యువభారతం - మధురాంతకం మంజుల

yuva bharatam

“భయ్యా, నాస్టా రెడీ, తిందువుగాని లే“ అంటూ చెల్లెలు మెహరున్నీసా తట్టి లేపడంతో ప్రయాణపు బడలికతో ముసుగుదన్ని పడుకున్న అన్వర్ వొళ్ళు విరుచుకుంటూ లేచి కూచున్నాడు. కండ్లు నులుముకుని ఒక్క నిముషం చుట్టూ కలయ చూసాడు. అవును, తానిప్పుడు మిలిటరీ యూనిఫామ్ లో లేడు. తన చేతిలో ఏ తుపాకీనో ఏ రైఫిలో లేదు. తానిప్పుడు తన పల్లెలో, తనింట్లో, తనపక్క మీద కూర్చోనున్నాడు. ఇలా అనుకోగానే అన్వర్ హృదయం ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగింది.

అన్వర్ ఇండియన్ ఆర్మీ లో సైనికుని గా చేరి మూడు సంవత్సరాలు కావస్తోంది. కన్న తల్లిదండ్రులను, చెల్లిని, సొంత ఊరిని వదలి దేశ రక్షణే ద్యేయంగా ఆర్మీకి వెళ్లిన అన్వర్, తాను మల్లీ ఇంత తొందరగా ఇంటికి తిరిగి రాగలనని కానీ, తన మనుషులను చూడగలనని కానీ అనుకోలేదు. అసలు నిజానికి అన్వర్ కు గత ఆరు నెలలుగా బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయనే చెప్పాలి. పుల్వామా ఉగ్ర దాడికి బదులుగా భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ కు పథకం వేసింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇండియన్ ఆర్మీ భారత సరిహద్దుల్లో విపరీతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. కళ్ళల్లో వత్తులు వేసుకుని పహారు కాయవలసిందిగా ప్రతి సైనికుకునికి ఇండియన్ ఆర్మీ ఆదేశాలను అందించింది. సరిహద్దు ప్రాంతాల పరిరక్షణలో నిమగ్నమైన భారత జవాన్లు తిండి నీళ్లు కూడా మరిచిపోయి తమ కర్తవ్య పాలనలో పడ్డారు. భారత వాయుసేన విజయభేరి తమ చెవుల్లో పడిన తరువాతే వాళ్ళు గుండెలనిండుకు గాలి పీల్చుకో గలిగారు.

ఇలాంటి సమయం లోనే అన్వర్ కు చెల్లెలి పెండ్లి కబురు మలయ మారుతంలా వచ్చి చేరింది. ఎలాగో నెల రోజులు లీవు సంపాదించి తమ విజయోత్సాహాన్ని తన వాళ్ళతో కలిసి పంచుకోడానికి ఆఘమేఘాలమీద ఇంట్లో వాలాడు అన్వర్.“తొందరగా వెళ్లి పండ్లు తోముకుని రా భయ్యా, నాస్టా చల్లారిపోతుంది“ అంటూ మళ్ళీ తొందర పెట్టింది మెహరున్నీసా. మిలిటరీ కసరత్తులతో, కవాతులతో శరీరంతో బాటు పాషాణంగా మారిన అన్వర్ హృదయం సొంతవూరి గాలి తగలగానే నవనీతంలా మెత్తబడిపోయింది. ఇంకాసేపట్లో తన ప్రాణ స్నేహితులను చూడబోతున్నానన్న ఆలోచన మదిలో మెదలగానే ఆ హృదయం కాస్తా దూదిపింజలా మారి ఆనందోత్సాహాలతో ఓలలాడసాగింది. ఉషారుగా ఈల వేసుకుంటూ బాత్ రూము లోకి వెళ్లి పదినిమిషాల్లో తిరిగొచ్చాడు అన్వర్. తనకిష్టమైన కారం దోశలను అమ్మ కొసరి కొసరి వడ్డిస్తుంటే ముక్కులదాకా లాగించి తృప్తిగా పైకి లేచాడు. రూములోకొచ్చి తన వారికోసం తాను తెచ్చిన వస్తువులను ఒక్కొక్కటిగా సూటుకేసునుంచి బయటకు తీసాడు.

