రెండు పెండ్లి సంబంధాల వారు నన్ను పెండ్లి చేసుకొనడానికి అంగీకారం తెలిపారు. ఒకరు ప్రభుత్వ ఆఫీస్ లో పని చేసే వ్యక్తి ,ఇంకొకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసే ఐ .టీ ఉద్యోగి .నిర్ణయం నా చేతులలో ఉంచారు. బాగా అలోచించి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకొనడానికి అంగీకరించాను . నా నిర్ణయానికిమా అమ్మ నాన్న సంతోష పడ్డారు .
" ప్రభుత్వ ఆఫీస్ లో పని చేసే వ్యక్తిని చేసుకొంటే జీవితం బాగుంటుందమ్మా మంచి చెడ్డా తెలిసిన వాడుగా ఉంటాడు . ఈ కాలం సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు పని ....నిద్ర ... కుటుంబం తప్ప సమాజం గురించి పట్టించుకోరు ఒకవేళ సమాజ సేవ చేయాలనుకున్నా పని ఒత్తిడి వల్ల ఏమీ చేయలేక పోతున్నారు. " అంటూ మా పెదనాన్న పెద్ద ఉపన్యాసం ఇచ్చినా ఫలించలేదు .సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నా భర్త అయ్యారు. పట్టణంలో కాపురం పెట్టాను .ఇరుగు పొరుగు ఆడవారు మాత్రమే కాదు ఈ వీధిలో ఆడవారందరూ నాకు బాగా పరిచయమయ్యారు.మాకు ఇద్దరు అబ్బాయిలు కలిగారు. మీరు నమ్మలేని నిజం ఏమిటంటే ఇప్పటికీ మా వారికి ఎవరితోనూ గొప్పగా పరిచయం లేదు.
ఈ రోజు జరిగిన సంఘటన....... అణుబాంబు పడినంతగా వీధిలోనివారందరూ ఉలిక్కి పడ్డారు.ఎండలు ఎక్కువుగా ఉండటం వల్ల మరో పది రోజులు బడులకు సెలవులు ఇచ్చారు .ఎనిమిదేండ్ల వయసు కల భావన ఎదురింటిలో ఉంది. ఎక్కువగా మా ఇంటికి వచ్చి మా ఇద్దరబ్బాయిలతో ఆడుకొనేది. ఈ రోజు ఉదయం పదిగంటల తరువాత మా ఇంటికి వెళ్లుతున్నట్టుగా వాళ్ళమ్మతో చెప్పి భావన బయలుదేరిందట ,మరో పావుగంట తరువాత భావన ఏమి చేస్తున్నదో తెలుసుకొనడానికి భావనఅమ్మ మాఇంటికి వచ్చి భావన లేక పోవడం చూసింది . భావన మా ఇంటికి తప్ప వేరేవారింటికి వెళ్ళదని నాకూ తెలుసు..
" నా బిడ్డను ఎవరో దొంగలించారు" అంటూ ఏడుపు గొంతుతో అంటూ వేగంగా వెళ్తూ వారింటి గుమ్మం ముందు ఒక్క సారిగా పడి స్పృహ తప్పి పడిపోయింది. ఎండ ఎక్కువగా ఉండుట వల్ల వీధి నిర్మానుష్యంగా ఉంటుంది . నేను వారింటిలోనికి వెళ్లి నీరు తెచ్చాను ఆమె ముఖంపై నీళ్లు చల్లుతూనే బిగ్గరగా అరిచాను .నా అరుపులు విన్న వారందరూ ఇంటిలోనికి వచ్చారు .అందరం కలసి ఆమెకు స్పృహ నుండి కళ్లుతెరిచేలా చేసాము .నేను మా వారికి ఫోన్ చేసి జరిగింది చెప్పాను . అప్పటికే వీధిలో వారందరూ వచ్చారు . భావనను ఎవరో కిడ్నప్ చేశారన్న నిర్ణయానికి వచ్చారు .
