" లైట్స్ ఆన్ ... కెమేరా స్టార్ట్...యాక్షన్...కట్...కట్...కట్..."
డైరెక్టరు వాసు సూచించినట్టుగా డైలాగులు చెప్పి సీన్ ముగించి రిలాక్సుగా కుర్చీలో కూర్చున్న ప్రఖ్యాత నటి మల్లీశ్వరికి సినిమా షూటింగ్ జరుగుతున్న అరకు పరిసరాలు చూసి తన గత జీవితం కళ్ల ముందు కదిలింది. * *
అది విశాఖ మన్యం అరకు పరిసర ప్రాంతం. టూరిస్టులు , సినిమా షూటింగులతో సందడిగా ఉంది. కస్టమర్లతో హోటళ్లు, చిరు వ్యాపారాలు బిజీగా కనబడు తున్నారు. వాహన దారులకు గిరాకీ పెరిగింది. అరకు పొలిమేర కుంచంపుట్టు గూడెంలో సోములు హోటలు కస్టమర్ల రాకతో కిటకిటలాడుతోంది. సోములు భార్య దేవుడమ్మ వెదురుబొంగు చికెన్ బిర్యానీ తయారు చేస్తే, కూతురి మల్లి అడ్డాకుల్లో పెట్టి కస్టమర్లకు సప్లై చేస్తోంది. మల్లి మండల కేంద్రం జూనయర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసింది. శలవులైనందున తండ్రికి హోటల్లో హెల్ప్ చేస్తోంది. మల్లి గిరిజన గూడెంలో పెరిగినా చదువులో చురుకైన పిల్ల.బొద్దుగా గిరిజన లావణ్యంతో అందంగా కనబడుతుంది.
సినిమాలు, టీ.వీ.కార్యక్రమాలు చూసినప్పుడల్లా తను బాగా చదివి ఈ గిరిజన గూడెం నుంచి బయట పడి ఫ్యాషన్ ప్రపంచంలో హాయిగా బతకాలని కలలు కంటుంది.స్కూలు , కాలేజీ సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది.
అమ్మా నాన్న నిరక్షరాస్యులు ,ఈ గూడెం సంప్రదాయం, కట్టుబాట్లు తప్ప బయటి ప్రపంచం ఎలా గుంటుందో తెలియదు. అమాయకులు. వాళ్లను ఈ అడవి గూడెం నుంచి తీసుకెళ్లి బయటి లోకం చూపెట్టాలను కుంటుంది.
అరకు పరిసరాల్లో ఏదో సినిమా షూటింగ్ జరుగుతోంది. సోములు హోటల్లో వెదురుబొంగు చికెన్ బిర్యానీ స్పెషలని తెలిసి యూనిట్ సిబ్బందికి ఆర్డర్ ఇవ్వడానికి సినిమా ప్రొడక్షన్ మేనేజరు వచ్చాడు. గిరిజన అందంతో లేడిపిల్లలాగ చలాకీగా నవ్వుతూ తిరుగుతున్న మల్లి కనబడింది. యూనిట్ సబ్యులందరికీ బిర్యానీ సప్లై చెయ్యాలంటే సమయం పడుతుందని సోములు చెప్పడంతో ప్రొడక్షన్ మేనేజరు ఆర్డరిచ్చి వెళ్లాడు.
మర్నాడు సినిమా డైరెక్టరు వాసు షూటింగ్ స్పాటులో ఆందోళనగా తిరుగుతున్నాడు. సెకెంటు హీరోయిన్ పాత్ర దారి సమయానికి షూటింగ్ కి చేరుకోలేదు. వాతావరణం షూటింగుకి అనుకూలంగా ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తయి కీలక సన్నివేశం చిత్రీకరించ వల్సి ఉంది. సమయం దాటితే వాతావరణం అనుకూలించక ఆర్థికంగా నష్టపోవల్సి ఉంటుంది.
హీరోయిన్ సోదరి పాత్ర చేస్తున్న అమ్మాయి తల్లికి ఆరోగ్యం బాగులేదని తెల్సి అర్జంటుగా ఊరికి వెళ్లి తిరిగి రాలేదు. డైరెక్టరు వాసు కంగారు పడుతున్నాడు. తనకిది డైరెక్టర్ గా తొలి చిత్రం., ఇది సక్సెస్ అయితే పేరొస్తుంది. డైరెక్టరు ఆందోళన గమనించిన ప్రొటెక్షన్ మేనేజరు తను హోటల్లో చూసిన మల్లి ప్రస్తావన తేగా వెంటనే మల్లిని షూటింగ్ స్పాటుకి రప్పించి మేకప్ టెస్టు చేసి స్క్రీన్ టెస్టు చెయ్యగా హీరోయిన్ తో పోలికలు కలిసి చెల్లెలి పాత్రకి సరిపోయింది.
మల్లికి హైస్కూలు సాంస్కృతిక కార్యక్రమాల్లో గిరిజన థింసా నృత్యం చెయ్యడం , రోజూ టి.వి. లో వచ్చే డ్యాన్సు ప్రోగ్రాములు అనుకరించడం వల్ల డైరెక్టరు చెప్పిన విధంగా డైలాగులు పలకడం, కెమేరా ముందు భయం లేకుండా నటించ గలుగుతోంది. ముందు డమ్మీ పాత్రలో మల్లి చేత నటింప చేయాలని నిర్ణయించి షూటింగు జరిపారు. డైరెక్టరు వాసు ఊహించిన దాని కంటే మల్లి నటించిన సన్నివేశాలు బాగా వచ్చాయి. హీరోయిన్ చెల్లెలి పాత్ర కోసం తీసుకున్న సెకండ్ హీరోయిన్ అమ్మాయి తల్లి ఆరోగ్యం బాగులేదని తెలిసి హైదరాబాదు చేరుకున్నతర్వాత ఆవిడ హాస్పిటల్లో చనిపోవడంతో తిరిగి షూటింగ్ కి రాలేకపోయింది. డైరెక్టరు వాసు స్క్రీన్ ప్లే ప్రకారం మిగతా మూడు రోజుల షూటింగు సన్నివేశాలు మల్లిని పెట్టి పూర్తి చేసారు.
యూనిట్ సబ్యులందరు మల్లి యాక్షన్ సన్నివేశాలతో సంతృప్తి వ్యక్తం చేసారు. కెమేరా ముందు కొత్త అమ్మాయైనా బెదురు లేకుండా
డైరెక్టరు చెప్పి నట్టు నటించింది మల్లి. పిక్చరు షూటింగు ఎలా పూర్తవుతుందా అని ఆందోళన పడుతున్న సమయంలో వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు మల్లి కనబడటం అనుకున్న షెడ్యూల్ ప్రకారం అరకులో షూటింగ్ పూర్తవడం డైరెక్టరు వాసుకి మనశ్శాంతి నిచ్చింది. యూనిట్ సబ్యులందరికీ ఘనంగా పార్టీ ఇచ్చాడు వాసు. మల్లి కి అనుకోకుండా సినిమా షూటింగులో పాల్గొని నటించడ త్రిల్ అనిపించింది.
మల్లి తండ్రి సోములు మల్లి ని షూటింగుకి పంపి తనకి ఆర్థికనష్టం లేకుండా చేసినందుకు కృతజ్ఞతగా డైరెక్టరు వాసు కొంత డబ్బు
అందచేసాడు. అనుకోని డబ్బు చేతికి రావడం , సినిమా షూటింగులు , టూరిస్టుల వల్ల హోటలు బాగా నడవడంతో సోములు సంబర పడిపోయాడు.ఆర్థికంగా బాగా కలిసొచ్చింది. సినిమాలో ఇంకా మల్లి చేత కొన్ని సన్నివేశాలు స్టూడియో లోచిత్రీకరించవల్సి ఉందని అప్పుడు మల్లి హైదరాబాదు రావల్సి ఉంటుందని సోములుకి చెప్పి డైరెక్టరు వాసు తన యూనిట్ బృందంతో సంతృప్తిగా వెనుతిరిగారు.
సోములు - దేవుడమ్మ తమ గారాలపట్టికి సినిమా చాన్సు రావడం చూసి ఆనంద పడ్డాడు. అనుకున్న సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత మల్లి అమ్మా నాన్నలతో హైదరాబాదు చేరింది. ఫిల్మ్ నగర్లో గెస్టుహౌసులో ఉండటానికి ఏర్పాటు చేసారు.రోజూ మల్లికి డ్యాన్సు క్లాసులు , వస్త్ర ధారణ , నటనలో మెలకువలు , డైలాగ్ డెలివరీ , ఇంగ్లిష్ హిందీ స్పీకింగ్ క్లాసులు మొదలయాయి.మెల్ల మెల్లగా వ్యక్తిత్వం , సిటీ జీవితం అలవాటైంది మల్లికి. గిరిజన యువతిగా కొండల్లో పెరిగిన మల్లీశ్వరిలో మోడరన్ లైఫ్ స్టైల్ ప్రారంభమైంది. వేషం , భాష నడక అన్నిటిలో మార్పు వచ్చింది. కారు డ్రైవింగు నేర్చుకుని ఖరీదైన కారు కొంది. సినిమాలతో పాటు టి.వి. సీరియల్స్ , కమర్షియల్ ప్రకటనలతో బిజీ అయిపోయింది. క్రమేపీ సినీ జీవితానికి అలవాటు పడింది. అరకు కొండల్లో చిన్న తాటిపాక ఇంట్లో సినిమా, టి.వి. కార్యక్రమాలు చూసే మల్లి మనసులోని కోరిక నెరవేరి సినిమా నటిగా మారి సమాజంలో డబ్బు హోదా సంపాదించింది. నిరక్షరాస్యులు , అమాయకులైన అమ్మా నాన్నల్ని కూడా గిరిజన గూడెం నుంచి వచ్చి బయటి ప్రపంచం చూడ గలుగుతున్నారు. వారిలో కూడా ఆధునిక పోకడలు వచ్చాయి. గూడెం సోములు సోమ్ గాను, దేవుడమ్మ దేవిగా పేర్లు మారి పోయాయి.
మొదటి సారి అరకు వ్యాలీలో షూటింగ్ జరిగిన "మన్యంలో మాణిక్యం " సినిమాలో నటించిన పాత్రకు నూతన నటిగా ప్రశంసలందుకున్న మల్లీశ్వరి అనతి కాలంలోనే మరిన్ని సినిమా, టీ.వీ.లలో నటిస్తూ బిజీ స్టారయిపోయింది. ఖరీదైన కారు, విలాసవంతమైన బంగళా , ప్రముఖ సినీనటిగా సమాజంలో గుర్తింపు సంపాదించుకుంది. వాసు డైరెక్టర్ గా తను నిర్మించిన తన జీవిత కథ ఆధారంగా పూర్తిగా అరకు పరిసర గిరిజన గూడెంలో షూటింగ్ జరిపిన " అడవి మల్లి " సినిమా బ్రహ్మాండంగా ప్రదర్సింపబడి ఆర్థికంగా లాభాలు తెచ్చి పెట్టింది.
తను పుట్టి పెరిగిన గిరిజన గూడేన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి జన్మభూమి రుణం తీర్చుకుంది. గిరిజన బాలికల విద్య, ఆరోగ్యం, వయోవృద్దుల వైద్య సౌకర్యాలు, రోడ్లు ఏర్పాటు చేసింది. మా గూడెం మల్లి ఎంతగా ఎదిగిపోయిందోననీ మురిసిపోయారు గిరిజన అమాయక జనం. తన జీవిత గమనాన్నే మార్చేసిన సినిమా డైరెక్టర్ వాసుని పెళ్లి చేసుకుని అభినేత్రిగా జీవితంలో స్థిరపడింది మల్లీశ్వరి ఉరఫ్ మల్లి.
" మేడమ్ , నెక్ట్సు సీన్ రెడీ ! " అన్న అసిస్టెంట్ డైరెక్టర్ పిలుపుకి ఈ లోకంలో కొచ్చింది అభినేత్రి మల్లీశ్వరి.