ఇది అమ్మీ జాన్ కు, ఇది అబ్బా జాన్ కు, ఇది బెహన్ కు అంటూ వాటిని వారిచేతికందించినప్పుడు వారి కళ్ళలో నిలిచిన ఆవందబాష్పాలు చూసి దేశ సరిహద్దుల్లో తాను శత్రువులతో పోరాడినప్పుడు కలిగిన గాయాలకు ఉపశమనం లభించినట్లు అనుభూతి చెందాడు అన్వర్. అందరికి యిచ్చిన తరువాత మిగిలిన రెండు గిఫ్టులను చేతబట్టుకుని “అమ్మీ జాన్, నేను బజారుకు వెళ్ళొస్తాను“ అని తల్లితో చెప్పి బయటకు నడిచాడు.

“ఆగరా అన్వర్, బయట ఎండగా వుంది, సాయింత్రం వెలుదువుగాని” అన్న తల్లి మాటలుగాని, “భయ్యా ఒక్క నిముషం ఆగు, నేను చెప్పేది విను“ అన్న చెల్లెలి మాటలుగాని అన్వర్ వినిపించుకోలేదు.

“ఏమిరా అబ్బాయ్, ఎప్పుడొచ్చావు? ఎలావున్నావు” అంటూ పలకరించిన బందు జనాలతో వినయంగా బదులు చెప్పి బజారు వీధి లో కాలుపెట్టాడు అన్వర్. అంతే హఠాత్తుగా అతని కాళ్ళు మరి ముందుకు సాగలేదు.వీధి మొదట్లో వుండే పీర్లచావిడి స్థానంలో “లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్” అన్న నేమ్ బోర్డుతోవున్న అధునాతన భవనమే అతని ఆశ్చర్యానికి కారణం.

“ఏమిట్రా అన్వర్, రోడ్డు మధ్యలో యిలా రాయిలా నిలబడిపోయావు. వెనక వాహనాలొస్తున్నాయి చూడలేదా?” అంటూ అతని భుజం పట్టి పక్కకు లాగాడొక వ్యక్తి. అతను అన్వర్ తండ్రి ఖాదర్ సాయిబుకు వేలువిడిచిన తమ్ముడు ప్యారు సాయిబు. “సలాములేకుం చాచా, ఎలా వున్నావు “అంటూ పలకరించాడు అన్వర్.

“వాలేకుం సలాం, ఏమిట్రా అబ్బాయ్, ఎప్పుడొచ్చావు, రోడ్డు మధ్యన నిలబడి దేని వైపు తదేకంగా చూస్తున్నావు? “ అంటూ ప్రశ్నించాడు ప్యారూ సాయిబు.

“ఇక్కడుండే పీర్ల చావిడి ఏమైంది చాచా? ఇక్కడ ఉర్దూ స్కూల్ కూడా నడిపే వాళ్ళు కదా, అది కూడా కనిపించడం లేదే!” అని అడిగాడు అన్వర్.

“అదంతా పెద్ద కథలే అన్వర్. ఈ మూడేండ్లలో ఊర్లో చాలా మార్పులొచ్చాయి. ఊర్లో మత వైషమ్యాలు ఎక్కువైనాయి. రాముణ్ణి కొలిచేవాళ్ళు, అల్లాను కొలిచేవాళ్ళు అంటూ వూరు రెండుగా చీలిపోయింది. ఈ పీర్ల చావిడి నిజానికి మనది కాదట. ఒకప్పుడు ఈ స్థలంలో కోమట్ల ధర్మ సత్రం ఉండేదట. ఆ సత్రం పాడుబడిపోవడంతో ఎప్పుడో ముప్పై ఏండ్లకు ముందు ఆ స్థలాన్ని కోమట్లు పీర్లు నిలుపుకోడానికి మనకు ఉచితంగాయిచ్చేశారట. ఈ మత కలహాలు ప్రారంభమైనాక ఈ విషయం పొగరాజుకుంది. ఉన్నట్టుండి ఒకరోజు ఆవర్గం వారు వచ్చి చావిడిని నేలమట్టం చేసిపారేశారు. ఇద్దరు పోట్లాడుకుంటే మూడోవాడికి లాభమన్నట్లు పక్కూరి సర్పంచి ఈ స్థలాన్ని చౌకగా కొనుక్కుని స్కూల్ బిల్డింగ్ కట్టేసాడు“ అన్నాడు ప్యారు సాయుబు. అన్వరుకు తన పినతండ్రి చెప్పిన మాటలు మింగుడుపడలేదు. తన వూరిలోనా! మత వైషమ్యాలా! వినకూడని మాటేదో విన్నట్లు హతాశుడై నిలబడిపోయాడతడు.