భావన తండ్రి రాగానే భార్యా భర్తలిద్దరూ కలసి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లారు .మేము ఆడవారందరూ సగం మంది రైల్వే స్టేషన్ వైపు ,మిగిలిన సగం మంది బస్సు స్టాండ్ వైపు వెళ్లి వెతకాలని నిర్ణయించుకొన్నాము . ఇంటికి తాళం వెయ్యడానికి ఇంటికి వెళ్లాను .మా వారు కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో పని చేస్తున్నట్లుంది .ఈ మధ్య ఆఫీస్ పని ఇంటికి వచ్చి చెయ్యడం అలవాటు .మొదట నేను ఫోన్ చేసినందువల్ల వచ్చారనుకొన్నాను .ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని .....కనీసం భావన ఇంటికి వచ్చి మానవత్వంతో విచారించి వచ్చివుండవచ్చు.....నాలో కోపం ఒక్కసారిగా పెరిగింది ....ఆ కంప్యూటర్ చేతిలోకి తీసుకొని ఒక్క సారిగా కుండను బద్దలు కొట్టినట్లు పగలగొట్టాలన్న ఆవేశాన్ని బలవంతంగా అణుచుకోని కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేసాను
"అసలు మీకు ....నీలో…. కరుణ జాలి ఏమైనా ఉందా " కోపంగా అడిగాను “ ఏమిటి ..." చాలా మెల్లగా అడిగారు “ ఎదిరింట్లో భావన తప్పి పోయిందన్న సంగతి నేను ఫోన్ లో చెప్పాను గుర్తుందా "“అందుకేగా వచ్చాను " అన్నారు “మరి ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకొంటే సరిపోతుందా "
“అసలు నేను ....." అంటూ చెప్ప బోతుంటే ఆయన మాటలకు అడ్డుపడుతూ "భావన కనపడలేదన్న వార్త విన్న మన అబ్బాయిలిద్దరూ వెక్కి వెక్కి ఏడ్చారు .వీధిలోని వారందరూ కన్నీరు పెట్టుకొన్నారు ...."కోపంతో అంటున్న నా మాటలు పట్టించుకోకుండా కంప్యూటర్ ఆన్ చేయడం చూడగానే ".మన పెద్ద అబ్బాయి భావనను ఎత్తుకు వెళ్లిన వాడు దొరికితే చంపుతాను అంటూ ఒక పెన్నా కత్తి జేబులో ఉంచుకొన్నాడు. మిమ్మల్ని హీరోలాగా ఉండమని అడగలేదు సమాజంలో మానవత్వం కలిగిన మనిషిలా ప్రవర్తించండి "అంటూ విసవిసమని నడచుకొంటూ వెళ్లాను.
అప్పటికే ఆటో సిద్ధంగా ఉంది .నేను మా పిల్లలతో పాటు మరో ఇద్దరు ఆడవారు కలసి ఆటో ఎక్కాము ,ఎవరిలోనూ జీవకళ లేదు.అందరూ గంభీరంగా ఉన్నాము. ఆటో వెళ్తాఉంటే అటూ ఇటూ చూస్తున్నాము మేము బస్సు స్టాండు నందు వెతకటానికి బయలు దేరాము . మరో గుంపు రైల్వే స్టేషన్ కు వెళ్ళింది. బాస్ స్టాండ్ అంతా చూసాము . వెళ్తున్న బస్సులను ఆపి వెతికాము ....ప్చ్ ....ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.
అప్పుడే భావన తల్లి దగ్గరనుండి ఫోన్ వచ్చింది .ఎటువంటి వార్త వినవలసి వస్తుందోనని భయం భయం తో వణుకుతూ ఫోన్ ఆన్ చేసి "హ .....లో ...."మెల్లగా అన్నాను
“భావన క్షేమముగా ఇంటికి వచ్చింది .ఆ కిరాతకులని మన ఇంటిముందు కట్టి పడవేసినారు "అన్న మాటలు వినగానే పోయిన ప్రాణం వచ్చినట్లు ...ఏదో తెలియని ఆనందం కలిగింది .
