లండన్ మహా నగరం.... సమయం ఉదయం పది గంటలు......
హారిక... భర్త ఆఫీస్ కు వెళ్ళిపోవడం తో కిచెన్ లో ఏదో పని చేసుకుంటోంది. హాల్లో ఛార్జ్ లో పెట్టిన సెల్ ఫోన్ మోగుతూ ఉండటంతో పని ఆపి హారిక వెళ్ళింది. ఇండియా నుండి ఆమె తల్లి దగ్గరి నుండి ఫోన్. అది చూడగానే ఆమె ముఖం విప్పారింది.
“ హలో అమ్మా! ఎలా ఉన్నారు? ఏంటి రెండు రోజుల నుండి ఫోన్ చేయలేదు?”
“మేము బాగానే ఉన్నాం రా..మీరెలా ఉన్నారు? కార్తీక్ ఎలా ఉన్నాడు? ఆఫీస్ కు వెళ్ళిపోయాడా?” కుశల ప్రశ్నలు వేసింది ఆమె తల్లి.
“ఇక్కడంతా ఓకే అమ్మా... ఏంటి విశేషాలు? నాన్న ఏం చేస్తున్నారు?”
“ ఇప్పుడే భోంచేసి కూర్చున్నాం. ఇప్పుడైతే నీవు కూడా ఫ్రీ గా ఉంటావని ఫోన్ చేసాను. పోయిన వారంలో తమ్ముడికి ఒక సంబంధం చూసాం అని చెప్పాను కదా.... నిన్న అమ్మాయి తరపు వాళ్ళు మన ఇంటికి వచ్చి వెళ్లారు. దాదాపు ఈ సంబంధం ఓకే అయినట్టే...”
“ ఎంత శుభ వార్త ! ఊ....అయితే ఎంగేజ్మెంట్...పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు?”
“ఓ పది రోజుల్లో ఎంగేజ్మెంట్ అనుకుంటున్నాం. ఆ తర్వాత నెల లోపే పెళ్ళికి కూడా ముహూర్తం ఉందిట..”
“ఓ....అయితే చాలా దగ్గరలోనే అన్నమాట....”
“ అవును. నిన్ను రమ్మనడానికే ఇప్పుడు ఫోన్ చేసింది...పెళ్ళికి ఇక ఎక్కువ టైం లేదు. ఎంత మగ పెళ్లి వాళ్ళమైనా మనకు కూడా షాపింగ్ పనులు ఉంటాయి కదా... పైగా ఒక్కగానొక్క ఆడపిల్లవైతివి. నువ్వు లేకుండా ఈ శుభకార్యం ఎలా చేయగలం? అందుకే నువ్వు వెంటనే బయలు దేరి రా.”
“ అమ్మా....అదీ.... ఆయన వచ్చాక మాట్లాడి తర్వాత చెప్పనా... ఇంత వెంటనే ఇక్కడి నుండి రావడం అంటే అన్నీ చూసుకోవాలి కదా....”
“అల్లుడు గారి గురించి నాకు తెలుసు. కాదనరు. నాటకాలన్నీ నీవే... అన్ని కట్టిపెట్టి వెంటనే బయలుదేరు. సరేనా.. నాన్న గారు కార్తీక్ తో మాట్లాడుతారులే...”
“ సరే వస్తాలేమ్మా...నాకు మాత్రం రావాలని ఉండదా ఏంటి...”
“సరే అయితే ఉంటాను..” ఫోన్ పెట్టేసింది ఆమె తల్లి. అవును మరి అల్లుడు గారు ఎందుకు కాదంటారు... తను ఉన్నా లేకున్నా ఆయనకు పెద్దగా తేడా తెలీదాయే.... తనకే ఆయనను విడిచి ఇండియాకు వెళ్ళాలంటే బాధగా ఉంది. కార్తీక్ కు అన్ని రోజులు సెలవు దొరకటం కష్టం. పెళ్ళికి అయినా వస్తాడో లేదో .....
