టిఫిన్ బ్యాగ్ - భైతి దుర్గయ్య

tiffin bag

" డ్రైవింగ్ లైసెన్స్ ఉందా "

" ఉన్నది సర్ " చూపించాడు

" ఆర్ సి బుక్ ఏది "

బండి లో నుండి తీసి ఇచ్చాడు

" ఇన్స్యూరెన్స్ ,పొల్యూషన్ సర్టిఫికేట్లు……"

మాటలు పూర్తి కాకముందే అవి కూడ పోలీస్ ఇన్ స్పెక్టర్ కు అందించాడు అరుణ్. కొద్ది సేపు ఏమి చేయాలో అర్థం కాకుండా ఎదో ఆలోచిస్తున్నాడు. అరుణ్ కు భయం వేసింది.అన్నీ సరిగానే ఉన్నాయి కదా ,అవి తిరిగి ఇచ్చేస్తే ఆపీసు కు త్వరగా వెళ్లవచ్చు అనేది అతని అభిప్రాయం. అరుణ్ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఇతరుల పై ఆధారపడడం తనకి నచ్చదు. చేసేది చిరుద్యోగమైనా ఉన్నదానితో సంతృప్తి చెందే ఉత్తముడు. ఈ మధ్య తరచుగా బండ్లను చెక్ చేస్తున్నారు. అరుణ్ బండికి సంబంధించిన పత్రాలను ఎప్పుడు బండి లొనే ఉంచుకోవడం అలవాటు.పదిహేను సంవత్సరాల నుండి ఎన్నో సార్లు పోలీసులు, రవాణా అధికారులు చెక్ చేసినా ఒక్కసారి కూడా జరిమానా పడలేదు. హెల్మెట్ బాండిపై పెట్టి పోలీసుల వంక చూస్తూనే ఉన్నాడు అరుణ్. పరిచయం ఉన్నవారిని కానిస్టేబుళ్ళు వదిలి పెడుతున్నారు. కొందరికి చాలన్లు వ్రాసి ఇస్తున్నారు. మరికొందరు బతిమిలాడుతున్నారు. వాచీ చూసాడు అరుణ్.ఆపీసు సమయం ఇంకను పది నిమిషాలు మాత్రమే బాకీ ఉన్నది.ధైర్యం తెచ్చుకుని మెల్లగా ఇన్ స్పెక్టర్ దగ్గరకు వెళ్లి

" సర్,ఆపీసు కు టైమ్ అ…….." అతను కోపంగా తిరిగి చూడగానే అరుణ్ మాట ఆగిపోయింది. రెండడుగులు వెనకకు వేసి సూటిగా చూడలేక తల పక్కకు తిప్పుకున్నాడు .అతను చాలను వ్రాసి అరుణ్ మొహం పైకి విసిరాడు.
అరుణ్ భయంభయంగానే క్రింద పడిన చాలను తీసుకొని చూసాడు. అధిక వేగంగా బండి నడిపినందుకు వంద రూపాయల జరిమానా అని ఉంది." ఇదిఅన్యాయం '" అనాలనిపించింది.మాట గొంతు దాటలేదు.ఎప్పుడూ నలభై మీటర్ల వేగంతో బండిని నడిపించే తనని అందరూ హంస వాహనమని ఎగతాళి చేసేవారు. అయినా తను పట్టించుకోలేదు.ఈరోజు ఇలా జరిమానా కు గురికావడం మనసును కలిచి వేస్తుంది.

జేబు చూసాడు.నెలాఖరు రోజులాయే. సగటు ఉద్యోగుల కు ప్రతి రూపాయి కూడా అత్యంత విలువైనది కదా! పై జేబు ,రెండు ప్యాంటు జేబుల్లో తడిమి చూస్తే యాభై రూపాయలకు నాలుగు రూపాయలు తక్కువగా ఉన్నవి.ఏమి చేయాలో పాలు పోవడం లేదు. ఈ ప్రమాదం నుండి గట్టెక్కేదెలా అనుకునేంతలో నిన్న రాత్రి ఇంట్లొ జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.

అరుణ్ కొడుకు కార్తీక్ నాల్గవ తరగతి చదువుచున్నాడు.వారి పాఠశాల లో డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తే, కార్తీక్ కు ప్రథమ బహుమతి గా వంద రూపాయల నగదు బహుమతి లభించింది. ఆ విషయం రాత్రి ఇంట్లో చెప్పి మురిసిపోయాడు.వంద రూపాయలు అరుణ్ కు ఇచ్చి " నాన్న, ఈ వంద రూపాయలతో నువు టిఫిన్ బ్యాగ్ కొనుక్కో. ఇది నా మొదటి బహుమతి.అది మీకే ఇవ్వాలని ఉంది ". చినిగిన టిఫిన్ బ్యాగ్ మార్చి కొత్త బ్యాగ్ కొనాలని తనకు రాని ఆలోచన ప్రతిరోజు గమనిస్తున్న కార్తీక్ కు రావడం, తనపై ఉన్న అమితమైన ప్రేమనే కావచ్చు." నాన్నా కొనలేక కాదు, అనవసర ఖర్చులెందుకని పాత బ్యాగ్ నే కుట్టించాడు " మధ్యతరగతి ఇల్లాలు కాబట్టి భర్త ను వెనకేసుకొచ్చింది. ఏదైతేనేమి బ్యాగ్ కొనడానికి వంద తీసుకుని టిఫిన్ బ్యాగ్ లో పెట్టాడు. బండికి వ్రేలాడదీసిన బ్యాగ్ ను చూడగానే కళ్ల నుండి అప్రయత్నంగానే నీళ్లు వచ్చాయి."నాన్న, ఈ వంద పోలీసులకు ఇవ్వవద్దు " కార్తీక్ అరిచినట్లనిపించింది.

మదనపడుతూనే బండి దగ్గరకు వచ్చాడు. పదేళ్ల క్రితం పదహరువేలకు కొన్న తన పాత బండి తననే దీనంగా చూస్తూ నిలబడి యున్నది. ఇప్పుడు ఈ వంద రూపాయలు ఇచ్చి, ఆపీసు లో ఎవరినైనా అడిగితే "ఎవ్వరు ఇవ్వరు ఎందుకంటే నీకు ఆత్మాభిమానం ఎక్కువ." అంతరాత్మ తీవ్రంగా హెచ్చరించింది. జేబులో కనీసం వంద రూపాయలు కూడా లేవనే బాధ ఒక వైపు, కొడుకు ప్రేమతో ఇచ్చిన డబ్బుతో బ్యాగ్ కొనపొతే వాడి మనసు ఎంత తల్లడిల్లుతుందోననే నిరాశ మరొక వైపు,అన్నిటిని మించి చేయని తప్పుకు జరిమానా చెల్లించడమే అరుణ్ మనసుని తీవ్రంగా బాధిస్తుంది. పుత్ర ప్రేమ కన్న ఆత్మాభిమానం గొప్పేమి కాదు అనుకొని టిఫిన్ బ్యాగ్ తెరిచాడు.ఇంతలో "అరుణ్ గారు బాగున్నారా, మీరు ఇక్కడ…" ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తూ ఓ అపరిచిత వ్యక్తి సంభోధించాడు.అప్పుడే బండి దిగి సరాసరి ఎస్సై దగ్గరికి వస్తున్న అతనిని అరుణ్ గుర్తుపట్టలేదు. ఇప్పుడు అతనెవరనే విషయం ఆలోచించే పరిస్థితి లో అరుణ్ లేడు. ఆ వ్యక్తి ఎస్సైతో కరచాలనం చేసి అరుణ్ ని ఎస్సై దగ్గరికి పిలిచి " ఇతనెవరో తెలుసా నీకు "అన్నాడు. ఎస్సై అరుణ్ వంక విచిత్రంగా చూసాడు. అరుణ్ కి అంతా అయోమయంలా ఉంది. "రెండు సంవత్సరాల క్రితం పది లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ దొరికిందని పోలీస్ స్టేషన్ కు వచ్చి అప్పగించాడు చూడు.ఆయనే ఈ అరుణ్. ఇతడు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం .ఏ రోజు విధులకు ఆలస్యంగా వెల్లడు. ఒక్క పైసా అవినీతి గా సంపాదించలేదు.బహుమతిగా పోలీసులు పదివేలు ఇచ్చినా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.నువ్వు ఈ మధ్యనే వచ్చావుగా,నీకు ఈయన గురించి తెలిసీ ఉండదులే "

ఒక్క క్షణం ఆగి అరుణ్ చేతిలో చాలను తీసుకుని చూసి ఆశ్ఛర్యంగా " వ్వాట్, నువ్వు ఓవర్ స్పీడ్ లో బండి నడిపావా? " అరుణ్ ఎస్సై వంక చూసాడు.ఎస్సై మాట్లాడలేదు.అతనికి మొత్తం అర్థమయినది. అతను చాలను డబ్బులు ఎస్సైకి ఇవ్వబోయాడు. ఎస్సై తీసుకోలేదు. ఎస్సై అరుణ్ కి కరచాలనం చేసి వెళ్లు మని సైగ చేసాడు. అరుణ్ అతనికి కృతజ్ఞతలు చెప్పి మీరెవరో తెలుసు కోవచ్చా అన్నట్లు ప్రశ్నార్థక మొహం పెట్టాడు."నా పేరు భరత్. నేను ఈ ఎస్సై మంచి స్నేహితులం. ఆ రోజు పది లక్షల బ్యాగ్ పోగొట్టుకున్నది కూడా నా స్నేహితుడే .అప్పుడే నీ నిజాయితీ తెలిసింది.ఇలాంటి వారు ఈ రోజుల్లో ఉన్నారా అని నీ గురించి ఆరా తీసాను.నీ మంచితనం నన్ను విశేషముగా ఆకర్షించింది.నీకు ఏ విధంగా నైనా సహాయం చేయాలనిపించింది.కాని నువ్వు స్వీకరించవని అర్థమయింది. " ఎస్సై ప్రేక్షక పాత్రుడయ్యాడు. ఆపీసు కు ఆలస్యమయిందని అరుణ్ బండి ఎక్కాడు. ఎస్సై ఎదో చెప్పాలని అరుణ్ దగ్గరికి వచ్చాడు. అప్పటికే అరుణ్ బండి పరుగులంకించుకుంది.

సాయంత్రం ఆపీసు నుండి బయటకు వచ్చి బండి దగ్గరకు రాగానే ఒక కానిస్టేబుల్ వచ్చి చేతిలో కొత్త టిఫిన్ బ్యాగ్ ,ఒక కవరు పెట్టి అరుణ్ మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.అరుణ్ కవరు తెరిచి చూసాడు. అందులో ఒక ఉత్తరం ఉన్నది. " ప్రియమైన మిత్రమా ఉచితంగా మీరు ఏది తీసుకోరు అని నాకు తెలుసు .మీలాంటి ఉత్తములను ఈ రోజు చాలా ఇబ్బంది పెట్టాను.భరత్ ద్వారా మీ గురించి పూర్తి వివరాలు సేకరించాను.ఈ టిఫిన్ బ్యాగ్ కొనడానికి ఉదయం మీరు పడిన బాధ కు నేనే కారణం. ఇప్పుడు కూడ ఇది మీకు ఉచితంగా ఇవ్వడం లేదు.మీ బాబు చదివే స్కూలుకు వెళ్లి కార్తీక్ వేసిన పెయింటింగ్ ను తీసుకున్నాను.దానికి ప్రతిఫలంగానే ఈ టిఫిన్ బ్యాగ్ తెచ్చి ఇచ్చాను. ఇది మీదే అరుణ్ గారు. మీకు అభ్యంతరం లేనిచో నన్ను మీ స్నేహితునిగా స్వీకరించండి."

ఎస్డ్సై వ్రాసిన ఉత్తరం చదివి బండి వైపు చూసాడు అరుణ్. ఏదో అద్బుత విజయం సాధించినదానిలా తలెత్తి గర్వంగా చూసింది.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న