ఇవాళ చిన్నకొడుకు ఋత్విక్ తో వాదన జరిగిన తరువాత ఆలోచనలో పడింది వసంత .ఇంజనీరింగు అయిదో సెమిస్టర్ పరీక్షలురాసి శలవులకి వచ్చిన ఋత్విక్ పరీక్షలు యెలా రాసేవు అన్నదానికి అల్లరిగా నవ్వి పరీక్షలదేముందమ్మా , కాలేజీ జీవితం అనుభవించాలి , జీవితంలో కావలసినవన్నీ సంపాదించుకోడానికి జీవితకాలం వుంది స్టూడెంటు లైఫ్ అనుభవించడానికి మరో సంవత్సరంన్నర కాలమే మిగిలివుంది , గత నాలుగు సెమిస్టిర్లు చదువేలోకంగా గడిపేసేను , మిగతా సంవత్సరంన్నరేనా నన్ను అనుభవించనీ ‘ నిర్లక్ష్యంగా నవ్వుతూ బెడ్ రూములోకి వెళ్తున్నకొడుకుని ఆశ్చర్యంగా చూసింది వసంత .
మళ్లా యిలా మారిపోయడేంటి వీడు ? . టెన్తు పరీక్షలలో ఫ్రెండ్స్ మాటలలోపడి చదువు నిర్లక్ష్యం చేసి బొటాబొటి మార్కులు తెచ్చుకున్నాడు , ఫష్టియరు బోర్డు పరీక్షకాదుకదా అనే నిర్లక్ష్యం తో అవే మార్కులు రిపీటయేయి . చదువుకోమంటే నాకుతెలుసు నువ్వేం చెప్పక్కరలేదు అనే పొగరు సమాధానం .
సచిన్ టెండూల్కర్ యేం చదివేడు , అంబాని యేం చదివి అంతపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టేడు అనే అడ్డగోలు వాదన , గాంధీ యేం చదివేడు , లాల్ బహద్దూర్ శాస్త్రి యేం చదివేడు యెలా చదివేడు అన్నది మాత్రం వినడానికే బోరు , అలాగని సచిన్ , అంబానీలు చేసిన కృషేనా వీరు చేస్తున్నారా అంటే అదీలేదు .
వీధి చివర కల్వర్టులమీద కూర్చొని ఓడిపోయిన క్రికెట్టు మాచ్ గురించి రోజుల తరబడి చర్చించుకోడం . కాని యేనాడూ కూడా సచిన్ అంబానీలు యిలా సమయం వృధా చేసేవారు కాదని తట్టేది కాదు . పోనీ యెవరైనా చెప్తే వింటారా ? అదీలేదు .పొరపాటున పుస్తకం ముందు కూర్చుంటే యెవరోవొకరు తలుపుకొట్టి వచ్చి వీదరుగుమీద ఒకటే కబుర్లు . ఇలా సెకండియరు సగం గడిపేసేడు . గుడ్డిలో మెల్ల నయం అన్నట్లు చెడుస్నేహాలేగాని , చెడు అలవాట్లవాపు వెళ్లకపోవడం కూడా అధృష్టమే .
ఏం చెప్పినా యెలా చెప్పినా వినని వాడు ఓ రోజు చదువు విలువగురించి చెప్తూవుంటే ఒక ఛాలెంజ్ విసిరేడు , దాంట్లో భాగంగా వసంత టీవీ చూడకూడదు . ఏ రోజు వసంత టీవీ చూస్తుందో ఆరోజు ఋత్విక్ ని చదువుకోమని చెప్పే హక్కుని పోగొట్టుకుంటుంది . ఋత్విక్ చదువుతున్నంత సేపు వసంత నిద్రపోకూడదు .