తమ పెళ్లి అయి మూడేళ్ళు కావస్తోంది. ఇన్నాళ్ళలో కార్తీక్ తరహా ఏమిటో ఇంత వరకు తనకు అంతు పట్టలేదు. తనకేమో అతనంటే చచ్చేంత ప్రేమ. అతనేమో అసలు తనంటే ప్రేమ ఉందొ లేదో అని అనుమానం వచ్చేలా ఉంటాడు. ఏ భావాన్ని బయటికి వెలిబుచ్చడు. తను ఎంత ఎక్స్ ప్రెసివో తను అంత మూడీ.... ఏమైనా అడిగితే చెబితేనే ప్రేమ ఉన్నట్టా .. అని లాజికల్ క్వశ్చన్స్....
ఇన్నాళ్ళలో ఎపుడూ నువ్వీ చీరలో బాగున్నావనో...... ఈ రోజు వంట బాగా చేసావనో..... నువ్వు లేకుంటే నేను లేననో.....ఇలాంటి డైలాగులు వినలేదు.
తనే వెంటపడి అడిగితే నువ్వు ఎప్పుడూ బాగానే ఉంటావు. అన్ని పన్లు బాగా చేస్తావు... అలాగని రోజు నిన్ను పొగడాలంటే ఎలా...అంటాడు.
ఆమెకు పెళ్ళైన తొలి రోజులు గుర్తొచ్చాయి.
భావుకత్వపు తన్మయత్వంలో తనని తాను మరిచే స్వాప్నికురాలామె. కాలం తో, కంప్యూటర్ లతో దీటుగా పోటీ పడే యంత్రుడు అతడు. దేవుడు జతకూర్చే విభిన్న మనస్తత్వాల జంటలలో వారిది కూడా ఒకటి.
మొదట్లో ఓ ఆర్నెల్లు అత్తగారింట్లోనే ఉన్నారు. తనతో కాస్త చనువుగా ఉండబోతే అవతల అమ్మ వాళ్ళు ఉన్నారు.బాగోదు....అనేవాడు. కాస్త గట్టిగా నవ్వితే అమ్మ కోప్పడుతుంది అంటాడు. ఎప్పుడూ గలగలా నవ్వుతూ, లొడలొడా మాట్లాడే తనకు ఆ ఇంట్లో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోయేది. కార్తీక్ ఉద్యోగ రీత్యా లండన్ కు వచ్చేసాక కాస్త నయం... అత్తగారి ఆంక్షలు తగ్గిపోయాయి గాని తను మాత్రం ఇంతే ...నో ఎక్స్ ప్రషన్స్....
స్నేహితురాళ్ళ మాటలలో వాళ్ళ భర్తలు చేసే చిలిపి సంగతుల గురించి చెబుతూ ఉంటె తనకు మాత్రం ఇలాంటి ఉలకని పలకని బండరాముడు దొరికాడేమిటా...అని వాపోతుంటుంది. ప్రేమగా దగ్గరి కెళితే పన్లో ఉన్నాను విసిగించకు అంటాడు. తను ఆఫీస్ కు వెళ్లి పోతేనే నయం. ఇంట్లో లేడని సరిపెట్టుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా అస్తమానూ ఆ వెధవ లాప్ టాప్ ముందర కూర్చుంటే తనకు తగని చిరాకు. ఏమంటే కెరీర్...ఉద్యోగం... సక్సెస్ ....చింతకాయ అంటాడు. జీవితాన్ని జీవించలేని జీతాలెందుకు....