**** ****
మేము ఆటో లో దిగేటప్పటికీ భావననుకిడ్నాప్ చేసిన ఆ రాక్షసుల కాళ్ళు విరిచేశారని తెలిసింది.భావనను పలుకరించిన తరువాత ఆ కిరాతకులను చూద్దామని వెళ్లాను . కిడ్నాప్ చేసిన కిరాతకులు కాళ్ళు విరిచినందువల్ల పోలీసులు శవాన్ని ఎత్తుకొన్నట్లు ఎత్తుకొని వాన్ నందు వేసి తీసుకెళ్లారు
ప్రెస్ వారు ఇన్స్పెక్టర్ విహాన్ దగ్గరకు వచ్చి వివరణ కోరారు .ఆయన ఎదో చెప్పడం చూసాను . దూరంగా ఉన్న నాకు వినపడలేదు
నాకెందుకో మా ఇంటికి వెళ్ళ్లాలంటేనే చాలా అసహనంగా ఉంది .కాస్సేపు భావన ఇంటిలో గడిపాను. ఇన్స్పెక్టర్ విహాన్ లోపలి రావడం చూసి నేను మా ఇంటికి వచ్చాను . ఎండలో తిరగడం వల్ల చిరాకుగా ఉండటంతో స్నానం చేసుకొని వచ్చాను . మా వారు కంప్యూటర్ ముందు పని చేయడం చూసి "ఆఫీస్ పనా " కోపంగా అన్నాను
" ఔను" అన్నారు
"భావన క్షేమంగా దొరికిందన్న సంగతి అయినా తెలుసా " కాస్తా బిగ్గరగా అన్నాను .అంతలో ఎవరో వస్తున్న శబ్దానికి ఎవరా అని చూసాను .భావన తండ్రితో పాటు ఎస్ .ఐ . విహాన్ రావడం చూసాను. మా వారు లేచి నిలబడి “రండి” అంటూ ఆహ్వానించారు. భావన తండ్రి వేగంగా వస్తూ ఆయన చేతులు కృతజ్ఞతా పూర్వకంగా పట్టుకుంటూ "సార్ , మీరు బయట ప్రపంచం గురించి పట్టించుకోరని అనుకొనే వాణ్ని. కానీ సమాజంలోని పౌరుడిగా మీ తెలివితేటలు ఉపయోగించి గొప్ప సేవ చేశారు. మీరు చేసిన సహాయం జన్మ జన్మలకు మరచి పోలేము .మీ వల్ల మా భావనను కాపాడుకొనగలిగాము " అన్న మాటలు నాలో విస్మయం కలిగించింది.
"సార్ మీరు చెప్పిన విధంగానే ప్రెస్ వారికి ఎవరో ఈ వీధిలో సి సి కెమెరా ఏర్పాటు చేసినందువల్ల ఆటోను సులభంగా గుర్తుపట్టాము. ప్రతి ఇంటి వారు సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే ఇటువంటి అన్యాయాలు జరిగిన సమయాన క్రిమినల్స్ ను సులభముగా, తొందరగా పట్టుకొనడానికి అవకాశముంటుందని చెప్పాను. సీసీ కెమెరా మీరు ఏర్పాటు చేసినట్లు ఎవరికీ చెప్పలేదు .భావన నాన్నకు మాత్రం చెప్పాము . అసలు మీకీ ఆలోచన ఎలా వచ్చింది సార్ " మా వారి వైపు చూస్తూ అన్నారు ఎస్ ఐ విహాన్.
“మానవత్వం నశించిన రాక్షసులు పెరుగుతున్నారు అలాంటి రాక్షసులను పెట్టుకోవాలంటే చిన్న ఆధారం ఏదైనా దొరికితే పోలీసుల పని సులభమవుతుంది. మా ఇంటి ముందు ,మా మిద్దె పైన రెండు సీసీ కెమెరాలను ఎవరికీ తెలియకుండా అమర్చాను .మా ఆవిడకు కూడా చెప్పలేదు. భావన కనిపించడంలేదని మా ఆవిడ చెప్పగానే ఇంటికి వచ్చి కెమెరా విజువల్స్ గమనించి,భావనను ఎక్కించుకొని వెళ్లిన ఆటో నెంబర్ తో పాటు ఆటో పైన వ్రాసియున్న సెల్ ఫోన్ నెంబర్ గుర్తించాను . వెంటనే పోలీస్ స్టేషనుకు వచ్చి చెప్పగానే మీరు ఆ రాక్షసులను పట్టుకొని భావనను కాపాడారు " అన్నారు మా వారు.
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా వారిని గట్టింగా కౌగిలించుకొంటూ " మీరు సమాజం గురించి పట్టించుకోరని అపార్థం చేసుకొన్నాను.నన్ను క్షమించండీ. సమాజంలో ఒకరుగా ఎంతో గొప్ప పని చేశారు " అన్నాను