ఏదో పిల్లవాడు పెట్టిన షరతులకి తల్లి అలా తలవంచాలా అని అనిపించవచ్చు , కాని ఒకొక్కప్పుడు అలా తలవంచాలి , యెప్పుడూ మన మాటే నెగ్గాలనే పంతం వల్ల లాభం యేమీ వుండదు , పట్టూ విడుపుల ఒడుపు. తెలిసినప్పుడే విజయం వరిస్తుంది .పట్టూవిడుపుల ఒడుపు తెలిసిన వసంత ఛాలెంజ్ కి ఒప్పుకొని తనవి కొన్ని షరతులు పెట్టింది , తను చదవమన్న విధంగానే ఋత్విక్ చదవాలి .టీవీ. చూడకుండా నువ్వుండగలవా ? , నేను లేని సమయంలో కూడా నువ్వు టీవీ పెట్టకూడదు , అలా చూసేవనుకో నేను చదువుమానేస్తాను ‘ ఋత్విక్ ధోరణి యెలావుందంటే యేదో వసంతకోసం చేస్తున్నట్లు తప్ప తన ఫ్యూచర్ గురించిన ఆలోచనే లేనట్లుంది . ఈతరం యువత యేదో తలి తంద్రుల బాధ పడలేక చదువుతున్నట్లున్నారు తప్ప రేపు యెలా ? అన్న అవగాహన కనిపించటం లేదు .
నేను నీలా టీవీలో పుట్టిపెరగలేదు , టీవీ చూడకపోతే చచ్చిపోను , టీవీ ఓ కాలక్షేపం మాత్రమే , టీవీ కి వేస్ట్ చేసే సమయంలో మరో హాబీని పెంచుకుంటాను . ఆ రోజే టీవీ అటకెక్కింది . తంజావూరు పెయింటింగ్ నేర్చుకోడం మొదలు పెట్టింది వసంత .రెండు నెలల తరువాత వచ్చిన క్వాలిఫైయింగ్స్ లో యాబైలనుంచి డబ్బైలకి చేరేయి మార్కులు , అదే పట్టుదలతో బోర్డు పరీక్షలురాసి తొంబై మార్కులు తెచ్చుకొని మంచి కాలేజీలో సీటు తెచ్చుకున్నాడు .
మళ్లా యిదిగో యీ సెమిస్టరునుంచి మళ్లా చదువమంటే యిలా తిరగబడుతున్నాడు .యెలా మార్చాలి వీడిని , వసంతకి యెప్పుడూ తనమీద తనకి మంచి నమ్మకం , పిల్లలకన్నా పెద్దలకి అనుభవం వుంటుంది కాబట్టి వాళ్లని లొంగదియ్యగలమని . చూద్దాం యీ సారి విజయం యెవరిని వరిస్తుందో ? యెవరు యెవి లొంగదీసుకుంటారో .
‘ వెధవ ... సైకిల్ మీద ఢిల్లీ రోడ్లమీద ప్రయాణం , యేంటనుకుంటున్నాడు , అదీ మన ఆడి కారుకి అడ్డంగా వెళ్లున్నాడు , మనకారు వాడి సైకిల్ ని ముద్దు పెట్టుకుంటే ఆ లోకంలో తేలుతాడు , యేమనుకుంటున్నాడో ‘ . ఋత్విక్ నిర్లక్ష్యంగా అన్నమాటలు వసంతని బాధించేయి . ఈ అవకాశాన్ని వుపయోగించుకోవాలని అనుకొంది వసంత .
‘ మరో రెండేళ్ల తరువాత నువ్వు అలా సైకిల్ తొక్కుకుంటూ వెళుతూ వుంటావు , నేను యిలా కారులోనే వెళుతూ వుంటాను అప్పుడు నా కారు నిన్ను ముద్దుపెట్టుకుంటే ? ‘
‘ నేనా , సైకిల్ మీదా నెవ్వర్ ‘ .
‘ ఆ నువ్వే , ఇంజనీరింగ్ పాసవకపోతే నువ్వు అలాగే సైకిల్ మీద వెళ్లాలి ‘ .
‘ అంటే ‘
‘ ఇంజనీరింగ్ పూర్తి చెయ్యలేకపోతే నువ్వు ట్వెల్త్ మాత్రమే పాసయినట్లు లెక్క రైట్ ‘
‘ రైట్ ‘
ట్వెల్త్ పాస్ వాళ్లకి యెలాంటి వుద్యోగం వస్తుంది యెంత జీతం యిస్తారు , అందులో నీ యిల్లు , నీ పిల్లలు , వాళ్ల చదువులు , అవగా నీకు కారు కాదుకదా బైకు మెయింటైన్ చేసే స్తోమత కూడా వుండదు అవునా ? మరి అప్పుడు నువ్వు వెళ్లగలిగేది సైకిలే కదా ? ‘ ఋత్విక్ చాలా సేపు మౌనంగా వుండిపోయేడు . చాలా సేపటి తరువాత ‘ మరి నాన్నగారు ఆర్జించినదాంట్లో నాకేమీ యివ్వరా ? ‘
‘ఎందుకివ్వనూ యిస్తాను , పోనీ నువ్వు నా కొడుకువి , కారు కొనుక్కోలేని స్థితిలో వున్నావు అని యీ కారిచ్చేననుక్కో నువ్వు వుండే చోట కారు పార్కింగు వుంటుందో లేదో , వుందే అనుక్కో నీజీతం లోంచి కారుకి యెంత పెట్రోలు పొయ్యగలవు ‘ .