“ అదీరా సంగతి అన్వర్, మూడేళ్ళక్రితం ఊరువిడిచి వెళ్లినవాడివి. నీకీవిషయాలు ఎలా తెలుస్తాయిలే. అయినా ఎందుకైనామంచిది నీ చెల్లెలి పెళ్లి అయేంతవరకు నువ్వుకాస్తా జాగ్రత్తగా వుండు. తొందర పడి వైశ్యుల ఇండ్ల వైపుగాని, బాపనవాడ కు గాని వెళ్లొద్దు. సాకుదొరికితేచాలు పోట్లాటకు సిద్ధంగా వున్నారు వాళ్ళు“ అని జోబీలోనుంచి బీడీతీసి ముట్టించి నోట్లో పెట్టుకుని తనింటివైపు నడిచాడు ప్యారు సాయుబు.
తన కాళ్ళ క్రింద భూమి కదులుతున్నట్లు కంపించిపోయాడు అన్వర్. దేశ శివార్లలో శత్రు దేశాలతో ఢీకొంటున్నప్పుడు కూడా కలగని దుర్బలత్వం యిప్పుడు ఒక్కుమ్మడిగా తనని ఆవరించడంతో జవసత్వాలుడిగిన వ్యక్తిలా నీరసించిపోయాడు. ఆతరువాత ఎలా ఇంటికొచ్చాడో, ఎలా తన పక్క మీద వాలిపోయాడో తెలియలేదు అతనికి. జ్వరపీడితుడైన రోగిలా పక్కకు అతుక్కు పోయాడతడు.

*** *** ***

సాయింత్రం పిల్లగాలికోసం మేడమీదికొచ్చిన అన్వర్ పిట్టగోడకానుకుని ఊరివైపు సాలోచనగా చూడసాగాడు. ఊరికి నాలుగు వైపులా వున్న రాములవారి గుడి, వాసవీదేవి గుడి, మసీదు, సాయిబాబా గుడి భిన్నత్వంలో ఏతత్వాన్ని చాటుతూ ఠీవిగా నిలబడివున్నాయి. మూడు సంవత్చరాలకు ముందున్న మట్టి మిద్దెలు మేడలుగా, మేడలు భవనాలుగా రూపాంతరం చెందివున్నాయి. పరిస్థితులు, పరిసరాలు ఆధునికత వైపు వెళుతుంటే మనుషులు మాత్రం కులమత రాజకీయాల రొచ్చులో పడి ఆటవికుల స్థాయికి దిగజారి పోతున్నారెందుకని అనుకున్నాడు అన్వర్. మరికాసేపు మేడ మీద పచార్లు చేసి కిందికొచ్చి హాల్లో సోఫాలో కూలబడ్డాడు.

“నీకోసం పకోడీలు చేసానురా, ఇదిగో, తిను” అంటూ వేడివేడి పకోడీల ప్లేటును అన్వర్ ముందుంచి “ఏమిట్రా పరధ్యానంగా వున్నావ్, ఏమాలోచిస్తున్నావ్?“ అంది వహీదాబేగం కొడుకు పక్కనే సోఫాలో కూర్చుంటూ.

“అవును భయ్యా! నీలో వచ్చినప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు లేదు, ఏమైంది చెప్పు భయ్యా?” అని ప్రశ్నించింది అక్కడే కుర్జీలో కూర్చుని అన్వర్ కోసం స్వేట్టర్ అల్లుతున్న మెహరున్నీసా.

“ఏం చెప్పమంటావు! మత సామరస్యానికి ఉపమానంగా చెప్పుకునే మనూరిలో మత కలహాలా! ఇలాంటి రోజొకటి వస్తుందని నేను కలలోకూడా అనుకోలేదు మెహర్“ అన్నాడు అన్వర్ బాధగా. మెహరున్నీసా నోరుతెరిచి ఏదోచెప్పబోయింది. కానీ పలవరిస్తున్నట్లుగా అన్వర్ తానే కొనసాగించాడు.