మళ్ళీ తన ఇష్టాలను వేటిని కాదనడు. తనకు ఎలా ఇష్టమో అలా ఉండనిస్తాడు. ఏది కోరినా ఎందుకు ఏమిటి అని అడక్కుండా తెచ్చి ఇచ్చేస్తాడు. తన స్నేహితురాళ్ళు అంతా మగ స్నేహితులతో మాట్లాడటం తమ భర్తలకు ఇష్టం ఉండదని చెబుతూ ఉంటారు. కార్తీక్ అలా కూడా ఏం ఫీల్ అవడు. పైగా తను కూడా వాళ్ళతో ఫ్రెండ్లీ గానే ఉంటాడు. ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ తప్ప తనని బాగానే చూసుకుంటున్నట్టు లెక్క. కానీ తనకు ఆ విషయాలే పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. తానేమైనా ఆయన ఆస్తులు అడుగుతోందా... ఎప్పుడైనా ఒక చిన్న ప్రశంస.....లేదా ఒక చిలిపి చేష్ట. తను కిచెన్ లో పని చేసుకుంటూ ఉంటె వెనుక నుండి వచ్చి మెడ మీద ఓ దొంగ ముద్దు ఇస్తే ఎంత బాగుంటుంది.......తన పనికి అడ్డం పడుతూ తను ముద్దుగా విసుక్కుంటూ ఉంటె ఎంత రొమాంటిక్ గా ఉంటుంది.....తన గురించి పాజిటివ్ గా ఒక మాట మాట్లాడితే తనెంత హ్యాపీగా ఫీల్ అవుతుంది......ఇవేవీ తనకు తోచవు. ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన శివ సినిమా లో “సరసాలు చాలు శ్రీవారు.... వేళ కాదు.......” పాట అంటే తనకెంతో ఇష్టం. పెళ్ళయ్యాక తన శ్రీవారితో జీవితాన్ని అంత రసరమ్యంగా ఊహించుకుంది. కానీ అంతా రివర్స్ లో ఉంటుంది. ఏది ఏమైనా అతడి మీద తనకున్న పిచ్చి ప్రేమ ఈ చిన్న అసంతృప్తిని డామినేట్ చేసేస్తూ ఉంటుంది.
ఇప్పుడు కూడా అతణ్ణి వదిలి వెళ్ళాలంటే తనకు కష్టమే. అతడికేం అనిపించదు. అన్ని రోజులు తనని వదిలి ఉండగలదా....అలాగని తమ్ముడి పెళ్ళికి వెళ్ళకుండా ఎలా ఉండగలదు?
ఆలోచనల్లోంచి బయటపడి నిట్టూరుస్తూ కిచెన్ లోకి నడచింది హారిక. సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే కార్తీక్ కు విషయం చెప్పింది.
“అవును మామయ్య గారు ఫోన్ చేసారు. నాకు అన్ని రోజులు లీవ్ దొరకదు. నీవు నీ లగేజ్ సర్దుకో..ఓ రెండు రోజుల్లో నీ ప్రయాణానికి ఏర్పాటు చేస్తాను. నేను పెళ్లి టైం కు వస్తాను. తర్వాత ఇద్దరం కలిసి వచ్చేద్దాం.” అన్నాడు.
“అన్ని రోజులు ఇక్కడ మీకు కష్టం అవదూ....”అంది హారిక.
“ ఏం పర్లేదులే. నేను చూసుకోగలను. నువ్వు అక్కడ అవసరం కదా...”
అంతే గాని నువ్వు లేకుండా నేను ఉండలేనని ఒక్క మాట అనడు కదా....మనసులోనే గొణుక్కుంది హారిక.
“ సరే అయితే ఆ ఏర్పాట్లు చూడండి. నేను బయలుదేరుతాను”
“అలాగే”
రెండు రోజుల్లోనే టికెట్స్ బుక్ చేసాడు కార్తీక్. ఆ రోజు ఎయిర్ పోర్ట్ కు బయలుదేరుతుంటే హారిక కు బెంగగా అనిపించింది. అతడి గుండెల మీద తల పెట్టి “మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకెలాగో ఉందండి” అంది. “డోంట్ బి సిల్లీ....పెళ్ళయ్యి ఇన్నాళ్ళు అయ్యాక ఇలా మాట్లాడితే ఎవరైనా నవ్వరూ...పద ఫ్లైట్ కు టైం అవుతుంది.”
“హు...ఈయన ఇంతే ...మారడు ..” అనుకుంది హారిక.
“అన్నట్టు చెప్పడం మరిచాను. నేను కూడా రెండు రోజుల్లో పారిస్ వెళుతున్నా ఆఫీస్ పని మీద. నువ్వు అస్తమానూ నాకు ఫోన్ చేయకు. నేను ఫ్రీగా ఉన్నపుడు నేనే చేస్తాను. సరేనా.”
“నేను అసలు మీకు ఫోన్ చేయనే చేయను లెండి.” ఉక్రోషంగా అంది హారిక. అతడు దాన్ని అసలు పట్టించుకున్నట్టే లేదు. సరే పద లేట్ అవుతుంది అంటూ బయలుదేరదీసాడు ఆమెను.