‘ నువ్వు మాత్రం కారులోనే తిరుగుతావా ? ‘ .
ఆ సుబ్బరంగా , యెందుకంటే నా బ్రతుకాట సరిగ్గా ఆడుకొని పై మెట్టుమీదకి యెక్కిపోయేను , నువ్వు చదువుకుంటే నాకు మరికొన్ని మార్కులు పడతాయి , నువ్వు చదువుకోకపోతే నాకేమీ మైనస్ మార్కులు పడవు , కాబట్టి నా హోదా యేమీ తగ్గదు , నా జీవితాంతం యిదే స్టేటస్ మైన్టైన్ చెయ్యగలను , కాని నీ సంగతే ఆలోచించుకో ? ‘ .
‘ మళ్లా ఆలోచనలలో మునిగి పోయేడు ఋత్విక్ , మరి అన్నగాడు నాకేమీ డబ్బు సహాయం చెయ్యడా ? ‘.
‘ చేస్తాడు , అదీ కొంత వరకే , వాడి సంసారం వాడికుంటుంది , అది చూసుకున్న తరువాతే నిన్ను చూస్తాడు , విద్యార్ధి దశలో అల్లరి చిల్లరిగా తిరిగి తరవాత యెవరి సహాయం కోసమో యెదురు చూడడం యెంతవరకు సమంజసం , వాడు నీ అన్నే కాదనను , అన్నదగ్గరైనా చెయ్యిచాచడం అంటే ముష్టి అడగడం అనే కదా అర్దం , లేకపోతే అర్దమేమైనా మారిపోతుందా ? ‘ .
ఇవి చాలవన్నట్లు స్మార్టు ఫోనులలో దొరికే చెత్త యువతని యెక్కడకి తీసుకు వెళుతోంది . ఎన్నికలొస్తే యే పార్టీ గెలుస్తుందో అనే దానిమీద బెట్టింగు , క్రికెట్ట్ సీజనులో అయితే అడగే అక్కరలేదు .
ఇదే సమయం యినుము వేడెక్కి వుంది యెంత కష్టమైనా మరో నాలుగు దెబ్బలు యీవూపున పడితే యినుప ముక్కని మనకి కాలసిన వస్తువగా మర్చుకోవచ్చని యెరిగిన వసంత తన మాటలు కొనసాగించింది .
‘ చూడు నాన్నా , మీలాంటి విద్యార్ధులు ఆలోచించుకోవలసినది ఒకటే , మిమ్మలని చదువూచదువూ అని పెద్దవాళ్లు మాటిమాటి చెప్పుతున్నారు అంటే మీరు చదివి వారిని అందలం యెక్కించాలని కాదు , యెక్కిస్తే మంచిదే . తమ సంతానం తమకంటే ఒక స్థాయి పైనవుంటే చూడాలనే స్వార్ధం తప్ప మరేమీ లేదు .
నువ్వు చదువుకోకపోతే మా స్థాయిలో యేమార్పూ వుండదు , నీకర్దమయేట్లు చెప్పాలంటే నువ్వు యింజనీరింగు పూర్తిచెయ్యకపోతే నువ్వు కారు కొనే స్థితిలో వుండకపోవచ్చు , కాని నా కారు యెవ్వరూ లాక్కోరు , నాన్నగారు చేస్తున్న వుద్యోగం తో మా చివరి రోజుల వరకు యిదే హోదాలో బ్రతకగలిగేంత మేం వెనకేసుకున్నాం , సో నువ్వు చదువు నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది నువ్వే . ఇప్పుడు ఓహో ఆహా అంటున్న దోస్తులు కూడా మొహం చాటేస్తారు , మీ అన్న యిప్పుడు ఒక్కడే కాబట్టి నువ్వడగ్గానే పదో పరకో యిస్తున్నాడు , పదో పరకో తప్ప యెక్కువ యివ్వడుకదా ? యెక్కువఅడిగే హక్కు నీకుందా ? వాడు స్టూడెంటుగా వున్నప్పుడు కష్టపడ్డాడు , పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో వుద్యోగం సంపాదించి లక్షలలో జీతం తీసుకుంటున్నాడు . విద్యార్ధి జీవితంలో కష్టపడి చదివితే సుమారుగా ఓ అయిదేళ్లు కష్టపడతావు తరవాత కాలుమీద కాలు వేసుకొని అనుభవిస్తావు , కాదు అంటే యీ అయిదేళ్లు ఎంజాయ్ చేస్తావు ఆ తరువాత లైఫంతా సఫరవుతావు , యేది కావాలో నువ్వే యెంచుకో .