“నిన్న సాయత్రం బస్సు దిగిన వెంటనే నాకు కాస్తా అనుమానం కలిగింది. బట్టల కొట్టు రంగనాధంశెట్టిని చూసి “బాగున్నావా రంగన్నా” అని పలకరించాను. ఆ అన్న నాకు బదులు చెప్పకుండా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు. మనోజ్ వాళ్ళ నాన్న రాజారెడ్డికి నేనంటే ఎంత అభిమానం. ఆయన కూడా నన్ను ఎవరో కొత్త మనిషిని చూసినట్లు చూసి మొఖం చాటేశాడు. వాళ్ళ ప్రవర్తన నాకప్పుడు వింతగా కనిపించింది. కానీ అసలు విషయం ఇదన్నమాట!”.

“ భయ్యా, భరద్వాజన్నను, సంతోష్ అన్నను వెళ్లి కలిసావా? వాళ్ళు నీతో మాట్లాడారా?” అన్వరుకు అడ్డు తగులుతూ అడిగింది మెహరున్నీసా.999

“ఎలా కలవాలి? భరద్వాజను కలవాలంటే బాపనవీధికి వెళ్ళాలి. సంతోష్ ను కలవాలంటే వైశ్యుల వీధికి వెళ్ళాలి. అయినా వాళ్లనిప్పుడు నాకు కలవాలని లేదు మెహర్. నాకిప్పుడు వాళ్ళసలు నా స్నేహితులని చెప్పుకోడానికే సిగ్గుగావుంది“అన్నాడు అన్వర్ ఈసడింపుగా.“వాళ్ళేం చేశారురా అన్వర్! వాళ్ళు నీ ప్రాణ స్నేహితులు. మీ ముగ్గురి స్నేహం చూసి ఊర్లోవాళ్ళు ఎంత ముచ్చటపడేవాళ్లు. మీరు ముగ్గురు పోయిన జన్మలో ఒక తల్లి బిడ్డలని, అందుకే ఒకరిని వొదలి ఒకరు ఉండలేని ఆప్తమిత్రులైపోయారని అందరూ మిమ్మల్ని చూసి ఎంత మెచ్చుకునే వాళ్ళు “ అంది వహీదా కొడుకువైపు ఆశ్చర్యంగా చూస్తూ.“నువ్వూరుకో అమ్మీజాన్, నాకు వీళ్ళమీదే కాదు ఊరివారందరిమీదా కోపంగా వుంది. వీళ్లల్లో చదువుకున్నవాళ్ళు లేరా. ఎవరిలోనూ ఉడుకు రక్తం ప్రవహించడంలేదా. ఒక పక్క భారతీయ జవాన్లు కుల మత ప్రాంతాల బేధాలు మరచి తమ ప్రాణాలొడ్డి దేశాన్ని కాపాడుతుంటే మనూరిలో వున్న యువకులు యింత చిన్న ఊరిలో పరిస్థితులను చక్కదిద్దలేని దద్దమ్మలై పోయారా ఏమిటి!“ ఆవేశం గా అన్నాడు అన్వర్.

“సరే బేటా, నువ్వు మెహర్ నిఖా కోసమొచ్చావు. ముందు ఆ పని సవ్యంగా జరగనీ. మిగతా విషయాలు తరువాత ఆలోచించవచ్చు“ అంది వహీదా తినకుండా కూర్చున్న కొడుకు చేతికి పకోడీల ప్లేటునందిస్తూ.