నా ప్రేమ ను ఇతడు కొంచెం కూడా ఫీల్ అవడేమిటో ....అనుకుంటూనే ఫ్లైట్ ఎక్కింది హారిక. ఇండియా లో దిగగానే తమ్ముడు ఎయిర్ పోర్ట్ కు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఇంట్లో అప్పుడే పెళ్లి సందడి మొదలయింది. ఆమె వచ్చిన వారం లోనే నిశ్చితార్థం అయిపొయింది. పెళ్ళికి ఇంకా ఇరవై రోజులుంది. హారిక వచ్చిందని తెలిసి ఆమె ప్రాణ స్నేహితురాలు ప్రియ వచ్చింది.
“ఎన్నాళ్లయిందే నిన్ను చూసి....ఎలా ఉన్నావ్.....లండన్ కు వెళ్లి బాగా రంగు తేలావ్... ” ఆప్యాయంగా ఆమెను హత్తుకుంటూ అంది ప్రియ.
“బాగున్నానే ...నువ్వెలా ఉన్నావ్?..” ఇద్దరు కబుర్లలో పడ్డారు.ఇద్దరు స్నేహితురాళ్ళు చాలా రోజుల తర్వాత కలుసుకుంటే ఎన్ని విశేషాలు ఉంటాయో మాట్లాడుకోవడానికి...సంభాషణ తమ భర్త ల మీదికి మళ్ళింది.
“ఎలా వుందే నీ కాపురం. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా?” అడిగింది హారిక.
“ బేషుగ్గా ఉందే. మా ఆయన ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టడు “ కాస్త సిగ్గు పడుతూ చెప్పింది ప్రియ.
“ అదృష్టవంతురాలివి” అంది హారిక.
“ఏ! నీ అదృష్టానికి ఏమయింది?” అడిగింది ప్రియ.
“నాదంతా రివర్స్ కేసు లేవే....ఎప్పుడూ నేను తన వెంట పడుతుంటాను కానీ మా ఆయనకు అసలు ఆ ధ్యాస ఉండదు. కంప్యూటర్ మీద చకచకా కదిలే అతడి వేళ్ళు నా మేని వీణను మీటితే ఎన్నెన్ని సరిగమలు పలుకుతాయో తెలుసుకోలేడు. ఏ భావాలను వ్యక్త పరచరు. అది ప్రేమైనా...కోపమైనా.. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది....నేను సరిగానే ఆలోచిస్తున్నానా అని. నావి చిన్న చిన్న కోరికలే కదే..అవి కూడా తీరడం లేదని లోటు గా ఉంటుంది.”
“అన్నయ్య మంచివాడని అమ్మ వాళ్ళు కూడా అంటూ ఉంటారు. తను పుట్టి పెరిగిన పరిస్థితులు కారణం కావచ్చు తన మనస్తత్వానికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గట్టిగా నవ్వ కూడదు...బిగ్గరగా మాట్లాడకూడదు..ఇలా పెంచి ఉంటారు. అవి మోతాదు ఎక్కువై ఇలా భావ వ్యక్తీకరణ చేతకాకుండా అయిపోయారేమో...” పెద్ద ఆరిందాలా చెప్పింది ప్రియ.
“ఇంట్లో ఎలా ఉంటేనేం...బయట ప్రపంచం లో తిరుగుతూనే ఉన్నాం కదా..మరి ఎవరినైనా చూసి తెలుసు కోవద్దూ...”
“సరెలేవే..అన్నయ్య గురించి నీవు చెప్పిన మాటలు వింటే తను మంచి వాడనే తెలుస్తోంది. నీ మీద ప్రేమను తను మరో రూపం లో చూపిస్తున్నాడు. అది నువ్వు గ్రహించటం లేదు.” అంది ప్రియ.
“ ఎక్కడా? మా అయన ప్రేమ నాకే కనబడలేదు. నీకెక్కడ కనిపించిందే?”