ఓ చిన్న విషయం చెప్తాను విను , మంచి తిండి తినాలనుకో ముందు ఓ గంట పొయ్య దగ్గర కష్టపడాలి , ఆ తరవాత ఫాను కింద కూర్చొని నీ కిష్టమైన వంటకాన్ని తినొచ్చు , వంటపొయ్య దగ్గరకి వెళ్లి కష్టపడలేను అనుకుంటే వంటకం దొరకదు కదా ? .
ఒక్కోతరం ఒక్కో అడుగు ముందుకేస్తే మనదేశం యెంతో ముందుకి వెళ్లదూ ? ఏవో కొన్ని అరాచక శక్తులు విద్యార్ధులను టార్గెట్ చేసి పనికిమాలిన ఆలోచనలను మీమీద రుద్దుతోంది . ప్రగతిలో దూసుకుపోతున్న దేశాన్ని వెనుకకి లాగాలంటే ఆదేశంలోని యువతని నిర్వీర్యం చేస్తే చాలట , అందుకని డ్రగ్స్ , వీడియోగేమ్స్ , పోర్న్ సైటుల ద్వారా మనదేశంమీద యెన్నో రకాలుగా మన మిత్ర , శతృదేశాలు వ్యూహాలు పన్నుతున్నాయి , వాటికి మీరు బలికాకూడదు , వాటిని తిప్పి కొట్టండి .
మన దేశం లోనే కుటుంబ వ్యవస్థ వుంది , చాలా దేశాలలో మైనరిటీ తీరగానే పిల్లలు వారి సంపాదన వారు చూసుకోవాలి అవునా ? , ఈ మధ్య కాలంలో మనదేశం ప్రపంచదేశాలలో అన్ని రంగాలలోనూ ముందడుగు వేసింది , అది ఓర్వలేని దేశాలు యువతని టార్గెట్ చేసుతున్నాయనేది యీ మధ్యన చేసిన సర్వేలో తేలింది .......’ .
‘ దేశం కోసమా ..... గాడిదగుడ్డు , నాకొద్దుకాని నీ కోసం నువ్వుచెప్పిన పైస్థాయికి చేరుకొని చూపిస్తాను ఛాలెంజ్ , నీ ఛాలెంజ్ యేమిటి ? ‘
నువ్వు నామాటవిని నీ ఛాలెంజ్ లో విజేతవవు , నేను తరువాత నా లైఫంతా నువ్వు చెప్పినట్లే వింటాను సరేనా ? ‘ .
ఈ నాటి యువతకి మొత్తం ప్రపంచమంతా వారిపై పగబట్టి జులుం చలాయిస్తున్నారనే ఓ అపోహ , అందులో చదువుకొని వృద్దిలోకి రమ్మనే తల్లితండ్రులు వారి ప్రధమ శతృవులు . ఇలాంటి ఆలోచనలలో వున్న యువతని వారిలో వున్న శక్తిని గుర్తించి కాస్త జాగ్రత్తగా మార్గం మార్చి మంచి దారిలో పెడితే అద్భుతాలు సృష్టించరూ ? .
అదే అయ్యింది ఋత్విక్ విషయం లో .అయదేళ్ల తరువాత మాన్యుఫేక్చరింగ్ కంపెనీలో జనరల్ మేనేజరుగా పదవి చేపట్టిన ఋత్విక్ పరిచయం చేసిన బెంగాలి అమ్మాయి స్మితని రెండు చేతులూ చాచి హృదయ పూర్వకంగా తమకుటుంబం లోకి ఆహ్వానించి తన ఛాలెంజ్ నిబెట్టుకుంది వసంత .