నా స్నేహితుడు వాసు కూతురు పెళ్లి, నేను నా శ్రీమతి తో కలిసి ఏదైనా సహాయం అవసరం అవుతుందని ముందుగానే వెళ్ళాము. కానీ వాడు మాత్రం ఏమి చేయొద్దురా, అంతా ఈవెంట్ మేనేజర్ చూసుకుంటాడు,నువ్వు చెల్లెమ్మ ,పెళ్లి అయ్యేంతవరకు వుండి ఆశీర్వదిస్తే చాలు అన్నాడు. అన్నట్లు గానే ,వాసు కూతురు పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా ఉన్నాయి.అంతా.. ఆడంబరంగా ఉంది.
ఏంట్రెన్సులో పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు ఫొటోలతో ఉన్న పెద్ద కాటౌట్, ఎదురుగా కలర్ ఫుల్ సేట్టింగ్స్, వాటర్ ఫౌంటేన్ , గణేశుని విగ్రహం , రెడ్ అండ్ గ్రీన్ కార్పెట్స్, చెలికత్తెల ఆహ్వానం, వెల్కమ్ డ్రింక్,స్నాక్స్,మక్మల్ క్లోత్ చైర్స్...అన్ని రిచ్ గా ఉన్నాయి.
రంగు రంగుల పువ్వులు ,ఆకులు,సెట్టిoగ్స్ తో పాటు జిగేల్ మనే లైటింగ్ తో పెళ్లి మండపం దేదీప్యమానంగా వెలుగుతుంది. డ్రోన్ కెమెరాలు,క్రేన్ కెమెరా. ఒకవైపు సన్నాయి మేళాలు, మరోపక్క ఫుల్ డ్రెస్సెడ్ బ్యాండ్ పార్టీ..అబ్బో ఎంత చెప్పినా తక్కువే ఆ వైభోగం. ఏమండీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి కదండీ...అంది శ్రీమతి., ఆ..ఆ..మరేమనుకుంటున్నావు, ఈ పెళ్లి గురించి పదికాలలు ఘనంగా చెప్పుకోవాలన్నదే వాసు కోరిక,అందుకే వెడ్డింగ్ కార్డ్ నుండి ప్రతీది కాస్ట్లీ గా ఉండాలని వాడు ప్లాన్ చేసాడు అన్నాను.
అవునండి ,మనమ్మాయి పెళ్లి కూడా ఇలాగే చెయ్యాలి మీరు అన్ని జాగ్రత్తగా పరిశీలించండి అని ఆర్డర్ వేసింది. అంతేగా మరి అన్నాను.. నవ్వుతూ...పెళ్లి తంతు మొదలైంది.కానీ ఎవరికి ఏమి కనిపించటం లేదు...అంతా కెమెరాలు పట్టుకొని అడ్డుగా ఉన్నారు..ఎలా ఉందంటే అంతర్జాతీయ అద్భుత నృత్యప్రదర్శన జరుగుతుంది కానీ లైటింగ్ లేక ఎవరికి ఏమి కనిపించట్లేదన్నట్లుంది.. గుడ్డిలో మెల్లలా పక్కన ఆరెంజ్ చేసిన స్క్రీన్స్ పై లైవ్ కవరేజ్ కొంత నయమనిపిస్తుంది. నవదంపతులకు తెరచేలము అడ్డుపెట్టి జీలకర బెల్లం పెట్టిస్తున్నారు పంతులుగారు, ఆహుతులంతా ఒక్కసారిగ లేచి అక్షితలు గందర గోళంగా వేస్తున్నారు,కొందరు దూరం నుండే ఎదో మొక్కుబడిగా ఎవరిమీదపడితే నాకేంటి నా చేయి కాళీ ఐతే చాలు అన్నట్లు విసురుతున్నారు.