“ మా ఆయన నన్ను క్షణమైనా వదిలి పెట్టడు అని చెప్పానా...ప్రేమ ఎక్కువైనా మనకు స్పేస్ లేకుండా చేసేస్తుంది. మా పుట్టింట్లో ఏదైనా వేడుక అంటే నాకు వెళ్లి ఎక్కువ రోజులు ఉండాలనిపించినా ఒకటి రెండు రోజుల కన్నా పంపరు. ఏమంటే నువ్వు లేకుండా ఉండలేను అంటారు. అక్కడ పడిపోతారు మన ఆడవాళ్ళు. రాను రాను మన ప్రపంచంలో భర్త మాత్రమే ఉంటాడు. మిగిలిన వాళ్లకు...కనీసం మనకు కూడా స్పేస్ ఉండదు. కాకపోతే ఆ ప్రేమ ఎప్పటికి అలాగే ఉంటె మనకు మిగతా ప్రపంచం తో పని కూడా ఉండదనుకో.....అయితే వయసు పెరిగే కొద్దీ ప్రేమ తరుగుతూ పోతే ఆ వెలితి మరింత స్పష్టంగా తెలుస్తుంది. అన్నయ్య చూడు... నీ ఇష్టాలను కాదనడు. నీ వాళ్ళను కలుసుకోవడానికి ఆంక్షలు పెట్టడు. ఇదో రకం ప్రేమ. నువ్వు దాన్ని గుర్తించడం లేదేమో.....”
“నీ బొంద....గొప్ప వేదాంతం చెప్పావులే...పడే వాళ్లకు తెలుస్తుంది నొప్పేమిటో....”
“లేదే....కాస్త ఆలోచించు. ఎదుటివారి దగ్గర ఉండి మన దగ్గర లేనిది ఎంత తక్కువదైనా వెంటనే గుర్తిస్తాం. అదే మన దగ్గర ఉండి ఎదుటివారి దగ్గర లేని ఎంత విలువైన దానినైనా మనం ఎప్పటికీ గుర్తించం. అది మానవ నైజం. తను చూపించే ప్రేమ ను చూడకుండా నువ్వు ఆశించే మరో రకం ప్రేమ దొరకలేదని అసంతృప్తి ఎందుకు? నీకు సంసారం లో వెలితిగా ఉందంటే నాకు బాధగా ఉంటుంది.”
“ఛ..ఛ..అదేం లేదులేవే...తన మీద నాకున్న ప్రేమ వీటిని పెద్దగా పట్టించుకోనివ్వదు. ఏదో నువ్వు నాకు ఆప్తురాలివి కాబట్టి నీ ముందు నా గోడు వెల్లబోసుకున్నాను. అంతే. నేను సంతోషంగానే ఉన్నాను.”
మరి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది ప్రియ.
హారిక ఇదే ఆలోచిస్తూ ఉంది. ప్రియ చెప్పింది నిజమే...కొంత మంది స్నేహితులు ఇదే చెప్పారు...తమను చాలా విషయాల్లో భర్తలు నిర్భందిస్తారని...కానీ కార్తీక్ అలా ఎప్పుడూ చేయలేదు. ప్రియ అన్నట్టు ఇదో రకం ప్రేమ మరి. అలా అనుకోగానే ఆమెకు భర్త మీద ప్రేమ ముంచుకొచ్చింది. వెంటనే కార్తీక్ కు ఫోన్ చేసింది. ఫోన్ మోగుతోంది కానీ తీయట్లేదు. బహుశా సైలెంట్ లో పెట్టి ఉంటాడు. వచ్చిన రోజు నుండి అలిగి తను ఫోన్ చేయనే లేదు. తర్వాత పెళ్లి పనుల్లో పడిపోయింది. షాపింగ్ పనుల్లో, పెళ్లి హడావిడి లో హారిక బిజీ అయిపొయింది. కార్తీక్ తో మాట్లాడి ఇరవై రోజులవుతోంది. ఆమె చేసినప్పుడు తీయడం లేదు. తర్వాత తను చేయడం లేదు. ఏమయిందో.... పెళ్లి దగ్గర పడింది. ఎప్పుడు వస్తున్నాడో.....
