నారాయణాస్త్రం - శ్యామగోపాల్ మరింగంటి

Narayanastram

వై కుంఠంలో శ్రీమహా విష్ణువు పూర్తిగా యోగనిద్రలో ఉన్నాడని నిర్ణయించుకుని శ్రీమహాలక్ష్మి శేషతల్పం నుండి కిందకు దిగింది. శ్రీమహా విష్ణువు నిశ్చలంగా యోగనిద్రలో ఉన్నాడు. లక్ష్మీదేవి ఎప్పటినుంచో ఒక పని చేయాలని అనుకుంటోది. కాని చాలా పనుల వత్తిడి వలన ఆ పని చేయలేకపోయింది. అందుకని ఈరోజు ఆ పని చేయాలని నిశ్చయించుకుని, నెమ్మదిగా బయటకు వచ్చింది.

పనివాళ్ళని పిలిచి ఆయుధాగారం తెరిపించింది. ఈ మధ్య యుధ్ధాలు లేక ఆయుధాలను విష్ణుమూర్తి పూర్తిగా వాడటం మానేశాడు. అందుకని అవి అలాగే చాలా కాలంగా దుమ్ము పట్టి ఉండిపోయాయి. లక్ష్మీదేవి ఇప్పుడు వాటిని శుభ్రం చేసే పనిని చేపట్టింది. ఒక్కొక్క ఆయుధం లక్ష్మీదేవి తీసి ఇస్తూ ఉంటే పనివాళ్ళు వాటిని శుభ్రం చేస్తున్నారు. లక్ష్మీదేవి ఒక ఆయుధం తీసింది. వంకీలు వంకీలు తిరిగి ఉన్న ఆయుధం అది. ఆ ఆయుధానికి ఉన్న ఒక్కొక్క వంపులో ఒక్కొక్క చర్య నిక్షిప్తమై ఉంది.

లక్ష్మీదేవికి ఆ ఆయుధం చాలా ఇష్టం. దానిని జాగ్రత్త అంటూ పనివాడికి ఇచ్చింది. ఒక్కొక్కసారి అతి జాగ్రత్త కూడా అతి ప్రమాదకరమే. పనివాడు జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. కాని వాడికి ఆ ఆయుధం బరువుపై అంచనా లేదు. అది చాల బరువుంది. అకస్మాత్తుగా చేతినుండి జారిపోయింది. అది జారిపోకుండా పట్టుకోవాలని లక్ష్మి విసురుగా క్రిందకు వంగింది. కాని ఆమె చేయి తగిలి ఇంకా వేగంగా క్రిందకు జారి, ఆ ఆయుధంలోని ఒక ఒంపులో లక్ష్మీదేవి చేయి తగిలింది. ఆ ఆయుధం విసురుగా వైకుంఠం నుండి వేగంగా బైట పడిపోయి, అంతరిక్షంలోకి జారిపోయింది. లక్ష్మీదేవి భయంతో వణికిపోయింది. ఆ జారిన ఆయుధం నారాయణాస్త్రం.

భవిష్యత్ బ్రహ్మ ఐన ఆంజనేయస్వామి హిమాలయాలలో ఒక పర్వతప్రాంతంలో తపస్సులో ఉన్నాడు. అకస్మాత్తుగ ఉలిక్కిపడ్డాడు. నుదిటిమీద చెమట పట్టింది. అదాటున లేచి నిలుచున్నాడు. భయంతో కంపించిపోయడు. విశ్వం అంతరించిపోతుందా? ఇదే అనుభవం విశ్వామిత్రుడికి కూడా కలిగింది. కమండలం పట్టుకుని ఏం చేయాలో తెలియక ఆందోళన పడ్డాడు. దివ్య దృష్టితో ఆంజనేయస్వామితో మాట్లాడాడు. ఆంజనేయస్వామికూడా ఏమి చెప్పలేని పరిస్థితి. ఆయన ఆందోళన నారాయణాస్త్రం జారిపోయినందుకు కాదు. అది అనేక లోకాలు దాటుకుంటూ తిన్నగా భూమండలం వైపు దూసుకు వస్తోంది.

హనుమంతుదు లక్ష్మీదేవితో దివ్యశక్తులతో సంభాషించాడు. లక్ష్మీదేవి, “నాయనా హనుమా ఆ నారాయణాస్త్రం తిరిగి వెనక్కు పిలిపించగల శక్తి శ్రీ మహావిష్ణువుకే వుంది. కాని ఆయన యోగ నిద్రలో ఉన్నారు. ఏదో ఒకటి చేసి ఈ ఆపదనుండి కాపాడు నాయానా” అంది. హనుమంతుదు తన దివ్యశక్తులతో భూమిమీద చిరంజీవులైన సప్తఋషులు, పరశురాముడు, మార్కండేయుడు మొదలైనవారితో చర్చలు మొదలుపెట్టాడు.