కొంతమంది ఫోటోలకోసం అక్షితలు వేసి కదలకుండా అక్కడే ఉంటున్నారు. అక్కడ నవ దంపతులను ఆశీర్వదించటం కంటే, మా వాసుగాడి దగ్గర అటెండెన్స్ పడితే చాలు అన్నట్లుంది చాలామంది వ్యవహారం. ఇంతలో డిన్నర్ స్టార్ట్ అయింది కళ్యాణ వేదిక దగ్గరి జనం మూడొంతులు డిన్నర్ దగ్గరికి వెళ్లిపోయారు. కొంతమంది పెళ్లితో సంబంధం లేనట్లు డైరెక్టుగా డిన్నర్ దగ్గరికి వెళుతున్నారు.M. L. A, అతని అనుచర గణం,వారితో పోలీసులు అంతా యాబై మంది దాకా కూడా వచ్చారు. ఓ కార్పోరేటర్, అతనితో మరో ఇరవై మందితో భోజనానికి వచ్చాడు. ఇక పోతే డిఫాల్ట్ గెస్ట్స్ (ఏ విందుకైనా వీళ్ళు పిలవని పేరంటాలు )...వాళ్ళ హడావిడి అందరికంటే ఎక్కువ మరి..అసలు మా వాడు ఎవరిని పిలిచాడో, ఎవరెవరు వస్తున్నారో ఆ భాగవంతునికే తెలియాలనిపించింది. ఇక భోజనాలు కడుపుకు సరిపడా తిందామనే ఆలోచన ఒక్కరికి లేదు, ఐటమ్ ఎంటో తెలియకున్నా ప్లేట్లో కుక్కేసుకుంటున్నారు,స్వీట్లు హాట్లు,పప్పు, కూరలు,పచ్చళ్లు అన్ని ప్లెట్లో కలిసి , కలగా పులగంలా అవుతున్నాయి.
ప్లేటులో కనీసం కలుపుకొని తినే స్థలం కూడా లేకుండా నింపుకుంటున్నారు. చిన్నపిల్లలకు కూడా ప్లేట్లల్లో నింపి పెట్టి స్తున్నారు. ఇక కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఎగబడి తీసుకుంటున్నారు.కాని ఎవరూ ఏది పూర్తిగా తినటం లేదు, తినడం కన్నా పారేయటం ఎక్కువైపోయింది.
నాకు చాలా బాదనిపించింది, ఎందుకింత కక్కుర్తి, ఎప్పుడు తిననట్లు..తాను తినడు ఎవ్వరికీ దక్కనీయడు అన్నట్లుంది వ్యవహారం అనుకున్నాను.పైగా ఎవడు పడితే వాడు వెధవ కామెంట్లు, స్వీటస్సలు బాగోలేదు, ఉప్పు కారం లేని చప్పిడి కూరలు ఎం బాగున్నాయి. .అంటూనే వదలకుండా లాగేస్తున్నారు. చిన్నూ ...ఈస్వీటు,కూరలు డస్టుబిన్ లో వేసి ఫ్రెష్ గా పెట్టుకోచ్చోకో నానా అని ఒకామె అంటుంది.
ఏవండి బుజ్జిగాడికి రెండు ఐస్ క్రీమ్లట కాస్త తెచ్చివ్వండి అని మరొక ఆవిడ... తినండి..ఎవడబ్బసొమ్మని ఎవరికి పట్టింపు అనుకున్నాను. నాకనిపించింది నిజంగా ఆకలి ఉన్నవాడికి గంజి దొరికినా పరమాన్నామే. వీళ్లకు ఆకాలే కానప్పుడు ఏం తిన్న నచ్చదు అనుకున్నాను. పెళ్లి ఇంకా పూర్తి కాలేదు భోజనాలు అయిపోయాయి, ఇంకా పెళ్ళివాళ్ళు భోజనం చేయనేలేదు, బందుగణం, కాస్తా ఆలస్యంగా వచ్చిన అతిధులు ఎవ్వరికీ భోజనాలు లేవు. మా వాసు ఈవెంట్ మేనేజర్ పైన గట్టిగా అరుస్తున్నాడు.
ఈవెంట్ మేనేజర్ కూడా సార్ మీమేo చేస్తాము ,మీరు చెప్పిన ఎస్టిమేషన్ కన్నా ట్వంటీ పర్సెంట్ ఎక్కువ చేయించాము...మీరెంత గట్టిగా మాట్లాడినా ఏం లాభం లేదు సార్...
వైట్ రైస్ వండిస్తున్నాను ఉన్న కూరలు పచ్చళ్ళతో అడ్జస్ట్ చేద్దాం అన్నాడు. ఏదో ఒకటి ఏడువు అంటూ మావాడు రుసరుసగా వెళ్లిపోయ్యాడు భోజనాలు లేవని పెళ్ళివాళ్ళు బంధువులు అలిగి వెళ్లిపోయారు..
ఈ మాత్రం దానికి పిలవడం ఎందుకు, బోడి పెళ్లి ,బోడి పెళ్లి అంటూ కొందరు వాసు ముఖంమీదే దెప్పుతూ తిట్టుకుంటూ వెళ్లిపోయారు మరికొందరైతే, ఓ డెకరేషన్లు, నగలు బట్టలు కావు, కడుపునిండా భోజనము పెట్టని పెళ్లి ఓ పెళ్లేనా అంటు నిష్టురాలు పోయారు.మొత్తానికి పెళ్లి తంతు ముగిసింది.పెళ్ళికొడుకు తల్లిదండ్రులను బ్రతిమిలాడి, హోటల్ నుండి పార్సెల్ తెప్పిం చి ఎదో మ్యానేజ్ చేసాము.పెళ్ళికొడుకు తండ్రి మా చుట్టాలను పస్తులుంచి మరి పెళ్లిచేశావయ్య..చుట్టాలముందు మా పరువు తీసావు,పదికాలలు గుర్తుండే పెళ్లి చేస్తానంటే ఏమో అనుకున్నాను ఇదన్నమాట అంటూ నిప్పులు చేరిగాడు.వాసు క్షమించండి అంటూ చేతులు జోడించాడు.
వాసు చాలా బాధ పడ్డాడు, లక్షలు ఖర్చు పెట్టానురా, నలుగురిలో పరువు పోయింది, ముఖ్యoగా పెళ్లి కొడుకువాళ్ల దగ్గర తల కొట్టేసినట్లైందిరా, అంటూ వేదన చెందాడు. ఇప్పుడేం చేయగలంరా ...నువ్వేం బాధపడకు ..ఇందులో నీ తప్పేముందిరా. అనుకోకుండా ఎస్టిమేషన్ తప్పింది ఆమాత్రం అర్థం చేసుకోరా అంటూ సర్ది చెప్పాను..కాదురా, ఇంత చేసి ఏ లాభం రా, వచ్చినవాళ్లకు సరైన భోజనము పెట్టలేక పోయాను అంటూ వాపోయాడు. అంతా సద్దుమనిగాక, నేను నా శ్రీమతి సెలవు తీసుకొని దారిలో హోటల్లో భోంచేసి ఇంటికొచ్చాము.ఏవండి..అనవసరమైన ఆడంబరాలకు పోయి, కనిపించిన వాళ్లoదరిని పెళ్లికి పిలిచి , చివరకు అందరి ముందు అబాసు పాలు కావడం తప్ప ఏమొచ్చిందండి.. ఇప్పుడు చూడండి పోయిన పరువు ఏంచేస్తే వస్తుంది అంది.
అవును పాపం ,వాసు ఎంతో గొప్పగా చేయాలనుకున్న పెళ్లి నవ్వుల పాలియింది, అందుకే మట్టిపనికైనా ఇంటివాడు ఉండాలి అంటారు..డబ్బులు ఖర్చు పెట్టడం కాదు , సరిగ్గా మ్యానేజ్ చేయకుంటే ఇలాగే ఉంటుంది అన్నాను. ఏవండి మనమ్మాయి పెళ్లి కూడా త్వరలోనే అనుకుంటున్నాము కదా..ఈ పరిస్థితి మాత్రం రావద్దండి అంది.చూద్దువుగా తక్కువ ఖర్చుతో నా కూతురు పెళ్లి ఎలా ప్లాన్ చేస్తానో అన్నాను.