ఆ రోజు రిసెప్షన్. హారిక తల్లి తండ్రులు...తమ్ముడు..అప్పటికే మండపానికి వెళ్ళిపోయారు. ఒకరిద్దరు బంధువులు, హారిక ఇంట్లో అన్ని సర్ది పెట్టి బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. సరిగ్గా అప్పుడే కార్తీక్ టాక్సీ దిగి ఇంట్లోకి వచ్చాడు. అతన్ని చూసి ఆ ఒకరిద్దరు బంధువులు “సరే హారికా...మేము బయలుదేరుతాము..నువ్వు అబ్బాయి త్వరగా వచ్చేయండి.” అంటూ వెళ్ళిపోయారు.
“ఎంటండి ఇలా చిక్కిపోయారు? ఎన్ని సార్లు ఫోన్ చేసానో తెలుసా? ఎందుకు తీయలేదు? తర్వాత ఎందుకు నాకు ఫోన్ చేయలేదు.” అతని చేతిలో బాగ్ అందుకుని లోపలి దారి తీస్తూ అంది హారిక.
“అలసట గా ఉంది హారికా...నీ చేతి కాఫీ కావాలి.”సోఫా లో కూర్చుంటూ అన్నాడు కార్తీక్.
“అయ్యో...ఉండండి ఇప్పుడే తెస్తాను.” లోపలి వెళ్లి ఐదు నిముషాల్లో కాఫీ తెచ్చింది ఆమె. మౌనంగా కాఫీ తాగడం ముగించాడు. “వెళ్లి ఫ్రెష్ అవ్వండి. రిసెప్షన్ కు అందరు వచ్చేసుంటారు. మీరు ఇపుడు రాగలరా...రెస్ట్ తీసుకుంటారా...”అడిగిందామె.అతను ఏదో చెప్పబోయాడు. అంతలో ఆమె సెల్ ఫోన్ మోగింది. అవతల ఆమె తల్లి. “తమ్ముడి సూట్ తన గదిలోనే మర్చిపోయి వచ్చాడట. నువ్వు వెంటనే అది తీసుకుని బయలుదేరు హారికా...ఇక్కడ గెస్ట్ లు అందరూ వచ్చేసారు.” తొందర తొందర గా చెప్పింది ఆమె.
“ సరే అమ్మా! వస్తున్నాను.” కార్తీక్ కు విషయం చెప్పింది.
“సరే నువ్వు బయలుదేరేయ్..నేను రెడీ అయి వచ్చేస్తాను.” అన్నాడతను. హారిక చేసేదేం లేక బయలుదేరింది. కార్తీక్ తో సరిగా మాట్లాడనే లేదు. అతన్ని చూసి ఎన్నో యుగాలైనట్టు ఉంది ఆమెకు....గబగబా మండపానికి చేరుకుంది. ఆ రాత్రి రిసెప్షన్.....తెల్లవారు ఝామున పెళ్లి....ఘనంగా జరిగిపోయాయి. అతిథులను రిసీవ్ చేసుకోవడం నుండి పెళ్లి అయిపోయాక వారిని సాగనంపటం వరకు పనులన్నీ చేసి చేసి హారిక బాగా అలసిపోయింది. ఆ రోజు సాయంత్రానికి హడావిడి కాస్త తగ్గింది. కొత్త దంపతులు అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్లారు. వారితో పాటే హారిక తల్లి తండ్రులు కూడానూ... ఇక ఇంటి దగ్గర తను ఉంటానని హారిక ఉండిపోయింది. బంధువులు అందరు ఒక్కొక్కరే నిష్క్రమించారు.
ఇంట్లో అన్ని సర్దిపెట్టి హారిక బెడ్ రూమ్ కు వచ్చే సరికి కార్తీక్ తల కింద చేతులు పెట్టుకుని, వెల్లకిలా పడుకుని పైకప్పు కేసి చూస్తూ ఏదో ఆలోచనల్లో ఉన్నాడు. హారిక వచ్చి అతడి ప్రక్కన కూర్చుంది.