చాలా శక్తిమంతమైన టెలిస్కోప్ లో అంతరిక్షాన్ని పరిశీలిస్తున్న ప్రొ. నారాయణమూర్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. చాలా చాలా వేగంగా ఒక వస్తువు భుమివైపు దూసుకు వస్తోంది. వెంటనే తన అనుచరుల్న్ని అలెర్ట్ చేసాడు. ఆ ఆబ్జెక్ట్ యొక్క సమాచారం సంపాదించాడు. అవి చాలా హైలీ రేడియో ఆక్టివ్ సబ్ స్టాన్స్. అది ఒక గైడెడ్ మిసైల్ లాగా ఉంది కాని హైలీ కాంప్లికేటెడ్ ప్రోగ్రాండ్ వెపన్. కాని అది స్లీపింగ్ మోడ్ లో ఉంది. ఏది ఏమైన అది భూమి వాతావరణంలో వస్తే దాని రేడియో ఏక్టివ్ అఫెక్ట్ కి భూమి నాశనం అయిపోయేటట్లుంది.

అదే టైంకి ప్రపంచంలో అన్ని స్పేస్ రీసేర్చ్ సెంటర్స్ అలెర్ట్ అయిపోయాయి. సైంటిస్ట్ లు అందరు ఒకరికొకరు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ప్రొ. నారాయణమూర్తి ఆ ఆబ్జెక్ట్ యొక్క సమాచారాన్ని అందరికి వివరించాడు.

యుగాంతం రానున్నదా ???????

అక్కడ హిమాలయాల్లో హనుమంతుడు, పరశురాముడు మొదలైనవాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారు. నారాయణాస్త్రం శక్తితో పోలిస్తే వాళ్ళ శక్తి చాలా తక్కువ. దాన్ని వెనక్కి పంపడం తరవాత సంగతి, కనీసం దాన్ని వేరే దిశకు తిప్పలేని పరిస్థితి. కాని ఈ మహానుభావులు అందరు కలిసి వారి శక్తులను ధారపోసి నారాయణాస్త్రం యొక్క తీవ్రత, ఉష్ణోగ్రత తగ్గించగలిగారు. నారాయణాస్త్రం భూమి వాతావరణంలోకి ఎక్కువ భీభత్సం సృష్టించకుండా ప్రవేశించింది.

టెలిస్కోప్ లో పరిశీలిస్తున్న ప్రొ. నారాయణమూర్తి చాలా ఆశ్చర్యపోయాడు. నిర్ఘాంతపోయాడు. సరిగ్గా భూ వాతావరణంలోకి ప్రవేశించడానికి ముందే ఆ గైడెడ్ మిస్సైల్ ఎలా చల్లబడింది? అస్సలు అర్థం కాలేదు. అన్ని రాడార్స్ ఫోకస్ చేస్తూ ఆ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్న సమాచారం చూస్తూ ఉంటే రాబోయే కొన్ని వేల తరాల ముందు టెక్నాలజి అందులో నిక్షిప్తమై ఉంది అని తెలుస్తోంది. కాని ఆందోళనకరమైన విషయం ఏమిటంటే కంప్యూటర్స్ చూపిస్తున్న ప్రకారం ఆ ఆబ్జెక్ట్ భూమిని తాకే ప్రదేశం హైదరాబాద్.

ఢిల్లీలో ప్రధానమంత్రి త్రిదళాధిపతులతో కలిసి రాష్ట్రపతిని అత్యవసరంగా కలిసారు. పరిస్తితిని వివరించారు. రాష్ట్రపతి గొంతులో భయం, ఆందోళన. "మానవజాతి అంతరించిపోతుందా?" ఆర్మి, నేవి, ఏర్ ఫోర్స్ లను అలర్ట్ చేశారు. హైదరాబాద్ వైపు వార్ ప్లేన్స్ దూసుకు వెళ్ళాయి.

కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి. డిసెంబర్ అర్ధరాత్రి కాదది మండు వేసవి మిట్టమధ్యాహ్నం అయింది. కొన్ని వందల డిగ్రీల ఉష్ణోగ్రత గల వస్తువు ఓజోన్ పొరను చీల్చుకుంటూ భూమి మీదకు పడుతోంది. అది వేగంగా భూమి మీద ఆసియా ఖండంలో భారత దేశంలో, ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో బుద్దుడి విగ్రహం ఉన్న హుసేన్ సాగర్లో ఒక్కసారిగా పడిపోయింది. ఆ వేడికి టాంక్ బండ్ నీళ్ళన్ని ఆవిరి ఐపోయాయి. సంజీవయ్య పార్క్ లో చెట్లన్ని మాడి పోయాయి. హైదరాబాద్ ఒక్కసారిగా అట్టుడికి పోయింది. కొంచెంసేపటికి నారాణాస్త్రం చల్లబడింది.