*** *** ***

నాలుగు రోజుల తరువాత చెల్లెలి పెండ్లికి కావలసిన సరుకులు తేవడానికి టౌన్ కు బయలు దేరాడు అన్వర్. మామిడి కాయలు, జామ కాయలు, తమలపాకులు అమ్మే చిన్నా చితకా వ్యాపారులతో రైలు కిక్కిరిసి వుంది. పక్క ఊర్లో జరిగే సంతలో తమ వ్యాపారం జరుపుకోడానికి వీళ్ళందరూ పక్క స్టేషన్ లో దిగిపోతారని అన్వర్ కు తెలుసు. అంతవరకు తనకు సీటు దొరకదని జనాలమధ్య ఓపిగ్గా నిలబడ్డాడతడు. మరో పది నిమిషాల్లో పక్క స్టేషన్ రానేవచ్చింది. తమ తమ తట్టలు బుట్టలు చేతబట్టుకుని బిలబిలమంటూ జనం రైలు నుండి కిందికి దిగారు. రెండు నిమిషాల్లో ఒకరిద్దరు తప్ప కంపార్ట్మెంట్ అంతా కాళీ ఐపోయింది. వెళ్లి సీట్లో కూర్చోబోయిన అన్వర్, ”ఎప్పుడొచ్చావురా అన్వర్,ఎలావున్నావు” అంటూ దగ్గరకొచ్చి అబ్బులించి పట్టుకున్న తన బాల్య మిత్రుడు భరద్వాజను చూసి నోటా మాటరాక నిలబడి పోయాడు. “ఏమిట్రా మాట్లాడవ్, ఎప్పుడొచ్చావు, వస్తూనే నన్ను కలవాలనిపించలేదా నీకు“ మిత్రుని చేయి పట్టుకుని పక్కన కుర్చోపెట్టుకుంటూ అడిగాడు భరద్వాజ.
“ఎలా కలుస్తాను రా! ఊరు రెండుగా చీలిపోయిందిగా, ఇందులో నువ్వొక వర్గానికి చెందినవాడివైతే నేనొక వర్గానికి చెందిన వాడిని! మా పొలిమేరలు దాటి మీ స్థలం లోకి నేనెలా అడుగుపెట్టగలను” అన్నాడు కోపంగా అన్వర్.

“అంటే ఊర్లోకి అడుగు పెడుతూనే విషయాలు నీకు బోధపడిపోయాయన్నమాట. ఏం చేద్దాం అన్వర్, కొన్నిసార్లు పరిస్థితులు మనచేతిలో వుండవు“ అన్నాడు భరద్వాజ నిర్లిప్తంగా.

“సరిగ్గా చెప్పావ్, నీలాంటి చేతగానివాళ్ళు అనుకున్నా పరిస్థితులను చక్కదిద్దలేరు. కొంతమంది కుఱ్ఱవాళ్లు పుట్టుకతో వృద్దులని నీలాంటి వాళ్ళను చూసే రాసుంటారు శ్రీశ్రీగారు” అన్నాడు అన్వర్ మరింత కోపంగా.

“నీ కోపంలో అర్థంలేదు అన్వర్. నేనేమైనా సినిమా హీరోనా. ఇరుపక్షాల మధ్య నిలబడి ఐకమత్యాన్ని బోధించి ఐదు నిమిషాల్లో మనుషులను మార్చేయడానికి” అన్నాడు భరద్వాజ నవ్వుతూ.“ఐతే మనలాంటి యువకులు చేతగానివాళ్లమై చేతులుకట్టుకుని కూర్చోవాలన్నమాట” స్నేహితునివైపు తీక్షణంగా చూస్తూ అన్నాడు అన్వర్.

“ఎందుకు కూర్చుంటాం, చాపకింద నీళ్లలా మేము చేయాల్సిన పనులేవో చేస్తూనే వున్నాముగా” అన్నాడు భరద్వాజ నింపాదిగా.“చాపక్రింద నీళ్లలా మీరిప్పుడు చేస్తున్న పనులేమిటో? “ఎద్దేవాగా అడిగాడు అన్వర్. “చెబుతాను కాస్త శాంతంగా విను. ఈ పెద్దవాల్లున్నారు చూడు, వీరికి పట్టిన కులాల జాడ్యం, మతాల జాడ్యం అంత తొందరగా పొయ్యేవి కావు. వాళ్ళను మార్చాలనుకోవడం మన అవివేకం. అందుకే ఊర్లోని యువకులందరం కలసి కూడబలుక్కున్నాం. పైకి విడిపోయినట్లున్న సంబంధాలను లోపల కలుపుతూనే వున్నాం. మన సంతోష్ వున్నాడు చూడు, వాడు బ్యాంకు ఉద్యోగి అని తెలుసుగా నీకు. వాడు ఊర్లోని చిన్నతరహా వ్యాపారులకు లోన్లు యిచ్చి సాయపడుతున్నాడు. ఊర్లోకి వచ్చిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టించింది పక్కూరి సర్పంచి అయినా స్కూల్ రన్ చేస్తున్నది మాత్రం మనూరి ప్రెసిడెంట్ కొడుకు అర్జున్ రెడ్డే. కులమతాల ప్రసక్తి లేకుండా ఊర్లో వున్న పిల్లలందరూ ఆ స్కూల్లో చదువుకోవాలన్నదే అతని ఆశయం. అందుకే ముస్లిం పిల్లలకోసం ఉర్దూ టీచర్ ను అప్పాయింట్ చేసాడతడు.

ఎలక్షన్లప్పుడు ఎలాంటి అవాంతర పరిస్థితులు జరగకుండా మరో నలుగురు మిత్రులు బాధ్యత తీసుకున్నారు. పంచాయతీబోర్డులో పని చేస్తున్న మరో మిత్రుడు ఉచితంగా లారీలతో నీళ్లు తోడించడం వల్ల కొళాయిలదగ్గరొచ్చే కొట్లాటలు తగ్గాయి. వాహన రాకపోకలకు వీలు కల్పిస్తూ పీర్ల చావిడిని ఊరి చివరికి మార్చాము. మరో ఇద్దరు మిత్రుల పర్యవేక్షణలో శ్రీ రామనవమి, పీర్ల పండగ ప్రశాంతంగా జరిగి పోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మన యువకులు చేస్తున్నపనులు కోకొల్లలు. ఇక నా సంగతంటావా, నాన్నకు వయసు మీరడంవల్ల గుడిలో అర్చకత్వపు బాధ్యత పూర్తిగా నామీదే పడింది. గుడి పూజారిగా పూలదండలు తెప్పించుకోవడంతో బాటు ప్రసాదాల తయారీ కూడా నేనే చూసుకోవాలి. అందుకే నేను రాములవారి ప్రసాదానికి వాడే బియ్యాన్ని మస్తాన్ దగ్గర కొంటున్నాను. నూనె రఫీ దగ్గరకొంటున్నాను, చింతపండును చింతపండు వ్యాపారస్థుడైన మీ నాన్న దగ్గర కొంటున్నాను.

వెరసీ మా రాముడు తింటున్నది మీ అన్నమే! కానీ ఊర్లో వాళ్లకి నేను గుడికి కావలసిన సరుకులు టౌన్ నుంచి తెచ్చుకుంటానని మాత్రమే తెలుసు. నిజానికి నేను ప్రతిసారీ టౌన్ కు వెళ్ళేది స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్న మన సంతోష్ ను కలవడానికి మాత్రమే. కారుచిచ్చులా మారుతుందనుకున్న ప్రతి కలహం పొగమంచులా చప్పున చల్లారి పోవడమేమిటా అని ఇరువర్గాల పెద్దమనుషులూ జుట్టుపీక్కుంటున్నారు. ఐతే ఒక్కటి, ఊరిని ఉద్ధరిస్తున్నామని ఈ పనులను మేము బహిరంగంగా ఏమీ చేయడం లేదు. ఇండియన్ ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ లా మాదీ నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి చేస్తున్న ఉమ్మడి ప్రయత్నమే! తలెత్తున ప్రతి సమస్యను సమూలంగా నాశనం చేయడమే మా ప్రధమ ద్యేయం. అన్నట్టు అన్వర్, ఇండియన్ ఆర్మీ లో స్త్రీ ల సంఖ్య తక్కువేమోగానీ మా యువ సైన్యంలో స్త్రీ ల సంఖ్య తక్కువేమీ కాదు. నువ్వు టౌన్ కు వెళుతున్న విషయం నాకెలా తెలిసిందో, ఎవరు మెసేజ్ చేశారో నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. ఏమంటావు అన్వర్” అన్నాడు భరద్వాజ మిత్రుడి చేతిని ఆత్మీయంగా స్పృశిస్తూ. చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ అన్వర్ మిత్రుని చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు.పట్టాల మీద రైలు గమ్యం వైపు వేగంగా పరిగెడుతూ వుంది.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న