“మీరు వచ్చినప్పటి నుండి మీతో మాట్లాడటానికే కుదరలేదు. డల్ గా ఉన్నారేం? ఒంట్లో బాగోలేదా...లేక ప్రయాణ అలసటా...” అతడి జుట్టులోకి చేతులు పోనిచ్చి ప్రేమగా అడిగింది.అతడు ఒక్కసారిగా లేచి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె మెడ వంపులో తల దాచుకున్నాడు. “ఏమయిందండీ?” కంగారుగా అడిగింది ఆమె. “నువ్వు లేకుంటే నేను, నా మనసు ఇంత శూన్యంగా ఉంటాయని తెలీదు హారికా... ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు “ ఆమెను మరింతగా హత్తుకుపోతూ అన్నాడు. అతడి దగ్గర నుండి ఇలాంటి మాటలు ఎప్పుడూ వినలేదు ఆమె. ఆశ్చర్యానందాలు ముప్పిరిగొన్నాయి ఆమెను. అతడు చెప్పసాగాడు.
“నువ్వు ఇక్కడికొచ్చేసావా...ఆ తర్వాత రెండు రోజులకు నేను పారిస్ వెళ్ళాను. అక్కడ ఓ నాలుగు రోజులు వర్క్ చూసుకుని తిరిగొచ్చాను. ఎడతెరిపి లేని పని వల్ల బాగా అలసిపోయాను. ఇంటికి తిరిగొస్తే ఆప్యాయంగా పలుకరించే నీవు లేవు. దేని విలువైనా లేనపుడే బాగా తెలుస్తుందేమో.... ఆ రోజు రాత్రి నాకు విపరీతంగా జ్వరం వచ్చింది. అంతకు ముందు నాకొకసారి జలుబు చేస్తేనే నువ్వెంత కంగారు పడ్డావో గుర్తొచ్చింది. ఫ్రెండ్ కు ఫోన్ చేసి మందులు తెప్పించుకున్నాను. నువ్వుంటే నన్ను ఎంత కేరింగ్ గా చూసుకునేదానివో అనిపించింది. ఆ రోజు నుండి నేను చేసే ప్రతిపని లోనూ నువ్వే గుర్తోచ్చేదానివి. ప్రతి క్షణం నీ లోటు తెలిసేది. ఇంతకు ముందు మనం ఎప్పుడు దూరంగా ఉన్నది లేదు. అందుకే నువ్వు లేకుంటే ఎలా ఉంటుందని నాకు తెలియలేదు. నువ్వు ఉన్నపుడు నువ్వు చూపించే ప్రేమను నేను అనుభవిస్తున్నానని కూడా నాకు తెలీదు. చెబితేనే ప్రేమా...చూపిస్తేనే ఉన్నట్టా...అని అడిగే వాణ్ణి. నువ్వోచ్చేసాక ప్రేమ చూపకపోతే ఎంత వెలితిగా ఉంటుందో తెలిసింది. సారీ రా బంగారం. నిన్ను చాలా బాధ పెట్టాను.”
హారిక ఇన్నాళ్లుగా అతడి దగ్గరినుండి ఏమాశించిందో అవన్నీ ఆ మాటల్లో ఆమెకు అర్థం అయిపోయాయి. మది ఆనంద తరంగమయింది. ఇన్నాళ్ళు అతడు శ్రుతి చేయని ఆమె హృదయవీణ ఇప్పుడు సరాగాల సుమధుర స్వరాలు పలికించ సాగింది.
నిజమే...ఆమె ఎప్పుడూ అతడిని వదిలి దూరంగా వెళ్ళలేదు. ఇక్కడున్న ఆర్నెల్లలో ఒకటి రెండు సార్లు పుట్టింటికి వచ్చినా వెంటనే వెళ్ళిపోయేది.
“ఇంతగా నా కోసం తపించి మరి ఇన్నాళ్ళు నాకెందుకు ఫోన్ చేయలేదు?” అడిగింది ఆమె.
“ నీతో మాట్లాడితే నన్ను నేను నిగ్రహించుకోలేననిపించింది. ఆఫీస్ లో లీవ్ మొన్నటి వరకు దొరకలేదు. అయినా ఈ మాటలన్నీ నీ గుండెల్లో తలదాచుకుని చెప్పాలనిపించింది. అందుకే చేయలేదు.” అన్నాడు ఆమె హృదయం మీద తల వాల్చి. అంతే....ఆమె మరింత ఆర్తిగా అతడిని గుండెల్లో పొదువుకుంది. ఎడబాటు తర్వాత కలయిక ఎంత కమనీయమో ఇద్దరికీ ఆ రోజే తెలిసొచ్చింది.