ప్రొ. నారాయణమూర్తి ఆ ఆబ్జెక్ట్ యొక్క సమాచారాన్ని క్రోడీకరిస్తున్నాడు. అది స్లీపింగ్ మోడ్ లో ఉన్న వెపన్. దాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పూర్తిగా అర్థం కావడం లేదు. తెలిసీ తెలియనట్లుగా అర్థం అయి, అవనట్లుగా ఉంది. అది అంత భయంకరమైనది కాదనిపిస్తోంది. దాన్ని ఏక్టివేట్ చేస్తే ఏ మేరకు ప్రళయం సృస్టిస్తుందో అని భయంగానూ ఉంది.

హనుమంతుదు, సప్తఋషులు, పరశురాముడు, మార్కండేయుడు కలిసి ఒక కార్యాచరణ ప్రణాళికను సిధ్ధం చేసాడు. ప్రపంచం లోని అందరు ప్రజలు ఒక నినాదాన్ని పలకాలి. తిరిగి నారాయణాస్త్రం లో కదలిక రావాలి. తిరిగి వైకుంఠం చేరాలి.

చక చకా పనులు జరిగాయి. అన్ని మత సంస్థలు కలిసాయి. అన్ని ఆధ్యాత్మిక సంఘాలు ఏకం అయ్యాయి. హనుమంతుడు ముందుండి అంతా నిర్వహించాడు.

హనుమంతుడి నోటి నుండి ఒక మాట, ఒక నినాదం, ఒక మంత్రం వెలువడింది. ఆ మంత్రాన్ని ప్రపంచ ప్రజలందరు ప్రతిధ్వనించారు. "ఓం నమో శ్రీ నారాయణాయ"

గాలిలో, నీటిలో, ఆకాశంలో మొత్తం నారాయణ మంత్రం నిండిపోయింది. భూమిలో ఒక రకమైన వెలుగు పుట్టి స్వయంప్రకాశంలాగా తయారవుతోంది. అంతరిక్షంలో భూమి మెరిసిపోతున్న ఒక నీలమణిలా అయింది.

ప్రొ. నారాయణమూర్తికి ఆ మిసైల్ టెక్నోలజి పూర్తిగా అర్థం కాకపొయినా కొంతవరకు అర్థం అయింది. ఆయన మిగిలిన సైంటిస్టులతో చర్చలు జరిపాడు. అందరూ దాన్ని భూమి నుండి బైటకు పంపడమే ముఖ్యమని నిర్ణయించారు. ఆ బాధ్యతను ప్రొ. నారాయణమూర్తికి అప్పగించారు.

పూర్తిగా ఎండిపోయిన టాంక్ బండ్ లో బుద్దుడికి దగ్గరగా ఒక రాకెట్ లాంచింగ్ పాడ్ ఏర్పాటు చేసారు. దాని మీదికి కంప్యూటర్స్ మరియు రోబోట్స్ సాయంతో ఆ ఆబ్జెక్ట్ ని ఎక్కించారు. రోబోట్స్ సాయంతో నారాయణాస్త్రంలోని మెనుని ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎక్కడో ఒక ఆశ.

అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవి మనస్సులోనే నారాయణ మంత్రం జపిస్తూ భూమి మీద జరుగుతున్నది గమనిస్తోంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర భంగం కాకూడదు అనుకుంటోంది.

ఇక్కడ భూమండలం మీద నారాయణ మంత్రం ఉఛ్చాటనతో భూమిలో ఒకరకమైన తేజస్సు వచ్చింది. నారాయణాస్త్రంలో ఒక కదలిక వచ్చింది.

ప్రొ. నారాయణమూర్తి ఆ మిసైల్ లో మెయిన్ మెనూ ఒపెన్ చేసాడు. మెనూ లో అంశాలు చూస్తూ ఉంటే మతి పోయింది. “మూవ్ టార్గెట్ హోం” దగ్గర ప్రెస్ చేసాడు. ఆ ఆబ్జెక్ట్ ఒక్కసారిగా పైకి ఎగిరింది. మరుక్షణం మాయమైంది.

హనుమంతుడు నారాయణాస్త్రంని లక్ష్మీదేవి సహాయంతో వైకుంఠంవైపు మళ్ళించగలిగాడు. చివరకు నారాయణాస్త్రం వైకుంఠం చేరింది. లక్ష్మీదేవి గబ గబా దాన్ని తిరిగి ఆయుధాగారంలో జాగ్రత్త పరిచి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చింది.

శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనే లక్ష్మిదేవికి అర్ధం అయి అవనట్లుగా చిన్నగా నవ్వాడు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు