ..
ఇక్కడకెందుకు వచ్చాడు అనుకుంటూ గేట్ వైపు వెళ్ళ సాగేడు.. " ఆగు మోహన్! కంగారేం లేదు. తిన్నాక వెళ్ళు. అందరూ తినే వరకూ ఉంటాడులే.." అంటూ మిగిలిన స్నేహితులను పలకరిస్తూ వెళ్ళేడు సత్యం..
ఫణి ఎందుకు వచ్చేడు. అందరూ తినే వరకూ ఉండటం ఏంటి అనుకుంటూ గబ గబా తిన్నాననిపించి చేయి కడుక్కొని బయటకు వెళ్ళేడు మోహన్ ..
బయట కొడుకుతో పాటు ఇంకో ముగ్గురు కుర్రాళ్ళను చూసాడు. ఫణీ ! ఇక్కడ నీకేం పని ప్రశ్నించేడు ఆశ్చర్యంగా! ఫణి కూడా అక్కడ తండ్రుంటాడని ఏమాత్రం ఊహించ లేదు..నాన్నా! అదీ ..ఫణి అంటూంటే, ఫణి స్నేహితుడు శ్రవణ్ ముందుకొచ్చి అంకుల్ ఇక్కడ విందు అవుతోంది కదా! అయ్యాక మిగిలి పోయిన ఫుడ్ తీసుకు పోయి యాచకులకు పంచుదామనీ..వచ్చేం. మేమంతా ఊర్లో ఎక్కడ ఫంక్షన్లు జరుగుతున్నా ముందుగా తెల్సుకునీ -వాళ్ళకిష్టమైతే మిగిలి పోయిన ఫుడ్ వేస్ట్ కానీయకుండా చేస్తున్నాం.. శ్రవణ్ మాటలు వినీ, మోహన్ వెనకే వచ్చిన శివ స్నేహితుని భుజాన్ని తట్టేడు.. అన్నం వండ లేదనో, లేక బండి సర్వీసింగ్ చేయ లేదనో వాడెదురుగా తిట్టి, ఆ తర్వాత తిట్టేనని, బాధ పడ్తూ ఫోన్ తీయక పోతే, కుర్రాడేం చేసుకునుంటాడో అని తెగ ఆదుర్దా పడ్డ నీలో ఆ తరం తండ్రి కనపడుతున్నాడు.
నీకు ఆఫీస్ కు ఇబ్బంది లేకుండా, హారన్ సరి జేసి బండి రడీ చేసిన నీ కొడుకులో బాధ్యత ఉందని గుర్తించు..ఫంక్షన్లలో వృధా కానీకుండా ఆహారాన్ని పంచి పెడుతున్న ఈ తరం కుర్రాళ్ళు వీళ్ళంతా..మనసారా అభినందించు..అన్నాడు..
మోహన్ ఆప్యాయంగా ఫణి భుజం తట్టేడు..